Tuesday, June 12, 2012

హక్కుల కోసం ఆదివాసీల పోరాటం---విజూ కృష్ణన్‌1537లో అమెరికాలో రెడ్‌ ఇండియన్ల పరిస్థితి ఎలా ఉందో భారతదేశంలో ఆదివాసీల పరిస్థితి కూడా అలాగే ఉంది. రెడ్‌ ఇండియన్లు కూడా మనుషులేనని, వారికి కూడా ఆత్మ, ఆలోచనలు ఉంటాయని పోప్‌ చేసిన హితోక్తిని సైతం ఐరోపాలోని పాలకవర్గాలు, వలసవాదులు పట్టించుకోలేదు. బానిసత్వం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా ఉన్న చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి. భారతదేశంలో ఆదివాసులదీ అదే పరిస్థితి. ఇక్కడ చట్టాలు కాగితాలకే పరిమితం. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కాగితాల్లో నిబంధనలు కాగితాలకే పరిమితం, ఆచరణకు నోచుకోవు. ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీరు మంచ్‌ (ఎఎఆర్‌ఎం) మే 25 నుంచి 27 వరకూ తమిళనాడులోని కూనూర్‌లో జరిపిన సమావేశంలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్ష, వారిపై జరుగుతున్న దాడులను సమీక్షించింది. ఆదివాసీలకు సమానత్వం, గౌరవంగా జీవించే హక్కు కల్పించే రాజ్యాంగం, చట్టాల నిబంధనలు కాగితపు చట్టాలుగానే మిగిలిపోయాయి. ఎఎఆర్‌ఎం కేంద్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో వెలుగులోకి వచ్చిన కొన్ని కేసులు ఈ విధంగా ఉన్నాయి.
ఖనిజ వనరుల లూటీ
ఖనిజ సంపద ఆదివాసీ ప్రాంతాల్లోని గనుల నుంచే ఎక్కువగా లభ్యమవుతోంది. పర్యావరణం, ఆదివాసీల గౌరవం, హక్కులు, పర్యావరణ పరిరక్షణ కోసం చట్టాలకు, శాసనాలకు ఎటువంటి లోటూ లేదు. అయితే అవి కార్మికులు, భూమి, ఖనిజ వనరుల లూటీని ప్రోత్సహించేవిగా ఉన్నాయి. కార్పొరేట్‌ సంస్థలకు వాటిపై, ఆదివాసీ ప్రాంత భూములపై తిరుగులేని హక్కులు కట్టబెట్టేవిగా ఉన్నాయి. గిరిజనుల హక్కుల పరిరక్షణ పేరుతో చట్టాలు ఉన్నప్పటికీ వాస్తవానికి వారి రక్తాన్ని, వనరులను హరించివేసేవిగా ఉన్నాయి. వారు నివాసముంటున్న ప్రాంత పర్యావరణాన్ని సరిదిద్దడానికి వీలు లేకుండా దెబ్బతీస్తున్నాయి. వారిని భూమి నుంచి, అడవుల నుంచి పారదోలే విధంగా ఉన్నాయి. గిరిజనుల హక్కుల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం చేసిన చట్టాల్లో 2011, ఖనిజాలు, గనుల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు (ఎంఎండిఆర్‌ఎ) ఒకటి. గనుల రంగంలో విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఈ చట్టాన్ని ఉద్దేశించారు. ఖనిజ సంపదను వెలికితీసేందుకు ఎఫ్‌డిఐ అవసరమనే వాదన ఈ చట్టానికి ప్రాతిపదిక. గనుల రంగంపై నియంత్రణను ఈ చట్టం ఎత్తివేస్తుంది. భారత కంపెనీతో ఒప్పందం చేసుకుంటే మైనింగ్‌ లీజ్‌ పొందేందుకు విదేశీ కంపెనీలను అనుమతిస్తుంది. బొగ్గు కంపెనీలు దయార్ద్ర హృదయంతో 26 శాతం లాభాలను జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థకు ఇస్తాయి. ఇతర ప్రధాన ఖనిజాల విషయంలో వార్షిక రాయల్టీ మొత్తానికి సమానంగా ఇస్తాయి. ఖనిజావృద్ధి సంస్థలో ఖనిజాల యజమానులు, అధికారగణం ఆధిపత్యం చెలాయిస్తారు. గిరిజన సమాజాలకు కల్పించిన ప్రాతినిధ్యం నామమాత్రమే. భారతదేశంలో రాయల్టీలు ఆ కంపెనీలు సంపాదించే లాభాలతో పోలిస్తే అత్యంత తక్కువగా ఉంటాయి. పిఇఎస్‌ఎ సంప్రదింపుల ప్రక్రియకు తిలోదకాలిచ్చింది. గిరిజన కుటుంబంలో ఒక సభ్యునికి ఒక్కొక్క వాటా ఇస్తామని హామీ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థల నిబంధనల ప్రకారం గిరిజనుల ముందస్తు అనుమతి పొందకుండా గనులు తవ్వకూడదు. గిరిజనుల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి ప్రాజెక్టులను అనుమతించకూడదు. వనరులపై గిరిజనులకు యాజమాన్య హక్కులు కల్పించాలి. స్థానిక ప్రజల సహకార సంఘాలను ఏర్పాటుచేయాలి. ఆదివాసీల హక్కులను భూమి, అడవులకే పరిమితం చేయకుండా ఖనిజ సంపదకు కూడా విస్తరింపజేయాలి.
ఏనుగుల విహారానికి హక్కు
అటవీ శాఖ తమిళనాడులోని నీలగిరి జిల్లాలో సేగూర్‌ పీఠభూమిలో కృత్రిమ ఏనుగు కారిడార్లను నెలకొల్పింది. ఆ ప్రాంతంలోని ఆదివాసీలు, చిన్న, మధ్యతరహా రైతుల భూములు, జీవనోపాధి దీనివల్ల దెబ్బతిన్నది. భారత వన్య ప్రాణి ట్రస్టు, ప్రాజెక్టు ఎలిఫెంట్‌, అడవులు, పర్యావరణ శాఖ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రాతిపదికగా కారిడార్‌ను సృష్టించారు. ప్రభుత్వం దీనిని 2006లో ఆమోదించింది. మొత్తం 88 ఏనుగు కారిడార్లున్నట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో నాలుగు సేగూర్‌ పీఠభూమిలో ఉన్నాయి. మొత్తం 83.42 ఎకరాల ప్రయివేటు భూమిని ఇందుకు కేటాయించారు. ఈ కారిడార్లకు ఉద్దేశించిన ప్రాంతాన్ని శాస్త్రీయ ప్రాతిపదికగా, వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నిర్దిష్ట నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయలేదు. అటవీ శాఖ ఏకపక్షంగా ఈ విస్తీర్ణాన్ని ఏడు వేల ఎకరాలకు విస్తరించింది. ఈ ప్రాంతం దీర్ఘకాలంగా ఆదివాసీలు, చిన్న రైతులు, ఇతరుల నివాస ప్రాంతంగా పేరుగాంచింది. ఒక్క మసీనాగుడి పంచాయతీ పరిధిలోనే 18 వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారిలో సుమారు సగం మంది దళితులు, ఆదివాసీలున్నారు. షోలూర్‌ పంచాయతీ పరిధిలో 1,750 మంది ప్రజలు నివసిస్తున్నారు. అందులో 70 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉన్నారు. అటవీశాఖ చర్యల ఫలితంగా వీరందరూ ప్రభావితులు కానున్నారు. ఏనుగులకు రక్షణ కల్పించే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఏనుగులు దాడి చేయకుండా ఆ ప్రాంత ప్రజలకు రక్షణ కల్పిస్తుంది. ఏనుగుల దండు దాడి చేయడం వల్ల చిన్న రైతులు, ఆదివాసీల జీవనోపాధికి ఇబ్బందులు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటవీ హక్కుల పరిరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ విషయంలో నిబంధనను ఉల్లఘిస్తున్నా పట్టించుకునే నాథుడు ఉండటం లేదు. ఏనుగుల సంరక్షణ పేరుతో గిరిజనులు గౌరవంగా జీవించే హక్కులను హరిస్తున్నారు.
ఆదివాసీల కదలికలపై నియంత్రణ
ఏనుగుల స్వేచ్ఛా విహారానికి న్యాయపరంగా, అధికార యంత్రాంగపరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ అక్కడ నివాసముంటున్న ఆదివాసీల కదలికలపై ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తేయాకు ఎస్టేట్స్‌లో ప్రవేశానికి ప్రజలకు అనుమతి నిరాకరిస్తున్నారు. నీలగిరి కొండల్లోని ఆదివాసీలకు ప్రభుత్వ రహదారుల్లోనూ, ప్లాంటేషన్‌ యజమానులు వేసిన ప్రయివేటు రోడ్లలోనూ ప్రవేశం కల్పించడం లేదు. నీలగిరి కొండల్లో అనేక ఎస్టేట్లు, వీటి పరిసర ప్రాంతాల్లో ఆదివాసీ హామ్లెట్లు తరతరాలుగా ఉంటున్నాయి. ఆదివాసీల కదలికలను అడ్డుకునేందుకు ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ 122 గేట్లు ఏర్పాటు చేసింది. ఆ రోడ్డు మీద వాహనాల రాకపోకలను కూడా నియంత్రించారు. ఒకవేళ అనుమతించినా టోల్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. ఇలా దాదాపు దశాబ్ద కాలంగా జరుగుతోంది. రాత్రి సమయాల్లో గేట్లు మూసివేస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సివచ్చిన వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజా రవాణా సర్వీసులు, అంబులెన్స్‌ల రాకపోకలను కూడా నిషేధిస్తున్నారు. ఈ ఎస్టేట్స్‌లోని ఉద్యోగుల్లో సుమారు 9 శాతం మంది ఆదివాసీలే. భద్రత కోసమే ఈ గేట్లను ఏర్పాటుచేసినట్లు చెప్పుకుంటున్న మేనేజ్‌మెంట్‌ వాటిని దళితులు, ఆదివాసీలు నివాసముంటున్న ప్రాంతాల్లో నిర్మిస్తుండటం విశేషం. ఈ రోడ్లను అక్కడి ప్రజలు దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఉన్న హామ్లెట్లకు చేరుకోవడానికి వారు ఈ రోడ్లను ఉపయోగిస్తున్నారు. ఎస్టేట్స్‌లో సర్వీసు రోడ్లు నిర్మించిన ప్రాంతం దశాబ్దాలుగా ఆదివాసీల యాజమాన్యంలోని పట్టా భూములే. మేనేజ్‌మెంట్‌ తన ఏకపక్ష చర్యల ద్వారా ప్రజలకు అసౌకర్యాన్ని, ఇబ్బందులను సృష్టిస్తోంది. ఏ సమయంలోనైనా ఈ రోడ్డును వినియోగించుకునే అధికారం ప్రజలకుంది. ఈ రోడ్డుపై మేనేజ్‌మెంట్‌ టోల్‌ ఛార్జీలను వసూలు చేయడం, పాస్‌లు మంజూరు చేయడం, ప్రజలు ఈ రోడ్డును ఉపయోగించుకోకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం. తమిళనాడు ఆదివాసీ అసోసియేషన్‌ క్రెగ్‌మోర్‌, సుల్తానా ఎస్టేట్‌ల అక్రమాలను అడ్డుకుని ప్రభుత్వ రోడ్లపై ప్రవేశాన్ని పునరుద్ధరించగలిగింది.
ఆశ్రమ పాఠశాలలు-గిరిజన హాస్టళ్లు
మహారాష్ట్రలోని 75-80 ఆశ్రమ పాఠశాలలు, జార్ఖండ్‌లోని గిరిజన హాస్టళ్లల్లో విస్తృతమైన సర్వే నిర్వహించగా దిగ్భ్రాంతిగొలిపే వివరాలు వెలుగుచూశాయి. తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు, ముఖ్యంగా సైన్స్‌, గణితశాస్త్రం బోధించేవారు లేరు. అనేక పాఠశాలల్లో ఈ పాఠ్యాంశాలను బోధించడం లేదు. రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయులను నియమించినప్పటికీ వారు అరుదుగా మాత్రమే పాఠశాలల్లో ఉంటారు. విడిగా తరగతి గదులు, నివాస ప్రాంతాలు లేవు. ఉదయం పూట క్లాస్‌రూమ్‌లు రాత్రిపూట హాస్టళ్ల అవతారం ఎత్తుతాయి. అక్కడ వంటవారే వార్డెన్లు. బాలికల పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. బాలికలకు విడిగా స్నానాల గదువు లేవు. పాఠశాలల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాలి. విద్యార్థులు చెరువులు, కుంటల్లో స్నానాలు చేయాల్సిందే. స్కాలర్‌షిప్పు మొత్తం ఎందుకూ కొరగానిదిగా ఉంది. అవి కూడా అవసరమైన లబ్ధిదారులకు చేరవు. అసోంలో గత మూడు సంవత్సరాలుగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వడం లేదు. గిరిజన విద్యార్థులకు ప్రత్యేక హాస్టళ్లు లేవు. అక్కడ పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయి. అణచివేతకు గురవుతున్న వర్గాల విద్యార్థులు విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి సానుకూలమైన పరిస్థితులు అక్కడ లోపించాయి. అటవీ హక్కుల చట్టం అమలులో లోపాలను వివిధ రాష్ట్రాలకు చెందిన సభ్యులు తెలియజేశారు. తమిళనాడులో 23 వేల దరఖాస్తులు రాగా 3,200 మందికి మాత్రమే పట్టాలిచ్చారు. నీలగిరి కొండల్లో సంప్రదాయబద్ధంగా తోడా గిరిజనులకు వారసత్వంగా ఉంటున్న భూములను స్వాధీనం చేసుకున్నారు.
ఆశ్రమ పాఠశాలలు, గిరిజన హాస్టళ్లు, స్కాలర్‌షిప్పు సమస్యలను పరిష్కరించేందుకు ఎస్‌ఎఫ్‌ఐతో సమన్వయంగా పోరాటం ఉధృతం చెయ్యాలని సిఇసి సమావేశం నిర్ణయించింది. ఈ పాఠశాలల పరిస్థితులపై సర్వే నిర్వహించి మానవ వనరుల అభివృద్ధి శాఖకు తగిన చర్యల నిమిత్తం సమర్పిస్తుంది. ఆదివాసీలందరికీ రేషన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ జులై 30 నుంచి ఆగస్టు 3 వరకూ వామపక్షాలు నిర్వహించనున్న ధర్నాల్లో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించింది. ఖనిజ వనరులు, గనులు ఉన్న రాష్ట్రాల్లో ఎంఎండిఆర్‌ఎ బిల్లు వల్ల ఒనగూరే ప్రమాదాల గురించి ప్రజలను చైతన్యపరచి ఆదివాసీల హక్కుల పరిరక్షణకు వారిని సమీకరిస్తారు. స్థానిక సమస్యలపై రాష్ట్ర స్థాయి పోరాటాలను నిర్వహిస్తారు.
-విజూ కృష్ణన్‌
Prajashakti News Paper Dated : 10/06/2012 

No comments:

Post a Comment