Monday, October 10, 2011

ఆదివాసుల రగలఖ్ జెండా..- చిల్ల మల్లేశం Namasethe Telangana 11/10/2011

ఆదివాసుల రగలఖ్ జెండా..
Komaram-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఅడవిపై తమ ఆధిపత్యాన్ని ధిక్కరించి, యుద్ధసన్నాహాల్లో నిమగ్నమైన కొమురంభీంతో ‘రాజీ’కి నైజాం సర్కారు ఆసిఫాబాద్ నాజం(సబ్ కలెక్టర్)ను దూతగా పంపుతుంది. ఈ సందర్భంగా నాజంకూ, కొమురంభీంకూ మధ్య యుద్ధక్షేత్రం జోడేఘాట్‌లో జరిగిన చర్చల వివరాలను నాజం నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాడు. 1980వ దశకంలో ఈ నివేదిక ను రచయితలు అల్లం రాజయ్య, సాహు సంపాదించి తమ నవ ల ‘కొమురం భీం’లో పొందుపరిచారు. అడవిపై మైదాన పెత్త నం వల్ల ఆగమైన గోండు బతుకులను, భీం ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను, నైజాం సర్కారుపై ఆయన వినిపించిన ధిక్కార స్వరాన్ని ఈ నివేదిక తెలిపింది.నాజం, భీం మధ్య జరిగిన సంభాషణ యాథాతథంగా..
సంవత్సరం : 1940 పూర్వ పాదం,
స్థలం : జోడేఘాట్..

నాజం: రాం రాం భీం. (భీం, సాయుధులైన గోండులు, ఆ పరిసరాల వంక భయంభయంగా చూస్తూ..)
భీం: నాజం సాబ్ రాంరాం.. మీకు ఎలాంటి భయమక్కర్లే దు. సంప్రదింపులకు వచ్చిన మనిషి కాలుకు ముల్లు గుచ్చకుం డా చూడాల్నని మాకు తెలుసు. (మంచంలో కూర్చోమని సైగ చేస్తూ)
నాజం: ఇంత పెద్ద అడవిలో ఎట్లా బతుకుతున్నరో ముసీబత్ హై.. భీం దాదా.. ముసీబత్ హై..!
భీం: కానీ ఈ అడవిలో నుంచే మీ బంగ్లాల్లోకి సరుకులు వస్తయి.

నాజం: అవునవును. సరే భీం, సరిగ్గా విను. నైజాం సర్కా రు దయగలది. నిజమే. మీరు భూములు లేక బాధపడుతున్న రు. ఆ సంగతి సర్కారుకు ఎట్లా తెల్వాలె! మీరు ఖానూన్లు ఎరుకజేసుకోవాలె! మీకు ఖానూన్లు తెల్వకపోవడం సర్కారు తప్పుకాదు గదా!
భీం: మేము వందలసార్లు అర్జీలు పెట్టుకున్నాం. సర్కారు చెవిటిది. గుడ్డిది. మూగది.(ఆవేశంగా)
నాజం: సర్కారుకు మీరొక్కరే కాదుగదా! లక్షల మంది. లక్ష పనులు. సరే.. జో హోగయా.. సో హోగయా! భీమూ.. అర్థం చేసుకో. నీకు, నీచిన్నాయినలకు పట్టాలిప్పిస్తా. అందరిజోలి నీకెందుకు? దున్నుకో. బతుకు!

భీం: నాజం సాబ్.. మీరు పొరబడుతున్నరు. మా పన్నెండు గ్రామాల గురించి మేం యుద్ధం చేస్తున్నం. నా ఒక్కడి గురించి కాదు.

నాజం: అయితే మీ పన్నెండు గ్రామాలకు పట్టాలిప్పిస్తాం.
భీం: అక్కర్లేదు నాజం సాబ్.. ఘనమైన మీ నైజాం సర్కారుతో చెప్పు! మీ ఉన్నతమైన రాజుకు మా సందేశం విన్పించు. మేము మా మొర విన్పించాలని మీ రాజు వద్దకు వచ్చినం. కానీ మమ్ముల్ని అవమానించి పంపిన్రు. అడవిని నరికి పాడుచేసే తెలివిలేని మూర్ఖులమన్నరు. బుడ్డగోచీ మాటలు అని అపహాస్యం చేసిన్రు. ఇప్పుడు చెబుతున్న. మేం బుద్ధి పూర్వకంగానే అడవిని నరికినమని చెప్పు. మేం పట్టేదార్ల కింద, జాగీర్దార్ల కింద కౌలు చేసి.. జంతువులతో పోరాడి పండించిన పంట సాంతం వారికి కొలిచి.. అర్ధాకలితో బతుకలేక.. మరింక తెగిం చి మాకు సొంత భూమి కావాలని.. స్వేచ్ఛగా బతుకాలని.. అడవి నరికినమని చెప్పు. మేం మోగించిన తుడుం గురించి చెప్పు. మేం ఎగరేసిన రగల్ జెండా గురించి చెప్పు. మీ దుర్మార్గపు పాలనతో విసిగిపోయామని చెప్పు. ఇకపై మేం జంగలాతువాళ్ల లాఠీ దెబ్బలు సహించబోమని చెప్పు. మీరు మమ్మల్ని జైళ్లపాల్జేసినా, చంపినా సరే.. మళ్లీమళ్లీ అడవులను నరుకుతమని చెప్పు. భూములు సాగు చేస్తమని చెప్పు. పంటలు తీస్తమని చెప్పు.జిస్ గోండ్ వాలోం కో గాండ్ మే దమాక్ రహతా బోల్‌కే బోలేనా వొ హీ గోండు నాయక్ కొమురం భీం చెప్పిండని మరీమరీ చెప్పు.

నాజం: ఓ భీం.. ఆవేశానికి పోవద్దు. కోపతాపాల వల్ల లాభం లేదు. లడాయి ఆపండి. రక్తపాతం ఎవరికీ మంచిది కాదు.(మధ్యలో అడ్డం వస్తూ)
భీం: నాజం సాబ్.. నన్నాపకు. నా రక్తం పోటెత్తుతోంది. మా బతుకంతా క్రూరమైన మీ రాజు పాలనలో ధ్వంసమై పోయింది. మమ్ముల మూర్ఖులన్నరు. కానీ మేం సర్వసంపద లు సృష్టించేవాళ్లం. ఒకనాడు మానవులు ఉన్నతంగా బతికిన్రు. భూమి, గాలి, నీరు, అడవులు, కాయ, పండు, వేట ప్రతీది కలిసి పంచుకుతిన్నరు. మనిషి మీద సాటి మనిషి పీడన లేకుం డా ఆకాశంలోని పక్షుల్లా స్వేచ్ఛగా బతికిన్రు. కానీ మీ రాజరికం అంతా గోల్‌మాల్ చేసింది. అలాంటి రాజరికం మా కక్కర్లేదు. మేం ఊర్కుంటే మీరు, మీ రాజులు, ఆకాశాన్ని, చంద్రున్ని, సూర్యున్ని, గాలిని అమ్ముకుంటరు. అన్నింటికీ పన్నులు కట్టమంటరు.

నాజం సాబ్.. మేం అడవులు నరికి సేద్యయోగ్యం చేసిన భూములను మీరు గుంజుకున్నరు. కొత్తగా అడవులు నరికితే కేసులు పెట్టి, బొక్కలో తోసిన్రు. మేము ఆకలితో చస్తుంటే మమ్ముల దోచిన సొమ్ముతో మీరు విందులు చేసుకుంటున్రు. మీ విలాసాల కోసం మారణహోమం సృష్టిస్తున్రు. నాజం మీరు రాక్షసులు. పంటలు దీసే మా చేతులను, గుడిసెలు గట్టే మా చేతులను నరికిన్రు. మా చెమట, నెత్తురు జలగల్లా తాగి న్రు. మీ సర్కారు భిక్షం మాకక్కర్లేదు. ఈ పన్నెండు గ్రామాలకే కాదు. ఉట్నూరు నుంచి రాజోరా దాకా మొత్తం మా గోం డు పరిగణాకు, పాలించే అధికారం కావాలి. మీ సర్కారుకు చెప్పు. మా మీదకు ఎక్కువ సైన్యాన్ని పంపినా.. మేమంతా పోరాడి చచ్చినా.. మాలో గోండు వీరుడొక్కడు మిగిలినా రాజ్యాధికా రం కోసం పోరాడుతడని!

నాజం: భీము. నాకొక చిన్న అనుమానం. రాజ్యం చేయడం మామూలు మాటలు కాదు. దానికెంతో అనుభవం ఉండాలె!
భీం: నాజం సాబ్ నిజమే. మీలాగా పదియి చ్చి, వందలకు పెంచి, పందుల్లా మెక్కే షావుకార్లు, అన్యాయంగా మంది భూములను లాక్కు నే జాగీర్దార్లు, అమాయకుల రక్తం పీల్చే జంగ్లాతోళ్లున్న రాజ్యాన్ని మేం చేయం. మేము అందరికీ సమానంగా బతికే హక్కు ఉన్న రాజ్యం చేస్తం. నాగలికట్టి దున్నేవాడికే భూములిస్తం. కనుక మా రాజ్యంలో అన్యాయానికి తావులేదు.ఇంకా వినండి. మేము మా గోండులకు ఈ విధంగా పిలుపునిచ్చినం..

‘‘ఓ గోండన్నలారా లేవండి. ఈ దునియాలో రెండు రకా ల మనుషులున్నరు. కూడు కోసం చచ్చేవాళ్లు. కూడు అన్యాయంగా సంపాదించి, పీకల దాకా మెక్కి అజీర్తితో బాధపడేవాళ్లు. పట్టేదార్లు, షావుకార్లు, రాజులు వీళ్లంతా మనలను దోస్తున్నరు. ఈ నేల, అడవి, అన్నీ.. అన్నీ మనవి. ఇవి మనకే చెందా లి. మనకే రాజ్యాధికారం కావాలి. రాజ్యాధికారం మనకు రావాలంటే మనమందరం ఏకం కావాలి. లడాయి చేయాలి. మనలను పీడించే వీళ్లను, శాశ్వతంగా తుడిచిపెట్టాలి. మన రాజ్యంలో కష్టపడేవాడికి తిండి, చదువు, తెలివి అన్నీ చెందుతాయి. ఎవడైతే నాగలి పట్టగలడో, ఎవడి భార్య అయితే పొద ల్లో, బెడల్లో జొన్నలు పోయగలదో వాళ్లకే అన్ని హక్కులు.’’ ఇదే మా సందేశం. ఇదంతా కొమురం భీము చెప్పాడని చెప్పు. మీ దుష్టపాలన, మోసపు సర్కారుతో మాకు రాజీ కుదరదని చెప్పు.
నాజం: భీం మీకు రాజ్యాధికారం ఇవ్వలేం. మీకు పరిపాలన చేసుకోవడం రాదని మా నమ్మకం
భీం: అయితే మాకు రాజ్యాధికారం తప్ప, ఇంకేమీ అవసరం లేదని మీ నైజాం రాజుకు నా మాటగా చెప్పు. ఇదే నా అంతిమ నిర్ణయమని చెప్పు. (చప్పట్లు చరిచి, వెళ్లిపొమ్మంటూ సైగ చేశాడు..)
- చిల్ల మల్లేశం
(నేడు కొమురం భీం వర్ధంతి)

No comments:

Post a Comment