Monday, October 10, 2011

గాంధీతాతా నువ్వే చెప్పు! - కంచ ఐలయ్య Andhra Jyothi 11/10/2011


గాంధీతాతా నువ్వే చెప్పు!

- కంచ ఐలయ్య

రావాలనుకున్న తెలంగాణ రాష్ట్రం రాక మా ప్రాంతపు ముగ్గురు నేతలు నువ్వు పుట్టిన రోజున నీ సమాధి దగ్గర నీ టోపి పెట్టుకొని కూర్చున్నారు. ఆ మూడు ఫోటోలు చూస్తే నాకు నువ్వు బతికి వుండగా మూడు కోతులకు చెడు మాట్లాడం, చెడు వినం, చెడు చూడం అని నేర్పిన నీతి గుర్తొచ్చింది. అందులో ఒకాయిన గాడ్సే గాడిలో ముసలితనం పొంది ఇప్పుడు నీ గాడికొచ్చాడు. ప్రాంతాల పంపకంలో 55 కోట్ల రూపాయలు పాకిస్థానుకియ్యాలని నువ్వు ఉపవాసనమున్నందుకు నిన్ను చంపుడు సరైందని వాదించి, వాదించి ఇప్పుడు నీ దగ్గరికెందుకొచ్చాడు?

ఆయన పార్టీ అధికారంలో ఉన్న గుజరాత్‌లో నీ అహింస సూత్రం ఆకుతో సమానమని ముస్లిం ఆడోల్ల కడుపులు కోసి పిండాలను మంటల్లో ఏసిన అహింసా అసలు రూపం అని వాదించాడు. అలా వాదించి, వాదించి మొన్న మోడీ సద్భావనంలో నీ ఫోటో పెట్టుకోగానే నువ్వు కాంగ్రెస్‌ను వదిలేసి వాళ్ళతో పోతున్నావని ఈయన నీ సమాధి దగ్గరికొచ్చి, చెడు చేసుడటుంచి, చెడు మాట్లాడనన్నట్టు కూర్చున్నాడు.

తెలంగాణలో వాళ్ళ రాజ్యమొస్తే ముస్లింలను ఊచకోత కొయ్యమని ఎక్కడ చెప్పడం లేదు. స్వాతంత్య్రం రాకముందే ముస్లింల రక్షణ మీద, రాజ్యం ఏర్పాటు మీద (పాకిస్థాన్) నువ్వు 1931 నాటికే ఒప్పుకున్నావుగా. మైనార్టీల వాటాపై గాని రక్షణపై గాని వీళ్ళు అగ్రిమెంట్ ముందు అవసరం లేదంటున్నారు. నువ్వేమో వాళ్ళకు ప్రత్యేక దేశమివ్వటానికే ఒప్పుకున్నావు. నిన్ను వాళ్ళు చంపి 63 ఏండ్లయింది. ఎన్నడు నీ దగ్గరికి రానోళ్ళు గీ చిన్న తెలంగాణ కోసమొస్తున్నారంటే మాకందరికి భయమేస్తుంది.

తెలంగాణ ప్రాంతానికి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, చత్తీస్‌ఘడ్ నుంచి వీళ్ళ కన్న తల్లి ఆర్.యస్.యస్. పైసల్నీ పదాతిదళాల్ని పెద్ద ఎత్తున పంపుతుంది. భాషా రాష్ట్రాలను విడగొట్టడం తెలంగాణతో మొదలుపెట్టి మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బెంగాల్, జమ్మూ కాశ్మీర్‌లకు చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని పాకించి, కరప్షన్‌తో చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని జోడించి సోనియా గాంధీని ఇటలీకి పంపించాలనేది వాళ్ళ వ్యూహం. ఇక్కడ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెలమ దొరల రాజ్యం ఏర్పరచవచ్చని ఒక ప్రయత్నం జరుగుతుంది.

మీ దగ్గరికొచ్చిన రెండోనేత ఇక్కడ తెలంగాణ రాజ్యాన్ని నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నాక ఇక్కడ రెడ్డి, వెలమలను కొంత అణచిపెట్టారు. కాంగ్రెస్ గూటి నుండి ఒక దళితుడు, టిడిపి గూటి నుండి ఒక బి.సి. తెలంగాణలో ముందున్న పెట్టుబడిదారులుగా కనిపించారు. ఒక ముస్లిం కుటుంబం కూడా ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో యస్.సి, బి.సి.లు అన్ని రంగాల్లో కనిపించడం మొదలైంది. కుల నిర్మూలన అసలు చెయ్యొద్దనీ నువ్వు కూడా అంబేద్కర్‌తో పోరాడి దాన్ని కాపాడావు కదా! దాని నిర్మూలనకు ఇదొక 'అడ్డ'గా తయారైందని వీళ్ళు తపన చెందుతున్నారు.

ఇక్కడి మూడు ప్రాంతాల్లో అన్నిటికంటె ఎక్కువ 'బి.సి' చైతన్యం ఉన్న 'అడ్డ'గా ఇది తయారైంది. ఈ ప్రమాదం నుండి కాపాడాలంటే 'ఆంధ్ర కమ్మరాజ్యం' 'రాయలసీమ రెడ్డిరాజ్యం'గా మారినట్టు దీన్ని 'వెలమ రాజ్యం'గా మార్చే 'విప్లవం' ముందుకొచ్చింది. చిన్న రాష్ట్రాలపై అంబేద్కర్ సిద్ధాంతం ఎట్లా తప్పో ఇక్కడే నిరూపించాలని ఈ ఇద్దరు నాయకుల్ని నీదగ్గరికొచ్చిన పెద్ద రావు, అడవిలోని అజ్ఞాతరావు అనుమతితోనే ముందుపెట్టారు. అంటే ఈ చిన్న రాష్ట్రంలో వెలమరాజ్యం రాబోతుందన్నమాట. నీ అండదండలతో నెహ్రూ చెప్పినట్లు ఈయన ఆంధ్ర పాలకుల దీవెనలతో ఎదిగి కుటుంబపార్టీని పెట్టాడు. 2001లో అప్పులతో పార్టీ ప్రారంభించి "కలెక్షన్ క్యాపిటల్ అక్యుములేషన్'' ఒక కొత్త సిద్ధాంతాన్ని అమెరికా నుంచే దిగుమతి చేశారు. ఈ అక్యుములేషన్ బనియా "బిజినెస్ క్యాపిటల్ అక్యుములేషన్'' పూర్తిగా విరుద్ధమైంది.

బనియా బిజినెస్ క్యాపిటల్ పిసినారితనం కలిగి ఉంటుంది. కాని కలెక్షన్ క్యాపిటల్ ఖర్చు చేస్తుంది, కొంత ఇన్‌వెస్ట్ చేస్తుంది. ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఎన్నడు ఖర్చుపెట్టలేదు. కాని ఈయన కుటుంబ సభ్యుల నేతృత్వంలోని స్వాడ్‌లకు భయపడి బాగానే రాలారు. ఈ క్రమంలోనే వెలమ కలెక్షన్ క్యాపిటల్ కూడ కొన్ని కుటుంబాల్లో జమైంది. ఇప్పుడు వెలమలకు రెండు టి.వి. చానెల్స్ ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలో 'తంతే వీరు హైదరాబాద్ పరుపులో' పడ్డారు. ఇటువంటి మీడియా పట్టు తెలంగాణ రెడ్డి క్యాపిటల్‌కు లేదు.

బి.సి., యస్.సి.లు ఈ క్యాపిటల్ ప్రచార సాధనాల ముందు నిలువలేదు. తెలంగాణ రెడ్లు రాయలసీమ రెడ్ల గుప్పిట్లో ఇరుక్కుపోయి బయటపడేలోపే పనంతా జరిగిపోయింది. ఇక్కడి వెలమలు అన్ని రంగాల్లో రెడ్లకు అందనంత ఎత్తు ఎదిగారు. తాతా నీది చిన్నకులమైనా అది జాతి అంతటా ఉంది కనుక నువ్వొక జాతీయవాదివయ్యావు. వీళ్ళది చిన్న ప్రాంతంలోని చిన్నకులం కనుక ప్రాంతీయ వాదమే వారికి 'శ్రీరామ రక్ష'. నీకు లేని మంచి లక్షణాలు కొన్ని వాళ్ళకున్నాయి. నీకు ఫార్‌మల్ పవర్ వద్దన్నావు. వాళ్ళకది సంపూర్ణంగా కావాలి.

నువ్వు సిద్ధాంత శత్రువువనుకున్న అంబేద్కర్‌ను డిస్‌ప్రూవ్ చేసి చిన్న రాష్ట్రాల్లో ఎంత చిన్నవైన అగ్రకులాలే అధికారంలోకి వస్తాయని చెప్పడానికి వాళ్ళు నీ దగ్గరికొచ్చారు. అన్ని రంగాల్లో అంబేద్కర్ సిద్ధాంతం చితికిపోవడమే నువ్వు కోరుకునేది కూడ. ఆ పని వాళ్ళు చెయ్యగలరు. ఐతే ఈ 'కలెక్షన్ క్యాపిటల్' చలనశక్తి ఎంతో మీ తరానికి అర్థంకాదు. ఇది ముందు బొంబాయిలో శివసేనతో ప్రారంభమైంది. ఇది చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. సెంటిమెంట్ ప్రాంతీయ వాదం దీని బలం.

దీని మజిల్ పవర్ ఇంగ్లీషు విద్యలేని బి.సి.ల నుండే ఎక్కువ వస్తుంది. ఇది ఎంత వేగంగా కలెక్ట్ అవుతుందో అంత వేగంగా ఖర్చు అవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికి ఆర్.యస్.యస్. అండ, అడవి పోరాటం అండ రెండు ఉండడంతో ఇది ఇంకా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఈ ఊపులోనే ఇక్కడ అంబేద్కర్‌ను చంపడం దాని లక్ష్యం. ఈ హత్య నీ అహింస సిద్ధాంతంతో కూడ చెయ్యొచ్చు. అంబేద్కర్ చచ్చిన కులాల్ని లేపి విద్యతో అధికారుల్ని, మంత్రుల్ని చేశాడు. అది తెలంగాణ వెలమలకు రెడ్లకు అసలె గిట్టని సమస్య. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రభుత్వ స్కూళ్ళు మూస్తే అంబేద్కర్ ఆటోమ్యాటిక్‌గా చస్తాడు. ఆ పని 1969 నుండే ప్రారంభమైంది. గత రెండు ఏండ్లలో తారాస్థాయికి చేరుకుంది.

తెలంగాణ రాగానే తెలుగుతల్లి సహాయంతో వెలమ పాలకులు ఇంగ్లీషు విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిగా ఆపేస్తారు. అది నీకు ఇష్టమే. గత పదేండ్లలో 'కమ్మ క్యాపిటల్' పాలనలో కాస్త కదిలాడిన తెలంగాణ బి.సి.లు, మాదిగలు ఇప్పటికే మంటగలిసే రోజొచ్చింది. ఇక్కడున్న వెలమ-రెడ్లు కొన్ని చిన్న కులాల నుంచి వచ్చిన మేధావులు తమ వెంట ఉంచుకోవచ్చు. కాని సామాజిక తెలంగాణ బి.సి., మాదిగ, ముస్లిం, క్రిస్టియన్ ఐక్యతలోనైన సందుపట్టే చాన్స్‌పోయింది.

ఇప్పుడు తెలంగాణ వస్తే వెలమ క్యాపిటల్‌కు-రెడ్డి క్యాపిటల్‌కు మధ్యనే అధికారం తిరుగుతుంది. సమైక్యాంధ్రలో అది రెడ్డి, కమ్మ క్యాపిటల్ మధ్య తిరిగేది. వెలమలు సమైక్యాంధ్రను ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న 'కలెక్షన్ క్యాపిటల్' బిజినెస్ క్యాపిటల్ అడవి అండతో కూడ పరిపాలించలేరు. కమ్మ క్యాపిటల్‌తో తట్టుకోలేని సమైక్యాంధ్ర రెడ్లు వైఎస్ఆర్ హయాంలో 'అగ్రెసివ్ స్టేట్ ప్లండర్' రూపంలో నిలదొక్కుకోవడమే కాక కమ్మ క్యాపిటల్‌నే ఉక్కిరిబిక్కిరి చేశారు.

తాతా, గ్లోబలైజ్‌డ్ పెట్టుబడితో ఆర్గనైజ్‌డ్ అగ్రెసివ్ పెట్టుబడి సమీకరణ నీకాలంనాటి బనియా వ్యాపారంలా చిన్న మొత్తాలను దండి కొట్టే వ్యాపారంతో సంపాదించదు. అది రోజువారీగా దండుకుంటుంది. మొదట్లో కొంత అభివృద్ధి లక్షణమున్న కమ్మ క్యాపిటల్, అది అధికారంలో ఉన్న ఆఖరి దశలో చాలా గర్విష్టిగా తయారై ఒక పక్క మొత్తం వ్యవసాయ రంగాన్ని, మరో పక్క తెలంగాణ వెలమ రెడ్లని, కాలికింద బంతిలా తొక్కింది. ఆ అణచివేత నుండి ఈ అగ్రెసివ్ వెలమ 'కలెక్షన్' క్యాపిటల్ పుట్టింది. ఇది త్వరలోనే నిలదొక్కుకున్నది. పెరిగి పెద్దదయింది.

దీనికి వెనుకబడిన, ప్రాంతాల స్వయం పాలన సిద్ధాంతాన్ని తుపాకిలా పట్టుకున్న 'అన్న'ల అండ దొరికింది. వాళ్ళు ఓటు బైకాట్ అని బయటికి చెప్పినా, అది కనుసైగతో కొత్త పార్టీ బాక్సుల్లో పడ్డది. ఇలా పుట్టిన పార్టీలు ఆత్మగౌరవం నినాదంతో గులాబీ జెండా కింద సకల వెలమల్ని సమీకరించింది. 1969లో పోరాటం ఆంధ్రా తెలంగాణ భూస్వామ్య శక్తుల మధ్య జరిగి చివరికి ఆంధ్ర రెడ్డి భూస్వామ్య శక్తులు చెన్నారెడ్డితో పరిపాలించబడడానికి సిద్ధపడ్డాయి. ఇప్పుడు పోరు పెట్టుబడి రంగానికి మారింది. నక్సలిజానికి ఉత్తర తెలంగాణ వెలమ పెట్టుబడిదారులకు ఉన్న కుల పునాదుల్ని కమ్మ పెట్టుబడి అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫేలయింది.

నీ దగ్గరకొచ్చిన మూడో టోపి పౌరహక్కుల పాయది. అది మధ్యవర్తిత్వ పని చేస్తున్నది. పౌరహక్కుల ఉద్యమంలో బాగా కష్టపడి కాలం గడిచిన ఒక మిత్రుడు చెప్పినట్లు ఆ ఉద్యమంలో కొంతమంది ఆస్తుల్ని కాపాడుకోవడానికి పనిచేశారు. ఇప్పుడు అటువంటి కొన్ని శక్తులు ఆస్తులు కాపాడుకోవడం దశ దాటిపోయి, ఆస్తుల్ని పెంచుకొని కొత్త అవతారమెత్తడానికి ఇదొక అదును. ఈ టోపీ, మార్క్స్‌కూ, మావోకు టోపీ పెట్టి నీ దగ్గరకొచ్చింది. ఆస్తుల పెంపకంలో ఈ కోవవారు ప్రస్తుతం కాషాయ టోపీ, 'కద్దర్' టోపీ ఏదైన పెట్టడానికి సిద్ధం. ఐతే దాని ప్రధాన పని వెలమ-రెడ్ల మధ్య మధ్యవర్తిత్వం. ముందేమైతదో చెప్పలేం.

ఈ ఉద్యమంలో దళిత నేతృత్వ పాయకూడ ఒకటున్నది. దానికి కిందా పైనా వెలమలే ఉన్నారు. ఈ పాయ అంబేద్కర్ సిద్ధాంతాన్ని నీ వేషంలో చెబుతుంది. గదెట్ల సాధ్యం. గణపతికి కల్లుతాపాలని చూస్తే తాగుతాడా? ఆయన తనవాళ్ళు నుండొచ్చే విస్కే తాగుతాడు. అందుకే సకల సమ్మెలో దళిత-బహుజనుల ఏకైక పెట్టుబడైన చదువు బందు పెట్టిండ్రుగాని విస్కీతాగుడు బందు పెట్టలే. ఈ కొత్త పెట్టుబడికి దేన్ని ఎప్పుడు, ఎట్లా బందు పెట్టాలో తొందర్లోనే అర్థమైంది. అది ఎంత ఆడిన, పాడిన అధికారం దాని చేతికి రాదు. అది కలవారి కాలువల్లో నీళ్ళు మాత్రమే పోయగలదు. ఆ నీళ్ళన్నీ ఈ ప్రాంతపు దొరవారి నదిలోనే పడుతాయి.

తాతా నీకు అనుభవమున్నది. నీ జాతీయ పోరాటంలో ఒక్క అంబేద్కర్ మాత్రమే నీ కాలువలకు నీళ్ళురాకుండా తన పెరట్లో తన చెట్లో పెట్టుకొని నీళ్ళుపోసుకున్నాడు. జిన్నా నీ కాలువకే గండికొట్టి తనదో చెరువు కట్టుకున్నాడు. ఇక మిగతా కాలువల్లోని నీళ్ళు నీ నదిలోనే పడ్డాయి. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఏదో ఒక కాలువలో నీళ్ళుపోసి వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజల నాలుకలెండ కొట్టినోల్లే. వాళ్ళనుండి పూర్తిగా లాభం పొందింది నువ్వే. వాళ్ళదప్పుడు ఎంత మంచి జాతీయవాదమో ఇప్పుడంత మంచి ప్రాంతీయ వాదం కూడా.

నిన్ను నేనడిగే అఖరి ప్రశ్నేమంటే, ఆంధ్ర కమ్మ-రెడ్డి క్యాపిటల్‌లో కొంత భాగం ఇంత తొందరగా వెలమల గంపలో పడ్డాక వచ్చే కొత్త రాష్ట్రంలో సామాజిక తెలంగాణో, బహుజన తెలంగాణో సాధ్యమేనా? ఇప్పటికీ వెలమల క్యాపిటల్‌కు ఉన్న తిరోగమన అగ్రెసివ్ హిందుత్వ లక్షణాలను మా కండ్ల ముందే చూస్తున్నాం. రాజ్‌ఘాట్‌లో వాళ్ళకు, నీకు కుదిరిన అగ్రిమెంట్ తెలంగాణలో అంబేద్కర్‌ను చంపడమే అయితే ఈ చిన్న రాష్ట్రాల కోసం జరిగే పోరాటంలో నీ అహింస పోరాటం ప్రకారమే దళిత-బహుజనులు తమను తామే చంపుకుంటున్నారు కదా! ఇది ఎంత కాలం జరగాలి? ఎంత మంది సచ్చేదాక జరగాలి? ఇక్కడ ప్రజలంత సచ్చి పాలకులు బతికుంటే చాలా? నువ్వు నడిపిన మొత్తం స్వాతంత్య్ర పోరాటంలో కూడ ఇంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారా?

క్యాపిటల్ ఆంధ్రదైనా, రాయలసీమదైనా, తెలంగాణదైనా ఇక్కడి పాలకకులాల మధ్యే తిరుగుతుంది. అధికారం మాకు కావాలనుకునే దళిత-బహుజన రాజకీయ నేతలైనా, ఉద్యమ నేతలైనా పెట్టుబడి ఏ కులాల్లో ఉంది, దాని బలమెంతో చూడకుండా చూస్తే సామాజిక న్యాయం దొరుకుతుందనుకుంటే గాంధీ టోపి వీరి నెత్తుల మీద కూడ పెడతారు. సిద్ధాంతాలకతీతంగా రాష్ట్రం సాధించుకోవాలి అని ఆర్.యస్.యస్.ని, అంబేద్కర్‌ని, మావోను ఒకే పడవెక్కిస్తే పడవ మునుగుద్ది కాని బతికి బయట పడేది నాలుగు పడగల హైందవ నాగరాజే.

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

No comments:

Post a Comment