Sunday, October 20, 2013

అస్తిత్వం కోసమే ఆదివాసీ పోరాటాలు By -ఆత్రం నవీన్ ఆదివాసీల హక్కుల వేదిక


భూమి, అడవి, నీటిపై సంపూర్ణ హక్కులు కావాలని అనాది నుంచీ ఆదివాసు లు పోరాటం చేస్తున్నారు.అణచివేతకు గురవుతున్నారు. విశాల భారత దేశంలో ఆదివాసులు మొదటి నుంచి స్వయం పాలన కోసం పోరాడుతూనే ఉన్నారు. అతి పెద్ద రాజ్యాంగంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యా న్ని ఆదివాసులు పాలించారు. దక్షిణ భారత దేశం సరిహద్దు భూభాగంలో మధ్య భారతంలో అతిపెద్ద రాజ్యంగా గోండ్వానా రాజ్యం విస్తరించి ఆదివాసుల పరిపాలన కొనసాగేది. మొగలు సామ్రాజ్యం ఉత్తర భారతం మొత్తం విస్తరించినా దక్షిణ భారతంలో విస్తరించకుండా పోరాడిన యోధులు ఆదివాసులు. ఆదివాసీయేతర సమాజం ముఖ్యంగా ఆర్యుల నుంచి మొగలాయిలు, బ్రిటిషువారి నుంచి నేటి పాలకుల వరకు వలస, సామ్రాజ్యవాద చొరబాట్లు దోపిడీ, అణచివేతల కారణం గా నిరంతరం ఆదివాసుల పోరాటాలు కొనసాగాయి.

మరాఠాలు, రాజపు త్రులు, కాకతీయులుతో జరిగిన పొరాటంలో కొంత భూభాగాన్ని ఆదివాసులు కోల్పోయారు. కాకతీయుల పరిపాలనలో ప్రసిద్ధుడు రుద్రదేవుడు (మొదటి ప్రతాపరువూదుడు) కీ.శ.1158-1195) కూడా ఇప్పడి వరంగల్‌లో ఉన్న మేడారం పరిస ర ప్రాంతాలన్నీ పరిపాలిస్తున్న మేడరాజును ఓడించి తను ఎదుర్కొన్న ప్రథమ శత్రువు మేడారాజు పేరును హనుమకొండ వేయిస్థంబాలగుడి శాసనంలో రాయించాడు. నేడు ‘మేడారం’గా ప్రసిద్ది చెందిన సమ్మక్క సారలమ్మల పోరాటం కూడా ఆదివాసీలకు రాజ్యాధికారం కోసం అన్నది జగమెరిగిన సత్యం.దాదాపు 500 ఏళ్ల మహారాష్ట్ర, మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా,ఆంధ్రవూపదేశ్‌లోలలోని భూభాగాలలో ‘గోండ్వానా’ రాజ్యంగా ఆదివాసులపాలన కొనసాగింది. క్రీ.శ.1240-1750 వరకు వివిధ ఆదివాసీ గోండు రాజులు పాలించారు.‘గోండ్వానా’ను ఆక్రమించదలచిన అక్బర్ 1564లో అసఫ్‌ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని అక్కడకు తరలించాడు.అప్పటికి గోండ్వానాను వీర నారాయణ తరుపున రాణి దుర్గావతి పరిపాలిస్తుంది.
ddr91


దుర్గావతి మొగలుల సైన్యాన్ని వీరోచితంగా ప్రతిఘటించింది. విజయావకాశాలు లేవని తెలుసుకున్న దుర్గావతి ఆత్మాహుతి చేసుకుంది. 
భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమాలకు కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఆదివాసులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బ్రిటిష్ పాలనను ఆదివాసీయేతర సమాజం ఆహ్వానించినా ఆదివాసులు మాత్రం ప్రతిఘటించారు. ఎక్కడ ఎదురుకాని వ్యతిరేకత మనదేశంలోనే ఆదివాసీల పోరాటంతో వారికి అనుభవంలోకి వచ్చింది. క్రీ.శ.1874లోనే బ్రిటీషు ప్రభుత్వం ఆదివాసుల పోరాటాన్ని నిరోధించేందుకు సంస్కరణలు తీసుకువచ్చింది. ఆదివాసులు ఎక్కవగా నివసిస్తున్న ప్రాం తాలను ప్రత్యేక ప్రాంతాలుగా ప్రకటించింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వరరామచంవూదపురం నందు అంబుల్‌రెడ్డి నాయకత్వంలో గొడ్డలిపై పన్ను విధించిన బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఇప్పటి విశాఖ, గంజాం జిల్లాల్లో గల ఆదివాసులు తమ ప్రాంతంలోకి బ్రిటిష్ పాలన ప్రవేశించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ పాలకులు ఆదివాసీ పోడు వ్యవసాయంపై నిషేధం విధిస్తూ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 తీసుకువచ్చి ఆదివాసీలపై ఆంక్షలు విధించారు. 1917ఆగస్టు 14న బ్రిటీషు ప్రభుత్వం ఇప్పుడు షెడ్యుల్డ్ ప్రాంతాలుగా పిలువబడుతున్న ఏజన్సీ ఏరియాలో భూ నిబంధన క్రమబద్ధీకరణ చట్టం (ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్) 1917ను తీసుకురావడం జరిగింది. ఆదివాసీయేతరుల నుంచి రక్షణగా ఈ చట్టం ఆదివాసులకు ఉంటుంది అని భావించింది. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ప్రత్యేక కోర్టులను స్థాపించి ఆదివాసీ, ఆదివాసీయేతరులకు మధ్య భూ బదలాయింపు జరగాలంటే ఏజెంట్ టు గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి చేసింది. నిజాం ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాంతంలో గల ఆదివాసులపై ఆంక్షలు నిర్భంధాన్ని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకించారు.

కొమురం భీం నాయకత్వంలో ఆదివాసులు రాజ్యాధికారం కోసం ఉద్యమించారు.ఆదివాసుల స్వాధీనంలో ఉన్న భూములకు వారికే హక్కు కల్పిస్తామన్నా తమకు సంపూర్ణ రాజ్యాధికారం కావాలని నిజాం ప్రభుత్వంపై ‘లడాయి’ చేయటానికే సంసిద్దులయ్యారు. కొమురంభీం పోరాటంతో నిజాం ప్రభువు వారి పోరాటాన్ని గుర్తించి ఇంగ్లాండ్ దేశస్తుడు ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ హైమండార్ఫ్‌ను ఆహ్వానించి నివేదిక సమర్పించమని ఆదేశించాడు. హైమండార్ఫ్ సిఫారసులను అనుసరించి నిజాం ప్రభుత్వం ‘హైదరాబాద్ ట్రైబల్ యాక్ట్ 1949’ని తీసుకువచ్చింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘భూ నిబంధన చట్టం 1917’ లాంటిది. హైమండార్ఫ్ అప్పటి తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇప్పటి ఆంధ్ర ప్రాంతంలో గల ఆదివాసులు నివసిస్తున్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పర్యటించి ఆదివాసులు ప్రాంతాలుగా వేరైనా, భావాలు ఒక్కటిగానే ఉన్నాయి, వారి పోరాటం ఎక్కడైనా మనుగడ, రాజ్యాధికారం కోసమేనని వ్యాఖ్యానించారు. 


స్వాతంత్య్రానంతరం ఆదివాసుల జీవితాలు ‘పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టు’ తయారైంది. దీనికి పాలకులు, వారు అవలంబిస్తున్న విధానాలే కారణం. ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను అటవీ సంపదను నీళ్ళను సంపన్నవర్గాలకు వనరులను ధారాదత్తం చేసి ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అలాగే సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలో ఆదివాసీలున్న ప్రాంతంలో అటవీ, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. భారీనీటి ప్రాజెక్టుల కోసం కావాల్సిన గోదావరి, శబరి, మున్నేరు, ప్రాణహిత, కిన్నెరసాని, లాంటి నదులున్నాయి. వీటిని నమ్ముకొని తరతరాలుగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.జాతీయ అవసరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు బొగ్గు నిక్షేపాలను వెలికితీసే కార్యవూకమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొత్తగా ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో ఆది వాసులను నిర్వాసితులను చేస్తున్నారు.అభయారణ్యం, టైగర్ జోన్, మైనింగ్ పేర్లతో ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఖమ్మం జిల్లాలో వరరామచంవూదపురం,చింతూరు, వరంగల్ జిల్లాలో తాడ్వాయి, ఏటూరునాగారం, విశాఖ జిల్లాలో పాడేరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది గ్రామాల ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.


రాజ్యాంగంలో 5వ, 6వ షెడ్యూళ్ళు ఆదివాసులకు రక్షణగా రూపొందా యి. ఆదివాసుల స్వయం పరిపాలన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ‘పెసా’ చట్టాన్ని 1996లో రూపొందించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 1998లో చట్టబద్ధత చేసి గ్రామసభలకే సర్వాధికారం అన్నాయి. రాజ్యాం గ అధికరణ 244 కింద ఉదహరించబడిన ఆదివాసుల రక్షణ నియమాల వంటి చట్టాలను పాలకులు ఉల్లంఘిస్తూ ఆదివాసులను బలి చేస్తున్నారు.
ఆదివాసులు రక్షణ,భద్రత కరువై అల్పసంఖ్యాకులుగా మారుతూ సంస్కృతిని, భాషను కోల్పోయి అస్తిత్వాన్నే కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోంచే ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలోని ఆదివాసుల ప్రాంతాలను కలుపుకొని ఆదివాసులకు ‘గోండ్వానా రాష్ట్రం’ కావాలని డిమాండ్ చేస్తున్నా రు. వారికి కేటాయించిన షెడ్యూల్డ్ ప్రాంతాలల్లో రాజ్యాధికారం కలిగి ఉండటం ద్వారా మాత్ర మే వారి సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 29 (1) (ఆర్టికల్ 29 (1))ని అనుసరించి భారత భూభాగంలో ఏదో ఒక ప్రదేశంలో నివసిస్తున్న కొందరు ప్రజలు ఒక విలక్షణమైన భాషను గాని,లిపిని గాని లేక సంస్కృతిని గానీ కలిగి ఉన్నట్లయితే వారు ఆ భాష, లిపి, సంసృ్కతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటారు. ఆదివాసులు ప్రత్యేకమైన భాషను కలిగియున్నారు. వీరి సం సృ్కతి సంప్రదాయాలు ఆదివాసీయేతర సమాజంతో పోల్చితే ప్రత్యేకమైనది, వీరి జీవన శైలి విభిన్నమైన ది. వాటిని కాపాడుకోవడం భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కు.ఆదివాసీ ప్రజల కోసం భూమి కోసం విముక్తి కోసం పోరాటానికి సిద్ధమవు తున్నారు.

-ఆత్రం నవీన్ ఆదివాసీల హక్కుల వేదిక, లీగల్‌సెల్ కన్వీనర్

Namasete Telangana Telugu News Paper Dated: 20/10/2013 

పెద్ద రాష్ట్రాలు- పెద్ద కులాలు By ఉ.సా,


రాష్ట్రాల ఏర్పాటులో సావూజిక అంశాలు 
సీవులో ప్రధాన అగ్రకులంగా రెడ్లు 
కోస్తాలో కవ్ము కుల ఆధిపత్యం 
తెలంగాణలో వెలవు, రెడ్ల ప్రాబల్యం 
అణిగి వుణిగి ఉంటున్న బడుగు కులాలు
అన్ని భాషా రాష్ట్రాలో అగ్రకులాధిక్యతే 
ప్రజాస్వావ్యు ప్రయోజనాలు నిష్ఫలం 

భాషా రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను నెరవేర్చేటప్పుడు ఆ రాష్ర్ట భౌగోళిక ప్రాదేశిక అంశంతో పాటు, ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రజల సామాజిక స్థితిగతుల అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేడ్కర్‌ ఆలోచనలను పరిశీలిస్తే ఈ సమగ్ర దృక్పథం ఆవశ్యకత ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది. ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో ఆ భాషా రాష్ర్టం స్వ యం పోషకంగా మనగలుగు తుందా? అనే అంశాన్ని మొదగా పరిశీలించాలి. తదుపరి రెండవ అంశంగా ఆయా (పెద్ద, చిన్న) రాష్ట్రాల ఏర్పాటుకి సరిపడినంత భౌగోళిక విస్తీర్ణం, తగినంత జనాభా నిష్పత్తి ఉన్నాయా అనే అంశాల్ని పరిశీలించాలి. మూడవ అంశంగా ఆ రాష్ట్ర జనం ఏఏ కులాలకు చెందినవారో, ఆ కులాల పొందిక, ప్రభావం వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో, ఆ ప్రాంతపు అస్తిత్వం యొక్క సాంసృ్కతిక ప్రత్యేకత ఏమిటో పరిశీలించాలి’ అంటారు నవభారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడ్కర్‌. 

‘దేశ మంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌’ అన్నట్లు భారత దేశమైనా, ఆంధ్రప్రదేశమైనా ప్రాదేశిక అంశాన్నే గాక మానవ సమాజానికి సంబంధించిన సామాజిక అంశాల్ని కూడా పరిణలోకి తీసుకోకపోతే, దేశభక్తి- ప్రాదేశిక స్వాతంత్య్రానికే పరిమితమై దేశ ప్రజల స్వాతంత్య్రాన్ని విస్మరిస్తుంది. అలాగే భాషా రాష్ర్ట వాదుల భాషాభిమానం భాషారాష్ట్రాల ఏర్పాటుకే పరిమితమై, ఆయా రాష్ట్రాల ప్రజల బాగోగుల సంగతి విస్మరిస్తుంది. పెద్ద రాష్ట్రాల సంగతే కాదు చిన్న రాష్ట్రాల సంగతైనా అంతే. అందుకే పెద్ద, చిన్న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమగ్రదృష్టితో పరిశీలించిన అంబేడ్కర్‌ ఆలోచనలు అంత శాస్త్రీయతను, ఆచరణీయతను సంతరించుకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద రాష్ట్రాలు పెద్ద కులాల విషయంలో ఆయన చేసిన సాధారణ విశ్లేషణ ఏమిటో పరిశీలిద్దాం. అలాగే భాషారాష్ర్టం పేరిట వివిధ ప్రాంతాల్ని విశాలాంధ్రలో విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ర్టం విషయంలో స్వయంగా ఆయన చేసిన ప్రత్యేక విశ్లేషణని ప్రత్యేకంగా పరిశీలిద్దాం. 

‘భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ట్రాల్లో ఒకటి రెండు ప్రధాన కులాలు అగ్రకులాలుగా, మరికొన్ని ఇతర కులాలు అధిక సంఖ్యాక ప్రాబల్య కులాలుగా పెద్ద సంఖ్యలో ఉంటాయి. అలాంటి ప్రధాన అగ్రకులాలపై, ఇతర అధికసంఖ్యాక ప్రాబల్య కులాలు- ఆ రెండింటిపై అల్పసంఖ్యాక అస్పృశ్యకులాలు ఆధారపడి, అణిగిమణిగి ఉండే కుల వ్యవస్థ సర్వ సాధారణ వ్యవస్థగా అన్ని భాషా రాష్ట్రాల్లో కొనసాగుతుంటుంది’ అన్నారు. ఈ సాధారణత్వానికి ఆంధ్రప్రదేశ్‌ మినహాయింపు కాదు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌ భాషా రాష్ర్టంలో కోస్టల్‌ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతీయ సాంస్కృతిక ప్రత్యేకతలో వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లోని కులాల పొందిక, ప్రభావాలు కూడా విభిన్నంగా ఉన్నాయి. రాయలసీమలో రెడ్డి కులం ప్రధాన అగ్రకులంగా ఆధిపత్యం చలాయిస్తున్నది. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలపై కోసాంధ్ర కమ్మ కులం ప్రధాన అగ్రకులంగా ఆధిపత్యం చలాయిస్తున్నది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న కులాలపొందిక మరోవిధంగా ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వెలమ కులం అగ్రకులంగా గుత్తాధిపత్యం చలాయిస్తుంటే, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో రెడ్డి కులం మరో అగ్రకులంగా గుత్తాధిపత్యం చలాయిస్తోంది. వలసాంధ్రకులంగా తెలంగాణకి వలసవచ్చిన కమ్మ అగ్రకులస్థులు తెలంగాణ అంతటా గణణీయంగానే ఉన్నారు. 

తెలంగాణలో ఉన్న వెలమ కులం, రాయలసీమాంధ్రలో ఏ ప్రాంతంలోనూలేదు. తెలంగాణ-ఆంధ్ర రెండు ప్రాంతాలను పోల్చిచూస్తే రాయలసీమలో ప్రధానంగా, ఇతర కోస్తా జిల్లాల్లో పాక్షికంగా ఉన్న రెడ్డి అగ్రకులం తెలంగాణలో కూడా ప్రధాన అగ్రకులంగా ఉండటంతో రెండు ప్రాంతాల కలయిక వలన దాని అగ్రకుల సంఘటిత శక్తి రెట్టింపయ్యింది. తెలంగాణ, ఆంధ్ర వంటి చిన్న రాష్ట్రాల విలీనం వల్ల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ర్టంలో, భౌగోళిక వైశాల్యంతో పాటు రెడ్డి అగ్రకులం జనాభా నిష్పత్తి, దాని సంఘటిత శక్తి కూడా ప్రబలంగా పెరిగిపోయి అది అత్యంత శక్తిమంతమైన ఆధిపత్యకులంగా పరిణమించింది. అలాగే తెలంగాణలో తిష్ఠ వేసిన వలసాంధ్ర కమ్మ కులం, వెలమ కులంతో చేతులు కలిపి రెడ్డి అగ్రకుల గుత్తాధిపత్యానికి గట్టి పోటీదారుగా మారింది. 

ఆ రకంగా ప్రాంతాల వారీ, కులాలవారీ పొందికను బట్టి, పోటీని బట్టి భాషా ప్రయుక్త రాష్ర్టం పేరిట వివిధ ప్రాంతాల్ని విశాలాంధ్రలో విలీనం చేసిన తొలిభాషా రాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా తీసుకుని సామాజిక విశ్లేషణ చేసిన అంబేడ్కర్‌ ‘ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌నే తీసుకొంటే ఆ భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ర్టంలో రెడ్డి, కమ్మ వంటి రెండు ప్రధాన అగ్రకులాలు వివిధ ప్రాంతాల్లో గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి. వ్యవసాయం, వ్యాపారం, ఉన్నతోద్యోగాల్లాంటి ముఖ్యరంగాలపై ఆ రెండు ప్రధాన అగ్రకులాలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. అధిక సంఖ్యాక ఇతర వెనుకబడిన కులాలకు, అల్ప సంఖ్యాక అస్పశ్య కులాలకు చెందిన బడుగువర్గ చిన్న కులాలవారు అగ్రకులాధిపత్య (పెద్ద) కులాలపై ఆధారపడి అణగిమణిగి బ్రతుకు ఈడుస్తున్నారు...

...ఇలాంటి భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ట్రాల్లో చిన్నకులాలవారు తమ అభ్యున్నతికి, సాధికారికతకి (ఈ అగ్రకులాధిపత్యశక్తులను ఎదిరించి) ఆస్కారం ఉందని ఆశించేందుకు ఏం మిగిలింది? తాము స్వయంగా (రిజర్వేషన్లు లేకుండా) శాసనసభకు ఎన్నిక కాగలమని చిన్న కులాల వారు ఆశించగలరా (రిజర్వేషన్లులేని బడుగువర్గ బిసి కులాల వారికి రాజ్యాధికారంలో కనీస ప్రాతినిధ్యమైనా లభిస్తున్నదా?)! ప్రభుత్వ ఉద్యోగాల్లో (ఉన్నతోద్యోగాల్లో బిసిలు 5 శాతం మించడం లేదు) తమ వాటా తాము పొంది ఈ సమాజంలో తమకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టుకోగలమని వారాశించగలరా? తమ ఆర్థిక ప్రగతి కోసం ఆ భాషా ప్రయుక్త (అగ్ర కులాధిపత్య పెద్ద) రాష్ర్ట ప్రభుత్వం శ్రద్ధ వహించగలదని వారు విశ్వసించగలరా? ఈ రకమైన దుస్థితి నెదుర్కొంటున్న బడుగువర్గ చిన్న కులాల వారి సామాజిక స్థితిగతుల్లో సామాజిక మార్పు తీసుకురాకుండా, కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచడమంటే దాని అర్థం ప్రధాన అగ్రకులాధిపత్య శక్తులకు ఆయా భాషా రాష్ట్రాల్లో స్వపరిపాలనాధికారం కట్టబెట్టటమే అవుతుంది. అప్పుడు అలాంటి రాష్ట్రాలను కేవలం (ప్రాదేశికంగా) భాషా ప్రయుక్తరాష్ట్రాలు అనేకంటే (సామాజికంగా) ఆంధ్రప్రదేశ్‌ని రెడ్డి (కమ్మ) రాష్ర్టమని, పంజాబ్‌ని జాట్‌ రాష్ర్టమని, మహారాష్ర్టని కున్బీ మరాఠా రాష్ర్టమని అంటే బాగా అర్థమవుతుంది’ అని భాషారాష్ట్రాల అగ్రకుల బాగోతాన్ని బట్టబయలు చేశారు. 

అందుకే అంబేడ్కర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల, పెద్ద రాష్ట్రాల ఏర్పాటు పట్ల అంత సదాభిప్రాయంలేదు. కుల వ్యవస్థ ప్రబలంగా ఉన్న భారతదేశంలో సామాజిక సమతుల్యత గురించి పట్టించుకోని భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల భాషాతత్వం అగ్రకులతత్వానికి మారు పేరుగా పరిణమిస్తుందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ తెలుగుభాషా రాష్ట్రాన్ని కమ్మ రాష్ర్టం లేదా రెడ్డి రాష్ర్టం అని అనాల్సివస్తుందన్నారు. భాషా రాష్ర్ట ఏర్పాటు వల్ల ఒనగూడే ప్రాదేశిక ప్రజాస్వామ్య ప్రయోజనాన్ని ఈ అగ్రకుల సామాజిక నిరంకుశాధిపత్యం నిష్పయోజనంగా మార్చుతుందన్నారు. ఆయన అన్నట్టే తెలుగు రాష్టమ్రంటే- కమ్మ దేశంగా, రెడ్డి దేశంగా, తెలుగు దేశం పార్టీ అంటే కమ్మ అగ్రకుల శక్తుల కొమ్ముగాసే కమ్మదేశం పార్టీగా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే రెడ్డి కాంగ్రెస్‌ పార్టీగా, రెడ్డి అగ్రకుల శక్తుల కొమ్ముగాసే పార్టీగా మారడమే అందుకు నిదర్శనం. అందుకే బడుగు వర్గ చిన్న కులాల హక్కులకు భాషారాష్ట్రాల ప్రభుత్వాల్లో కన్నా కేంద్ర ప్రభుత్వంలోనే ఎక్కువ రక్షణ ఉంటుదని అంబేడ్కర్‌ భావించి దళితుల హక్కులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కట్టుదిట్టమైన రక్షణ కల్పించాడు. 

అభివృద్ధిని వికేంద్రీకరించడంతో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలని వాదించే నికార్సయిన ప్రజాస్వామ్యవాది అంబేడ్కర్‌, బడుగువర్గ దళిత కులాల హక్కుల రక్షణ భాద్యత కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంచక తప్పదని భావించాడంటే భాషారాష్ట్రాల ముసుగులో నిరంకుశాధిపత్యం చలాయించే ప్రాంతీయ అగ్రకుల శక్తుల ధాష్ఠీకాన్ని ఎంతగా అభిశంసించాడో అర్థమవుతుంది. అలాగని భాషా ప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటులో ఇమిడి ఉన్న ప్రజాస్వామ్య సూత్రం ఎడల తన సూత్ర బద్ధ వైఖరిని ఎన్నడూ విడనాడలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత గురించి ఆయన చెప్పినంత గొప్పగా మరే భాషా రాష్ర్ట వాదీ చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఒక జాతికి చెందిన తామంతా ఒక భాషా మాట్లాడే సజాతీయులం అనే భావనలేని మిశ్రమ భాషా రాష్ట్రాల్లో, ఒక భాష మాట్లాడే వారి పట్ల మరొక భాష మాట్లాడే వారు పరభాషా విద్వేష్వాన్ని, వ్యతిరేకతని కలిగి ఉంటారు.

అందువల్ల ఒకే భాష మాట్లాడే సజాతీయ భావనలేని మిశ్రమ భాషా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం సరిగా పనిచేయలేదని చరిత్ర చాటి చెబుతోంది. కనుక బొంబాయి, మద్రాసు, కలకత్తావంటి మిశ్రమ భాషా రాష్ట్రాల్లో కంటే ఏక భాషాప్రయుక్త రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం మరింత మెరుగ్గా పని చేయగలుగుతుంది’ అని స్పష్టంచేశాడు. కనుక భాషా రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన వ్యతిరేకం కాదు. ఆ మేలిముసుగులో అగ్రకులా ధిపత్య శక్తులు, అధికార దుర్వినియోగంతో అన్యాయానికి, అణచివేతకి పాల్పడకుండా హద్దుల్లో ఉండడానికి ఖచ్చితమైన కొన్ని అదుపాజ్ఞలతో సామాజిక సమతుల్యతను (చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌) కాపాడేలా తగిన చర్యలను తీసుకోవాలన్నాడు. అలాగే అస్పృశ్య అల్ప సంఖ్యాక చిన్న కులాల హక్కుల పరిరక్షణకు ప్రత్యేకమైన రక్షణ చర్యలు (సేఫ్‌గార్డ్‌‌స) తీసుకోవాలన్నారు. 

అంతేకాదు అధికారంలో, అభివృద్ధిలో బడుగువర్గ చిన్నకులాలకు వారి జనాభాకి తగిన ప్రాతినిధ్యాన్ని, భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా సమ్మళిత అభివృద్ధితో కూడిన భౌగోళిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే భాషా ప్రయుక్త రాష్ట్రాలతో కూడిన భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య బాగుపడుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించి, ఓటు విషయంలో అందరూ సమానులే అనే రాజకీయ సమానత్వం లభించినా (కుల-వర్గ), సామాజిక- ఆర్ధిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సామాజిక న్యాయంతో ఈ సామాజిక అన్యాయాన్ని సామాజిక అసమానతల్ని సత్వరమే రూపుమాపి సామాజిక సమతుల్యత సాధించకపోతే ఎంతో శ్రమకోర్చి రూపొందించుకున్న మన దేశ ప్రజాస్వామ్యం అగ్రకుల ధనిక సామ్యంగా భ్రష్ఠు పట్టిపోతుం దని-రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించే సమయంలోనే మన దేశ రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. 

సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో అవినీతిమయమైన నేరపూరిత రాజకీయాల నుండి దేశ రాజకీయ రంగాన్ని ప్రక్షాళనం చేయాలని డిమాండ్‌ చేస్తున్న సోకాల్ట్‌ ప్రజాస్వామ్య వాదులు అందుకు మూలమైన బ్రాహ్మణీయ హిందూ మత తత్వ అగ్రకుల ధనిక స్వామ్యాన్ని రాజకీయాలనుండి ప్రక్షాళన చేయాలని మాత్రం నేటికీ కోరడం లేదు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాల భారతావనిలో సమాఖ్యరాజ్యం అని ఆదర్శాలు వల్లించిన ఆనాటి కామ్రేడ్లు సైతం భారత సంయుక్త భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో లౌకిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సోషల్‌ జస్టిస్‌ సోషలిజాన్ని విస్మరించి విశాలాంధ్ర పేరిట అగ్రకుల వలసాంధ్ర పెట్టుబడిదారీ, పెత్తందారీ రాజ్యాలు నెలకొల్పిన కమ్మ, రెడ్డి కామ్రేడ్లుగా మారారు.

Suryaa Telugu News Paper Dated: 20/10/2013 

Saturday, October 19, 2013

చిన్న రాష్ట్రాలూ పెద్ద కులాలేకనా? By ఉ.సా.,


చిన్న రాష్ట్రాల ఏర్పాటు- వికేంద్రీకృత అభివృద్ధికి, పరిపాలనా సౌలభ్యానికి మాత్రమే గాక బడుగు వర్గ చిన్న కులాల అభ్యున్నతికి కూడా తోడ్పాటునిస్తుందని డా బి. ఆర్‌. అంబేడ్కర్‌ ప్రతిపాదించిన సమగ్ర దృక్ఫధంలో, ప్రాంతీయ కోణంతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏ కోణం ఆవశ్యకత ఆ కోణానికి ఉన్నా, ప్రాధాన్యతా క్రమం లో ఏ అంశం ప్రధానంగా ముందుకొస్తే ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాల్సివచ్చినా, ఏ అంశా నికి ఆ అంశాన్ని పాక్షిక అంశంగా చూడకుండా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీ లించే సమగ్ర దృక్ఫధం అవసరం అని ఆనాడే (1950-55) నొక్కి చెప్పినది ఆధునిక అభ్యుదయ నవ భారత రాజ్యాంగ నిర్మాత డా బి. ఆర్‌. అంబేడ్కర్‌ ఒక్కరే అంటే అతిశయోక్తి కాదు. కానీ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని ఓ అక్షయ పాత్రగా భావించి, ఆ పాత్రలో నుండి ఎవరికి కావలసిన అంశాన్ని వారు స్వీకరి స్తున్నారు

తప్ప అందులోని సమగ్ర దృక్ఫధాన్ని ఎవరూ స్వీకరించడం లేదు. అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని కులానికి, అందులోను అస్పృశ్య కులాలకి, మళ్లీ వాటిలో తను ఏ ఉప కులానికి చెందనవాడో ఆ ఉపకులానికి పరిమితం చేసే సంకుచిత సాంప్రదాయ అంబేడ్కర్‌ వాదులు ఆయన సమగ్ర దృక్పధాన్ని అసమగ్ర దృక్ఫధంగా కుదించారు. భారత జాతీయ సమైక్యత, సమగ్రతల పేరిట భారత జాతీయ వాదాన్ని ముందుకు తెచ్చిన కాంగ్రెస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సోకాల్డు భారత జాతీయవాదులు ఆయన చెప్పిన భారత సంయుక్త‚ రాష్ట్రాల సమాఖ్య వాదాన్ని స్వీకరించకుండా పక్కన పెట్టారు. ఆ దృక్ఫధం భారత జాతీయ సమైక్యతను దెబ్బతీసే, సమైక్య భారతావనిని విచ్ఛిన్నంచేసే దృక్పధంగా వక్రీకరించి అఖండ భారత్‌ వాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. స్వదేశీ స్వధర్మ స్వరాజ్‌ పేరిట మత ధర్మరక్షణ ముసుగులో మనుధర్మ రక్షణ కోసం మత ప్రాదిపదికపై హిందూ హిందుయేతర రెండు జాతుల సిద్ధాంతాన్ని సృష్టించి, జాతీయ తత్వాన్ని అగ్రకుల తత్వంగా, మత తత్వంగా భ్రష్ఠు పట్టించారు. 

విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాల భారతావనిలో సమాఖ్య రాజ్యం అని ప్రవచించిన (పుచ్చలపల్లి సుందరయ్య వంటి) కమ్యూనిస్టులు హిందూ హిందు యేతర రెండు జాతుల సిద్ధాంతంలో భాగంగా హైదరాబాద్‌ (తెలంగాణ) ఫ్యూడల్‌ సంస్థానాన్ని పాకిస్థాన్‌లో కాకుండా హిందూస్థాన్‌లో, భారత యూనియన్‌లో విలీనం చేయడానికి పరోక్షంగా తోడ్పాడ్డారు. అంతేకాదు ఇండియా సంయుక్తరాష్ట్రాలను భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా పునర్వవస్థీకరించాలనే వాదనతో ఒకే భాష, ఒకే రాష్ర్టం- అనే నినాదంతో వలసాంధ్ర వాదానికి తోడ్పడే సమైక్యాంధ్ర విశాలాంధ్ర ధృక్ఫధానికి ‚ పట్టంకట్టారు. ఒకే భాష, ఒకే రాష్ర్టం అనే ఆ నినాదమే నేటి కుహనా సమైక్యాంధ్ర రణన్నినాదంగా మారింది. సమైక్యాంధ్ర పేరిట తెలంగాణ‚ వ్యతిరేక, సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఆ ముసుగులో అగ్రకుల తత్వాన్ని చొప్పించి చిన్న రాష్ట్రాల ఏర్పాటును సహితం పెద్ద కులాల ఆధిపత్యం లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

‚అందుకు భిన్నంగా, ఓ పెద్ద రాష్ర్టమైన ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాలుగా విభజిస్తే సాపేక్షికంగా అవి రెండూ చిన్న రాష్ట్రాలే అవుతాయి కనుక, అంబేడ్కర్‌ చెప్పిన చిన్న రాష్ట్రాల వాదాన్ని భౌగోళిక తెలంగాణ వాదులు బలపరుస్తున్నారు. అలాగే ఇది కేవలం ఒక పెద్ద రాష్ట్రాన్ని రెండు చిన్న రాష్ట్రాలుగా విభజించడం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ పేరిట1956 లో బలవంతాన విలీనమైన తెలంగాణ (హైదరాబాద్‌), ఆంధ్ర రాష్ట్రాలు మళ్లీ యథాపూర్వ వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పడడమేనని కూడా వాదిస్తున్నారు. గత 56 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన వలసాంధ్ర పెత్తందారీ శక్తులు తెలంగాణ ప్రాంతంతో పాటు, సీమాంధ్రలోని ఉత్తరాంధ్ర , రాయలసీమ తదితర వెనుకబడిన ప్రాంతాల ప్రాంతీయ అసమానతలను తొలగించాల్సిన బాధ్యతను విస్మరించాయి. ఆ విధంగా సమైక్యాంధ్రలో సమగ్రాభివృద్దిని, సమానాభివృద్ధిని సాధిస్తామని వాగ్దానం చేసిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కిన కారణంగానే ప్రత్యేక తెలంగాణ వాదం తలెత్తిందని చెప్తున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్‌ నగరంపై,‚ సాగునీటి సదుసాయం ఉన్న వివిధ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలపై వలసాంధ్ర పెత్తందారీ తనానికి పాల్పడిన అగ్రకుల పెట్టు బడి దారీ శక్తులవల్లనే దగాపడ్డ‚ తెలంగాణలో ప్రత్యేక తెలంగాణవాదం తలెత్తిందని వాదిస్తున్నారు. ఆ రకంగా సమైక్యాంధ్ర అనైక్యాంధ్రగా మారటానికి సీమాంధ్ర వలన పెత్తందారీ శక్తులే మూలకారకులైనా, ఆ సత్యాన్ని కప్పిపుచ్చి- ప్రత్యేక తెలంగాణ వేర్పాటు వాదులు, కాంగ్రెస్‌ అవకాశవాదులు ఇరువురు కుమ్మకై తెలుగు జాతి సమైక్యతకు చిచ్చుపెట్టారని కట్టుకథలు చెప్పి సామాన్యాంధ్రుల్లో, సీమాంధ్రలో ప్రాంతీయ విద్వేషతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని తెంగాణ వ్యతిరేక ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు భూమికగా మార్చుకుంటున్నారు. కానీ, దగాపడ్డ తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ర్టంగా ఏర్పడడం- సమైక్యాంధ్రను విచ్ఛిన్నంచేసే విచ్ఛిన్నకర వేర్పాటువాదం కాదని వాదిస్తున్న తెలంగాణ వాదులు అంబేడ్కర్‌ చెప్పిన చిన్న రాష్ట్రాల వాదాన్ని ఆశ్రయిస్తున్నారు. 

ఆనాడు అంబేడ్కర్‌ చెప్పినట్లు భాషా ప్రయుక్త రాష్ర్టమంటే- ఒక భాష మాట్లాడే ప్రజందరినీ ఒక రాష్ర్ట (భౌగోళిక సరిహద్దుల) పరిధిలోకి తీసుకురావాలన్నది ఒక అర్థమైతే, ఒక భాష మాట్లాడే ప్రజలకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చునన్నది మరొక అర్థం- అని చెప్పిన అంబేడ్కర్‌ వాదానికి రెండు అర్థాలున్నాయి. ఇందు లో ఒక అర్థాన్నే తీసుకొని రెండవ అర్థాన్ని విస్మరించి- ఒకే భాష, ఒకే రాష్ర్ఠం- అనే‚ నినాదం ఇచ్చిన భాషాప్రయుక్త వాదుల వక్రభాష్యం వల్లనే ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ విడిపోవాల్సివస్తోందన్న మాట. ఒక భాషా రాష్ఠ్రానికి ఒకే భాష తప్పనిసరి కావచ్చు గాని, ఒక భాషకి ఒకే రాష్ర్టం తప్పని సరి కాదని, చారిత్రక, ప్రాంతీయ ప్రత్యేక కారణాల రీత్యా ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆనాడే (1950- 55) అంబేడ్కర్‌ చెవినిల్లు కట్టుకొని చెప్పినా వినకుండా పెడచెవిన పెట్టిన ఫలితంగానే ఈ చారిత్రక తప్పిదం జరిగింది. 
కొన్ని వందల సంవత్సరాలు ప్యూడల్‌ రాచరిక వ్యవస్థలో మగ్గిన తెలంగాణ ప్రాంతం, సర్కారాంధ్ర కంటే చారిత్రక వెనుకబాటు తనానికి గురై ఉంది.

రాయల సీమ దత్త మండలం కూడా కోస్తా ఆంధ్రా కంటే వెనుకబడి ఉంది. ఆధునిక బ్రిటిష్‌ సర్కార్‌ పాలన క్రింద ప్రయోజనం పొందిన కోస్తా ఆంధ్ర- తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల కంటే ఆధునికంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతీయ అభివృద్ధిని సామాజిక అభివృద్ధిగా మలచుకున్న అగ్రకుల ఆధిపత్య శక్తులు బ్రిటిష్‌ వలన వాదుల ప్రభావంతో కోస్తాంధ్రా వలన వాద శక్తిగా రూపాంతరం చెందాయి. 1956 లో ఆంధ్రప్రదేశ్‌ అవతరించి 56 యేళ్లు దాటినా నేటికీి కొనసాగుతున్న ఈ మూడు ప్రాంతాల ప్రాంతీయ వ్యత్యాసాల వాస్తవికత (మూడు చేతుల బొమ్మ) ‚ సమైక్యాంధ్ర చిత్ర పఠాన్ని చిధ్రం చేస్తోంది. అందుకో భవిష్యత్తు దృష్టితో అరవై ఏళ్ల క్రితం అంబేడ్కర్‌ చెప్పిన మాట నేటి వర్తమాన చరిత్రకి వర్తించే చారిత్రక సత్యంగా కాల పరీక్షలో నెగ్గి మార్గ దర్శకంగా మారింది. కుహనా భారత జాతీయ వాదుల, భాషా రాష్ర్ట వాదుల అవకాశవాదం కాల దోషంపట్టి కాల గర్భంలో కలిసిపోయింది. 

ఈ దృష్టితో ఆనాడు‚ అంబేడ్కర్‌ ఏమన్నారో పరిశీలిద్దాం- ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తెలుగు జాతి (జాతీయ) సమైక్యతకు, భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య దృక్పధానికి చేటు తెస్తుందని అంటున్న ఈనాటి సమైక్యాంధ్ర వాదుల్లాగానే, ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు భారత జాతీయ సమైక్యతకు చేటు తెస్తుందని బ్రాహ్మణీయ హిందూ భారత జాతీయ వాదులు వాదించారు. ఆనాడే వారి అవకాశ వాదాన్ని పూర్వ పక్షం చేస్తూ- అమెరికా సంయుక్త రాష్ట్రాల సమాఖ్య దృక్పధాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అంబేడ్కర్‌ ప్రతిపాదించారు. అంతేకాదు, భారత సంయుక్త రాష్ట్రాలను భాషాప్రయుక్త రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించాలని, ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ర్టంలో ఉండాలని వాదించిన ఆనాటి భాషారాష్ర్ట వాదుల అవకాశవాదాన్ని కూడా ఖండించారు. ఒకే భాష మాట్లాడే వారందరని ఒకే రాష్ర్ట పరిధిలోకి తెచ్చే సందర్భంలో ప్రాంతీయ వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకోవాలని, అలా తీసుకోవడం సమాఖ్య (ఫెడరల్‌) దృక్పధానికి మరింత మేలు చేస్తుందే కాని, కీడు చేయదని స్పష్ఠం చేశాడు.

ఆయన ఏమన్నాడో ఆయన మాటల్లలోనే- భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య రాజ్యాంగం విజయవంతంగా పనిచేయడానికి భాషాప్రయుక్త రాష్ట్రాలు మరింత ప్రాదేశిక సమతుల్యతతో ఉండడం అవసరం. ప్రాదేశికమైన ప్రాంతీయ అసమానతలు మరీ ఎక్కువగా ఉన్నట్లుయితే అవి వెనుక బడిన ప్రాంతాల వారిలో అనుమానాన్ని, అసంతృప్తిని కలిగించడమే కాక ఫెడరల్‌ స్ఫూర్తి విచ్ఛిన్నమైపోయే దుష్పరిణామాలకు దారి తీస్తుంది. అందుకే ప్రాదేశిక ప్రాంతీయ సమతుల్యత ఆవశ్యకతని సార్వజనీనంగా సర్వత్రా అందరూ గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల ఫెడరల్‌‚ రాజ్యాంగాల్లో పెద్ద రాష్ట్రాల (ప్రాబల్య ప్రాంతాల) ప్రాబల్యాన్ని హద్దులో ఉంచి అదుపుచేయడానికి పలు జాగ్రత్తలు తీసుకున్నారు.... అలాగే పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న రాష్ట్రాల ఏర్పాటును సర్వత్రా స్వాగతించారు. 

ఫెడరల్‌ రాజ్యా ంగ సెనెట్‌లో‚ చిన్న పెద్ద తేడా లేకుండా (చిన్న రాష్ట్రాలను చిన్న చూపు చూడకుండా) ప్రతి రాష్ట్రానికి సమాన (హోదా) ప్రాతినిధ్యాన్ని కల్పించారు (పేజీలు 192, 193, భాషా ప్రయుక్త రాష్ట్రాలు). ఈ ఆలోచనతోనే అంబేడ్కర్‌ 1955లో మహారాష్ర్ట, యుపి, ఎపి, బీహార్‌ తదితర పెద్ద రాష్ట్రాల ఏర్పాటును చిన్న రాష్ట్రాలుగా వ్యవస్థీకరించాలని సూచించారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌కు సారథ్యం వహించన ఫజల్‌ ఆలీ కూడా హైదరాబాద్‌ (తెలంగాణ) రాష్ఠ్రాన్ని ఆంధ్రరాష్ర్ఠంతో వెంటనే విలీనం చేయకుండా కొంతకాలం సొంత కాళ్ల మీద నిలబడి అభివృద్ధి చెందనివ్వాలని సిఫారసు చేశారు. 

ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు ఈనాడు ప్రత్యేక తెంగాణ రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ఆచరణ రూపం దాల్చడమంటే, ఆంధ్రప్రదేశ్‌ అనే ఒక పెద్ద రాష్ఠ్రాన్ని తెంగాణ- ఆంధ్ర అనే రెండు చిన్న రాష్ట్రాలుగా పునర్వ్యవస్థీకరించడమే. మరో రకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ పేరిట 1956లో బలవంతాన విలీనమైన తెలంగాణ, ‚ఆంధ్ర రాష్ట్రాలను మళ్లీ యథాపూర్వ వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడమే. అందుకే తెంగాణ వాదులు అంబేడ్కర్‌ ప్రతిపాదించిన చిన్న రాష్ట్రాల వాదాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు వత్తాసు పలికే వాదంగా ప్రచారం చేస్తున్నారు. కాని అంబేడ్కర్‌ సమగ్ర దృక్పధం అనే అక్షయపాత్రలో నుంచి ఎవరికి వాటంగా ఉన్నదాన్ని వాళ్లు వాడుకున్నట్లే తెలంగాణ వాదులు కేవలం భౌగోళిక తెలంగాణ వాదానికే పరిమితం అవుతున్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వికేంద్రీకృత అభివృద్దికి, పరిపాలన సౌలభ్యానికి మాత్రమే కాక బడుగు వర్గ చిన్న కులాల అభ్యున్నతకు కూడా తోడ్పాటు ఇస్తుందని అంబేడ్కర్‌ చెప్పిన మూడు విషయాల్లో చిన్న కులాలకు తోడ్పాటు అనే మూడవ విషయాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే మినహాయిస్తున్నారు. 

అంటే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటుగా మారడం తెలంగాణ ప్రాంత వెలమ, రెడ్డి, బ్రాహ్మణీయ అగ్ర కులాధిపత్య శక్తులకు ఏ మాత్రం ఇష్టం లేదన్న మాట. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరిగిన ఉద్యమంలో చోదక శక్తిగా పనిచేసి, అత్యధికంగా ఆత్మ బలిదానాలకు పాల్పడిన బహుజన శక్తుల్ని వెనక్కి నెట్టి కొత్తగా ఏర్పడే 29వ రాష్ర్టమైన తెలంగాణ రాష్ర్టంపై అగ్రకుల ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని చూస్తున్నారన్న మాట. ప్రాదేశిక సమాన అభివృద్ధి కోసం, భౌగోళిక తెంగాణ సమాన అవకాశాల కోసం సామాజిక తెలంగాణ- అని నినదించిన అంబేడ్కర్‌ వాదులు తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజిక తెలంగాణ వాదాన్ని ప్రతిష్ఠించడంలో ఎందుకు విఫలం అవుతున్నారో పునరా లోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. 

విచిత్రమేమిటంటే అంబేడ్కర్‌ వాదం అనే అక్షయ పాత్రలో నుంచి భౌగోళిక తెలంగాణ వాదులు సామాజిక సమతుల్యత అంశాన్ని విస్మరించి, తమకు వాటంగా ఉండే ప్రాదేశిక సమతుల్యతాంశాన్ని స్వీకరించారు. అలాగే వలసాంధ్ర అగ్రకుల పెట్టుబడి దారీ, పెత్తందారీ శక్తులు హైదరాబాద్‌ను రెండవ రాజధానిగా చేయాలని చెప్పిన అంబేడ్కర్‌ అభిప్రాయాన్ని వాటంగా వాడుకుంటున్నారు. అంబేడ్కర్‌ చెప్పిన వికేంద్రీకృత అభివృద్ధికి విరుద్ధంగా హైదరాబాద్‌ రాజధానీ నగరాన్ని కేంద్రీకృత విధ్వంసక అభివృద్ధికి నమూనాగా మార్చిన వలసాంధ్ర పెట్టుబడి దారీ శక్తులు, హైదరాబాద్‌ని దేశానికి రెండవ రాధానిని చేయాలని చెప్పడం విడ్డూరం.
హైదరాబాద్‌తో సహా 10 జిల్లాల తెలంగాణ ప్రాంతం తెలంగాణవారి స్వపరిపాలనాధికారం క్రిందికి పోవడాన్ని సహించలేని వలసాంధ్ర పెట్టుబడిదారులు, తమకు దక్కని హైదరాబాద్‌ను తెలంగాణ వారికి కూడా దక్కనీయకుండా చేయడానికే ఈ పన్నాగం పన్నారు. హైదరాబాద్‌ ను దేశానికి రెండవ రాజధానిగా చేయాలని అంబేడ్కర్‌ ఏ చారిత్రక సందర్భంలో చెప్పాడో ఆ సందర్భాన్ని కప్పిపచ్చాలని చూస్తున్నారు.

ఆంగ్లేయ పాలకులు ఢిల్లీని ఒక రాజధానిగా, సిమ్లాని మరో రాజధానిగా చేసుకున్నట్లే భారత పాలకులు ఢీల్లీతో పాటు హైదరాబాద్‌ని మరో రాజధానిగా చేసుకుంటే పరిపాలనా సౌలభ్యం రీత్యా ఉత్తరాది రాష్ట్రాలకు ఒక రాజధాని, దక్షిణాది రాష్ట్రాలకు మరో రాజధాని అందుబాటులో ఉంటాయని చెప్పారు. అందుకు తగిన అన్ని అర్హతలు కలిగినదిగా అప్పటికే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి చెందిందని స్పష్టం చేశాడు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రప్రభుత్వం ఫజల్‌ ఆలీ కమిషన్‌ను నియమించిన చారిత్రక సందర్భంలో 1955లో అంబేడ్కర్‌ వ్యక్తంచేసిన ఆ అభిప్రాయాన్ని ఆనాడు స్వీకరించ కుండా, హైదరాబాద్‌ నగరాన్ని సీమాంధ్రాకి రాజధానిగా మలచుకున్న వలసాంధ్ర పెట్టుబడి దారులు ఈనాడు దానిని దేశానికి రెండవ రాజధానిగా చేయాలని వాదించడం- వారి అవకాశ వాదానికి వరాకాష్ఠ అని చెప్పక తప్పదు. ఇటు భౌగోళిక తెలంగాణ వాదులు, అటు వలసాంధ్ర సమైక్యాంధ్ర వాదులు అంబేడ్కర్‌ వాదాన్ని తమకి అనుకూలమైన సమయానుకూల వాదంగా మలచుకుంటుంటే, ఫూలే, 

అంబేడ్కర్‌ల వాదులమని చెప్పుకునే బడుగువర్గ బహుజనశక్తులు ప్రత్యేక తెలంగాణ వాదులను, సమైక్యాంధ్రవాదులను ఆశ్రయించే ఆశ్రీత వాదులుగా ఎందుకు మారేరో పునరాలోచించుకోవలసిన సమయం ఆసన్నమైంది. చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటుగా మారనీయకుండా చిన్న రాష్ట్రాలపై సహితం అగ్రకుల పెద్దకులాల వారే ఆధిపత్యం చెలాయించే దుస్థితి దాపురించడానికి బడుగు వర్గ బహుజన శక్తుల స్వయంకృత ఆపరాధ పాత్ర ఎంతఉందో సమీక్షించుకొని ఇప్పటికైన అప్రమత్తం కావడం అవసరం



Suryaa Telugu News Paper Dated : 16/10/2013 

Wednesday, October 16, 2013

సామాజికన్యాయంతో నవ ప్రస్థానం - ప్రొఫెసర్ భంగ్యా భూక్యా

10 శాతం జనాభా కలిగి ఉన్న అగ్రకులాలు దాదాపు 50 శాతం శాసన సభ్యులను కలిగి ఉన్నాయి. అగ్రకుల శాసన సభ్యులను 10 శాతానికి ఎలా తీసుకురావాలన్న ప్రాతిపదికగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలి. అణగారిన కులాలు రాజ్యాధికారం సాధించి ఆత్మగౌర వంతో బతికే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అభివృద్ధి ఫలాలు ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కాకుండా సామాజికన్యాయ సూత్ర ప్రాతిపదిక మీద అన్ని కులాలకు, వర్గాలకు, అందేలా పునర్‌నిర్మాణం జరగాలి.
కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్ కమిటీ జూలై 30 ప్రకటనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిందనే అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు వచ్చేశారు. పార్లమెంటు ఆమోదమే మిగిలింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పునర్నిర్మాణం గురించి మీడియా లోపట, బైట చర్చలు మొదలైనాయి. ఇక్కడ ప్రశ్న ఏమంటే ఏ ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలి? తెలంగాణ విద్యావంతులుగా, ఉద్యమ పార్టీలుగా చలామణి అవుతున్నవారు 'అభివృద్ధి' ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలని వాదిస్తున్నారు. చాలా తెలివిగానే వీరు ఈ వాదనను ముందుకు తీసుకు వ స్తున్నారు. ఈ వాదనలో అణగారిన కులాల రాజకీయ ఆకాంక్షను తొక్కిపెట్టే కుట్ర దాగి ఉంది. మొదటి నుంచే అణగారిన కులాల ఆకాంక్ష తెలిసే వీరు ఈ ఉద్యమాన్ని ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా చిత్రీకరించారు.
అణగారిన కులాలు నిజంగానే నీరు, వనరుల కోసం ఉద్యమిస్తున్నాయా? దున్నటానికి కుంట భూమి లేనివాడికి, పైసా పెట్టుబడి పెట్టలేని వాడికి నీరెందుకు, వనరులెందుకు. నీరు, వనరులనేది కేవలం తెలంగాణ దొరల ఎజెండా. అణగారిన కులాల, జాతుల ఎజెండాలో అవి ఎన్నడూ లేవు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రజలు ఆర్థిక ఎజెండాతో పోరాటం చేయడం చాలా అరుదు. వారి పోరాటంలో సామాజిక, రాజకీయ ఎజెండాలే ప్రధానంగా కనిపిస్తాయి. ప్రపంచ అణగారిన వర్గాల ఉద్యమాల్ని పరిశీలిస్తే అవి రెండే రెండు ఎజెండాల చుట్టూ నడుస్తుంటాయి. ఒకటి 'ఆకలి', రెండవది-'అవమానం'. ఇండియా విషయానికివస్తే 'అవమానం' ఒక ప్రధానమైన సమస్య. అణగారిన కులాలు, జాతులు, ఈ సమస్య నుంచి అధిగమించటానికి అవకాశం వచ్చినప్పుడల్లా వివిధ రూపాల్లో ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నం జాతీయ, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ ఉద్యమాలన్నిటిలోనూ కనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమం జరిగిన తీరును నిశితంగా పరిశీలిస్తే 'అవమానం' ఏ విధంగా ప్రధాన ఎజెండాగా ఉద్యమంలో ఉండింది ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలోని కులాలు తమ తమ ఉత్పత్తి పనిముట్లతో వచ్చి తమ ఉనికిని చాటుతూ ఉద్యమంలో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఒక కారణం కావచ్చు కానీ దాని చుట్టూ తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని, స్వయంపాలనా ఆకాంక్షను చాటుకునే ప్రయత్నం చేశాయి. ఉద్యమ నాయకులుగా చలామణి అవుతున్నవారు ఎంతమంది ఈ విషయాన్ని గుర్తించారన్నది తెలియదు. కానీ, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నర్సింహ ఢిల్లీ ప్రెస్ మీట్‌లో తెలంగాణ ఉద్యమం ఆర్థిక అసమానతల నిర్మూలన కోసం జరిగింది కాదని, ఇది ప్రత్యేక ఉనికి, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం జరిగిందని చెప్పటం చాలా సంతోషకరం. బహుశా ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పి ఉండవచ్చు.
తెలంగాణకు ఈ కోణం ఉందన్న వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించటం వల్లనే రాష్ట్ర ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయాలు జరిగిపోయాయి. ఎందుకంటే దానికి రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
తమ రాజకీయ ఆకాంక్షను ఇప్పుడు ఎలా సాకారం చేసుకోవాలన్నదే అణగారిన కులాల ముందున్న ప్రధాన సమస్య. ఫ్యూడల్ వ్యవస్థను ఢీ కొనడం కష్టతరమైన పనే. దీనికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల తదనంతరం వచ్చిన కుతుబ్ షాహిల కాలంలో నాయకర్‌లు(గ్రామాధికారులు)గా ఆంధ్ర, మరాఠ ప్రాం తాల నుంచి వచ్చిన రెడ్డి, వెలమలు కొలది కాలంలోనే 'కులాన్ని' ఫ్యూడల్ వ్యవస్థతో జోడించి ఒక భయంకరమైన దోపిడీ వ్యవస్థను సృష్టించారు. ఈ వ్యవస్థ అణగారిన కులాలను పూర్తి స్థాయి బానిసలుగా మార్చివేసింది. ఈ వ్యవస్థ అసఫ్‌జాహీల కాలంలో మరింత బలపడి నేటికీ వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది.

1995 నుంచి సాగిన ఉద్యమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఆంధ్ర పెట్టుబడిదార్లకు, తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా జరిగిన ట్రయాంగిల్ పోరాటంగా కనిపిస్తుంది. దొరల నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే, అణగారిన కులాలు, జాతులు తమ తమ కుల, జాతుల సంఘాలు పెట్టుకొని తమ ప్రత్యేక ఉనికి, ఆత్మగౌరవాన్ని, స్వయం పాలనను చాటుకుంటూ ఉద్యమించాయి. ఈ ఉద్యమాలు దొరల ఉద్యమాల్లో భాగంగా కాకుండా సమాంతరంగా నడిచాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను దొరల ఉద్యమం కంటే ఈ అణగారిన కులాల ఉద్యమమే బలంగా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారం కావడటానికి అణగారిన కులాల పాత్రే ప్రధాన భూమిక పోషించింది. దొరలు తెలంగాణ పేరుతో తమ కులాన్ని రాజకీయంగా బలోపేతం చేసుకొని, వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారు. దొరల నాయకత్వాన్ని ఢిల్లీ పెద్దలు ఎప్పుడు చీదరించుకుంటూనే వచ్చారు. ఇంతటి పోరాట పటిమ కలిగిన తెలంగాణ ప్రజలకు వీరా నాయకులని ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అణగారిన ప్రజల ఆకాంక్షను ఢిల్లీ నాయకత్వం చివరికి గౌరవించింది.
తెలంగాణ వారి నాయకత్వంలో తమతో సంబంధం లేకుండా ఉద్యమాలు వస్తుండటం చూసి ఈ దొరలు మళ్లీ కొత్త నాటకాలు మొదలెట్టారు. వీరి మాటలు విని 1948లో తెలంగాణ ప్రజలు ఒకసారి మోసపోయారు. మరోసారి అది పునరావృతం కాకుండా ఉండాలంటే అణగారిన కులాలు అప్రమత్తంగా ఉండాలి. పునర్‌నిర్మాణం చర్చల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారంలా అభివృద్ధి చేస్తామని దొరలు ఊదరకొడుతున్నారు. వీరు చెప్పే అభివృద్ధి ఎందుకు, ఎవరికోసమన్న ప్రశ్నలు వేసుకోవాలి. దొరలు చెప్పే అభివృద్ధి కేవలం వారి ఆస్తులను పెంచుకోవడానికే ఉపయోగపడుతుంది. దొరలు చెప్పే అభివృద్ధిలో అణగారిన కులాలకు మిగిలేది కేవలం గొర్ల, బర్ల లోన్‌లు మాత్రమే అన్న విషయాన్ని గమనించాలి. మరి వీటి కోసమేనా తెలంగాణ తల్లులు వేలమంది కొడుకులను త్యాగం చేసింది? అసలు ఈ దొరలు చెప్పే అభివృద్ధి అణగారిన కులాలకు అవసరమా?
వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికీ, అభివృద్ధికీ ఏ సంబంధం లేదు. ఇది ఒక రాజకీయ ఉద్యమం. కాబట్టి ముందు రాజకీయ పునర్ నిర్మాణం జరగాలి. అలా అని నేను అణగారిన ప్రజలకు అభివృద్ధి అవసరం లేదని అనటం లేదు. రాజ్యాధికారం అణగారిన కులాలకు వస్తే ఆర్థిక అభివృద్ధి, సామాజిక పునర్ నిర్మాణం (సోషల్ ఇంజనీరింగ్) దానంతటికి అదే జరిగిపోతుంది. దళిత, బహుజన, ఆదివాసీ మేధావులు, కవులు, కళాకారులు ఈ ప్రాతిపదిక మీదనే తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసి నిర్మించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఈ ప్రాతిపదిక మీదనే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. 90 శాతం అణగారిన కులాలు జాతులున్న తెలంగాణలో అంబేద్కర్ ఆశించిన రాజ్యం వచ్చే అవకాశం బలంగానే ఉన్నది.
ఇక్కడ ప్రశ్న ఏమంటే 10 శాతం జనాభా కలిగి ఉన్న అగ్రకులాలు దాదాపు 50 శాతం శాసన సభ్యులను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ 50 శాతం ఉన్న అగ్రకుల శాసన సభ్యులను 10 శాతానికి ఎలా తీసుకురావాలన్న ప్రాతిపదికగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలి. అణగారిన కులాలు రాజ్యాధికారం సాధించి ఆత్మగౌరవంతో బతికే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అగ్ర కులాలే పాలకులుగా, ప్రతిపక్షాలుగా, ఉద్యమ నాయకులుగా, ఉండే పరిస్థితి మారే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అభివృద్ధి ఫలాలు ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కాకుండా సామాజికన్యాయ సూత్ర ప్రాతిపదిక మీద అన్ని కులాలకు, వర్గాలకు, అందేలా పునర్ నిర్మాణం జరగాలి. మానవ హక్కుల ఉల్లంఘన లేని సమాజ నిర్మాణం కోసం పునర్ నిర్మాణం జరగాలి.
- ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 17/10/2013 


Saturday, October 12, 2013

ఉద్యమాలను ఎలా అంచనా వేయాలి? - జి.హరగోపాల్

ఇప్పుడున్న విషమ పరిస్థితిలో పరస్పర అవగాహనతో విడిపోయి, రెండు ప్రాంతాల మధ్య సమస్యలను ఎంత సామరస్యంగా పరిష్కరించగలమో, అంత సామరస్యంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏర్పడే అవగాహన భవిష్యత్తులో మళ్ళీ రెండు ప్రాంతాల ప్రజల అంగీకారంతో సమైక్య రాష్ట్రంగా ఏర్పడే ఒక చారిత్రక అవకాశాన్ని భవిష్యత్ తరాలకు నిలపగలిగితే సామాజిక శాస్త్రవేత్తలు తమ పాత్ర సరిగ్గా నిర్వహించినట్లే.
ఆచార్య జి. రాంచంద్రం రాసిన 'రాష్ట్రం సరే జాతి మాటేమిటి?' అక్టోబర్ 5, ఆంధ్రజ్యోతి వ్యాసం చదివిన తర్వాత దానికి స్పందించాలా వద్దా అని కొంత వెనకముందు అయినా... అది రాజకీయ నాయకులో, పార్టీ కార్యకర్తలో వ్రాస్తే స్పందించవలసిన అవసరం ఉండేదికాదు. ఒక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ఆ వ్యాసం వ్రాసినందుకు కొన్ని పరిశోధనా పీఠాలకి, మరికొన్ని ఆయన విశ్లేషణకు సంబంధించిన అంశాలు చర్చించడం సామాజిక శాస్త్ర అధ్యాపకులకు ప్రయోజనకరంగా ఉంటుందనేది ఈ వ్యాసం ఉద్దేశం.
ఒక సామాజిక శాస్త్రవేత్త (ఈ శాస్త్రాలు చదివినంత మాత్రాన శాస్త్రవేత్తలు కారు) ఒక సామాజిక ప్రక్రియను విశ్లేషిస్తున్నపుడు తన అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ అభిప్రాయాలే వాస్తవాలుగా, విశ్లేషణగా పరిగణించడం శాస్త్రీయ పద్ధతి కాదు. ఆంధ్ర ప్రాంతం పట్ల ఆయన పక్షపాత వైఖరిని అర్థం చేసుకోవచ్చు. నాకు కూడా తెలంగాణ పట్ల అంతే పక్షపాత వైఖరి ఉంది. కానీ నా ఉద్దేశమైనా ఆయన ఉద్దేశమైనా అవి వ్యక్తిగత అభిప్రాయాలు.

మన వ్యక్తిగత అభిప్రాయాలను మన విశ్లేషణ మీద రుద్ది, ఆ అభిప్రాయానికి అనుగుణంగా వాస్తవాలను వక్రీకరించడం శాస్త్రీయ పద్ధతి అనిపించుకోదు. దేశంలో సామాజిక శాస్త్రాల విజ్ఞానం పెరగక పోవడానికి ఇదొక పెద్ద గుదిబండగా తయారైంది. జర్నలిస్టులు ఏ రోజుకు ఆ రోజుకు వార్తలు అందించే ప్రక్రియలో భాగంగా ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండే సమాచారాన్ని సేకరించి కొంత తమ సొంత కవిత్వం జోడించి వార్తలు రాస్తుంటారు, దాంట్లో వాళ్ళ వ్యక్తిగత పరిమితులుంటాయి, అలాగే జర్నలిజంలో పెరిగిన పోటీ తత్వం కూడా దీనికి ఒక కారణం. సామాజిక శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక మార్పును, చారిత్రక స్పృహతో రాయవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రభావం దీర్ఘకాలంలో సమాజం మీద ఏం ఉంటుంది అని కూడా చూడలవలసి ఉంటుంది.
ఈ చూసే పద్ధతిలో శాస్త్రవేత్త 'విలువల చట్రం' కీలక అంశంగా ఉంటుంది. విలువలకు, ద్వేష భావనకు మౌలికమైన తేడా ఉంటుంది. పాక్షిక, పక్షపాత, సంకుచిత ధోరణులతో మన విలువలను మలచడం కాక, విలువల చట్రం ఈ ధోరణులకు అతీతంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ వ్యాసంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక తీవ్ర రాజకీయ తప్పిదం, శ్రీ కృష్ణ కమిషన్ తెలంగాణ డిమాండ్ సమర్ధనీయం కాదని స్పష్టం చేసింది. 2014లో పూర్తి తన రాజకీయ ప్రయోజనాల కొరకు సంకుచితవాదంతో పుట్టిన టీఆర్ఎస్ అవినీతి నుంచి ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ అని సీమాంధ్ర అట్టుడికి పోతుంది, అన్ని వర్గాలవారు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తపరుస్తున్నారు, సీమాంధ్ర సమాజం స్తంభించి పోతోంది, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్న ఉద్యమమిది, స్వతంత్ర దేశంలో ఇదొక విశిష్ఠ ఉద్యమం...వ్యాసం ఇలాంటి వ్యాఖ్యలతో నిండి ఉంది.
చాలా ఆశ్చర్యం కలిగించే వ్యాఖ్యలు సీమాం«ద్రులది ప్రజల ఉద్యమం, ఇందుకు భిన్నంగా తెలంగాణలో నిర్వహిస్తున్న నిరసన ఉద్యమా రాజకీయ పార్టీల, అవకాశవాద రాజకీయవేత్తల నాయకత్వంలో జరుగుతోంది, సంకుచిత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అబద్ధాలు బెదిరింపులతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు, చంద్రశేఖర్ రావు, కోదండరాం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మాత్రమే పరిమితం, సీమాంధ్రలో జరుగుతన్నది స్వత:సిద్ధ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంత పది జిల్లాల్లో అది ప్రజ్వరిల్ల లేదు, సీమాం«ద్రులపై దాడులు చేసారు, నానా అరాచకాలు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అత్యున్నతమైన రాజనీతిజ్ఞతకు అదొక నిరదర్శనం. ఈ వ్యాఖ్యలే కాదు సీడబ్ల్యూసీ నిర్ణయం ఏకపక్షమని, ఎవరినీ సంప్రదించలేది, అనడమే కాక తెలంగాణలో విభజనను వ్యతిరేకించిన వారి గొంతు నొక్కేశారని అంటూ హైదరాబాద్‌ను మెగా సిటీగా సీమాం«ద్రులు తీర్చిదిద్దారని కూడా వ్యాసం పేర్కొంది. కొంచెం హాస్యాస్పదమైన వాఖ్యగా తెలంగాణవాదులు హైద్రాబాదును రియల్ ఎస్టేటుగా పరిగణిస్తున్నారని అనడం. ఈ వ్యాఖ్యలన్నీ బాధ్యతారహితమైన రాజకీయ నాయకులు అంటున్నవే, కానీ ఒక సామాజిక శాస్త్రవేత్త ఇలా రాయడంలోను చదువుకున్న శాస్త్రానికి, శాస్త్రీయతకి అనుగుణంగా లేవు. దాంట్లో చేసిన ప్రతి వ్యాఖ్యను ప్రశ్నించవచ్చు, నిరాధారమైన వ్యాఖ్యలు శాస్ట్రీయ ప్రమాణాలకు తట్టుకోలేవు. వ్యాసాలను మనకు ఇష్టమొచ్చినట్టుగా రాయడం విశ్వవిద్యాలయ ఆచార్యులు చేయకూడదు. అప్పుడు అవకాశవాద రాజకీయాలకు, శాస్త్రీయ విశ్లేషణకు మధ్య గీత చెరిగి శాస్త్రవేత్తలను ప్రజలు అవకాశవాదులతో పోల్చే ప్రమాదమేకాక మన విశ్లేషణను సీరియస్‌గా తీసుకోవడం మానేస్తారు.
ప్రజల మధ్య ఇంత పెద్ద ఘర్షణ ఎందుకు ప్రారంభమయ్యింది, తెలంగాణ ఉద్యమం నిరంతరాయంగా ఏదో ఒక రూపంలో ఎందుకు కొనసాగుతూ వచ్చింది, నిర్ణయం వచ్చేదాకా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతం ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నది. చరిత్ర గమనంలో ఈ రెండు ప్రాంతాల ప్రజలకు ఇంత జరిగాక సమైక్యంగా ఉంచగలమా? అలా ఉంచాలంటే రెండు ప్రాంతాల ప్రజలను సంపూర్ణంగా సంతృప్తిపరచవలసిన పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశాల మీద లోతైన చర్చకు అవకాశం ఉంది. మనకు ఎంత మంచి భావాలున్నా చరిత్ర మన భావాలతో రూపొందదు. చరిత్రకు దాని గమనం అంటూ ఒకటి ఉంటుంది.మార్క్స్ అన్నట్లు 'ప్రజలు చరిత్ర నిర్మాతలే కానీ వాళ్ళు చరిత్రను తమ ఇచ్ఛానుసారంగా నిర్మించలేరని'అన్నాడు. ప్రజలే చరిత్ర నిర్మాణాన్ని తాము అనుకున్నట్లు నడపలేకపోతే, సామాజిక శాస్ట్రవేత్తలు ఎలా నడుపగలరు? మనం చరిత్రను నిర్దేశించలేం, మనం చరిత్ర గమనాన్ని విశ్లేషించగలం, అంతకంటే మించి మన వ్యాసాలకు ఎక్కువ విలువ ఉండదు. రామచంద్రంగారు తెలుగు ప్రజల మధ్య ఎందుకు ఇంత సంక్షోభం వచ్చింది. దీని మూలకారణాలు ఎక్కడ ఉన్నాయనే ఒక ప్రశ్నతో బయలుదేరి ఉంటే వ్యాసం ఇంత గందర గోళంగా ఉండేది కాదు. తెలుగు ప్రజల విధానం, రెండుప్రాంత నాయకుల తప్పిదం. తెలంగాణనాయకులు తమ ప్రాంతానికి సమన్యాయం జరగాలని ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు, అలాగే ఒక వెనకబడిన ప్రాంతం, అభి వృద్ధి చెందిన ప్రాంతంతో ఎన్నో అనుమానాలు, అభిశంసనల మధ్య కలిసినపుడు వెనుకబడిన ప్రాంత ప్రజల విశ్వాసాన్ని పొందే కృషి పెద్ద ఎత్తున జరుగవలసి ఉంది. ఈ స్పృహ రాష్ట్ర నిర్మాణం జరిగిన మరునాటి నుంచి ప్రారంభం కావల్సింది. పెద్ద మనుషుల ఒప్పందంలో అతి కీలకమైన అంశం తెలంగాణ భూములను ఇతర ప్రాంతాల వాళ్ళు కొనాలంటే, తెలంగాణ రీజినల్ కమిటీ అనుమతి పొందవలసి ఉంటుం దని.
అతి చిన్న విషయం ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంవారు ఉండాలని. నీలం సంజీవరెడ్డి గారు ఉపముఖ్యమంత్రి పదవి అసహజమని ఒప్పందంలోని ఒక అంశాన్ని మొదట రోజే విస్మరించారు. సంజీవరెడ్డి పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతంకం చేసినవాడు! ఈ అంశం ఈ రోజు ఒక వాదనకు దోహదపడింది. పాలకులకు చారిత్రక స్పృహ లేకపోవడం వలన రెండు ప్రాంతాల ప్రజలమధ్య పరస్పర, విశ్వాసాన్ని కలిగించేందు ప్రయత్నించనందువల్ల ఇప్పటి వివాదానికి దారితీసింది. అధికారంతో ఏదైనా చేయవచ్చు అని భావిస్తే ఇలాంటి పర్యవసానాలుంటాయి.తెలంగాణ ఉద్యమం ప్రజల ఉద్యమం కాదు అని మొత్తంగా ఉద్యమాన్ని కొట్టివేయడం పూర్తిగా వాస్తవాలని విస్మరించడం. అలాగే ఆంధ్ర ప్రాంత ఉద్యమం ప్రజాఉద్యమమని, స్వత:సిద్ధ ఉద్యమమని పొగడడం కూడా పాక్షిక దృష్టే. అలా కొట్టేస్తే 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అంచనా వేస్తారు. అప్పుడు జరిగిన ఉద్యమం మంచి చెడ్డలు పక్కన పెట్టి ఉద్యమంలో 360 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. 1971-72లో ఇందిరా గాంధీ ప్రభంజనంలో దేశం మొత్తం కొట్టుకు పోతున్నప్పుడు తెలంగాణ నుంచి 14 పార ్లమెంటు సభ్యలకు 12 మంది తెలంగాణ ప్రజాసమితి నుంచి ఎన్నికయ్యారు.
తెలంగాణకు ప్రజాబలం లేదని అంత తేలికగా ఎలా కొట్టెయ్యగలం? ఈ అసంతృప్తిని అవకాశవాద రాజకీయ నాయకులు వాడుకొని ఉండవచ్చు. ఆ అసంతృప్తి అవకాశవాదం కాదు. దానికి నిత్య జీవిత అనుభవం ఉంటుంది. తెలంగాణ ప్రజ ల్లో ఈ అసంతృప్తికి కేవలం ఆంధ్ర ప్రాంత నాయకులు కొంత కారణం కానీ, ఆంధ్రప్రాంత ప్రజలు ఏ మాత్రం కారణం కాదు. ఆ ప్రాంతంలో కూడా పేదవాళ్ళున్నారు, కుల అహంకారానికి గురైన దళితులున్నారు, నూతన ఆర్థిక విధానం వల్ల జీవితాలు విచ్ఛినమైన మత్స్యకారులున్నారు. ఇలా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అన్యాయాలకు సాధారణ ప్రజలు ఎప్పుడూ కారణం కాదు. ఆ విషయాన్ని రాంచంద్రంగారు ప్రస్తావిస్తే బావుండేది.తెలంగాణ ఉద్యమానికి ఒకవైపు హరిత విప్లవం మరోవైపు దుర్మార్గమైన నూతన ఆర్థిక విధానం ప్రధాన కారణాలు. హరిత విప్లవం వ్యవసాయంలో నీళ్ళ పాత్రను విపరీతంగా పెంచింది. దీంతో నదీ జలాలలో ఏ ప్రాంత వాటా ఎంత అన్న ప్రశ్న ముందుకు వచ్చింది. అంతకుముందు తెలంగాణలో వ్యవసాయం చిన్న తరహా నీటి వనరుల మీద ఆధారపడి ఉండేది. రైతు తనకున్న దాంట్లో సరిపుచ్చుకునేవాడు. వ్యవసాయ వ్యాపారీకరణతో తెలుగు ప్రజల భవిష్యత్తు పెడదారిలో పడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ముందు, దాని దీర్ఘకాలిక పర్యవసానాన్ని పాలకులు ఆలోచించవలసి ఉంది.
అది ఒక చారిత్రక తప్పిదం. ఆ తప్పిదం ఇప్పుడు రెండు ప్రాంతాల రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. తెలంగాణ రాకపోతే తమకు భవిష్యత్తులేదని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ వ్యవసాయానికి సరిపోయే నీళ్ళు రావని ఆ ప్రాంతం వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఈ వైరుధ్యం చాలా తీవ్రం కావడంతో రెండు ప్రాంతాల రాజకీయ నాయకులను సంక్షోభంలోకి నెట్టేసింది.అలాగే చంద్రబాబు ఇవ్వాళ హైదరాబాదు నగరాన్ని తాను అభివృద్ధి చేసానని ఎంత వాదించినా, ఆ అభివృద్ధి వల్ల మన రెండు ప్రాంతాల ప్రజలు నష్టపోయారే గానీ బాగుపడలేదు. ఒక ్క హైద్రాబాదు నగరాన్ని 'అభివృద్ధి' చేస్తే ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలకు ప్రయోజనమైనట్లా? ఆంధ్రలోని రైతులు తమ పంటలకు ధర లేక 'క్రాప్ హాలిడే' ప్రకటించారు. మనం ఒక అభివృద్ధి నమూనాను ఇతరుల నుంచి కాపీ కొట్టే ముందు ఈ అంశాల గురించి ఆలోచించాలి కదా! హరిత విప్లవం వలన నీళ్ళు సమస్యగా మారితే, అభివృద్ధి నమూనా సృష్టించిన సమస్య హైద్రాబాదు నగరం అయింది. చరిత్ర, ఇన్ని వ్యక్తీకరణలకు గురికావడంతో మనం ఇప్పుడు ఒక అసహాయమైన స్థితిలోకి నెట్టబడ్డాం.
పరిస్థితి ఇంత విషమంగా మారిన తర్వాత సమైక్యతను ఎలా కాపాడగలం? ఇప్పుడున్న పరిస్థితిలో విడిపోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. రెండు ప్రాంతాల మధ్య ద్వేష భావం ఇంకా పెరిగితే హైద్రాబాదులో నివసించే రెండు ప్రాంతాల వాళ్ళు నిత్య జీవితంలో కలసిమెలిసి జీవించడం ఎలా సాధ్యం? శాంతి భద్రతలకు పోలీసుగా పనిచేసిన గవర్నర్ ఏం కాపాడగలడు. లాఠీలతో ప్రజలను కలిపి ఉంచడం సాధ్యమా? అది హింసాత్మకంగా మారితే హైద్రాబాదు నగర సామాజిక సంబంధాల భవిష్యత్తు ఏమిటి? ఈ విషమ పరిస్థితిలో పరస్పర అవగాహనతో విడిపోయి, రెండు ప్రాంతాల మధ్య సమస్యలను ఎంత సామరస్యంగా పరిష్కరించగలమో, అంత సామరస్యంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏర్పడే అవగాహన భవిష్యత్తులో మళ్ళీ రెండు ప్రాంతాల ప్రజల అంగీకారంతో సమైక్య రాష్ట్రంగా ఏర్పడే ఒక చారిత్రక అవకాశాన్ని భవిష్యత్ తరాలకు నిలపగలిగితే సామాజిక శాస్త్రవేత్తలు తమ పాత్ర సరిగ్గా నిర్వహించినట్లే.
- జి.హరగోపాల్
రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యులు

Andhra Jyothi Telugu News Paper Dated : 11/10/2013 

Thursday, October 10, 2013

గిరిజనులు-అడవులు-గ్రామసభ By -బి తులసీదాస్‌


Posted on: Fri 11 Oct 00:11:20.133729 2013

    అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు గల ఆచారాలు (కస్టమరీ), మత విశ్వాసాల (రెలిజియస్‌) హక్కులను కాపాడేది గ్రామసభేనని సుప్రీం పునరుద్ఘాటించింది. లాంజగిరి పర్వతశ్రేణిలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా గ్రామసభలు పూర్తి చేయాలని, అవి జిల్లా న్యాయమూర్తి స్థాయి తగ్గని న్యాయాధికారి సమక్షంలో జరగాలని ఆదేశించింది.
గిరిజనులకు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారికి అడవే జీవనాధారం. అడవిపై వారికి హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం (2006) ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా రాజ్యాంగ రక్షణ, రాష్ట్ర చట్టాలున్నాయి. వాటి ఆధారంగానే సమతా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పౌర పాలనకు సంబంధించి షెడ్యూల్డు ప్రాంత పంచాయతీరాజ్‌ (పీసా) చట్టం గ్రామసభకు విశేషాధికారాలనిచ్చింది. ఇలాటి చట్టాలు, సుప్రీం తీర్పులూ ఉన్నాగాని గిరిజనులకు తగిన రక్షణ కలగడం లేదన్నది వాస్తవ అనుభవం. ఒడిశాలోని నియమగిరి కొండల్లో బాక్సైట్‌ మైనింగ్‌కు తెగబడ్డ వేదాంత కంపెనీకి ముకుతాడు వేసే మంచి తీర్పును ఏప్రిల్‌ 18న సుప్రీంకోర్టు ఇచ్చింది. గిరిజనుల సామూహిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో గ్రామసభ ప్రాధాన్యతను, విస్తృతిని ఆ తీర్పు స్పష్టంగా పేర్కొంది. అలాగే వన సంరక్షణ సమితుల (విఎస్‌ఎస్‌)కు సామూహిక అటవీహక్కులను దఖలు పరచడం చెల్లదని స్పష్టం చేస్తూ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మన రాష్ట్ర అటవీశాఖకు ఆగస్టులో ఒక ఉత్తర్వు నిచ్చింది. ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఎకరాల అడవులకు సంబంధించినదే గాక సామూహిక హక్కును పరోక్షంగా అటవీశాఖ పొంద డానికి వీలులేదన్న విస్తృత అన్వయం కలిగిన ఉత్తర్వు అది. అడవి, అటవీ హక్కులు, గిరిజనుల జీవితం, గ్రామసభలతో ముడిబడిన ఈ ఉత్తర్వు, సుప్రీం తాజా తీర్పు ప్రజోపయోగమైనవి. వాటిలోని కొన్ని వివరాలు, విశిష్టత, పర్యవసానాలూ పరిశీలించదగినవి.
విఎస్‌ఎస్‌లకు సామూహిక అటవీ హక్కు ఇవ్వరాదు
గిరిజనులకు, సాంప్రదాయక అటవీవాసులకు అడవిపై వ్యక్తిగత అనుభవ హక్కులను అటవీ హక్కుల చట్టం కల్పిస్తోంది. అలాగే ఉమ్మడి ప్రయోజనం కోసం ఉపయోగించే భాగంపై సామూహిక అటవీ హక్కును ఆ గ్రామస్తులకు కల్పిస్తుంది. 2009 జులై 21న నాటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ హక్కుల కమిటీ విఎస్‌ఎస్‌లకు అటవీ భూమిని కట్టబెడుతూ నిర్ణయించింది. అంటే గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు ఉమ్మడిగా లభించవలసిన సామూహిక హక్కును అటవీశాఖ చేజిక్కించుకోవడమే. పేరుకు విఎస్‌ఎస్‌లే అయినా పెత్తనమంతా అటవీశాఖ చేస్తోందని, సామూహిక అటవీ హక్కును విఎస్‌ఎస్‌లకు కాకుండా స్థానిక ప్రజలకే కల్పించాలని గిరిజన సంఘం తదితర సంస్థలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. గత ఏడాది విశాఖ జిల్లాలో వెదురు ఉత్పత్తులపై హక్కుల విషయం తెర మీదకు రాగా తప్పనిసరై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను వివరణ కోరింది. అటవీహక్కుల చట్టం సెక్షన్‌ 3(1)(ఐ) ప్రకారం విఎస్‌ఎస్‌లకు సామూహిక అటవీ హక్కును పొందడానికి అర్హతలేదని 2013 ఆగస్టు ఆరున కేంద్రం ఇచ్చిన వివరణలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే విఎస్‌ఎస్‌లకు మంజూరు చేసిన సామూహిక అటవీ హక్కు పత్రాలను ఉపసంహరించాలని కూడా గిరిజన సంక్షేమ శాఖ ఆదేశించింది.
పర్యవసానాలు ఎలా ఉంటాయి?
కేంద్ర ఉత్తర్వుతో రాష్ట్రమంతటా గల సుమారు రెండు వేల విఎస్‌ఎస్‌ల నుంచి అంటే అటవీ శాఖ అజమాయిషీ పోయి స్థానిక ప్రజలకు తొమ్మిది లక్షల ఎకరాల అటవీ భూమిపై సామూహిక హక్కు దఖలు పరచాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9,50,301 ఎకరాల కోసం 3,23,765 వ్యక్తిగత దరఖాస్తులు రాగా వాటిలో కేవలం 1,65,691 కుటుంబాలకు 4,72,016 ఎకరాలకు మాత్రమే అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. అంటే ఇంకా 4,84,630 ఎకరాలకు ఇవ్వలేదు. ఇచ్చిన దాని కంటే తిరస్కరించినదే ఎక్కువన్నమాట. అదే సామూహిక దరఖాస్తుల విషయానికొస్తే 10,16,307 ఎకరాల కోసం దరఖాస్తులు రాగా 9,79,207 ఎకరాలను దఖలుపరిచారు. సామూహిక హక్కులు పొందినవి విఎస్‌ఎస్‌లే కావడం గమనార్హం. కుటుంబానికి పదెకరాల చొప్పున 25 లక్షల ఎకరాల అటవీ భూమినిస్తాం అంటూ నాటి సిఎం ఆర్భాటంగా ప్రచారం చేశారు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 1,65,691 కుటుంబాలకు 4,72,016 ఎకరాలిచ్చారు. అంటే సగటున కుటుంబానికి మూడెకరాలు కూడా దక్కలేదు. అదే విఎస్‌ఎస్‌లు చూస్తే సగటున ఒక్కో దానికి నాలుగు వేల ఎకరాల పైబడి దఖలుపడింది. అటవీ హక్కుల చట్టం అమలు చేశామని చెబుతూనే సర్కారు విఎస్‌ఎస్‌ల మాటున విస్తార ప్రాంతాలను అటవీశాఖ అజమాయిషీలోనే ఉంచుకుంది. కేంద్ర గిరిజన శాఖ తాజా ఉత్తర్వు మూలంగా రాష్ట్ర అటవీశాఖ పెత్తనం ఆ మేరకు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ సభలను జరిపి సామూహిక అటవీ హక్కులను వాటికే దఖలు పరిచేలా చర్యలు చేపట్టాలి. కానీ ప్రభుత్వం అలా చేస్తుందా అన్నదే అనుమానం. ప్రతిష్టాత్మకమైన పీసా చట్టాన్ని కేంద్రం 1996లో తీసుకురాగా రాష్ట్ర చట్టం 1998లో వచ్చింది. దాని అమలు కోసం నిబంధనలను 2011 మార్చిలో వెలవడ్డాయి. అందుకు కీలకమైన షెడ్యూల్డ్‌ గ్రామాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ప్రకటించవలసి (నోటిఫై) ఉండగా ఇప్పటికీ ఆ పని చేయలేదు. అంటే చట్టం, నిబంధనలు ఉన్నా గ్రామసభకు పూర్తిస్థాయి చట్టబద్ధత చేకూరలేదు. గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది. ఇక సాక్షాత్తూ అటవీశాఖ పెత్తనంలోని భూమిని గ్రామసభలకు దఖలు పరచడానికి ప్రభుత్వం అంత త్వరగా చర్యలు చేపడుతుందని భావించడం కష్టం. బలమైన ప్రజా ఉద్యమం సాగితేనే కొంతైనా కదులుతుంది.
'వేదాంత'పై సుప్రీం తీర్పు
ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ కోసం వేదాంత అల్యూమినా లిమిటెడ్‌ గత పదేళ్లకు పైగా తంటాలు పడుతోంది. ఒకవైపు అడవులు, గుట్టలను ఆక్రమిస్తూనే మరోవైపు అనుమతుల కోసం దరఖాస్తులు చేస్తూనే ఉంది. పదేపదే అటవీ, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. వాటిపై సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఇందులో 660.749 హెక్టార్ల అటవీ భూమి విషయమై సుప్రీం కోర్టు గత ఏప్రిల్‌ 18న ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. గ్రామసభకున్న హక్కులను పునరుద్ఘాటించి వాటికి పెద్దపీట వేయడంలో ఈ తీర్పు ఓ మైలురాయి. బాక్సైట్‌ మైనింగ్‌ చేపట్టనున్న లాంజగిరి ప్రాంతంలో ఇతర తెగలతోపాటు ఆదిమ గిరిజన తెగలైన (పిటిజి) డొంగారియా ఖోంద్‌లు, కుటియా ఖోంద్‌లు నివసిస్తున్నారు. బాక్సైట్‌ మైనింగ్‌ చేపడితే అక్కడి అటవీ సంపదకు, పర్యావరణానికి నష్టం కలగడమే గాక స్థానిక గిరిజనులు కొలిచే నియమరాజ ఆలయ ప్రాంతానికి నష్టం కలుగుతుందని సుప్రీంకోర్టులో వచ్చిన వాదుల వాదన సారాంశం. ఉభయ పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు గిరిజనులకు నియమరాజను కొలిచేందుకు గల హక్కును తప్పక సంరక్షించాలని, దాన్ని పరిరక్షించాలని (పేరా 55) తీర్పులో పేర్కొంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు గల ఆచారాలు (కస్టమరీ), మత విశ్వాసాల (రెలిజియస్‌) హక్కులను కాపాడేది గ్రామసభేనని సుప్రీం పునరుద్ఘాటించింది. లాంజగిరి పర్వతశ్రేణిలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా గ్రామసభలు పూర్తి చేయాలని, అవి జిల్లా న్యాయమూర్తి స్థాయి తగ్గని న్యాయాధికారి సమక్షంలో జరగాలని ఆదేశించింది. నియమరాజను కొలిచే విషయమై పేర్కొన్నప్పటికీ సారాంశంలో గిరిజనుల గ్రామసభకు సర్వాధికారాలను పునరుద్ఘాటించడం ఈ తీర్పు విశిష్టత.
ససేమిరా అన్న గ్రామసభలు
సుప్రీం ఆదేశం మేరకు 12 ఆవాసాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొదటి గ్రామసభ జులై 18న రాయగడ జిల్లా సెర్కపల్లి గ్రామంలో జిల్లా న్యాయమూర్తి శరత్‌చంద్ర మిశ్రా సమక్షంలో జరిగింది. ఆ గ్రామంలోని 46 మందికిగానూ 16 మంది మహిళలతో సహా 36 మంది హాజరై ముక్త కంఠంతో బాక్సైట్‌ మైనింగ్‌ను తిరస్కరించారు. 'మా దేవుడైన నియమరాజ గుండెల్లో బాక్సైట్‌ మైనింగ్‌ను మేమెందుకు అనుమతించాలి' అని వారు ప్రశ్నించారు. ఈ గ్రామసభను పూర్తిగా వీడియోలో చిత్రీకరించారు. రెండవ గ్రామసభ జులై 22న కేసరపడిలో జరగగా, చిట్టచివరి గ్రామసభ జరప గ్రామంలో ఆగస్టు 19న జరిగింది. రాయగడ జిల్లాలో ఏడు, కలహండిలో ఐదు మొత్తం 12 గ్రామసభల్లోనూ ప్రజలు ఏకగ్రీవంగా బాక్సైట్‌ మైనింగ్‌ను తిరస్కరించారు.
సుప్రీం తీర్పుతో జరిగిన గ్రామసభల నిర్ణయం పర్యవసానంగా లాంజగిరిలో వేదాంత బాక్సైట్‌ మైనింగ్‌కు బ్రేక్‌ పడినట్లే. అయితే ఆ తీర్పు ప్రభావంతో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాల్లో చేపట్టనున్న అక్రమ మైనింగ్‌ ప్రాజెక్టుల విషయం యోచించాలి. స్థానిక గిరిజనులకు, వారి జీవనోపాధికి, పర్యావరణానికీ కలిగే హాని గురించి లోతుగా పరిశీలించాలి. ఆయా గ్రామసభలకు అన్ని అంశాలనూ వివరించి, వాటి అభిప్రాయం, అభీష్టం మేరకు సర్కారు ముందుకు అడుగేయాలి తప్ప ఏకపక్షంగా వ్యవహరించరాదు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో గ్రామసభ ప్రాధాన్యత మరింత పెరిగింది. పీసా చట్టం నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలుగా వెంటనే రాష్ట్రంలో షెడ్యూల్డు ఆవాసాలను గిరిజన సంక్షేమ కమిషనర్‌ ప్రకటించేలా ప్రజా ఉద్యమ ఒత్తిడి పెంచాలి. గ్రామసభను సంపూర్ణంగా చట్టబద్ధం చేయడానికీ, సాధికారత కల్పించడానికీ ఉపక్రమించాలి.

Prajashakti Telugu News Paper Dated: 11/10/2013 

కొత్త రాష్ట్రాలు-సామాజికశక్తుల కర్తవ్యం By Y K



కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ కోర్ కమిటీలు 2013 జూలై 30న తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేశాయి. ఆతర్వాత 63 రోజుల సీమాంధ్ర ఆందోళన అనంతరం కూడా ఆ తీర్మానాన్ని యధాతథంగా కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. సమైక్యవాదుల, రాజకీయ నాయకత్వంగానీ, ఉద్యోగ సంఘాల జేఏసీ గానీ ఆందోళనని ఉధృతం చెయ్యటానికి తమ శక్తినంతా ధారపోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆందోళనకు కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం అన్నీ తానై నిర్వహిస్తున్నారు.అయినప్పటికీ కేంద్ర నిర్ణయంపై ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో సీమాంవూధలో ఆందోళన మూలంగా కాంగ్రెస్ ఓట్ల పరంగా బాగానే నష్టపోయింది. అయినప్పటికీ జూలై 30 తీర్మానం అక్టోబరు 3న కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. అది అనివార్యం కూడా. ఎందుకంటే, 2009 డిసెంబరు 9 ప్రకటన నుంచి, 23 ప్రకటన ద్వారా ఒకసారి వెనక్కి వెళ్ళింది. ఈలోగా అనేక చర్చలు జరగడం, వివిధ రాజకీయ పార్టీలు తమతమ అభివూపాయాలు తెలియజేయటం, తన అభివూపాయం చెప్పాలని మిగిలిన పార్టీలు కాంగ్రెస్‌పైన వత్తిడితేవడం.. ఈ నేపధ్యంలోనే జూలై 30 తీర్మానం వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడిక వెనక్కి వెళ్ళడం అంటే అప్రతిష్ట మూటగట్టుకొనడమే అవుతుంది. ఏమైనా కాంగ్రెస్ పూర్తిగా నమ్మశక్యంగానిదే అనేది మరువలేం. కనుక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలు అవూపమత్తంగా వుండవలసిందే. ప్రజా ఉద్యమాన్ని కొనసాగించవలసిం దే. సీమాంవూధలో సామాజిక న్యాయశక్తులు రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఎదురీత ఈదవలసివస్తున్నది.సమైక్యవాదనాయకులు ఆధిపత్యకులాలకు చెందిన సంపన్న వర్గీయులు ప్రజలపై, ముఖ్యంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలను గుప్పిట్లో పెట్టుకుని వారిని తమకనుకూలంగా నడిపిస్తున్నారు. మరో వైపు బడుగు, బలహీనవర్గాలను ప్రభావితం చేస్తూ అంబేద్కర్ ప్రవచించిన చిన్న రాష్ట్రాల భావజాలం పక్షాన నిలబెట్టగలిగిన బలమైన సామాజిక న్యాయ పార్టీ రాష్ట్రంలో లేదు. కనుకనే సమైక్యవాద అగ్రకుల నాయకులు సీమాంవూధలో కొంతమందిని గందరగోళ పరచగలిగారు. కొంత ఉన్మాదాన్ని కూడా రెచ్చగొట్టగలిగారు. ఆందోళనకు సామాన్య ప్రజల్లో పునాదులు లేకపోయినప్పటికీ, సమైక్యవాదంలోనే పసలేకపోయినప్పటికీ కొంతమందినైనా పక్కదారి పట్టించగలిగారు. మనోవూదేకాలు సృష్టించగలిగారు. భిన్నాభివూపాయాన్ని ప్రకటించటానికైనా వీల్లేని ఫాసిస్టు వాతావరణాన్ని సృష్టించగలిగారు. 

దీంతో ప్రక్కదారిపట్టినవారిలో కొందరు అణచబడ్డ కులాలకు, మైనారిటీలకు చెందినవారు కూడా వుండటం బాధాకరమే. అదే సమయంలో సమైక్యవాదం అంటే సారాంశంలో ఆధిపత్యకులాల సంప న్న వర్గాల రాజకీయాధిపత్యం, తద్వారా ఆర్థిక దోపి డీ తప్ప మరేమీ కాదనే చైతన్యం ప్రజల్లో కలిగించలేకపోవడం సామాజిక న్యాయశక్తుల వైఫల్యమే. కులవ్యవస్థ లోతుగా వేళ్లూనుకొని వున్న దేశంలో సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమం, ఆ లక్ష ్యసాధనలో నిమగ్నమైవున్న ఒక బలమైన రాజకీయపార్టీ ఉనికలో లేకపోవడం పెద్ద కొరత. ఆ కొరతను పూడ్చుకొనడం సామాజిక న్యాయ రాజకీయ శక్తుల తక్షణ కర్తవ్యం. ప్రస్తుతం విషవాయువులా వీస్తున్న సమైక్యవాద ప్రచారాన్ని అడ్డుకొని ముందుకు సాగవలసి వుంది. ప్రస్తుత సందర్భం, సామాజిక న్యాయశక్తులను కూడగట్టుకోవటానికి ముందుకు వచ్చిన ఒక మహాదవకాశం కూడ. ఎందుకంటే, ఇప్పుడు జరుగుతున్నది కేవలం రాష్ట్రాల విభజన మాత్రమేకాదు, సామాజిక న్యాయం, సామాజిక ఆధిపత్యం అనే రెంటి మధ్య జరుగుతున్న రాజకీయ శక్తుల విభజన కూడ. ఈవిధంగా రెండు రాజకీయ శిబిరాల ఏర్పాటు కావడం, అభివృద్ధి చెందడం ఆహ్వానించదగిన పరిణామమే కదా? అయితే, తెలంగాణ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమైంది. ఐదు దశాబ్దాలకు పైగా అనేక ఆటుపోట్లతో కొనసాగుతున్న రాష్ట్ర సాధన ఉద్యమం ఫలించబోతున్నది. ఆ క్రమం ఇప్పుడు ప్రారంభమైంది. అంటే భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనున్నది. 

సామాజిక న్యాయ శక్తుల కర్తవ్యం కేవలం భౌగోళిక రాష్ట్రమే అయితే బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారీటీ వర్గాలకు, అంటే బహుజనులకు ఒరిగే ప్రయోజనం బహుస్వల్పం. పాత సామ్రాజ్యవాద అనుకూల, ఆధిపత్య కులాల భూస్వామ్య సంపన్నవర్గాలే రాజ్యాధికారంలో కొనసాగుతాయి. సమైక్య రాష్ట్రంలో పరిపాలించిన శక్తుల మౌలిక స్వభావానికీ, కొత్త పరిపాలకుల మౌలిక స్వభావానికీ తేడా ఏమీ వుండదు. బడుగు బలహీన వర్గాల జీవనస్థితి యధాతధంగా కొనసాగుతుంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీలలో ఏ ఒక్కటీ సామాజిక న్యాయపార్టీ కాకపోగా సామాజిక న్యాయాన్ని నిరంతరమూ, అన్ని విధాలా కాలరాస్తున్న పార్టీలే. ఆ పార్టీలనాశ్రయిస్తే, నమ్ముకుంటే ఏవో కొన్ని రాయితీలు (ఆర్థిక, రాజకీయవగైరా) రాలవొచ్చునేమోగానీ, బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారంరాదు. సామాజిక న్యాయం అసలే దక్కదు. అంతేగాక, ఆ పార్టీ ల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవడం కూడా సామాజిక న్యాయానికి అన్యా యం చెయ్యడమే.ఎందుకంటే, ఆ పార్టీలన్నీ ఒకే తానులోని ముక్కలే. ‘తెలంగాణను తెచ్చిందీ, ఇచ్చిందీ మేమే’ నని తెరాస, కాంగ్రెస్ పార్టీలు సెంటిమెంటును రెచ్చగొట్టి ఓట్ల వేట సాగించే అవకాశం వుంది. వాస్తవానికి గత ఐదున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలోనూ, ప్రత్యేకించి ఒక దశాబ్దానికి పైగా సాగుతోన్న మలిదశ పోరాటంలోనూ ప్రధానశక్తిగా నిలబడింది బహుజనులైన ప్రజా బాహుళ్యమే. ఉస్మానియా తదితర సంస్థల బహుజన విద్యార్థులే. వెయ్యి మందికి పైగా అమరులైన త్యాగధనుల్లో అత్యధికులు ఈ సామాజిక వర్గాలకు చెందినవారే. మరోవైపు ఆధిపత్య కుల సంపన్న వర్గీయులు నాయకత్వ స్థానాలను ఆక్రమించుకున్నారు. పంచాయితీ మొదలు పార్లమెంటుదాకా, ఆపైన అధికార కాంగ్రెస్‌తో రాజీపడి మంత్రి పదవులదాకా ఎగబాకారు. కానీ, సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలు కేవలం పరిపాలకులు మారటం మాత్రమే కాదు. తలకాయలు మారటం కాదు. పాలనలో, ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని, కొత్త రాష్ట్రంలో వస్తుందని ఆకాంక్షించారు. ఉద్యమించారు. త్యాగాలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించారు. కనుక ‘తెలంగాణ తెచ్చిన వారు, ఇచ్చినవారు’ ఆధిపత్యకుల రాజకీయ పార్టీలు కాదు. తెలంగాణ ప్రజలే. ప్రధానంగా బడుగు బలహీనవర్గాల ప్రజలే. అలాంటప్పుడు నూతన రాష్ట్రంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించవలసింది సామాజిక న్యాయ రాజకీయ శక్తులే. అంతేగానీ, పాత సమైక్యాంధ్ర పరిపాలకుల వంటి ఆధిపత్య కులదోపిడీ స్వభావంగల శక్తులకు ఆ అర్హత లేదు.

అయితే తెలంగాణలో కూడ సామాజిక న్యాయ రాజకీయ శక్తులు బలమైన సంఘటితశక్తిగా ఈ రోజు లేవు. ఆస్థాయిలో వ్యవహరించగల రాజకీయ పార్టీలు లేవు. అవి ఉద్యమ శక్తులుగానే, చిన్న చిన్న పార్టీలుగానే, గ్రూపులుగానే, వ్యక్తులుగానే అసంఘటితంగా వున్నాయి. ఈ శక్తులన్నీ ఇప్పటికిప్పుడే ఒకే రాజకీయ పార్టీగా నిర్మాణమై ఒకే గొడుగు కిందకి వచ్చే అవకాశాలు లేవు. అందుకు పరిస్థితులు ఇంకా పరిపక్వం కావలసే వుంది.దీనికోసం సిద్ధాంత, రాజకీయ విధాన పరమైన, నిర్మాణయుతమైన కృషి సాగించవలసి వుంది. ఇది నేటి ప్రజల ఆవశ్యకత. గను క ఆ కృషిలో నిబద్ధత, నిజాయితీ గలిగిన శక్తులు తప్పకుండా ముందుకు వస్తాయి .ఇది కష్టతరమైందే కానీ అసంభవమేమీ కాదు.
2014 ఎన్నికల దిశగా ప్రస్తుతం ఉనికిలో వున్న సామాజిక న్యాయ శక్తులన్నీ కలిసి ఒక రాజకీయ ఫ్రంట్‌గా ఏర్పడాలి. ఆ శక్తులు ఏ రూపంలో వున్నా ఫ్రంట్‌లో భాగస్వాములవడానికి అభ్యంతరం వుండకూడదు. ఆ ఫ్రంట్ ఇప్పుడున్న పాలక, ప్రతి పక్ష పార్టీలకు(అక్షిగకుల సంపన్నవర్గాల పార్టీ లు) ప్రత్యామ్నాయంగా 2014లో పోటీ చెయ్యటానికి సన్నద్ధమవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్నికలు దగ్గరలో వున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం రాజకీయ వూహ్యంతోనే చేసింది. ఇలాంటి నిర్ణయాపూప్పుడూ ఆధిపత్య శక్తులే చేస్తా యి. వున్నంతలో అందుకొనడం తప్ప బలహీనవర్గాలకు మరో గత్యంతరం లేదు. కనుక, ఏ సంస్థకాసంస్థ సమాయత్తమవుతూ మరోవైపు సమష్టిగా ఒక సామాజిక రాజకీయ శిబిరం నిర్మాణానికి నడుం బిగించాలి. అదే సమయంలో సభలు, సమావేశాలు, సదస్సులు విస్త ృతంగా నిర్వహిస్తూ నూతన రాష్ట్రమంతటా సామాజిక ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణాన్ని పెంచాలి. ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సెంటిమెంటు ఎంతబలంగా నిర్మాణమైందో, అంతకన్నా మించిన స్థాయిలో సామాజిక న్యాయ సెంటిమెంటును విస్త ృతంగా రగల్చాలి. సంస్థలకు రోటీన్‌గా వుండే డిమాండ్ల ఎజెండాను తత్కాలికంగానైనా రెండో స్థానానికి నెట్టి, వీలైతే పూర్తిగా పక్కనబెట్టి, సామాజిక న్యాయ రాజకీయ వ్యాప్తినీ, అలాంటి శిబిరం నిర్మాణాన్నీ ప్రధాన ఎజెండాగా సంస్థలన్నీ కృషి చేయాలి. ఇప్పటి నుంచే 2014 ఎన్నికల అంశం కేంద్ర బిందువుగా క్షేత్ర స్థాయి లో కార్యక్షికమం సాగాలి.

-వై కే
సామాజిక న్యాయంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు

Namasete Telangana Telugu News Paper Dated: 11/10/2013