Monday, October 10, 2011

ఈ కులాలు తెలుసా ? By Vakulabharanam Krishna Mohan Rao Surya News Paper 11/10/2011


ఈ కులాలు తెలుసా ?
అరవైనాలుగేళ్ళ స్వాతంత్య్రానంతరం కూడా మన ప్రజాస్వామ్య దేశంలో అసమానతలను, వివక్షను, అణిచివేతను మట్టు పెట్టలేకపోయాం. పలు మానవ సమూహాలను మన సమాజంలోని నాగరిక జీవన వ్యవస్థలోకి ఇంకా తీసుకు రాలేకపోయాం. దేశంలో అవినీతిపై ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ప్రాంతాల వెనుకబాటుతనంతో అన్యాయాలకు గురైన ప్రాంతాలలో ‘ప్రత్యేక రాష్ర్ట విభజన వాదా లు’ పెల్లుబుకుతున్నా యి. చిన్న కులాల ప్రజలు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురి కావడంతో అత్యంత పేదలుగా దారిద్య్రరేఖకు దిగువన చేరిపోయారు. కులాల మధ్య అంతరాలు పెరిగాయి. కులం పునాదుల మీద రాజకీయ వ్యవస్థ రాజ్యమేలుతున్నది. జన బాహుళ్యంలేని కులాలు డబ్బు, రాజకీయాధికారాన్ని చేజిక్కించుకుని తర తరాలుగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి.

ఇలాంటప్పుడు సమ సమాజం ఎలా ఏర్పడుతుంది? సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు- ఎలా సాధ్యపడుతుంది? జనాధిక్యత కలిగిన బలహీన వర్గాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందకుండా దేశం సంపన్న అగ్రరాజ్యం ఎలా అవుతుంది? మహాత్మా జ్యోతిబా ఫూలే, డా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ కన్న కలలు ఎలా సాకారం అవుతాయి?ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని మన రాష్ర్టంలోని పలు బీసీ కులాల వాస్తవ జీవన స్థితి గతులను సమాజం ముందుంచి చర్చనీయాంశం చేసి ఈ వర్గాల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు గైకొనవలసి ఉన్నది.

రాష్ర్టంలో బీసీ కులాలలో- బాలసంతు, బహురూపి, బందర, బుడబుక్కల, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాపటిపాపల, కొర్చ, మొండివారు, మొండిబండ, బండ, పిచ్చకుంట్ల, వంశరాజ్‌, పాముల, పార్థి, నీర్‌షికారి, పంబాల, దమ్మలి, పెద్దమ్మలవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలవాండ్లు, వీరముష్టి, నెత్తికోటల, వీరభద్రీయ, గుడల, కంజరబట్ట, రెడ్డిక, మొండిబట్ట, నొక్కర్‌, పరికిముగ్గుల, యాత, చొపమెరి, కైకాడి, మందుల, మేథర్‌, కూనపులి, పొందర, పట్రా, కురాకుల, పొందర, సిక్లిగర్‌, పూసల, కెవ్వుట్లు, గుడియా, జక్కల వంటి మరెన్నో కులాలు. అసలు ఎప్పుడైనా ఈ కులాల పేర్లు విన్నారా? ఇవి బీసీ కులాలని, వీరు మన రాష్ర్టంలోనే ఉన్నారని ఎందరికి తెలుసు? ఈ మానవ సమూహాలు మన నాగరిక వ్యవస్థలోనే ఉన్నాయా? అనే అనుమానం కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
అనంతరామన్‌ అధ్వర్యంలో మొట్ట మొదటి బీసీ కమిషన్‌ 1970లో ఈ కులాలను సంచార, విముక్తి జాతులుగా గుర్తించి బీసీ కులాల జాబితాలోని ఎ గ్రూపులో చేర్చింది. వీరి అభి వృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి జన జీవన స్రవంతిలో తగిన గుర్తింపు తేవాలని సూచించింది. అ యితే 64 ఏళ్ళ స్వతంత్ర భారతంలో వీరి గురించి పరిశీలించడం మొదలుపెడితే, ఇవి జాడ తెలియని కులాలుగా నేటికీ సంచార జాతులుగానే మిగిలిపోవడం హృదయ విదారకరమైన అక్షరసత్యం.

బాల సంతు, బహురూపి కులస్థులు గ్రామీణ ప్రాంతాలలో బహురూప కళల ద్వారా ప్రజలకు వినోదాన్ని కలిగిస్తూ, భిక్షాటనే ఆధారంగా జీవించేవారు. కావడికి జోలె వేసుకొని గంట ఊపుతూ సూర్యోదయానికి ముందే గ్రామ ప్రజల్ని నిద్రలేపేవారు. ఆ పద్ధతిలో గంటను ఊపడం వీరి ప్రత్యేకత. స్థిర నివాసం లేకుండా సంచార జీవితం గడుపుతూ బతుకులీడ్చేవారు. కాల క్రమంలో వీరి వృత్తి కనుమరుగైపోయింది. వీరు నేడు ఏ విధంగా బతుకుతున్నారో తెలియదు. వీరు ప్రధానంగా తెలంగాణ జిల్లాలకే పరిమితమై ఉండేవారు.
దొమ్మర కులస్థుల దొమ్మరి విద్యలు, ఒలింపిక్స్‌ ఆటలతో పోటీపడతాయి. వీరు పందుల పెంపకం చేపట్టేవారు. కాలక్రమంలో జీవనాధారం లేక పలువురు పడుపు వృత్తిని ఎంచుకోవాల్సి వచ్చింది. చట్టం దృష్టిలో నేర ప్రవృత్తి అయిన వీరి వ్యాపకం దినదినగండం అవడంతో ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో తెలియదు. గంగిరెడ్లవారి గురించి అందరికీ తెలుసు - కాని నేడు వారి జీవితాల గురించి ఎవరికీ తెలియదు. జంగం, జోగి కులాలు భక్తి ఉద్యమాల కాలంలో ఏర్పడ్డాయి. శైవమత ప్రచారం కోసం జీవితాలను అంకితంచేసి విస్తృతంగా పర్యటించారు.

కాల క్రమములో భిక్షగాళ్ళుగా మారిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా కడప జిల్లాలో భిక్షాటన చేస్తూ, సంచార జీవులుగా బతికిన ‘బందర’ కులస్థులకు దొంగలుగా ముద్రవేశారు. దాంతో వారు సమాజంలో కలసి పోలేక పోయారు. బుడబుక్కల కులస్థు లు సంచార జీవితంలో యాచక వృత్తే ప్రధానాధారంగా జీవిం చారు. కాటిపాపల వాళ్ళు కూడా శవదహన క్రియలు చేపట్టే వృత్తి నుండి దూరం అయ్యారు. సమాజంలో ప్రస్తుతం వీరి జాడ కనిపించడం లేదు. పూసల వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో సామాన్యులకు అందుబాటులో ఉండే చవకధరల దువ్వెనలు, కొప్పుపిన్నులు, అద్దాలు మొదలైనవి అమ్మి జీవించేవారు. జక్కుల వాళ్ళు సర్కారు జిల్లాలకు పరిమితమైన జక్కలవారు. జనాధిక్యత లేని సామాజిక వర్గం ఇది. వీరి పూర్వీకులు భాగవతం తదితర ఇతిహాసాలపై కథలు చెపుతూ బ్రతికేవారు. క్రమంలో జనాదరణ తగ్గడంతో బతుకుదెరువు కోసం పడుపు వృత్తిలోకి దిగి జీవితాలను బలిపెట్టుకున్నారు.

ప్రపంచీకరణలో ఇలా ఎన్నో కులాలు నిర్వీర్యమయ్యాయి. వృత్తి కులాలు, శ్రామిక కులాలు అవకాశాలు లేక చేయూతనిచ్చేవారు కరువై, నిర్వీర్యమై అభివృద్ధి సాధించలేక ప్రత్యామ్నాయ జీవనోపాధి దొరకక పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయారు. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో దారిద్య్ర రేఖకు దిగువన జీవించే ప్రజలుగానే వీరు కొనసాగుతున్నారు. ఒకనాటి వృత్తులు, వృత్తి ధర్మాలు నేడు అక్కరకు రాకుండా పోయాయి. అయినా మనుషులు బతకాలి కదా! పారిశ్రామికీకరణతో నూతన వ్యాపార ఉత్పత్తులతో కోట్లాది మంది జీవనాధారం కోల్పోయారు.పారిశ్రామికీకరణతో అభివృద్ధి సూచిలను ఘనంగా ప్రకటించుకుంటున్నారు. కాని వాటివల్ల కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిన సూచికలు ప్రకటించరెందుకు? ఎవరు, ఏఏ వృత్తులు కోల్పోయారో ఎలా బ్రతుకున్నారో తెలియకుండా వారి అభివృద్ధికి ప్రణాళిక వేయడం ఎలా సాధ్యం? అందువలన ఈ పేదకులాల జీవన స్థితుగతుల గురించి, వారిని అభివృద్ధి పథంలోకి, ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రత్యేక కృషి ఎలా చేయాలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాలు తమ పరిశోధనలను ఈ రంగాలకు విస్తరించకపోతే అవి ఎందుకు, ఎవరి కోసం ఉన్నట్టు? పరిశోధనల పేరిట ఏం చేస్తున్నట్టు? సామాజిక, ఆర్థిక, చరిత్ర, మానవ పరివర్తన శాస్త్ర విభాగాల ద్వారా విస్తృతంగా అధ్యయనాలు నెరపి, విశ్వవిద్యాలయాలు పరిష్కార ాలు సూచించాల్సి ఉంది.

sithaaram
అన్నింటికన్నా మించి జాతీయ ప్రణాళికా సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్య మూలాల్లోకి వెళ్లి, అధ్యయనాలు చేయించి, ఆ దిశగా నిధులు కేటాయించి, చర్యలు చేపట్టాలి. అలాగే ఆయా కుల సంఘాల నాయకత్వం ఎదిగి, తమ కులస్థుల జీవితాలు ఎలా బాగుపడుతాయో క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారాలకై ప్రభుత్వాలకు నివేదించాల్సి ఉంది.42 ఏళ్ళుగా రాష్ర్టంలో విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, ఈ కులాలు మరీ వెనుకబడి, జాడ తెలియకుండా కనుమరుగవడం, ఉనికిని కోల్పోయే పరిస్థితులు నెలకొనడం దిగ్భ్రాంతికరం. ఆధునిక సమాజం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా దూసుకువెళుతున్న ప్రస్తుత తరుణంలో మరింత బాధ్యతాయుతంగా వీరి అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉంది.


రచయిత కేంద్ర సామాజిక, న్యాయ పరిశోధన సలహా సంఘం సభ్యుడు

No comments:

Post a Comment