Sunday, December 2, 2012

'సింధు' స్ఫూర్తి ఆవాహన--సత్య బత్తుల (యుఎస్ఏ), డాక్టర్ ఘంటా చక్రపాణి, డాక్టర్ అడపా సత్యనారాయణ, డాక్టర్ భంగ్యా భుక్యా, సుదర్శన్, కుమారస్వామి



ప్రాచీన భారత సంస్కృతిలో అంతర్భాగమైన బ్రాహ్మణ, శ్రమణ వైరుధ్యాలు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్తరూపుని సంతరించుకొని సామాజిక న్యాయం, ఆత్మగౌరవ నినాదాల్ని బహుముఖంగా వ్యాప్తి చెందిస్తున్నాయి. ఈ తరుణంలో మొత్తం వైదిక సంస్కృతి, ధర్మాల స్వరూప స్వభావాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించవల్సి ఉంది. వైదిక మతాన్ని, దాని తాత్వికతను, భావజాలాన్ని, సామాజిక వ్యవస్థననుసరించి ప్రగతి సాధించలేమని, వైదిక సంస్కృతి మూల సూత్రాలను సమూలంగా పెకిలించాలనే ఆకాంక్షను నేటి బహుజన ఉద్యమాలు స్పష్టం చేస్తున్నాయి. 

భారత దేశ సంస్కృతి, వారసత్వం విశ్లేషణలో లిబరల్ బూర్జువా మేధావి జవహర్ లాల్ నెహ్రూ, సనాతన ధర్మ ప్రచారకుడు సంపూర్ణానందలో భావ సారూప్యత కనబడుతుంది. అదేమంటే భారత దేశ చరిత్ర, నాగరికత ఆర్యులతోనే ప్రారంభమైంది. భారత జాతీయతకు ఆర్య వైదిక సంస్కృతి ప్రధాన భూమిక. 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'లో నెహ్రూ ప్రతిపాదించిన సాంస్కృతిక జాతీయవాదానికి హైందవ జాతీయతకు చాలా దగ్గర పోలికలున్నాయి. ఈ రెండు వాదాలు ఆర్య వైదిక సంస్కృతికి ప్రాముఖ్యతనిచ్చి, ఆర్యేతర ద్రవిడ సంస్కృతుల్ని తోసిపుచ్చాయి. వాస్తవానికి భారత ఉపఖండ చరిత్ర, సంస్కృతి ఆర్యులతోనే మొదలైంది. నెహ్రూవియన్ విశ్లేషణకు దగ్గరగా సాంస్కృతిక జాతీయ వాదులు కూడా హైందవ/బ్రాహ్మణ మతాన్ని జాతీయ మతంగా ప్రచారం చేస్తున్నారు. వారి విశ్లేషణలో భారతీయ జాతీయ మతం సంస్కృతి అంటే ఆర్యనిజం/బ్రాహ్మణిజం అని అర్థం. హిందువు-హిందు-హిందుస్తాన్.

వైదిక మతాన్ని జాతీయ మతంగా చిత్రీకరించి భారతీయ సంస్కృతికి హైందవాన్ని అంటగట్టి, ఆర్యేతర ముఖ్యంగా ద్రవిడ సంస్కృతి, నాగరికతల్ని తృణీకరించడం హిందూత్వ తాత్వికత భావజాలంలో ప్రధాన అంశం. రొమిల్లా థాపర్ అన్నట్లు సంప్రదాయ చరిత్ర రచనల్లో భారతీయ సంస్కృతి అంటే హిందూయిజమే అనే ధోరణులు ప్రబలంగా ఉన్నాయి. ప్రధానంగా మతతత్వవాద చారిత్రక దృక్పథంలో భారత సాంస్కృతిక పునాదులు వేదాల్లో ఉన్నాయని, వేదమంటే భారతీయత అనే అర్థం ప్రస్ఫుటంగా కనబడుతుంది.

ఇటీవల కాలంలో ఆర్కియాలజిస్టులు, ఇండాలజిస్టులు జరిపిన పరిశోధనల ఫలితంగా భారతదేశ చరిత్ర, సంస్కృతి వారసత్వాలకు సంబంధించిన అనేక నూతన అంశాలు వెలికి తీయడం జరిగింది. గత శతాబ్దపు మొదటి దశకాల్లో పురాతత్వ త్రవ్వకాల్లో బయల్పడిన అవశేషాల ఆధారంగా భారతదేశంలోని మొట్టమొదటి నాగరికత అయిన సింధు (ఇండస్) నాగరికతను ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు (వేద పరిభాషలో దాస్యులు) నిర్మించారనే విషయం రూఢీ అయింది. ఆర్యులు భారతదేశానికి రాకపూర్వం ఈ దేశంలో ఆనాటి ప్రాచీన నగర సమాజాలైన ఈజిప్టు, మెసపటోమియా, చైనాలకు దీటుగా హరప్పా, మొహంజదారో, డోళవీర, లొథల్, రాఖిగడి, గన్వెరివాల లాంటి న గరాలు, దాదాపు రెండు వేల చిన్న పట్టణాలతో క్రీస్తుకు పూర్వం 3000 నుంచి 1700 సంవత్సరం వరకు దాదాపు 1300 సంవత్సరాలు సింధూ నది పరివాహక ప్రాంతంలో పట్టణ నాగరికత విలసిల్లింది. 

ప్రాచీన భారత దేశంలో క్రీస్తుకు పూర్వం 2,600 సంవత్సరం నాటికే (అంటే 4,700 సంవత్సరాల క్రితం), ప్రతి ఇల్లు ఇటుకలతో కట్టబడి, బాత్‌రూం, లెట్రిన్, భూగర్భ మురుగునీటి పారుదల, నగర ప్రణాళిక వ్యవస్థతో ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో, ప్రాచీన అమెరికాగా ప్రసిద్ధికెక్కింది. వర్తక వ్యాపారస్తులు, రైతులు, వృత్తి పనివారు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి వంటి ఉత్పాదక వర్గాలు వినూత్న పరికరాలు కనిపెట్టి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రగతిని సాధించారు. లిపి కలిగిన భాషతో అద్భుతమైన నాగరికతను సృష్టించారు.

సింధు (ఇండస్) నాగరికత సమాజ వ్యవస్థలో వ్యక్తి స్థానం వృత్తి, ప్రావీణ్యతను బట్టి నిర్ణయించబడింది కానీ పుట్టుక మీద కాదు. సింధు (ఇండస్) నాగరికత మతంలో ప్రకృతి ఆరాధన అమ్మ తల్లి ప్రధానాంశాలు. పూజారి వర్గానికి ప్రత్యేక స్థానం లేదు. స్త్రీ పురుష సంబంధాల్లో అన్యోన్యత, సమానత్వం కనబడుతుంది. సతి, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలున్నట్లు కనపడదు. ద్రావిడ సంస్కృతి మత విధానం సమాజ శ్రేయస్సుకు దోహదం చేసింది. ప్రాచీన భారతదేశంలో అత్యున్నత పట్టణ నాగరికతను సృష్టించిన ద్రావిడ సంస్కృతి, దేశ దిమ్మరులైన ఇండో-ఆర్యన్ దండయాత్రకులోనై అంతరించి పోయింది. తత్ఫలితంగా భారతదేశం పట్టణ సమాజం నుంచి పశు పోషణ సమాజంగా మారిపోయింది. 

ఈ పరిణామం పురోగతికి బదులు తిరోగమనాన్ని సూచిస్తుంది. పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన అవశేషాల ఆధారంగా పశుకాపరులైన ఆర్యులు సింధూ ఉపనది అయిన సరస్వతి నది ఒడ్డున తమ నివాసాలు (గూడాలను) ఏర్పరచుకున్నట్లు, యగ్న యాగాదులు నిర్వహించిన పొయ్యిలు కల్గి ఉన్నట్లు తెలుస్తుంది. వీరి నాగరికత, సంస్కృతిని వివరించిన మొదటి గ్రంథం రుగ్వేదం. క్రీస్తుకు పూర్వం 1100 సంవత్సరంలో రుగ్వేదాన్ని కంపోజ్ చేసినట్లు, క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరంలో సంస్కృత భాషలోని శ్లోకాలని దేవనాగరి లిపిలో రాసినట్లు ఇండాలజిస్టులు నిర్ధారించారు. ఆ తర్వాతి కాలంలో యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, ఉపనిషత్తులు, పురాణాలు వంటి ఎన్నో గ్రంథాలు సంస్కృత భాషలో రాయబడినాయి.

వేదవాజ్ఞ్మయంలోని శ్లోకాలని పరిశీలిస్తే, ఈ ఆర్యులు వర్గీకరణ (వర్ణ) వ్యవస్థని కనిపెట్టినట్లు తెలుస్తుంది. వర్గీకరణ సిద్ధాంతం ప్రకారం సమాజాన్ని త్రివర్గాలుగా (త్రివర్ణ), అంటే బ్రాహ్మణ (మతం), క్షత్రియ (పాలన, రక్షణ), వైశ్య (ఉత్పాదకత)గా విభజించారు. అంతేకాకుండా ఈ వర్గీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన బ్రాహ్మణ వర్గం మిగిలిన వర్గాలు (వర్ణాల) కంటె కూడా పై స్థాయిలో తమకు తాము పెట్టుకున్నట్లు అర్ధం అవుతుంది. త్రివర్ణాల వారు ద్విజులుగా (రెండవసారి జన్మించిన వారు) పిలవబడతారు. ఎందుకంటె వారికి మాత్రమే ఉపనయనం చేసుకునే హక్కు ఉంది. శూద్రులు, అంటరాని వారికి ఉపనయనం ఉండదు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థకి మూలం బ్రాహ్మణిజం. ఈ బ్రాహ్మణ సంస్కృతి (వర్ణ వ్యవస్థ) మన భారతదేశానికి సుమారు క్రీ.పూ. 1700 సంవత్సరంలో ఇరాన్‌లోని మిట్లాని రాజ్యం నుంచి ఆర్యులు తీసుకువచ్చారు. వీరి భాష సంస్కృతం. ఇరానియన్ల ప్రాచీన భాష అవెస్తన్, సం స్కృత భాషలకు పోలికలు ఉండడమే కాక రుగ్వేదంలోని ఇంద్ర, మిత్ర, వరుణ లాంటి దేవుళ్ళందరి పేర్లు వాటిలో ఉన్నాయి.

ఆర్యులు సింధు నాగరికుల మీద దాడిచేసి, తమ త్రివర్గ (మూడు కేటగిరి) స్కీంని విస్తరించి ఓడిపోయిన భారతదేశ మూలవాసులైన సింధూ నాగరికత ప్రజలను 'శూద్రులు'గా, నాలుగవ వర్ణంలో చేర్చారు. చరిత్రని లోతుగా పరిశీలిస్తే క్రీ.శ. 320-520 సంవత్సరంలో, గుప్తుల కాలంలో చాతుర్వర్ణాన్ని అయిదుకి పెంచి పంచముడిని సృష్టించినట్లు ఫాహియాన్ అనే బౌద్ధ భిక్షువు రచనల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారత దేశానికి ఈ ఆర్యన్ సంస్కృతి (వర్ణ వ్యవస్థ) విస్తరించే క్రమంలో అనేక ఆర్యేతర జాతుల్ని, అటవిక తెగల్ని వర్గీకరణ సిద్ధాంతాన్ని పెంచుతూ, ఆరు, ఏడు, ఎనిమిది ఇలా తీసుకొని రావడం జరిగింది. వీరు రాసిన వేదాలు, సత్పథ, జైమిన్య ఉపనిషత్తులలోని శ్లోకాల ప్రకారం ఇండొ-ఆర్యన్లు త్రివర్గ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. త్రిశబ్దాలైన భు, భవహ్, స్వహ్‌లతో ప్రజాపతి ఆత్మను, మనుషులను, పశువులను; అలా అవే శబ్దాలతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను; అలాగే భూమి, వాతావరణం, ఆకాశంలను; ఇంకా గాయత్రి, త్రిస్తుబ్, జగతి మంత్రాలని సృష్టించినట్లు ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది.

వేద వాజ్ఞ్మయంలోని శ్లోకాల ద్వారా రూపొందించిన వర్గీకరణ, విశ్వంలో ఉన్న ప్రతిదాన్నీ, ప్రకృతి, పశువులు, చెట్లు, మనుషులు, వేదాలు, సంస్కృత భాష, మానవ శరీరం, ఇలా అన్ని మూడు వర్గాలుగా విడగొట్టి ద్విజులకు రిజర్వేషన్ కల్పించింది. చివరికి దేవుళ్ళని మూడు వర్గాలుగా విడగొట్టి బ్రాహ్మణులకి అగ్ని, వాసు దేవుళ్లని, క్షత్రియులకి ఇంద్ర, వాయు, రుద్ర దేవుళ్ళని, వైశ్యులకి సూర్య, వరుణ, ఆదిత్య దేవుళ్ళని రిజర్వ్ చేశారు..... ఇలాగే పశువులు... మేకని బ్రాహ్మణులకి, గుర్రాన్ని క్షత్రియులకి, ఆవుని వైశ్యులకి రిజర్వేషన్ చేశారు. చాతుర్వర్ణ సృష్టి గురించి రుగ్వేదంలోని పురుష సూక్తం పదవ (10-90-11-12) మండలంలో చెప్పబడింది. 

దీని ప్రకారం పురుష ముఖం బ్రాహ్మిణ్, భుజాలు క్షత్రియ, తొడలు వైశ్య, పాదం శూద్రులు. తద్వారా ప్రజాపతి అసమానమైన సమాజాన్ని సృష్టించి, బ్రాహ్మణునికి అగ్రస్థానం కల్పించి, 'శూద్రులు'కి పాదాలు, ఆర్యన్ మూడు వర్ణాలకి సేవచేసే పవిత్ర కార్యక్రమాన్ని రిజర్వేషన్ చేయడం జరిగింది. అయితే పంచములకి ఏ రిజర్వేషన్ లేదు, ఎందుకంటే వాళ్లు అంటరాని వారు. వైదిక తాత్వికత భావజాలంలోని ప్రధాన అంశం ద్విజులకు ముఖ్యంగా బ్రాహ్మణ, పురోహితవర్గం ఆధిపత్యాన్ని కొనసాగించడమే. బైబిల్, ఖురాన్‌లో లేనివిధంగా సృష్టికర్త హిందూ సమాజాన్ని వర్గీకరించి హెచ్చుతగ్గులకు ప్రామాణికతను కల్పించారు.

వైదిక ధర్మం పేరిట కొనసాగింపబడుతున్న వర్గీకరణలో అణిచివేతకు గురైన దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ సమూహాలు నేడు బ్రాహ్మణీయ సంస్కృతిపై తిరుగుబాటు చేస్తున్నాయి. మరొకపక్క సనాతన ధర్మ ప్రచారకులు అగ్ణానంద, అపరిపూర్ణ స్వాములు, హిందూత్వ వాదులు పురుషసూక్త వ్యవస్థను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాచీన భారత సంస్కృతిలో అంతర్భాగమైన బ్రాహ్మణ, శ్రమణ వైరుధ్యాలు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్తరూపుని సంతరించుకొని సామాజిక న్యాయం, ఆత్మగౌరవ నినాదాల్ని బహుముఖంగా వ్యాప్తి చెందిస్తున్నాయి. ఈ తరుణంలో మొత్తం వైదిక సంస్కృతి, ధర్మాల స్వరూప స్వభావాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించవల్సి ఉంది. వైదిక మతాన్ని, దాని తాత్వికతను, భావజాలాన్ని, సామాజిక వ్యవస్థననుసరించి ప్రగతి సాధించలేమని, వైదిక సంస్కృతి మూల సూత్రాలను సమూలంగా పెకిలించాలనే ఆకాంక్షను నేటి బహుజన ఉద్యమాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సందర్భంలో వైదిక/ ఇండిక్ సంస్కృతికి ముందే విలసిల్లిన ద్రావిడ నాగరికత, సంస్కృతి, మూల వాసుల సైన్స్, టెక్నాలజీ, ప్రాపంచిక దృక్పథాన్ని, సింధూ వారసత్వ ఔన్నత్యాన్ని తెలుసుకోవడం అవసరం. కొంతమంది మేధావులు సమష్టి ఆలోచనతో 'సింధూ వారసత్వ కేంద్రం'ని ఏర్పాటు చేయడమైనది. ఈ అధ్యయన కేంద్రం సింధూ నాగరికతకు సంబంధించిన పలు సామాజిక అంశాలపై పరిశోధనలు చేపడుతుంది. ఇండో-ఆర్యన్, వైదిక యుగ వేద వాఙ్మయాన్ని విమర్శనాత్మకంగా వివరించడం, వర్ణ వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల్ని సోదాహరణముగా వివరించడం, వర్గీకరణ, ద్విజులకి రిజర్వేషన్ సిద్ధాంతాన్ని సమర్థించే వైదిక సాహిత్యాన్ని డీ కోడ్ చేయడం జరుగుతుంది. పురుషసూక్త వర్గీకరణ, మూలవాసుల ప్రతిఘటన చైతన్యం ప్రాముఖ్యతను రికార్డ్ చేయడం ఈ సంస్థ ఉద్దేశం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆర్యన్ నాగరికతకు పూర్వం భారతదేశంలో విలసిల్లిన నాగరికతకు సంబంధించిన అనేక అంశాల్ని ఆర్కియాలజిస్టులు, ఇండాలజిస్టులు, శాస్త్రవేత్తలు బహిర్గతం చేశారు.

అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాస్త్రీయ పద్ధతుల ద్వారా భారతదేశ మూల వాసుల నాగరికత, సంస్కృతికి సంబంధించి, ఇప్పటివరకు మరుగుపడిన అంశాలని వెలికితీసి సమాజానికి అందించడం అధ్యయన కేంద్రం ముఖ్య ఉద్దేశం. ఆర్యులకు పూర్వం వైదిక సంస్కృతికి భిన్నంగా ఆర్యేతరులు ముఖ్యంగా ద్రావిడులు నిర్మించిన నాగరికత విశిష్టతను ప్రచారం చెయ్యడం ద్వారా ప్రస్తుత బహుజనుల ఉద్యమాలకు చేయూతనియ్యడం జరుగుతుంది. 

బహుజనుల, మూలవాసీల అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాలకు శాస్త్రీయమైన తాత్వికతను, భావజాలాన్ని అందించడం ప్రస్తుత సమయంలో ఆవశ్యకం. ఎందుకంటే వైదిక బ్రాహ్మణ శక్తులు, సంస్కృతి, ఆచారం పేరిట వర్గీకరణ భావజాలాన్ని వివిధ రూపాల్లో ప్రచారం చేస్తుండటం, మరొక పక్క బ్రాహ్మణేతర మూలవాసీ సమూహాలు తమ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని పునర్నిర్మించుకొనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్యేతర, ఆర్య వైదిక సంస్కృతి, మతం, ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాలని శాస్త్రీయంగా హేతుబద్ధంగా బేరీజు వేయాల్సిన అవసరాన్ని సింధూ వారసత్వ సంస్థ గుర్తించింది.
సత్య బత్తుల (యుఎస్ఏ),
డాక్టర్ ఘంటా చక్రపాణి,
డాక్టర్ అడపా సత్యనారాయణ,
డాక్టర్ భంగ్యా భుక్యా,
సుదర్శన్, కుమారస్వామి
www.indusheritagecenter.com

Andhra Jyothi News Paper Dated: 2/12/2012 

No comments:

Post a Comment