Wednesday, February 13, 2013

సామాజిక ఇటుకలతో తెలంగాణ -ప్రొఫెసర్ జి. లక్ష్మణ్



ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'ప్రాంతీయ న్యాయం, సామాజిక న్యాయం' పేరుతో ఆ పత్రిక సంపాద కుడు కె. శ్రీనివాస్ రాసిన వ్యాసం ఆలోచింపచేసే విధంగా ఉంది. దానితోపాటుగా భిన్నమైన సంఘర్షణలు కూడా అందులో ఉన్నాయి. 'రాష్ట్రం ఏర్పడ్డాక ఒకటి రెండు అసెంబ్లీలలో సామాజిక నిష్పత్తులు ప్రస్తుతమున్న తరహాలోనే కొనసాగవచ్చు. రెడ్డి, వెలమ కులాల ఆధిక్యం మరికొంతకాలం కొనసాగక తప్పక పోవచ్చు. (వారి పెత్తనం వల్ల మాత్రమే కాదు, వారి నాయకత్వం తెలంగాణకు 'అవసరం' కూడా కావచ్చును) కానీ అతి తొందరలోనే గౌడ, యాదవ, మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి కులాలు బలమైన సామాజిక వర్గాలుగా అవతరిస్తాయి' అని కె. శ్రీనివాస్ విశ్లేషించారు. ఇది భవిష్యత్ తెలంగాణకు సంబంధించిన ఒక అంచనా అనుకుంటాను. అంటే ఇప్పుడు జెఎసిలో ఉన్న అన్ని జాక్‌ల నేతల నాయకత్వంలో కూడా కులాలను చూడాల్సి ఉంటుంది.

కీలకమైన జాక్ నేతలంతా అగ్రవర్ణాలకు చెందినవారే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఒక దశాబ్ద కాలంపాటు దళిత బహుజన నాయకత్వం కీలకమైన స్థానానికి రాకపోతే ఆ వర్గాలకు చెందినవారు మరో 20 ఏళ్ళు వెనక్కు పోతారు. అప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత దళిత బహుజన వర్గాలకు కొత్తగా ఒరిగిందేమిటన్నదే కీలకప్రశ్న అవుతుంది. అందుకే రాష్ట్రం వచ్చేదాకా వేచి ఉందామన్న ఆలోచన బహుజనులలో ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేలోపుగా 2014 ఎన్నికలు జరిగేటట్లయితే టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బిసి, ఎస్‌సి, ఎస్టీ, మైనారిటీలకు ఎన్ని సీట్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్రం వస్తే రాజకీయ సమీకరణలు పూర్తిగా మారకపోతే తెలంగాణ రాష్ట్రం బహుజనులకు వొరగబెట్టిందేమిటన్న ప్రశ్న నుంచి కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తాయి. నల్గొండ జిల్లాలో రెడ్లు, మహబూబ్‌నగర్ జిల్లాలో రెడ్డి, వెలమలు, మెదక్, కరీంనగర్ జిల్లాల లో వెలమ, రెడ్ల నాయకత్వాలు మారకుండా సామాజిక న్యాయం ఎలా జరుగుతుంది? అందుకే బిసిలకు ప్రత్యేకించి సీట్లు కేటాయించాలి. తెలంగాణలో 119 ఎమ్మెల్యే స్థానాలకు 60 సీట్లు బిసిలకు కేటాయించాలి. 17 పార్లమెంటు స్థానాలకు 8బిసిలకు కేటాయించాలి. ఇది ఇప్పుడే జరగాలి. తెలంగాణ రాష్ట్రం వస్తే విధిగా జరగాలి.

కె. శ్రీనివాస్ ఇదే వ్యాసంలో 'తెలంగాణ ప్రాంతపు సాంప్రదాయ నాయకత్వానికి భూస్వామ్యపు పెత్తందారీ దుర్మార్గ గతమూ, అవశేష వర్తమానమూ ఉండవచ్చును. ఎంతకాలమని ఆ బూచీని చూపించి, చూసి, నాయకత్వమే లేకుండా ఉండగలరు? ఏ ప్రాంత ప్రజలైనా వారి సొంత నాయకత్వం కింద, పాలన కింద ఉంటే అణగి పోతారని, పీడితులౌతారని అనడంలో ఎంత మాత్రం శ్రేయోభిలాషిత్వం ఉన్నది? సామాజిక విమర్శ పెట్టి, ప్రత్యేక రాష్ట్రం వద్దనే దాక వెళ్లినవారున్నారు. మరి సమైక్య రాష్ట్రంలో మాత్రం సామాజిక న్యాయాన్ని వారెందుకు కోరరు? సామాజిక సమైకాంధ్ర కోరేవారెవరూ కనిపించరేమీ?' అన్న చర్చను లేవదీశారు. తెలంగాణ భూస్వామ్య వర్గం పోవాలని పోరాడే శక్తులే సీమాంధ్ర పెట్టుబడిదారులపై గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యమిస్తూనేఉన్నారు.సామాజిక న్యాయాన్ని, సామాజిక చైతన్యాన్ని కోరే శక్తులు వాళ్ళు ఏ రూపంలో ఉన్నా ఈ రెండు ప్రాంతాల్లోని కులాధిపత్యాన్ని, ఆర్థిక కులాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు వెళ్ళిపోవాలని పిలుపునివ్వడమంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ భూస్వామ్య ఆధిపత్యకులాల పెట్టుబడిదారులపై కూడా ఆ పోరాటం కొనసాగుతుంది. 

ఇప్పుడు భౌగోళిక తెలంగాణ ఉద్యమంలో తమ నేలపై ఇతర ప్రాంత ఆధిపత్యానికి వ్యతిరేకంగా యుద్ధం జరుగుతుంది. రేపు తెలంగాణ వచ్చాక సొంత నేలపై ఆధిపత్య కులాల ఆధిపత్యంపై తిరిగి ఉద్యమం కొనసాగుతుంది. తెలంగాణలో సామాజిక న్యాయాన్ని కోరుతున్నవారే గతంలో కూడా సమైక్యాంధ్రలో కూడా సామాజిక న్యాయాన్ని అడిగారు. కారంచేడు, చుండూరు ఉద్యమాలకు సంఘీభావంగా తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, ఆలోచనాపరులు ముందుకు వచ్చారు. ఆంధ్రా ప్రాంతంలో సామాజిక న్యాయం జరగాలని తెలంగాణ గొంతెత్తి అరచింది. ఇప్పుడు ప్రాంతీయ న్యాయంతోపాటు సామాజిక న్యాయమూ జరగాలని తెలంగాణ చైతన్యం ప్రశ్నిస్తోంది. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకునేటప్పుడే సామాజిక న్యాయం ఇటుకలతో కట్టుకుంటాం. కులాధిపత్యం అడ్డంకులను రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే తొలగించుకోవాలి.

-ప్రొఫెసర్ జి. లక్ష్మణ్

Andhra Jyothi Telugu News Paper Dated : 14/2/2013 

No comments:

Post a Comment