Wednesday, October 16, 2013

సామాజికన్యాయంతో నవ ప్రస్థానం - ప్రొఫెసర్ భంగ్యా భూక్యా

10 శాతం జనాభా కలిగి ఉన్న అగ్రకులాలు దాదాపు 50 శాతం శాసన సభ్యులను కలిగి ఉన్నాయి. అగ్రకుల శాసన సభ్యులను 10 శాతానికి ఎలా తీసుకురావాలన్న ప్రాతిపదికగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలి. అణగారిన కులాలు రాజ్యాధికారం సాధించి ఆత్మగౌర వంతో బతికే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అభివృద్ధి ఫలాలు ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కాకుండా సామాజికన్యాయ సూత్ర ప్రాతిపదిక మీద అన్ని కులాలకు, వర్గాలకు, అందేలా పునర్‌నిర్మాణం జరగాలి.
కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్ కమిటీ జూలై 30 ప్రకటనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిందనే అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు వచ్చేశారు. పార్లమెంటు ఆమోదమే మిగిలింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పునర్నిర్మాణం గురించి మీడియా లోపట, బైట చర్చలు మొదలైనాయి. ఇక్కడ ప్రశ్న ఏమంటే ఏ ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలి? తెలంగాణ విద్యావంతులుగా, ఉద్యమ పార్టీలుగా చలామణి అవుతున్నవారు 'అభివృద్ధి' ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలని వాదిస్తున్నారు. చాలా తెలివిగానే వీరు ఈ వాదనను ముందుకు తీసుకు వ స్తున్నారు. ఈ వాదనలో అణగారిన కులాల రాజకీయ ఆకాంక్షను తొక్కిపెట్టే కుట్ర దాగి ఉంది. మొదటి నుంచే అణగారిన కులాల ఆకాంక్ష తెలిసే వీరు ఈ ఉద్యమాన్ని ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా చిత్రీకరించారు.
అణగారిన కులాలు నిజంగానే నీరు, వనరుల కోసం ఉద్యమిస్తున్నాయా? దున్నటానికి కుంట భూమి లేనివాడికి, పైసా పెట్టుబడి పెట్టలేని వాడికి నీరెందుకు, వనరులెందుకు. నీరు, వనరులనేది కేవలం తెలంగాణ దొరల ఎజెండా. అణగారిన కులాల, జాతుల ఎజెండాలో అవి ఎన్నడూ లేవు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రజలు ఆర్థిక ఎజెండాతో పోరాటం చేయడం చాలా అరుదు. వారి పోరాటంలో సామాజిక, రాజకీయ ఎజెండాలే ప్రధానంగా కనిపిస్తాయి. ప్రపంచ అణగారిన వర్గాల ఉద్యమాల్ని పరిశీలిస్తే అవి రెండే రెండు ఎజెండాల చుట్టూ నడుస్తుంటాయి. ఒకటి 'ఆకలి', రెండవది-'అవమానం'. ఇండియా విషయానికివస్తే 'అవమానం' ఒక ప్రధానమైన సమస్య. అణగారిన కులాలు, జాతులు, ఈ సమస్య నుంచి అధిగమించటానికి అవకాశం వచ్చినప్పుడల్లా వివిధ రూపాల్లో ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నం జాతీయ, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ ఉద్యమాలన్నిటిలోనూ కనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమం జరిగిన తీరును నిశితంగా పరిశీలిస్తే 'అవమానం' ఏ విధంగా ప్రధాన ఎజెండాగా ఉద్యమంలో ఉండింది ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలోని కులాలు తమ తమ ఉత్పత్తి పనిముట్లతో వచ్చి తమ ఉనికిని చాటుతూ ఉద్యమంలో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఒక కారణం కావచ్చు కానీ దాని చుట్టూ తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని, స్వయంపాలనా ఆకాంక్షను చాటుకునే ప్రయత్నం చేశాయి. ఉద్యమ నాయకులుగా చలామణి అవుతున్నవారు ఎంతమంది ఈ విషయాన్ని గుర్తించారన్నది తెలియదు. కానీ, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నర్సింహ ఢిల్లీ ప్రెస్ మీట్‌లో తెలంగాణ ఉద్యమం ఆర్థిక అసమానతల నిర్మూలన కోసం జరిగింది కాదని, ఇది ప్రత్యేక ఉనికి, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం జరిగిందని చెప్పటం చాలా సంతోషకరం. బహుశా ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పి ఉండవచ్చు.
తెలంగాణకు ఈ కోణం ఉందన్న వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించటం వల్లనే రాష్ట్ర ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయాలు జరిగిపోయాయి. ఎందుకంటే దానికి రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
తమ రాజకీయ ఆకాంక్షను ఇప్పుడు ఎలా సాకారం చేసుకోవాలన్నదే అణగారిన కులాల ముందున్న ప్రధాన సమస్య. ఫ్యూడల్ వ్యవస్థను ఢీ కొనడం కష్టతరమైన పనే. దీనికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల తదనంతరం వచ్చిన కుతుబ్ షాహిల కాలంలో నాయకర్‌లు(గ్రామాధికారులు)గా ఆంధ్ర, మరాఠ ప్రాం తాల నుంచి వచ్చిన రెడ్డి, వెలమలు కొలది కాలంలోనే 'కులాన్ని' ఫ్యూడల్ వ్యవస్థతో జోడించి ఒక భయంకరమైన దోపిడీ వ్యవస్థను సృష్టించారు. ఈ వ్యవస్థ అణగారిన కులాలను పూర్తి స్థాయి బానిసలుగా మార్చివేసింది. ఈ వ్యవస్థ అసఫ్‌జాహీల కాలంలో మరింత బలపడి నేటికీ వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది.

1995 నుంచి సాగిన ఉద్యమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఆంధ్ర పెట్టుబడిదార్లకు, తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా జరిగిన ట్రయాంగిల్ పోరాటంగా కనిపిస్తుంది. దొరల నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే, అణగారిన కులాలు, జాతులు తమ తమ కుల, జాతుల సంఘాలు పెట్టుకొని తమ ప్రత్యేక ఉనికి, ఆత్మగౌరవాన్ని, స్వయం పాలనను చాటుకుంటూ ఉద్యమించాయి. ఈ ఉద్యమాలు దొరల ఉద్యమాల్లో భాగంగా కాకుండా సమాంతరంగా నడిచాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను దొరల ఉద్యమం కంటే ఈ అణగారిన కులాల ఉద్యమమే బలంగా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారం కావడటానికి అణగారిన కులాల పాత్రే ప్రధాన భూమిక పోషించింది. దొరలు తెలంగాణ పేరుతో తమ కులాన్ని రాజకీయంగా బలోపేతం చేసుకొని, వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారు. దొరల నాయకత్వాన్ని ఢిల్లీ పెద్దలు ఎప్పుడు చీదరించుకుంటూనే వచ్చారు. ఇంతటి పోరాట పటిమ కలిగిన తెలంగాణ ప్రజలకు వీరా నాయకులని ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అణగారిన ప్రజల ఆకాంక్షను ఢిల్లీ నాయకత్వం చివరికి గౌరవించింది.
తెలంగాణ వారి నాయకత్వంలో తమతో సంబంధం లేకుండా ఉద్యమాలు వస్తుండటం చూసి ఈ దొరలు మళ్లీ కొత్త నాటకాలు మొదలెట్టారు. వీరి మాటలు విని 1948లో తెలంగాణ ప్రజలు ఒకసారి మోసపోయారు. మరోసారి అది పునరావృతం కాకుండా ఉండాలంటే అణగారిన కులాలు అప్రమత్తంగా ఉండాలి. పునర్‌నిర్మాణం చర్చల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారంలా అభివృద్ధి చేస్తామని దొరలు ఊదరకొడుతున్నారు. వీరు చెప్పే అభివృద్ధి ఎందుకు, ఎవరికోసమన్న ప్రశ్నలు వేసుకోవాలి. దొరలు చెప్పే అభివృద్ధి కేవలం వారి ఆస్తులను పెంచుకోవడానికే ఉపయోగపడుతుంది. దొరలు చెప్పే అభివృద్ధిలో అణగారిన కులాలకు మిగిలేది కేవలం గొర్ల, బర్ల లోన్‌లు మాత్రమే అన్న విషయాన్ని గమనించాలి. మరి వీటి కోసమేనా తెలంగాణ తల్లులు వేలమంది కొడుకులను త్యాగం చేసింది? అసలు ఈ దొరలు చెప్పే అభివృద్ధి అణగారిన కులాలకు అవసరమా?
వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికీ, అభివృద్ధికీ ఏ సంబంధం లేదు. ఇది ఒక రాజకీయ ఉద్యమం. కాబట్టి ముందు రాజకీయ పునర్ నిర్మాణం జరగాలి. అలా అని నేను అణగారిన ప్రజలకు అభివృద్ధి అవసరం లేదని అనటం లేదు. రాజ్యాధికారం అణగారిన కులాలకు వస్తే ఆర్థిక అభివృద్ధి, సామాజిక పునర్ నిర్మాణం (సోషల్ ఇంజనీరింగ్) దానంతటికి అదే జరిగిపోతుంది. దళిత, బహుజన, ఆదివాసీ మేధావులు, కవులు, కళాకారులు ఈ ప్రాతిపదిక మీదనే తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసి నిర్మించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఈ ప్రాతిపదిక మీదనే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. 90 శాతం అణగారిన కులాలు జాతులున్న తెలంగాణలో అంబేద్కర్ ఆశించిన రాజ్యం వచ్చే అవకాశం బలంగానే ఉన్నది.
ఇక్కడ ప్రశ్న ఏమంటే 10 శాతం జనాభా కలిగి ఉన్న అగ్రకులాలు దాదాపు 50 శాతం శాసన సభ్యులను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ 50 శాతం ఉన్న అగ్రకుల శాసన సభ్యులను 10 శాతానికి ఎలా తీసుకురావాలన్న ప్రాతిపదికగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలి. అణగారిన కులాలు రాజ్యాధికారం సాధించి ఆత్మగౌరవంతో బతికే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అగ్ర కులాలే పాలకులుగా, ప్రతిపక్షాలుగా, ఉద్యమ నాయకులుగా, ఉండే పరిస్థితి మారే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అభివృద్ధి ఫలాలు ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కాకుండా సామాజికన్యాయ సూత్ర ప్రాతిపదిక మీద అన్ని కులాలకు, వర్గాలకు, అందేలా పునర్ నిర్మాణం జరగాలి. మానవ హక్కుల ఉల్లంఘన లేని సమాజ నిర్మాణం కోసం పునర్ నిర్మాణం జరగాలి.
- ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 17/10/2013 


No comments:

Post a Comment