చాయ్, సమోస ఔర్ లామకాన్
భంగ్యా భూక్యా. ఇటువంటి పేర్లను విద్యావిషయకమైన బృందాల్లో వినడానికి మనం ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. వేరే స్థలాల్లో వేరే సందర్భాల్లో వేరే కోవల్లో మాత్రమే కనిపించే పేర్లు అధికార స్థానాల్లో, జ్ఞానపీఠాల్లో, పత్రికల కాలమ్స్‌లో తరచు తారసపడితే తప్ప సమాజంలోని అహంకారాలూ అర్థసత్యాలూ అంతరించిపోవు. ఇంగ్లీషు, విదేశీభాషల యూనివర్సిటీలో సామాజికవివక్ష అధ్యయన విభాగంలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న భూక్యా నిజాం పాలనలో లంబాడాల స్థితిగతుల మీద ఇంగ్లండ్‌లోని వార్‌విక్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. అంతర్జాతీయంగా పేరుపొందిన చరిత్రకారులతో కలసి పనిచేశారు. 2010లో ఇంగ్లీషులో వచ్చిన ఆయన పరిశోధనాగ్రంథం తెలుగు సంక్షిప్త అనువాదం జనవరి 5న హైదరాబాద్‌లో ఆవిష్కృతమైంది.
ఆ పుస్తకం నుంచి కోకొల్లలుగా కొత్త సత్యాలు నేర్చుకోవచ్చును. అవన్నీ ఒక ఎత్తు, పుస్తకావిష్కరణ జరిగిన వేదిక 'లామకాన్' నేర్పే కాలజ్ఞానం మరో ఎత్తు. గ్రంథకర్తకూ, ప్రచురించిన హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌వారికీ ఆ సమయంలో ఆ స్ఫురణ కలిగిందో లేదో కానీ, బంజారా హిల్స్‌లో, మేడాగూడూ కాకుండా మధ్యరకంగా, బృహత్‌శిలలను కడుపులోనే పెట్టుకుని కట్టుకున్న ఒక పొదరింటిలో భూక్యా పుస్తకావిష్కరణ జరగడం ఒక చారిత్రక న్యాయంగా తోచింది నాకు. ఒక వైపు జివికె మహాసామ్రాజ్యం, మరో పక్కన వెంగళరావు పార్కు, తక్కిన వైపులంతా విషంలా వ్యాపించిన నవసంపన్నత, వీటి మధ్య 'లామకాన్' ఒక చెలిమె. సాహిత్యం, సంస్కృతి, సమాజం- ఏదైనా సరే, నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి, పాడుకోవడానికి ఒక మంచి మనిషి అందించిన కాసింత స్థలం. అతి విలువైన అతి అరుదైన స్థలం. ఆ స్థలం ఉండబట్టే, బంజారాల చరిత్రను ఆవిష్కరించిన పుస్తకం బంజారాహిల్స్‌లో ఆవిష్కృతమైంది. ఆ సన్నివేశం మీటిన రహస్తంత్రి ఏమి చెబుతున్నది? ఈ దేశపు మహాజనులారా! మీరు కోల్పోయిన స్థలాలన్నిటినీ తిరిగి ఆక్రమించుకోండి, మీరు విస్మృతులైన కాలాలన్నిటినీ నిద్రలేపండి!
సంపన్నతతో విర్రవీగుతున్న బంజారాహిల్స్‌ను ఉద్రిక్త వక్షోజాలతో పోల్చాడు తిలక్. మహానగరంలోని ఉన్నతవర్గాల కేంద్రంగా బంజారాహిల్స్ ప్రఖ్యాతినో అపఖ్యాతినో మూటగట్టుకున్నది కానీ దాని నామవాచకం వెనుక ఉన్న చారిత్రక అర్థం మరుగున పడిపోయింది. ఒకనాడు సంచారవర్తకులుగా, రవాణాదారులుగా ఉన్న లంబాడాల ఆవాస ప్రాంతాలు నేటి బంజారాహిల్స్. ఆ కొండలు ఇప్పుడు బంగారు కొండలయిన క్రమం గానీ, ఎవరెవరినుంచి చేతులు మారి అవి నేడు కొండచిలువలకు కొలువైన కథ గానీ చరిత్రలో కనిపించదు. భంగ్యా భూక్యా- ఆ చరిత్ర డొంకను కదిలించాడు. 'లామకాన్'లో ఆ పుస్తకం గురించి చర్చించుకున్న కాసేపయినా బంజారాహిల్స్‌ను తిరిగి బంజారాలకు అంకితం చేశాడు.
'లామకాన్' ఒక సాంస్కృతిక బహిరంగ వేదిక కాకముందు, అది ఒక నివాసం. అప్పుడు కూడా దానిపేరు లామకానే. లామకాన్ అంటే ఇల్లులేని వారు అని అర్థం. ఇల్లు లేకపోవడం అంటే నిరాశ్రయత కాదు. సర్వవ్యాపిత్వం అని. ఇస్లామ్‌లో అల్లాకు ఉన్న అనేక నామాలలో లామకాన్ కూడా ఒకటి. నిరాకారుడైన దైవం స్థావరుడు కాదు. అన్నిటా ఉండే మహాశక్తి. జంగమతత్వానికి దగ్గరగా కనిపించే అద్భుతమైన భావన అది. భాగ్యనగరానికి ఆభరణాల వంటి మహాశిలలను ధ్వంసం చేయకుండా, వాటిని గర్భీకరించుకుంటూ, కళాత్మకంగా, నిరాడంబరంగా నిర్మించుకున్న ఆ నివాసం మొయిద్ హసన్‌ది. హైదరాబాదీ శిలా రక్షణ ఉద్యమకారుడు, ఛాయాగ్రాహకుడు, డాక్యుమెంటరీల నిర్మాత, చిత్రకారుడు మొయిద్ హసన్. ఉర్దూ రచయిత్రి జిలానీ బానో సోదరుడు ఆయన. తన తండ్రి స్నేహితుడైన హైదరాబాద్ అద్భుత కవి మగ్దూం మొహియుద్దీన్ ఒడిలో బాల్యకౌమారాలు గడిపిన అదృష్టవంతుడు.
పదిహేనేళ్ల కిందట హసన్‌ను 'లామకాన్' లో కలిశాను. చలపతి, విజయవర్థనరావు ఉరిశిక్షల రద్దు ఉద్యమంపై ఆయన, సజయ కలిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిన సందర్భం అది. సందర్భం అదే అయినా సంభాషణ బహుముఖాలుగా సాగింది. ఆయన ఆదరణలాగే ఉన్న పరిమళభరితమైన వెచ్చటి టీ తాగాను. ఆయన స్వయంగా వండి వడ్డించిన ఆతిథ్యాన్ని స్వీకరించాను. అప్పుడప్పుడే తెలంగాణ చరిత్రపై ఆసక్తి పెంచుకుంటున్న నేను నా అజ్ఞానాన్ని, కుతూహలాన్ని ఆయనతో పంచుకున్నాను. వెలుగునీడల మర్మం తెలిసినవాడేమో, సత్యాసత్యాల మధ్య ఉండే పొరలను విప్పిచెప్పాడు. ట్యూబ్‌లైట్‌లు నిర్జీవ దీపాలని అన్నాడు. నీడలు రాని దీపం వృథా అన్నాడు. ఆయన ఇంట్లో అన్నీ గుండ్రటి ఫిలమెంట్ బల్బులే.
ఏ ఉత్తరాది నుంచో ఏడెనిమిది దశాబ్దాల కిందట వలసవచ్చిన హసన్ కుటుంబం, హైదరాబాద్‌ను ప్రాణప్రదంగా ప్రేమించింది. మఖ్‌మల్ బట్టలో చుట్టి కుట్టిన ఒక చిన్న హైదరాబాదీ శిలను చూపిస్తూ, అభివృద్ధి చేస్తున్న విధ్వంసం గురించి, జనజీవనంలో వస్తున్న శైథిల్యం గురించి హసన్ వేదనతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనపై ఆయనకు ఎంతటి వ్యతిరేకతో, హైదరాబాద్ చరిత్రపై, తెహజీబ్ పై ఆయనకు అంత మక్కువ. కర్కోటకుడని పేరుపొందిన ఏడో నిజాం హయాంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదనే విషయం ఆయన చెబితేనే నాకు తెలిసింది. వాస్తవాలను కమ్మివేసిన అభిప్రాయాల పొరలను తొలుచుకుని చూడకపోతే చరిత్రను అర్థం చేసుకోవడం కష్టమని హసన్ నన్ను హెచ్చరించారు.
ఆయనను కలిసింది ఒక్కసారే కానీ, జ్ఞాపకం మాత్రం బలంగా మిగిలిపోయింది. 2004లో ఆయన చనిపోయినప్పుడు, ఆలస్యంగా తెలిసింది. సమాచార విప్లవ యుగంలో కూడా అన్ని వార్తలూ వేగంగా ప్రసరించవని అర్థమయింది. ఆయనను ఎవరెంత గుర్తించారో అనవసరం కానీ, ఆయన బలమైన ఆకాంక్షలు నిరాకరించలేని గుర్తింపును సాధించుకున్నాయి. ఆయన అభిమతాన్ని గుర్తించిన వారసులు, ఆయన నివసించిన ఇంటిని ఒక ఊరుమ్మడి సాంస్కృతిక వేదికగా మలిచారు. మంచితనాన్ని పంచుకునే ఏ ప్రయత్నానికయినా ఉచితంగా దొరికే వేదిక 'లామకాన్'. మిత్రుడు రామ్మోహన్ హోలగుండి ప్రదర్శించిన నాటకాలో, మానవహక్కుల వేదిక 'సోంపేట' మీటింగో, కవి శివారెడ్డి కవిత్వాలాపనో, కచేరీలో, ఆటపాటలో బంజారాహిల్స్ రాళ్లలోపల పూలు పూయిస్తూనే ఉన్నాయి. వేడివేడి చాయ్ సమోసాల మధ్య కొత్త మెహఫిళ్లను తీర్చిదిద్దుతున్నాయి. ఎదురీతల్లో రాటుదేలిన భూక్యాల మేధావిత్వం ఒక శిఖరం. విలువలను, సమష్టిని వదలని హసన్‌ల మంచితనం మరో శిఖరం.
- కె. శ్రీనివాస్
srinivask99@gmail.com
Andhra Jyothi Sunday Special Dated: 20/1/2013
No comments:
Post a Comment