ప్రజాస్వామ్యమే పరిశోధన
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సందర్భంలో ఇటీవల నల్గొండ జిల్లాలో జనం తో కలిసి తిరిగాను. ఉద్యమాలు ఏదో ఒక నేపథ్యంలో సామాజిక కోణం నుంచి పుట్టుకొస్తూనే ఉంటాయి. సమస్యలకు పరిష్కారాలు ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతాయని చరిత్ర చెబుతున్నది. అయితే తమ సమస్యల పరిష్కారానికి గళం విప్పడం ప్రజలకు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇచ్చిన హక్కు. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ పాలకులకూ లేదు. నల్గొండ జిల్లాలో ఇటీవ ల కొన్ని సంఘటనలలో పోలీసుల అఘాయిత్యాలు కళ్లారా చూశాను. ప్రజల నిస్సహాయత కూడా చూశా ను. ప్రజల కోపాగ్ని కట్టలు తెగడమూ చూశాను. నల్గొండ నుంచి రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాను. నిత్య జీవిత కార్యక్షికమంగా మారిన వాకింగ్‌కు ఉద యం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లాను. ఆ ఆవరణంతా కలియ తిరిగాను. విశ్వవిద్యాలయాలకు, ఈ ప్రజా ఉద్యమాలకు ఏమైనా సంబంధం ఉంటుందా? అని నాలో ఆలోచనలు మొదలయ్యాయి.
ప్రజా కార్యక్షికమాల లో పౌరులు భాగస్వాములు కావడం ప్రజాస్వామ్యంలో ఒక ప్రధానమైన భాగం. ఆ పనిలోంచి ప్రజలను వేరు చేసి చూడలేం. ప్రపంచంలోని అన్ని యూనివర్సిటీలు ప్రజలకు పాలకులకు మధ్యన ఏర్పడే అగాథాన్ని పూరించేందుకు పెనుగులాడుతున్నాయి. పరిశోధన అనగానే విశ్వవిద్యాలయాల గోడల వరకే, మేధావి వర్గం వరకే పరిమితం చేస్తారు. విశ్వవిద్యాలయాలు ఎంతో గొప్ప పరిశోధన చేస్తా యి. అంతటితో పరిమితం కాకుండా ప్రజాస్వామిక పాలనకు, జ్ఞాన సముపార్జనకు ఏర్పడ్డ అగాథాన్ని పూరించగలుగుతాయి. అంత శక్తిసామర్థ్యాలు విశ్వవిద్యాలయాలకున్నాయి. దాన్నే ‘యాక్షన్ రీసెర్చ్’ అంటారు. నేడు రీసెర్చ్ సమాజ ప్రగతి కోసం ఎంత ప్రధానమో? మానవ సంపద పెంచేందుకు ఎంత అవసరమో? ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కూడా ఈ పరిశోధన అంతే అత్యవసరమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కూడా పరిశోధనలో ఒక భాగమైంది.
‘రీసెర్చ్ ఫర్ డెమోక్షికసీ’, ‘డెమోక్షికసీ ఫర్ రీసెర్చ్’. ప్రజలను పాలనా యంత్రాంగంలో భాగస్వామ్యం చేయడమంటే పాలనకు సంబంధించిన చర్చలలో భాగం చేయడమే. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం చేయడమే. సమస్యలు పరిష్కరించడంలో భాగం చేయడమే. దీనితో పాలనా యంత్రాంగంలో ఉండే అధికారాలకు, సామాజిక కార్యకర్తలకు మధ్యనున్నటువంటి లోపాన్ని పూరించే అవకాశం ఉంటుంది. దీనివల్ల సామూహికమైన జ్ఞానం పెరిగే అవకాశం, ప్రభుత్వం పౌరుల సమస్యల ను అవగాహన చేసుకోవడానికి, ప్రజలు పాలనలో ఇబ్బందుల ను చూసేందుకు దానికి అవకాశం లభిస్తుంది. దీనిలో మూడంశాలు ఇమిడి ఉంటాయి.
1) చర్చించే వేదిక 2) నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం 3) సమస్యను పరిష్కరించే ఆచరణాత్మక ప్రజాస్వామ్యం.
చర్చించే వేదిక అంటే సెక్ర చర్చలు మాత్రమే కాదు. అసెంబ్లీలో చర్చలు మాత్రమే కాదు. ప్రజలకు సంబంధించిన అంశాలపై గ్రామస్థాయి నుంచి చర్చలు జరగాలి. కొన్నిసార్లు వ్యక్తులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు చిన్నచిన్న గ్రూపులతో చర్చలు జరుగుతాయి. కొన్నిసార్లు పంచాయితీ సభ్యులతో జరుగుతాయి. అంటే చర్చలను కిందిస్థాయి వరకు తీసుకుపోవాలి. సమస్యల పరిష్కారం మేధావి వర్గం, లేదా పాలనాపరమైన సొత్తు అనుకోకూడదు. కిందిస్థాయి గ్రామాల్లో ఉన్న సామాజిక కార్యకర్తలు కూడా చర్చలో భాగస్వాములు అయితే సమస్య పరిశోధనలో ఎక్కువ మంది భాగం అవుతారు. పరిష్కారాలు మేధావి వర్గం మెదళ్ల నుంచే వస్తాయని అనుకోవద్దు. అధికార పీఠాల నుంచే రాల్తాయని అస్సలు అనుకోకూడదు. నల్గొండలో జనంలో తిరుగుతుంటే సామాన్యమైన మనిషి ఎదుర్కొంటున్న సమస్యపైన, తెలంగాణలో రగులుతున్న ఉద్యమంపైన ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారో కళ్లారా చూశాను. చర్చలు చేయడమే పరిశోధనకు మొదటి ప్రాతిపదిక.
అవి ఎంత విశాలంగా ఉంటే మనకంత విస్తృత సమాచారం లభిస్తుంది. వివిధ స్థాయిలలో ప్రతిరోజు ప్రజా సమస్యలపైన, రచ్చబండపైన చర్చలు జరుగుతాయి. ఆ చర్చలే రాష్ట్ర విధానాలకు కూడా ప్రాతిపదికలవుతాయి. రచ్చబండ కిందిస్థాయి చర్చలు కావు. అదొక పరిశోధన వేదిక. పరిశోధన ఎంత విశాలంగా ఉంటే ఫలితాలు కూడా అంత విస్తృతంగా ఉండే అవకాశాలుంటాయి.
నిర్ణయాలు చేసే ప్రజాస్వామ్యం: సమాజంలోని వివిధ వర్గాలకు వివిధ ఆశయాలు విభిన్నంగా ఉంటాయి. విభిన్నమైన నిర్ణయాలు కూడా ఒక్కొక్కసారి మొలకెత్తుతాయి. విభిన్న నిర్ణయాలలో ఏకత్వం, ఏకాభివూపాయం తేవడమే పరిశోధన లక్ష్యం కావాలి.
సమస్య పరిష్కారంలో సంబంధిత వ్యక్తులను కలిపితేనే కిందిస్థాయి బాధలు, కష్టాలు అర్థమవుతాయి. నిరంకుశ ప్రభుత్వాలలో నిర్ణయాలు పైనుంచి రుద్దబడతాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో కింది నుంచి మొలకెత్తుతాయి. అవే ప్రజలను ప్రభుత్వం లో భాగస్వాములను చేస్తాయి. ప్రజాభివూపాయాన్ని, ఆచరణాత్మక ప్రజాస్వామ్యాన్ని చెప్పడానికి పాలకులు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వాటిని గౌరవించే అలవాటు చేసుకోవాలి. అదే మాదిరిగా ఆ డేటాను సామరస్యంగా సేకరించడం, సహృదయంతో స్వీకరించడం ప్రజాస్వామ్యానికి కావల్సిన మొదటి లక్షణం.
విశ్వవిద్యాలయాల్లో ఉన్న రీసెర్చ్‌ను ప్రజాజీవితంలోకి తీసుకరావాలి. బ్రిటన్‌లో జరిగిన చిన్న సంఘటనను పార్లమెంటు వరకే పరిమితం చేయలేదు.
దానిపై కిందిస్థా యి నుంచి చర్చలకు అవకాశం కల్పించారు. అదే మాదిరిగా మనం డెమోక్షికసీ తెచ్చుకు న్నాం. కానీ డెమోక్షికటిక్ అటిట్యూడ్ తెచ్చుకోలేదు. ప్రజలను పాలితులుగా చూస్తున్నాం కానీ భాగస్వాములుగా చూడడం లేదు. ప్రజాస్వామ్య ముసుగులో ఫ్యూడల్ రాజకీయాలు నడుపుతున్నారు. పరిశోధనలో చిన్న పెద్దా అనేది ఉండదు. అందరూ సమానమే. నల్గొండలో పోలీసు దాడులకు గురైన ప్రాంతాలలో తిరుగుతుంటే ప్రతి ఊరు నాకొక పరిశోధనశాలగా కనిపించింది. అది నకెరేకల్ కావచ్చును, కోదాడ, సూర్యాపేట కావచ్చును. చౌటుప్పల్, చిట్యాలలు కావచ్చును. సమస్త తెలంగాణ జనం ఏకాక్షిగతతో చర్చిస్తున్నారు. బాధ్యతాయుతంగా ప్రజ లు ఆలోచిస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణనలోకి తీసుకోవాలి. అలా చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచి ఫలితాలొస్తాయి.
మనకు ఒకరినొకరు విశ్వసించే అలవాటు కూడా ముఖ్యం. ఒకరిపై ఒకరికి విశ్వాసం లోపించకూడదు. ఆ ప్రజలకు సంబంధించిన సమస్యల సమాచారాన్ని విశ్లేషించే లక్షణముండాలి. ఆ సమాచారాన్ని ఆధారం చేసుకునే నిర్ణయాలు జరుగుతుండాలి. అప్పుడే సమస్య పరిష్కారంలో ప్రజలు భాగస్వాములవుతారు. అందుకే పరిశోధన అన్నది ప్రజాస్వామ్యం. అసలు ప్రజాస్వామ్యమే పరిశోధన.
-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు
No comments:
Post a Comment