Wednesday, February 1, 2012

మానవ హక్కులు- పోలీసులు


‘మానవ హక్కులు’ అనే పదబంధం అతి పురాతనమైనది. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఈ పదబంధం అత్యంత ప్రాచుర్యం పొందింది. కానీ ఇటీవలి కాలంలో దీనికి అత్యంత ప్రాధాన్యత లభించింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్‌ 1945లో మొట్టమొదటగా ఈ పదబంధాన్ని రాతపూర్వకంగా ఉపయోగించారు. అంతర్జాతీయంగా శాంతిని, రక్షణను ఏర్పాటు చేయడం ఐరాస ప్రధాన లక్ష్యం. అందుకని మానవహక్కుల ప్రాధాన్యతను ఐరాస గుర్తించింది. ఈ చార్టర్‌ను 1945లో శాన్‌ఫ్రాన్సికోలో ఆమోదించారు. ఈ చార్టర్‌ దేశాల మీద పాలనీయం కాదు కనుక ఆదర్శాలను ప్రకటించడమే తప్ప, అమలుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడిన పరిస్థితిని చూసి మానవ హక్కులను గ్రంథస్థం చేయాలని ప్రపంచ దేశాలు భావించాయి. దాని ఫలితమే ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన 1948’. ఈ ప్రకటనపై సభ్య దేశాలు 1948 డిసెంబర్‌ 10న సంతకాలు చేశాయి. ఇది కూడా ఆదర్శాల ప్రకటనే అయింది తప్ప సమితిలోని దేశాలమీద పాలనీయమైన పరిస్థితి లేదు. ఈ లోపాలను సరిదిద్దడానికి ఐరాస సాధారణ అసెంబ్లీ రెండు ఒప్పందాలను తీసుకువచ్చింది. అవి ‘సివిల్‌ రాజకీయ హక్కుల ఒప్పందం’, ‘ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల ఒప్పందం. ఈ ఒప్పందాలు వాటిపై సంతకాలు చేసిన దేశాలమీద పాలనీయమై ఉంటాయి. అయితే ఇవి శాసనాలు కావు. వీటికి అనుగుణంగా ఆయా దేశాలు తమ శాసనాలను రూపొందించవలసి ఉంటుంది. మన దేశం కూడా ఈ ఒప్పందాలపై సంతకం చేసింది. ప్రపంచ మానవాళికి స్వయంసిద్ధంగా ఉండే హక్కులే మానవ హక్కులు. కాని వీటి అమలు కంటె ఉల్లంఘనే ఎక్కువగా జరుగుతున్నది.

మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులన్నీ మాన వ హక్కులే. ఈ హక్కులను పరిరక్షించడానికి జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్రాలలో రాష్ట మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘మానవ హక్కుల పరిరక్షణ చట్టం- 1993’ ను తీసుకువచ్చింది. ఈ చట్టంలోని సె.2 (డి) ప్రకారం ‘భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో పొందుపరచి అభయమిచ్చిన వ్యక్తి జీవనం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం ఇంకా అంతర్జాతీయ ఒప్పందాలలో పొందుపరచి, భారత దేశ కోర్టులలో అమలు పరిచే అవకాశం ఉన్న హక్కులన్నీ మానవ హక్కులే.

మానవ హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనకు పోలీసులు గుర్తుకొస్తారు. సమాజంలో చాలా మంది మానవహక్కుల ఉల్లంఘన చేస్తున్నప్పటికీ, ఈ విషయంలో ప్రధానంగా ఆరోపణలు వస్తున్నది పోలీసులపైననే. ఇందుకు కారణం- శాసనాల ద్వారా విపరీతమైన అధికారాలు వచ్చింది పోలీసులకే. చట్టాన్ని సక్రమంగా అమలు పరచడానికి మానవహక్కులు అడ్డు వస్తాయని చాలా మంది చట్టాన్ని అమలు పరచవలసిన అధికారులు ఇప్పటికీ భావిస్తున్నారు. చట్టాన్ని అమలు చేయడాన్ని- మానవ హక్కుల పేరిట న్యాయవాదులు, ప్రభుత్వేతర సంస్థలకు చెందిన వ్యక్తులు ఆటంకపరుస్తున్నారని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి ప్రమాదకరంగా పరిణమించి రహస్యంగా నిర్బంధించడం, నిందితుడిని ప్రశ్నించే పేరిట అరెస్టును చూపకుండా చాలా కాలం తమ ఆధీనంలో ఉంచుకోవడానికి, నిందితుడిని భౌతికంగా హింసించడానికి పాల్పడుతున్నారు.
వ్యక్తులను చిత్రహింసలకు గురిచేయడం అనాదిగా వస్తున్నది. నేటి ఆధునిక ప్రపంచంలోని చాలా దేశాలు చిత్రహింసలను ఆమోదించవు. ఆయా దేశాల్లో ఉన్న మానవ హక్కుల శాసనాలు, అంతర్జాతీయ ఒడంబడికలు ఇందుకు కారణం కావచ్చు.

చాలా దేశాలు చిత్రహింసలను ఆమోదించనప్పటికీ అవి ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయన్నది వాస్తవం. కస్టడీలో చిత్రహింసలు, కస్టడీ మరణాలు, ఎన్‌కౌంటర్‌ మరణాలు ఈ విషయం గురించి చర్చించడానికి తరచు అవకాశం కల్పిస్తున్నాయి. వరంగల్‌లో యాకూబ్‌ రెడ్డిపైన చిత్రహింసల ఆరోపణలు, బెంగాల్‌లో కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌పై వచ్చిన ఆరోపణలు- పోలీసులు ఏ ప్రాంతంలోని వారైనా ఒకటేనని స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ఏ వ్యక్తిపై అమానవీయ చర్యలకు, చిత్రహింసలకు పాల్పడకూడదు. దర్యాప్తు, విచారణ వంటి ఎటువంటి దశల్లో సైతం ఈ చర్యలకు పూనుకోవడానికి వీల్లేదు. శాసనం చెప్పిన సందర్భాల్లోనే కాక మరే విధంగా కూడా వ్యక్తి స్వేచ్ఛని, జీవితాన్ని హరించినప్పుడు అందుకు బాధ్యుడైన వ్యక్తి, అదే విధంగా రాజ్యం కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.

అమెరికా సుప్రీంకోర్టు మిరాండా వర్సెస్‌ ఆరీజోనా (1966 యుఎస్‌ 384) కేసులో చెప్పిన అభిప్రాయాల్ని మన సుప్రీంకోర్టు డి.కె. బసు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ కేసులో, ప్రీతి పాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (4 నవంబర్‌ 2011) కేసులో ఉటంకించింది. సుప్రీంకోర్టు డి.ె. బసు కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది ‘రాజ్యం భద్రత గురించి వ్యక్తుల స్వేచ్ఛను బలి పెట్టడానికి వీల్లేదు. రాజ్యం భద్రత గురించి ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ ఉపయోగించవచ్చు. డిటెన్యూలను, దోషులను, అరెస్టయిన వ్యక్తులను దేశ ప్రయోజనాల కోసం ఇంటరాగేట్‌ చేయవచ్చు. ఈ ఇంటరాగేషన్‌కు వ్యక్తి స్వేచ్ఛకంటె ఎక్కువ ఆధిక్యత ఉంది. ప్రజల రక్షణ అనేది అత్యున్నత శాసనం. రాజ్యం రక్షణ అనేది అత్యున్నత శాసనం. ఇవి రెండూ ఒకదాని వెంట ఒకటి ఉండాలి. వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం ఉంటుంది. రాజ్యం చర్యలు సరైనవిగా, న్యాయబద్ధంగా, ఉచితమైనవిగా ఉండాలి. ఎలాంటి సమాచారం రాబట్టడానికైనా వ్యక్తులను చిత్రహింసలకు గురి చేయడం సరైనది కాదు... ఇది ఆర్టికల్‌ 21కి హాని కలిగించేది కాబట్టి ఆమోదయోగ్యం కాదు. దోషులను శాస్ర్తీయపద్ధతిలో ఇంటరాగేషన్‌ చేయాలి. అది కూడా శాసనం ధృవీకరించిన నిబంధనల ప్రకారం జరగాలి.

నేరం ఒప్పుదల గురించి, సహనేరస్థుల, ఆయుధాల ఆచూకీ తెలుసుకునేందుకు వ్యక్తులను చిత్రహింసల పాలు చేయడానికి వీలు లేదు... కొత్తరకమైన ఆలోచనలతో, దృక్పథాలతో టెర్రరిజం సవాలును ఎదుర్కోవాలి. టెర్రరిజంపై యుద్ధం చేయడానికి స్టేట్‌ టెర్రరిజం సమాధానం కాదు... టెర్రరిజంపై యుద్ధం చేయడానికి ఉన్న ఏజెన్సీలు శాసన ప్రకారం నడచుకునేట్టుగా రాజ్యం చూడాలి. అంతేకానీ వాళ్ళే శాసనం మీరడానికి వీల్లేదు. అమాయక పౌరుల మానవహక్కులను టెర్రరిస్టులు ఉల్లంఘించినప్పుడు వాళ్ళు శాసనం ప్రకారం శిక్షార్హులవుతారు కానీ వాళ్ళు మానవహక్కులను మరోరకంగా హరించడానికి వీల్లేదు’.

చిత్రహింసల గురించి ఎన్నో తీర్పులు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది డి.కె. బసు కేసు. అలాంటిదే మరో కేసు సుప్రీంకోర్టు ప్రీతిపాల్‌ సింగ్‌ మరి ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (4 నవంబర్‌ 2011) కేసు. ఈ తీర్పులకు తగు ప్రచారం జరిగినా మానవ హక్కుల సంఘాలు ఎంతో కృషి చేసినా పోలీసుల్లో గుణాత్మకమైన మార్పు కనుపించడం లేదు. కారణం- పోలీసు చర్యల్లో పారదర్శకత లేకపోవడం, వారి చర్యలకు జవాబుదారీ లేకపోవడం. పోలీసు శాఖలో ఈ ధోరణిని అరికట్టడానికి అవసరమైన యంత్రాంగం లేదు. పంజాబ్‌లో ఖలిస్థాన్‌ గురించి గొడవలు జరిగినప్పుడు సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ అజిత్‌ సింగ్‌ సంధూ ఒక హీరో. కానీ అతను చేసిన అకృత్యాలకు అతను మూల్యం చెల్లించవలసి వచ్చింది. జశ్వంత్‌ సింగ్‌ ఖల్రా మానవహక్కుల ఉద్యమ కార్యకర్త. అమృతసర్‌ తదితర జిల్లాల్లో మిలిటెంట్లు అన్న పేరుతో అమాయకులను కాల్చి చంపివేశారన్న ఆరోపణలపై సాక్ష్యాలు సేకరించాడు. అది సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ అజిత్‌ సింగ్‌ సంధూకు ఆగ్రహం తెప్పించింది. పోలీసులు పథకం ప్రకారం జశ్వంత్‌సింగ్‌ను అపహరించి, చిత్రహింసలపాలు చేసి చంపేశారు. అతడి భార్య సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో నేరాభియోగాలు తయారుచేయకముందే సంధూ ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా 8 మందిలో ఒకరు చనిపోగా, ఒకరిపై నేరం రుజువు కాలేదు. మరో అధికారిని కోర్టు వదలిపెట్టింది. మిగతా ఐదుగురు అధికారులకు కోర్టు శిక్ష విధించింది. ఆ శిక్షలను హైకోర్టు ధృవీకరించింది. సుప్రీంకోర్టు కూడా అధికారుల అప్పీళ్ళను తిరస్కరించింది. ఇటువంటి సంఘటనలు కొంత భిన్నంగా కేరళలో కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరగవన్న హామీ లేదు. ఇది అందరూ గమనించవలసిన అంశం.
Surya News Paper Dated 

No comments:

Post a Comment