లక్ష్మింపేటలో రుధిర సత్యం
శ్రీకాకుళం మళ్ళీ నెత్తుటి గుడ్డు అయ్యింది. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట సంఘటనల తరువాత నేడు లక్ష్మింపేటలో దళితులపై జరిగిన అమానుష దాడి నాలుగు నిండుప్రాణాలను బలిగొంటూ మనముందు అనేక ప్రశ్నలను వుంచింది. ఈహత్యల వెనక కులం, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటుగా ప్రధానంగా ఈ దేశ అస్తిత్వ సమస్య అయిన భూమి వుంది.
ఈ ప్రాంతంలోని సువర్ణముఖి, వేగావతి నదీ సంగమ ప్రాంతం మడ్డువలస దగ్గర నిర్మించిన ప్రాజెక్టు కిందవేలాది ఎకరాలపంట భూములు, గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ముంపు బాధితులు అప్పటి అర కొర ప్యాకేజీలతో పొట్టచేత పట్టుకొని చెట్టు కొకరు పుట్ట కొకరైన వారే ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం యిచ్చిన నిర్వాసిత స్థలంలో ఇళ్లునిర్మించుకొని వున్నవాళ్ళలో కొట్టిశ, లక్ష్మింపేట గ్రామాల ప్రజలు వున్నారు. ఈ రెండు గ్రామాలు వంగర మండల పరిధిలో వున్నాయి. ఇందులోలక్ష్మింపేటగ్రామంలో 60 ఇండ్లు దళితులలోని మాల వర్గానికి చెందినవి.
మిగిలిన 80 బిసికాపుకులానికి చెందినవి. వీరంతాతమపాత గ్రామం విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కొత్తగా చేరినవారే. ఈ గ్రామం చుట్టు పరచుకొని వున్న 240 ఎకరాల వ్యవసాయ భూమి బిసివాళ్ళది. దీనికిప్రభుత్వం కాంపెన్సేషన్ చెల్లించి వేసింది. అయినా ఇది ముంపు పరిధి దాటి వుండడంతో ఇందులో 180 ఎకరాలు బిసిలు, 60 ఎకరాలు మాల కులస్తులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమి తమదే కాబట్టి ఆ అరవై ఎకరాలు కూడా తమకే చెందాలని కాపువర్గం దళితులపై వత్తిడి తేవడంతో దళితులంతా ప్రభుత్వానికిఅర్జీ పెట్టుకున్నారు. ఈమొత్తం భూమికి గవర్నమెంటు నష్ట పరిహారం చెల్లించి వున్నందున అది ప్రభుత్వ స్వాధీనంలో వున్నట్టే. దీనిపై ఎవరికీ హక్కులుండవు కాబట్టి సరైనరీతిలో ఇరు వర్గాలను కూచో బెట్టి ఆభూమిని పంపిణీ చేసివుంటే అసలు ఈ రోజు ఇంత దారుణం జరిగివుండేది కాదు.
న్యాయస్థానాన్ని ఇరువర్గాలు ఆశ్రయించడంతో ఈ మొత్తం భూమిపై స్టేఆర్డరిస్తూ ఎవరూ సాగుచేయకుండా ఆదేశాలిచ్చింది. ఇది బిసిలకు పుండుమీద కారంలా మారింది. గతంలో తమసాగులో వున్న భూమిపై హక్కును, దళితులు అడగడం కారణంగా తాము కోల్పోయామని వారుభావించారు. అందుకు బిసి వర్గానికి చెందిన మాజీ ఎంపిపి అధ్యక్షుడు ఒకరు తమఅధికార పార్టీ అండతో ప్రభుత్వాధికారుల అవినీతి అలసత్వాలను సొమ్ముచేసుకొంటూ సమస్యను తెగనీయకుండా చేస్తూ ఇరు వర్గాలను రెచ్చగొట్టారు; తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ఎత్తుగడలో భాగంగా సమస్యను జటిలం చేయడంలో ప్రధాన పాత్ర వహించారు.
దీనికి వత్తాసుగా ఉత్తరాంధ్ర మంత్రులు కొందరు కొమ్ము కాయడంతో ఎన్నాళ్ళుగానో రగులుతున్న తమ కక్షను, తీర్చుకునేందుకు ఉపఎన్నికల సందర్భాన్ని(జూన్ 12) వాడుకున్నారు బిసిలు. గ్రామంలో గత ఆరునెలలుగా కొనసాగుతున్న పోలీసు పికెట్‌లోనివారు ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన వేళ దళితులంతా ఉదయం చద్దన్నం తినడానికి ఇంట్లో వున్న సమయంలో కత్తులు బాంబులు రాళ్ళతో కాపు వర్గానికి చెందిన ఆడామగా పిల్లలతో సహావారిపైదాడిచేసి ఇంట్లోంచి ముంగిటకు లాక్కొని వచ్చి వారిని అతి దారుణంగా కొట్టి చంపారు. ఈ దాడిలో, దళితులైన బూరాడ సుందరరావు, చిత్రి అప్పడు , తండ్రీకొడుకులైన నెవర్తి వెంకట్, నెవర్తి సంగమేసులు చనిపోయారు. ఇంకా ఇరవైమంది తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా వుంది.
రాయలసీమ, పల్నాడు ప్రాంతంలోని బాంబుల సంస్కృతిని ఇక్కడ కూడా ప్రవేశపెట్టిన ఘనత ప్రస్తుతం మంత్రిగాఉన్న ఒకప్రముఖ నాయకుడిదని అంతా అంటున్నారు. ఇంత దారుణంగా దళితులపై దాడులు జరిగి నలుగురు హత్య చేయబడి, ఇరవై మందికి పైగా గాయాల పాలై అందులో మరికొంత మంది చావు బతుకుల మధ్యకొట్టుకొంటుంటేకనీసంప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించ లేదు.
అలాగే కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారం పై కూడా సరైన ఆదేశాలు రాకపోవడం దళితులను మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో రాష్ట్ర ఎం ఆర్ పి ఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరికొంత మంది దళిత నాయకులు రాజకీయ పార్టీల వారు చనిపోయిన మృతదేహాలను ఖననం చేయకుండా మూడు రోజులుగా పోరాటం చేశారు. తత్ఫలితంగా కదలిన అధికార యంత్రాంగం ఆ భూమిలో దళితులకు ఎకరా చొప్పున ఇవ్వడానికి, అలాగే దాడికి పాల్పడిన వారిపై చర్యలకు హామీలిచ్చారు. ఆ తర్వాతనే అంటే గురువారం సాయంత్రం హతులకు అంత్యక్రియలు జరిగాయి.
ఈ దళిత హత్యాకాండ, దాడి సంఘటనకు ప్రధానంగా రెవెన్యూ, పోలీసుయంత్రాంగం బాధ్యతవహించాలి. అలాగే స్థానిక రాజకీయ నాయకులు తమ అగ్రకుల అధికార మదంతోదళితులను భయ భ్రాంతులను చేశారు. వారిని ఆఊరినుంచి తరిమికొట్టడం ద్వారా మొత్త ం ప్రభుత్వాధీనంలోకి పోయిన భూమిపై హక్కును తామే కైవసం చేసుకోవాలన్న పక్కాప్రణాళిక కూడా ఈ సంఘటనల వెనుక వుంది. ఈ దేశంలోని కులం, వర్గం స్వభావానికి మరో తార్కాణం లక్ష్మింపేట దళితులపై జరిగిన దాడి. దీని సామాజిక, రాజకీయ, ఆర్థిక మూలాలను అర్థం చేసుకోవాల్సి వుంది. కులమొక్కటే ఆత్మ గౌరవ సమస్యగా ఉద్యమాలు చేయడమే సరికాదు. బడుగు వర్గాలవారికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని, హక్కును కల్పించే జీవనోపాధి వనరు భూమిని ప్రధాన సమస్యగా ముందుకు తీసుకురావాల్సినఅవసరమెంతైనా వుంది.ఈ సత్యాన్నే లక్ష్మింపేట ఊచకోత మరోసారి స్పష్టం చేసింది.
-
విప్లవ రచయితల సంఘం, పార్వతీపురం
Andhra Jyothi News Paper Dated : 16/06/2012
No comments:
Post a Comment