Saturday, June 16, 2012

ముస్లిం రిజర్వేషన్లు-రాజ్యాంగ రక్షణ----కనీజ్ ఫాతిమా



ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం 2004లో జీవో33ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2011లో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది వాదిస్తున్నారు. ముస్లింలకు విద్యా, ఉద్యోగరంగాల్లో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తీర్పులు వెలువరించే సమయంలో న్యాయాధిపతులు రాజ్యాంగంలోని ఆయా ఆర్టికల్స్ స్పిరిట్‌ను అర్థం చేసుకున్నట్లు లేదు.ముస్లింల కు రిజర్వేషన్లను వ్యతిరేకించేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తీకరణలు వస్తున్నా యి. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగ అనుమతి లేదనీ, సమాజాన్ని విచ్ఛి న్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పు ముస్లింలతో సహా ఇతర మైనార్టీల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నది. సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని కేంద్రం నివేదించింది. సుప్రీంకోర్టు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ మీద అసహనం ప్రదర్శించింది.రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వడానికి గల డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను కోర్టుకు సమర్పించాలని సూచించింది. 

రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెం టనే మద్రాసు రాష్ట్రంలో కొనసాగుతున్న ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ సమ్మతం కాదని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది. పార్లమెంటులో కూడా దీనిపై చర్చ జరిగింది. మద్రాసు కోర్టు న్యాయాధీశులు రాజ్యాంగం సారాన్ని అర్థం చేసుకోలేదని, వారు కేవలం న్యాయశాస్త్ర నిపుణులుగానే మిగిలిపోయారని అప్పటి పార్లమెంటులో డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. మద్రాసులో ఎప్పటి నుంచో అమలవుతున్న ఓబీసీ రిజర్వేషన్లు కొత్త రాజ్యాంగం ప్రకారం న్యాయసమ్మతమేననీ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16 హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయని ఆయన వాదించారు. ఆయన వాదనను అంగీకరించి తొలి రాజ్యాంగ సవరణ ఓబీసీ రిజర్వేషన్ల కోసం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని నాడు మద్రాసు కోర్టు తీర్పు ఇచ్చినట్టే, నేడు ఆంధ్రవూపదేశ్ హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పుఇచ్చింది. మైనార్టీ రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేస్తాయని 2007లోనే బాలగోపాల్ ఊహించారు.

రాజ్యాంగం ఈ దేశ పౌరులకు మౌలిక హక్కులు కల్పించింది.విద్యా, ఉద్యోగ రంగాలు ఈ హక్కుల కిందే పరిగణింపబడ్డాయి. వీటిని నిరాకరించే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. ఆర్టికల్ 13(2), 3 (ఎ) ప్రకారం మౌలిక హక్కులకు భంగకరమైన ఎలాంటి చట్టమైనా రాజ్యాంగం ప్రకారం చెల్లదు. ఆర్టికల్ 14 ప్రకారం ఈ దేశంలోని పౌరులంతా చట్టం ముందు సమానులే. అంటే అన్ని మతాల ప్రజలు చట్టం ముందు సమానులే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విద్యా,ఉద్యోగ హక్కులతో పాటు, జీవించేహక్కు, ప్రాతినిథ్యం వహించేహక్కును మౌలిక హక్కు ల పరిధిలోనే పెట్టాలని రాజ్యాంగ సభలో వాదించారు. ఈ హక్కులను మార్చే అధికారం ఎవరికీ లేదని ఆర్టికల్ 13 ఆదేశిస్తుంది. అందుకే మౌలిక హక్కులే రాజ్యాంగం అసలైన నిర్మాణం. ఆర్టికల్ 15 పౌరులకు ప్రాతినిధ్యహక్కు కల్పిస్తుంది. ఆర్టికల్ 15(4), (5) ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడి న వర్గాలకు స్పెషల్ ప్రొవిజన్ చేసేందుకు రాజ్యాన్ని ఆటంకపరిచేదేదీ లేదు. ఆర్టికల్ 16(1), (2), (4)విద్యా, ఉద్యోగ రంగాలలో పౌరులందరికీ సమానత్వం కల్పించబడింది. ముస్లింలు, ఇతర మైనార్టీలు ఈదేశ పౌరులు. అందువల్ల రాజ్యాంగం హామీ ఇచ్చిన మౌలిక హక్కులను వారికి ఇవ్వాలి. కానీ న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. విద్యా, ఉద్యోగాలలో మైనార్టీలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నది. రాష్ట్ర హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్లు ఆర్టికల్ 15,16 పరిధిలోకి రావని తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం. ఫండమెంటల్ రైట్స్ గురించి ఏర్పా టు చేసిన ప్రతి ఆర్టికల్‌లో తొలుత మతం అనే పదాన్నే చాలా స్పష్టంగా వాడా రు. ఈ మౌలిక హక్కులను ఉల్లంఘించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తుంటే న్యాయవ్యవస్థ మాత్రం మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని అంటున్నది. మైనార్టీ రిజర్వేషన్ జీవోను, ఆర్డినెన్స్‌ను మూడుసార్లు న్యాయవ్యవస్థ కాలరాసిం ది. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని వక్రీకరించడం కాదా ఇది? మతం పేరుతో పౌరుల పట్ల వివక్ష చూపించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ముస్లింలు ఆర్థికంగా, సాంఘికంగా, విద్యా, ఉద్యోగపరంగా దయనీయ స్థితిలో ఉన్నారని అనేక కమిషన్లు చెప్పాయి. న్యాయవ్యవస్థ ముస్లింల అభివృద్ధి కోసం ప్రత్యేక రిజర్వేష న్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఆదేశాలివ్వడం లేదు? 

ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చే విషయంలో ఒక సాంకేతిక సమస్య ఇమి డి ఉన్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదనే ఒక వాదన ఉన్నది. ఈ సమస్య ఆరు దశాబ్దాలుగా ఉన్నది. అయితే మండల్ కమిషన్ కేసులో జస్టిస్ జీవన్‌డ్డి తీర్పు చెప్పారు. ఆ తీర్పులో ‘వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ 50 శాతం మించరాదనేది సాధారణ నియమం. ప్రత్యేకమైన అంశాలలో దీనికి మినహాయింపులు ఉండొచ్చు. ఇదే కాదు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు కాకుండా, ఇతర కారణాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ వర్తించదు’ అన్నారు. అందువల్లే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం, వికలాంగులకు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వంటి వాటిలో మూడు శాతం రిజర్వేషన్లు అమలువుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు అగ్రకులాలు ఎలాంటి వాదనలు చేశాయో, ఇప్పుడు ముస్లిం, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని అలాంటి వాదనలే చేస్తున్నారు. ఏదైనా కులం సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడితే దాన్ని వెనుకబడిన వర్గంగా గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తే, అది కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కాదనినాడు సుప్రీంకోర్టు తెలిపింది. అదే సూత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వర్తిస్తుంది. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమూహాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ సందర్భంలోనే ‘ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముస్లింల్లో వెనుకబాటు తనం ఉందని గుర్తిస్తే, వారికి రిజర్వేషన్ ఇవ్వొచ్చు’ అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.

ముస్లిం, ఇతర మైనార్టీలకు బీసీ రిజర్వేషన్ల నుంచి కోటా కేటాయించడం వల్ల బీసీ సోదరులు ముస్లిం వ్యతిరేకులుగా మారుతున్నారు. నిజంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం ప్రభుత్వాలకు ఉంటే 50 శాతం సీలింగ్‌ను తొలగించాలి. ముస్లిం, ఇతర మైనార్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేష న్లు కల్పించాలి. ఓబీసీల్లోని 27 శాతం నుంచి 4.5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ముస్లింల, ఇతర మైనార్టీల ప్రాతినిథ్య హక్కును తగ్గించడమే అవుతుంది. బీసీలకు, ముస్లింలకు మధ్య గొడవపెట్టే ఎత్తుగడను ప్రభుత్వం అమలు చేస్తున్న ది.బీసీల వైఖరి కూడా ముస్లింల పట్ల అహేతుకంగా ఉన్నది. బీసీలు అగ్రకుల రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకోవా లి.మాయావతి అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలాగే బీసీలు కూడా ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ సమ్మతం కావు. మరి అగ్రకులాలకు కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని ఏ ఒక్క బీసీ సం ఘమూ కోర్టులో కేసువేయలేదు. మతం పేరుతో ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు అగ్రకులాలకు ఇచ్చే రిజర్వేషన్లు మతపరమైనవని ఎందుకు వాదించడం లేదు? కోర్టులు కూడా అగ్రకులాలకు రిజర్వేషన్లను ఎందుకు తిరస్కరించడం లేదు? వెనుక బడిన ముస్లిం లకు, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మతం పేరుతో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.అందువల్ల ముస్లింలకు ఇతర మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వ డాన్ని న్యాయవ్యవస్థతో సహా ఎవరూ వ్యతిరేకించ కూడదు. న్యాయ వ్యవస్థ ద్వారా కూడా మైనార్టీలకు న్యాయం జరగకపోతే.. ప్రజలు ఎన్నుకున్న పార్లమెం ప్రజలకు సరియైన న్యాయం చేయాలి. ఈ దేశపౌరులైన ముస్లింలకు రాజ్యాం గబద్ధమైన న్యాయంచేసే అత్యున్నత అధికారం పార్లమెంటుకే ఉన్నది. కాబట్టి బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లే, జనాభా ప్రాతిపదికన మైనార్టీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ముస్లిం, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పం, నిజాయితీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, గతంలో బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లే చేయాలి. అలా కాకుండా జీవోలు, ఆర్డినెన్స్‌ల పేరుతో మైనార్టీలను మభ్యపెట్టాలని చూస్తే, ముస్లిం, బీసీల మధ్య ఘర్షణ పెట్టాలని చూస్తే ప్రభుత్వం భంగపడక తప్పదు. 

-కనీజ్ ఫాతిమా
(సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ సహాయ కార్యదర్శి

Namasete Telangana News Paper Dated : 17/06/2012 

Friday, June 15, 2012

మార్క్స్ చాలడు-అంబేద్కర్ కావాలి --- ఉ.సా


కులాన్ని సాంఘికార్థిక అంశంగా, ఇండియా సమాజాన్ని కుల-వర్గ సమాజంగా విశ్లేషించిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే'మార్క్స్ చాలడు, అంబేద్కర్ కావాలి'. 


ఎర్రాఎర్రటి నరుడో భాస్కరుడు, నల్లానల్లటి దళిత సూరీడు శివసాగరుడు (కెజి సత్యమూర్తి) ఇటీవల అమరుడైన సందర్భంగా 'సామాజిక విప్లవమూర్తి'గా ఆయన్ని స్మరించుకొంటూ అనేక మంది పలు వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల్లో సత్యమూర్తిని సామాజిక విప్లవ మూర్తిగా అభివర్ణించడాన్ని రంగనాయకమ్మ సహించలేకపోయారు. అలాగే మన దేశ కులవ్యవస్థను, కులాధీన వర్గ వ్యవస్థను జమిలిగా మార్చటానికి అంబేద్కర్ కావాలి, మార్క్స్ కావాలని నొక్కి చెప్పిన సత్యమూర్తి విశ్లేషణని గొప్ప దేశీయ మార్క్సిస్టు-అంబేద్కరిస్టు తాత్విక విశ్లేషణగా కొనియాడటాన్ని కూడా ఆమె సహించలేకపోయారు. 



రంగనాయకమ్మ దృష్టిలో అంబేద్కర్ సాంఘిక సంస్కర ణవాద సంఘసంస్కర్త మాత్రమే. కనుక ఆయన్ని బలపర్చే వారెవరైనా అలాంటి సంఘ సంస్కర్తలే అవుతారు. గతంలో సత్యమూర్తి విప్లవ కమ్యూనిస్టు అయినా ఒకసారి అంబేద్కర్‌ని బలపర్చినాక ఆయన్ని కూడా సంస్కరణ వాదిగానే చూడాలి తప్ప సామాజిక విప్లవ యోధుడిగా చూడటానికి వీల్లేదు... అలా చూస్తే ఆమె సహించలేదు. కులపరమైన సాంఘిక వివక్షకి పరాకాష్ఠ అయిన అంటరాని దళిత సమస్య కుల వ్యవస్థతో సంబంధంలేని సాంఘిక దురాచార సమస్యగా గాంధీ చిత్రీకరించారు. ఆ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలిగించని హరిజనోద్యమం ద్వారా ఆ సాంఘిక దురాచారాన్ని ఆయన పోగొడతానన్నాడు. 



కానీ అంబేద్కర్ కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న దళిత సమస్య కుల వ్యవస్థలో సమూలమైన మార్పు తేకుండా పరిష్కారం కాదని కుల నిర్మూలనా దృక్పథాన్ని ప్రతిపాదించారు. చారిత్రక దృష్టితో కులాల మూలాల్లోకి వెళ్ళి'అస్పృశ్యతకు మూలం కుల వ్యవస్థలో ఉంది. కుల వ్యవస్థకు మూలం వర్ణాశ్రమ వ్యవస్థలో ఉంది. వర్ణాశ్రమ ధర్మం మత పరిరక్షణలో ఉంది. దాని మూలం అగ్రవర్ణ నిరంకుశాధికార రాజ్యాధికారంలో ఉంది' అన్నాడు. కుల నిర్మూలనా విధానంతో రాజ్యాధికారం అనే మాస్టర్ కీ చేజిక్కించుకోవాలన్నాడు. తద్వారా సాంఘిక ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయంతో కుల వ్యవస్థను సమూలంగా మార్చాలని, కులాంతర వివాహాల ద్వారా కులాలను రద్దుచేయాలని అప్పుడే దళిత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 



అంబేద్కర్‌ను స్వీయాత్మక దృష్టితో చూడటం కారణాన అంబేద్కర్‌ను సాంఘిక సంస్కరణవాదిగా రంగనాయకమ్మ చిత్రీకరించారు. అంబేద్కర్ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సామాజిక, న్యాయ సామాజిక విప్లవ కుల నిర్మూలనా పోరాటాన్ని కేవలం సాంఘిక పోరాటంగా కుదించి చూస్తున్నారు. కులాలను రద్దు చేసే కులాంతర వివాహాల సాంఘిక కార్యక్రమానికి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అంటున్నారు. కానీ అట్టడుగు కులాల వారందరి ఆర్థిక పరిస్థితులు మారకుండా, కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరిగే వాతావరణం ఏర్పడకుండా కులాల రద్దు అసాధ్యం అని ఆమె అన్నారు. శ్రామిక వర్గ సంబంధాల్లో మార్పు కోసం జరిగే వర్గ విప్లవ పోరాటం ద్వారానే అది సాధ్యమని అంటున్నారు. 



దళిత సమస్యను కేవలం ఉపరితల సమస్యగా, సాంఘిక సమస్యగా మాత్రమే రంగనాయకమ్మ చూస్తున్నారనడానికి 'దళిత సమస్య పరిష్కారానికి అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి' అనే రంగనాయకమ్మ పుస్తకమే నిదర్శనం. మార్కిజాన్ని ఆర్థిక నిర్ణాయక పెడధోరణిగా మార్చిన ఈ అగ్రకుల మూస మార్క్సిస్టులు ఇండియాలో వర్గాన్ని ఆర్థికంగా, కులాన్ని సాంఘికంగా విశ్లేషించిన అవాస్తవిక విశ్లేషణని అంబేద్కర్ ఖండించి తిరస్కరించారు. ఆర్థిక నిర్ణాయకవాద మూస మార్క్సిస్టు అయిన రంగనాయకమ్మ అంబేద్కర్‌పై బురద జల్లుతున్నారు. 



శ్రమనేగాక శ్రామిక వర్గ సంబంధాల్ని శ్రామిక కుల సంబంధాలుగా మార్చిన కులవ్యవస్థ కేవలం ఉపరితల సాంఘిక వ్యవస్థ కాదని అంబేద్కర్ చెప్పారు. ఈ దేశంలో కుల అంతస్తుల వారీగా ఏర్పడిన 'కుల-వర్గ ఆస్తులు-అంతస్తులే' అందుకు తిరుగులేని నిదర్శనం. కనుక కులం ఉపరితల సాంఘిక వ్యవస్థ అని ఫ్యూడల్ కుల వృత్తులు చెదిరిపోతే కులాలు అంతరించిపోతాయని, కులాల్లో వర్గాలేర్పడితే కులం వర్గంగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసిన మూస మార్క్సిస్టుల అంచనాలు అభూత కల్పనలుగా మారి కాలదోషం పట్టి కాలగర్భంలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది తప్ప అంబేద్కర్ అంచనాలు విఫలం కాలేదు. 



కులాన్ని సాంఘికాంశంగా పరిగణించే రంగనాయకమ్మలాంటి మూస మార్క్సిస్టుల అంచనాలు తప్పని ఇప్పటికే చరిత్ర నిరూపించింది. మన దేశ సామాజిక వ్యవస్థని కుల వర్గ వ్యవస్థగా చూడాలని, కుల-వర్గ సామాజిక విప్లవ పోరాటంతో మార్చాలని చెప్పిన ఏకైక సామాజిక శాస్త్రవేత్త, సిద్ధాంతవేత్త అప్పటికీ ఇప్పటికీ అంబేద్కర్ ఒక్కడే. 'ఈ సందర్భంగా కుల వ్యవస్థకు సంబంధించి ఒక ముఖ్య లక్షణం గురించి నొక్కి చెప్పాలి. 



అదేమిటంటే కులమూ వర్గమూ ఒకే రకమైనవి కాకపోయినా కుల వ్యవస్థ వర్గ వ్యవస్థను గుర్తిస్తుందని స్పష్టంగా చెప్పగలం. బ్రాహ్మణీయ హిందూ సమాజం అనేక కులాలుగా విభజింపబడినట్లే కులాలు అనేక వర్గాలుగా విభజింపబడ్డాయి. అందుకే ఈ కులవర్గ సమాజంలో కుల చైతన్యంతో పాటు వర్గ చైతన్యం కూడా ఉంది.. దీనికి రుజువులు కావాలనేవారు మద్రాసు బొంబాయి రాష్ట్రాల్లో జరిగిన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని పరిశీలించవచ్చు' అని స్పష్టం చేశారు. (హిందూయిజం తాత్విక భూమిక-కులం, వర్గం-అంబేద్కర్). బ్రాహ్మణేతర బహుజనోద్యమం వర్గాన్ని విస్మరించినందువల్ల శూద్ర వ్యవసాయ కులాలకి చెందిన వారు భూస్వాములై, అగ్రకుల పాలక వర్గాలుగా, నూతన సంపన్న వర్గాలుగా పరిణమించటాన్ని నివారించలేకపోయిందని అందులోని లోపాన్ని గుణపాఠం తీసి చెప్పారు. 



'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అని కార్మికవర్గ అంతర్జాతీయ దృక్పథంతో మార్క్స్ ఇచ్చిన పిలుపును మూస మార్క్సిస్టులు భ్రష్టు పట్టించారు. ఏ కులం వారైనా, ఏ దేశం వారైనా పేదలంతా ఒక్కటే.. బాధలన్నీ ఒక్కటే అని ప్రపంచ పేదల్లారా, ఏకంకండి అని ఆ నినాదాన్ని వక్రీకరించి వివిధ దేశాల, జాతుల, ప్రత్యేక కుల సమాజాలకు అతీతంగా ఒకే మూసలో (వర్గ మూసలో) పోసే వాదాన్ని అంబేద్కర్ తిరస్కరించారు. 'మానవుల సమూహమే సమాజం అనే సామాజిక దృక్పథం మోసపూరితమైనది. ఏ దేశ సమాజంలోనైనా వర్గాలు ఏర్పడుతాయి. 



ప్రపంచమంతటా ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడని మార్క్స్ చెప్పిన సార్వజనీన వర్గ దృక్పథమే సరైంది. విలక్షణ ప్రత్యేక కుల వ్యవస్థ ఉనికిలో ఉన్న ఇండియా సైతం అందుకు మినహాయింపు కాదు. కాకుంటే ఇండియాలో వర్గంతోపాటు కులం కూడా ఉందన్న కుల వర్గ సామాజిక వాస్తవికతను ఇండియన్ అగ్రవర్ణ మార్క్సిస్టులే సరిగా గుర్తించటం లేదు. ఇండియాలో వర్గం కుల నియంత్రణకి గురవుతోందని, శ్రమ విభజనను శ్రామికుల విభజనగా మార్చి విభజించి పాలించే బ్రాహ్మణిజాన్ని దేశీయ సామాజిక ప్రత్యేక శత్రువుగా గుర్తించాలి' అని అంబేద్కర్ హెచ్చరించారు. 



కనుక వర్గాన్ని నియంత్రించి వర్గపోరాటానికి అడ్డంకులు కల్పించే కుల నియంత్రణని అరికట్టే కుల నిర్మూలనా పోరాటం చేపట్టకుండా, యథాతథ 'కులం పునాదుల మీద (వర్గ ఉద్యమాన్ని గాని, జాతీయోద్యమాన్ని గాని) ఒక జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేదు' నిర్మించినా కుల నియంత్రణకి గురికాకుండా నివారించలేదు. అందుకే 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అని కార్మిక వర్గ అంతర్జాతీయ దృష్టితో మార్క్స్ ఇచ్చిన పిలుపు ఇండియాలో యథాతథంగా అమలుకాదని అంబేద్కర్ తమ 'కుల నిర్మూలన'లో స్పష్టం చేశారు. ఆ కారణంగా ఇండియాలో కమ్యూనిస్టులు ఫ్యూడల్ వ్యతిరేక వ్యవసాయ విప్లవ వర్గపోరాటంపై కుల ప్రభావాన్ని నివారించలేకపోయారు. 



దాంతో 'దున్నే వానికే భూమి' అని వారు ఇచ్చిన నినాదం వ్యవసాయ కులాలకి చెందిన కమ్మ, రెడ్డి, కాపు, వెలమ 'కౌలుదారులకే భూమి'గా పరిణమించింది. పర్యవసానంగా వ్యవసాయేతర శూద్ర అతిశూద్ర కులాలవారికి చారిత్రక అన్యాయం జరిగింది. అలా అంబేద్కర్ చెప్పిందే నిజమైంది. కనుక ఈ వాస్తవాల్ని తారుమారు చేసి, తలకిందులుగా చూపుతున్న రంగనాయకమ్మ వాదాన్ని సరిదిద్ది తలపైకి కాళ్ళు కిందికి పెట్టి చూద్దాం. కులాన్ని సాంఘికార్థిక అంశంగా, ఇండియా సమాజాన్ని కుల-వర్గ సమాజంగా విశ్లేషించిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి. ఒక్కమాటలో ఈ మూస మార్క్సిస్టు 'మార్క్స్ చాలడు. అంబేద్కర్ కావాలి'.

ఉద్యమాల ఉపాధ్యాయుడు
Andhra Jyothi News Paper Dated : 16/06/2012

లక్ష్మింపేటలో రుధిర సత్యం---కె.కె.కుమార వర్మ


లక్ష్మింపేటలో రుధిర సత్యం

శ్రీకాకుళం మళ్ళీ నెత్తుటి గుడ్డు అయ్యింది. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట సంఘటనల తరువాత నేడు లక్ష్మింపేటలో దళితులపై జరిగిన అమానుష దాడి నాలుగు నిండుప్రాణాలను బలిగొంటూ మనముందు అనేక ప్రశ్నలను వుంచింది. ఈహత్యల వెనక కులం, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటుగా ప్రధానంగా ఈ దేశ అస్తిత్వ సమస్య అయిన భూమి వుంది. 


ఈ ప్రాంతంలోని సువర్ణముఖి, వేగావతి నదీ సంగమ ప్రాంతం మడ్డువలస దగ్గర నిర్మించిన ప్రాజెక్టు కిందవేలాది ఎకరాలపంట భూములు, గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ముంపు బాధితులు అప్పటి అర కొర ప్యాకేజీలతో పొట్టచేత పట్టుకొని చెట్టు కొకరు పుట్ట కొకరైన వారే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం యిచ్చిన నిర్వాసిత స్థలంలో ఇళ్లునిర్మించుకొని వున్నవాళ్ళలో కొట్టిశ, లక్ష్మింపేట గ్రామాల ప్రజలు వున్నారు. ఈ రెండు గ్రామాలు వంగర మండల పరిధిలో వున్నాయి. ఇందులోలక్ష్మింపేటగ్రామంలో 60 ఇండ్లు దళితులలోని మాల వర్గానికి చెందినవి. 



మిగిలిన 80 బిసికాపుకులానికి చెందినవి. వీరంతాతమపాత గ్రామం విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కొత్తగా చేరినవారే. ఈ గ్రామం చుట్టు పరచుకొని వున్న 240 ఎకరాల వ్యవసాయ భూమి బిసివాళ్ళది. దీనికిప్రభుత్వం కాంపెన్సేషన్ చెల్లించి వేసింది. అయినా ఇది ముంపు పరిధి దాటి వుండడంతో ఇందులో 180 ఎకరాలు బిసిలు, 60 ఎకరాలు మాల కులస్తులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమి తమదే కాబట్టి ఆ అరవై ఎకరాలు కూడా తమకే చెందాలని కాపువర్గం దళితులపై వత్తిడి తేవడంతో దళితులంతా ప్రభుత్వానికిఅర్జీ పెట్టుకున్నారు. ఈమొత్తం భూమికి గవర్నమెంటు నష్ట పరిహారం చెల్లించి వున్నందున అది ప్రభుత్వ స్వాధీనంలో వున్నట్టే. దీనిపై ఎవరికీ హక్కులుండవు కాబట్టి సరైనరీతిలో ఇరు వర్గాలను కూచో బెట్టి ఆభూమిని పంపిణీ చేసివుంటే అసలు ఈ రోజు ఇంత దారుణం జరిగివుండేది కాదు. 



న్యాయస్థానాన్ని ఇరువర్గాలు ఆశ్రయించడంతో ఈ మొత్తం భూమిపై స్టేఆర్డరిస్తూ ఎవరూ సాగుచేయకుండా ఆదేశాలిచ్చింది. ఇది బిసిలకు పుండుమీద కారంలా మారింది. గతంలో తమసాగులో వున్న భూమిపై హక్కును, దళితులు అడగడం కారణంగా తాము కోల్పోయామని వారుభావించారు. అందుకు బిసి వర్గానికి చెందిన మాజీ ఎంపిపి అధ్యక్షుడు ఒకరు తమఅధికార పార్టీ అండతో ప్రభుత్వాధికారుల అవినీతి అలసత్వాలను సొమ్ముచేసుకొంటూ సమస్యను తెగనీయకుండా చేస్తూ ఇరు వర్గాలను రెచ్చగొట్టారు; తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ఎత్తుగడలో భాగంగా సమస్యను జటిలం చేయడంలో ప్రధాన పాత్ర వహించారు. 



దీనికి వత్తాసుగా ఉత్తరాంధ్ర మంత్రులు కొందరు కొమ్ము కాయడంతో ఎన్నాళ్ళుగానో రగులుతున్న తమ కక్షను, తీర్చుకునేందుకు ఉపఎన్నికల సందర్భాన్ని(జూన్ 12) వాడుకున్నారు బిసిలు. గ్రామంలో గత ఆరునెలలుగా కొనసాగుతున్న పోలీసు పికెట్‌లోనివారు ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన వేళ దళితులంతా ఉదయం చద్దన్నం తినడానికి ఇంట్లో వున్న సమయంలో కత్తులు బాంబులు రాళ్ళతో కాపు వర్గానికి చెందిన ఆడామగా పిల్లలతో సహావారిపైదాడిచేసి ఇంట్లోంచి ముంగిటకు లాక్కొని వచ్చి వారిని అతి దారుణంగా కొట్టి చంపారు. ఈ దాడిలో, దళితులైన బూరాడ సుందరరావు, చిత్రి అప్పడు , తండ్రీకొడుకులైన నెవర్తి వెంకట్, నెవర్తి సంగమేసులు చనిపోయారు. ఇంకా ఇరవైమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది. 



రాయలసీమ, పల్నాడు ప్రాంతంలోని బాంబుల సంస్కృతిని ఇక్కడ కూడా ప్రవేశపెట్టిన ఘనత ప్రస్తుతం మంత్రిగాఉన్న ఒకప్రముఖ నాయకుడిదని అంతా అంటున్నారు. ఇంత దారుణంగా దళితులపై దాడులు జరిగి నలుగురు హత్య చేయబడి, ఇరవై మందికి పైగా గాయాల పాలై అందులో మరికొంత మంది చావు బతుకుల మధ్యకొట్టుకొంటుంటేకనీసంప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించ లేదు. 



అలాగే కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారం పై కూడా సరైన ఆదేశాలు రాకపోవడం దళితులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో రాష్ట్ర ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరికొంత మంది దళిత నాయకులు రాజకీయ పార్టీల వారు చనిపోయిన మృతదేహాలను ఖననం చేయకుండా మూడు రోజులుగా పోరాటం చేశారు. తత్ఫలితంగా కదలిన అధికార యంత్రాంగం ఆ భూమిలో దళితులకు ఎకరా చొప్పున ఇవ్వడానికి, అలాగే దాడికి పాల్పడిన వారిపై చర్యలకు హామీలిచ్చారు. ఆ తర్వాతనే అంటే గురువారం సాయంత్రం హతులకు అంత్యక్రియలు జరిగాయి. 



ఈ దళిత హత్యాకాండ, దాడి సంఘటనకు ప్రధానంగా రెవెన్యూ, పోలీసుయంత్రాంగం బాధ్యతవహించాలి. అలాగే స్థానిక రాజకీయ నాయకులు తమ అగ్రకుల అధికార మదంతోదళితులను భయ భ్రాంతులను చేశారు. వారిని ఆఊరినుంచి తరిమికొట్టడం ద్వారా మొత్త ం ప్రభుత్వాధీనంలోకి పోయిన భూమిపై హక్కును తామే కైవసం చేసుకోవాలన్న పక్కాప్రణాళిక కూడా ఈ సంఘటనల వెనుక వుంది. ఈ దేశంలోని కులం, వర్గం స్వభావానికి మరో తార్కాణం లక్ష్మింపేట దళితులపై జరిగిన దాడి. దీని సామాజిక, రాజకీయ, ఆర్థిక మూలాలను అర్థం చేసుకోవాల్సి వుంది. కులమొక్కటే ఆత్మ గౌరవ సమస్యగా ఉద్యమాలు చేయడమే సరికాదు. బడుగు వర్గాలవారికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని, హక్కును కల్పించే జీవనోపాధి వనరు భూమిని ప్రధాన సమస్యగా ముందుకు తీసుకురావాల్సినఅవసరమెంతైనా వుంది.ఈ సత్యాన్నే లక్ష్మింపేట ఊచకోత మరోసారి స్పష్టం చేసింది.
విప్లవ రచయితల సంఘం, పార్వతీపురం
Andhra Jyothi News Paper Dated : 16/06/2012 

Tuesday, June 12, 2012

సింహల చరిత్ర కారుడు ప్రొఫెసర్ భుక్యా భంగ్యా -Subjugated Nomads – పుస్తక సమీక్ష By Karthik Navayan

సింహలనుంది ఒక చరిత్రకారుడు ఉద్బవించే వరకు వేటగాడు చెప్పే పిట్ట కథలు కట్టు కథలే చరిత్రగా చలామణి అవుతాయి అనేది ఆఫ్రికాన్ సామెత (Until lions have their historians, tales of the hunt shall always glorify the hunter). ఈ దేశం లో ఆదిమ జాతులు ఆదిమ కులాలు తమ తమ చరిత్రలను తిరగ రాస్తున్న సమయమిది అంటరానితనం అవమానాల పెనుమంటల పెనుగులాట లో నుండి తమ తమ గతాన్ని తవ్వి ఇదిగో ఇది మా చరిత్ర అని వర్తమాన  చరిత్రకారుల డొంకతిరుగుడు వాదనలకు సవాల్ విసురుతున్న నూతన చరిత్రకారుల యుగం ఇది.




ఇపుడు పేదలుగా, అంటబడని వారుగా, కేవలం ఓటర్ లుగా, ప్రబుత్వాలు ప్రవేశపెట్టే వివిధ పథకాలకోసం ఎదిరిచుసే అర్బకులుగా ఉన్న ఆదిమ జాతుల గత చరిత్ర ఏమిటి? ఒక నాలుగైదు వందల సంవత్సరాల కిందకి వెళ్లి చుస్తే వారు ఇలాగే ఉన్నారా?  వారి బ్రతుకులు ఇలాగె  ఉన్నాయ? అనే అనేకానేక ప్రశ్నలకు ప్రస్తుతం చలామణిలో ఉన్న పేరు మోసిన చరిత్రకారుల వద్ద ఆయ ఆదిమ జాతులను సంతృప్తి పరిచే సమాదానం లేదు. ఇది మన ప్రస్తుత విద్యావ్యవస్థ లోని, విద్యాలయాలు చేస్తున్న వివిధ చరిత్ర పరిశోదనల్లోని  డొల్లతనాన్ని తెలియజేస్తుంది. విద్య వ్యవస్థలోని అప్రజస్వమిక దొరనులను తెలియజేస్తుందిప్రస్తుతం సామజిక ఆర్ధిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుతనానికి గురి అయిన కులాలు, జాతులు తమ తమ నిజ  చరిత్రలను తాము మాత్రమే బయటికి తీసుకురావలసి వస్తున్న పరిస్థుతులు కూడా చాల ఆలోచించవలసినవి. ఎందుకు అగ్రకుల చరిత్రకారులు ఈ ఆదివాసుల, అంటారని వారి చరిత్రలను గూర్చి నిజానిజాలను రాయలేక చెప్పలేక పోతున్నారో కూడా ఆలోచించవలసిందే. ఉన్నత విద్య వ్యవస్థ  ఇప్పటికి కొనసాగిస్తున్న కుల, జాతి వివక్ష లో బాగమే అడుగు కులాల, జాతుల నిజ చరిత్రలను దాచి పెట్టడం.అని బావించ వలసి వస్తుంది.ఇంకా చెప్పాలంటే అగ్ర కుల చరిత్రకారులు గనక ఈ దేశ నిజమైన చరిత్రను రికార్డు చేయడమంటే  తమ తమ తాతలు, తండ్రులు ఈ దేశం లోని అడుగు కులాలపై, జతులపై సాగించిన అమానవీయ అణచివేత దోపిడీ దౌర్జన్యాలను రికార్డు చేయడమే.  అంత నీతి, నిజాయితి గలిగిన చరిత్రకారులు ప్రస్తుతమున్న విద్య రంగంలో దుర్బినివేసి వెతికినా దొరకరు. అందుకే అడుగు కులాలు, జాతులు తమ తమ చరిత్రలను తవ్వి తీయవసలిన అవసరం ఇపుడు వచ్చింది

ఆ క్రమంలో, ఆ కర్తవ్య నిర్వహణలో బాగంగా రాసిందే  ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా  రాసిన ” అణచబడిన సంచారులు”(నిజాం పాలనలో లంబాడీలు)  (subjugated  Nomads – the lambadas  under the  rule of  the  nizams ) అనే  తన పీ ఎచ్ డీ పరిశోదన గ్రంధం. లండన్ లోని  Warwick university  లో మూడు సంవస్తరాల వ్యవదిలో ఈ పుస్తకాన్ని రాసారు. దీనిని ఒరిఎంట్ బ్లాక్ స్వాన్ అనే ప్రచురణ సంస్థ 2010  లో ప్రచురించింది. 255  పేజీల ఈ పుస్తకం లంబడిలా గత చరిత్రను మన ముందు ఉంచుతుంది. ప్రస్తుతం అనువాద దశలో ఉన్న ఈ పుస్తకం త్వరలో తెలుగులో కూడా వస్తుంది. లంబడిలా నిజమైన గతాన్ని తెలుసుకోవాలనే వారికీ ఇదొక కరదీపిక  ఈ పుస్తకంలో ఎ విషయం కూడా అధరాలు లేకుండా లేదు. ప్రతి వాక్యానికి రేఫెరన్స్ ఉంటుంది. ఈ పుస్తకాన్ని రాయడానికి ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా  నిజాం పరిపాలన కు సంబందించిన అనేక రాత  ప్రతులతో పాటు నిజాం/ బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో పాటు  అనేక  వేల పుస్తకాలను చదివారు. ఆ పుస్తకాల లిస్టు ఈ పుస్తకం చివరలో ఇచారు
ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, అణచబడిన, అంటారని జాతుల చరిత్రలను విద్య రంగ పరిధిలోని తీసుకోచిన మొట్ట మొదటి పుస్తకం  యిదే. ఈ దారీ లోనే అన్ని అణచబడిన కులాలు అణచబడిన జాతులు  తమ తమ నిజమైన చరిత్రలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆయ దళిత ఆదివాసి సమూహాలకు చెందిన విద్యా వేతలైన ఈ పని చేయవలసి ఉంది
ఒకప్పుడు స్వయం సంవృద్ది తో రాజీలేని జీవితం గడిపిన ఆదిమ జాతులు వలస పాలనా కాలంలో బ్రిటిష్  వారితో కలిసి  వారి తాబెదరులయిన స్థానిక అగ్ర కుల  అధికారులు ప్రవేశపెట్టిన పరిపాలన సంస్కరణల వల్ల తమ తమ వ్రుతులు, ఉపాది కోల్పోయి. తమ జీవన వైవిధ్యాన్ని కోల్పోయి ప్రస్తుతపు పేదవారుగా అన్ని రంగాలలో వెనుకబడిన జాతులుగా మిగిలి పోయారు. ఈ చారిత్రక పరిణామా క్రమాన్ని పట్టి యిచేదే ఈ పుస్తకం. మరొక ముఖ్య విషయం ఏమిటంటే లంబాడ జాతి ఆయా సంస్కరణల వాళ్ళ తమ జాతికి ఉనికికి ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు అనివార్యంగా తమను తాము హిందూ మతం లో ఒక కులంగా బావించుకొని బాగామైపోయే క్రమాన్ని ఈ పుస్తకం పట్టి చూపిస్తుంది
ప్రధానంగా హైదరాబాద్ డెక్కన్ లోని లంబాడి జాతి ఎ సంస్కరణల వల్ల, ఎ పరిపాలన విధానాల వల్ల తమ సాంస్కృతిక వైవిధ్యాన్ని కోల్పోయి  వర్తమాన కాలం లో  తమ తమ కన్న   బిడ్డలను అమ్ముకొనే దుర్బర పరిస్థితులకు గరయ్యిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఒక నాలుగైదు వందల సంవత్సరాల వెనకకు వెళ్లి చుసినట్టైతే లంబాడీలు ఇపుడున్న సామజిక ఆర్థిక పరిస్థుతులకు బిన్నమైన పరిస్తులను కలిగి ఉన్నారు. యిప్పటిలగా అపుడు వారు తమ కన్నా బిడ్డలను అమ్ముకొనే దుర్బర దారిద్ర్య పరిస్తులలో లేరు. వారు స్వయం సంవృద్ది కలిగిన అప్పటి వ్యవసాయ మరియు వాణిజ్య రంగాలకు అత్యంత ముఖ్యమైన రవాణా రంగాన్ని నిర్వహిస్తున్న వారు. అంతే కాకుండా అపుడు సైన్యాలు యుద్దానికి ఎక్కడికైనా బయలుదేరవలసి వస్తే ఆ సైన్యానికి సంభందించిన యుద్ద సామగ్రిని మరియు ఆహార సామగ్రిని సైన్యం తో పాటు తరలించేది లంబాదీలే
లంబాడీలు ప్రధానంగా పశువుల పెంపకం దారులు ఒక్కొక్కరికి వందలు మరియు వేల సంక్యలో పశువులు ఉండేవి. ఈ పశువుల ద్వారానే వీరు రావణ రంగాన్ని నిర్వహించేవారు. హైదరాబాద్ డెక్కన్ లోని అప్పటి వాణిజ్య వ్యాపార వ్యవస్థ అంత లంబడిలా పై ఆధారపడి మనుగడ సాగించింది. వ్యవసాయ ఉత్పతులైన ఉల్లిగడ్డలు, బియ్యము, గోదుమలు మార్కెట్ కు తరలించడానికి లంబదీలే ప్రధాన ఆదారం. బ్రిటిష్ వలస పాలనా కంటే ముందు రవాణా రంగం అంత లంబాడీల పైననే ఆధారపడి ఉండేది.
నూతన సాంకేతికత వాళ్ళ వచ్చిన రైల్వీలు, తద్వారా వచ్చిన పెద్ద కంపనీలు  చిన్న స్థాయి వ్యాపారంగా కొనసాగిన లంబడిలా రావణ రంగాన్ని దెబ్బతీసి వారిని రోజు వారి కూలీలుగా మార్చివేశాయి. అలాగే బ్రిటిష్ వారు తీసుకోచిన చట్టాలు ( cattle  tress pass  act – 1857 , మరియు criminal  Tribes  Act )   అన్ని లంబడిలా జీవితాలను వారి జీవన వైవిధ్యాన్ని నియంత్రించేవి మాత్రమే కాకుండా వారి పశువుల పెంపకాన్ని కూడా నియంత్రించాయి మరియు లంబదిలను నేరస్త జాతిగా ముద్ర వేయడానికి దోహద పడ్డాయి
మామూలుగానైతే  ఏదైనా పంటను లంబదిలకు చెందిన పశువులు నాశనం చేసినట్లయితే, లంబాడీలు ఆయ పంట చేనులను పశువుల పేడతో నింపడం ద్వార పరిహారం చెల్లించేవారు కానీ బ్రిటిష్ పాలనా కాలం లో వచ్చిన చట్టాల వలన చెల్లించవలాసిన పరిహారం రుపయలలోకి మారి  అదీ  పెరిగి లంబాడీలు తమ తమ పశువుల ను దూరం చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే దోపిడీలు అనేవి కూడా లంబదిలకు పుట్టుకతో వచినవి కాదు వారసత్వంగా వచ్చినది కాదు. బ్రిటిష్ వలస పాలనా సంస్కరణలు వారి తాబెదారులైన స్వదేశీ అగ్రకుల పలక వర్గాల విధానాల వలన తమ తమ జీవనోపాదులు కోల్పోయి గత్యంతరము లేక ఎంచుకున్నదే. ఈ విషయాన్నీ ఈ పుస్తకం అనేక చారిత్రక ఆధారాలతో నిరూపిస్తుంది
అణచబడిన, అంటారని, ఆదివాసి ప్రజల నిజ చరిత్ర లను విద్య వ్యవస్థ పరిదిలోని తీసుకు రావాల్సిన అవసరాన్ని ఈ పుస్తకం నెరవేర్చింది ఇలాంటి పుస్తకాలు అన్ని ఆదివాసి అంటారని సమూహాలపై రావాల్సిన అవసరం ఉంది. అనేక అంటారని కులాలు తెగలు క్రమ క్రమంగా అంతరించి పోతున్నాయి. వన్యప్రాణి సంరక్షణ పేరుతో అటవీ సంరక్షణ పేరుతో అడవి జంతువులను అడవులను కాపాడేందుకు ప్రణాళికలు వేస్తున్న పాలకులు అడవే ఆధారంగా జీవనం సాగిస్తున్న ఆదివాసులను ఇతర అంటారని  సమూహాలకు సంబంధించి ఎ ప్రణాళిక లేదు ఉన్న పతకాలేవి వారి అవసరాలను తీర్చేవిధంగా లేవు కావున ఆయ సమూహాల పై వారి జీవన వైవిద్యాల పై పరిశోదన అనేది తక్షణం అవసరం
ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్టీ లలో 30 వరకు తెగలు ఉన్నాయి ఏవో కొన్ని తెగలు తప్ప ఇంకా అనేక తెగలు విద్య కు వైద్యానికి నోచుకోని దశలోనే ఉన్నాయి అలాగే ఎస్సీ లలో 61 కులాలు ఉంటె మాల మాదిగా తప్ప మిగతా కులాలు ఎవరికీ తెలియవు వారు ఎ పరిస్తులలో జీవనం సాగిస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. నాగరికులుగా చెప్పుకుంటున్న ప్రస్తుత సమాజం లో నుండి కొన్నీ తెగలు కులాలు క్రమ క్రమంగా ఆర్తనాదాలతో అంతరించి పోతున్నాయి యిది ఎ సమాజానికైనా మంచి పరిణామం కాదు. ఈ పరిస్థితి వారి గురుంచి చరిత్రకారులు, మేధావులు, విద్యవేతలు తక్షణం ఆలోచించవలసిన అవసరం ఉండి. ఆయా అణచబడిన సమూహాలనుండి చరిత్రకారులు ఉద్బవించ వలసి ఉన్నది. వర్తమాన  చరిత్ర కారుడు ప్రొఫెసర్ భూక్యా  భంగ్యా లాగే  అనేక మంది సింహాల చరిత్రకారులు ఆయా అణచబడిన జాతులనుండి , కులాల నుండి ఉద్బవించ వలసి ఉన్నది
- బత్తుల కార్తీక్ నవయన్
రిసెర్చ్ స్కాలర్
ఆంగ్లము మరియు విదేశీ బాషల విశ్వ విద్యాలయము
తార్నాక , హైదరాబాద్.

హక్కుల కోసం ఆదివాసీల పోరాటం---విజూ కృష్ణన్‌



1537లో అమెరికాలో రెడ్‌ ఇండియన్ల పరిస్థితి ఎలా ఉందో భారతదేశంలో ఆదివాసీల పరిస్థితి కూడా అలాగే ఉంది. రెడ్‌ ఇండియన్లు కూడా మనుషులేనని, వారికి కూడా ఆత్మ, ఆలోచనలు ఉంటాయని పోప్‌ చేసిన హితోక్తిని సైతం ఐరోపాలోని పాలకవర్గాలు, వలసవాదులు పట్టించుకోలేదు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి. భారతదేశంలో ఆదివాసులదీ అదే పరిస్థితి. ఇక్కడ చట్టాలు కాగితాలకే పరిమితం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కాగితాల్లో నిబంధనలు కాగితాలకే పరిమితం, ఆచరణకు నోచుకోవు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీరు మంచ్‌ (ఎఎఆర్‌ఎం) మే 25 నుంచి 27 వరకూ తమిళనాడులోని కూనూర్‌లో జరిపిన సమావేశంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్ష, వారిపై జరుగుతున్న దాడులను సమీక్షించింది. ఆదివాసీలకు సమానత్వం, గౌరవంగా జీవించే హక్కు కల్పించే రాజ్యాంగం, చట్టాల నిబంధనలు కాగితపు చట్టాలుగానే మిగిలిపోయాయి. ఎఎఆర్‌ఎం కేంద్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు ఈ విధంగా ఉన్నాయి.
ఖనిజ వనరుల లూటీ
ఖనిజ సంపద ఆదివాసీ ప్రాంతాల్లోని గనుల నుంచే ఎక్కువగా లభ్యమవుతోంది. పర్యావరణం, ఆదివాసీల గౌరవం, హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం చట్టాలకు, శాసనాలకు ఎటువంటి లోటూ లేదు. అయితే అవి కార్మికులు, భూమి, ఖనిజ వనరుల లూటీని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు వాటిపై, ఆదివాసీ ప్రాంత భూములపై తిరుగులేని హక్కులు కట్టబెట్టేవిగా ఉన్నాయి. గిరిజనుల హక్కుల పరిరక్షణ పేరుతో చట్టాలు ఉన్నప్పటికీ వాస్తవానికి వారి రక్తాన్ని, వనరులను హరించివేసేవిగా ఉన్నాయి. వారు నివాసముంటున్న ప్రాంత పర్యావరణాన్ని సరిదిద్దడానికి వీలు లేకుండా దెబ్బతీస్తున్నాయి. వారిని భూమి నుంచి, అడవుల నుంచి పారదోలే విధంగా ఉన్నాయి. గిరిజనుల హక్కుల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం చేసిన చట్టాల్లో 2011, ఖనిజాలు, గనుల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు (ఎంఎండిఆర్‌ఎ) ఒకటి. గనుల రంగంలో విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించారు. ఖనిజ సంపదను వెలికితీసేందుకు ఎఫ్‌డిఐ అవసరమనే వాదన ఈ చట్టానికి ప్రాతిపదిక. గనుల రంగంపై నియంత్రణను ఈ చట్టం ఎత్తివేస్తుంది. భారత కంపెనీతో ఒప్పందం చేసుకుంటే మైనింగ్‌ లీజ్‌ పొందేందుకు విదేశీ కంపెనీలను అనుమతిస్తుంది. బొగ్గు కంపెనీలు దయార్ద్ర హృదయంతో 26 శాతం లాభాలను జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థకు ఇస్తాయి. ఇతర ప్రధాన ఖనిజాల విషయంలో వార్షిక రాయల్టీ మొత్తానికి సమానంగా ఇస్తాయి. ఖనిజావృద్ధి సంస్థలో ఖనిజాల యజమానులు, అధికారగణం ఆధిపత్యం చెలాయిస్తారు. గిరిజన సమాజాలకు కల్పించిన ప్రాతినిధ్యం నామమాత్రమే. భారతదేశంలో రాయల్టీలు ఆ కంపెనీలు సంపాదించే లాభాలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉంటాయి. పిఇఎస్‌ఎ సంప్రదింపుల ప్రక్రియకు తిలోదకాలిచ్చింది. గిరిజన కుటుంబంలో ఒక సభ్యునికి ఒక్కొక్క వాటా ఇస్తామని హామీ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థల నిబంధనల ప్రకారం గిరిజనుల ముందస్తు అనుమతి పొందకుండా గనులు తవ్వకూడదు. గిరిజనుల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి ప్రాజెక్టులను అనుమతించకూడదు. వనరులపై గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పించాలి. స్థానిక ప్రజల సహకార సంఘాలను ఏర్పాటుచేయాలి. ఆదివాసీల హక్కులను భూమి, అడవులకే పరిమితం చేయకుండా ఖనిజ సంపదకు కూడా విస్తరింపజేయాలి.
ఏనుగుల విహారానికి హక్కు
అటవీ శాఖ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో సేగూర్‌ పీఠభూమిలో కృత్రిమ ఏనుగు కారిడార్లను నెలకొల్పింది. ఆ ప్రాంతంలోని ఆదివాసీలు, చిన్న, మధ్యతరహా రైతుల భూములు, జీవనోపాధి దీనివల్ల దెబ్బతిన్నది. భారత వన్య ప్రాణి ట్రస్టు, ప్రాజెక్టు ఎలిఫెంట్‌, అడవులు, పర్యావరణ శాఖ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రాతిపదికగా కారిడార్‌ను సృష్టించారు. ప్రభుత్వం దీనిని 2006లో ఆమోదించింది. మొత్తం 88 ఏనుగు కారిడార్లున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో నాలుగు సేగూర్‌ పీఠభూమిలో ఉన్నాయి. మొత్తం 83.42 ఎకరాల ప్రయివేటు భూమిని ఇందుకు కేటాయించారు. ఈ కారిడార్లకు ఉద్దేశించిన ప్రాంతాన్ని శాస్త్రీయ ప్రాతిపదికగా, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయలేదు. అటవీ శాఖ ఏకపక్షంగా ఈ విస్తీర్ణాన్ని ఏడు వేల ఎకరాలకు విస్తరించింది. ఈ ప్రాంతం దీర్ఘకాలంగా ఆదివాసీలు, చిన్న రైతులు, ఇతరుల నివాస ప్రాంతంగా పేరుగాంచింది. ఒక్క మసీనాగుడి పంచాయతీ పరిధిలోనే 18 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో సుమారు సగం మంది దళితులు, ఆదివాసీలున్నారు. షోలూర్‌ పంచాయతీ పరిధిలో 1,750 మంది ప్రజలు నివసిస్తున్నారు. అందులో 70 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉన్నారు. అటవీశాఖ చర్యల ఫలితంగా వీరందరూ ప్రభావితులు కానున్నారు. ఏనుగులకు రక్షణ కల్పించే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఏనుగులు దాడి చేయకుండా ఆ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పిస్తుంది. ఏనుగుల దండు దాడి చేయడం వల్ల చిన్న రైతులు, ఆదివాసీల జీవనోపాధికి ఇబ్బందులు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటవీ హక్కుల పరిరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ విషయంలో నిబంధనను ఉల్లఘిస్తున్నా పట్టించుకునే నాథుడు ఉండటం లేదు. ఏనుగుల సంరక్షణ పేరుతో గిరిజనులు గౌరవంగా జీవించే హక్కులను హరిస్తున్నారు.
ఆదివాసీల కదలికలపై నియంత్రణ
ఏనుగుల స్వేచ్ఛా విహారానికి న్యాయపరంగా, అధికార యంత్రాంగపరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ నివాసముంటున్న ఆదివాసీల కదలికలపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తేయాకు ఎస్టేట్స్‌లో ప్రవేశానికి ప్రజలకు అనుమతి నిరాకరిస్తున్నారు. నీలగిరి కొండల్లోని ఆదివాసీలకు ప్రభుత్వ రహదారుల్లోనూ, ప్లాంటేషన్‌ యజమానులు వేసిన ప్రయివేటు రోడ్లలోనూ ప్రవేశం కల్పించడం లేదు. నీలగిరి కొండల్లో అనేక ఎస్టేట్లు, వీటి పరిసర ప్రాంతాల్లో ఆదివాసీ హామ్లెట్లు తరతరాలుగా ఉంటున్నాయి. ఆదివాసీల కదలికలను అడ్డుకునేందుకు ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ 122 గేట్లు ఏర్పాటు చేసింది. ఆ రోడ్డు మీద వాహనాల రాకపోకలను కూడా నియంత్రించారు. ఒకవేళ అనుమతించినా టోల్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇలా దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతోంది. రాత్రి సమయాల్లో గేట్లు మూసివేస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సివచ్చిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజా రవాణా సర్వీసులు, అంబులెన్స్‌ల రాకపోకలను కూడా నిషేధిస్తున్నారు. ఈ ఎస్టేట్స్‌లోని ఉద్యోగుల్లో సుమారు 9 శాతం మంది ఆదివాసీలే. భద్రత కోసమే ఈ గేట్లను ఏర్పాటుచేసినట్లు చెప్పుకుంటున్న మేనేజ్‌మెంట్‌ వాటిని దళితులు, ఆదివాసీలు నివాసముంటున్న ప్రాంతాల్లో నిర్మిస్తుండటం విశేషం. ఈ రోడ్లను అక్కడి ప్రజలు దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఉన్న హామ్లెట్లకు చేరుకోవడానికి వారు ఈ రోడ్లను ఉపయోగిస్తున్నారు. ఎస్టేట్స్‌లో సర్వీసు రోడ్లు నిర్మించిన ప్రాంతం దశాబ్దాలుగా ఆదివాసీల యాజమాన్యంలోని పట్టా భూములే. మేనేజ్‌మెంట్‌ తన ఏకపక్ష చర్యల ద్వారా ప్రజలకు అసౌకర్యాన్ని, ఇబ్బందులను సృష్టిస్తోంది. ఏ సమయంలోనైనా ఈ రోడ్డును వినియోగించుకునే అధికారం ప్రజలకుంది. ఈ రోడ్డుపై మేనేజ్‌మెంట్‌ టోల్‌ ఛార్జీలను వసూలు చేయడం, పాస్‌లు మంజూరు చేయడం, ప్రజలు ఈ రోడ్డును ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం. తమిళనాడు ఆదివాసీ అసోసియేషన్‌ క్రెగ్‌మోర్‌, సుల్తానా ఎస్టేట్‌ల అక్రమాలను అడ్డుకుని ప్రభుత్వ రోడ్లపై ప్రవేశాన్ని పునరుద్ధరించగలిగింది.
ఆశ్రమ పాఠశాలలు-గిరిజన హాస్టళ్లు
మహారాష్ట్రలోని 75-80 ఆశ్రమ పాఠశాలలు, జార్ఖండ్‌లోని గిరిజన హాస్టళ్లల్లో విస్తృతమైన సర్వే నిర్వహించగా దిగ్భ్రాంతిగొలిపే వివరాలు వెలుగుచూశాయి. తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు, ముఖ్యంగా సైన్స్‌, గణితశాస్త్రం బోధించేవారు లేరు. అనేక పాఠశాలల్లో ఈ పాఠ్యాంశాలను బోధించడం లేదు. రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులను నియమించినప్పటికీ వారు అరుదుగా మాత్రమే పాఠశాలల్లో ఉంటారు. విడిగా తరగతి గదులు, నివాస ప్రాంతాలు లేవు. ఉదయం పూట క్లాస్‌రూమ్‌లు రాత్రిపూట హాస్టళ్ల అవతారం ఎత్తుతాయి. అక్కడ వంటవారే వార్డెన్లు. బాలికల పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. బాలికలకు విడిగా స్నానాల గదువు లేవు. పాఠశాలల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాలి. విద్యార్థులు చెరువులు, కుంటల్లో స్నానాలు చేయాల్సిందే. స్కాలర్‌షిప్పు మొత్తం ఎందుకూ కొరగానిదిగా ఉంది. అవి కూడా అవసరమైన లబ్ధిదారులకు చేరవు. అసోంలో గత మూడు సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వడం లేదు. గిరిజన విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు లేవు. అక్కడ పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయి. అణచివేతకు గురవుతున్న వర్గాల విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి సానుకూలమైన పరిస్థితులు అక్కడ లోపించాయి. అటవీ హక్కుల చట్టం అమలులో లోపాలను వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యులు తెలియజేశారు. తమిళనాడులో 23 వేల దరఖాస్తులు రాగా 3,200 మందికి మాత్రమే పట్టాలిచ్చారు. నీలగిరి కొండల్లో సంప్రదాయబద్ధంగా తోడా గిరిజనులకు వారసత్వంగా ఉంటున్న భూములను స్వాధీనం చేసుకున్నారు.
ఆశ్రమ పాఠశాలలు, గిరిజన హాస్టళ్లు, స్కాలర్‌షిప్పు సమస్యలను పరిష్కరించేందుకు ఎస్‌ఎఫ్‌ఐతో సమన్వయంగా పోరాటం ఉధృతం చెయ్యాలని సిఇసి సమావేశం నిర్ణయించింది. ఈ పాఠశాలల పరిస్థితులపై సర్వే నిర్వహించి మానవ వనరుల అభివృద్ధి శాఖకు తగిన చర్యల నిమిత్తం సమర్పిస్తుంది. ఆదివాసీలందరికీ రేషన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ జులై 30 నుంచి ఆగస్టు 3 వరకూ వామపక్షాలు నిర్వహించనున్న ధర్నాల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించింది. ఖనిజ వనరులు, గనులు ఉన్న రాష్ట్రాల్లో ఎంఎండిఆర్‌ఎ బిల్లు వల్ల ఒనగూరే ప్రమాదాల గురించి ప్రజలను చైతన్యపరచి ఆదివాసీల హక్కుల పరిరక్షణకు వారిని సమీకరిస్తారు. స్థానిక సమస్యలపై రాష్ట్ర స్థాయి పోరాటాలను నిర్వహిస్తారు.
-విజూ కృష్ణన్‌
Prajashakti News Paper Dated : 10/06/2012 

గద్దర్:ఒక దృశ్యకావ్యం--- కత్తి పద్మారావు



సహజంగా వాగ్గేయకారులుగా సమాజం ముందు నిలబడ్డవారికి కవిగా, తాత్వికుడిగా, ఆర్గనైజర్‌గా, విశ్లేషకుడిగా, నృత్యకారుడిగా పేరురాదు. కాని, గద్దర్‌లో ఈ అన్ని లక్షణాలు ఒక సమాహారంగా వున్నాయి. అందుకే ఆయన మాటకు పాటకు ప్రాధాన్యత వచ్చింది. ఈమధ్యకాలంలో ఆయన ఉపన్యాసాలు కూడ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. సందర్భానికి అనుగుణంగా వ్యంగ్యాత్మకమైన బాణాలను సంధించడంలో ఆయనకొక ప్రత్యేకత వుంది. గద్దర్‌గారు నాకు 1975 నుండి తెలుసు. ఆంధ్రదేశంలో ’హేతువాదాన్ని’ ఒక ఉద్యమంగా తీసుకెళ్లే పనిలో నేను 1981లో హేతువాద మహాసభలను తెనాలిలో చాలా పెద్దఎత్తున జరిపినపుడు గద్దర్‌గారిని పిలిచాము. ఆయనకు నా చేత్తో ’డప్పు’ను కానుకగా యిచ్చాము. అప్పటికే విప్లవాన్ని, సామాజికవిప్లవాన్ని జోడించి పాడే గద్దర్‌గారికి చాలా ప్రఖ్యాతి వుండేది. 
1980 దశకంలో తెలంగాణాలోకాని కోస్తాంవూధలోకాని పేరు చెబితే జనం వచ్చేవారు కొందరే వుండేవాళు.్ల అందులో గద్దర్ మొదటివరుసలోనివాడు. ఆయన పాటల్లో ఒక తత్త్వం, ఒక ధర్మం, ఒక ఆవేశం, ఒక చర్య ఉండేవి. తెలుగువారి గుండెలో,్ల మెదళ్లలో ధర్మావేశాన్ని కలిగించాయి. శ్రీశ్రీ మహావూపస్థానం 1933 ప్రాంతాల్లో రాసింది. అది వచన కవిత. ఆ కవితలు చదివి కమ్యూనిస్టు ఉద్యమంలోకి చాలా మంది మధ్యతరగతివారు వచ్చారు. కాని ప్రజాసమూహాల్లో నక్సల్‌బరీ ఉద్యమ ప్రభావాన్ని తీసుకొచ్చింది గద్దర్, వంగపండు. వారు ప్రజలపై చూపిన ప్రభావం చరివూతాత్మకమైంది. నేను చిన్నప్పటినుండి పాటలురాస్తూ వుండేవాడిని. పాటగాళ్ళం ప్రాణం. మా చిన్నతనంలో నాజర్ బుర్రకథ, బండారు రామారావు, చెంచురామారావు, అద్దంకి మాణిక్యరావుల పద్యనాటకాలు చూసేవారం. వీళ్ళందరూ దళిత బహుజనుల నుండి వచ్చినవారే. ఆ తరువాత హేతువాద ఉద్యమంలో మేము వంగపండు, గద్దర్ పాటలకు అభిమానులుగా మారాం.

వీళ్లిద్దరూ బహుజనులే. ఈ నాలుగు దశాబ్దాల్లో బ్రాహ్మణుల్లో పుట్టిన వారెవరూ మమ్మల్ని ప్రభావితం చేయలేకపోయారు. కారణం వారి భాష, శ్రుతి మా చెవులకు అందలేదు. సాహిత్య విద్యార్ధిగా భట్టుమూర్తి రామరాజ భూషణుని ’వసుచరిత్ర’, పరవస్తు చిన్నయ్యసూరి ’నీతి చంద్రిక, తరువాత వేమన్నను, పోతులూరి వీరవూబహ్మాన్ని ఇష్టపడేవాళ్ళం. వచనకవిత్వ ధారకు వచ్చిన కొత్తల్లో శ్రీశ్రీని, బాలగంగాధర్ తిలక్‌ను ఇష్టపడేవాళ్ళం. జాషువాను చదివాక విషయపరంగా ’గబ్బిలం’ ముందుకు వచ్చింది. గద్దర్‌గారిపాటలు విన్నాక నాకు వేమనలో వున్న తెలుగు, సూటిదనం ఆయనలో కనిపించాయి. చిన్నయ్యసూరిగారి ’నీతిచంవూదిక’లోని ప్రకృతిని, జంతువులను ఉదహరిస్తు చెప్పే పద్ధతీ, పోతులూరి వీరవూబహ్మంలోని భవిష్యత్ దర్శనం, జాషువాలోని దళితతత్వం గద్దర్‌గారిపాటల్లో చూశాను. గద్దర్‌పాటలు వింటున్నపుడు ఉన్నంతగా చదువుతున్నప్పుడు బలంగా వుంటాయా అనే అనుమానం వుండేది. వింటున్నపుడే నోటి కొచ్చే గుణంవాటిలో వుండేది. ఆయనలో సున్నితత్వం ఉంది. పాటకు పాటకు మధ్య ఆయన అమరవీరుల గురించి, పేదలగురించి గుండెలు ద్రవించే మాటలు చెబుతారు. అదంతా కవిత్వమే. గద్దర్‌ని వాగ్గేయకారుడిగా తేల్చాలని వి.ర.సం. భావించింది. విరసంలో చెరబండరాజు రాసిన ’కొండలు పగలేసినం’ గద్దర్ బ్యాలేగా ’పాడింది ఖమ్మంలో చూశాను. అప్పుడు నేను ఉపన్యాసకుడిగా, ’గద్దర్’ గాయకుడిగా మొదటి వరుసలో వున్నాం. ఇద్దరం సభకొస్తే వేలాది మంది ప్రజలు వచ్చేవారు. గద్దర్ వస్తున్నాడంటే నేను సభకు అంగీకరించేవాణ్ణి. ఆయన కవిత్వం వినడానికి ఎదురువచ్చి కూర్చునేవాణ్ణి. మాకు అప్పుడు ఇద్దరం దళితులమే అనే స్పృహలేదు. ఒకసారి పొన్నూరులో కె.వి.రమణాడ్డిగార్ని సభకు పిలిచాము. ఆయన రాసిన ’కవి కోకిల’ ’మహోదయం’ అనే గ్రంథాలు ఇచ్చారు. వారి అమ్మాయి, అల్లుడు పొన్నూరులో డాక్టర్లుగా పని చేస్తున్నారు. ఆయన తరచూ వస్తుంటారు. వారిని అడిగాను- మీరు వ్రాసిన వాటిలో ఒకాయన ’రెడ్డి’, ఒకాయన బ్రాహ్మణసంస్కర్త. దువ్వూరిరామి రెడ్డి భూస్వామ్య భావాలకు ప్రతినిధి, గురజాడ బ్రాహ్మణ సంస్కర్త. మరి విప్లవ భావాలను పాటలో తెస్తున్న గద్దర్ మీద ఒక పుస్తకం ఎందుకు వ్రాయలేదని’ అడిగాను. తరువాత ఆయన గద్దర్‌మీద పెద్దవ్యాసం రాశారు. అప్పుడు మేము ప్రతి ఆదివారం ఒకొక్క మేధావిని ఉపన్యాసకుణ్ణి పొన్నూరు పిలిచి మా ఇంటిలో ఆతిధ్యం ఇచ్చేవారం. ’జ్వాలాముఖి’ని పిలిచాను. ఆయన గొప్ప ఉపన్యాసకుడు. అయితే ఆయన ఉపన్యాసంలో మంచికి, చెడుకి బ్రాహ్మణులనే ఎక్కువ ఉటంకిస్తున్నాడు. ఇది ఆశ్చర్యం వేసింది. ’జాషువా’నిగాని, వేమన్ననుకాని అంబేద్కర్‌నుకాని, గద్దర్‌ని కాని పేర్కొనలేదు. ఆ తరువాత నేను మాట్లాడేను. విప్లవ రచయితలకంటే కూడ గద్దర్, వంగపండు, అరుణోదయ రామారావు వీళ్ళు మంచి తెలుగు కవిత్వం రాస్తున్నారు. వారిపాటల్లో ఈ వి.ర.సం.వారి వచన కవిత్వంకంటే కూడ మంచి తెలుగు వస్తున్నది. ప్రతీకలొస్తున్నాయి. వ్యంగ్యము, ధ్వని వస్తున్నాయి’ అన్నాను. భోజనాల సమయంలో కూడ చర్చ జరిగింది. జ్వాలాముఖి హిందీలో పండితుడు. నిఖిలేశ్వర్ కూడ హిందీలో పండితుడే. సంస్కృతపదాలనే మిక్కుటంగా కవిత్వంలో వాడేవారు. ఇకపోతే ఎక్కువ హిందీ కవిత్వాన్ని అనువదించేవారు. 1971లో నేను జనగీతం రాసి వారిద్దరిని పీఠిక రాయమన్నాను. అప్పటికి వచ్చినకవిత్వంలో అది మొదటి దళిత కవిత. 

అర్దరేతిరికాడ
అరగాలిన పీనుగుల 
పడదోసికాలుస్తుండు ఓడురా వాడు 
భారతమ్మోరి కడగొట్టు కొడుకా, 
పెద్దోళ్ళు నలుగురు 
వెలిబెట్టివాణ్ణి 
సోద్దెంగ చూస్తూ 
నవ్వుతుందేరా 
బిడ్డల్ని కందా! 
గడ్డల్ని కందా! 
(కడుపు తీపి - జనగీతం)

దీనిమీద జ్వాలాముఖి పెద్ద పీఠిక వ్రాశాడు. విరసంలోకి ’దళిత’ వస్తువు రాలేదని ఒప్పుకొన్నాడు. కాని జననాట్యమండలి అలా కాదు. పేద ప్రజల గుండె చప్పుళ్ళు వినిపించింది. ఇటీవల వరవరరావు కవిత్వం బృహత్‌సంకలనం చూశాను. ఆయన పీఠికల్లో ఎక్కడ గద్దర్ ప్రస్తావన లేదు. విప్లవేతర బ్రాహ్మణుల గురించి ఎందరి గురించో గుర్తు చేసుకున్నారు. ఎన్ని సభల్లో వరవరరావు గద్దర్ పాటలు వినివుంటాడు. ఆ స్పందన వ్యక్తం చేయలేదంటే సొంత సంస్థలోనే ఆయన ఎంత కుల వివక్షను అనుభవించి వుంటారో అనిపించింది. బ్రాహ్మణులు ఏ ఉద్యమాల్లోవున్నా నోటితో దళితులను ప్రశంసిస్తారేమోకాని రాతలో ప్రశంసించరు. అందుకే గద్దర్ తన పాటమూలాలను తానే చెప్పుకొన్నాడు. ఈ ప్రభావం గద్దర్ మీద కూడ పడింది. తన సమకాలికులను రాత పూర్వకంగా, నోటి పూర్వకంగా ప్రశంసించడంలో గద్దర్ వెనకబడేవున్నాడు. ఇది విరసం ప్రభావంతోనే జరిగిందని నేను అనుకొన్నాను. గద్దర్‌కు అనేక అస్పష్టతలు వున్నాయి. సిద్దాంతపరంగా, జీవనక్షికమంపరంగా, అభివ్యక్తిపరంగా ఎన్నివున్నా ఆయన ఈ యుగంలో ఒక లెజెండు కావడనికి కారణం ఆయన పాటలోని కవిత్వం. ఆయన గొంతులోని ’మెలొడీ’. ఆయన హృదయంలోని సున్నితత్వం. తెలుగుపాటపై సాహితీ విమర్శలో వివక్ష:


వచన కవిత్వం మీద వచ్చిన విమర్శ పాటమీద రాకపోవడం బ్రాహ్మణ పక్షపాతమే. పాటలు ఎక్కువగా దళిత బహుజనులు రాస్తున్నారు. ఈపాటల మూలాలు వి.ర.సం. బ్రాహ్మణులకు కూడ తెలియదు. ఒకసారి తిరుపతిలో యూనివర్సిటి విద్యార్థ్ధుల సభకు పిలిచారు. త్రిపురనేని మధుసూదనరావు అంటే నాకెంతో అభిమానం. బాగా చదవరి. ఉపన్యాసకుడు కూడ. నేను హేతువాద నాయకుడు నాగసిద్ధాడ్డిగారింట్లో దిగేవాడిని. వారి దగ్గరకు వెళ్ళాం. వారితో సంభాషణల మధ్యలో వి.ర.సం. ప్రస్తావన వచ్చింది. త్రిపురనేని రామస్వామికి దాయాదులు అవుతారు. వారిదీ గుడివాడే. కవిత్వము, చైతన్యమూ పుస్తకం ప్రసిద్ధి చెందింది. ఆయనకు విరసంలోని బ్రాహ్మణ రచయితలమీద అసంతృప్తి వుంది. ఆయనఅప్పుడు కె.జి. సత్యమూర్తి శివసాగర్ ప్రభావంలో వున్నాడు. గద్దర్ గురించి ఆయన పట్టించుకొని మాట్లాడే స్థితిలో లేడు. కారణం ’పాట’లో అత్యున్నతమైన కవిత్వం వుంటుందని వారు గుర్తించకపోవడమే. గద్దర్‌గారు ఇవన్నీ పట్టించుకొనేవారు కాదు. వారందరికి గద్దర్ వినవూమంగా ఉండేవాడు. పెద్దలతో వివాదపడటం ఆయన స్వభావం కాదు. ఒక సాహిత్య చరివూతకారుడిగా నేనే ఆయన తరుఫున మాట్లాడేవాణ్ణి. ఆ విషయం గద్దర్‌కి తెలియదు. నేనెప్పుడూ ప్రస్థావించలేదు. ఇదంతా సాహిత్య చరివూతలో భాగంగానే నేను చూసేవాడిని. కాని ఇతరం కాదు. గద్దర్ మీద మీకు అంత అభిమానం ఎందుకు అని చాలా మంది అడిగారు కాని చెప్పే అవకాశం ఇప్పుడే వచ్చింది. అది కుల పరమైందని కూడ కొందరు అభియోగం వేశారు. గద్దర్‌కాని, నేనుకాని కుల సంఘాల నుండి వచ్చిన వారంకాదు. నేను హేతువాద వుద్యమంనుండి వచ్చాను ఆయన వర్గ పునాదినుండి వచ్చాడు. తెలుగు సాహిత్య చరివూతకి గద్దర్‌కి సంబంధం వుంది. అందుకే గద్దర్ అనగానే అనేక అంశాలు చర్చకు వస్తాయి. గద్దర్ ఒక వ్యక్తిగాదు; ఆంధ్రదేశంలో ప్రధానమైన నక్సలైట్ ఉద్యమం, దళిత వుద్యమాలలో సాంస్కృతిక యోధుడిగా పని చేసినవాడు. ఇవి రెండూ వర్గ, కుల ఆధిపత్యాన్ని ఎదిరించిన ఉద్యమాలు. ఈ ఉద్యమాల్లో సిద్ధాంతాంశాలు వున్నాయి, తాత్వికాంశాలు వున్నాయి, జీవితాంశాలున్నాయి. గద్దర్‌పై కాల్పులు జరిగినప్పుడు మరుక్షణం నన్ను హాస్పిటల్‌లో చూసిన పోలీసులు నన్ను నక్సల్‌బరీ ఉద్యమ సానుభూతిపరుడినని అనుకున్నారు. సత్యమూర్తిగారు లుంబీనిలో ఉన్నప్పుడు కూడ అనుకొన్నారు. నిజానికి నేను సాయుధపోరాటానికి వ్యతిరేకిని. ఫక్తు అంబేద్కర్‌వాదిని. అంబేద్కర్ కుల నిర్మూలనక్షిగంథమే నా ప్రణాళిక. కాని గద్దర్ సాంస్కృతిక పోరాట రూపానికి అభిమానిని. ఇవి రెండు రెండు భిన్నమైన అంశాలు. 


వేమన్న గురించి బ్రౌన్ పట్టించుకొన్నట్టు ఇప్పుడు గద్దర్ గురించి బి.నరసింగరావుగారు పట్టించుకొన్నారు. ’మా భూమి’, ’రంగులకల’ నిర్మాతగానేకాక కళాకారుల ప్రోత్సాహకుడిగా, మోటివేటర్‌గా వున్నారు. ఆయన సినిమా ’మా భూమి’లో గద్దర్ ’బండెనక బండికట్టి’ పాటపాడారు. అది ఆంధ్రదేశాన్ని ఊపింది. అప్పటినుండి నరసింగరావుగారిని నేను పలుసార్లు కలిశాను. గ్రామాల్లో ’మా భూమి’ సినిమా వేయిద్దామని కోరాను. నరసింగరావు లేకుండ గద్దర్ లేడు. బ్రౌన్ లేకుండ వేమన్న లేడు. కక్కయ్య లేకుండ పోతులూరి వీరవూబహ్మం లేడు. బసవడు లేకుండ వీరశైవ ఉద్యమం లేదు. నరసింగరావుగారి సలహా మంచి చెప్పినా చెడు చెప్పినా గద్దర్ అనుసరిస్తాడని ప్రతీతి. నరసింగరావుది నాకు తెలిసి పరిమిత, పరిణితమైన మాట. అది గద్దర్‌కి దిక్సూచి అనడంలో సందేహం లేదు. అయితే గద్దర్‌ది స్వతంత్ర వ్యక్తిత్వం. ఆయన ఎవరికీ అనుచరుడు కాదు. ఆయనది సొంత గొంతే. ఆయన స్టేజిమీద ఉన్నప్పుడు చూడాలి. అది ఒక పెద్ద దృశ్యం. నాకళ్ళల్లో గద్దర్ కళాదృశ్యం. ఆయనకళ్ళు ఎర్ర చేసినపుడు నాజర్‌లో ఉండే రౌద్రం చూశాను. గద్దర్ డప్పుకొడుతున్నప్పుడు సైన్యం కవాతుకు మార్చి బాండ్‌లా వుంటుంది. ’రెేలారే’ వంటి లయతోకూడిన ధ్వనులు ఆకాశాన్ని భూమిని ఏకం చేసేవి. ఆయన కొన్నిసార్లు నీలి సమువూదంలా, కొన్నిసార్లు ఎర్ర సమువూదంలా ఘోషిస్తాడు. ఆయన కర్ర తిప్పే పద్ధతిలో వీరత్వం వుంది. ఆయనది గుంపు నాట్యం. సంధ్య, దివాకర్, జైరాజ్‌వంటి ఎందరో సాంస్కృతిక యోధులు ఆయనతో గొంతు గలిపారు. వారి చరివూతను కూడ గద్దర్‌కు రాయవలసిన బాధ్యత వుంది. 

గద్దర్ రాజకీయ జీవితంకంటే కళాకారుడిగా, కవిగా, సాహితీకారుడిగా కొనసాగించిన జీవితమే గొప్పది. ఆయనమీద ఆయన తల్లి ప్రభావం అనన్యమైంది. భార్య విమల కూడ ఆయన జీవనక్షికమాన్ని నిర్ణయించడంలో ప్రభావాన్ని చూపింది. పిల్లలకంటే మేనల్లుడే ఎక్కువ అనుయాయి. కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తూ ’ప్రజాయుద్ధ నౌక’గా పేరొందడం గొప్ప విషయం. కుటుంబం చాలా మంది ఉద్యమకారులను నియంవూతిస్తుంది. గద్దర్ ఈ విషయంలో సమతుల్యం చేశాడనిపిస్తుంది. నక్సలైట్ నిర్బంధాన్ని ఎదుర్కొని ఆయన చేసిన ప్రయాణం సామాన్యమైందికాదు. తిండి, నీరు, వసతి, పడక ఇవన్నీ ప్రజాజీవనంలోనే కొనసాగించారు. అప్పటికి పొన్నూరులో సాంస్కృతిక విప్లవాన్ని ముమ్మరంగా సాగిస్తున్నాం. అక్కడకు వచ్చినవావరైనా మా ఇంటిలో దిగేవారు. వారితో సంభాషణలో చాలా నేర్చుకొనేవారం. గద్దర్ బైటకి వస్తే ప్రజల్లో మమేకం అయ్యేవారు. ఆయనది చాలా స్పందించే హృదయం. ప్రజల దుఃఖానికి కరిగిపోయే గుణం ఆయనది. కళాకారుడికి గోసి, గొంగడిని ఆయనే ప్రవేశపెట్టారు. చిన్న గడ్డంతో ఆయన కళ్ళల్లో ఎన్నో భావాలు పలికించేవారు. ఆయన కళాత్మక ప్రదర్శనల్లో కుల, మత, వర్గభేదాలు లేవు. అందరూ ప్రేక్షకులే. అందుకే ఆయన్ని తెలుగుజాతి వైతాళికుడు అని సంబోధించాను. వేమన తరువాత ఆ స్థాయిని గద్దర్‌కే మనం ఇవ్వాల్సి వస్తుంది. గద్దర్ ఎర్ర నీలిసమువూదాలు పోటెత్తిన దగ్గర పునరుజ్జీవం పొందారు. అది అందుకోవడం కష్టం. అనుయాయులకు, మిత్రులకు అందకుండ ఎదగడం గద్దర్ వ్యక్తిత్వంలోని ప్రధానపార్శ్వం. 

మార్క్సిజం అధ్యయనంనుండి అంబేడ్కర్‌ను చూసినవారిలో లోతైన సమన్వయాన్ని మనం చూస్తాం. మార్క్సు తత్వశాస్త్రం అంటే ప్రపంచాన్ని వ్యాఖ్యానించేదేకాదు, సమాజాన్ని మార్చేది అనే వ్యాఖ్యానం ప్రసిద్ధమైంది. హెగెల్ భావవాదానికి ఫూలే భౌతికవాదాన్ని అన్వయించడంలో అతని ప్రతిభ వుంది. ఆ కోణం నుండి చూస్తే ప్రతి మార్క్సువాది అంబేద్కర్‌ను చదువవలసి వుంది. అంబేడ్కర్ కులనిర్మూలన, ’బుద్ధ ఆర్ మార్క్స్’ తులనాత్మక పరిశీలనతో చాలా కీలకమైన అంశాల్ని మన ముందుకు తెచ్చాయి.
మార్స్కుచెప్పిన దోపిడి నిర్మూలన, బుద్ధుడు చెప్పిన దుఃఖ నివారణలో వుంది. ఇద్దరూ వ్యక్తిగత ఆస్తిని కాదన్నారు. కాకపోతే ఒక వ్యవస్థను అవసరమైతే బలవంతంగా కూలదోసే దగ్గర అంబేడ్కర్ ప్రజాస్వామికంగానే పునర్నిర్మాణం జరగాల్సివుందన్నాడు. భారతదేశంలో ఆర్ధికశాస్త్ర విద్యార్ధిగా మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన తత్వవేత్త అంబేద్కర్ మాత్రమే. డాంగేకాని, అధికారికాని, నంబూవూదిపాద్‌కాని, ఇంకా ఏ మార్క్సిస్టు లేక ఎం.ఎల్. పార్టీనాయకులు మార్క్సును సరిగా అధ్యయనం చేయలేకపోయారు. అంబేడ్కర్ మార్క్సు ప్రతిపాదించిన అంశాలకంటే అదనంగా వున్నా వాటిని కూడ బౌద్ధంలో చూపించాడు. బౌద్ధంలో ఒక జీవన క్రమం ఉంది. సత్యమూర్తిగారితోను, గద్దర్‌తోను దళిత వుద్యమం తరుపున నేను ఎన్నోసార్లు మాట్లాడను. వారికి అంబేడ్కంర్ అంటే అపారమైన గౌరవం. కాని సాయుధపోరాటంలో అమరులైనవారి త్యాగాలపట్ల వారికి ప్రగాఢ సానుభూతి వుంది, ప్రేమ వుంది. తమ పాటలు విని ఉద్యమంలోకి వచ్చి ప్రాణాలు అర్పించినవారికి భిన్నంగా మేము ఆలోచించలేమనేది వారి వాదన. మార్క్సు అంబేడ్కర్‌వాదం స్పష్టంగా ప్రజాస్వామ్యాన్ని పేర్కొంది. అలాగే పార్లమెంటరీ రాజకీయ పోరాటాన్ని ప్రయోగంలో నిలిపింది. సాంస్కృతిక విప్లవాన్ని, తాత్విక విప్లవాన్ని స్పష్టంగా నిర్దేశించింది. తప్పకుండ మార్క్సిస్టు లెనిన్ వాదాలకు అంబేద్కర్ వాదానికి ఆచరణలో తేడా వుంది. కాని అంతిమంగా ఇద్దరూ కోరుకొంటున్నది సమ సమాజాన్నే. అయితే ఇంత స్పష్టమైన విధానరేఖ ఉన్నప్పటికి కూడ మార్క్సిస్టుపూనినిస్టు పార్టీల అనుబంధ సాంస్కృతిక విప్లవానికి నాయకత్వం వహిస్తూ ప్రజల్లో, ప్రధానంగా అస్పృశ్యతను అనుభవిస్తున్న ప్రజల్లో వుంటున్న మార్క్సు వాదులందరికి ఈ సమస్య ఎదురవుతుంది. పీపుల్స్‌వార్ దగ్గర, దాని అనుబంధ సంస్థల దగ్గర ’అస్పృశ్యతా’ నిర్మూలనకు, కులనిర్మూలనకు కార్యక్షికమం లేదు. ఆవిషయాన్ని వర్గపోరాటంలో భాగంగానే చూస్తున్నారు కాని ఇతరం కాదు. ’అస్పృశ్యులు’ కుల పీడితులు మైదాన ప్రాంతాల్లో సామూహిక దాడులకు గురవుతున్నారు. 

కారరచేడులో ఇదే జరిగింది. మా మంచి నీళ్ళు మురికి చెయ్యవద్దన్నందుకు అగ్రకుల భూస్వాములు దారుణమారణ హోమం చేశారు. వారి సమాధుల మీద ’దళిత సహాసభ’ అని వ్రాసి ఉద్యమం సృష్టించాం. గద్దర్‌గారు వచ్చారు దళితులకోసం పాటరాశారు, పాడారు. దళిత పులులమ్మాఅనే ఈపాట దళిత ఉద్యమానికి ఊపుఇచ్చింది. పాటలో ధర్మవీరం ఉంది. తెలుగు సాహిత్యంలోనే శిఖరాయమానమైన పాట అది. 1985 చలోచీరాల సెప్టెంబర్ 1 మహాసభలో గద్దర్ ఈపాట ఆలపించారు. దళిత మహాసభ వేదికపైకి వరవరరావుని రానివ్వలేదు. కేవలం దళితులే దళితుల గురించి పాడతారు, మాట్లాడతారు అనేది నియమం. ఈ నియమం వివాదాస్పదం అయింది. ఈ వివాదమే దళిత వ్యక్తిత్వాన్ని నిలిపింది. దళిత ఉద్యమానికి విరసంలో వుండే బ్రాహ్మణులకు వైరుధ్యం వుంది. దళిత ఉద్యమానికి, జననాట్యమండలికి వైరుధ్యం లేదు. జన నాట్యమండలిలో బ్రాహ్మణులు లేరు, దళిత బహుజనులే వున్నారు. వారు పల్లెల్లో పుట్టారు, పల్లెల్లో ఆడతారు, పాడతారు, తింటారు, పండతారు. వారు మిడిలిక్లాస్ కాదు, శ్రామికజనం. దళిత ఉద్యమ పోరాటంలో అనేక వేదికల మీద జననాట్యమండలి తన ఉద్యమ స్పూర్తిని చాటింది. కొన్నిసార్లు ఆయుధాలు లేకుండ ఈ పోరాటంతో ఏమి సాధించలేరని చెప్పింది. అప్పుడు మేము విభేదించాం. అంబేడ్కర్ ఆయుధాలతో పోరాడలేదు. అంబేడ్కర్‌ది తాత్విక ఆయుధం. అది మామూలు ఆయుధాలకంటే బలమైంది. మీరూ అంబేడ్కర్‌ను చదవండి అని చెబుతూ వచ్చాం. 1991లో చుండూరులో దళితులపై ఊచకోతప్పుడు కూడ ఈ సవాలు ఎదురైంది. గద్దర్ అప్పుడు పార్టీమనిషిగా మాట్లాడాడు. దళిత వుద్యమం అంబేడ్కర్ బాటలోనే చలో ఢిల్లీ వరకు వెళ్ళింది. ఇదంతా వైరుధ్యం సమన్వయం పద్ధతిలోనే జరుగుతూ వచ్చింది. 1989 తరువాత గద్దర్‌లో గుణాత్మకమైన మార్పు చూశాను. అంబేడ్కర్ అధ్యయనం పెరిగింది. ’కులసమస్య’ను పట్టించుకోకుండ ఏ పార్టీ విజయవంతం కాదు అనే అంశాన్ని పార్టీలో ’గద్దర్’ పెట్టగలిగాడని విన్నాను. అది గద్దర్ కంట్రిబ్యూషన్ అనే చెప్పాలి. మారోజువీరన్న కూడ ఇదే వైరుధ్యానికి గురయ్యాడు. ’కులనిర్మూలన’ ఉద్యమాన్ని కుల అస్తిత్వ ఉద్యమంగా అతడు భావించాడు. వర్గ,కుల అంశాలను జోడించ ప్రయత్నించాడు. ప్రయోగంలో వైఫల్యం జరిగింది. కాని, భారతసమాజంలో ’కులం’ ప్రాధాన్యం చర్చకు రావడం ’కారంచేడు’ తరువాతే. అందుకే కారంచేడు ఉద్యమానికి ముందు గద్దర్ వేరూ, కారంచేడు ఉద్యమం తరువాత గద్దర్ వేరూ అవుతూ వచ్చారు. గద్దర్‌మీద కాల్పులు జరిగినప్పుడు పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా దళితులు, బహుజనులు ఇతర ప్రజాబాహుళ్యం హృదయంతో స్పందించారు. తెలంగాణా ఉద్యమంలో దళిత బహుజనులు మరింతగా గద్దర్‌ను సొంతం చేసుకున్నారు. 

- కత్తి పద్మారావు
(మిగతా రే

Namasete Telangana News Paper Dated : 13/06/2012 

Gaddar Oka Drushyakavyam--by Katti Padma Rao




Namasete Telangana News Paper Dated : 13/06/2012