Tuesday, February 12, 2013

కష్టాల కాంగ్రెస్‌: నయా గాంధీ! ---డేవిడ్- సవాళ్ళను, సమస్యలను ఎదుర్కొంటారా?

- బహిరంగంగా లోపాల ఒప్పుకోలు! 
- అవినీతి దారుణంగా ఉన్నదని గుర్తింపు 
- యువత డిమాండ్లపై స్పందించలేదేం?
- 2014కు ముందే 9 రాష్ట్రాల ఎన్నికల పరీక్ష

rahul-sonia

ఎన్నికలకు ఏడాదిముందే కాంగ్రెస్‌ పార్టీ ‘నయా’ లీడర్‌ను ముందుకు తెచ్చింది. అధికారికంగా చెప్పకపోయినా 2014కు ప్రధాని రాహులేనని జైపూర్‌ మేధోమథనం సాక్షిగా కాంగ్రెస్‌ తేల్చేసింది. ఉపాధ్యక్ష పదవితోనే పార్టీ దశ,దిశ, భవిష్యత్తు అన్నీ రాహులేనని స్పష్టమైన సందేశం పంపింది. వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీని రాహుల్‌- ముచ్చటగా మూడోసారి అధికారం లోకి తెస్తారా, ఉన్న సవాళ్ళు, ఆ రాబోయే సమస్యల ను ఆయన సమర్ధవంతగా ఎదుర్కొనగలరా అనేవి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ముందున్న పెద్ద సవాళ్ళు. నూట పాతికేళ్ల చరిత్ర ఉన్న పార్టీని గాంధీ- నె్రహూ కుటుంబం పెద్ద దిక్కుగా ఉండి నడిపించింది. అలాంటి కుటుంబంనుంచి నాలుగో తరం నాయకుడిగా రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీని ఇక నడిపించబోతున్నారు. ఇంత వరకు తల్లిచాటు బిడ్డగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న రాహుల్‌ తాత, నాయనమ్మ, తండ్రి వారసత్వాన్ని ఎంత వరకు నిలబెడుతాడో అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూ స్తోంది. ఒకవైపు భారీ ఆశలు, ఇంకెన్నో సవాళ్లు, అంతకు మించిన ఆకాంక్షలు, మరోవైపు ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ జైపూర్‌ చింతన్‌ శిబిరంలో యువరాజ్‌కు నంబర్‌ టూ స్థానాన్ని కట్టబెట్టింది. సోనియాగాంధీ అధినే త్రి హోదాలోఉన్నా ఇకనుంచి ఆమె పాత్ర పరిమితంగానే ఉండబోతోందని పార్టీలో అందరూ అంగీకరిస్తున్నారు. 8 ఏళ్లపాటు కాంగ్రెస్‌ రాజకీయాలతోపాటు, దేశం మొత్తం తిరిగి రాజకీయ అనుభవాన్ని సొంతం చేసుకున్న రాహుల్‌ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కిస్తారా అనేది వేచి చూడాలి. ఉపాధ్యక్షుడిగా తన ప్రసంగాన్ని వినిపించిన రాహుల్‌, గతంలోకంటే భిన్నంగా తన మనో భావాల్ని వ్యక్తంచేశారు. గాంధీ, నెహ్రుల సిద్ధాంతాలను గుర్తుచేస్తూనే నాయనమ్మ ఇందిరా గాంధీ హత్య విషయాన్ని ప్రస్తావించారు. రాజీవ్‌గాంధీ తెచ్చిన టెక్నాలజీ సింబల్‌ మోబెల్‌ఫోన్లు అని చెబుతూనే, యుపిఏ ప్రభుత్వంపై, ప్రధాని మన్మోహన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సంస్కరణలతో భారత్‌ రూపురేఖలు మార్చిన ఘనత మన్మోహన్‌కు దక్కుతుందని, మన్మోహన్‌ తెచ్చిన ఆర్థిక సంస్క రణలు దేశానికి అన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పుకొచ్చారు. పాత, కొత్త తరాలను గుర్తుచేస్తూ ఆమ్‌ఆద్మీ పాలసీకి కాంగ్రెస్‌ దూరం కాలేదని సెలవిచ్చారు. అధికారమనేది విషం లాంటిదని తన తండ్రి, నానమ్మ చావులను గుర్తు చేసుకు న్నారు. అమ్మ తనకు అదే చెప్పిందంటూ కాంగ్రెస్‌ శ్రేణుల గుండెల్ని పిండేశారు. భావోద్వేగం, రాజకీయ అవగాహన, లోపాలను అంగీకరించే నిజాయితీలతో- సామాన్యునికి దూరం కాకుడదన్న లక్ష్యాన్ని ప్రకటిస్తూ, తమ కుటుంబం చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ ఉద్వేగంతో ప్రసంగించి తల్లిచేత కంటతడి పెట్టించారు. అయినా సరే తన భవిష్యత్తు కన్నా దేశ భవిష్యత్తే ముఖ్యమని తేల్చేశారు. కాంగ్రెస్‌ సాధించిన విజయాలను గుర్తుచేస్తూనే సరిచేసుకోవాల్సిన లోపాలను ఎత్తిచూపారు. మహాత్ముడి సిద్ధాంతాన్ని, తండ్రి రాజీవ్‌ పాలనను, మన్మోహన్‌ సంస్కరణలను గుర్తుచేస్తూ ఆ ఒరవడిని కొనసాగిస్తామన్నారు. అందరి కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుందన్ని ప్రకటించారు. ఎనిమిదేళ్లు రాజకీయాల్లో ఉన్న రాహుల్‌, అధినేత హోదాలో ఉండి కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత లోపాల గురించి బహిరంగంగా ఒప్పు కోవడం ఇదే మొదటి సారి. యువతరం అసహనంతో రగులుతోందని, పాలనలో, అధికారంలో తన మాటలకు విలువ ఉండాలని కోరుకుంటోందనీ తెలిపారు. అధికారం కేంద్రీకృతమై కొంతమందే రాజకీయాలను నియంత్రిస్తున్నారన్నారు. మనం విజ్ఞానానికి కాకుండా హోదాలు విలువిస్తున్నామనీ, అవినీతి పరులే అవినీతి గురించి మాట్లాడుతున్నారని, మహిళల్ని అవమానించేవారే వారి సాధికారత గురించి మాట్లాడుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ భావోద్వేగాలు, రాజకీయ వారసత్వం, అధికారంపై అభిప్రాయాలు, పార్టీలో లోపాలు, ప్రభుత్వంలో సమస్యలు ఇలా అన్నీ కోణాలను ప్రస్తావించిన రాహుల్‌ ప్రసంగం మొత్తం సారం రాజకీయంగా కొత్త విధానాన్ని అవలంబిస్తున్నారని తెలుస్తోంది. అయితే తన ప్రసంగంలోచెప్పిన అభిప్రాయాలు ఎంత వరకూ అత్మవిమర్శతో కూడుకున్నా యనేది విశ్లేషించాలి. నిజానికి రాజకీయ నాయకుణ్ణి కానీ, పార్టీ అధినేతను కానీ విశ్లేషించాల్సింది- చేసిన ఉపన్యాసాల్ని బట్టికాదు, గతంలో చేసిన పనులను, చేస్తున్న పనులను బట్టి! రాహుల్‌ గాంధీ చింతన్‌ బైటక్‌లో ప్రసంగిస్తూ అవినీతి దారుణంగా ఉందని సెలవిచ్చారు కానీ, ఆ ఆవినీతికి ఎవరూ పాల్పడుతున్నారో వివరణ ఇస్తే బాగుండేది. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో కాంగ్రెస్‌ పార్టీయే ఈ దేశాన్ని దాదాపు40 సంవత్స రాలకు పైగా పరిపాలించింది. ఈ 40 ఏండ్ల పాలన కూడా తన కుటుంబ సభ్యుల కనుసన్నల్లోనే, తన కుటుంబసభ్యుల ద్వారానే సాగింది.ఒకవైపు తన తాత, నాయనమ్మ, తండ్రి- త్యాగాలను గురించి, వారి గొప్పతనాన్ని గురించి చెప్పుకుం టున్న రాహుల్‌గాంధీ- దేశంలో దారుణంగా ఉన్న అవినీతికి తన కుటుంబ సభ్యులు ఎంతవరకూ కారణమనేది కూడా గుర్తించాలి. 1950లలో మొదలైన ‘హరిదాస్‌ ముంద్రా’ నుంచి ప్రారంభిస్తే ‘2- జి’ వరకూ పాలక వర్గాల, పాలకుల కుంభకోణాల జాబితా లెక్క పెట్టలేనంతటిది. ప్రస్తుత యుపిఏ కూటమి పాలనా కాలంలోనే స్పెక్ట్రం, కామన్‌ వెల్త్‌, గ్రామీణ ఉపాధి హామి పథకం, జలంతర్గామి కొనుగోళ్ళు, సైనికుల రేషన్‌, సత్యం కంపెనీ మొదలైన లక్షల కోట్ల రూపాయల కిమ్మత్తు కుంభకోణాలు బయట పడ్డాయి. తొమ్మిదేండ్లుగా తానూ క్రియాశీలంగా రాజకీయాల్లో ఉంటూ, అధికారాన్ని అనుభవిస్తూ ఈ కాలంలో అవినీతిని ఉపేక్షించి, అవినీతి పరులైన మంత్రులను వెనకేసుకొస్తూ ఇప్పుడు అవినీతి దారుణంగా ఉందనడం- దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. యుపిఏ పాలనా కాలంలోని ప్రభుత్వంలోనే ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులు అవినీతి ఆరోపణలో అరెస్టు అయి, తమ పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. చివరకు ప్రధాన మంత్రి కార్యాలయంపైనే అవినీతి ఆరోపణలున్నా, స్వయాన తన బావమరిది పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి ఉన్నా, వారిపై చర్యలు తీసుకోవాలని ఏనాడు మాట్లాడని రాహుల్‌ గాంధీ నేడు- అవినీతి దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తే హస్యాస్పదంగానే ఉంటుంది. ఈ తొమ్మిది సంవత్సరాల యుపిఏ పాలనలో అవినీతిని అరికట్టేందుకు కొంతనైనా ప్రయత్నిస్తే ప్రజలు కాంగ్రెస్‌ పాలన పట్ల, రాహుల్‌ నిజాయితీపట్ల విశ్వాసంతో ఉండేవారు. తన తండ్రి రాజీవ్‌గాంధీ కూడా రాజకీయా ల్లోకి కొత్తగా ప్రవేశించినప్పుడు- ప్రభుత్వం అందిస్తున్న ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతోందని, 85 పైసలు అక్రమార్కుల చేతుల్లోకి వెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఆయన కూడా ఏనాడూ దానిని అరికట్టేందుకు ప్రయత్నించలేదు. నేడు రాహుల్‌గాంధీ భావోద్వేగ ప్రసంగాన్ని కూడా ఆ విధంగానే చూడాల్సి వస్తుంది. ఇక రెండవది, యువత అసహనంతో రగులుతోందని, సమస్యలపట్ల దేశ యువత అద్భుతంగా స్పందిస్తున్నదనీ, వాళ్లకు అనుగుణంగా స్పందించాలనీ తోటి రాజకీయ నాయకుల కు సెలవిచ్చారు ఈ యువనేత. కానీ- అవినీతికి వ్యతిరేకంగా దేశంలోని యువకులు పెద్ద ఎత్తున అందోళన నిర్వహిస్తుంటే వారికి మద్దతుగా ఈ యువనేత ఎందుకు నిలవలేదని ఆలోచించాలి. మొన్న ఢిల్లీ దారుణ సంఘటనకు వ్యతిరేకంగా అసంఖ్యాక యువత రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తూ, ప్రభుత్వాన్ని స్థంభింపజేస్తుంటే- ఈ యువనేత ఎందుకు స్పందిచలేదో సెలవివ్వాలి. యువతకు అనుగుణంగా స్పందించాలన్న యువనేత తానేంచేశారో! ఆలస్యంగానైనా తన తల్లి సోనియా, దేశ ప్రధాని మన్మోహన్‌ స్పందించినా కూడా భావి ప్రధాని స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశంలో నూట ఇరవై కోట్ల జనాభా, దాంటో 75 కోట్ల మంది ఓటర్లు, అందులో దాదాపు 25 కోట్ల మంది 25 ఏళ్లలోపు వాళ్లే. ఈ యూత్‌ ఐకాన్‌ దేశంలోని యూత్‌ను ఎంత వరకు ఆకట్టుకోగలుగుతారనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి- భవిష్యత్తు ప్రధానిగా కనిపిస్తున్నా, ఆయన దేశంలోని యూత్‌ను ఆకట్టుకోలేకపోయారని, వారి ఓట్లను సాధించుకోలేక పోయారని అనేక ఉదాహరణలు మన ముందున్నాయి. మొన్నటి గుజరాత్‌ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ ఎన్నికలు నిరూపించాయి. తన తాత, తన తల్లినుంచి స్వయంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న యుపిలోకూడా యువ ఓటర్లు యూత్‌ సింబల్‌గా అఖిలేష్‌ యాదవ్‌ను చూశారు కాని రాహుల్‌ గాంధీని చూడలేక పోయారు. వివిధ ఆందోళనలో ముందుంటున్న యువత, వారి డిమాండ్లు ముందు ముందు రాహుల్‌ సత్తాకు సవాలుగా నిలుస్తాయనడంలో సందేహం లేదు. వాటన్నిం టికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇకపై రాహుల్‌దే. పెరిగిన నిత్యావసర సరకుల ధరలు, అవినీతి కుంభకోణాలు, ప్రజా వ్యతిరేకత- ఇవన్నీ రాహుల్‌ ముందున్న సవాళ్ళు. భవిష్యత్తు గురించి బెంగ వద్దని చింతన్‌ బైటెక్‌లో రాహుల్‌ కాంగ్రెస్‌ శ్రేణుల్లో నైతికస్థైర్యాన్ని నింపారు, కానీ అది పార్టీకి ఎంత ప్లస్‌ అవుతుందనేది చూడాలి. రాజకీయ వారసత్వం, నాన్న నుంచి వచ్చిన చరిష్మా, తల్లి నేర్పిన రాజకీ య పాఠాలు, తనకున్న యూత్‌ ఐకాన్‌ ముద్ర రాహుల్‌కు కలిసొచ్చే అంశాలే కానీ, సంకీర్ణ శకంలో కలిసొచ్చే మిత్రులు, దూరమయ్యే శుత్రువులెవరో తెలుసుకోవాలి. వారు పెట్టిన డిమాండ్లలను అంగీకరించాలి. అవసరమైనా, లేకపోయినా మిత్రపక్షా లను దువ్వాలి. ఇవన్ని రాహుల్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. నెహ్రు తన హయంలో దేశానికి దిశానిర్దేశం చేస్తూ మిత్రపక్షాలను కలుపుకొని పోయి అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. దేశవిభజన జరిగినప్పుడు దేశంలో నెత్తురు పారినప్పటికి ప్రజల్లో మళ్ళీ విశ్వాసం నిలకొల్పి స్వతంత్ర భారతదేశాన్ని తనకాళ్ళపై తను నిలబడేలా చేశాడు. శాస్త్ర విజ్ఞానం, పరిశ్రమల రంగంలో భారత దేశం స్వయం ప్రతిపత్తిని సాధించేలా కృషి చేశాడు. భాక్రానంగల్‌ ఆనకట్ట, రిహంద్‌ ఆనకట్ట, భిలాయ్‌, బొకారో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు, ఐఐటి వంటి అధునిక విశ్వవిద్యాలయాల స్థాపన వంటి వాటిని దేశాభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలిపారు. సుమారు పదహారేళ్ల పాటు దేశ ప్రధానిగా కొనసాగిన ఇంధిరా గాంధీ సమర్థవంతమైన పరిపాలనఅందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించు కోగలిగారు. 


devid
గాంధీ కుటుంబం తొలిసారిగా పార్టీకి దూరం కావడంతో 1992లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చెందడంతో అయిష్టంగానే సోనియా అధ్యక్ష పదవి చేపట్టారు. ఎనిమి దేళ్ల ఆటుపోట్ల తర్వాత 2004లో యుపిఏను అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రధాన పదవి చేపట్టే అవకాశం ఉన్నప్ప టికీ విదేశీ ముద్ర వల్ల తాను తప్పుకొని, మన్మోహన్‌కు అవకాశం ఇచ్చారు. ఆయన సంస్కరణ లతో పాటే అవినీతి ఆరోపణ లు కాంగ్రెస్‌పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నెహ్రూ హయాంలో మొదలైన కుంభకోణాలు రూపాన్ని మార్చుకుంటూ ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. సామాన్యుడి ఆవేదనను యువరాజు ఎలా తీరు స్తాడో, దేశాన్ని ముం దుకు ఎలా తీసుకెళతారో అన్న దానిపై ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంతకంటే ముందు అసలు సిసలైన పరీక్ష ఈ ఏడాది జరగ బోయే తొమ్మిది రాష్టాల ఎన్నికలు.ఈ ఎన్నికల్లో రాహుల్‌ ఎంతవరకు తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటారో చూడాలి.


Surya Telugu News Paper Dated : 13/2/2013 

No comments:

Post a Comment