Tuesday, February 12, 2013

సాహిత్యంలో దళిత స్త్రీలు ---ఆరికొండ ప్రతాప్‌ కుమార్‌'దైవ ప్రసాదిత కుంతి సంతతిలో
ఒక్క ఆడజీవి ఉన్నా మీకు బోధపడేది
కుంతి కాదు ఏ ఇంతి కనబడ్డా
గర్భదానపు దేవుళ్లు పైనుంచి దిగుతారు
తేడా అల్లా -
సహజ కవచ కుండలాలతో 'కర్ణుడు' పుట్టినట్లు
సహజ గర్భసంచితో ఒక 'కర్ణిక' పుట్టకపోవడమే!
(పుల్లింగ న్యాయ ధిక్కారం)
దళిత కులాల్లోని సంప్రదాయాలకు, పూజలకు పునాది స్త్రీలే! అయితే దళిత స్త్రీల సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యమేనన్న భావన ఉంది. దళిత స్త్రీల చరిత్రని, తాత్విక చింతనని, జీవన సరళిని, ఆలోచనా ఒరవడిని, మనోభావాలను చూడాలంటే జానపద రూపంలో ఉన్న సాహిత్యంలోకి తొంగి చూడాల్సిందే! స్త్రీవాద దృక్పథంతో రాసిన రచనలకు స్త్రీవాద సంకలనాల్లో, దళిత దృక్పథంతో రాసిన రచనలకు దళిత సంకలనాల్లో స్థానం లభించింది. కుల, పితృస్వామ్య, వర్గ, ప్రాంతీయ అణచివేతలతో కూడిన బహుముఖ సమస్యలను ఏకకాలంలో ఎదుర్కొంటున్న దళిత స్త్రీల అనుభవ వ్యక్తీకరణకు సాహిత్య శిబిరాలతో స్థానం తక్కువగానే ఉంది.
దళిత స్త్రీ సాహిత్య పరిణామం
ఆది ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి నేటి ఆత్మగౌరవ పోరాటాల వరకూ దళిత స్త్రీలు రచనలు చేస్తున్నారు. 1940కి ముందు దళిత స్త్రీలకు చదువు అందనంత దూరంలో ఉంది. నిరక్షరాస్య జనాభాలో దళిత స్త్రీలే అధిక శాతం ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిలకరించినట్లుగా ఉన్న దళిత మహిళా విద్యావంతుల్లో కవులు, మేధావులు, కళాకారులు, పండితులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, పోలీసాఫీసర్లు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు, విశ్లేషకులు, పరిశీలకులు, విమర్శకులు, సంపాదకులు, కాలమిస్టులు ఉన్నారు. వీరు అనేక సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు, చేస్తున్నారు. కొన్ని ఆధునిక ప్రక్రియలను తెలుగు సాహిత్యానికి మొదటిసారిగా పరిచయం చేసిన రచయిత్రులు కూడా ఉన్నారు. 'హైకూలు' రాసిన తొలి దళిత రచయిత్రి స్వరూపరాణి. వీరిలో ఎక్కువమంది పిల్లలు, స్త్రీల విషయాలను సాహిత్య వస్తువుగా తీసుకోవడం కన్పిస్తుంది.
దళిత పురుషులతోనూ, అగ్రకుల స్త్రీలతోనూ పోల్చినప్పుడు అత్యధిక పీడనకు గురవుతున్నది దళిత స్త్రీలే! దళితవాదం ఒక స్పృహగా 20వ శతాబ్దం మొదటి నుంచీ తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్నా, ఒక చైతన్య రూపంగా జాషువా నుంచి వికసిస్తున్నా, ఒక ప్రతిఘటన రూపంగా హేతువాద, నాస్తికవాద, సామ్యవాద ఉద్యమాల్లో పెంపొందుతున్నా, 1980ల నుంచే పోరాట స్పృహ రగులుతూ వచ్చింది. 1990ల నుంచి స్పష్టంగా ఒక సమగ్ర వికాసాన్ని సాధిస్తోంది. సాహిత్యంలో దళితవాదం నేపథ్యం పరిశీలిస్తే - భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సాహిత్య వాదాల పరిణామం భిన్న రీతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 1930ల నుంచీ సాహిత్యంలో మార్క్సిస్టు దృక్పథం ప్రధాన స్రవంతిగా ఉంది. అది అనేక రూపాల్లో సాహిత్య సృజనలో ప్రతిఫలించింది. సాహిత్యంలో సంఘర్షణ ఒక వాదంగా ముందుకు రావడానికి పునాదితోనే బయలుదేరిన అసంతృప్తి ఎంతోకాలంగా రగలి రగిలి అనుకూలమైన ఒక సామాజిక బిందువు దగ్గర విస్ఫోటనం చెందుతుంది. దళిత సాహిత్యానికి ఈ విస్ఫోటన దశ 1990 నుంచి ప్రారంభమై, సాహిత్య ప్రక్రియలన్నింటినీ వేగంగా ప్రభావితం చేసింది.
భారత వ్యవసాయోత్పత్తిలో 90 శాతం మంది దళిత, దళితేతర కులాల స్త్రీలు పాల్గొంటున్నారు. ఇందులో లింగ ప్రాతిపదికతోపాటు కుల ప్రాతిపదికన కూడా శ్రమ విభజన జరిగింది, జరుగుతోంది. వీరి శ్రమకు విలువ లేనితనాన్ని రుద్దడంలో ఈ వ్యవస్థ తొలినుంచీ బలంగానే పనిచేస్తోంది. దళిత, వెనుకబడిన కులాల, ముస్లిం, గిరిజన స్త్రీలను హిందూ ఆధిపత్య కుల పితృస్వామ్యం అదుపులో ఉంచి క్రూరంగా అణచివేస్తోంది. ఈ వాస్తవికతని స్త్రీల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్త్రీలకు, దళితులకు వర్ణ వ్యవస్థలోనే సంక్షేమాన్ని కోరిన గాంధీ కొటేషన్లు ప్రజాస్వామ్య ఉద్యమాలకు, స్త్రీవాదానికి ఆదర్శం కాలేదు.
సమాజంలోని శ్రమ, పెళ్లి, పుట్టుక, మాట్లాడే పద్ధతి, చావు, తిండి, సంప్రదాయాలు, అలంకరణ మొదలైనవి గమనించదగినవి. సమాజంలో కించపరచబడే పనిముట్లు, శ్రమ దళిత కులాల్లో గౌరవింపబడుతూ జీవనాధారంగా స్వీకరింపబడతాయి. ఉదాహరణకు : పొలాల్లో పంటను కోసిన తరువాత కుప్పలు నూర్చి కల్లంలో తయారైన రాశులను సంచులకు ఎత్తుతారు. భూస్వామి ఇంటికి ధాన్యం తరలించిన తరువాత దళిత స్త్రీలు చాట, కొయ్యలు, కుంచి బట్ట తీసుకొని ఆ కల్లంలోకి వెళతారు. మట్టిలో కలిసిన ధాన్యపు గింజలను మట్టి, తాలు, వడిపిలి, గడ్డిగింజల నుంచి దఫాదఫాలుగా వేరు చేస్తారు. దీనినే 'లేకి కల్లం' అని, ఇందులో ఉపయోగించే చాటనే 'లేకి చాట' అని అంటారు. లేకి అనే మాట చేర్చటం ద్వారా ఇక్కడ శ్రమను హీనపర్చటం మనం గమనిస్తాము. దళిత కులాల్లోని సంప్రదాయాలకు, పూజలకు పునాది స్త్రీలే! ఇక్కడ శ్రమకూ, శ్రమలో స్త్రీల పాత్రకూ ప్రాధాన్యం కనిపిస్తుంది. దళితుల పండగల వ్యవహారంలో పురుష దేవుళ్లు కనబడరు. అందరూ స్త్రీ దేవతలే! వారిని గ్రామ దేవతలుగా కూడా చూస్తారు. దీన్నిబట్టి వీరికీ, హిందూ దేవుళ్లకూ గల తేడా గమనించవచ్చు. హిందూ దేవతలు పురుష దేవుడి పక్కన, పువ్వులు, చెంబులు, దీపాలు పట్టుకొని లేదా భర్త కాళ్లు పడుతూనో కనిపిస్తారు. దళితలు పూజించే దేవతలు వేప కొమ్మలు, మొంట్య (చిన్నచాట), లక్క కోలలు (కర్రతో చేసిన బొమ్మలు) పట్టుకొని వివిధ స్థలాల్లో, చెట్టు కింద సాదా సీదాగా చిన్న గుడిలోనో లేదా బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటారు. వీరి దరిదాపుల్లో పురుష దేవుళ్లు కన్పించరు.
దళిత ఉద్యమాలు - స్త్రీలు
దళిత పురుష కవులు కులవృత్తిని, పనిముట్లని సాహిత్యంలో పొందుపరిచారు. తమదైన భాష, సంస్కృతి, సంప్రదాయాలుగా, ఆత్మగౌరవంతో చాటి చెప్పారు. దళిత స్త్రీల పట్ల మాత్రం పితృస్వామ్య ధోరణులే కనబరిచారు. 'మానం పోతే కడుక్కోగలం.. రవిక పోతే కొనుక్కోలేము' అనే వ్యాఖ్యానాలు దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రవిక పోతే కొనుక్కోలేకపోవడం పేదరికానికి ప్రతీక. దానిలో ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. అంతమాత్రాన దళిత స్త్రీ ఆత్మగౌరవం పోగొట్టుకోవడమనేది ఎన్నటికీ తక్కువ కాదు కదా! కుల వ్యవస్థ రాజ్యమేలే నిచ్చెన మెట్ల సమాజంలో పెత్తందారులకు దళితులంటే చులకన - దళిత స్త్రీలంటే మరింత చులకన. దళిత పురుషులు శ్రమ దోపిడీకి గురైతే, దళిత స్త్రీలు - శ్రమ దోపిడీతోపాటు లైంగిక దోపిడీకి కూడా గురవుతున్నారు. దళిత స్త్రీ తన పైకులాల పురుషుల నుంచే కాక, తన సొంత మగవాళ్ల నుంచి కూడా పీడనను భరిస్తోంది. దీనిని ప్రత్యేక దృష్టితో అర్థం చేసుకోవాలి. స్త్రీల మనోగతాన్ని వ్యక్తీకరించటంలో పురుషాధిపత్యం, దానిని ప్రభావిత పదజాలం పెచ్చరిల్లటం మంచిది కాదు.
దళిత స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా నడచిన పోరాటాల్లో నష్టపరిహారం, ఆత్మగౌరవం అనే రెండు అంశాలూ సమభాగం కావాల్సి ఉంది. దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న కుటుంబ హింస, గర్భధారణ, ప్రసూతి బాధలు, చావులను అంచనా వేయలేకపోవడం మొదలైనవి. నేడు దళితేతర స్త్రీలు, దళిత స్త్రీలు, గిరిజన స్త్రీలు, హిందూయేతర మతాల స్త్రీలు వారి హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితి నెలకొంది. దళిత పురుషులు కూడా దళిత స్త్రీని ఒక బాధితురాలిగానో, తమ నీడన నిలబడే వారిగానో గుర్తిస్తున్నారేగానీ, హక్కులు కలిగిన వ్యక్తిగా, పోరాడే శక్తిగా గుర్తించడంలో వెనుకబడ్డారనే చెప్పాలి. సాంఘిక, లైంగిక అంశాలతో దళిత స్త్రీలకు ప్రత్యేక సమస్యలు, పోరాటాలు, హక్కులు, సంఘీభావం అవసరమనే విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దళిత ఉద్యమాల్లో కూడా స్త్రీల ప్రశ్నలు పితృస్వామ్య భావజాలం చాటున సరిగ్గా చర్చకు రాకపోవడం, ఉద్యమం వారిని ఉపయోగించుకొని, తర్వాత పక్కకి తోసేయడం జరుగుతూనే ఉందనే విషయాన్ని అనేకమంది దళిత స్త్రీల అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. 1978 తరువాత వచ్చిన తిమ్మ సముద్రం, కారంచేడు, చుండూరు ఉద్యమాల్లో దళిత స్త్రీలు నాయకులు గానూ, రచయితలుగానూ, ఆత్మగౌరవ దళిత ఉద్యమాన్ని నిర్మించడంలో బలమైన పాత్రని పోషించారు. ఈ కోణంలో దళిత మహిళల సమస్యలపై రచయిత్రులు వెలువరిస్తున్న కథలూ, కవిత్వం, ఇతర రచనలూ ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
- ఆరికొండ ప్రతాప్‌ కుమార్‌ 
Prajashakti Telugu News Paper Dated : 10/2/2013

No comments:

Post a Comment