Sunday, October 20, 2013

అస్తిత్వం కోసమే ఆదివాసీ పోరాటాలు By -ఆత్రం నవీన్ ఆదివాసీల హక్కుల వేదిక


భూమి, అడవి, నీటిపై సంపూర్ణ హక్కులు కావాలని అనాది నుంచీ ఆదివాసు లు పోరాటం చేస్తున్నారు.అణచివేతకు గురవుతున్నారు. విశాల భారత దేశంలో ఆదివాసులు మొదటి నుంచి స్వయం పాలన కోసం పోరాడుతూనే ఉన్నారు. అతి పెద్ద రాజ్యాంగంగా చెలామణి అయిన గోండ్వానా రాజ్యా న్ని ఆదివాసులు పాలించారు. దక్షిణ భారత దేశం సరిహద్దు భూభాగంలో మధ్య భారతంలో అతిపెద్ద రాజ్యంగా గోండ్వానా రాజ్యం విస్తరించి ఆదివాసుల పరిపాలన కొనసాగేది. మొగలు సామ్రాజ్యం ఉత్తర భారతం మొత్తం విస్తరించినా దక్షిణ భారతంలో విస్తరించకుండా పోరాడిన యోధులు ఆదివాసులు. ఆదివాసీయేతర సమాజం ముఖ్యంగా ఆర్యుల నుంచి మొగలాయిలు, బ్రిటిషువారి నుంచి నేటి పాలకుల వరకు వలస, సామ్రాజ్యవాద చొరబాట్లు దోపిడీ, అణచివేతల కారణం గా నిరంతరం ఆదివాసుల పోరాటాలు కొనసాగాయి.

మరాఠాలు, రాజపు త్రులు, కాకతీయులుతో జరిగిన పొరాటంలో కొంత భూభాగాన్ని ఆదివాసులు కోల్పోయారు. కాకతీయుల పరిపాలనలో ప్రసిద్ధుడు రుద్రదేవుడు (మొదటి ప్రతాపరువూదుడు) కీ.శ.1158-1195) కూడా ఇప్పడి వరంగల్‌లో ఉన్న మేడారం పరిస ర ప్రాంతాలన్నీ పరిపాలిస్తున్న మేడరాజును ఓడించి తను ఎదుర్కొన్న ప్రథమ శత్రువు మేడారాజు పేరును హనుమకొండ వేయిస్థంబాలగుడి శాసనంలో రాయించాడు. నేడు ‘మేడారం’గా ప్రసిద్ది చెందిన సమ్మక్క సారలమ్మల పోరాటం కూడా ఆదివాసీలకు రాజ్యాధికారం కోసం అన్నది జగమెరిగిన సత్యం.దాదాపు 500 ఏళ్ల మహారాష్ట్ర, మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా,ఆంధ్రవూపదేశ్‌లోలలోని భూభాగాలలో ‘గోండ్వానా’ రాజ్యంగా ఆదివాసులపాలన కొనసాగింది. క్రీ.శ.1240-1750 వరకు వివిధ ఆదివాసీ గోండు రాజులు పాలించారు.‘గోండ్వానా’ను ఆక్రమించదలచిన అక్బర్ 1564లో అసఫ్‌ఖాన్ నాయకత్వంలో సైన్యాన్ని అక్కడకు తరలించాడు.అప్పటికి గోండ్వానాను వీర నారాయణ తరుపున రాణి దుర్గావతి పరిపాలిస్తుంది.
ddr91


దుర్గావతి మొగలుల సైన్యాన్ని వీరోచితంగా ప్రతిఘటించింది. విజయావకాశాలు లేవని తెలుసుకున్న దుర్గావతి ఆత్మాహుతి చేసుకుంది. 
భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమాలకు కొన్ని దశాబ్దాలకు పూర్వమే ఆదివాసులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బ్రిటిష్ పాలనను ఆదివాసీయేతర సమాజం ఆహ్వానించినా ఆదివాసులు మాత్రం ప్రతిఘటించారు. ఎక్కడ ఎదురుకాని వ్యతిరేకత మనదేశంలోనే ఆదివాసీల పోరాటంతో వారికి అనుభవంలోకి వచ్చింది. క్రీ.శ.1874లోనే బ్రిటీషు ప్రభుత్వం ఆదివాసుల పోరాటాన్ని నిరోధించేందుకు సంస్కరణలు తీసుకువచ్చింది. ఆదివాసులు ఎక్కవగా నివసిస్తున్న ప్రాం తాలను ప్రత్యేక ప్రాంతాలుగా ప్రకటించింది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వరరామచంవూదపురం నందు అంబుల్‌రెడ్డి నాయకత్వంలో గొడ్డలిపై పన్ను విధించిన బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఇప్పటి విశాఖ, గంజాం జిల్లాల్లో గల ఆదివాసులు తమ ప్రాంతంలోకి బ్రిటిష్ పాలన ప్రవేశించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తిరుగుబాటు చేశారు. బ్రిటిష్ పాలకులు ఆదివాసీ పోడు వ్యవసాయంపై నిషేధం విధిస్తూ మద్రాస్ ఫారెస్ట్ యాక్ట్ 1882 తీసుకువచ్చి ఆదివాసీలపై ఆంక్షలు విధించారు. 1917ఆగస్టు 14న బ్రిటీషు ప్రభుత్వం ఇప్పుడు షెడ్యుల్డ్ ప్రాంతాలుగా పిలువబడుతున్న ఏజన్సీ ఏరియాలో భూ నిబంధన క్రమబద్ధీకరణ చట్టం (ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్) 1917ను తీసుకురావడం జరిగింది. ఆదివాసీయేతరుల నుంచి రక్షణగా ఈ చట్టం ఆదివాసులకు ఉంటుంది అని భావించింది. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాలో ప్రత్యేక కోర్టులను స్థాపించి ఆదివాసీ, ఆదివాసీయేతరులకు మధ్య భూ బదలాయింపు జరగాలంటే ఏజెంట్ టు గవర్నమెంట్ అనుమతి తప్పనిసరి చేసింది. నిజాం ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రాంతంలో గల ఆదివాసులపై ఆంక్షలు నిర్భంధాన్ని ఆదివాసులు తీవ్రంగా వ్యతిరేకించారు.

కొమురం భీం నాయకత్వంలో ఆదివాసులు రాజ్యాధికారం కోసం ఉద్యమించారు.ఆదివాసుల స్వాధీనంలో ఉన్న భూములకు వారికే హక్కు కల్పిస్తామన్నా తమకు సంపూర్ణ రాజ్యాధికారం కావాలని నిజాం ప్రభుత్వంపై ‘లడాయి’ చేయటానికే సంసిద్దులయ్యారు. కొమురంభీం పోరాటంతో నిజాం ప్రభువు వారి పోరాటాన్ని గుర్తించి ఇంగ్లాండ్ దేశస్తుడు ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ హైమండార్ఫ్‌ను ఆహ్వానించి నివేదిక సమర్పించమని ఆదేశించాడు. హైమండార్ఫ్ సిఫారసులను అనుసరించి నిజాం ప్రభుత్వం ‘హైదరాబాద్ ట్రైబల్ యాక్ట్ 1949’ని తీసుకువచ్చింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ‘భూ నిబంధన చట్టం 1917’ లాంటిది. హైమండార్ఫ్ అప్పటి తెలంగాణ ప్రాంతంలోనే కాకుండా ఇప్పటి ఆంధ్ర ప్రాంతంలో గల ఆదివాసులు నివసిస్తున్న షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పర్యటించి ఆదివాసులు ప్రాంతాలుగా వేరైనా, భావాలు ఒక్కటిగానే ఉన్నాయి, వారి పోరాటం ఎక్కడైనా మనుగడ, రాజ్యాధికారం కోసమేనని వ్యాఖ్యానించారు. 


స్వాతంత్య్రానంతరం ఆదివాసుల జీవితాలు ‘పెనం మీదనుంచి పొయ్యిలో పడ్డట్టు’ తయారైంది. దీనికి పాలకులు, వారు అవలంబిస్తున్న విధానాలే కారణం. ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను అటవీ సంపదను నీళ్ళను సంపన్నవర్గాలకు వనరులను ధారాదత్తం చేసి ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు అలాగే సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలో ఆదివాసీలున్న ప్రాంతంలో అటవీ, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. భారీనీటి ప్రాజెక్టుల కోసం కావాల్సిన గోదావరి, శబరి, మున్నేరు, ప్రాణహిత, కిన్నెరసాని, లాంటి నదులున్నాయి. వీటిని నమ్ముకొని తరతరాలుగా ఆదివాసులు జీవనం సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. లక్షలాది మంది ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.జాతీయ అవసరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు బొగ్గు నిక్షేపాలను వెలికితీసే కార్యవూకమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నాయి. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కొత్తగా ఓపెన్‌కాస్ట్‌ల పేరుతో ఆది వాసులను నిర్వాసితులను చేస్తున్నారు.అభయారణ్యం, టైగర్ జోన్, మైనింగ్ పేర్లతో ఆదిలాబాద్ జిల్లాలో కవ్వాల్ ఖమ్మం జిల్లాలో వరరామచంవూదపురం,చింతూరు, వరంగల్ జిల్లాలో తాడ్వాయి, ఏటూరునాగారం, విశాఖ జిల్లాలో పాడేరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాది గ్రామాల ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.


రాజ్యాంగంలో 5వ, 6వ షెడ్యూళ్ళు ఆదివాసులకు రక్షణగా రూపొందా యి. ఆదివాసుల స్వయం పరిపాలన కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ‘పెసా’ చట్టాన్ని 1996లో రూపొందించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం 1998లో చట్టబద్ధత చేసి గ్రామసభలకే సర్వాధికారం అన్నాయి. రాజ్యాం గ అధికరణ 244 కింద ఉదహరించబడిన ఆదివాసుల రక్షణ నియమాల వంటి చట్టాలను పాలకులు ఉల్లంఘిస్తూ ఆదివాసులను బలి చేస్తున్నారు.
ఆదివాసులు రక్షణ,భద్రత కరువై అల్పసంఖ్యాకులుగా మారుతూ సంస్కృతిని, భాషను కోల్పోయి అస్తిత్వాన్నే కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోంచే ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు సరిహద్దున గల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషాలోని ఆదివాసుల ప్రాంతాలను కలుపుకొని ఆదివాసులకు ‘గోండ్వానా రాష్ట్రం’ కావాలని డిమాండ్ చేస్తున్నా రు. వారికి కేటాయించిన షెడ్యూల్డ్ ప్రాంతాలల్లో రాజ్యాధికారం కలిగి ఉండటం ద్వారా మాత్ర మే వారి సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 29 (1) (ఆర్టికల్ 29 (1))ని అనుసరించి భారత భూభాగంలో ఏదో ఒక ప్రదేశంలో నివసిస్తున్న కొందరు ప్రజలు ఒక విలక్షణమైన భాషను గాని,లిపిని గాని లేక సంస్కృతిని గానీ కలిగి ఉన్నట్లయితే వారు ఆ భాష, లిపి, సంసృ్కతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉంటారు. ఆదివాసులు ప్రత్యేకమైన భాషను కలిగియున్నారు. వీరి సం సృ్కతి సంప్రదాయాలు ఆదివాసీయేతర సమాజంతో పోల్చితే ప్రత్యేకమైనది, వీరి జీవన శైలి విభిన్నమైన ది. వాటిని కాపాడుకోవడం భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన హక్కు.ఆదివాసీ ప్రజల కోసం భూమి కోసం విముక్తి కోసం పోరాటానికి సిద్ధమవు తున్నారు.

-ఆత్రం నవీన్ ఆదివాసీల హక్కుల వేదిక, లీగల్‌సెల్ కన్వీనర్

Namasete Telangana Telugu News Paper Dated: 20/10/2013 

No comments:

Post a Comment