సంస్కృతి పరిశ్రమను ఆధిపత్య కుల వ్యవస్థలో ఒక భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. కమల్ హాసన్ పట్ల సానుభూతిని చూపి, షారుఖ్ ఖాన్ పట్ల ఉదాసీనతను చూపించే స్పందనలు ఎలాంటి మానవీయమైన విలువలనూ పాదుకొల్పలేవు.
సవర్ణ పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మించే సాంస్కృతిక పరిశ్రమ ఉత్పత్తులకు పీడిత కుల శ్రామిక వర్గాలు కేవలం వినియోగదారులుగా మాత్రమే ఉంటాయి. పాశ్చాత్య సాంస్కృతిక పరిశ్రమ గురించి అడార్నో తర్వాత విలియం రేమాండ్స్, ఫ్రెడ్రిక్ జేమ్‌సన్, జిజెక్ వంటి తత్వవేత్తలు అనేక రచనలు చేశారు. కానీ మన దేశ సంస్కృతి పరిశ్రమ విభిన్నమైంది. దాని రాజకీయ తాత్విక పునాది అందుకు కారణం. భారతదేశంలో వలస పాలన కాలం నుంచీ రూపొందుతూ వచ్చి, ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైన సాంస్కృతిక పరిశ్రమ స్వభావం గురించీ దాని పరిణామాల గురించీ తగినంత చర్చ జరగలేదన్నది విమర్శకుల అభిప్రాయం. పాశ్చాత్య సమాజంలోని సాంస్కృతిక పరిశ్రమకు పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత బలపర్చే కార్యక్రమం ఉన్నట్టే, మన దేశంలోని పరిశ్రమకు కొన్ని సామాజిక వర్గాల ఆధిక్యాన్ని మరింత శక్తిమంతం చేసే ఎజెండా ఉంది. ఆ క్రమంలోనే అది అనేక సమస్యలను చాలా తెలివిగా చర్చకు పెడుతూ ఉంటుంది.
'విశ్వరూపం' చిత్రం వివాదం ఆసక్తికరమైన అంశాలను చర్చకు తెచ్చింది. కమల్ హాసన్ గొప్ప కళాకారుడు. తన చిత్రాన్ని ముస్లిం వ్యతిరేకమైందిగా చిత్రిస్తూ నిషేధించడాన్ని ఆయన తప్పు పడుతున్నారు. ఇలాంటి మతతత్వవాదులున్న చోట జీవించలేననీ, లౌకికవాదం ఉన్న మరెక్కడికైనా వెళ్లి బతకాలని ఉందని కమల్ అన్నారు. ఆయన నోటివెంట అలాంటి మాటలు విన్న అనేక మంది అభిమానులు బాధపడ్డారు. ఆయనకు కష్టం కలిగిస్తున్న వారి మీద, వారి మతం మీద తీవ్రమైన అసంతృప్తిని ప్రకటిస్తున్నారు. ముస్లిం సమాజం అంటేనే ఒక సమస్యగా భావించే మతతత్వవాదులకు ఇదొక మంచి అవకాశంగా లభించింది. కమల్ హాసన్ పట్ల సానుభూతిని ప్రదర్శించే వారి సంఖ్య చాలా ఎక్కువ. కళను కళగానే చూడాలని హితబోధ చేసే ధార్మిక పండితులకూ ఇదొక చక్కని అవకాశం. కమల్ హాసన్‌కు అలాంటి అభద్రతా భావం కలగడానికి కారకులెవరైనా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఆయన ఆవేదన పట్ల ఇంతగా చలించిపోతున్న వారికి షారుఖ్ ఖాన్ వేదన ఎందుకు పట్టడం లేదో ప్రశ్నించాలి.
షారుఖ్ ఖాన్ గొప్ప కళాకారుడని ఎవరి ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. ఆయన నటనా వైదుష్యం విమర్శకులనే కాదు కోటానుకోట్ల మంది అభిమానులను మెప్పించింది. కానీ, మన దేశంలోని మత వివక్ష, అంతర్జాతీయంగా ముస్లిం వ్యతిరేకత వల్ల ఆయన చవి చూసిన అవమానాల గురించి ఒక వ్యాసంలో చాలా హృదయ విదారకంగా రాసుకున్నారు.
ఆయన మనో వేదనను అర్థం చేసుకున్న చలన చిత్ర ప్రముఖులెవరూ కనిపించలేదు. ఆయనకు సంఘీభావం తెలిపిన వాళ్లూ లేరు. ఇన్ని అవమానాలు జరిగినా సరే, నేను భారతీయుడిని, ఈ దేశంలోనే జీవిస్తాను, మరణిస్తాను అని షారూఖ్ ఖాన్ ఆ వ్యాసంలో రాశారు. ఇలాంటి వాక్యాలు రాసినందుకు ఆయన్ని ప్రశంసించిన వారూ లేరు. జరిగిన అవమానాలకు ఈ దేశం విడిచి వెళ్లిపోతానని షారూఖ్ ఖాన్ ఒక వేళ అంటే ఎలా ఉండేది? కమల్ హాసన్ పట్ల సానుభూతి చూపిన తీరుగానే షారుఖ్ పట్ల సానుభూతినీ సంఘీభావాన్ని ప్రదర్శించేవారా? ఒక వేళ ఆయన కమల్ హాసన్ లాగే మాట్లాడి ఉంటే దేశ వ్యాప్తంగా ముస్లింల మీద అపర దేశభక్తులు దాడులకు తెగబడేవారు కాదా? దేశ ద్రోహం అభియోగం మోపి జైల్లో పెట్టేవారు కాదా? ఇద్దరూ కళాకారులే. కానీ ఒకరి పట్ల సానుభూతి. మరొకరి పట్ల నిరాసక్తత. ఈ ద్వంద్వ వైఖరి దేన్ని చూపిస్తుంది? సమాజంలో ముస్లిం వ్యతిరేకత క్రమంగా విస్తరించటమే కాదు, సామాజిక ఆమోదం పొందుతుందన్నది నిరూపణ అవుతుంది.
విశ్వరూపం నేపథ్యంలోనే పాత వివాదాలను కూడా గుర్తు చేసుకోవాలి. ఇటీవల ఒక యువ కథానాయకుడు హీరోగా ఒక చిత్రం విడుదలైంది. అందులో బ్రాహ్మణులను అవమానించేలా దృశ్యాలున్నాయని కొన్ని సంఘాలు ఆందోళనకు దిగాయి. అదే విధంగా, ఏ వుమెన్ ఇన్ బ్రాహ్మణిజం అనే సినిమాను నిషేధించాలని ఆ సినిమా చూడకుండానే డిమాండ్ చేశారు. మునుపెన్నడూ రాస్తారోకో, ధర్నా, ముట్టడి వంటి కార్యక్రమాలు చేసి ఎరుగని బ్రాహ్మణ సంఘాలు ఆందోళన మార్గం పట్టాయి. చాలా విచిత్రంగా బ్రాహ్మణీయ సంస్కృతిని విమర్శించే కొన్ని దళిత సంఘాలు కూడా ఈ ఆందోళనలకు మద్దతు పలికాయి. బ్రాహ్మణుల తరఫున మాదిగలు పోరాడుతారని మందకృష్ణ బాహాటంగానే ప్రకటించారు. విశ్వరూపం చిత్రం వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి, ముస్లింల తరఫున పోరాడుతామని ఆయన బహిరంగ ప్రకటన చేయలేకపోతున్నాడెందుకు? సినిమాను సినిమాగానే చూడాలని ఇప్పుడు హితవు పలికే ప్రబోధకులు, మతాధిపతులు అప్పుడు మాత్రం హిందూ ధర్మం మీద దాడిగా, భారతీయ సంస్కృతి మీద దాడిగా గగ్గోలు పెట్టారు. విశ్వరూపం సినిమాను మాత్రం సినిమాగానే చూసి ఆనందించాలని సెలవిస్తున్నారు. ముస్లింలకో నీతి, ఇతరులకో నీతేంటని అడిగితే సమాధానం ఏం చెబుతారు?
ముస్లింలను దేశద్రోహులుగా, తీవ్రవాదులుగా చిత్రిస్తూ అనేక సినిమాలు వచ్చాయి. అణగారిన వర్గాల సమాజాన్ని అవహేళన చేస్తూ ఎన్నో చిత్రాలు వచ్చాయి. వీటిని తొలి దశలో వెకిలి సినిమాలుగా ప్రేక్షకులు తోసిపుచ్చారు. అయినా సరే, అలాంటి సినిమాలనే దర్శక, నిర్మాతలు ఎందుకు తీస్తున్నారు? మతతత్వం తలకెక్కిన అనేక మంది చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉండేది. కాకపోతే, అప్పుడు ఆధిపత్య కుల సంస్కృతిని సార్వజనీనం చేసే ఎజెండా మాత్రమే ఉండేది. రెండు ఆధిపత్య కులాల ముఠా కక్షలను ప్రతీకార కథనాలతో చిత్రించారు.
సినిమా రంగం యొక్క రాజకీయ తత్వశాస్త్రం మనువాదం. తెలుగు సంస్కృతి, భారతీయ సంస్కృతి పేరుతో సినిమాల నిండా బ్రాహ్మణీయ సంస్కృతినే కూర్చుతూ వచ్చారు. వంద ఏళ్ల కిందటి కన్నా ఎక్కువ బ్రాహ్మణీయ అసమాన భావజాలం సంస్కృతి పరిశ్రమ విస్తరించాకే జరిగింది. ఆ భావజాలానికి ఆమోదం దొరుకుతుంది. అది ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించాలని ఆశించిన రాజ్యాంగ కర్త ఆలోచనకు ప్రతికూలమైంది. బ్రాహ్మణీయ మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా ఇప్పుడు అణగారిన కులాల్లో చైతన్యం పెరిగింది. ఈ చైతన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు మత మైనార్టీలను శత్రువులుగా చూపే చిత్రాలు నిర్మిస్తున్నారు. మతాల వారీగా సంస్కృతిని నిర్మాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే జర్మనీలో కూడా జరిగింది.
హిందూత్వ తీవ్రవాద హింసాకాండ పట్ల చిత్ర పరిశ్రమ ఏనాడూ స్పందించలేదు. రెండు వేల మంది ముస్లింలను ఊచకోత కోసిన గుజరాత్ మారణకాండ మీద ఒక్క సినిమా కూడా రాలేదు. వేల సంవత్సరాల నుంచి దళితులను అంటరాని వారిగా చూస్తూ, నిత్యం వారి మీద దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉంటే వాటికి వ్యతిరేకంగా సినిమాలు రాలేదు. కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట వంటి దళితుల సామూహిక హననాల గురించీ ఏ ఒక్క సినీ హీరో, సక్సెస్‌ఫుల్ డైరెక్టరూ సినిమా తీయలేదు. 'శూద్ర' అనే ఒక హిందీ సినిమాను జైస్వాల్ అనే దర్శకుడు తెరకెక్కిస్తే దాన్ని విడుదల కానీయకుండా అనేక అవాంతరాలను కల్పించారు.
ముస్లిం, దళిత సమాజం నిత్యం వేధింపులకూ అవమానాలకూ గురవుతున్నది. మత వివక్ష, మత హింసకు ముస్లింలు గురవుతూనే ఉన్నారు. అయినప్పటికీ వారు ఈ దేశంలోనే జీవిస్తాం అంటున్నారు. కేవలం సమానత్వాన్ని మాత్రమే అంగీకరిస్తామన్నందుకు రెండు వేల సంవత్సరాల నుంచీ అంటరాని వాళ్లుగా వెలేయబడిన ఈ దేశ మూలవాసులు ఏనాడూ ఈ దేశం విడిచి పోతామని అనలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, ఇతర మైనార్టీలు గొప్ప దేశ భక్తులు. ఇది వాళ్లకు మాతృభూమి. కమల్ హాసన్ ఈ దేశం విడిచి వెళ్లిపోతానని ఉద్వేగంలో అన్నాడేమో. కానీ ఆ మాటల వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు భయంకరమైనవి. ముస్లిం సమాజం పట్ల వ్యతిరేకతనూ విద్వేషాన్ని పెంచుతాయి. అన్ని హక్కులూ అధికారాలూ హోదా సామాజిక గౌరవం అనుభవించిన వర్గాలు తేలిగ్గా అల్ప సంఖ్యాకులను ముద్దాయిలను చేస్తాయి. అలా చేసేందుకు అవసరమైన పరిస్థితులను పాలకవర్గమే కల్పిస్తుంది.
సంస్కృతి పరిశ్రమను ఆధిపత్య కుల వ్యవస్థలో ఒక భాగంగానే మనం అర్థం చేసుకోవాలి. కమల్ హాసన్ పట్ల సానుభూతిని చూపి, షారుఖ్ ఖాన్ పట్ల ఉదాసీనతను చూపించే స్పందనలు ఎలాంటి మానవీయమైన విలువలను ఈ సమాజంలో పాదుకొల్పలేవు. బహుళ సంస్కృతులున్న మన దేశంలో ఒకేఒక్క ఆధిపత్య సంస్కృతిని నిలబెట్టాలని చూస్తే అది కూలిపోక తప్పదు. అప్పుడు నిజంగానే కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ లాంటి మంచి కళాకారులు ఈ దేశంలో జీవించే లౌకిక పరిస్థితులేవీ ఉండవు.
- డా. జిలుకర శ్రీనివాస్
Andhra Jyothi Telugu News Paper Dated : 13/2/2013
No comments:
Post a Comment