Tuesday, February 19, 2013

పట్టాలో ఉన్న భూమి పల్లెలో లేదు' - పి.యస్. అజయ్ కుమార్



వ్యవసాయ భూమిని పూర్తిగా మార్కెట్ సరుకుగా మార్చింది మన రాష్ట్రంలోనేనని చెప్పక తప్పదు. దళితులకు 9/77, ఆదివాసీలకు 1/70, బహుజన కౌలు రైతులకు కౌలు (తెలంగాణ, ఆంధ్ర) చట్టాలు, భూమిలేని వారికి 1/73 (సీలింగు) చట్టం.. ఇలా దండిగా చట్టాలు ఉన్నాయి. అసలు సమస్య వాటి 'అమలు '. 


"పట్టా పట్టుకొని/ తాశీల్దారు కాడికెళ్తే / పట్టా చూసిండు- పకా పకా నవ్విండు/ పట్టాలో వున్న భూమి/ మండలంలో లేదన్నడు'' - 'భూమెక్కడో చెప్పరండి' అంటూ పట్టా పట్టుకొని తిరుగుతూ పెద్దలందరిని ప్రశ్నించే ఈ పాట రాష్ట్రంలో భూమిలేని పేదలకు సుపరిచితం. భూమి కావాలని దరఖాస్తులు అందితే వాటిని ముఖ్యమైనవిగా భావించి వెంటనే పరిష్కరించాలి. దశాబ్దాల క్రిందట మద్రాసు రెవెన్యూ బోర్టు స్టాండింగ్ ఆర్డర్సు ఆ మాట చెబుతున్నాయి. రెవెన్యూ శాఖ విధి నిర్వహణలో ప్రభుత్వ భూముల మంజూరు ముఖ్యమైనది. రోజువారీ జరగవలసిన ఈ పాలనా వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ 'విడతలవారీ' కార్యక్రమంగా మార్చింది.



పట్టా మంజూరు చేయడమంటే భూమిపై -సాపేక్షికంగా- ఒక స్థిరమైన హక్కును కల్పించడం. ఇదేమి ఆషామాషీ తంతు కాదు. అందుచేత బ్రిటిష్ వారు విధి విధానాలను పకడ్బందీగా రూపొందించారు. వాటిని తూచ తప్పకుండా నిష్ఠతో పాటిస్తే ఇప్పుడు మనం చూస్తున్న, వింటున్న లాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు. గడిచిన సంవత్సరం ఆఖరి నెల ఆఖరి రోజున భూ సమస్యలపై రెవెన్యూ మంత్రి వర్యులు ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో భూమి శిస్తు కమిషనరు నుంచి రెవెన్యూ కార్యదర్శి వరకు ఓ 16 మంది ఐఏఎస్ అధికారులు, జాయింట్ డైరెక్టర్ల నుంచి తాశీల్దారు స్థాయి వరకు మరో 36 మంది, పౌర సమాజ ప్రతినిధులు ఒక నలుగురు పాల్గొన్నారు. పలు అంశాలు అక్కడ చర్చకు వచ్చాయి. అందులో కొన్నింటిని పరిశీలిద్దాం. మావోయిస్టు పార్టీ నేతలతో చర్చలు, ఉభయ కమ్యూనిస్టు పార్టీల 'భూ' పోరాటాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రి, మునిసిపల్ శాఖ మంత్రి కోనేరు రంగారావు గారి అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. 



ఆ కమిటీ వారు ప్రభుత్వానికి 104 సిఫారసులు ఇచ్చారు. వీటిలో 90 ప్రభుత్వామోదం పొందాయి; 14 తిరస్కరింపబడ్డాయి. ఆమోదించిన వాటిలో 75 సిఫారసుల అమలుకు ఆదేశాలు దిగువకు వెళ్ళాయి. మిగతా 15 సిఫార్సుల అమలుకు ఇంకా ఆదేశాలు జారీ కాలేదు. ఇలా ఉండిపోయిన వాటిలో అత్యధికం ఆదివాసీలకు సంబంధించినవే. అయితే అసలు సమస్య అది కాదు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు కాగితాలు ఎన్నైనా వెళ్ళవచ్చు కానీ ఎన్ని అమలైనాయి? ఈ సిఫారసుల అమలుకు ఆదేశాలు ఇవ్వకముందు, ఇచ్చాక ప్రజలకు తేడా ఏమైనా తెలుస్తుందా? కోనేరు సిఫారసుల అమలంటే తాఖీదులు దిగువకు పంపడంగా భావిస్తున్నారు. అంతేగానీ వాటి అమలు తీరును సమీక్షించిన వారు లేరు.



ఇప్పటివరకు విడతల వారీగా ఇచ్చిన డి-పట్టాలు ఎన్నింటికి ఇంకా భూమి అప్పగించాలి? అధికారిక లెక్క ప్రకారం 23,455.61 ఎకరాలు. మెదక్ జిల్లాలో ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఇప్పించిన పట్టాలకు ఇప్పటికీ భూమి చూపించలేదు. ప్రజల మాట దేవుడెరుగు, ఇది దేశ ప్రధానిని అవమానించడం కాదా? ఇది కాస్త వివాదం అయి రాజధానికి చేరడంతో, 'పట్టాలు ఇచ్చినా సాగు చేయలేదని', కనుక వాటిని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. భూమి చూపండంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నవారి చేతిలో అధికారులు ఈ నోటీసులు పెట్టారు. ప్రశ్న ఏమిటంటే, అసలు భూమిలేకుండా పట్టాలు ఎలా ఇచ్చారు? సర్వే డివిజన్ వర్కు ఎక్కడ చేశారు? రెవెన్యూ ఇన్‌స్పెక్టరు నిర్వహించవలసిన విచారణ ఏమయ్యింది? పద్ధతి ప్రకారం నింపవలసిన ప్రొఫార్మాలలో రాసిందంతా అబద్ధాలేనా?



సాగు యోగ్యమైన ప్రభుత్వ భూములను పెద్దలు ఆక్రమించారు. ఇలాంటి వారిని చట్ట ప్రకారం తొలగించాలి. ఎప్పుడో 1905లో బ్రిటిష్‌వారు చేసిన భూ ఆక్రమణ చట్టాన్ని అలంకారంగా పెట్టుకు కూర్చున్నారు. వారిని తొలగిస్తే గానీ పేదలకు భూములు రావు. నెల్లూరు జిల్లాలో ఒక్క వాకాడు, మనిపోడు మొదలైన మండలాలలో అన్యాక్రాంతమైన యానాది ఆదివాసీల అసైన్ మెంట్ భూమి ఒక లక్ష ఎకరాలకు పైగా ఉంటుంది. ఇందులో అధిక శాతం భూస్వాములే. ఈ భూముల విషయంలో యానాదుల పట్ల సానుభూతిని చూపిస్తున్నారని అక్కడి జిల్లా జాయింట్ కలెక్టర్‌ను రెండు నెలలకే బదిలీ చేశారు.



అంతెందుకు అదే జిల్లాకు కలెక్టరుగా వచ్చి పెద్దల భూ దందాలపై కొరడా ఝళిపించిన ఒక ఐఏఎస్ అధికారిని తొమ్మిది నెలలకే బదిలీ చేయించారు. మహబూబ్ నగర్, వరంగల్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో యానాది ఆదివాసీలతో సహకార సంఘాలను ఏర్పాటు చేసి వాటికి భారీగా ప్రభుత్వ భూములు కేటాయించారు. ఆ సొసైటీలను అధికారులు, స్థానిక రాజకీయ భూ కబ్జాదార్లు పాతరేసి భూములను గుంజుకున్నారు. కాగితాల మీద సొసైటీలు 'డిఫాల్టు' అయినట్లుగా ఉంటాయి. భూములేమో భూస్వాములు సాగుచేసుకుంటూ ఉంటారు. వీటిని స్వాధీనం చేసుకొని సొసైటీలను పునరుద్ధరించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. లేనిదల్లా చిత్తశుద్ధి, రాజకీయ సంకల్పం. దీనికి పరిష్కారం ఏమిటి కనిపెట్టారంటే సొసైటీలను రద్దు చేసి ఆ భూములను స్వాధీనం చేసుకొని 'పేదలకు' పంపిణీ చేయడం. సొసైటీల రద్దు ఐదు నిమిషాల్లో జరుగుతుంది. తరువాతి కథ చూసేందుకు 'వెండి తెర' అవసరం లేదు.



ఏకరువు పెట్టిన సమస్యలన్నింటికీ ఒకటే జవాబు- 'జిల్లా జాయింట్ కలెక్టర్లను ఆదేశిస్తాం' అని. ఆదేశించనవసరం లేదు, చట్టాలను అమలుపరిస్తే తాము అడ్డుపడమని, బదిలీతో శంకరగిరి మాన్యాలకు పంపించమని చెపితే చాలు. కొసమెరుపు ఏమిటంటే ముందు ప్రస్తావించిన సమావేశం అయిన రెండురోజుల తరువాత జనవరి 3, 4 తేదీలలో జరిగిన జిల్లా జాయింట్ కలెక్టర్ల సమావేశంలో 'అనర్హుల నుంచి ప్రభుత్వ భూముల స్వాధీనం' అన్న ఊసేలేదు. పేదల సాగుకు ఇక్కడి డి-ఫారం పట్టా భూములను కొనకూడదు. అందుకు రెండు వేల రూపాయల జరిమానా, ఆరునెలలు జైలు శిక్ష ఉంది. రాష్ట్రంలోని వివిధ మండల రెవెన్యూ కార్యాలయాలలో నమోదై విచారణ జరగనివి 1,31,554 కేసులు. ఆంధ్రప్రదేశ్ ఎసైన్‌మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం 9/77 ఇతర భూమి చట్టాలకు భిన్నంగా సూటిగా, స్పష్టంగా ఉంటుంది.



తన 'ఇడుపులపాయ' ఎస్టేట్‌లో ప్రభుత్వ భూములు ఉన్న విషయం మీడియాకు పొక్కిందని తెలుసుకోగానే అప్పటి 'మహానేత' తమ వ్యవహారం ఫైసలా అయ్యేంతరవకు చట్టంలోని నేరం-శిక్ష క్లాజును త్రిశంకు స్వర్గంలో పెట్టి, తదుపరి చట్టాన్నే మార్చేశారు. దళిత ఉద్యమ నేత ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం అడ్డుపడకపోయి ఉంటే అన్యాక్రాంతం పొందిన వారికే వాటిని ఖరీదుకు ఇచ్చేసి ఉండేవారు. సరే, గుడ్డిదో, మెల్లదో ఆ చట్టంతో పూర్తిచేయవలసిన విచారణలు ఎందుకు జరగటం లేదు? ఎవరు అడ్డం పడుతున్నారు? యథావిధిగా జనవరిలో జరిగిన జాయింట్ కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఆ కేసుల ఊసే లేదు.



ఆదివాసీలకు సంబంధించిన అంశాన్నిప్రస్తావించి ఈ చర్చ ముగిద్దాం. కోనేరు కమిటీ ఇచ్చిన 104 సిఫార్సులలో 41, అంటే మొత్తం సిఫారసులలో 39 శాతం ఆదివాసీలవే. ఆమోదించిన 90లో ఇంకా ఆదేశాలు ఇవ్వవలసిన సిఫార్సులూ వారికి చెందినవే. ఇందులో అతి ముఖ్యమైనది భూ బదిలీ నిషేధ చట్టం 1/70. ఈ కేసులు విచారణ చేయవలసిన కోర్టులకు అధికారులు లేరు. వారికి సిబ్బంది, మౌలిక వసతులూ లేవు. రేపో మాపో పదవీ విరమణ చేసేవారు, కలెక్టరు లేదా ఆ జిల్లా గౌరవనీయ మంత్రివర్యుల అనుగ్రహానికి పాత్రులు కాని వారిని ఇక్కడ 'పనిష్మెంట్ పోస్టింగు' క్రింద నియమిస్తారు.



కుర్చీలో కూర్చున్న మరుక్షణమే అక్కడ నుంచి పారిపోవడానికి పైరవీలు లేదా గిరిజనేతరులతో లాలూచిపడి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడాలూ. సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ భూమినెందుకు కొన్నాడు? సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో ఎందుకు కొనలేదు? వ్యవసాయం చేయనివారు ఆ భూములను కొనకుండా ఏదో ఒక స్థాయిలో ఆ రాష్ట్రంలో రక్షిత చట్టాలున్నాయి. అమితాబ్ బచ్చన్ వివాదమూ అదే. వ్యవసాయ భూమిని పూర్తిగా మార్కెట్ సరుకుగా మార్చింది మన రాష్ట్రంలోనేనని చెప్పక తప్పదు. ఒక్క వాక్యంలో చెప్పాలంటే దళితులకు 9/77, ఆదివాసీలకు 1/70, బహుజన కౌలు రైతులకు కౌలు (తెలంగాణ, ఆంధ్ర) చట్టాలు, భూమిలేని వారికి 1/73 (సీలింగు) చట్టం.. ఇలా దండిగా చట్టాలున్నాయి. అసలు సమస్య వాటి 'అమలు'. భూమి ఎక్కడ ఉందంటే ఎక్కడికీ పోలేదు; అక్కడే ఉంది. అయితే కన్పించనివ్వకుండా ఒక 'మాయ' కమ్మి ఉంది. అంతే! మరి ఆ మాయ మాంత్రికులు మంత్రులేనా!?



- పి.యస్. అజయ్ కుమార్
రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్


Andhra Jyothi Telugu News Paper Dated : 19/2/2013

Wednesday, February 13, 2013

సామాజిక ఇటుకలతో తెలంగాణ -ప్రొఫెసర్ జి. లక్ష్మణ్



ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'ప్రాంతీయ న్యాయం, సామాజిక న్యాయం' పేరుతో ఆ పత్రిక సంపాద కుడు కె. శ్రీనివాస్ రాసిన వ్యాసం ఆలోచింపచేసే విధంగా ఉంది. దానితోపాటుగా భిన్నమైన సంఘర్షణలు కూడా అందులో ఉన్నాయి. 'రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటి రెండు అసెంబ్లీలలో సామాజిక నిష్పత్తులు ప్రస్తుతమున్న తరహాలోనే కొనసాగవచ్చు. రెడ్డి, వెలమ కులాల ఆధిక్యం మరికొంతకాలం కొనసాగక తప్పక పోవచ్చు. (వారి పెత్తనం వల్ల మాత్రమే కాదు, వారి నాయకత్వం తెలంగాణకు 'అవసరం' కూడా కావచ్చును) కానీ అతి తొందరలోనే గౌడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి కులాలు బలమైన సామాజిక వర్గాలుగా అవతరిస్తాయి' అని కె. శ్రీనివాస్ విశ్లేషించారు. ఇది భవిష్యత్ తెలంగాణకు సంబంధించిన ఒక అంచనా అనుకుంటాను. అంటే ఇప్పుడు జెఎసిలో ఉన్న అన్ని జాక్‌ల నేతల నాయకత్వంలో కూడా కులాలను చూడాల్సి ఉంటుంది.

కీలకమైన జాక్ నేతలంతా అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక దశాబ్ద కాలంపాటు దళిత బహుజన నాయకత్వం కీలకమైన స్థానానికి రాకపోతే ఆ వర్గాలకు చెందినవారు మరో 20 ఏళ్ళు వెనక్కు పోతారు. అప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత దళిత బహుజన వర్గాలకు కొత్తగా ఒరిగిందేమిటన్నదే కీలకప్రశ్న అవుతుంది. అందుకే రాష్ట్రం వచ్చేదాకా వేచి ఉందామన్న ఆలోచన బహుజనులలో ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేలోపుగా 2014 ఎన్నికలు జరిగేటట్లయితే టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బిసి, ఎస్‌సి, ఎస్టీ, మైనారిటీలకు ఎన్ని సీట్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారకపోతే తెలంగాణ రాష్ట్రం బహుజనులకు వొరగబెట్టిందేమిటన్న ప్రశ్న నుంచి కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తాయి. నల్గొండ జిల్లాలో రెడ్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెడ్డి, వెలమలు, మెదక్, కరీంనగర్ జిల్లాల లో వెలమ, రెడ్ల నాయకత్వాలు మారకుండా సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది? అందుకే బిసిలకు ప్రత్యేకించి సీట్లు కేటాయించాలి. తెలంగాణలో 119 ఎమ్మెల్యే స్థానాలకు 60 సీట్లు బిసిలకు కేటాయించాలి. 17 పార్లమెంటు స్థానాలకు 8బిసిలకు కేటాయించాలి. ఇది ఇప్పుడే జరగాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే విధిగా జరగాలి.

కె. శ్రీనివాస్ ఇదే వ్యాసంలో 'తెలంగాణ ప్రాంతపు సాంప్రదాయ నాయకత్వానికి భూస్వామ్యపు పెత్తందారీ దుర్మార్గ గతమూ, అవశేష వర్తమానమూ ఉండవచ్చును. ఎంతకాలమని ఆ బూచీని చూపించి, చూసి, నాయకత్వమే లేకుండా ఉండగలరు? ఏ ప్రాంత ప్రజలైనా వారి సొంత నాయకత్వం కింద, పాలన కింద ఉంటే అణగి పోతారని, పీడితులౌతారని అనడంలో ఎంత మాత్రం శ్రేయోభిలాషిత్వం ఉన్నది? సామాజిక విమర్శ పెట్టి, ప్రత్యేక రాష్ట్రం వద్దనే దాక వెళ్లినవారున్నారు. మరి సమైక్య రాష్ట్రంలో మాత్రం సామాజిక న్యాయాన్ని వారెందుకు కోరరు? సామాజిక సమైకాంధ్ర కోరేవారెవరూ కనిపించరేమీ?' అన్న చర్చను లేవదీశారు. తెలంగాణ భూస్వామ్య వర్గం పోవాలని పోరాడే శక్తులే సీమాంధ్ర పెట్టుబడిదారులపై గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తూనేఉన్నారు.సామాజిక న్యాయాన్ని, సామాజిక చైతన్యాన్ని కోరే శక్తులు వాళ్ళు ఏ రూపంలో ఉన్నా ఈ రెండు ప్రాంతాల్లోని కులాధిపత్యాన్ని, ఆర్థిక కులాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు వెళ్ళిపోవాలని పిలుపునివ్వడమంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భూస్వామ్య ఆధిపత్యకులాల పెట్టుబడిదారులపై కూడా ఆ పోరాటం కొనసాగుతుంది. 

ఇప్పుడు భౌగోళిక తెలంగాణ ఉద్యమంలో తమ నేలపై ఇతర ప్రాంత ఆధిపత్యానికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతుంది. రేపు తెలంగాణ వచ్చాక సొంత నేలపై ఆధిపత్య కులాల ఆధిపత్యంపై తిరిగి ఉద్యమం కొనసాగుతుంది. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని కోరుతున్నవారే గతంలో కూడా సమైక్యాంధ్రలో కూడా సామాజిక న్యాయాన్ని అడిగారు. కారంచేడు, చుండూరు ఉద్యమాలకు సంఘీభావంగా తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, ఆలోచనాపరులు ముందుకు వచ్చారు. ఆంధ్రా ప్రాంతంలో సామాజిక న్యాయం జరగాలని తెలంగాణ గొంతెత్తి అరచింది. ఇప్పుడు ప్రాంతీయ న్యాయంతోపాటు సామాజిక న్యాయమూ జరగాలని తెలంగాణ చైతన్యం ప్రశ్నిస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకునేటప్పుడే సామాజిక న్యాయం ఇటుకలతో కట్టుకుంటాం. కులాధిపత్యం అడ్డంకులను రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే తొలగించుకోవాలి.

-ప్రొఫెసర్ జి. లక్ష్మణ్

Andhra Jyothi Telugu News Paper Dated : 14/2/2013 

Tuesday, February 12, 2013

కష్టాల కాంగ్రెస్‌: నయా గాంధీ! ---డేవిడ్



- సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటారా?

- బహిరంగంగా లోపాల ఒప్పుకోలు! 
- అవినీతి దారుణంగా ఉన్నదని గుర్తింపు 
- యువత డిమాండ్లపై స్పందించలేదేం?
- 2014కు ముందే 9 రాష్ట్రాల ఎన్నికల పరీక్ష

rahul-sonia

ఎన్నికలకు ఏడాదిముందే కాంగ్రెస్‌ పార్టీ ‘నయా’ లీడర్‌ను ముందుకు తెచ్చింది. అధికారికంగా చెప్పకపోయినా 2014కు ప్రధాని రాహులేనని జైపూర్‌ మేధోమథనం సాక్షిగా కాంగ్రెస్‌ తేల్చేసింది. ఉపాధ్యక్ష పదవితోనే పార్టీ దశ,దిశ, భవిష్యత్తు అన్నీ రాహులేనని స్పష్టమైన సందేశం పంపింది. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీని రాహుల్‌- ముచ్చటగా మూడోసారి అధికారం లోకి తెస్తారా, ఉన్న సవాళ్ళు, ఆ రాబోయే సమస్యల ను ఆయన సమర్ధవంతగా ఎదుర్కొనగలరా అనేవి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ముందున్న పెద్ద సవాళ్ళు. 



నూట పాతికేళ్ల చరిత్ర ఉన్న పార్టీని గాంధీ- నె్రహూ కుటుంబం పెద్ద దిక్కుగా ఉండి నడిపించింది. అలాంటి కుటుంబంనుంచి నాలుగో తరం నాయకుడిగా రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీని ఇక నడిపించబోతున్నారు. ఇంత వరకు తల్లిచాటు బిడ్డగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రాహుల్‌ తాత, నాయనమ్మ, తండ్రి వారసత్వాన్ని ఎంత వరకు నిలబెడుతాడో అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూ స్తోంది. ఒకవైపు భారీ ఆశలు, ఇంకెన్నో సవాళ్లు, అంతకు మించిన ఆకాంక్షలు, మరోవైపు ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ జైపూర్‌ చింతన్‌ శిబిరంలో యువరాజ్‌కు నంబర్‌ టూ స్థానాన్ని కట్టబెట్టింది. సోనియాగాంధీ అధినే త్రి హోదాలోఉన్నా ఇకనుంచి ఆమె పాత్ర పరిమితంగానే ఉండబోతోందని పార్టీలో అందరూ అంగీకరిస్తున్నారు. 8 ఏళ్లపాటు కాంగ్రెస్‌ రాజకీయాలతోపాటు, దేశం మొత్తం తిరిగి రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్న రాహుల్‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తారా అనేది వేచి చూడాలి. 



ఉపాధ్యక్షుడిగా తన ప్రసంగాన్ని వినిపించిన రాహుల్‌, గతంలోకంటే భిన్నంగా తన మనో భావాల్ని వ్యక్తంచేశారు. గాంధీ, నెహ్రుల సిద్ధాంతాలను గుర్తుచేస్తూనే నాయనమ్మ ఇందిరా గాంధీ హత్య విషయాన్ని ప్రస్తావించారు. రాజీవ్‌గాంధీ తెచ్చిన టెక్నాలజీ సింబల్‌ మోబెల్‌ఫోన్లు అని చెబుతూనే, యుపిఏ ప్రభుత్వంపై, ప్రధాని మన్మోహన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సంస్కరణలతో భారత్‌ రూపురేఖలు మార్చిన ఘనత మన్మోహన్‌కు దక్కుతుందని, మన్మోహన్‌ తెచ్చిన ఆర్థిక సంస్క రణలు దేశానికి అన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పుకొచ్చారు. పాత, కొత్త తరాలను గుర్తుచేస్తూ ఆమ్‌ఆద్మీ పాలసీకి కాంగ్రెస్‌ దూరం కాలేదని సెలవిచ్చారు. 



అధికారమనేది విషం లాంటిదని తన తండ్రి, నానమ్మ చావులను గుర్తు చేసుకు న్నారు. అమ్మ తనకు అదే చెప్పిందంటూ కాంగ్రెస్‌ శ్రేణుల గుండెల్ని పిండేశారు. భావోద్వేగం, రాజకీయ అవగాహన, లోపాలను అంగీకరించే నిజాయితీలతో- సామాన్యునికి దూరం కాకుడదన్న లక్ష్యాన్ని ప్రకటిస్తూ, తమ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ ఉద్వేగంతో ప్రసంగించి తల్లిచేత కంటతడి పెట్టించారు. అయినా సరే తన భవిష్యత్తు కన్నా దేశ భవిష్యత్తే ముఖ్యమని తేల్చేశారు. కాంగ్రెస్‌ సాధించిన విజయాలను గుర్తుచేస్తూనే సరిచేసుకోవాల్సిన లోపాలను ఎత్తిచూపారు. మహాత్ముడి సిద్ధాంతాన్ని, తండ్రి రాజీవ్‌ పాలనను, మన్మోహన్‌ సంస్కరణలను గుర్తుచేస్తూ ఆ ఒరవడిని కొనసాగిస్తామన్నారు. అందరి కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుందన్ని ప్రకటించారు. 



ఎనిమిదేళ్లు రాజకీయాల్లో ఉన్న రాహుల్‌, అధినేత హోదాలో ఉండి కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత లోపాల గురించి బహిరంగంగా ఒప్పు కోవడం ఇదే మొదటి సారి. యువతరం అసహనంతో రగులుతోందని, పాలనలో, అధికారంలో తన మాటలకు విలువ ఉండాలని కోరుకుంటోందనీ తెలిపారు. అధికారం కేంద్రీకృతమై కొంతమందే రాజకీయాలను నియంత్రిస్తున్నారన్నారు. మనం విజ్ఞానానికి కాకుండా హోదాలు విలువిస్తున్నామనీ, అవినీతి పరులే అవినీతి గురించి మాట్లాడుతున్నారని, మహిళల్ని అవమానించేవారే వారి సాధికారత గురించి మాట్లాడుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ భావోద్వేగాలు, రాజకీయ వారసత్వం, అధికారంపై అభిప్రాయాలు, పార్టీలో లోపాలు, ప్రభుత్వంలో సమస్యలు ఇలా అన్నీ కోణాలను ప్రస్తావించిన రాహుల్‌ ప్రసంగం మొత్తం సారం రాజకీయంగా కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారని తెలుస్తోంది. అయితే తన ప్రసంగంలోచెప్పిన అభిప్రాయాలు ఎంత వరకూ అత్మవిమర్శతో కూడుకున్నా యనేది విశ్లేషించాలి. 



నిజానికి రాజకీయ నాయకుణ్ణి కానీ, పార్టీ అధినేతను కానీ విశ్లేషించాల్సింది- చేసిన ఉపన్యాసాల్ని బట్టికాదు, గతంలో చేసిన పనులను, చేస్తున్న పనులను బట్టి! రాహుల్‌ గాంధీ చింతన్‌ బైటక్‌లో ప్రసంగిస్తూ అవినీతి దారుణంగా ఉందని సెలవిచ్చారు కానీ, ఆ ఆవినీతికి ఎవరూ పాల్పడుతున్నారో వివరణ ఇస్తే బాగుండేది. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్‌ పార్టీయే ఈ దేశాన్ని దాదాపు40 సంవత్స రాలకు పైగా పరిపాలించింది. ఈ 40 ఏండ్ల పాలన కూడా తన కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే, తన కుటుంబసభ్యుల ద్వారానే సాగింది.



ఒకవైపు తన తాత, నాయనమ్మ, తండ్రి- త్యాగాలను గురించి, వారి గొప్పతనాన్ని గురించి చెప్పుకుం టున్న రాహుల్‌గాంధీ- దేశంలో దారుణంగా ఉన్న అవినీతికి తన కుటుంబ సభ్యులు ఎంతవరకూ కారణమనేది కూడా గుర్తించాలి. 1950లలో మొదలైన ‘హరిదాస్‌ ముంద్రా’ నుంచి ప్రారంభిస్తే ‘2- జి’ వరకూ పాలక వర్గాల, పాలకుల కుంభకోణాల జాబితా లెక్క పెట్టలేనంతటిది. ప్రస్తుత యుపిఏ కూటమి పాలనా కాలంలోనే స్పెక్ట్రం, కామన్‌ వెల్త్‌, గ్రామీణ ఉపాధి హామి పథకం, జలంతర్గామి కొనుగోళ్ళు, సైనికుల రేషన్‌, సత్యం కంపెనీ మొదలైన లక్షల కోట్ల రూపాయల కిమ్మత్తు కుంభకోణాలు బయట పడ్డాయి. తొమ్మిదేండ్లుగా తానూ క్రియాశీలంగా రాజకీయాల్లో ఉంటూ, అధికారాన్ని అనుభవిస్తూ ఈ కాలంలో అవినీతిని ఉపేక్షించి, అవినీతి పరులైన మంత్రులను వెనకేసుకొస్తూ ఇప్పుడు అవినీతి దారుణంగా ఉందనడం- దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. 



యుపిఏ పాలనా కాలంలోని ప్రభుత్వంలోనే ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు అవినీతి ఆరోపణలో అరెస్టు అయి, తమ పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. చివరకు ప్రధాన మంత్రి కార్యాలయంపైనే అవినీతి ఆరోపణలున్నా, స్వయాన తన బావమరిది పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ఉన్నా, వారిపై చర్యలు తీసుకోవాలని ఏనాడు మాట్లాడని రాహుల్‌ గాంధీ నేడు- అవినీతి దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తే హస్యాస్పదంగానే ఉంటుంది. ఈ తొమ్మిది సంవత్సరాల యుపిఏ పాలనలో అవినీతిని అరికట్టేందుకు కొంతనైనా ప్రయత్నిస్తే ప్రజలు కాంగ్రెస్‌ పాలన పట్ల, రాహుల్‌ నిజాయితీపట్ల విశ్వాసంతో ఉండేవారు. 



తన తండ్రి రాజీవ్‌గాంధీ కూడా రాజకీయా ల్లోకి కొత్తగా ప్రవేశించినప్పుడు- ప్రభుత్వం అందిస్తున్న ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతోందని, 85 పైసలు అక్రమార్కుల చేతుల్లోకి వెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆయన కూడా ఏనాడూ దానిని అరికట్టేందుకు ప్రయత్నించలేదు. నేడు రాహుల్‌గాంధీ భావోద్వేగ ప్రసంగాన్ని కూడా ఆ విధంగానే చూడాల్సి వస్తుంది. 



ఇక రెండవది, యువత అసహనంతో రగులుతోందని, సమస్యలపట్ల దేశ యువత అద్భుతంగా స్పందిస్తున్నదనీ, వాళ్లకు అనుగుణంగా స్పందించాలనీ తోటి రాజకీయ నాయకుల కు సెలవిచ్చారు ఈ యువనేత. కానీ- అవినీతికి వ్యతిరేకంగా దేశంలోని యువకులు పెద్ద ఎత్తున అందోళన నిర్వహిస్తుంటే వారికి మద్దతుగా ఈ యువనేత ఎందుకు నిలవలేదని ఆలోచించాలి. మొన్న ఢిల్లీ దారుణ సంఘటనకు వ్యతిరేకంగా అసంఖ్యాక యువత రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తూ, ప్రభుత్వాన్ని స్థంభింపజేస్తుంటే- ఈ యువనేత ఎందుకు స్పందిచలేదో సెలవివ్వాలి. యువతకు అనుగుణంగా స్పందించాలన్న యువనేత తానేంచేశారో! ఆలస్యంగానైనా తన తల్లి సోనియా, దేశ ప్రధాని మన్మోహన్‌ స్పందించినా కూడా భావి ప్రధాని స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 



దేశంలో నూట ఇరవై కోట్ల జనాభా, దాంటో 75 కోట్ల మంది ఓటర్లు, అందులో దాదాపు 25 కోట్ల మంది 25 ఏళ్లలోపు వాళ్లే. ఈ యూత్‌ ఐకాన్‌ దేశంలోని యూత్‌ను ఎంత వరకు ఆకట్టుకోగలుగుతారనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి- భవిష్యత్తు ప్రధానిగా కనిపిస్తున్నా, ఆయన దేశంలోని యూత్‌ను ఆకట్టుకోలేకపోయారని, వారి ఓట్లను సాధించుకోలేక పోయారని అనేక ఉదాహరణలు మన ముందున్నాయి. మొన్నటి గుజరాత్‌ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఎన్నికలు నిరూపించాయి. తన తాత, తన తల్లినుంచి స్వయంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న యుపిలోకూడా యువ ఓటర్లు యూత్‌ సింబల్‌గా అఖిలేష్‌ యాదవ్‌ను చూశారు కాని రాహుల్‌ గాంధీని చూడలేక పోయారు. 



వివిధ ఆందోళనలో ముందుంటున్న యువత, వారి డిమాండ్లు ముందు ముందు రాహుల్‌ సత్తాకు సవాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. వాటన్నిం టికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇకపై రాహుల్‌దే. పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, అవినీతి కుంభకోణాలు, ప్రజా వ్యతిరేకత- ఇవన్నీ రాహుల్‌ ముందున్న సవాళ్ళు. భవిష్యత్తు గురించి బెంగ వద్దని చింతన్‌ బైటెక్‌లో రాహుల్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని నింపారు, కానీ అది పార్టీకి ఎంత ప్లస్‌ అవుతుందనేది చూడాలి. రాజకీయ వారసత్వం, నాన్న నుంచి వచ్చిన చరిష్మా, తల్లి నేర్పిన రాజకీ య పాఠాలు, తనకున్న యూత్‌ ఐకాన్‌ ముద్ర రాహుల్‌కు కలిసొచ్చే అంశాలే కానీ, సంకీర్ణ శకంలో కలిసొచ్చే మిత్రులు, దూరమయ్యే శుత్రువులెవరో తెలుసుకోవాలి. వారు పెట్టిన డిమాండ్లలను అంగీకరించాలి. అవసరమైనా, లేకపోయినా మిత్రపక్షా లను దువ్వాలి. ఇవన్ని రాహుల్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 



నెహ్రు తన హయంలో దేశానికి దిశానిర్దేశం చేస్తూ మిత్రపక్షాలను కలుపుకొని పోయి అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. దేశవిభజన జరిగినప్పుడు దేశంలో నెత్తురు పారినప్పటికి ప్రజల్లో మళ్ళీ విశ్వాసం నిలకొల్పి స్వతంత్ర భారతదేశాన్ని తనకాళ్ళపై తను నిలబడేలా చేశాడు. శాస్త్ర విజ్ఞానం, పరిశ్రమల రంగంలో భారత దేశం స్వయం ప్రతిపత్తిని సాధించేలా కృషి చేశాడు. భాక్రానంగల్‌ ఆనకట్ట, రిహంద్‌ ఆనకట్ట, భిలాయ్‌, బొకారో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు, ఐఐటి వంటి అధునిక విశ్వవిద్యాలయాల స్థాపన వంటి వాటిని దేశాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిపారు. సుమారు పదహారేళ్ల పాటు దేశ ప్రధానిగా కొనసాగిన ఇంధిరా గాంధీ సమర్థవంతమైన పరిపాలనఅందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించు కోగలిగారు. 


devid
గాంధీ కుటుంబం తొలిసారిగా పార్టీకి దూరం కావడంతో 1992లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చెందడంతో అయిష్టంగానే సోనియా అధ్యక్ష పదవి చేపట్టారు. ఎనిమి దేళ్ల ఆటుపోట్ల తర్వాత 2004లో యుపిఏను అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రధాన పదవి చేపట్టే అవకాశం ఉన్నప్ప టికీ విదేశీ ముద్ర వల్ల తాను తప్పుకొని, మన్మోహన్‌కు అవకాశం ఇచ్చారు. ఆయన సంస్కరణ లతో పాటే అవినీతి ఆరోపణ లు కాంగ్రెస్‌పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నెహ్రూ హయాంలో మొదలైన కుంభకోణాలు రూపాన్ని మార్చుకుంటూ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. సామాన్యుడి ఆవేదనను యువరాజు ఎలా తీరు స్తాడో, దేశాన్ని ముం దుకు ఎలా తీసుకెళతారో అన్న దానిపై ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంతకంటే ముందు అసలు సిసలైన పరీక్ష ఈ ఏడాది జరగ బోయే తొమ్మిది రాష్టాల ఎన్నికలు.ఈ ఎన్నికల్లో రాహుల్‌ ఎంతవరకు తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటారో చూడాలి.


Surya Telugu News Paper Dated : 13/2/2013 

రెండు వ్యాఖ్యలు : ద్వంద్వ ప్రమాణాలు - డా. జిలుకర శ్రీనివాస్



సంస్కృతి పరిశ్రమను ఆధిపత్య కుల వ్యవస్థలో ఒక భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. కమల్ హాసన్ పట్ల సానుభూతిని చూపి, షారుఖ్ ఖాన్ పట్ల ఉదాసీనతను చూపించే స్పందనలు ఎలాంటి మానవీయమైన విలువలనూ పాదుకొల్పలేవు. 

సవర్ణ పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మించే సాంస్కృతిక పరిశ్రమ ఉత్పత్తులకు పీడిత కుల శ్రామిక వర్గాలు కేవలం వినియోగదారులుగా మాత్రమే ఉంటాయి. పాశ్చాత్య సాంస్కృతిక పరిశ్రమ గురించి అడార్నో తర్వాత విలియం రేమాండ్స్, ఫ్రెడ్రిక్ జేమ్‌సన్, జిజెక్ వంటి తత్వవేత్తలు అనేక రచనలు చేశారు. కానీ మన దేశ సంస్కృతి పరిశ్రమ విభిన్నమైంది. దాని రాజకీయ తాత్విక పునాది అందుకు కారణం. భారతదేశంలో వలస పాలన కాలం నుంచీ రూపొందుతూ వచ్చి, ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైన సాంస్కృతిక పరిశ్రమ స్వభావం గురించీ దాని పరిణామాల గురించీ తగినంత చర్చ జరగలేదన్నది విమర్శకుల అభిప్రాయం. పాశ్చాత్య సమాజంలోని సాంస్కృతిక పరిశ్రమకు పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత బలపర్చే కార్యక్రమం ఉన్నట్టే, మన దేశంలోని పరిశ్రమకు కొన్ని సామాజిక వర్గాల ఆధిక్యాన్ని మరింత శక్తిమంతం చేసే ఎజెండా ఉంది. ఆ క్రమంలోనే అది అనేక సమస్యలను చాలా తెలివిగా చర్చకు పెడుతూ ఉంటుంది.

'విశ్వరూపం' చిత్రం వివాదం ఆసక్తికరమైన అంశాలను చర్చకు తెచ్చింది. కమల్ హాసన్ గొప్ప కళాకారుడు. తన చిత్రాన్ని ముస్లిం వ్యతిరేకమైందిగా చిత్రిస్తూ నిషేధించడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. ఇలాంటి మతతత్వవాదులున్న చోట జీవించలేననీ, లౌకికవాదం ఉన్న మరెక్కడికైనా వెళ్లి బతకాలని ఉందని కమల్ అన్నారు. ఆయన నోటివెంట అలాంటి మాటలు విన్న అనేక మంది అభిమానులు బాధపడ్డారు. ఆయనకు కష్టం కలిగిస్తున్న వారి మీద, వారి మతం మీద తీవ్రమైన అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. ముస్లిం సమాజం అంటేనే ఒక సమస్యగా భావించే మతతత్వవాదులకు ఇదొక మంచి అవకాశంగా లభించింది. కమల్ హాసన్ పట్ల సానుభూతిని ప్రదర్శించే వారి సంఖ్య చాలా ఎక్కువ. కళను కళగానే చూడాలని హితబోధ చేసే ధార్మిక పండితులకూ ఇదొక చక్కని అవకాశం. కమల్ హాసన్‌కు అలాంటి అభద్రతా భావం కలగడానికి కారకులెవరైనా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఆయన ఆవేదన పట్ల ఇంతగా చలించిపోతున్న వారికి షారుఖ్ ఖాన్ వేదన ఎందుకు పట్టడం లేదో ప్రశ్నించాలి.

షారుఖ్ ఖాన్ గొప్ప కళాకారుడని ఎవరి ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. ఆయన నటనా వైదుష్యం విమర్శకులనే కాదు కోటానుకోట్ల మంది అభిమానులను మెప్పించింది. కానీ, మన దేశంలోని మత వివక్ష, అంతర్జాతీయంగా ముస్లిం వ్యతిరేకత వల్ల ఆయన చవి చూసిన అవమానాల గురించి ఒక వ్యాసంలో చాలా హృదయ విదారకంగా రాసుకున్నారు. 

ఆయన మనో వేదనను అర్థం చేసుకున్న చలన చిత్ర ప్రముఖులెవరూ కనిపించలేదు. ఆయనకు సంఘీభావం తెలిపిన వాళ్లూ లేరు. ఇన్ని అవమానాలు జరిగినా సరే, నేను భారతీయుడిని, ఈ దేశంలోనే జీవిస్తాను, మరణిస్తాను అని షారూఖ్ ఖాన్ ఆ వ్యాసంలో రాశారు. ఇలాంటి వాక్యాలు రాసినందుకు ఆయన్ని ప్రశంసించిన వారూ లేరు. జరిగిన అవమానాలకు ఈ దేశం విడిచి వెళ్లిపోతానని షారూఖ్ ఖాన్ ఒక వేళ అంటే ఎలా ఉండేది? కమల్ హాసన్ పట్ల సానుభూతి చూపిన తీరుగానే షారుఖ్ పట్ల సానుభూతినీ సంఘీభావాన్ని ప్రదర్శించేవారా? ఒక వేళ ఆయన కమల్ హాసన్ లాగే మాట్లాడి ఉంటే దేశ వ్యాప్తంగా ముస్లింల మీద అపర దేశభక్తులు దాడులకు తెగబడేవారు కాదా? దేశ ద్రోహం అభియోగం మోపి జైల్లో పెట్టేవారు కాదా? ఇద్దరూ కళాకారులే. కానీ ఒకరి పట్ల సానుభూతి. మరొకరి పట్ల నిరాసక్తత. ఈ ద్వంద్వ వైఖరి దేన్ని చూపిస్తుంది? సమాజంలో ముస్లిం వ్యతిరేకత క్రమంగా విస్తరించటమే కాదు, సామాజిక ఆమోదం పొందుతుందన్నది నిరూపణ అవుతుంది.

విశ్వరూపం నేపథ్యంలోనే పాత వివాదాలను కూడా గుర్తు చేసుకోవాలి. ఇటీవల ఒక యువ కథానాయకుడు హీరోగా ఒక చిత్రం విడుదలైంది. అందులో బ్రాహ్మణులను అవమానించేలా దృశ్యాలున్నాయని కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయి. అదే విధంగా, ఏ వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం అనే సినిమాను నిషేధించాలని ఆ సినిమా చూడకుండానే డిమాండ్ చేశారు. మునుపెన్నడూ రాస్తారోకో, ధర్నా, ముట్టడి వంటి కార్యక్రమాలు చేసి ఎరుగని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన మార్గం పట్టాయి. చాలా విచిత్రంగా బ్రాహ్మణీయ సంస్కృతిని విమర్శించే కొన్ని దళిత సంఘాలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు పలికాయి. బ్రాహ్మణుల తరఫున మాదిగలు పోరాడుతారని మందకృష్ణ బాహాటంగానే ప్రకటించారు. విశ్వరూపం చిత్రం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, ముస్లింల తరఫున పోరాడుతామని ఆయన బహిరంగ ప్రకటన చేయలేకపోతున్నాడెందుకు? సినిమాను సినిమాగానే చూడాలని ఇప్పుడు హితవు పలికే ప్రబోధకులు, మతాధిపతులు అప్పుడు మాత్రం హిందూ ధర్మం మీద దాడిగా, భారతీయ సంస్కృతి మీద దాడిగా గగ్గోలు పెట్టారు. విశ్వరూపం సినిమాను మాత్రం సినిమాగానే చూసి ఆనందించాలని సెలవిస్తున్నారు. ముస్లింలకో నీతి, ఇతరులకో నీతేంటని అడిగితే సమాధానం ఏం చెబుతారు?

ముస్లింలను దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా చిత్రిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. అణగారిన వర్గాల సమాజాన్ని అవహేళన చేస్తూ ఎన్నో చిత్రాలు వచ్చాయి. వీటిని తొలి దశలో వెకిలి సినిమాలుగా ప్రేక్షకులు తోసిపుచ్చారు. అయినా సరే, అలాంటి సినిమాలనే దర్శక, నిర్మాతలు ఎందుకు తీస్తున్నారు? మతతత్వం తలకెక్కిన అనేక మంది చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. కాకపోతే, అప్పుడు ఆధిపత్య కుల సంస్కృతిని సార్వజనీనం చేసే ఎజెండా మాత్రమే ఉండేది. రెండు ఆధిపత్య కులాల ముఠా కక్షలను ప్రతీకార కథనాలతో చిత్రించారు.

సినిమా రంగం యొక్క రాజకీయ తత్వశాస్త్రం మనువాదం. తెలుగు సంస్కృతి, భారతీయ సంస్కృతి పేరుతో సినిమాల నిండా బ్రాహ్మణీయ సంస్కృతినే కూర్చుతూ వచ్చారు. వంద ఏళ్ల కిందటి కన్నా ఎక్కువ బ్రాహ్మణీయ అసమాన భావజాలం సంస్కృతి పరిశ్రమ విస్తరించాకే జరిగింది. ఆ భావజాలానికి ఆమోదం దొరుకుతుంది. అది ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించాలని ఆశించిన రాజ్యాంగ కర్త ఆలోచనకు ప్రతికూలమైంది. బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పుడు అణగారిన కులాల్లో చైతన్యం పెరిగింది. ఈ చైతన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు మత మైనార్టీలను శత్రువులుగా చూపే చిత్రాలు నిర్మిస్తున్నారు. మతాల వారీగా సంస్కృతిని నిర్మాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే జర్మనీలో కూడా జరిగింది.

హిందూత్వ తీవ్రవాద హింసాకాండ పట్ల చిత్ర పరిశ్రమ ఏనాడూ స్పందించలేదు. రెండు వేల మంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ మారణకాండ మీద ఒక్క సినిమా కూడా రాలేదు. వేల సంవత్సరాల నుంచి దళితులను అంటరాని వారిగా చూస్తూ, నిత్యం వారి మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటే వాటికి వ్యతిరేకంగా సినిమాలు రాలేదు. కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట వంటి దళితుల సామూహిక హననాల గురించీ ఏ ఒక్క సినీ హీరో, సక్సెస్‌ఫుల్ డైరెక్టరూ సినిమా తీయలేదు. 'శూద్ర' అనే ఒక హిందీ సినిమాను జైస్వాల్ అనే దర్శకుడు తెరకెక్కిస్తే దాన్ని విడుదల కానీయకుండా అనేక అవాంతరాలను కల్పించారు.

ముస్లిం, దళిత సమాజం నిత్యం వేధింపులకూ అవమానాలకూ గురవుతున్నది. మత వివక్ష, మత హింసకు ముస్లింలు గురవుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారు ఈ దేశంలోనే జీవిస్తాం అంటున్నారు. కేవలం సమానత్వాన్ని మాత్రమే అంగీకరిస్తామన్నందుకు రెండు వేల సంవత్సరాల నుంచీ అంటరాని వాళ్లుగా వెలేయబడిన ఈ దేశ మూలవాసులు ఏనాడూ ఈ దేశం విడిచి పోతామని అనలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఇతర మైనార్టీలు గొప్ప దేశ భక్తులు. ఇది వాళ్లకు మాతృభూమి. కమల్ హాసన్ ఈ దేశం విడిచి వెళ్లిపోతానని ఉద్వేగంలో అన్నాడేమో. కానీ ఆ మాటల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు భయంకరమైనవి. ముస్లిం సమాజం పట్ల వ్యతిరేకతనూ విద్వేషాన్ని పెంచుతాయి. అన్ని హక్కులూ అధికారాలూ హోదా సామాజిక గౌరవం అనుభవించిన వర్గాలు తేలిగ్గా అల్ప సంఖ్యాకులను ముద్దాయిలను చేస్తాయి. అలా చేసేందుకు అవసరమైన పరిస్థితులను పాలకవర్గమే కల్పిస్తుంది.

సంస్కృతి పరిశ్రమను ఆధిపత్య కుల వ్యవస్థలో ఒక భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. కమల్ హాసన్ పట్ల సానుభూతిని చూపి, షారుఖ్ ఖాన్ పట్ల ఉదాసీనతను చూపించే స్పందనలు ఎలాంటి మానవీయమైన విలువలను ఈ సమాజంలో పాదుకొల్పలేవు. బహుళ సంస్కృతులున్న మన దేశంలో ఒకేఒక్క ఆధిపత్య సంస్కృతిని నిలబెట్టాలని చూస్తే అది కూలిపోక తప్పదు. అప్పుడు నిజంగానే కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ లాంటి మంచి కళాకారులు ఈ దేశంలో జీవించే లౌకిక పరిస్థితులేవీ ఉండవు.

- డా. జిలుకర శ్రీనివాస్

Andhra Jyothi Telugu News Paper Dated : 13/2/2013 

జోగినీల జీవితం దుర్భరం బందెల రాజశేఖర్‌


 - ఆదిలాబాద్‌    Sun, 10 Feb 2013, IST  

  • దరిచేరని సంక్షేమ పథకాలు
  • అమలుకు నోచని ప్రత్యేక చట్టాలు
  • అధికారుల నిర్లక్ష్యం, పట్టని పాలకులు
జోగినీలంటేనే అదో రకమైన చిన్న చూపు. వారితో అన్ని రకాల పనులూ చేయించుకుంటారు. ఇంటి పని మొదలు తమ కోరికలను సైతం తీర్చుకుంటారు. కానీ వారు వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నా పట్టించుకోరు. ఓ పక్క శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరో పక్క మూఢాచారాలు, సామాజిక రుగ్మతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సమాజర ఎంత అభివృద్ధి చెందినా జోగినీలు మాత్రం అట్టడుగు స్థాయిలోనే బతుకులు వెల్లదీస్తున్నారు. జోగినీలను ఇప్పటికీ అంటరానివారుగా చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వమూ వారి పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జోగినీల కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా వారు నేటికీ వివక్షకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో జోగినీల జీవన స్థితిగతులపై ఈ వారం 'ప్రజాశక్తి' ప్రత్యేక కథనం....
జిల్లాలో జోగినీల పరిస్థితి..
రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో జోగినీ వ్యవస్థ కొనసాగుతోంది. దేవదాసీలు, జోగినులు, మాతంగులుగా చెప్పుకునే వీరంతా ఎక్కువగా దళితులు ఉన్నారు. గతంలో వారు తమకు అధికంగా సంతానం కలగడం వల్ల అందరూ బాగుంటే ఆడపిల్లలను మాతంగిని చేస్తామని దేవుళ్లకు మొక్కుకునేవారు. అనుకున్నట్లుగానే తమ సంతానం నుంచి ఒకరిని గ్రామదేవత పేరుతో జోగినిగా వదిలేస్తారు. ఈ విధంగా జిల్లాలో అనాదిగా ఈ వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. ఇలా వదిలేసిన వారిని గ్రామ పెత్తందార్లు, దొరలు వారితో వెట్టిచాకిరీ చేయించుకునేవారు. వారితో అన్ని రకాల పనులు, చేయించుకునేవారు. గ్రామాల్లో కొందరు కామాందులు వారి కోరకలు తీర్చుకునేవారు. మరికొందరు దీర్ఘకాలికంగా వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. ఫలితంగా జోగినులకు సంతానం కలిగేది. సాధారణంగా అధికారుల రికార్డుల్లో పుట్టిన బిడ్డ పేరు పక్కన తండ్రి పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ జోగినులు, దేవదాసీల పిల్లల పేర్ల పక్కన వారి తల్లిపేర్లే ఉంటాయి. దీంతో దేవదాసీలకు, జోగినీలకు ఇళ్లుగానీ, జానెడు స్థలంకానీ లేకుండా పోయింది. జోగినీలు గ్రామాల్లోని దేవాలయాల్లో సేవలు చేస్తూ, యాచిస్తూ సంతానాన్ని పోషించుకునేవారు. ఈ విధంగా నేటికీ జోగినీలు దుర్భరమైన బతుకులు వెల్లదీస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు రెండు వేల మంది వరకు జోగినీ కుటుంబాలు ఉన్నట్లు అధికారుల అంచనా. రికార్డుల్లో మాత్రం వీరి జనాభా ఎంతుందో తెలియదు. జిల్లాలో ఎక్కువగా నిర్మల్‌ డివిజన్‌లోని నిర్మల్‌, సారంగాపూర్‌, ముథోల్‌, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, భైంసా మండలాల్లో జోగినుల కుటుంబాలు ఉన్నాయి. నిర్మల్‌ పట్టణం బుధవార్‌ పేటలో 32 కుటుంబాలు, కుర్రన్నపేట్‌లో 24, గొల్లపేట్‌లో మూడు, విశ్వనాథ్‌పేట్‌లో మూడు కుటుంబాలు నాయుడివాడ, బంగల్‌పేట్‌, రాంనగర్‌, గాజులపేట్‌లో రెండు కుటుంబాలు ఉన్నాయి. సారంగాపూర్‌ మండలం ప్యారమూరల్‌లో ఏడు, బీరవెల్లిలో 11, కౌట్ల(బి)లో ఒకటి, ఆలూర్‌లో నాలుగు, పంచర్‌లో మూడు, మలక్‌చించోలిలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఎవరూ చదువుకున్న వారు లేరు. జోగినీలెవరికీ భూమి లేదు. వీరంతా బీడీలు చుడుతూ, వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వారి పిల్లలను కూడా వారితోపాటే కూలికి తీసుకెళ్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారి దరిచేరడం లేదు. ప్రభుత్వాధి కారులు సైతం వారిని చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసి సమాజరలో గౌరవంగా బతికేటట్లు చూడాలని వారు కోరుతున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జోగినీలు అధికంగా ఉన్నట్లు 1984లో వెల్లడైంది. తొలిసారిగా జోగినీ వ్యవస్థ నిజామాబాద్‌ జిల్లా బినోలా గ్రామంలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆశామూర్తి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సమీపంలో సుమారు 70 మంది మహిళలు ఆమె చుట్టూ చేరారు. తమ పిల్లలను చూపించి తమకు కూడు, గూడు వంటి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. తాము జోగినీలమని, అనాదిగా గ్రామంలో ఈ వ్యవస్థ కొనసాగుతుందని, తమను కాపాడాలని మొర పెట్టుకున్నారు. వారి పరిస్థితిని చూసిన కలెక్టర్‌ జోగినీ వ్యవస్థపై అధికారులతో పూర్తి సమాచారం సేకరించారు. ఈ వ్యవస్థపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి 1984లోనే అధికారికంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి వరకు ఈ వ్యవస్థ ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లోనే లేదు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించ లేదు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం యాక్ట్‌ సంవత్సరం 10/1998 చట్టాన్ని చేసింది. వి.రాఘునాథరావు అధ్యక్షతన ఏక సభ్య కమిషన్‌ నియమించింది. జోగినీ వ్యవస్థపై క్షేత్రస్థాయిలో అధ్యయనం కోసం 2011 జనవరిలో గుంటూర్‌ జిల్లా బాపట్ల కేంద్రంగా 12 రోజులపాటు ఈ కమిటీ పర్యటించింది. 18 జిల్లాలో ఈ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవస్థను నిర్మూలిం చేందుకు, జోగినీలకు పునరావాసం కల్పించేందుకు 1998లో ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం జిల్లాలో అమలు కాకపోవడం, జోగినీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయకపోవడం వల్ల వారు నేటికీ దుర్భర జీవితాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది
జిల్లాలో జోగినీలు సామాజికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టంచుకోవడం లేదు. వారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దరిచేరడం లేదు. జోగినీలకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చి బోరుబావులు తవ్వించి విద్యుత్‌ సౌకర్యం, మోటార్లు పైప్‌లైన్‌ కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలో నాలుగో తరగతి ఉద్యోగులుగా అవకాశం కల్పించాలి. వారి పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్‌, ఉద్యోగ నియామకాలను చేయడానికి ఇఓలను విడుదల చేయాలి. అంత్యోదయ, అన్నయోజన పథకం కింద రేషన్‌ కార్డులు మంజూరు చేయాలి. ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేయాలని చట్టంలో పొందుపరిచారు. కాని జిల్లాలో జోగినీల పిల్లలకు చదువు చెప్పించకుండానే వారితోబాటు కూలికి తీసుకెళ్తు న్నారు. వారిలో ఎవరు చదవకపోవడం వల్ల ఉద్యోగానికి అర్హులు కాలేకపోయారు. వారి చట్టాలే వారికి తెలయకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఉపయోగించు కోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో ప్రభుత్వం జోగినీలకు పునరావాస చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముందుగా 60 మందికి పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చింది. కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కానీ మౌలిక సౌకర్యాలు కల్పిండం మరిచిపోయింది. స్వయం ఉపాధి కోసం రుణాలు, కుట్టుమిషన్లు ఇచ్చింది. దానికి సంబంధించిన శిక్షణ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పునరావాసంపై అవగాహనలేక అటకెక్కింది.ల


మా బతుకులను ప్రభుత్వమే మార్చాలి -తోడేళ్ల భూలక్ష్మి, లోకేశ్వరం
మాకు సెంటు భూమి లేదు. బీడీలు చుట్టుకొని బతుకు తు న్నాం. నాకు ఇద్దరు కూతుళ్లు. వారిని చదివించలేక మాతోపాటు ఓ కూతురు బీడీలు చూడుతోంది. మరో కూతురు కూలీకి వెళ్తుతోంది. నాకు వయసు మీద పడింది. ప్రభుత్వం నుండి రూ.200 పింఛన్‌ వస్తోంది. కాని దాంతో బతకడం కష్టంగా ఉంది. మాకు నెలసరి పింఛన్‌ రూ.1500 ఇవ్వాలి. నెలకు నాలుగు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అవి సరిపోక బయట కొని తింటు న్నాం. మమ్మల్ని ఆదుకుని మా బతుకులను ప్రభుత్వమే మార్చాలి.


మా పిల్లకైనా ఉద్యోగం ఇవ్వాలి : ఆస్తం ముత్తవ్వ, లోకేశ్వరం
నాకు ఒక కూతురు. నేను కూలీ నాలీ చేసి నా కూతుర్ని చదవిస్తున్నాను. మాకు ప్రభుత్వం నుంచి నెలకు 200 పింఛన్‌ తప్ప ఏమీ అందడం లేదు. మాకు గుడిసె తప్ప సెంటు భూమి లేదు. మా పిల్లకైనా ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.


మా తరం పోయింది.. పిల్లలనైనా ఆదుకోండి: సౌడల్ల నాగవ్వ : లోకేశ్వరం
జోగినులుగా ఎన్నో కష్టాలు భరించాం. నేను ఇప్పటికీ దొర గారింట్లో వంట పనులు చేసుకుంటూ బుతుకుతున్నా. ఇక మాతరం ముగి సింది. మా పిల్లల భవిష్య త్తన్నా బాగుం డాలి. వారిని ప్రభుత్వం ఆదుకుని ఏదైనా ఉద్యోగం కల్పించి గౌరవంగా బతికేట్లు చూడాలి.
జోగినీల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం - పోతురాజుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మహిపాల్‌ ప్రభుదాస్‌
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జోగినీలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్లే జోగినీ వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. వారి కోసం ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టినా అమలులో అధికారులు విఫలం చెందారు. తెలియని వారికి అవగాహన కల్పించడం లేదు. దీంతో సంక్షేమ పథకాలు దరి చేరడం లేదు. జోగినీ వ్యవస్థను రూపుమాపేందుకు పోరాటం చేస్తున్నాం. జోగినీల కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పించడమే అంతిమ లక్ష్యంగా పోరాడుతాం

Prajashakti Telugu News Paper Dated : 10/2/2013

సాహిత్యంలో దళిత స్త్రీలు ---ఆరికొండ ప్రతాప్‌ కుమార్‌



'దైవ ప్రసాదిత కుంతి సంతతిలో
ఒక్క ఆడజీవి ఉన్నా మీకు బోధపడేది
కుంతి కాదు ఏ ఇంతి కనబడ్డా
గర్భదానపు దేవుళ్లు పైనుంచి దిగుతారు
తేడా అల్లా -
సహజ కవచ కుండలాలతో 'కర్ణుడు' పుట్టినట్లు
సహజ గర్భసంచితో ఒక 'కర్ణిక' పుట్టకపోవడమే!
(పుల్లింగ న్యాయ ధిక్కారం)
దళిత కులాల్లోని సంప్రదాయాలకు, పూజలకు పునాది స్త్రీలే! అయితే దళిత స్త్రీల సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యమేనన్న భావన ఉంది. దళిత స్త్రీల చరిత్రని, తాత్విక చింతనని, జీవన సరళిని, ఆలోచనా ఒరవడిని, మనోభావాలను చూడాలంటే జానపద రూపంలో ఉన్న సాహిత్యంలోకి తొంగి చూడాల్సిందే! స్త్రీవాద దృక్పథంతో రాసిన రచనలకు స్త్రీవాద సంకలనాల్లో, దళిత దృక్పథంతో రాసిన రచనలకు దళిత సంకలనాల్లో స్థానం లభించింది. కుల, పితృస్వామ్య, వర్గ, ప్రాంతీయ అణచివేతలతో కూడిన బహుముఖ సమస్యలను ఏకకాలంలో ఎదుర్కొంటున్న దళిత స్త్రీల అనుభవ వ్యక్తీకరణకు సాహిత్య శిబిరాలతో స్థానం తక్కువగానే ఉంది.
దళిత స్త్రీ సాహిత్య పరిణామం
ఆది ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి నేటి ఆత్మగౌరవ పోరాటాల వరకూ దళిత స్త్రీలు రచనలు చేస్తున్నారు. 1940కి ముందు దళిత స్త్రీలకు చదువు అందనంత దూరంలో ఉంది. నిరక్షరాస్య జనాభాలో దళిత స్త్రీలే అధిక శాతం ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిలకరించినట్లుగా ఉన్న దళిత మహిళా విద్యావంతుల్లో కవులు, మేధావులు, కళాకారులు, పండితులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, పోలీసాఫీసర్లు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు, విశ్లేషకులు, పరిశీలకులు, విమర్శకులు, సంపాదకులు, కాలమిస్టులు ఉన్నారు. వీరు అనేక సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు, చేస్తున్నారు. కొన్ని ఆధునిక ప్రక్రియలను తెలుగు సాహిత్యానికి మొదటిసారిగా పరిచయం చేసిన రచయిత్రులు కూడా ఉన్నారు. 'హైకూలు' రాసిన తొలి దళిత రచయిత్రి స్వరూపరాణి. వీరిలో ఎక్కువమంది పిల్లలు, స్త్రీల విషయాలను సాహిత్య వస్తువుగా తీసుకోవడం కన్పిస్తుంది.
దళిత పురుషులతోనూ, అగ్రకుల స్త్రీలతోనూ పోల్చినప్పుడు అత్యధిక పీడనకు గురవుతున్నది దళిత స్త్రీలే! దళితవాదం ఒక స్పృహగా 20వ శతాబ్దం మొదటి నుంచీ తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్నా, ఒక చైతన్య రూపంగా జాషువా నుంచి వికసిస్తున్నా, ఒక ప్రతిఘటన రూపంగా హేతువాద, నాస్తికవాద, సామ్యవాద ఉద్యమాల్లో పెంపొందుతున్నా, 1980ల నుంచే పోరాట స్పృహ రగులుతూ వచ్చింది. 1990ల నుంచి స్పష్టంగా ఒక సమగ్ర వికాసాన్ని సాధిస్తోంది. సాహిత్యంలో దళితవాదం నేపథ్యం పరిశీలిస్తే - భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సాహిత్య వాదాల పరిణామం భిన్న రీతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 1930ల నుంచీ సాహిత్యంలో మార్క్సిస్టు దృక్పథం ప్రధాన స్రవంతిగా ఉంది. అది అనేక రూపాల్లో సాహిత్య సృజనలో ప్రతిఫలించింది. సాహిత్యంలో సంఘర్షణ ఒక వాదంగా ముందుకు రావడానికి పునాదితోనే బయలుదేరిన అసంతృప్తి ఎంతోకాలంగా రగలి రగిలి అనుకూలమైన ఒక సామాజిక బిందువు దగ్గర విస్ఫోటనం చెందుతుంది. దళిత సాహిత్యానికి ఈ విస్ఫోటన దశ 1990 నుంచి ప్రారంభమై, సాహిత్య ప్రక్రియలన్నింటినీ వేగంగా ప్రభావితం చేసింది.
భారత వ్యవసాయోత్పత్తిలో 90 శాతం మంది దళిత, దళితేతర కులాల స్త్రీలు పాల్గొంటున్నారు. ఇందులో లింగ ప్రాతిపదికతోపాటు కుల ప్రాతిపదికన కూడా శ్రమ విభజన జరిగింది, జరుగుతోంది. వీరి శ్రమకు విలువ లేనితనాన్ని రుద్దడంలో ఈ వ్యవస్థ తొలినుంచీ బలంగానే పనిచేస్తోంది. దళిత, వెనుకబడిన కులాల, ముస్లిం, గిరిజన స్త్రీలను హిందూ ఆధిపత్య కుల పితృస్వామ్యం అదుపులో ఉంచి క్రూరంగా అణచివేస్తోంది. ఈ వాస్తవికతని స్త్రీల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్త్రీలకు, దళితులకు వర్ణ వ్యవస్థలోనే సంక్షేమాన్ని కోరిన గాంధీ కొటేషన్లు ప్రజాస్వామ్య ఉద్యమాలకు, స్త్రీవాదానికి ఆదర్శం కాలేదు.
సమాజంలోని శ్రమ, పెళ్లి, పుట్టుక, మాట్లాడే పద్ధతి, చావు, తిండి, సంప్రదాయాలు, అలంకరణ మొదలైనవి గమనించదగినవి. సమాజంలో కించపరచబడే పనిముట్లు, శ్రమ దళిత కులాల్లో గౌరవింపబడుతూ జీవనాధారంగా స్వీకరింపబడతాయి. ఉదాహరణకు : పొలాల్లో పంటను కోసిన తరువాత కుప్పలు నూర్చి కల్లంలో తయారైన రాశులను సంచులకు ఎత్తుతారు. భూస్వామి ఇంటికి ధాన్యం తరలించిన తరువాత దళిత స్త్రీలు చాట, కొయ్యలు, కుంచి బట్ట తీసుకొని ఆ కల్లంలోకి వెళతారు. మట్టిలో కలిసిన ధాన్యపు గింజలను మట్టి, తాలు, వడిపిలి, గడ్డిగింజల నుంచి దఫాదఫాలుగా వేరు చేస్తారు. దీనినే 'లేకి కల్లం' అని, ఇందులో ఉపయోగించే చాటనే 'లేకి చాట' అని అంటారు. లేకి అనే మాట చేర్చటం ద్వారా ఇక్కడ శ్రమను హీనపర్చటం మనం గమనిస్తాము. దళిత కులాల్లోని సంప్రదాయాలకు, పూజలకు పునాది స్త్రీలే! ఇక్కడ శ్రమకూ, శ్రమలో స్త్రీల పాత్రకూ ప్రాధాన్యం కనిపిస్తుంది. దళితుల పండగల వ్యవహారంలో పురుష దేవుళ్లు కనబడరు. అందరూ స్త్రీ దేవతలే! వారిని గ్రామ దేవతలుగా కూడా చూస్తారు. దీన్నిబట్టి వీరికీ, హిందూ దేవుళ్లకూ గల తేడా గమనించవచ్చు. హిందూ దేవతలు పురుష దేవుడి పక్కన, పువ్వులు, చెంబులు, దీపాలు పట్టుకొని లేదా భర్త కాళ్లు పడుతూనో కనిపిస్తారు. దళితలు పూజించే దేవతలు వేప కొమ్మలు, మొంట్య (చిన్నచాట), లక్క కోలలు (కర్రతో చేసిన బొమ్మలు) పట్టుకొని వివిధ స్థలాల్లో, చెట్టు కింద సాదా సీదాగా చిన్న గుడిలోనో లేదా బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటారు. వీరి దరిదాపుల్లో పురుష దేవుళ్లు కన్పించరు.
దళిత ఉద్యమాలు - స్త్రీలు
దళిత పురుష కవులు కులవృత్తిని, పనిముట్లని సాహిత్యంలో పొందుపరిచారు. తమదైన భాష, సంస్కృతి, సంప్రదాయాలుగా, ఆత్మగౌరవంతో చాటి చెప్పారు. దళిత స్త్రీల పట్ల మాత్రం పితృస్వామ్య ధోరణులే కనబరిచారు. 'మానం పోతే కడుక్కోగలం.. రవిక పోతే కొనుక్కోలేము' అనే వ్యాఖ్యానాలు దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రవిక పోతే కొనుక్కోలేకపోవడం పేదరికానికి ప్రతీక. దానిలో ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. అంతమాత్రాన దళిత స్త్రీ ఆత్మగౌరవం పోగొట్టుకోవడమనేది ఎన్నటికీ తక్కువ కాదు కదా! కుల వ్యవస్థ రాజ్యమేలే నిచ్చెన మెట్ల సమాజంలో పెత్తందారులకు దళితులంటే చులకన - దళిత స్త్రీలంటే మరింత చులకన. దళిత పురుషులు శ్రమ దోపిడీకి గురైతే, దళిత స్త్రీలు - శ్రమ దోపిడీతోపాటు లైంగిక దోపిడీకి కూడా గురవుతున్నారు. దళిత స్త్రీ తన పైకులాల పురుషుల నుంచే కాక, తన సొంత మగవాళ్ల నుంచి కూడా పీడనను భరిస్తోంది. దీనిని ప్రత్యేక దృష్టితో అర్థం చేసుకోవాలి. స్త్రీల మనోగతాన్ని వ్యక్తీకరించటంలో పురుషాధిపత్యం, దానిని ప్రభావిత పదజాలం పెచ్చరిల్లటం మంచిది కాదు.
దళిత స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా నడచిన పోరాటాల్లో నష్టపరిహారం, ఆత్మగౌరవం అనే రెండు అంశాలూ సమభాగం కావాల్సి ఉంది. దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న కుటుంబ హింస, గర్భధారణ, ప్రసూతి బాధలు, చావులను అంచనా వేయలేకపోవడం మొదలైనవి. నేడు దళితేతర స్త్రీలు, దళిత స్త్రీలు, గిరిజన స్త్రీలు, హిందూయేతర మతాల స్త్రీలు వారి హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితి నెలకొంది. దళిత పురుషులు కూడా దళిత స్త్రీని ఒక బాధితురాలిగానో, తమ నీడన నిలబడే వారిగానో గుర్తిస్తున్నారేగానీ, హక్కులు కలిగిన వ్యక్తిగా, పోరాడే శక్తిగా గుర్తించడంలో వెనుకబడ్డారనే చెప్పాలి. సాంఘిక, లైంగిక అంశాలతో దళిత స్త్రీలకు ప్రత్యేక సమస్యలు, పోరాటాలు, హక్కులు, సంఘీభావం అవసరమనే విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దళిత ఉద్యమాల్లో కూడా స్త్రీల ప్రశ్నలు పితృస్వామ్య భావజాలం చాటున సరిగ్గా చర్చకు రాకపోవడం, ఉద్యమం వారిని ఉపయోగించుకొని, తర్వాత పక్కకి తోసేయడం జరుగుతూనే ఉందనే విషయాన్ని అనేకమంది దళిత స్త్రీల అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. 1978 తరువాత వచ్చిన తిమ్మ సముద్రం, కారంచేడు, చుండూరు ఉద్యమాల్లో దళిత స్త్రీలు నాయకులు గానూ, రచయితలుగానూ, ఆత్మగౌరవ దళిత ఉద్యమాన్ని నిర్మించడంలో బలమైన పాత్రని పోషించారు. ఈ కోణంలో దళిత మహిళల సమస్యలపై రచయిత్రులు వెలువరిస్తున్న కథలూ, కవిత్వం, ఇతర రచనలూ ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
- ఆరికొండ ప్రతాప్‌ కుమార్‌ 
Prajashakti Telugu News Paper Dated : 10/2/2013

Sunday, February 10, 2013

స్త్రీవాదాన్ని విస్తృతార్థంలో చూద్దాం! - ఎ. సునీత



 స్త్రీల ఉద్యమాలకూ, స్త్రీవాదులకూ, దళిత బహుజన, మైనారిటీ స్త్రీలూ, వారి సమస్యల పట్ల వున్న అవగాహన, నిబద్ధత పట్ల ఆయా సమూహాలకు చెందిన మేధావులు సందేహాలు వ్యక్తం చేయటం ఇరవై ఏళ్ల నుండి జరుగుతోంది. ఢిల్లీ సంఘటన నేపథ్యంలో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయింది. 'వివిధ' (21.1.13)లో సుభద్ర వ్యాసం ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసి మంచి చర్చకు తెరతీసింది.

సుభద్ర తను పరిశీలించిన పుస్తకాలలో ఎక్కువశాతం అగ్రకుల రచయితలే ఉన్నారన్న పరిశీలన సరైనదే. స్త్రీవాదం అందరి స్త్రీల కోసం పనిచేయాలంటే, స్త్రీవాద ఉద్యమాలూ, స్త్రీవాదము దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల జీవితాల గురించీ, దృక్పథాల గురించీ చాలా నేర్చుకోవాలని జూపాక సుభద్ర చెప్పకుండా చేసిన సూచనతో విభేదించడమూ కష్టం. అయితే, ఆయా స్త్రీవాద ప్రచురణలను అంచనా వేయడానికీ, దానిపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదాన్ని గురించి ఒక అంచనాకు రావటానికి, సుభద్ర అనుసరించిన ప్రచురణల పరిమిత పరిశీలన సరిపోతుందా? 1970లలో స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పటి నుండీ 2013 వరకూ, వివిధ చారిత్రక సందర్భాల్లో వచ్చిన రచనలను ఇటువంటి విశ్లేషణా చట్రంలో పరిశీలించటం సాధ్యమేనా? ఈ ముప్ఫై ఏళ్లల్లో స్త్రీవాదంలో ఏ మార్పులూ రాలేదా? ఈ మార్పుల్లో సుభద్ర వంటి దళిత బహుజన మేధావుల పాత్ర ఎలాంటిది? అసలు స్త్రీవాదాన్ని ఆయా సంస్థలకు, గ్రూపులకు కుదించటం సాధ్యమేనా?

స్త్రీవాదంతో గత మూడు దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న 'అన్వేషి' సభ్యురాలిగా నేను సుభద్ర మొదలుపెట్టిన చర్చను ముందుకు తీసుకువెళ్లాలంటే, స్త్రీవాదాన్ని అంచనా వేయడానికి తాననుసరించిన పరిమిత పరిశీలనా చట్రం కాక, మరింత విస్తృతమైన విశ్లేషణా చట్రం అవసరం. దానికోసం, స్త్రీవాదం వచ్చిన చారిత్రక సందర్భాన్ని, గత ముప్ఫై ఏళ్లల్లో దళిత ఉద్యమాల నుండీ, దళిత స్త్రీల నుండి వచ్చిన సవాళ్లను గుర్తుచేసుకోవాలి. 1970లలో వచ్చిన స్త్రీవాదులు ప్రధానంగా అగ్రకులాలకి చెందినవారే. అప్పటి స్త్రీవాదులకి, వామపక్ష వాదం నుంచి విడివడి, స్త్రీల సమస్యలు ప్రత్యేకమని, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రత్యేక పోరాటం అవసరమనీ వాదించటం చారిత్రకంగా ప్రధానమయింది. 1980ల వరకూ స్త్రీల వ్యతిరేక చట్టాలను మార్చటం, హింసకు వ్యతిరేకంగా కొత్త చట్టాల కోసం పోరాటాలు జరిగాయి. మథుర, రమీజ బీ వంటి ఆదివాసీ, ముస్లిం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపినా, వారి ఆదివాసీ, ముస్లిం అస్తిత్వాలు, వాటితో ముడిపడి ఉన్న సమస్యలు పెద్దగా ముందుకు రాలేదు. అందరు స్త్రీలకూ పిత్రుస్వామ్యమే ప్రధాన శత్రువనే అవగాహనా ఆ రోజుల్లో ఉండింది. ఆ సమయంలోనే 'మనకు తెలియని మన చరిత్ర' పుస్తకం వచ్చింది.

ఈ అవగాహన, 1990-92లలో మారవలసి వచ్చింది. మండల్ కమిషన్ నివేదిక విడుదల, చుండూరు ఊచకోతల సందర్భంలో దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలూ, బాబ్రి మసీదు కూల్చివేత తరువాత లౌకికవాదంపై ముస్లింలు లేవనెత్తిన సందేహాలూ స్త్రీవాదుల్ని కుదిపేశాయి. స్త్రీలంతా ఒకటి కాదనీ, దళిత, ముస్లిం స్త్రీల జీవితాలను కుల వ్యవస్థా, హిందూ జాతీయవాదం శాసిస్తున్నాయనే అవగాహన స్త్రీవాదులకు నెమ్మదిగా రావటం మొదలయింది. రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఏర్పడిన సమతా సంఘటనలో హైదరాబాదులోని స్త్రీవాదులు భాగం కావటం, చుండూరు ఘటన గురించి రాయటం, కులం, జెండర్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం 1990-2000 మధ్య జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉద్యమం కూడా కుల సమస్యని పట్టించుకోవటం ఈ దశాబ్దంలో వచ్చిన ముఖ్య మార్పు. స్త్రీల ఉద్యమాల, దళిత ఉద్యమాల మధ్యలో దళిత స్త్రీలు ఎక్కడనే ప్రశ్నని చల్లపల్లి స్వరూపరాణి 1990ల మధ్యలో లేవనెత్తే వరకూ, దళిత స్త్రీల ప్రశ్న ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టంగా రాలేదు.

దళిత స్త్రీలు బాధితులు కారనీ, వారికీ ప్రత్యేక దృక్కోణం ఉందనే విషయాన్ని ఆమె చెప్పారు. విషయాలని అర్ధం చేసుకోవటానికి, అప్పటికున్న పితృస్వామ్యాన్ని కేంద్రంగా చేసుకున్న స్త్రీవాద చట్రాన్ని ప్రశ్నించటం ఆంధ్రప్రదేశ్ స్త్రీవాదులలో అప్పుడే మొదలయింది. సూసి తారు, కల్పనా కన్నబిరాన్ ఇటువంటి సందర్భంలోనే తమ తమ సందేహాలను సిద్ధాంతీకరించారు. 2000 నుండి దళిత, ముస్లిం, బహుజన స్త్రీలు స్త్రీవాదాన్ని కుదిపి వేసి, దాన్ని పునర్నిర్వచిస్తున్నారు. సుభద్రతో సహా, చల్లపల్లి స్వరూపరాణి, వినోదిని, షాజహానా, జాజుల గౌరీ, గోగు శ్యామల, సూరేపల్లి సుజాత వంటి అనేక సాహితీ-సిద్ధాంతవేత్తలు తమ తమ రచనల్లో- కుటుంబం, భూమి, ఇల్లు, కమ్యూనిటీ, హింస, హక్కులు, ప్రాంతం, రాజకీయాలు, పంచాయితీలు, మతము- వంటి అనేక విషయాలని తమదైన స్త్రీవాద దృక్పథంలో విశ్లేషించి వాటిని చూడవలసిన దృక్పథాలని పునరాలోచించేలా చేస్తున్నారు. అప్పటికే, 1990లలో కుల సమస్య గురించి ఆలోచించటం మొదలుపెట్టిన అన్వేషి సంస్థ నుండి గోగు శ్యామల 'నల్లపొద్దు' సంకలనాన్ని తీసుకొచ్చారు.

2000 తరువాత, 'మట్టిపూలు' వంటి దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల రచయిత్రుల వేదికలొస్తే, ఇంకో పక్క దళిత స్త్రీశక్తి వంటి దళిత స్త్రీల హక్కుల సంఘాలు కూడా వచ్చాయి. గోగు శ్యామల, దళిత రాజకీయవేత్త సదాలక్ష్మి జీవిత చరిత్ర 'నేనే బలాన్ని' అనే పుస్తకం రాసారు. దళిత స్త్రీలు స్త్రీవాదాన్ని విస్తృతం చెయ్యటమే కాక, బలంగా, లోతుగా విశ్లేషిస్తున్నారు. 'అన్వేషి' వంటి స్త్రీవాద పరిశోధన కేంద్రాలు, దళిత, మైనారిటీ సమస్యల పరిశోధనకై ప్రత్యేక విభాగాలు ప్రారంభించి, అనేక రకాల పరిశోధనలు జరగడంలో తోడ్పడుతున్నాయి. ఈ రకమైన విస్తృత విశ్లేషణా చట్రంలో చూసినప్పుడు, స్త్రీవాదానికి, దళిత బహుజన స్త్రీల దృక్పథాలకీ మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ ఒకే రకంగా లేదనీ, దృక్పథాలు మారుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదం రకరకాలుగా స్పందిస్తూ వచ్చిందనీ అర్ధమవుతుంది. అప్పుడు, అంటే 1990ల ముందు వచ్చిన రచనలనీ, తరువాత వచ్చిన రచనలనీ, సంఘాల, గ్రూపుల కార్యాచరణని కూడా వేరుగా చూడాలి. 

అగ్రకుల స్త్రీలు రాసినవయినా సరే, వాటిలో దళిత, మైనారిటీ, ఆదివాసీ స్త్రీల ప్రత్యేక చరిత్రలనూ, జీవితాలనూ, దృక్పథాలనూ పరిగణనలోకి తీసుకున్నాయా, ఎంతమేరకు తీసుకున్నాయనే ప్రశ్న వేసుకోవాలి. స్త్రీవాదాన్ని నిర్వచించే విశ్లేషణ చట్రంలో, ఆయా సంఘాల, గ్రూపుల కార్యాచరణలో, దళిత, ఆదివాసీ, మైనారిటీ స్త్రీల సిద్ధాంతాలకూ, రచనలకూ ఎటువంటి పాత్ర ఉందనే ప్రశ్న కూడా అడగాలి. ఈ దృక్పథంలో అన్వేషి పుస్తకం స్త్రీవాద రాజకీయాలూ-వర్తమాన చర్చలు సంకలనంలో, సుభద్ర అంచనా ప్రకారం, గోగు శ్యామల రాసిన ఒక్క వ్యాసం తప్ప మిగిలినవన్నీ అగ్రకుల స్త్రీల జీవితాల చుట్టూ, వారి సమస్యల గురించి మాత్రమే ఉన్నాయి. 1990ల తరువాత స్త్రీవాద సిద్ధాంతాలలో వచ్చిన కొత్త చర్చలని కొన్ని ఇంగ్లిష్‌లో వచ్చినవి తెలుగులోకి అనువదించి, కొన్ని తెలుగులో రాసిన పరిశోధనా వ్యాసాలు కలిపి ఈ పుస్తకాన్ని అన్వేషి వేసింది. దీని కూర్పు 1990లలో మొదలయ్యి, పూర్తి కావటానికి పదేళ్లు పట్టడంతో సుభద్ర విమర్శ కొంత సరైనదే అనిపిస్తుంది.

అయితే, విషయ పరిశీలనకు వచ్చినప్పుడు, ఆ విమర్శకున్న పరిమితులు కూడా అర్థమవుతాయి. సజయ వ్యాసం భూమి కోసం బహుజన స్త్రీలు, దళిత స్త్రీలు, ఆదివాసి స్త్రీలు చేస్తున్న పోరాటాల గురించి, వారి గొంతుల ద్వారా చర్చించి, ఆ పోరాటాల ఫలితాలు అగ్రకుల పితృస్వామ్యం వల్ల ఏ విధంగా వారి కందకుండా పోతున్నాయనే విషయాన్ని చర్చిస్తుంది. లలిత వ్యాసం ప్రపంచీకరణ నేపథ్యంలో పేద స్త్రీల కోసమంటూ నడిపిస్తున్న పొదుపు కార్యక్రమాలు, ఏ రకంగాను వారి స్వశక్తిని పెంపొందించడం లేదనీ, జిల్లా యంత్రాంగానికి వీరిమీద ఇంకా నియంత్రణ కల్పించేటట్లు ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయని, పోరాడే సత్తా వున్న దళిత స్త్రీలను వీటిల్లోకి రానివ్వకుండా చేస్తున్నారని చెప్పారు. ఇక తెలుగేతర స్త్రీవాద వ్యాసకర్తల దగ్గరికి వస్తే, వందన సోనల్కర్ వ్యాసంలో అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ చేసిన వాదనల నేపథ్యంలో స్త్రీవాదులు రిజర్వేషన్లను, ఉమ్మడి పౌర చట్టం వంటి పౌరసత్వ హక్కులను చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ విషయాల పట్ల మహారాష్ట్రలోని దళిత స్త్రీల సంఘాల వాదనలు, వాటిలో కూడా వస్తున్న మార్పులను కూడా చర్చించారు. స్త్రీవాదులంటే ఎవరు, ఏ ఏ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చారు, వారి దృక్పథాలు ఏర్పడటంలో దాని పాత్ర ఆవిడ చర్చిస్తారు. ఫ్లావియా అగ్నెస్, బాబ్రీ మస్జిద్ తరువాత చెలరేగిపోయిన హిందుత్వవాద నేపథ్యంలో స్త్రీల ఉద్యమం తన ఎజెండా పునర్‌నిర్వచించుకోవాలని వాదిస్తారు. ముస్లిం స్త్రీల, ముస్లిం కమ్యూనిటీకున్న ప్రత్యేక పరిస్థితులని అర్థం చేసుకోలేని నేపథ్యంలో అది హిందూ స్త్రీల ఉద్యమంగా మిగిలిపోతుందని అంటారు. ముస్లిం స్త్రీల హక్కుల గురించి పనిచేయడమే కాక, క్రైస్తవ వివాహ చట్టంలో మార్పుల కోసం అపారమైన కృషి చేసిన వారు ఫ్లావియా. భారతదేశంలో స్త్రీవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, అంబేద్కర్ కులం, జెండర్ కలిపి విశ్లేషించిన విధానాన్ని అలవర్చుకోవాలి, అనే వందనా సోనల్కర్ వాదన, ముస్లిం స్త్రీల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఇస్లాం మతం గురించి కాక 1990ల తరువాత హిందూత్వవాద భావజాలాన్ని, ఉమ్మడి పౌరసత్వ రాజకీయాలనీ అర్ధం చేసుకోవాలనే ఫ్లావియా వాదనా ఈ సంకలనంలో విలువైనవి. శ్యామల వ్యాసంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం వుంది.

అయితే ఇటువంటి విషయ పరిశీలన జరగటానికి, ఇంతకు ముందు చెప్పినట్లు విశ్లేషణ చట్రాన్ని విస్తృతం చేసుకోవటం చాల అవసరం. ముప్ఫయ్యేళ్లలో దళిత ఉద్యమ ఫలితంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఉద్యమాలతోపాటు, స్త్రీవాద ఉద్యమం కూడా కుల సమస్యను అనివార్యంగా సీరియస్‌గా తీసుకోవటం మొదలైంది. అలా గుర్తించిన స్త్రీవాదం గురించిన ప్రశ్నలను మార్చటం కూడా అవసరం. ఇంకా లోతుగా, నిశితంగా అడగటం మరీ అవసరం. స్త్రీవాదం కొన్ని వర్గాల, కులాల స్త్రీలకూ, కొన్ని సంస్థలకూ, గ్రూపులకూ పరిమితం కాకుండా ఉండాలని, రాజకీయంగా జీవించి ఉండాలని ఆశించే వారికి, అగ్రకులంలో పుట్టినవారికైనా, దళితులుగా నిర్వచించుకున్నవారైనా- అందరికీ ఇది ముఖ్యం, అవసరం. ఈ చర్చకు తెరతీసిన సుభద్రకు అభినందనలు.

- ఎ. సునీత
సీనియర్ ఫెలో, అన్వేషి

Andhra Jyothi Telugu News Paper Dated : 11/2/2013