Tuesday, February 12, 2013

జోగినీల జీవితం దుర్భరం బందెల రాజశేఖర్‌


 - ఆదిలాబాద్‌    Sun, 10 Feb 2013, IST  

  • దరిచేరని సంక్షేమ పథకాలు
  • అమలుకు నోచని ప్రత్యేక చట్టాలు
  • అధికారుల నిర్లక్ష్యం, పట్టని పాలకులు
జోగినీలంటేనే అదో రకమైన చిన్న చూపు. వారితో అన్ని రకాల పనులూ చేయించుకుంటారు. ఇంటి పని మొదలు తమ కోరికలను సైతం తీర్చుకుంటారు. కానీ వారు వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నా పట్టించుకోరు. ఓ పక్క శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరో పక్క మూఢాచారాలు, సామాజిక రుగ్మతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సమాజర ఎంత అభివృద్ధి చెందినా జోగినీలు మాత్రం అట్టడుగు స్థాయిలోనే బతుకులు వెల్లదీస్తున్నారు. జోగినీలను ఇప్పటికీ అంటరానివారుగా చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వమూ వారి పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జోగినీల కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా వారు నేటికీ వివక్షకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో జోగినీల జీవన స్థితిగతులపై ఈ వారం 'ప్రజాశక్తి' ప్రత్యేక కథనం....
జిల్లాలో జోగినీల పరిస్థితి..
రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో జోగినీ వ్యవస్థ కొనసాగుతోంది. దేవదాసీలు, జోగినులు, మాతంగులుగా చెప్పుకునే వీరంతా ఎక్కువగా దళితులు ఉన్నారు. గతంలో వారు తమకు అధికంగా సంతానం కలగడం వల్ల అందరూ బాగుంటే ఆడపిల్లలను మాతంగిని చేస్తామని దేవుళ్లకు మొక్కుకునేవారు. అనుకున్నట్లుగానే తమ సంతానం నుంచి ఒకరిని గ్రామదేవత పేరుతో జోగినిగా వదిలేస్తారు. ఈ విధంగా జిల్లాలో అనాదిగా ఈ వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. ఇలా వదిలేసిన వారిని గ్రామ పెత్తందార్లు, దొరలు వారితో వెట్టిచాకిరీ చేయించుకునేవారు. వారితో అన్ని రకాల పనులు, చేయించుకునేవారు. గ్రామాల్లో కొందరు కామాందులు వారి కోరకలు తీర్చుకునేవారు. మరికొందరు దీర్ఘకాలికంగా వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. ఫలితంగా జోగినులకు సంతానం కలిగేది. సాధారణంగా అధికారుల రికార్డుల్లో పుట్టిన బిడ్డ పేరు పక్కన తండ్రి పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ జోగినులు, దేవదాసీల పిల్లల పేర్ల పక్కన వారి తల్లిపేర్లే ఉంటాయి. దీంతో దేవదాసీలకు, జోగినీలకు ఇళ్లుగానీ, జానెడు స్థలంకానీ లేకుండా పోయింది. జోగినీలు గ్రామాల్లోని దేవాలయాల్లో సేవలు చేస్తూ, యాచిస్తూ సంతానాన్ని పోషించుకునేవారు. ఈ విధంగా నేటికీ జోగినీలు దుర్భరమైన బతుకులు వెల్లదీస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు రెండు వేల మంది వరకు జోగినీ కుటుంబాలు ఉన్నట్లు అధికారుల అంచనా. రికార్డుల్లో మాత్రం వీరి జనాభా ఎంతుందో తెలియదు. జిల్లాలో ఎక్కువగా నిర్మల్‌ డివిజన్‌లోని నిర్మల్‌, సారంగాపూర్‌, ముథోల్‌, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, భైంసా మండలాల్లో జోగినుల కుటుంబాలు ఉన్నాయి. నిర్మల్‌ పట్టణం బుధవార్‌ పేటలో 32 కుటుంబాలు, కుర్రన్నపేట్‌లో 24, గొల్లపేట్‌లో మూడు, విశ్వనాథ్‌పేట్‌లో మూడు కుటుంబాలు నాయుడివాడ, బంగల్‌పేట్‌, రాంనగర్‌, గాజులపేట్‌లో రెండు కుటుంబాలు ఉన్నాయి. సారంగాపూర్‌ మండలం ప్యారమూరల్‌లో ఏడు, బీరవెల్లిలో 11, కౌట్ల(బి)లో ఒకటి, ఆలూర్‌లో నాలుగు, పంచర్‌లో మూడు, మలక్‌చించోలిలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఎవరూ చదువుకున్న వారు లేరు. జోగినీలెవరికీ భూమి లేదు. వీరంతా బీడీలు చుడుతూ, వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వారి పిల్లలను కూడా వారితోపాటే కూలికి తీసుకెళ్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారి దరిచేరడం లేదు. ప్రభుత్వాధి కారులు సైతం వారిని చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసి సమాజరలో గౌరవంగా బతికేటట్లు చూడాలని వారు కోరుతున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జోగినీలు అధికంగా ఉన్నట్లు 1984లో వెల్లడైంది. తొలిసారిగా జోగినీ వ్యవస్థ నిజామాబాద్‌ జిల్లా బినోలా గ్రామంలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆశామూర్తి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సమీపంలో సుమారు 70 మంది మహిళలు ఆమె చుట్టూ చేరారు. తమ పిల్లలను చూపించి తమకు కూడు, గూడు వంటి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. తాము జోగినీలమని, అనాదిగా గ్రామంలో ఈ వ్యవస్థ కొనసాగుతుందని, తమను కాపాడాలని మొర పెట్టుకున్నారు. వారి పరిస్థితిని చూసిన కలెక్టర్‌ జోగినీ వ్యవస్థపై అధికారులతో పూర్తి సమాచారం సేకరించారు. ఈ వ్యవస్థపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి 1984లోనే అధికారికంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి వరకు ఈ వ్యవస్థ ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లోనే లేదు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించ లేదు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం యాక్ట్‌ సంవత్సరం 10/1998 చట్టాన్ని చేసింది. వి.రాఘునాథరావు అధ్యక్షతన ఏక సభ్య కమిషన్‌ నియమించింది. జోగినీ వ్యవస్థపై క్షేత్రస్థాయిలో అధ్యయనం కోసం 2011 జనవరిలో గుంటూర్‌ జిల్లా బాపట్ల కేంద్రంగా 12 రోజులపాటు ఈ కమిటీ పర్యటించింది. 18 జిల్లాలో ఈ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవస్థను నిర్మూలిం చేందుకు, జోగినీలకు పునరావాసం కల్పించేందుకు 1998లో ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం జిల్లాలో అమలు కాకపోవడం, జోగినీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయకపోవడం వల్ల వారు నేటికీ దుర్భర జీవితాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది
జిల్లాలో జోగినీలు సామాజికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టంచుకోవడం లేదు. వారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దరిచేరడం లేదు. జోగినీలకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చి బోరుబావులు తవ్వించి విద్యుత్‌ సౌకర్యం, మోటార్లు పైప్‌లైన్‌ కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలో నాలుగో తరగతి ఉద్యోగులుగా అవకాశం కల్పించాలి. వారి పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్‌, ఉద్యోగ నియామకాలను చేయడానికి ఇఓలను విడుదల చేయాలి. అంత్యోదయ, అన్నయోజన పథకం కింద రేషన్‌ కార్డులు మంజూరు చేయాలి. ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేయాలని చట్టంలో పొందుపరిచారు. కాని జిల్లాలో జోగినీల పిల్లలకు చదువు చెప్పించకుండానే వారితోబాటు కూలికి తీసుకెళ్తు న్నారు. వారిలో ఎవరు చదవకపోవడం వల్ల ఉద్యోగానికి అర్హులు కాలేకపోయారు. వారి చట్టాలే వారికి తెలయకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఉపయోగించు కోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో ప్రభుత్వం జోగినీలకు పునరావాస చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముందుగా 60 మందికి పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చింది. కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కానీ మౌలిక సౌకర్యాలు కల్పిండం మరిచిపోయింది. స్వయం ఉపాధి కోసం రుణాలు, కుట్టుమిషన్లు ఇచ్చింది. దానికి సంబంధించిన శిక్షణ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పునరావాసంపై అవగాహనలేక అటకెక్కింది.ల


మా బతుకులను ప్రభుత్వమే మార్చాలి -తోడేళ్ల భూలక్ష్మి, లోకేశ్వరం
మాకు సెంటు భూమి లేదు. బీడీలు చుట్టుకొని బతుకు తు న్నాం. నాకు ఇద్దరు కూతుళ్లు. వారిని చదివించలేక మాతోపాటు ఓ కూతురు బీడీలు చూడుతోంది. మరో కూతురు కూలీకి వెళ్తుతోంది. నాకు వయసు మీద పడింది. ప్రభుత్వం నుండి రూ.200 పింఛన్‌ వస్తోంది. కాని దాంతో బతకడం కష్టంగా ఉంది. మాకు నెలసరి పింఛన్‌ రూ.1500 ఇవ్వాలి. నెలకు నాలుగు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అవి సరిపోక బయట కొని తింటు న్నాం. మమ్మల్ని ఆదుకుని మా బతుకులను ప్రభుత్వమే మార్చాలి.


మా పిల్లకైనా ఉద్యోగం ఇవ్వాలి : ఆస్తం ముత్తవ్వ, లోకేశ్వరం
నాకు ఒక కూతురు. నేను కూలీ నాలీ చేసి నా కూతుర్ని చదవిస్తున్నాను. మాకు ప్రభుత్వం నుంచి నెలకు 200 పింఛన్‌ తప్ప ఏమీ అందడం లేదు. మాకు గుడిసె తప్ప సెంటు భూమి లేదు. మా పిల్లకైనా ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.


మా తరం పోయింది.. పిల్లలనైనా ఆదుకోండి: సౌడల్ల నాగవ్వ : లోకేశ్వరం
జోగినులుగా ఎన్నో కష్టాలు భరించాం. నేను ఇప్పటికీ దొర గారింట్లో వంట పనులు చేసుకుంటూ బుతుకుతున్నా. ఇక మాతరం ముగి సింది. మా పిల్లల భవిష్య త్తన్నా బాగుం డాలి. వారిని ప్రభుత్వం ఆదుకుని ఏదైనా ఉద్యోగం కల్పించి గౌరవంగా బతికేట్లు చూడాలి.
జోగినీల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం - పోతురాజుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మహిపాల్‌ ప్రభుదాస్‌
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జోగినీలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్లే జోగినీ వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. వారి కోసం ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టినా అమలులో అధికారులు విఫలం చెందారు. తెలియని వారికి అవగాహన కల్పించడం లేదు. దీంతో సంక్షేమ పథకాలు దరి చేరడం లేదు. జోగినీ వ్యవస్థను రూపుమాపేందుకు పోరాటం చేస్తున్నాం. జోగినీల కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పించడమే అంతిమ లక్ష్యంగా పోరాడుతాం

Prajashakti Telugu News Paper Dated : 10/2/2013

No comments:

Post a Comment