Thursday, October 10, 2013

గిరిజనులు-అడవులు-గ్రామసభ By -బి తులసీదాస్‌


Posted on: Fri 11 Oct 00:11:20.133729 2013

    అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు గల ఆచారాలు (కస్టమరీ), మత విశ్వాసాల (రెలిజియస్‌) హక్కులను కాపాడేది గ్రామసభేనని సుప్రీం పునరుద్ఘాటించింది. లాంజగిరి పర్వతశ్రేణిలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా గ్రామసభలు పూర్తి చేయాలని, అవి జిల్లా న్యాయమూర్తి స్థాయి తగ్గని న్యాయాధికారి సమక్షంలో జరగాలని ఆదేశించింది.
గిరిజనులకు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించేవారికి అడవే జీవనాధారం. అడవిపై వారికి హక్కులు కల్పిస్తూ అటవీ హక్కుల చట్టం (2006) ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా రాజ్యాంగ రక్షణ, రాష్ట్ర చట్టాలున్నాయి. వాటి ఆధారంగానే సమతా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పౌర పాలనకు సంబంధించి షెడ్యూల్డు ప్రాంత పంచాయతీరాజ్‌ (పీసా) చట్టం గ్రామసభకు విశేషాధికారాలనిచ్చింది. ఇలాటి చట్టాలు, సుప్రీం తీర్పులూ ఉన్నాగాని గిరిజనులకు తగిన రక్షణ కలగడం లేదన్నది వాస్తవ అనుభవం. ఒడిశాలోని నియమగిరి కొండల్లో బాక్సైట్‌ మైనింగ్‌కు తెగబడ్డ వేదాంత కంపెనీకి ముకుతాడు వేసే మంచి తీర్పును ఏప్రిల్‌ 18న సుప్రీంకోర్టు ఇచ్చింది. గిరిజనుల సామూహిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవితంలో గ్రామసభ ప్రాధాన్యతను, విస్తృతిని ఆ తీర్పు స్పష్టంగా పేర్కొంది. అలాగే వన సంరక్షణ సమితుల (విఎస్‌ఎస్‌)కు సామూహిక అటవీహక్కులను దఖలు పరచడం చెల్లదని స్పష్టం చేస్తూ కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మన రాష్ట్ర అటవీశాఖకు ఆగస్టులో ఒక ఉత్తర్వు నిచ్చింది. ప్రత్యక్షంగా తొమ్మిది లక్షల ఎకరాల అడవులకు సంబంధించినదే గాక సామూహిక హక్కును పరోక్షంగా అటవీశాఖ పొంద డానికి వీలులేదన్న విస్తృత అన్వయం కలిగిన ఉత్తర్వు అది. అడవి, అటవీ హక్కులు, గిరిజనుల జీవితం, గ్రామసభలతో ముడిబడిన ఈ ఉత్తర్వు, సుప్రీం తాజా తీర్పు ప్రజోపయోగమైనవి. వాటిలోని కొన్ని వివరాలు, విశిష్టత, పర్యవసానాలూ పరిశీలించదగినవి.
విఎస్‌ఎస్‌లకు సామూహిక అటవీ హక్కు ఇవ్వరాదు
గిరిజనులకు, సాంప్రదాయక అటవీవాసులకు అడవిపై వ్యక్తిగత అనుభవ హక్కులను అటవీ హక్కుల చట్టం కల్పిస్తోంది. అలాగే ఉమ్మడి ప్రయోజనం కోసం ఉపయోగించే భాగంపై సామూహిక అటవీ హక్కును ఆ గ్రామస్తులకు కల్పిస్తుంది. 2009 జులై 21న నాటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ హక్కుల కమిటీ విఎస్‌ఎస్‌లకు అటవీ భూమిని కట్టబెడుతూ నిర్ణయించింది. అంటే గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు ఉమ్మడిగా లభించవలసిన సామూహిక హక్కును అటవీశాఖ చేజిక్కించుకోవడమే. పేరుకు విఎస్‌ఎస్‌లే అయినా పెత్తనమంతా అటవీశాఖ చేస్తోందని, సామూహిక అటవీ హక్కును విఎస్‌ఎస్‌లకు కాకుండా స్థానిక ప్రజలకే కల్పించాలని గిరిజన సంఘం తదితర సంస్థలు చాలా కాలంగా పోరాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. గత ఏడాది విశాఖ జిల్లాలో వెదురు ఉత్పత్తులపై హక్కుల విషయం తెర మీదకు రాగా తప్పనిసరై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖను వివరణ కోరింది. అటవీహక్కుల చట్టం సెక్షన్‌ 3(1)(ఐ) ప్రకారం విఎస్‌ఎస్‌లకు సామూహిక అటవీ హక్కును పొందడానికి అర్హతలేదని 2013 ఆగస్టు ఆరున కేంద్రం ఇచ్చిన వివరణలో స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికే విఎస్‌ఎస్‌లకు మంజూరు చేసిన సామూహిక అటవీ హక్కు పత్రాలను ఉపసంహరించాలని కూడా గిరిజన సంక్షేమ శాఖ ఆదేశించింది.
పర్యవసానాలు ఎలా ఉంటాయి?
కేంద్ర ఉత్తర్వుతో రాష్ట్రమంతటా గల సుమారు రెండు వేల విఎస్‌ఎస్‌ల నుంచి అంటే అటవీ శాఖ అజమాయిషీ పోయి స్థానిక ప్రజలకు తొమ్మిది లక్షల ఎకరాల అటవీ భూమిపై సామూహిక హక్కు దఖలు పరచాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 9,50,301 ఎకరాల కోసం 3,23,765 వ్యక్తిగత దరఖాస్తులు రాగా వాటిలో కేవలం 1,65,691 కుటుంబాలకు 4,72,016 ఎకరాలకు మాత్రమే అటవీ హక్కు పత్రాలు ఇచ్చారు. అంటే ఇంకా 4,84,630 ఎకరాలకు ఇవ్వలేదు. ఇచ్చిన దాని కంటే తిరస్కరించినదే ఎక్కువన్నమాట. అదే సామూహిక దరఖాస్తుల విషయానికొస్తే 10,16,307 ఎకరాల కోసం దరఖాస్తులు రాగా 9,79,207 ఎకరాలను దఖలుపరిచారు. సామూహిక హక్కులు పొందినవి విఎస్‌ఎస్‌లే కావడం గమనార్హం. కుటుంబానికి పదెకరాల చొప్పున 25 లక్షల ఎకరాల అటవీ భూమినిస్తాం అంటూ నాటి సిఎం ఆర్భాటంగా ప్రచారం చేశారు. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా 1,65,691 కుటుంబాలకు 4,72,016 ఎకరాలిచ్చారు. అంటే సగటున కుటుంబానికి మూడెకరాలు కూడా దక్కలేదు. అదే విఎస్‌ఎస్‌లు చూస్తే సగటున ఒక్కో దానికి నాలుగు వేల ఎకరాల పైబడి దఖలుపడింది. అటవీ హక్కుల చట్టం అమలు చేశామని చెబుతూనే సర్కారు విఎస్‌ఎస్‌ల మాటున విస్తార ప్రాంతాలను అటవీశాఖ అజమాయిషీలోనే ఉంచుకుంది. కేంద్ర గిరిజన శాఖ తాజా ఉత్తర్వు మూలంగా రాష్ట్ర అటవీశాఖ పెత్తనం ఆ మేరకు తగ్గాల్సి ఉంటుంది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామ సభలను జరిపి సామూహిక అటవీ హక్కులను వాటికే దఖలు పరిచేలా చర్యలు చేపట్టాలి. కానీ ప్రభుత్వం అలా చేస్తుందా అన్నదే అనుమానం. ప్రతిష్టాత్మకమైన పీసా చట్టాన్ని కేంద్రం 1996లో తీసుకురాగా రాష్ట్ర చట్టం 1998లో వచ్చింది. దాని అమలు కోసం నిబంధనలను 2011 మార్చిలో వెలవడ్డాయి. అందుకు కీలకమైన షెడ్యూల్డ్‌ గ్రామాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ప్రకటించవలసి (నోటిఫై) ఉండగా ఇప్పటికీ ఆ పని చేయలేదు. అంటే చట్టం, నిబంధనలు ఉన్నా గ్రామసభకు పూర్తిస్థాయి చట్టబద్ధత చేకూరలేదు. గిరిజనుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అది. ఇక సాక్షాత్తూ అటవీశాఖ పెత్తనంలోని భూమిని గ్రామసభలకు దఖలు పరచడానికి ప్రభుత్వం అంత త్వరగా చర్యలు చేపడుతుందని భావించడం కష్టం. బలమైన ప్రజా ఉద్యమం సాగితేనే కొంతైనా కదులుతుంది.
'వేదాంత'పై సుప్రీం తీర్పు
ఒడిశాలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ కోసం వేదాంత అల్యూమినా లిమిటెడ్‌ గత పదేళ్లకు పైగా తంటాలు పడుతోంది. ఒకవైపు అడవులు, గుట్టలను ఆక్రమిస్తూనే మరోవైపు అనుమతుల కోసం దరఖాస్తులు చేస్తూనే ఉంది. పదేపదే అటవీ, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. వాటిపై సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి. ఇందులో 660.749 హెక్టార్ల అటవీ భూమి విషయమై సుప్రీం కోర్టు గత ఏప్రిల్‌ 18న ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. గ్రామసభకున్న హక్కులను పునరుద్ఘాటించి వాటికి పెద్దపీట వేయడంలో ఈ తీర్పు ఓ మైలురాయి. బాక్సైట్‌ మైనింగ్‌ చేపట్టనున్న లాంజగిరి ప్రాంతంలో ఇతర తెగలతోపాటు ఆదిమ గిరిజన తెగలైన (పిటిజి) డొంగారియా ఖోంద్‌లు, కుటియా ఖోంద్‌లు నివసిస్తున్నారు. బాక్సైట్‌ మైనింగ్‌ చేపడితే అక్కడి అటవీ సంపదకు, పర్యావరణానికి నష్టం కలగడమే గాక స్థానిక గిరిజనులు కొలిచే నియమరాజ ఆలయ ప్రాంతానికి నష్టం కలుగుతుందని సుప్రీంకోర్టులో వచ్చిన వాదుల వాదన సారాంశం. ఉభయ పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు గిరిజనులకు నియమరాజను కొలిచేందుకు గల హక్కును తప్పక సంరక్షించాలని, దాన్ని పరిరక్షించాలని (పేరా 55) తీర్పులో పేర్కొంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు గల ఆచారాలు (కస్టమరీ), మత విశ్వాసాల (రెలిజియస్‌) హక్కులను కాపాడేది గ్రామసభేనని సుప్రీం పునరుద్ఘాటించింది. లాంజగిరి పర్వతశ్రేణిలోని రాయగడ, కలహండి జిల్లాల్లో బాక్సైట్‌ మైనింగ్‌ వల్ల ప్రభావితమయ్యే గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి వారి అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మూడు నెలల్లోగా గ్రామసభలు పూర్తి చేయాలని, అవి జిల్లా న్యాయమూర్తి స్థాయి తగ్గని న్యాయాధికారి సమక్షంలో జరగాలని ఆదేశించింది. నియమరాజను కొలిచే విషయమై పేర్కొన్నప్పటికీ సారాంశంలో గిరిజనుల గ్రామసభకు సర్వాధికారాలను పునరుద్ఘాటించడం ఈ తీర్పు విశిష్టత.
ససేమిరా అన్న గ్రామసభలు
సుప్రీం ఆదేశం మేరకు 12 ఆవాసాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొదటి గ్రామసభ జులై 18న రాయగడ జిల్లా సెర్కపల్లి గ్రామంలో జిల్లా న్యాయమూర్తి శరత్‌చంద్ర మిశ్రా సమక్షంలో జరిగింది. ఆ గ్రామంలోని 46 మందికిగానూ 16 మంది మహిళలతో సహా 36 మంది హాజరై ముక్త కంఠంతో బాక్సైట్‌ మైనింగ్‌ను తిరస్కరించారు. 'మా దేవుడైన నియమరాజ గుండెల్లో బాక్సైట్‌ మైనింగ్‌ను మేమెందుకు అనుమతించాలి' అని వారు ప్రశ్నించారు. ఈ గ్రామసభను పూర్తిగా వీడియోలో చిత్రీకరించారు. రెండవ గ్రామసభ జులై 22న కేసరపడిలో జరగగా, చిట్టచివరి గ్రామసభ జరప గ్రామంలో ఆగస్టు 19న జరిగింది. రాయగడ జిల్లాలో ఏడు, కలహండిలో ఐదు మొత్తం 12 గ్రామసభల్లోనూ ప్రజలు ఏకగ్రీవంగా బాక్సైట్‌ మైనింగ్‌ను తిరస్కరించారు.
సుప్రీం తీర్పుతో జరిగిన గ్రామసభల నిర్ణయం పర్యవసానంగా లాంజగిరిలో వేదాంత బాక్సైట్‌ మైనింగ్‌కు బ్రేక్‌ పడినట్లే. అయితే ఆ తీర్పు ప్రభావంతో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాల్లో చేపట్టనున్న అక్రమ మైనింగ్‌ ప్రాజెక్టుల విషయం యోచించాలి. స్థానిక గిరిజనులకు, వారి జీవనోపాధికి, పర్యావరణానికీ కలిగే హాని గురించి లోతుగా పరిశీలించాలి. ఆయా గ్రామసభలకు అన్ని అంశాలనూ వివరించి, వాటి అభిప్రాయం, అభీష్టం మేరకు సర్కారు ముందుకు అడుగేయాలి తప్ప ఏకపక్షంగా వ్యవహరించరాదు. సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో గ్రామసభ ప్రాధాన్యత మరింత పెరిగింది. పీసా చట్టం నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలుగా వెంటనే రాష్ట్రంలో షెడ్యూల్డు ఆవాసాలను గిరిజన సంక్షేమ కమిషనర్‌ ప్రకటించేలా ప్రజా ఉద్యమ ఒత్తిడి పెంచాలి. గ్రామసభను సంపూర్ణంగా చట్టబద్ధం చేయడానికీ, సాధికారత కల్పించడానికీ ఉపక్రమించాలి.

Prajashakti Telugu News Paper Dated: 11/10/2013 

No comments:

Post a Comment