Monday, April 21, 2014

స్వయంపాలన దొరలపాలన కాకూడదు(సంపాదకీయం)-ప్రొ. భంగ్యా భూక్యా


Published at: 22-04-2014 06:32 AM
తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరుగుతున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒక ప్రత్యేక రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఇవి తెలంగాణ భావి రాజకీయాల్ని నిర్ణయించబోతున్నాయి. ఈ ఎన్నికలలో పార్టీల పొత్తులు వాటి తీరుతెన్నులు తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ పాత రాజకీయాల్ని భద్రపర్చడానికే అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయి. ప్రజల స్వయంపాలన ఆకాంక్షను ఈ పరిణామాలు వెనక్కినెట్టే ప్రమాదముంది.
తెలంగాణ ప్రజలు స్వయంపాలన కోసం సర్వాయి పాపడు కాలం నుంచి పోరాడుతూనే ఉన్నారు. కానీ దొరల కుటిల రాజకీయాల వల్ల అది అందినట్టే అంది చేజారిపోతుంది. ఈ విషయాన్ని తెలంగాణ గ్రామాల్లో దర్శనమిచ్చే ఏ స్మారక స్థూపాన్ని అడిగినా చెబుతుంది. దొరలకు వ్యతిరేకంగా జరిగిన 1946 రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలు వీరోచితంగా పోరాడి అనేక విజయాలు సాధించారు. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలబడలేదు. భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించిన వెంటనే దొరలు రాత్రికి రాత్రే సైన్యం పక్కన చేరి ప్రజల మీద దాడులకు ఉసిగొల్పారు. పోరాట కాలంలో ప్రజలు అక్రమించుకున్న భూములను సైన్యం సహాయంతో దొరలు తిరిగి ఆక్రమించుకున్నారు. తదనంతరం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి ప్రజలను మరింత దోపిడీకి, అణచివేతకు గురిచేశారు.
1969లో జరిగిన శ్రీకాకుళం ఆదివాసీ పోరాటం తెలంగాణలో బలమైన అతివాద వామపక్ష (నక్సలైట్) ఉద్యమానికి దారితీసింది. నక్సలైట్ ఉద్యమ సిద్ధాంత, రాద్దాంతాలు పక్కన పెడితే, ఇది తెలంగాణ దొరల పెత్తనం మీద పెద్ద ప్రభావాన్నే చూపించింది. చాలామంది దొరలు గ్రామాలని వదిలి పట్టణాల్లో స్థిరపడ్డారు. పట్టణాల్లో ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి భూస్వామ్య క్యాపిటలిస్టులుగా అవతారమెత్తారు. 1985లో ఎన్.టి. రామారావు కరణం, పటేల్ వ్యవస్థను రద్దు చేయటంతో పట్టణాలకు దొరల వలసలు క్రమంగా పెరిగాయి. ఆంధ్ర పాలక వర్గంతో అధికారాల్ని పంచుకుంటూ ఆర్థికంగా బలపడ్డారు. 1990 ఆర్థిక సంస్కరణలు ఈ దొరలకు మంచి అవకాశం వరించాయి. ఇది వారికి పూర్తిస్థాయి భూస్వామ్య పెట్టుబడిదారులుగా రూపాంతరం చెందటానికి ఉపయోగపడింది. సారా కాంట్రాక్టర్‌లుగా, బీడీ ఆకుల కాంట్రాక్టర్‌లుగా గ్రామాల్లో ఉండే దొరలు ఇప్పుడు అనేక ఆధునిక వ్యాపార రంగాల్లో విస్తరించి ప్రజలను పీడించటం మొదలుపెట్టారు.
ఈ పరిణామాలు దొరల పెత్తనం పోయిందనుకున్న అణగారిన కులాలకు, వర్గాలకు నిరాశే మిగిల్చాయి. దొరల పెత్తనం కొత్త తరహాలో పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించింది. ఊరి మధ్యలో ఉండే గడీల పెత్తనం పోయింది. ఫామ్ హౌస్ రూపంలో నూతన గడీలను ఊరి బయట నిర్మించుకుని దొరలు మళ్ళీ పెత్తనం చెలాయించటం మొదలుపెట్టారు. హైవే కాంట్రాక్టర్‌లుగా, గనుల యజమానులుగా, సెజ్‌ల యజమానులుగా, మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ యజమానులుగా, రాజకీయ నాయకులుగా, ఉద్యమకారులుగా దొరలు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర పాలక వర్గానికి వ్యతిరేకంగానే కాకుండా ఇక్కడి దొరల దోపిడీకి, పెత్తనానికి వ్యతిరేకంగా జరిగింది. అణగారిన కులాల వారు తమ కుల అస్తిత్వాలను తెలంగాణ అస్తిత్వంతో జోడించి స్వయంపాలనే ధ్యేయంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలోని బలాన్ని గుర్తించిన దొరలు కొలది కాలంలోనే ఉద్యమాన్ని తమ నాయకత్వంలోకి తెచ్చుకున్నారు.
దొరలకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం లేదు, రావడం ఇష్టం కూడా లేదు. దొరలు తెలంగాణ ఉద్యమాన్ని ఒక అవకాశంగానే చూశారు. ఉద్యమాన్ని బూచిగా చూపించి ఆంధ్ర పాలకవర్గ దోపిడీలో అత్యధిక వాటాను పొందటం ఒక ఎత్తైతే, తమ కుల, కుటుంబ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవటం మరో ప్రధాన అంశంగా మనకు కనిపిస్తుంది. అందుకే దొరలు ప్రతిసారీ ఉప ఎన్నికలు తెచ్చి ప్రజలకు అగ్ని పరీక్ష పెట్టేవారు. కనీసం ప్రచారం కూడా చేసేవారు కాదు. ప్రజలు తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవటానికి అయిష్టంగానే తిట్టుకుంటూనే ఈ దొరలకు ఓట్లు వేసేవారు.
ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. దొరలను గెలిపించుకోవలసిన అవసరం అణగారిన కులాలకు, వర్గాలకు అవసరం లేదు. అందుకే దొరలకు ఏంచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించటానికి దొరలు పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా పొత్తులు, అంతర్గత అవగాహన కుదుర్చుకుంటున్నారు. దొరతనానికి మతోన్మాదంను జోడించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది.ప్రజలు సంఘటితమవుతున్న ప్రతిసారీ దొరలు ఏదో ఒక రూపంలో వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమ రూపంలో కుల ఉద్యమాలను కొంతవరకు విచ్ఛిన్నం చేయగలిగారు. ఇప్పుడు హిందూ మతోన్మాదాన్ని ఉసిగొలిపి కుల చైతన్యాన్ని వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇండియా పాలక వర్గానికి హిందూత్వ ధోరణులు బలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పాలక వర్గంగా చలామణి అవుతున్న దొరలకు హిందూత్వ ధోరణులు బలంగానే ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రజలు చారిత్రకంగా మత సామరస్యానికి ప్రతీకలుగా వున్నారు. చారిత్రకంగా దక్కన్ ప్రాంతం అనేక మతాలకు, సంస్కృతులకు నిలయంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి ముస్లిం పాలకులు కూడా ఇక్కడి సంస్కృతిలో భాగమై పాలించారు. ఏ ఒక్క ముస్లిం పాలకుడు కూడా ఖలీఫా పేరు మీద ప్రమాణ స్వీకారం చేసి సింహాసనం ఎక్కలేదు. దక్కన్‌లో ఇస్లాం వ్యాప్తి కూడా బలవంతంగా జరగలేదు. ప్రజలు సూఫీ ప్రవక్తల భావాలతో ప్రభావితమై స్వచ్ఛందంగానే ఇస్లాంను స్వీకరించారు. అందుకే దక్కన్‌లో ఇప్పటికీ మత సామరస్యం బలంగా వుంది. ఈ సంస్కృతిని దొరలు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దొరలు హిందూత్వాన్ని నెత్తిన పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో దానికి ఒక లెజిటమసీని ఇచ్చారు. విచిత్రమేమంటే ఎమ్.ఎల్. పాలిటిక్స్‌కి ప్రతినిధులమని చెప్పుకునేవారు కూడా హిందూత్వ శక్తులను ప్రోత్సహించారు. తెలంగాణలో బీజేపీ తర్వాత హిందూత్వ ధోరణులు బలంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీకే. టీఆర్ఎస్ పార్టీ హావభావాలు, దాని అధినేత చేష్టలు శివసేన పార్టీకి దగ్గరగా ఉన్నాయి. టీఆర్ఎస్‌కు తెలంగాణ శివసేనగా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది తెలంగాణ సంస్కృతికి, ప్రజలకి చాలా ప్రమాదకర పరిణామమే. ఈ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థుల ఎంపిక చూస్తే దొరల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు దొరతనాన్ని మతోన్మాదంతో జోడించే ప్రయత్నం చేశాయి. అందుకే బీజేపీ, దొరలకు 8 శాతం స్థానాలు కల్పించింది. బీజేపీ తరువాత దొరలకు అత్యధిక స్థానాలు (47 శాతం) కల్పించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 37 శాతం సీట్లు దొరలకు కేటాయించగా తెలుగుదేశం 34 శాతం కేటాయించింది. ఈ పరిణామాలు తెలంగాణను దొరల పాలన వైపు తీసుకెళుతున్నాయి.
తెలంగాణలో కనీసం 10 శాతం జనాభా కూడా లేని దొరల కులాలకు దాదాపు 50 శాతం కంటే పైచిలుకు స్థానాలను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కేటాయించాయి. ఈ పరిణామాలు దేశ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. జనాభాలో 90శాతం ఉన్న ప్రజలకు సముచిత స్థానం కల్పించకుండా కుల రాజకీయాలు చేస్తున్న పార్టీలకు బుద్ధిచెప్పాల్సిన అవసరం వుంది. దొరలను, మతోన్మాద శక్తులను ఈ ఎన్నికల్లో ఓడించటం ఒక చారిత్రక అవసరం. ప్రజాస్వామిక వాదులు, సామాజిక ఉద్యమకారులు ప్రజల పక్షాన నిలబడాల్సిన సమయమిది. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి కూర్చుంటే ప్రజలకు అన్యాయం చేసిన వారే అవుతారు. ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని మన దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక స్ఫూర్తిని కాపాడుకోవలసిన చారిత్రక సందర్భమిది.
- ప్రొ. భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 22/4/2014 

No comments:

Post a Comment