Thursday, October 13, 2011

తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్ By మందకృష్ణ మాదిగ Andhra Jyothi Dated 13/10/2011

తొలి ముఖ్యమంత్రిగా కొండా లక్ష్మణ్
- మందకృష్ణ మాదిగ

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర కమిటీ సమావేశం సెప్టెంబర్ 30న ఖమ్మంలోని అంబేద్కర్‌హాల్‌లో జరిగింది. రాష్ట్ర కమిటీలోని మూడు ప్రాంతాల సీనియర్ నాయకులు, ప్రాంతీయ ఇన్‌చార్జ్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో సామాజిక తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణలో ఎమ్మార్పీయస్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని, తెలంగాణలోని 90 శాతం గల బిసి, యస్‌సి, యస్‌టి, మైనారిటీ వర్గాలను సామాజిక తెలంగాణకు అనుకూలంగా పెద్దఎత్తున సమీకరించాలని తీర్మానించడం జరిగింది.

సామాజిక తెలంగాణే లక్ష్యంగా ఈ వర్గాలను సంఘటితంచేయడంలో భాగంగా చైతన్యం చేయడానికి అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు రెండు నెలల పాటు ప్రతి రోజు రెండు నియోజకవర్గాలలో సామాజిక తెలంగాణ సాధనకై, పెద్ద ఎత్తున సభలను నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. మరో తీర్మానంలో తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బడుగు, బలహీన వర్గాల నాయకుడు త్యాగం, పోరాటం, సాహసం, పట్టుదల, అంకిత భావం ఉద్యమ స్ఫూర్తితో బాటు పాలనా దక్షత గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీనే నియమించాలని ఎమ్మార్పీయస్ తీర్మానించింది.

తెలంగాణ రాష్ట్రసాధనకై జరుగుతున్న ఉద్యమంలో త్యాగపూరితమైన పాత్ర పోషిస్తున్న ఈ అణగారిన వర్గాలు వచ్చే తెలంగాణలో సామాజికన్యాయం అమలుజరిగే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు ఆర్థిక, సామాజిక, విద్య -ఉపాధి, రాజకీయ తదితర రంగాలలో తీసుకోవాలని అనుకుంటే అందుకు ముఖ్యమంత్రిగా బాపూజీ నిజమైన అర్హుడని ఎమ్మా ర్పీయస్ సంపూర్ణంగా విశ్వసిస్తుం ది. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని అమలు చేయించుకునే దిశగా బాపూజీని ముఖ్యమంత్రిగా నియమించడానికి ఎమ్మార్పీయస్ ముందు వరుసలో నిలబడి పీడిత కులాలన్నింటినీ కూడగడుతుంది.

బాపూజీని ముఖ్యమంత్రిగా నియమించడానికి బలమైన అండదండలు అందిస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను ఒక తాటి మీదకి తీసుకొచ్చే విషయంలో కూడా ఎమ్మార్పీయస్ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే విషయంలో తెలంగాణ ప్రజల, వివిధ వర్గాల సమూహాల మధ్య ఏకాభిప్రాయం వుంది. అందులో రెండో మాటే లేదు. అంతే కాకుండ సీమాంధ్ర ప్రాం తాలలో కూడ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్న దళిత, బలహీనవర్గాలు, విద్యావంతులు, మేధావులలో తెలంగాణ ఏర్పాటు పట్ల సానుకూలత వుంది.

తెలంగాణ ఏర్పాటు పట్ల సీమాంధ్రలో ఉండే సానుకూలతను కూడగట్టే విషయంలో కూడా ఎమ్మార్పీయస్ క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి బాపూజీని ప్రథమ ముఖ్యమంత్రిని చేయడం వల్ల ఆయనలో ఉన్న సామాజిక దృక్పథం, సామాజిక తెలంగాణకు దారితీస్తుంది. దొరల తెలంగాణకు సీమాంధ్రలోని పీడిత కులాలలో సహజంగా ఉండే వ్యతిరేకత కనుమరుగై సామాజిక తెలంగాణకు మరింత మద్దతు సీమాంధ్ర పీడిత కులాల నుంచి దొరుకుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తెలంగాణప్రజల్లో ఏకాభిప్రాయం ఉన్నది. తెలంగాణేతర ప్రజల్లో కూడా సానుభూతి ఉన్నది. అయినా తెలంగాణ ఏర్పడ్డ తరువాత అది దొరల చేతికి పోతుందేమో అనే భయం, తద్వారా దొరల పాలనలో మరింత అణచివేతకు, వివక్షకు గురవుతామనే ఆందోళన తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలకు ఉంది. నిజాం పరిపాలనను అడ్డం పెట్టుకొని భూస్వాములుగా, జమిందారులుగా, జాగీర్దారులుగా ఎదిగిన వెలమ, రెడ్డి దొరలు సామంతరాజులుగా గడీల ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను వారి వారి పరిధిలోని వందలాది గ్రామాలను ఆయా గ్రామాల్లో పీడిత కులాల ప్రజలను నిట్టనిలువున దోపిడీ చేశారు.

దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఇంగ్లీషు వాళ్ళ పరిపాలనలో వున్న భూభాగంలో పేదవాడు ఏ పనిచేసినా కనీస వేతనాలు అమలు జరగడం వల్లనే పీడిత కులాలు కొంత ఆర్థికంగా పుంజుకోవడం జరిగింది. తెలంగాణలోని ఈ వెలమ, రెడ్డి దొరలు పీడిత కులాల వారందరి చేత వెట్టిచేయించుకున్న చరిత్ర వుంది. తెలంగాణ అవతలి ప్రాంతంలో బ్రిటిష్ పాలనలో దళితులు, పీడితకులాలు చదువు నేర్చుకోవడానికి మార్గం ఏర్పడితే తెలంగాణలో ఈ దొరలు తమ బిడ్డలను ప్రాథమిక, మాధ్యమిక చదువులకు పక్క రాష్ట్రాలకు పంపి ఇంగ్లీషు చదువులు నేర్పించి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపారు.

దళితులు, పీడిత కులాల ప్రజలు చదువు నేర్చుకోవాలని ఆలోచిస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఏర్పడకుండ ఈ దొరలు అడ్డు పడింది వాస్తవం కాదా? అంతే కాకుండ మీ పిల్లలను బళ్ళోకి పంపితే మాకు ఎట్టి చేసేటోడు ఎవడ్రా అని దౌర్జన్యాలు చేసిన సంఘటనలు కోకొల్లలే కదా? గడీల ముందు దొరలు ఎదురయినప్పుడు తన కాళ్ళ చెప్పులను తన సంకలో పెట్టుకొని తలదించుకొని దొరలకు వంగి వంగి దండం పెట్టే పరిస్థితే గతంలో కొనసాగిన విషయం మేం మరచిపోలేం. తెలంగాణలోని దొరల అణచివేత, పీడనకు వ్యతిరేకంగా పీడిత కులాలు తమ ప్రాణాలను అడ్డంపెట్టి ఎదురు తిరిగిన సందర్భాలున్నాయి.

ఆ సందర్భమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం కావటానికి దారితీసింది. ఎట్టికి వ్యతిరేకంగా, తెలంగాణ దొరల, భూస్వాముల అహంకారానికి వ్యతిరేకంగా జరిగిన ఆ పోరాటంలో 1946 నుంచి 1951 వరకు దాదాపు 6 వేల మంది అణగారిన వర్గాల వారు అసువులు బాశారు. సాయుధ పోరాటానికి, ప్రజల తిరుగుబాటుకు భయపడ్డ దొరలు ఊర్లను, గడీలను వదలి పట్నం చేరారు. సాయుధ పోరాట విరమణ అనంతరం ఆ దొరలు, భూస్వాములే తిరిగి కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని, ఆ పార్టీలో చేరి కాంగ్రెస్ కండువాలు టోపీలు ధరించి గ్రామాలు చేరి ప్రజల మీద పెత్తనం చేయడం ప్రారంభించారు.

ఆ విధంగా దొరల పెత్తనం తిరిగి అన్ని అణగారిన వర్గాలను దౌర్జన్యంగ తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకోవటం జరిగింది. దొరల పెత్తనాన్ని ప్రశ్నించిన వాళ్ళను హింసలకు గురిచేయటం పీడితకులాల మహిళల మీద దొరల అన్ని రకాల అకృత్యాలు పెరగడం సర్వసాధారణమయింది. ఆ పరిస్థితుల్లోనే మళ్ళీ దొరలకు వ్యతిరేకంగా పీడిత కులాల హక్కుల, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం మొదలైన ఉద్యమమే నక్సలైట్ ఉద్యమానికి దారి తీసింది.

పీడిత కులాల ఆగ్రహం నక్సలైట్ ఉద్యమం మరింత బలపడడానికే దారి తీసింది. పీడిత కులాల ప్రజల ప్రతిఘటన వల్ల కొంత మంది దొరలు ప్రజల ఆగ్రహానికి గురై హతం కావడంతో మిగిలిన దొరలు మళ్ళీ పట్నాలకు చేరారు. ఆనాడు సాయుధ పోరాటానికి భయపడి పట్నాలకు చేరిన దొరలు (1946-51), సాయుధపోరాటం విరమణ అనంతరం కాంగ్రెస్‌ను అడ్డుపెట్టుకొని తిరిగి పల్లెలకు చేరినట్టుగానే, మూడు నాలుగు దశాబ్దాల క్రితం నక్సలైట్ ఉద్యమానికి భయపడి పట్నాల దారి పట్టిన దొరలే టిఆర్ఎస్ ఏర్పడ్డ గత దశాబ్దం నుంచి తెలంగాణ సెంటిమెంటు ముసుగులో గ్రామాలకు చేరి టిఆర్ఎస్, జెఎసిల పేరుతో గ్రామీణ ప్రజల మీద తమ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇది వాస్తవం.

పీడితకులాల పోరాట స్ఫూర్తి, త్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ఆ ఏర్పడ్డ తెలంగాణ పరిపాలన టిఆర్ఎస్ ముసుగులో జెఎసి పేరుతో వెలమ, రెడ్ల చేతికే అధికారం పోతే ఇక అణగారిన వర్గాల జీవితాలు మళ్ళీ అధోగతి పాలే. ఈ భయం తెలంగాణ లోని అన్ని అణగారిన వర్గాల ప్రజలను వేధిస్తుంది. దీనికి పరిష్కార మార్గమే కొండా లక్ష్మణ్ బాపూజీని ముఖ్యమంత్రిగా చేయడం. తద్వారా సామాజిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారి తీస్తుందని ఎమ్మార్పీయస్ భావిస్తుంది. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని దొరలు నమ్మించవచ్చు. దొరల మాటలు నమ్మేంత అమాయకులు ఇప్పుడు ఎవరూ లేరు.

ఎందుకంటే టిఆర్ఎస్ ఏర్పడ్డ ఈ పదేళ్ళ కాలంలో తెలంగాణలోని పది జిల్లాల్లో ఈ నాటికీ ఏ జిల్లాకు ఒక్క దళితుణ్ణి టిఆర్ఎస్ అధ్యక్షుణ్ణి చేయలేదు. లక్షలాది మందితో జరుగుతున్న బహిరంగ సభల వేదిక మీద ఒక దళిత నేతనూ ముందు వరసన తమ పక్కన కూర్చో బెట్టుకున్న సందర్భం మచ్చుకైనా లేదు. టిఆర్ఎస్ అధినాయకత్వం ఆయా సందర్భాల్లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో గాని వివి ధ జాతీయ రాజకీయపక్షాల నేతలతో గాని చర్చలు జరపటానికి వెళ్ళి న సందర్భాలలో ఒక్క దళిత నాయకుణ్ణి కూడా వెంటతీసుకెళ్ళిన సంద ర్భం లేదు.

ఇక పోతే 97 ఏళ్ళ వయస్సుగల కొండా లక్ష్మణ్ బాపూజీనే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎందుకు కోరుకుంటున్నారనే ప్రశ్న కొంత ఉదయించక తప్పదు. ఎమ్మార్పీయస్ ఆయనలో రెండు నిర్దిష్టమైన లక్షణాలను గమనించింది. (అ) తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత; (ఆ) అణగారిన కులాల ప్రజలు పడుతున్న బాధలను తొలగించే విషయంలో వారికి దక్కవలసిన న్యాయమైన హక్కులను అందించే విషయంలో ఆయన పీడిత కులాల పక్షపాతిగా గతంలో నిలబడ్డారు. ఇక ముందు కూడ ఆయన సామాజిక న్యాయాన్ని కోరే శక్తులను ప్రోత్సహించే విషయంలో మరింత క్రియాశీలమైన పాత్ర వహిస్తారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం.

కొండా లక్ష్మణ్ బాపూజీ గారినే ఎమ్మార్పీయస్ ప్రథమ ముఖ్యమంత్రిగా కోరుకోవడానికి ఆయనలోవున్న ఈక్రింది పది లక్షణాలు కారణాలని మేం స్పష్టం చేస్తున్నాం. తాను స్వాతంత్య్ర సమరయోధుడిగా జైలు జీవితాన్ని గడిపిన మొదటి తరం యోధుడు; నైజాం స్టేట్ భారతదేశంలో విలీనమయ్యేందుకు ఎన్నోకష్టాలకు ఓర్చి ఉద్యమాన్ని నిర్వహించిన ధీశాలి; 1959లో తమ స్వగృహమైన జలదృశ్యంలో దేశంలోనే ప్రథమ దళిత ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొన్న దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన దళిత దీన జనుల పక్షపాతి;

1969లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం కిరాతకంగా అణచివేస్తున్న సందర్భంలో ఉద్యమానికి అండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా తన క్యాబినెట్ మంత్రి పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న మొట్ట మొదటి త్యాగశీలి; తన జలదృశ్యాన్ని (తన ఇంటిని) అణగారిన కులాల సామాజిక ఉద్యమాలకు, తెలంగాణ ఏర్పాటుకై జరుగుతున్న ఉద్యమాలకి, సంఘాలకి, పార్టీలకు గొడుగుగా మార్చిన పెద్ద మనసున్న పెద్ద మనిషి;

తన సామాజిక వర్గమైన చేనేత సహకార సంఘానికే కాకుండా మాదిగ చర్మకార పరిశ్రమ అభివృద్ధికి 1960లోనే నాయుడమ్మ కమిషన్‌ను నియమించిన మాదిగ బంధువు. ఈ రోజువున్న బలహీన వర్గాల ప్రతి వృత్తి కులసంఘాలయిన గీత, మత్స్య, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, స్వర్ణకార, రజక, మేదరి తదితర కులవృత్తి సంఘాలను నెలకొల్పడానికి మనసావాచా ప్రోత్సహించిన పీడిత కులాల పక్షపాతి; టి.ఆర్.యస్ ఆవిర్భావానికి తన ఇల్లు (జలదృశ్యం) ఇచ్చి ఆనాటి ముఖ్యమంత్రి కోపానికి గురై ఇంటినే పోగొట్టుకున్న నిఖార్సయిన తెలంగాణ స్ఫూర్తిదాత;

ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి డిప్యూటీ స్పీకరై, రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా వుండి ఇప్పుడు సొంత ఇల్లులేని నిస్వార్థ ప్రజాసేవకుడు; 97 ఏళ్ళ వయస్సు వచ్చినా ఇప్పటికీ ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణం కట్టుకొని తెలంగాణ వాదులందరినీ ఒకే గొడుగు కిందికి తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రమజీవి; తన సుదీర్ఘ ప్రజారాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తెలంగాణ విషయంలో గాని పీడితకులాలకు సామాజిక న్యాయం సాధించే విషయంలో గాని రాజీపడకుండా ధృడ సంకల్పంతో తను నమ్ముకున్న ఆశయ సాధన కోసం పట్టువదలని విక్రమార్కుడిలాగ ప్రయాణిస్తున్న బాటసారి.

- మందకృష్ణ మాదిగ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

ప్రజాస్వామ్యమే పరిశోధన By -చుక్కా రామయ్య Namasethe Telangana dated 14/102011

ప్రజాస్వామ్యమే పరిశోధన
Chukka-Ramaiah talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పుట్టుకొస్తూనే ఉంటాయి. సమస్యలకు పరిష్కారాలు ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతాయని చరిత్ర చెబుతున్నది. అయితే తమ సమస్యల పరిష్కారానికి గళం విప్పడం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ పాలకులకూ లేదు. నల్గొండ జిల్లాలో ఇటీవ ల కొన్ని సంఘటనలలో పోలీసుల అఘాయిత్యాలు కళ్లారా చూశాను. ప్రజల నిస్సహాయత కూడా చూశా ను. ప్రజల కోపాగ్ని కట్టలు తెగడమూ చూశాను. నల్గొండ నుంచి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాను. నిత్య జీవిత కార్యక్షికమంగా మారిన వాకింగ్‌కు ఉద యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లాను. ఆ ఆవరణంతా కలియ తిరిగాను. విశ్వవిద్యాలయాలకు, ఈ ప్రజా ఉద్యమాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అని నాలో ఆలోచనలు మొదలయ్యాయి.


ప్రజా కార్యక్షికమాల లో పౌరులు భాగస్వాములు కావడం ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన భాగం. ఆ పనిలోంచి ప్రజలను వేరు చేసి చూడలేం. ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీలు ప్రజలకు పాలకులకు మధ్యన ఏర్పడే అగాథాన్ని పూరించేందుకు పెనుగులాడుతున్నాయి. పరిశోధన అనగానే విశ్వవిద్యాలయాల గోడల వరకే, మేధావి వర్గం వరకే పరిమితం చేస్తారు. విశ్వవిద్యాలయాలు ఎంతో గొప్ప పరిశోధన చేస్తా యి. అంతటితో పరిమితం కాకుండా ప్రజాస్వామిక పాలనకు, జ్ఞాన సముపార్జనకు ఏర్పడ్డ అగాథాన్ని పూరించగలుగుతాయి. అంత శక్తిసామర్థ్యాలు విశ్వవిద్యాలయాలకున్నాయి. దాన్నే ‘యాక్షన్ రీసెర్చ్’ అంటారు. నేడు రీసెర్చ్ సమాజ ప్రగతి కోసం ఎంత ప్రధానమో? మానవ సంపద పెంచేందుకు ఎంత అవసరమో? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడా ఈ పరిశోధన అంతే అత్యవసరమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా పరిశోధనలో ఒక భాగమైంది.

‘రీసెర్చ్ ఫర్ డెమోక్షికసీ’, ‘డెమోక్షికసీ ఫర్ రీసెర్చ్’. ప్రజలను పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం చేయడమంటే పాలనకు సంబంధించిన చర్చలలో భాగం చేయడమే. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం చేయడమే. సమస్యలు పరిష్కరించడంలో భాగం చేయడమే. దీనితో పాలనా యంత్రాంగంలో ఉండే అధికారాలకు, సామాజిక కార్యకర్తలకు మధ్యనున్నటువంటి లోపాన్ని పూరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల సామూహికమైన జ్ఞానం పెరిగే అవకాశం, ప్రభుత్వం పౌరుల సమస్యల ను అవగాహన చేసుకోవడానికి, ప్రజలు పాలనలో ఇబ్బందుల ను చూసేందుకు దానికి అవకాశం లభిస్తుంది. దీనిలో మూడంశాలు ఇమిడి ఉంటాయి.

1) చర్చించే వేదిక 2) నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం 3) సమస్యను పరిష్కరించే ఆచరణాత్మక ప్రజాస్వామ్యం.
telangana talangana patrika telangana culture telangana politics telangana cinema
చర్చించే వేదిక అంటే సెక్ర చర్చలు మాత్రమే కాదు. అసెంబ్లీలో చర్చలు మాత్రమే కాదు. ప్రజలకు సంబంధించిన అంశాలపై గ్రామస్థాయి నుంచి చర్చలు జరగాలి. కొన్నిసార్లు వ్యక్తులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు చిన్నచిన్న గ్రూపులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు పంచాయితీ సభ్యులతో జరుగుతాయి. అంటే చర్చలను కిందిస్థాయి వరకు తీసుకుపోవాలి. సమస్యల పరిష్కారం మేధావి వర్గం, లేదా పాలనాపరమైన సొత్తు అనుకోకూడదు. కిందిస్థాయి గ్రామాల్లో ఉన్న సామాజిక కార్యకర్తలు కూడా చర్చలో భాగస్వాములు అయితే సమస్య పరిశోధనలో ఎక్కువ మంది భాగం అవుతారు. పరిష్కారాలు మేధావి వర్గం మెదళ్ల నుంచే వస్తాయని అనుకోవద్దు. అధికార పీఠాల నుంచే రాల్తాయని అస్సలు అనుకోకూడదు. నల్గొండలో జనంలో తిరుగుతుంటే సామాన్యమైన మనిషి ఎదుర్కొంటున్న సమస్యపైన, తెలంగాణలో రగులుతున్న ఉద్యమంపైన ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారో కళ్లారా చూశాను. చర్చలు చేయడమే పరిశోధనకు మొదటి ప్రాతిపదిక.


అవి ఎంత విశాలంగా ఉంటే మనకంత విస్తృత సమాచారం లభిస్తుంది. వివిధ స్థాయిలలో ప్రతిరోజు ప్రజా సమస్యలపైన, రచ్చబండపైన చర్చలు జరుగుతాయి. ఆ చర్చలే రాష్ట్ర విధానాలకు కూడా ప్రాతిపదికలవుతాయి. రచ్చబండ కిందిస్థాయి చర్చలు కావు. అదొక పరిశోధన వేదిక. పరిశోధన ఎంత విశాలంగా ఉంటే ఫలితాలు కూడా అంత విస్తృతంగా ఉండే అవకాశాలుంటాయి.
నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం: సమాజంలోని వివిధ వర్గాలకు వివిధ ఆశయాలు విభిన్నంగా ఉంటాయి. విభిన్నమైన నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి మొలకెత్తుతాయి. విభిన్న నిర్ణయాలలో ఏకత్వం, ఏకాభివూపాయం తేవడమే పరిశోధన లక్ష్యం కావాలి.

సమస్య పరిష్కారంలో సంబంధిత వ్యక్తులను కలిపితేనే కిందిస్థాయి బాధలు, కష్టాలు అర్థమవుతాయి. నిరంకుశ ప్రభుత్వాలలో నిర్ణయాలు పైనుంచి రుద్దబడతాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో కింది నుంచి మొలకెత్తుతాయి. అవే ప్రజలను ప్రభుత్వం లో భాగస్వాములను చేస్తాయి. ప్రజాభివూపాయాన్ని, ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని చెప్పడానికి పాలకులు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటిని గౌరవించే అలవాటు చేసుకోవాలి. అదే మాదిరిగా ఆ డేటాను సామరస్యంగా సేకరించడం, సహృదయంతో స్వీకరించడం ప్రజాస్వామ్యానికి కావల్సిన మొదటి లక్షణం.
విశ్వవిద్యాలయాల్లో ఉన్న రీసెర్చ్‌ను ప్రజాజీవితంలోకి తీసుకరావాలి. బ్రిటన్‌లో జరిగిన చిన్న సంఘటనను పార్లమెంటు వరకే పరిమితం చేయలేదు.

దానిపై కిందిస్థా యి నుంచి చర్చలకు అవకాశం కల్పించారు. అదే మాదిరిగా మనం డెమోక్షికసీ తెచ్చుకు న్నాం. కానీ డెమోక్షికటిక్ అటిట్యూడ్ తెచ్చుకోలేదు. ప్రజలను పాలితులుగా చూస్తున్నాం కానీ భాగస్వాములుగా చూడడం లేదు. ప్రజాస్వామ్య ముసుగులో ఫ్యూడల్ రాజకీయాలు నడుపుతున్నారు. పరిశోధనలో చిన్న పెద్దా అనేది ఉండదు. అందరూ సమానమే. నల్గొండలో పోలీసు దాడులకు గురైన ప్రాంతాలలో తిరుగుతుంటే ప్రతి ఊరు నాకొక పరిశోధనశాలగా కనిపించింది. అది నకెరేకల్ కావచ్చును, కోదాడ, సూర్యాపేట కావచ్చును. చౌటుప్పల్, చిట్యాలలు కావచ్చును. సమస్త తెలంగాణ జనం ఏకాక్షిగతతో చర్చిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రజ లు ఆలోచిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలి. అలా చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి ఫలితాలొస్తాయి.

మనకు ఒకరినొకరు విశ్వసించే అలవాటు కూడా ముఖ్యం. ఒకరిపై ఒకరికి విశ్వాసం లోపించకూడదు. ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల సమాచారాన్ని విశ్లేషించే లక్షణముండాలి. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకునే నిర్ణయాలు జరుగుతుండాలి. అప్పుడే సమస్య పరిష్కారంలో ప్రజలు భాగస్వాములవుతారు. అందుకే పరిశోధన అన్నది ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యమే పరిశోధన.
-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

Monday, October 10, 2011

ఈ కులాలు తెలుసా ? By Vakulabharanam Krishna Mohan Rao Surya News Paper 11/10/2011


ఈ కులాలు తెలుసా ?
అరవైనాలుగేళ్ళ స్వాతంత్య్రానంతరం కూడా మన ప్రజాస్వామ్య దేశంలో అసమానతలను, వివక్షను, అణిచివేతను మట్టు పెట్టలేకపోయాం. పలు మానవ సమూహాలను మన సమాజంలోని నాగరిక జీవన వ్యవస్థలోకి ఇంకా తీసుకు రాలేకపోయాం. దేశంలో అవినీతిపై ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ప్రాంతాల వెనుకబాటుతనంతో అన్యాయాలకు గురైన ప్రాంతాలలో ‘ప్రత్యేక రాష్ర్ట విభజన వాదా లు’ పెల్లుబుకుతున్నా యి. చిన్న కులాల ప్రజలు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి కావడంతో అత్యంత పేదలుగా దారిద్య్రరేఖకు దిగువన చేరిపోయారు. కులాల మధ్య అంతరాలు పెరిగాయి. కులం పునాదుల మీద రాజకీయ వ్యవస్థ రాజ్యమేలుతున్నది. జన బాహుళ్యంలేని కులాలు డబ్బు, రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుని తర తరాలుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇలాంటప్పుడు సమ సమాజం ఎలా ఏర్పడుతుంది? సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు- ఎలా సాధ్యపడుతుంది? జనాధిక్యత కలిగిన బలహీన వర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందకుండా దేశం సంపన్న అగ్రరాజ్యం ఎలా అవుతుంది? మహాత్మా జ్యోతిబా ఫూలే, డా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ కన్న కలలు ఎలా సాకారం అవుతాయి?ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని మన రాష్ర్టంలోని పలు బీసీ కులాల వాస్తవ జీవన స్థితి గతులను సమాజం ముందుంచి చర్చనీయాంశం చేసి ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు గైకొనవలసి ఉన్నది.

రాష్ర్టంలో బీసీ కులాలలో- బాలసంతు, బహురూపి, బందర, బుడబుక్కల, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాపటిపాపల, కొర్చ, మొండివారు, మొండిబండ, బండ, పిచ్చకుంట్ల, వంశరాజ్‌, పాముల, పార్థి, నీర్‌షికారి, పంబాల, దమ్మలి, పెద్దమ్మలవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలవాండ్లు, వీరముష్టి, నెత్తికోటల, వీరభద్రీయ, గుడల, కంజరబట్ట, రెడ్డిక, మొండిబట్ట, నొక్కర్‌, పరికిముగ్గుల, యాత, చొపమెరి, కైకాడి, మందుల, మేథర్‌, కూనపులి, పొందర, పట్రా, కురాకుల, పొందర, సిక్లిగర్‌, పూసల, కెవ్వుట్లు, గుడియా, జక్కల వంటి మరెన్నో కులాలు. అసలు ఎప్పుడైనా ఈ కులాల పేర్లు విన్నారా? ఇవి బీసీ కులాలని, వీరు మన రాష్ర్టంలోనే ఉన్నారని ఎందరికి తెలుసు? ఈ మానవ సమూహాలు మన నాగరిక వ్యవస్థలోనే ఉన్నాయా? అనే అనుమానం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
అనంతరామన్‌ అధ్వర్యంలో మొట్ట మొదటి బీసీ కమిషన్‌ 1970లో ఈ కులాలను సంచార, విముక్తి జాతులుగా గుర్తించి బీసీ కులాల జాబితాలోని ఎ గ్రూపులో చేర్చింది. వీరి అభి వృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి జన జీవన స్రవంతిలో తగిన గుర్తింపు తేవాలని సూచించింది. అ యితే 64 ఏళ్ళ స్వతంత్ర భారతంలో వీరి గురించి పరిశీలించడం మొదలుపెడితే, ఇవి జాడ తెలియని కులాలుగా నేటికీ సంచార జాతులుగానే మిగిలిపోవడం హృదయ విదారకరమైన అక్షరసత్యం.

బాల సంతు, బహురూపి కులస్థులు గ్రామీణ ప్రాంతాలలో బహురూప కళల ద్వారా ప్రజలకు వినోదాన్ని కలిగిస్తూ, భిక్షాటనే ఆధారంగా జీవించేవారు. కావడికి జోలె వేసుకొని గంట ఊపుతూ సూర్యోదయానికి ముందే గ్రామ ప్రజల్ని నిద్రలేపేవారు. ఆ పద్ధతిలో గంటను ఊపడం వీరి ప్రత్యేకత. స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతూ బతుకులీడ్చేవారు. కాల క్రమంలో వీరి వృత్తి కనుమరుగైపోయింది. వీరు నేడు ఏ విధంగా బతుకుతున్నారో తెలియదు. వీరు ప్రధానంగా తెలంగాణ జిల్లాలకే పరిమితమై ఉండేవారు.
దొమ్మర కులస్థుల దొమ్మరి విద్యలు, ఒలింపిక్స్‌ ఆటలతో పోటీపడతాయి. వీరు పందుల పెంపకం చేపట్టేవారు. కాలక్రమంలో జీవనాధారం లేక పలువురు పడుపు వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది. చట్టం దృష్టిలో నేర ప్రవృత్తి అయిన వీరి వ్యాపకం దినదినగండం అవడంతో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. గంగిరెడ్లవారి గురించి అందరికీ తెలుసు - కాని నేడు వారి జీవితాల గురించి ఎవరికీ తెలియదు. జంగం, జోగి కులాలు భక్తి ఉద్యమాల కాలంలో ఏర్పడ్డాయి. శైవమత ప్రచారం కోసం జీవితాలను అంకితంచేసి విస్తృతంగా పర్యటించారు.

కాల క్రమములో భిక్షగాళ్ళుగా మారిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా కడప జిల్లాలో భిక్షాటన చేస్తూ, సంచార జీవులుగా బతికిన ‘బందర’ కులస్థులకు దొంగలుగా ముద్రవేశారు. దాంతో వారు సమాజంలో కలసి పోలేక పోయారు. బుడబుక్కల కులస్థు లు సంచార జీవితంలో యాచక వృత్తే ప్రధానాధారంగా జీవిం చారు. కాటిపాపల వాళ్ళు కూడా శవదహన క్రియలు చేపట్టే వృత్తి నుండి దూరం అయ్యారు. సమాజంలో ప్రస్తుతం వీరి జాడ కనిపించడం లేదు. పూసల వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులకు అందుబాటులో ఉండే చవకధరల దువ్వెనలు, కొప్పుపిన్నులు, అద్దాలు మొదలైనవి అమ్మి జీవించేవారు. జక్కుల వాళ్ళు సర్కారు జిల్లాలకు పరిమితమైన జక్కలవారు. జనాధిక్యత లేని సామాజిక వర్గం ఇది. వీరి పూర్వీకులు భాగవతం తదితర ఇతిహాసాలపై కథలు చెపుతూ బ్రతికేవారు. క్రమంలో జనాదరణ తగ్గడంతో బతుకుదెరువు కోసం పడుపు వృత్తిలోకి దిగి జీవితాలను బలిపెట్టుకున్నారు.

ప్రపంచీకరణలో ఇలా ఎన్నో కులాలు నిర్వీర్యమయ్యాయి. వృత్తి కులాలు, శ్రామిక కులాలు అవకాశాలు లేక చేయూతనిచ్చేవారు కరువై, నిర్వీర్యమై అభివృద్ధి సాధించలేక ప్రత్యామ్నాయ జీవనోపాధి దొరకక పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయారు. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో దారిద్య్ర రేఖకు దిగువన జీవించే ప్రజలుగానే వీరు కొనసాగుతున్నారు. ఒకనాటి వృత్తులు, వృత్తి ధర్మాలు నేడు అక్కరకు రాకుండా పోయాయి. అయినా మనుషులు బతకాలి కదా! పారిశ్రామికీకరణతో నూతన వ్యాపార ఉత్పత్తులతో కోట్లాది మంది జీవనాధారం కోల్పోయారు.పారిశ్రామికీకరణతో అభివృద్ధి సూచిలను ఘనంగా ప్రకటించుకుంటున్నారు. కాని వాటివల్ల కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిన సూచికలు ప్రకటించరెందుకు? ఎవరు, ఏఏ వృత్తులు కోల్పోయారో ఎలా బ్రతుకున్నారో తెలియకుండా వారి అభివృద్ధికి ప్రణాళిక వేయడం ఎలా సాధ్యం? అందువలన ఈ పేదకులాల జీవన స్థితుగతుల గురించి, వారిని అభివృద్ధి పథంలోకి, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రత్యేక కృషి ఎలా చేయాలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాలు తమ పరిశోధనలను ఈ రంగాలకు విస్తరించకపోతే అవి ఎందుకు, ఎవరి కోసం ఉన్నట్టు? పరిశోధనల పేరిట ఏం చేస్తున్నట్టు? సామాజిక, ఆర్థిక, చరిత్ర, మానవ పరివర్తన శాస్త్ర విభాగాల ద్వారా విస్తృతంగా అధ్యయనాలు నెరపి, విశ్వవిద్యాలయాలు పరిష్కార ాలు సూచించాల్సి ఉంది.

sithaaram
అన్నింటికన్నా మించి జాతీయ ప్రణాళికా సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్య మూలాల్లోకి వెళ్లి, అధ్యయనాలు చేయించి, ఆ దిశగా నిధులు కేటాయించి, చర్యలు చేపట్టాలి. అలాగే ఆయా కుల సంఘాల నాయకత్వం ఎదిగి, తమ కులస్థుల జీవితాలు ఎలా బాగుపడుతాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారాలకై ప్రభుత్వాలకు నివేదించాల్సి ఉంది.42 ఏళ్ళుగా రాష్ర్టంలో విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, ఈ కులాలు మరీ వెనుకబడి, జాడ తెలియకుండా కనుమరుగవడం, ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొనడం దిగ్భ్రాంతికరం. ఆధునిక సమాజం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా దూసుకువెళుతున్న ప్రస్తుత తరుణంలో మరింత బాధ్యతాయుతంగా వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉంది.


రచయిత కేంద్ర సామాజిక, న్యాయ పరిశోధన సలహా సంఘం సభ్యుడు

ఆదివాసుల రగలఖ్ జెండా..- చిల్ల మల్లేశం Namasethe Telangana 11/10/2011

ఆదివాసుల రగలఖ్ జెండా..
Komaram-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూతగా పంపుతుంది. ఈ సందర్భంగా నాజంకూ, కొమురంభీంకూ మధ్య యుద్ధక్షేత్రం జోడేఘాట్‌లో జరిగిన చర్చల వివరాలను నాజం నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాడు. 1980వ దశకంలో ఈ నివేదిక ను రచయితలు అల్లం రాజయ్య, సాహు సంపాదించి తమ నవ ల ‘కొమురం భీం’లో పొందుపరిచారు. అడవిపై మైదాన పెత్త నం వల్ల ఆగమైన గోండు బతుకులను, భీం ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, నైజాం సర్కారుపై ఆయన వినిపించిన ధిక్కార స్వరాన్ని ఈ నివేదిక తెలిపింది.నాజం, భీం మధ్య జరిగిన సంభాషణ యాథాతథంగా..
సంవత్సరం : 1940 పూర్వ పాదం,
స్థలం : జోడేఘాట్..

నాజం: రాం రాం భీం. (భీం, సాయుధులైన గోండులు, ఆ పరిసరాల వంక భయంభయంగా చూస్తూ..)
భీం: నాజం సాబ్ రాంరాం.. మీకు ఎలాంటి భయమక్కర్లే దు. సంప్రదింపులకు వచ్చిన మనిషి కాలుకు ముల్లు గుచ్చకుం డా చూడాల్నని మాకు తెలుసు. (మంచంలో కూర్చోమని సైగ చేస్తూ)
నాజం: ఇంత పెద్ద అడవిలో ఎట్లా బతుకుతున్నరో ముసీబత్ హై.. భీం దాదా.. ముసీబత్ హై..!
భీం: కానీ ఈ అడవిలో నుంచే మీ బంగ్లాల్లోకి సరుకులు వస్తయి.

నాజం: అవునవును. సరే భీం, సరిగ్గా విను. నైజాం సర్కా రు దయగలది. నిజమే. మీరు భూములు లేక బాధపడుతున్న రు. ఆ సంగతి సర్కారుకు ఎట్లా తెల్వాలె! మీరు ఖానూన్లు ఎరుకజేసుకోవాలె! మీకు ఖానూన్లు తెల్వకపోవడం సర్కారు తప్పుకాదు గదా!
భీం: మేము వందలసార్లు అర్జీలు పెట్టుకున్నాం. సర్కారు చెవిటిది. గుడ్డిది. మూగది.(ఆవేశంగా)
నాజం: సర్కారుకు మీరొక్కరే కాదుగదా! లక్షల మంది. లక్ష పనులు. సరే.. జో హోగయా.. సో హోగయా! భీమూ.. అర్థం చేసుకో. నీకు, నీచిన్నాయినలకు పట్టాలిప్పిస్తా. అందరిజోలి నీకెందుకు? దున్నుకో. బతుకు!

భీం: నాజం సాబ్.. మీరు పొరబడుతున్నరు. మా పన్నెండు గ్రామాల గురించి మేం యుద్ధం చేస్తున్నం. నా ఒక్కడి గురించి కాదు.

నాజం: అయితే మీ పన్నెండు గ్రామాలకు పట్టాలిప్పిస్తాం.
భీం: అక్కర్లేదు నాజం సాబ్.. ఘనమైన మీ నైజాం సర్కారుతో చెప్పు! మీ ఉన్నతమైన రాజుకు మా సందేశం విన్పించు. మేము మా మొర విన్పించాలని మీ రాజు వద్దకు వచ్చినం. కానీ మమ్ముల్ని అవమానించి పంపిన్రు. అడవిని నరికి పాడుచేసే తెలివిలేని మూర్ఖులమన్నరు. బుడ్డగోచీ మాటలు అని అపహాస్యం చేసిన్రు. ఇప్పుడు చెబుతున్న. మేం బుద్ధి పూర్వకంగానే అడవిని నరికినమని చెప్పు. మేం పట్టేదార్ల కింద, జాగీర్దార్ల కింద కౌలు చేసి.. జంతువులతో పోరాడి పండించిన పంట సాంతం వారికి కొలిచి.. అర్ధాకలితో బతుకలేక.. మరింక తెగిం చి మాకు సొంత భూమి కావాలని.. స్వేచ్ఛగా బతుకాలని.. అడవి నరికినమని చెప్పు. మేం మోగించిన తుడుం గురించి చెప్పు. మేం ఎగరేసిన రగల్ జెండా గురించి చెప్పు. మీ దుర్మార్గపు పాలనతో విసిగిపోయామని చెప్పు. ఇకపై మేం జంగలాతువాళ్ల లాఠీ దెబ్బలు సహించబోమని చెప్పు. మీరు మమ్మల్ని జైళ్లపాల్జేసినా, చంపినా సరే.. మళ్లీమళ్లీ అడవులను నరుకుతమని చెప్పు. భూములు సాగు చేస్తమని చెప్పు. పంటలు తీస్తమని చెప్పు.జిస్ గోండ్ వాలోం కో గాండ్ మే దమాక్ రహతా బోల్‌కే బోలేనా వొ హీ గోండు నాయక్ కొమురం భీం చెప్పిండని మరీమరీ చెప్పు.

నాజం: ఓ భీం.. ఆవేశానికి పోవద్దు. కోపతాపాల వల్ల లాభం లేదు. లడాయి ఆపండి. రక్తపాతం ఎవరికీ మంచిది కాదు.(మధ్యలో అడ్డం వస్తూ)
భీం: నాజం సాబ్.. నన్నాపకు. నా రక్తం పోటెత్తుతోంది. మా బతుకంతా క్రూరమైన మీ రాజు పాలనలో ధ్వంసమై పోయింది. మమ్ముల మూర్ఖులన్నరు. కానీ మేం సర్వసంపద లు సృష్టించేవాళ్లం. ఒకనాడు మానవులు ఉన్నతంగా బతికిన్రు. భూమి, గాలి, నీరు, అడవులు, కాయ, పండు, వేట ప్రతీది కలిసి పంచుకుతిన్నరు. మనిషి మీద సాటి మనిషి పీడన లేకుం డా ఆకాశంలోని పక్షుల్లా స్వేచ్ఛగా బతికిన్రు. కానీ మీ రాజరికం అంతా గోల్‌మాల్ చేసింది. అలాంటి రాజరికం మా కక్కర్లేదు. మేం ఊర్కుంటే మీరు, మీ రాజులు, ఆకాశాన్ని, చంద్రున్ని, సూర్యున్ని, గాలిని అమ్ముకుంటరు. అన్నింటికీ పన్నులు కట్టమంటరు.

నాజం సాబ్.. మేం అడవులు నరికి సేద్యయోగ్యం చేసిన భూములను మీరు గుంజుకున్నరు. కొత్తగా అడవులు నరికితే కేసులు పెట్టి, బొక్కలో తోసిన్రు. మేము ఆకలితో చస్తుంటే మమ్ముల దోచిన సొమ్ముతో మీరు విందులు చేసుకుంటున్రు. మీ విలాసాల కోసం మారణహోమం సృష్టిస్తున్రు. నాజం మీరు రాక్షసులు. పంటలు దీసే మా చేతులను, గుడిసెలు గట్టే మా చేతులను నరికిన్రు. మా చెమట, నెత్తురు జలగల్లా తాగి న్రు. మీ సర్కారు భిక్షం మాకక్కర్లేదు. ఈ పన్నెండు గ్రామాలకే కాదు. ఉట్నూరు నుంచి రాజోరా దాకా మొత్తం మా గోం డు పరిగణాకు, పాలించే అధికారం కావాలి. మీ సర్కారుకు చెప్పు. మా మీదకు ఎక్కువ సైన్యాన్ని పంపినా.. మేమంతా పోరాడి చచ్చినా.. మాలో గోండు వీరుడొక్కడు మిగిలినా రాజ్యాధికా రం కోసం పోరాడుతడని!

నాజం: భీము. నాకొక చిన్న అనుమానం. రాజ్యం చేయడం మామూలు మాటలు కాదు. దానికెంతో అనుభవం ఉండాలె!
భీం: నాజం సాబ్ నిజమే. మీలాగా పదియి చ్చి, వందలకు పెంచి, పందుల్లా మెక్కే షావుకార్లు, అన్యాయంగా మంది భూములను లాక్కు నే జాగీర్దార్లు, అమాయకుల రక్తం పీల్చే జంగ్లాతోళ్లున్న రాజ్యాన్ని మేం చేయం. మేము అందరికీ సమానంగా బతికే హక్కు ఉన్న రాజ్యం చేస్తం. నాగలికట్టి దున్నేవాడికే భూములిస్తం. కనుక మా రాజ్యంలో అన్యాయానికి తావులేదు.ఇంకా వినండి. మేము మా గోండులకు ఈ విధంగా పిలుపునిచ్చినం..

‘‘ఓ గోండన్నలారా లేవండి. ఈ దునియాలో రెండు రకా ల మనుషులున్నరు. కూడు కోసం చచ్చేవాళ్లు. కూడు అన్యాయంగా సంపాదించి, పీకల దాకా మెక్కి అజీర్తితో బాధపడేవాళ్లు. పట్టేదార్లు, షావుకార్లు, రాజులు వీళ్లంతా మనలను దోస్తున్నరు. ఈ నేల, అడవి, అన్నీ.. అన్నీ మనవి. ఇవి మనకే చెందా లి. మనకే రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం మనకు రావాలంటే మనమందరం ఏకం కావాలి. లడాయి చేయాలి. మనలను పీడించే వీళ్లను, శాశ్వతంగా తుడిచిపెట్టాలి. మన రాజ్యంలో కష్టపడేవాడికి తిండి, చదువు, తెలివి అన్నీ చెందుతాయి. ఎవడైతే నాగలి పట్టగలడో, ఎవడి భార్య అయితే పొద ల్లో, బెడల్లో జొన్నలు పోయగలదో వాళ్లకే అన్ని హక్కులు.’’ ఇదే మా సందేశం. ఇదంతా కొమురం భీము చెప్పాడని చెప్పు. మీ దుష్టపాలన, మోసపు సర్కారుతో మాకు రాజీ కుదరదని చెప్పు.
నాజం: భీం మీకు రాజ్యాధికారం ఇవ్వలేం. మీకు పరిపాలన చేసుకోవడం రాదని మా నమ్మకం
భీం: అయితే మాకు రాజ్యాధికారం తప్ప, ఇంకేమీ అవసరం లేదని మీ నైజాం రాజుకు నా మాటగా చెప్పు. ఇదే నా అంతిమ నిర్ణయమని చెప్పు. (చప్పట్లు చరిచి, వెళ్లిపొమ్మంటూ సైగ చేశాడు..)
- చిల్ల మల్లేశం
(నేడు కొమురం భీం వర్ధంతి)

గాంధీతాతా నువ్వే చెప్పు! - కంచ ఐలయ్య Andhra Jyothi 11/10/2011


గాంధీతాతా నువ్వే చెప్పు!

- కంచ ఐలయ్య

రావాలనుకున్న తెలంగాణ రాష్ట్రం రాక మా ప్రాంతపు ముగ్గురు నేతలు నువ్వు పుట్టిన రోజున నీ సమాధి దగ్గర నీ టోపి పెట్టుకొని కూర్చున్నారు. ఆ మూడు ఫోటోలు చూస్తే నాకు నువ్వు బతికి వుండగా మూడు కోతులకు చెడు మాట్లాడం, చెడు వినం, చెడు చూడం అని నేర్పిన నీతి గుర్తొచ్చింది. అందులో ఒకాయిన గాడ్సే గాడిలో ముసలితనం పొంది ఇప్పుడు నీ గాడికొచ్చాడు. ప్రాంతాల పంపకంలో 55 కోట్ల రూపాయలు పాకిస్థానుకియ్యాలని నువ్వు ఉపవాసనమున్నందుకు నిన్ను చంపుడు సరైందని వాదించి, వాదించి ఇప్పుడు నీ దగ్గరికెందుకొచ్చాడు?

ఆయన పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో నీ అహింస సూత్రం ఆకుతో సమానమని ముస్లిం ఆడోల్ల కడుపులు కోసి పిండాలను మంటల్లో ఏసిన అహింసా అసలు రూపం అని వాదించాడు. అలా వాదించి, వాదించి మొన్న మోడీ సద్భావనంలో నీ ఫోటో పెట్టుకోగానే నువ్వు కాంగ్రెస్‌ను వదిలేసి వాళ్ళతో పోతున్నావని ఈయన నీ సమాధి దగ్గరికొచ్చి, చెడు చేసుడటుంచి, చెడు మాట్లాడనన్నట్టు కూర్చున్నాడు.

తెలంగాణలో వాళ్ళ రాజ్యమొస్తే ముస్లింలను ఊచకోత కొయ్యమని ఎక్కడ చెప్పడం లేదు. స్వాతంత్య్రం రాకముందే ముస్లింల రక్షణ మీద, రాజ్యం ఏర్పాటు మీద (పాకిస్థాన్) నువ్వు 1931 నాటికే ఒప్పుకున్నావుగా. మైనార్టీల వాటాపై గాని రక్షణపై గాని వీళ్ళు అగ్రిమెంట్ ముందు అవసరం లేదంటున్నారు. నువ్వేమో వాళ్ళకు ప్రత్యేక దేశమివ్వటానికే ఒప్పుకున్నావు. నిన్ను వాళ్ళు చంపి 63 ఏండ్లయింది. ఎన్నడు నీ దగ్గరికి రానోళ్ళు గీ చిన్న తెలంగాణ కోసమొస్తున్నారంటే మాకందరికి భయమేస్తుంది.

తెలంగాణ ప్రాంతానికి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, చత్తీస్‌ఘడ్ నుంచి వీళ్ళ కన్న తల్లి ఆర్.యస్.యస్. పైసల్నీ పదాతిదళాల్ని పెద్ద ఎత్తున పంపుతుంది. భాషా రాష్ట్రాలను విడగొట్టడం తెలంగాణతో మొదలుపెట్టి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లకు చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని పాకించి, కరప్షన్‌తో చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని జోడించి సోనియా గాంధీని ఇటలీకి పంపించాలనేది వాళ్ళ వ్యూహం. ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెలమ దొరల రాజ్యం ఏర్పరచవచ్చని ఒక ప్రయత్నం జరుగుతుంది.

మీ దగ్గరికొచ్చిన రెండోనేత ఇక్కడ తెలంగాణ రాజ్యాన్ని నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నాక ఇక్కడ రెడ్డి, వెలమలను కొంత అణచిపెట్టారు. కాంగ్రెస్ గూటి నుండి ఒక దళితుడు, టిడిపి గూటి నుండి ఒక బి.సి. తెలంగాణలో ముందున్న పెట్టుబడిదారులుగా కనిపించారు. ఒక ముస్లిం కుటుంబం కూడా ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో యస్.సి, బి.సి.లు అన్ని రంగాల్లో కనిపించడం మొదలైంది. కుల నిర్మూలన అసలు చెయ్యొద్దనీ నువ్వు కూడా అంబేద్కర్‌తో పోరాడి దాన్ని కాపాడావు కదా! దాని నిర్మూలనకు ఇదొక 'అడ్డ'గా తయారైందని వీళ్ళు తపన చెందుతున్నారు.

ఇక్కడి మూడు ప్రాంతాల్లో అన్నిటికంటె ఎక్కువ 'బి.సి' చైతన్యం ఉన్న 'అడ్డ'గా ఇది తయారైంది. ఈ ప్రమాదం నుండి కాపాడాలంటే 'ఆంధ్ర కమ్మరాజ్యం' 'రాయలసీమ రెడ్డిరాజ్యం'గా మారినట్టు దీన్ని 'వెలమ రాజ్యం'గా మార్చే 'విప్లవం' ముందుకొచ్చింది. చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ సిద్ధాంతం ఎట్లా తప్పో ఇక్కడే నిరూపించాలని ఈ ఇద్దరు నాయకుల్ని నీదగ్గరికొచ్చిన పెద్ద రావు, అడవిలోని అజ్ఞాతరావు అనుమతితోనే ముందుపెట్టారు. అంటే ఈ చిన్న రాష్ట్రంలో వెలమరాజ్యం రాబోతుందన్నమాట. నీ అండదండలతో నెహ్రూ చెప్పినట్లు ఈయన ఆంధ్ర పాలకుల దీవెనలతో ఎదిగి కుటుంబపార్టీని పెట్టాడు. 2001లో అప్పులతో పార్టీ ప్రారంభించి "కలెక్షన్ క్యాపిటల్ అక్యుములేషన్'' ఒక కొత్త సిద్ధాంతాన్ని అమెరికా నుంచే దిగుమతి చేశారు. ఈ అక్యుములేషన్ బనియా "బిజినెస్ క్యాపిటల్ అక్యుములేషన్'' పూర్తిగా విరుద్ధమైంది.

బనియా బిజినెస్ క్యాపిటల్ పిసినారితనం కలిగి ఉంటుంది. కాని కలెక్షన్ క్యాపిటల్ ఖర్చు చేస్తుంది, కొంత ఇన్‌వెస్ట్ చేస్తుంది. ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎన్నడు ఖర్చుపెట్టలేదు. కాని ఈయన కుటుంబ సభ్యుల నేతృత్వంలోని స్వాడ్‌లకు భయపడి బాగానే రాలారు. ఈ క్రమంలోనే వెలమ కలెక్షన్ క్యాపిటల్ కూడ కొన్ని కుటుంబాల్లో జమైంది. ఇప్పుడు వెలమలకు రెండు టి.వి. చానెల్స్ ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో 'తంతే వీరు హైదరాబాద్ పరుపులో' పడ్డారు. ఇటువంటి మీడియా పట్టు తెలంగాణ రెడ్డి క్యాపిటల్‌కు లేదు.

బి.సి., యస్.సి.లు ఈ క్యాపిటల్ ప్రచార సాధనాల ముందు నిలువలేదు. తెలంగాణ రెడ్లు రాయలసీమ రెడ్ల గుప్పిట్లో ఇరుక్కుపోయి బయటపడేలోపే పనంతా జరిగిపోయింది. ఇక్కడి వెలమలు అన్ని రంగాల్లో రెడ్లకు అందనంత ఎత్తు ఎదిగారు. తాతా నీది చిన్నకులమైనా అది జాతి అంతటా ఉంది కనుక నువ్వొక జాతీయవాదివయ్యావు. వీళ్ళది చిన్న ప్రాంతంలోని చిన్నకులం కనుక ప్రాంతీయ వాదమే వారికి 'శ్రీరామ రక్ష'. నీకు లేని మంచి లక్షణాలు కొన్ని వాళ్ళకున్నాయి. నీకు ఫార్‌మల్ పవర్ వద్దన్నావు. వాళ్ళకది సంపూర్ణంగా కావాలి.

నువ్వు సిద్ధాంత శత్రువువనుకున్న అంబేద్కర్‌ను డిస్‌ప్రూవ్ చేసి చిన్న రాష్ట్రాల్లో ఎంత చిన్నవైన అగ్రకులాలే అధికారంలోకి వస్తాయని చెప్పడానికి వాళ్ళు నీ దగ్గరికొచ్చారు. అన్ని రంగాల్లో అంబేద్కర్ సిద్ధాంతం చితికిపోవడమే నువ్వు కోరుకునేది కూడ. ఆ పని వాళ్ళు చెయ్యగలరు. ఐతే ఈ 'కలెక్షన్ క్యాపిటల్' చలనశక్తి ఎంతో మీ తరానికి అర్థంకాదు. ఇది ముందు బొంబాయిలో శివసేనతో ప్రారంభమైంది. ఇది చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. సెంటిమెంట్ ప్రాంతీయ వాదం దీని బలం.

దీని మజిల్ పవర్ ఇంగ్లీషు విద్యలేని బి.సి.ల నుండే ఎక్కువ వస్తుంది. ఇది ఎంత వేగంగా కలెక్ట్ అవుతుందో అంత వేగంగా ఖర్చు అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికి ఆర్.యస్.యస్. అండ, అడవి పోరాటం అండ రెండు ఉండడంతో ఇది ఇంకా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఈ ఊపులోనే ఇక్కడ అంబేద్కర్‌ను చంపడం దాని లక్ష్యం. ఈ హత్య నీ అహింస సిద్ధాంతంతో కూడ చెయ్యొచ్చు. అంబేద్కర్ చచ్చిన కులాల్ని లేపి విద్యతో అధికారుల్ని, మంత్రుల్ని చేశాడు. అది తెలంగాణ వెలమలకు రెడ్లకు అసలె గిట్టని సమస్య. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ స్కూళ్ళు మూస్తే అంబేద్కర్ ఆటోమ్యాటిక్‌గా చస్తాడు. ఆ పని 1969 నుండే ప్రారంభమైంది. గత రెండు ఏండ్లలో తారాస్థాయికి చేరుకుంది.

తెలంగాణ రాగానే తెలుగుతల్లి సహాయంతో వెలమ పాలకులు ఇంగ్లీషు విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఆపేస్తారు. అది నీకు ఇష్టమే. గత పదేండ్లలో 'కమ్మ క్యాపిటల్' పాలనలో కాస్త కదిలాడిన తెలంగాణ బి.సి.లు, మాదిగలు ఇప్పటికే మంటగలిసే రోజొచ్చింది. ఇక్కడున్న వెలమ-రెడ్లు కొన్ని చిన్న కులాల నుంచి వచ్చిన మేధావులు తమ వెంట ఉంచుకోవచ్చు. కాని సామాజిక తెలంగాణ బి.సి., మాదిగ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యతలోనైన సందుపట్టే చాన్స్‌పోయింది.

ఇప్పుడు తెలంగాణ వస్తే వెలమ క్యాపిటల్‌కు-రెడ్డి క్యాపిటల్‌కు మధ్యనే అధికారం తిరుగుతుంది. సమైక్యాంధ్రలో అది రెడ్డి, కమ్మ క్యాపిటల్ మధ్య తిరిగేది. వెలమలు సమైక్యాంధ్రను ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న 'కలెక్షన్ క్యాపిటల్' బిజినెస్ క్యాపిటల్ అడవి అండతో కూడ పరిపాలించలేరు. కమ్మ క్యాపిటల్‌తో తట్టుకోలేని సమైక్యాంధ్ర రెడ్లు వైఎస్ఆర్ హయాంలో 'అగ్రెసివ్ స్టేట్ ప్లండర్' రూపంలో నిలదొక్కుకోవడమే కాక కమ్మ క్యాపిటల్‌నే ఉక్కిరిబిక్కిరి చేశారు.

తాతా, గ్లోబలైజ్‌డ్ పెట్టుబడితో ఆర్గనైజ్‌డ్ అగ్రెసివ్ పెట్టుబడి సమీకరణ నీకాలంనాటి బనియా వ్యాపారంలా చిన్న మొత్తాలను దండి కొట్టే వ్యాపారంతో సంపాదించదు. అది రోజువారీగా దండుకుంటుంది. మొదట్లో కొంత అభివృద్ధి లక్షణమున్న కమ్మ క్యాపిటల్, అది అధికారంలో ఉన్న ఆఖరి దశలో చాలా గర్విష్టిగా తయారై ఒక పక్క మొత్తం వ్యవసాయ రంగాన్ని, మరో పక్క తెలంగాణ వెలమ రెడ్లని, కాలికింద బంతిలా తొక్కింది. ఆ అణచివేత నుండి ఈ అగ్రెసివ్ వెలమ 'కలెక్షన్' క్యాపిటల్ పుట్టింది. ఇది త్వరలోనే నిలదొక్కుకున్నది. పెరిగి పెద్దదయింది.

దీనికి వెనుకబడిన, ప్రాంతాల స్వయం పాలన సిద్ధాంతాన్ని తుపాకిలా పట్టుకున్న 'అన్న'ల అండ దొరికింది. వాళ్ళు ఓటు బైకాట్ అని బయటికి చెప్పినా, అది కనుసైగతో కొత్త పార్టీ బాక్సుల్లో పడ్డది. ఇలా పుట్టిన పార్టీలు ఆత్మగౌరవం నినాదంతో గులాబీ జెండా కింద సకల వెలమల్ని సమీకరించింది. 1969లో పోరాటం ఆంధ్రా తెలంగాణ భూస్వామ్య శక్తుల మధ్య జరిగి చివరికి ఆంధ్ర రెడ్డి భూస్వామ్య శక్తులు చెన్నారెడ్డితో పరిపాలించబడడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు పోరు పెట్టుబడి రంగానికి మారింది. నక్సలిజానికి ఉత్తర తెలంగాణ వెలమ పెట్టుబడిదారులకు ఉన్న కుల పునాదుల్ని కమ్మ పెట్టుబడి అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫేలయింది.

నీ దగ్గరకొచ్చిన మూడో టోపి పౌరహక్కుల పాయది. అది మధ్యవర్తిత్వ పని చేస్తున్నది. పౌరహక్కుల ఉద్యమంలో బాగా కష్టపడి కాలం గడిచిన ఒక మిత్రుడు చెప్పినట్లు ఆ ఉద్యమంలో కొంతమంది ఆస్తుల్ని కాపాడుకోవడానికి పనిచేశారు. ఇప్పుడు అటువంటి కొన్ని శక్తులు ఆస్తులు కాపాడుకోవడం దశ దాటిపోయి, ఆస్తుల్ని పెంచుకొని కొత్త అవతారమెత్తడానికి ఇదొక అదును. ఈ టోపీ, మార్క్స్‌కూ, మావోకు టోపీ పెట్టి నీ దగ్గరకొచ్చింది. ఆస్తుల పెంపకంలో ఈ కోవవారు ప్రస్తుతం కాషాయ టోపీ, 'కద్దర్' టోపీ ఏదైన పెట్టడానికి సిద్ధం. ఐతే దాని ప్రధాన పని వెలమ-రెడ్ల మధ్య మధ్యవర్తిత్వం. ముందేమైతదో చెప్పలేం.

ఈ ఉద్యమంలో దళిత నేతృత్వ పాయకూడ ఒకటున్నది. దానికి కిందా పైనా వెలమలే ఉన్నారు. ఈ పాయ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నీ వేషంలో చెబుతుంది. గదెట్ల సాధ్యం. గణపతికి కల్లుతాపాలని చూస్తే తాగుతాడా? ఆయన తనవాళ్ళు నుండొచ్చే విస్కే తాగుతాడు. అందుకే సకల సమ్మెలో దళిత-బహుజనుల ఏకైక పెట్టుబడైన చదువు బందు పెట్టిండ్రుగాని విస్కీతాగుడు బందు పెట్టలే. ఈ కొత్త పెట్టుబడికి దేన్ని ఎప్పుడు, ఎట్లా బందు పెట్టాలో తొందర్లోనే అర్థమైంది. అది ఎంత ఆడిన, పాడిన అధికారం దాని చేతికి రాదు. అది కలవారి కాలువల్లో నీళ్ళు మాత్రమే పోయగలదు. ఆ నీళ్ళన్నీ ఈ ప్రాంతపు దొరవారి నదిలోనే పడుతాయి.

తాతా నీకు అనుభవమున్నది. నీ జాతీయ పోరాటంలో ఒక్క అంబేద్కర్ మాత్రమే నీ కాలువలకు నీళ్ళురాకుండా తన పెరట్లో తన చెట్లో పెట్టుకొని నీళ్ళుపోసుకున్నాడు. జిన్నా నీ కాలువకే గండికొట్టి తనదో చెరువు కట్టుకున్నాడు. ఇక మిగతా కాలువల్లోని నీళ్ళు నీ నదిలోనే పడ్డాయి. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏదో ఒక కాలువలో నీళ్ళుపోసి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజల నాలుకలెండ కొట్టినోల్లే. వాళ్ళనుండి పూర్తిగా లాభం పొందింది నువ్వే. వాళ్ళదప్పుడు ఎంత మంచి జాతీయవాదమో ఇప్పుడంత మంచి ప్రాంతీయ వాదం కూడా.

నిన్ను నేనడిగే అఖరి ప్రశ్నేమంటే, ఆంధ్ర కమ్మ-రెడ్డి క్యాపిటల్‌లో కొంత భాగం ఇంత తొందరగా వెలమల గంపలో పడ్డాక వచ్చే కొత్త రాష్ట్రంలో సామాజిక తెలంగాణో, బహుజన తెలంగాణో సాధ్యమేనా? ఇప్పటికీ వెలమల క్యాపిటల్‌కు ఉన్న తిరోగమన అగ్రెసివ్ హిందుత్వ లక్షణాలను మా కండ్ల ముందే చూస్తున్నాం. రాజ్‌ఘాట్‌లో వాళ్ళకు, నీకు కుదిరిన అగ్రిమెంట్ తెలంగాణలో అంబేద్కర్‌ను చంపడమే అయితే ఈ చిన్న రాష్ట్రాల కోసం జరిగే పోరాటంలో నీ అహింస పోరాటం ప్రకారమే దళిత-బహుజనులు తమను తామే చంపుకుంటున్నారు కదా! ఇది ఎంత కాలం జరగాలి? ఎంత మంది సచ్చేదాక జరగాలి? ఇక్కడ ప్రజలంత సచ్చి పాలకులు బతికుంటే చాలా? నువ్వు నడిపిన మొత్తం స్వాతంత్య్ర పోరాటంలో కూడ ఇంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారా?

క్యాపిటల్ ఆంధ్రదైనా, రాయలసీమదైనా, తెలంగాణదైనా ఇక్కడి పాలకకులాల మధ్యే తిరుగుతుంది. అధికారం మాకు కావాలనుకునే దళిత-బహుజన రాజకీయ నేతలైనా, ఉద్యమ నేతలైనా పెట్టుబడి ఏ కులాల్లో ఉంది, దాని బలమెంతో చూడకుండా చూస్తే సామాజిక న్యాయం దొరుకుతుందనుకుంటే గాంధీ టోపి వీరి నెత్తుల మీద కూడ పెడతారు. సిద్ధాంతాలకతీతంగా రాష్ట్రం సాధించుకోవాలి అని ఆర్.యస్.యస్.ని, అంబేద్కర్‌ని, మావోను ఒకే పడవెక్కిస్తే పడవ మునుగుద్ది కాని బతికి బయట పడేది నాలుగు పడగల హైందవ నాగరాజే.

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

Saturday, October 8, 2011

కుతంత్రాలు ఇక చాలు...By-బి. రామకృష్ణ Namasethe Telangana 09/10/2011

కుతంత్రాలు ఇక చాలు...
తెలంగాణ ఆరు దశాబ్దాలుగా సమానత్వ విలువల కోసం పోరాడుతున్న ది. ఆత్మగౌరవం కోసం, స్వయం నిర్ణయాధికారం కోసం కలెబడుతున్నది. తన సాంస్కృతిక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం పొర్లాడుతున్నది. తన యాసను, భాషను, వేళ్లను వెతుక్కుంటూ, వాటిని స్థిరీకరించుటకు పోరుతున్నది. స్థానిక సంస్కృతులను నిలబెట్టుకుంటూ అంతర్లీనంగా ప్రపంచీకరణను ఎదిరించే పోరాటానికి సాగుతున్నది తెలంగాణ. పాలకుల కుటిల నీతిని, బడా పెట్టుబడిదారుల క్రూరత్వాన్ని, వారి స్వలాభాల కోసం ప్రజలను ఎంతగా
హింసించగలరో నిరూపిస్తున్నది. త్యాగాలకు, శాంతియుత ప్రజాస్వామిక ఉద్యమాలకు పాఠాలు నేర్పుతున్నది తెలంగాణ.

గుణాత్మక ఉద్యమ లక్ష్యాలతో సకల జనుల ఆకాంక్షగా ముందుకెగసి పడుతున్నది తెలంగాణ. చరిత్ర గర్వించదగ్గ రీతిలో సమర శంఖం పూరిస్తూ సమ్మె సెగలను రాజేస్తూ రాష్ట్ర సాధన దిశగా సాగిపోతున్న ది తెలంగాణ.నాలుగు వారాలుగా సింగరేణి బొగ్గుగని కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారూ, వీరు అనకుండా సకల జనులు ప్రత్యేక రాష్ట్రం కోసం సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణే ఏకైక ధ్యేయంగా నిర్బంధాలను ధిక్కరిస్తూ ఉద్యమం లో ఊరేగుతున్నారు.
ఉద్యోగులు జీతభత్యాల కోసం కాకుండా రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమ సెగలను రాజేస్తూ కదులుతున్నారు. సకల ఇబ్బందులను భరిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కద న రంగంలో సకల జనులు పరుగుపూత్తుతున్నారు.

పది పదిహేనేళ్లుగా ఊరువాడా, సకల, సబ్బండ వర్గా లు రాష్ట్ర ఆకాంక్షను సభలు సమావేశాల్లో, ఊరేగింపుల్లో, ధర్నాల్లో, నిరాహారదీక్షా శిబిరాల్లో, ఆట పాటల్లో, వంటా వార్పుల్లో, రైలు రోకోలలో, బందుల్లో నేడు సకల జనుల సమ్మె రూపంలో వ్యక్తీకరిస్తున్న సందర్భంలో మనమున్నాం. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించకుండా ఇంకా చర్చలు అంటే మరో మోసానికి తెర తీయడమే! హైదరాబాద్‌లేని తెలంగాణను
సూచించడమనేది తెలంగాణ ప్రజలను వంచించడమే తప్ప మరొకటి కాదు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాత్రం నేడు విలువలు కరువైనాయని అంటున్నారు. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి గాంధేయవాదానికే ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అంటున్నాడు. గాంధేయ పద్ధతుల్లో ఈ ప్రాంత ప్రజలు పదిహేనేళ్లుగా ఉద్యమిస్తున్నా.. దాని గురించి
సానుకూలంగా పెదవి తెరవరు సరికదా అణచివేత, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. వీరా గాంధేయవాదం గురించి మాట్లాడేది? తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడిన పాలక పార్టీలు, కోస్తాంధ్ర వలస పెట్టుబడిదారులు, సోకాల్ట్ కోస్తాంధ్ర మేధావులది సంకుచిత బుద్ధి తప్ప మరొకటి కాదు. తెలంగాణ సంస్కృతిని ఎత్తిపట్టి, గౌరవించి తమలో మమే కం చేసుకోలేని సమైక్యవాదులు ఇక్కడి మట్టిమనుషుల వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పటిమను, ధీరత్వాన్ని కాదని సమైక్యరాగాన్ని ఆలపించడం వెనుక కుట్రలు దాగి ఉన్నాయి. పాలక వర్గ పార్టీల మాయోపాయా లు, దుర్నీతి, చెవులుండి వినిపించనట్టు, కళ్లుండి చూడలేకపోతున్నట్లు నటిస్తున్న కుట్రపూరిత మోసకారితనం ప్రస్ఫుటంగా వెల్లడవుతున్నది.


రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల (ఒక్క సీపీఎం తప్ప) అంగీకారం మేరకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. వెను విద్రోహాలు మొదలై ఆ ప్రకటన వెనక్కిపోయింది. కేంద్రం కూడా ఇచ్చిన మాటను అమలు చేయకుండా దొంగ నాటకానికి తెర తీసింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమోనని ఏడువందలకుపైగా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ బలిదానాలకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, తెలంగాణపై ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న పార్టీలదే బాధ్యత. సమై క్యం అనేవారు, అంతా ఒకటే అనేవారు, భాష, ఒకే తల్లి బిడ్డలం అనేవారు, మనమంతా సోదరులం అనేవారు, సాటి సోదరులు బలిదాలకు చలించరా?
తెలంగాణ ఇవ్వకుండా కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు కొత్త విద్రోహానికి సన్నాహాలు చేస్తుంటే, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించకుండా ఉంటున్నారంటే వారికి ఎంత అధికారదాహం ఉన్నదో అర్థమవుతుం ది. ప్రజాభివూపాయాన్ని గౌరవించే ప్రజాస్వామిక సంస్కృతి ఉంటే ఇంత తమ పదవులను అట్టిపెట్టుకునేవారు కానే కాదు. పైగా రాజీనామాలు చేసిన కొంద రు తామేదో త్యాగం చేసినట్టు,త్యాగధనులుగా కీర్తింపబడాలని తిరిగి తమనే ఎన్నుకోవాలనే ఒక నిర్బంధపూరిత వాతావరణాన్ని కోరుకుంటున్నా ను. ఇదేదో తమ జన్మహక్కుగా భావించే ఒక చౌకబారు మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు. దీన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. వీరి రాజీనామాలను ప్రజలు కోరుకున్నారు. రాజీనామాలు చేసి ప్రజాభివూపాయాన్ని గౌరవించడం బాధ్యతగా గుర్తించాలే తప్ప త్యాగంగా కానే కాదు. ఉద్యమంలో ప్రత్యక్ష
కార్యాచరణతో పాల్గొని తెలంగాణ సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే గౌరవానికి అర్హత వస్తుంది. అంతేకాని రాజీనామాల డ్రామాలు అడితే రాదనేది స్పష్టం అయిపోయింది.


రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్న క్రమంలో వాటిలోని న్యాయమైన ఆకాంక్షలకు మద్దతుగా ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, కార్మికులు, విద్యార్థులు ఉద్యమాల్లోకి వస్తుంటా రు. కాని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో దీనికి భిన్నంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి వర్గం అగ్రస్థానంలో ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలకు చురకలు అంటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరివూతలో
ఎప్పుడూ విద్యార్థులు, ఉద్యోగులే ప్రధాన భూమిక వహించడం ఇక్కడి చారివూతక ప్రత్యేకత.
దేశంలో అంతర్భాగంగా కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంపై ఎన్నెన్నో కుతంవూతా లు, కపట నాటకాలు, విద్యార్థులపై పోలీసుల లాఠీలు, ఒక్కొక్కరిపై 100పైగా అక్రమ కేసులు, బెదిరింపులు, జైళ్లు, తీవ్ర నిర్బంధాలు అణచివేతలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడం చూస్తుంటే, మౌలిక మార్పు కోసం జరిగే
ఉద్యమాలపై ఎంత దారుణమైన రాజ్యహింస ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రజాస్వామిక నిరసనలకు, శాంతియుత పోరాటాలకు విలువలేని దుర్మార్గపు పరిస్థితి దాపురించడం దేశ ప్రజలకు, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు నిరాశ కలిగించే విషయం.
-బి. రామకృష్ణ

అభివృద్ధి పేరుతో విధ్వంసం..By -వూకే రామకృష్ణ ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ Namasethe Telangana 09/10/2011

అభివృద్ధి పేరుతో విధ్వంసం...
వర్తమానంలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మనిషి ఉనికికే ప్రమా దం. పోలవరం ప్రాజెక్టు కూడా అలాంటి విధ్వంసంలో ఒక భాగం. ప్రకృతిని మనం రక్షించుకుంటే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. పాలక వర్గాలు ప్రజానీకానికి నీతులు చెప్పుతాయి . కానీ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. ప్రజలందరూ సమానమనీ భారత రాజ్యాంగంలోని 14వ అధికరణంలో పొందుపర్చుకున్నాం. నవీన విజ్ఞానంతో పాటుగా వ్యవసా యం, పశువుల అభివృద్ధి కోసం కృషిచేయాలని, ప్రకృతి సిద్ధమైన వాతా వర ణాన్ని, అడవులు, చెరువులు, నదులను రక్షించుకోవాలి. వన్య ప్రాణుల వైవి ధ్యాన్ని కాపాడటానికి పెంపొందించుకోవడానికి జీవజంతు జాలం పట్ల కనికరం ప్రేమ చూపాలి. ప్రజలు జీవించడానికి వారికి కావలసిన వసతులు పొందడానికి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలని ఆదేశిక సూత్రాల ద్వారా హామీలు ఇచ్చుకున్నాము. ఇవన్నీ చెప్పడానికి మాత్రమేనని ఇటీవలి పరి ణామాలు తెలియజేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు దీనికొక తాజా ఉదాహరణ. దీనితో ప్రాంతాల మధ్య వివక్ష మాత్రమే గాక, పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోంది. అయినా.. పాల కులు దీనినేమీ పట్టించుకోకుండా.. పక్షపాత ధోరణితో పోలవరా న్ని నిర్మించడానికి పూనుకున్నారు.


గోదావరి నదిపై పోలవరం దగ్గర ఐదు వందల టీఎంసీల భారీ నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును 17,340 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్నారు. 80 టీఎంసీల నీటిని కృష్ణా జిల్లాకూ, 181.53 టీఎంసీల నీటిని విశాఖ పట్టణం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకూ, కృష్ణాజిల్లాలోని570 గ్రామాలకు తాగు నీరుఅందించబోతున్నారు. అలాగే.. 960 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని కూడా చెప్పు కొస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఈ ప్రాజెక్టు కారణంగా తెలం గాణ ఖమ్మం జిల్లా లోని వరరామచంద్రాపురం, మండలంలోని 45 గ్రామా లు, కూనవరం మండలంలోని 48 గ్రామాలు, చింతూరు మండలంలోని 17 గ్రామాలు, కుక్కునూరు మండలంలోని 34 గ్రామాలు, భద్రాచలం మండలం లో 40 గ్రామాలు, బూర్గం పాడు మండలంలో 15 గ్రామాలు, తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నంలో 42 గ్రామాలు,ఒడిషా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలు కొన్ని ముంపునకు గురవుతున్నాయి. సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్ ) పరిశోధన ప్రకారం 276 గ్రామాలు మునిగిపోతున్నాయి. రెండు లక్షల ముప్ఫై వేలమంది నిర్వాసితులవుతున్నా రని నిపుణులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక అధ్యయ నాలు కూడా 94, 357 ఎకరాల భూమి, 650 చదరపు కిలోమీటర్ల షెడ్యూ ల్డు ప్రాంతం, ఇందులో 7, 964 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ నాశనం అవుతుం దని, ముంపుకు గురిఅవుతుందని తెలుపుతున్నాయి. అంతేగాక.. ఈ ముంపు ప్రాంతాలలో నివసిస్తున్న జనాభాలో మొత్తం అదివాసీలే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు మూలంగా ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, వారి ఉనికి, అడవులు, జంతుజాలం మొత్తం నాశనమయ్యే పరిస్థితి వచ్చింది. వారి పునరావాసం గానీ, ఇతర జీవన సమస్యలు కానీ ఈ పాలక వర్గాల కు పట్టదు.

‘పోలవరం ప్రాజెక్ట్ వద్దే వద్దు’ అనే ప్రధాన డిమాండ్‌తో ఆదివాసీ విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆదివాసీ దళిత తది తర ప్రజాసంఘాలన్నీ పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ముంపు ప్రాంతా లలో పాదయాత్రలు చేశాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిషా, రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షా లు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కుంట ఎమ్మెల్యే కొవ్వాసి లకా్ష్మ నేతృత్వంలో భారీ ర్యాలీలు , బహిరంగ సభలు జరిగాయి. వేల మంది ఆదివాసీలను సమీకరించగలిగారు.
పోలవరం కారణంగా ముంపునకు గురి అయ్యే ప్రాంతం అంతా పైరు పచ్చలతో అలరారు తుంటుంది.పత్తి, పెసరు, నువ్వు, మొక్కజొన్న, మిరప, చేన్లతో ఈ ప్రాంతమంతా స్థానిక గిరిజనులకు జీవనాధారంగా ఉంటోంది. అనేక రకాల మొక్కలు, ఔషధ మొక్కలతో అటవీ ప్రాంతమంతా ఎన్నటికీ తరగని గనిగా ఉంటోంది. అలాంటి సహజసిద్ధ వనరులను, వన సంపదను, పంట భూములను పోలవం ప్రాజెక్టు మింగేస్తోంది. అంతేగాక అనేక గ్రామా లు ముంపునకు గురై గిరిజనులు నిర్వాసితులు అవుతున్నారు. ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టుకు ఎగువ ఉన్న తెలంగాణ జిల్లాలకు ఇవ్వాల్సిన 680 టీఎంసీల నీటి నుంచి 500 టీఎంసీల నీటిని ఆంధ్రాకు తరలించి జలదోపిడీకి పాల్పడుతున్నారు. మరోవైపు ఇచ్చంపల్లి ప్రాజెక్టును ఆంధ్రా పాలకులు మరిచే పోయారు. పీవీ నరసింహారావు కుంతనపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారు. దుమ్ము గూడెం ప్రాజెక్టు గురించి కాంట్రాక్టర్ల జేబు లు నింపే పనులే చేశారు.మొబిలైజేషన్ ఫండ్ పేరుతో.. 450 కోట్లు కాంట్రా క్టర్లకు ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల రెండో దశ నిర్మాణ పనులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇలా తెలంగాణలోని 13 ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం 3,450 కోట్లు అవసరం కాగా, ఇప్ప టికీ 2, 850 కోట్లు కూడా ఖర్చుచేయలేదు.
అభివృద్ధి అంటే ప్రకృతి వనరులు, వృక్ష సంపద , జంతుసంపదను నాశ నం చేయడం కాదనీ , అలాగే ఒక వర్గం ప్రజల ఆదాయ అవకాశాలను మెరు గుపర్చడం కోసం ఇతర ప్రాంత ప్రజలను బలిపెట్టడం కాదనీ డ్యాం నిర్మా ణంపై పరిశీలన కోసం ఏర్పాటైన అంతర్జాతీయ ప్రాజెక్టుల కమిషన్ తేల్చి చెప్పింది. ప్రపంచంలో 3600 పెద్ద డ్యాంలు ఉంటే, అందులో 40 శాతం డ్యాంలు భారతదేశంలోనే ఉన్నాయి. 1990 వరకు నిర్మించిన వివిధ ప్రాజె క్టు కింద రెండు కోట్ల 13 లక్షల మంది నిర్వాసితులయ్యారు. అపారమైన జలవనరులనూ ఒక చోట నిల్వచేయటం వల్ల భూమిపై ఒత్తిడి పెరిగి భూకం పాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ భారీ ప్రాజె క్టుల కమిషన్ తేల్చి చెప్పింది.అయినా మన పాలకులకు ఇవేవీ చెవికి ఎక్కడం లేదు. భారీ ప్రాజెక్టు వల్ల పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలుగుతుందని ప్రపంచ బ్యాంకు నియమించిన మోర్సు కమిటీ తేల్చి చెప్పింది. అలాగే భారీ ప్రాజెక్టులు వల్ల కలిగే ప్రయో జనం కేవలం పదిశాతం ప్రజలకు ఉపయోగ పడు తుందని చెప్పింది. ఇటీవలి కాలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కొరకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల కాంట్రాక్టు కోసం రెండు మూడుసార్లు టెండర్లు పిలిచారు.

సీమాంధ్రకు చెందిన వారే కాంట్రాక్టు పొందారు. అంటే పోలవరం ప్రాజెక్టు ఆర్థికంగానూ, భౌతికం గానూ, వ్యవసాయ పరంగా, మంచినీరు, పారిశ్రామికంగా అన్ని రకాలుగా సీమాం ధ్రకు ఉపయోగపడుతుంది. తెలంగాణకు ఏ మాత్రం ఉపయో గపడటం లేదు. పైగా తెలంగాణ ప్రాంత భూములు మునిగి పోతున్నాయి. ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జంతువుల మీద చూపిన ఔదార్యం సామా న్య ప్రజలమీద చూపడంలేదు.

ఛత్తీస్‌గఢ్ జల్సాయిగిరి జిల్లాలో గూడ్సు రైలు ఢీకొని ఏడు ఏనుగులు చనిపోతే పర్యావరణ శాఖ చలించిపోయి ఏనుగుల రక్షణ గురించి రైలు మార్గం వెంబడి 168 కిలోమీటర్ల పరిధిలో ముళ్ళకంచే నిర్మాణానికి, వాచ్‌టవర్ల నిర్మాణానికి ఏడు కోట్ల రూపాయాల ప్యాకేజీ ప్రకటించింది. కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్టు వల్ల 276 గ్రామాలు.. రెండు లక్షల ముఫె్పై వేల మంది ప్రజలు నిర్వాసితులు అవుతుంటే ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. 650 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ప్రాంత విస్తీర్ణంలో 94. 357 ఎకరాల భూమి, 7,964 ఎకరాల రిజర్వు భూములు, అడవులు ముంపునకు గురి అవుతున్నాయి. పర్యావరణ వేత్తలు, మేధావులు, ఆదివాసీ సంఘాలు, వివిధ అధ్యయనాలు పోలవరం ప్రాజెక్టును కట్టవద్దని కోరుతున్నా యి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో పాటుగా అదే ఉద్యమ స్ఫూర్తితో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలని పోరాటం చేయాలి. 
-వూకే రామకృష్ణ
ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్, ఖమ్మం జిల్లా