ఇప్పుడున్న విషమ పరిస్థితిలో పరస్పర అవగాహనతో విడిపోయి, రెండు ప్రాంతాల మధ్య సమస్యలను ఎంత సామరస్యంగా పరిష్కరించగలమో, అంత సామరస్యంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏర్పడే అవగాహన భవిష్యత్తులో మళ్ళీ రెండు ప్రాంతాల ప్రజల అంగీకారంతో సమైక్య రాష్ట్రంగా ఏర్పడే ఒక చారిత్రక అవకాశాన్ని భవిష్యత్ తరాలకు నిలపగలిగితే సామాజిక శాస్త్రవేత్తలు తమ పాత్ర సరిగ్గా నిర్వహించినట్లే.
ఆచార్య జి. రాంచంద్రం రాసిన 'రాష్ట్రం సరే జాతి మాటేమిటి?' అక్టోబర్ 5, ఆంధ్రజ్యోతి వ్యాసం చదివిన తర్వాత దానికి స్పందించాలా వద్దా అని కొంత వెనకముందు అయినా... అది రాజకీయ నాయకులో, పార్టీ కార్యకర్తలో వ్రాస్తే స్పందించవలసిన అవసరం ఉండేదికాదు. ఒక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు ఆ వ్యాసం వ్రాసినందుకు కొన్ని పరిశోధనా పీఠాలకి, మరికొన్ని ఆయన విశ్లేషణకు సంబంధించిన అంశాలు చర్చించడం సామాజిక శాస్త్ర అధ్యాపకులకు ప్రయోజనకరంగా ఉంటుందనేది ఈ వ్యాసం ఉద్దేశం.
ఒక సామాజిక శాస్త్రవేత్త (ఈ శాస్త్రాలు చదివినంత మాత్రాన శాస్త్రవేత్తలు కారు) ఒక సామాజిక ప్రక్రియను విశ్లేషిస్తున్నపుడు తన అభిప్రాయాలు చెప్పవచ్చు కానీ అభిప్రాయాలే వాస్తవాలుగా, విశ్లేషణగా పరిగణించడం శాస్త్రీయ పద్ధతి కాదు. ఆంధ్ర ప్రాంతం పట్ల ఆయన పక్షపాత వైఖరిని అర్థం చేసుకోవచ్చు. నాకు కూడా తెలంగాణ పట్ల అంతే పక్షపాత వైఖరి ఉంది. కానీ నా ఉద్దేశమైనా ఆయన ఉద్దేశమైనా అవి వ్యక్తిగత అభిప్రాయాలు.
మన వ్యక్తిగత అభిప్రాయాలను మన విశ్లేషణ మీద రుద్ది, ఆ అభిప్రాయానికి అనుగుణంగా వాస్తవాలను వక్రీకరించడం శాస్త్రీయ పద్ధతి అనిపించుకోదు. దేశంలో సామాజిక శాస్త్రాల విజ్ఞానం పెరగక పోవడానికి ఇదొక పెద్ద గుదిబండగా తయారైంది. జర్నలిస్టులు ఏ రోజుకు ఆ రోజుకు వార్తలు అందించే ప్రక్రియలో భాగంగా ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉండే సమాచారాన్ని సేకరించి కొంత తమ సొంత కవిత్వం జోడించి వార్తలు రాస్తుంటారు, దాంట్లో వాళ్ళ వ్యక్తిగత పరిమితులుంటాయి, అలాగే జర్నలిజంలో పెరిగిన పోటీ తత్వం కూడా దీనికి ఒక కారణం. సామాజిక శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక మార్పును, చారిత్రక స్పృహతో రాయవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల ప్రభావం దీర్ఘకాలంలో సమాజం మీద ఏం ఉంటుంది అని కూడా చూడలవలసి ఉంటుంది.
ఈ చూసే పద్ధతిలో శాస్త్రవేత్త 'విలువల చట్రం' కీలక అంశంగా ఉంటుంది. విలువలకు, ద్వేష భావనకు మౌలికమైన తేడా ఉంటుంది. పాక్షిక, పక్షపాత, సంకుచిత ధోరణులతో మన విలువలను మలచడం కాక, విలువల చట్రం ఈ ధోరణులకు అతీతంగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ వ్యాసంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక తీవ్ర రాజకీయ తప్పిదం, శ్రీ కృష్ణ కమిషన్ తెలంగాణ డిమాండ్ సమర్ధనీయం కాదని స్పష్టం చేసింది. 2014లో పూర్తి తన రాజకీయ ప్రయోజనాల కొరకు సంకుచితవాదంతో పుట్టిన టీఆర్ఎస్ అవినీతి నుంచి ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ అని సీమాంధ్ర అట్టుడికి పోతుంది, అన్ని వర్గాలవారు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తపరుస్తున్నారు, సీమాంధ్ర సమాజం స్తంభించి పోతోంది, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్న ఉద్యమమిది, స్వతంత్ర దేశంలో ఇదొక విశిష్ఠ ఉద్యమం...వ్యాసం ఇలాంటి వ్యాఖ్యలతో నిండి ఉంది.
చాలా ఆశ్చర్యం కలిగించే వ్యాఖ్యలు సీమాం«ద్రులది ప్రజల ఉద్యమం, ఇందుకు భిన్నంగా తెలంగాణలో నిర్వహిస్తున్న నిరసన ఉద్యమా రాజకీయ పార్టీల, అవకాశవాద రాజకీయవేత్తల నాయకత్వంలో జరుగుతోంది, సంకుచిత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. అబద్ధాలు బెదిరింపులతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు, చంద్రశేఖర్ రావు, కోదండరాం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మాత్రమే పరిమితం, సీమాంధ్రలో జరుగుతన్నది స్వత:సిద్ధ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం ఆ ప్రాంత పది జిల్లాల్లో అది ప్రజ్వరిల్ల లేదు, సీమాం«ద్రులపై దాడులు చేసారు, నానా అరాచకాలు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అత్యున్నతమైన రాజనీతిజ్ఞతకు అదొక నిరదర్శనం. ఈ వ్యాఖ్యలే కాదు సీడబ్ల్యూసీ నిర్ణయం ఏకపక్షమని, ఎవరినీ సంప్రదించలేది, అనడమే కాక తెలంగాణలో విభజనను వ్యతిరేకించిన వారి గొంతు నొక్కేశారని అంటూ హైదరాబాద్‌ను మెగా సిటీగా సీమాం«ద్రులు తీర్చిదిద్దారని కూడా వ్యాసం పేర్కొంది. కొంచెం హాస్యాస్పదమైన వాఖ్యగా తెలంగాణవాదులు హైద్రాబాదును రియల్ ఎస్టేటుగా పరిగణిస్తున్నారని అనడం. ఈ వ్యాఖ్యలన్నీ బాధ్యతారహితమైన రాజకీయ నాయకులు అంటున్నవే, కానీ ఒక సామాజిక శాస్త్రవేత్త ఇలా రాయడంలోను చదువుకున్న శాస్త్రానికి, శాస్త్రీయతకి అనుగుణంగా లేవు. దాంట్లో చేసిన ప్రతి వ్యాఖ్యను ప్రశ్నించవచ్చు, నిరాధారమైన వ్యాఖ్యలు శాస్ట్రీయ ప్రమాణాలకు తట్టుకోలేవు. వ్యాసాలను మనకు ఇష్టమొచ్చినట్టుగా రాయడం విశ్వవిద్యాలయ ఆచార్యులు చేయకూడదు. అప్పుడు అవకాశవాద రాజకీయాలకు, శాస్త్రీయ విశ్లేషణకు మధ్య గీత చెరిగి శాస్త్రవేత్తలను ప్రజలు అవకాశవాదులతో పోల్చే ప్రమాదమేకాక మన విశ్లేషణను సీరియస్‌గా తీసుకోవడం మానేస్తారు.
ప్రజల మధ్య ఇంత పెద్ద ఘర్షణ ఎందుకు ప్రారంభమయ్యింది, తెలంగాణ ఉద్యమం నిరంతరాయంగా ఏదో ఒక రూపంలో ఎందుకు కొనసాగుతూ వచ్చింది, నిర్ణయం వచ్చేదాకా నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతం ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నది. చరిత్ర గమనంలో ఈ రెండు ప్రాంతాల ప్రజలకు ఇంత జరిగాక సమైక్యంగా ఉంచగలమా? అలా ఉంచాలంటే రెండు ప్రాంతాల ప్రజలను సంపూర్ణంగా సంతృప్తిపరచవలసిన పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? అన్న అంశాల మీద లోతైన చర్చకు అవకాశం ఉంది. మనకు ఎంత మంచి భావాలున్నా చరిత్ర మన భావాలతో రూపొందదు. చరిత్రకు దాని గమనం అంటూ ఒకటి ఉంటుంది.మార్క్స్ అన్నట్లు 'ప్రజలు చరిత్ర నిర్మాతలే కానీ వాళ్ళు చరిత్రను తమ ఇచ్ఛానుసారంగా నిర్మించలేరని'అన్నాడు. ప్రజలే చరిత్ర నిర్మాణాన్ని తాము అనుకున్నట్లు నడపలేకపోతే, సామాజిక శాస్ట్రవేత్తలు ఎలా నడుపగలరు? మనం చరిత్రను నిర్దేశించలేం, మనం చరిత్ర గమనాన్ని విశ్లేషించగలం, అంతకంటే మించి మన వ్యాసాలకు ఎక్కువ విలువ ఉండదు. రామచంద్రంగారు తెలుగు ప్రజల మధ్య ఎందుకు ఇంత సంక్షోభం వచ్చింది. దీని మూలకారణాలు ఎక్కడ ఉన్నాయనే ఒక ప్రశ్నతో బయలుదేరి ఉంటే వ్యాసం ఇంత గందర గోళంగా ఉండేది కాదు. తెలుగు ప్రజల విధానం, రెండుప్రాంత నాయకుల తప్పిదం. తెలంగాణనాయకులు తమ ప్రాంతానికి సమన్యాయం జరగాలని ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు, అలాగే ఒక వెనకబడిన ప్రాంతం, అభి వృద్ధి చెందిన ప్రాంతంతో ఎన్నో అనుమానాలు, అభిశంసనల మధ్య కలిసినపుడు వెనుకబడిన ప్రాంత ప్రజల విశ్వాసాన్ని పొందే కృషి పెద్ద ఎత్తున జరుగవలసి ఉంది. ఈ స్పృహ రాష్ట్ర నిర్మాణం జరిగిన మరునాటి నుంచి ప్రారంభం కావల్సింది. పెద్ద మనుషుల ఒప్పందంలో అతి కీలకమైన అంశం తెలంగాణ భూములను ఇతర ప్రాంతాల వాళ్ళు కొనాలంటే, తెలంగాణ రీజినల్ కమిటీ అనుమతి పొందవలసి ఉంటుం దని.
అతి చిన్న విషయం ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతం వాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతంవారు ఉండాలని. నీలం సంజీవరెడ్డి గారు ఉపముఖ్యమంత్రి పదవి అసహజమని ఒప్పందంలోని ఒక అంశాన్ని మొదట రోజే విస్మరించారు. సంజీవరెడ్డి పెద్ద మనుషుల ఒప్పందం మీద సంతంకం చేసినవాడు! ఈ అంశం ఈ రోజు ఒక వాదనకు దోహదపడింది. పాలకులకు చారిత్రక స్పృహ లేకపోవడం వలన రెండు ప్రాంతాల ప్రజలమధ్య పరస్పర, విశ్వాసాన్ని కలిగించేందు ప్రయత్నించనందువల్ల ఇప్పటి వివాదానికి దారితీసింది. అధికారంతో ఏదైనా చేయవచ్చు అని భావిస్తే ఇలాంటి పర్యవసానాలుంటాయి.తెలంగాణ ఉద్యమం ప్రజల ఉద్యమం కాదు అని మొత్తంగా ఉద్యమాన్ని కొట్టివేయడం పూర్తిగా వాస్తవాలని విస్మరించడం. అలాగే ఆంధ్ర ప్రాంత ఉద్యమం ప్రజాఉద్యమమని, స్వత:సిద్ధ ఉద్యమమని పొగడడం కూడా పాక్షిక దృష్టే. అలా కొట్టేస్తే 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని ఎలా అంచనా వేస్తారు. అప్పుడు జరిగిన ఉద్యమం మంచి చెడ్డలు పక్కన పెట్టి ఉద్యమంలో 360 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు. 1971-72లో ఇందిరా గాంధీ ప్రభంజనంలో దేశం మొత్తం కొట్టుకు పోతున్నప్పుడు తెలంగాణ నుంచి 14 పార ్లమెంటు సభ్యలకు 12 మంది తెలంగాణ ప్రజాసమితి నుంచి ఎన్నికయ్యారు.
తెలంగాణకు ప్రజాబలం లేదని అంత తేలికగా ఎలా కొట్టెయ్యగలం? ఈ అసంతృప్తిని అవకాశవాద రాజకీయ నాయకులు వాడుకొని ఉండవచ్చు. ఆ అసంతృప్తి అవకాశవాదం కాదు. దానికి నిత్య జీవిత అనుభవం ఉంటుంది. తెలంగాణ ప్రజ ల్లో ఈ అసంతృప్తికి కేవలం ఆంధ్ర ప్రాంత నాయకులు కొంత కారణం కానీ, ఆంధ్రప్రాంత ప్రజలు ఏ మాత్రం కారణం కాదు. ఆ ప్రాంతంలో కూడా పేదవాళ్ళున్నారు, కుల అహంకారానికి గురైన దళితులున్నారు, నూతన ఆర్థిక విధానం వల్ల జీవితాలు విచ్ఛినమైన మత్స్యకారులున్నారు. ఇలా ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వచ్చు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అన్యాయాలకు సాధారణ ప్రజలు ఎప్పుడూ కారణం కాదు. ఆ విషయాన్ని రాంచంద్రంగారు ప్రస్తావిస్తే బావుండేది.తెలంగాణ ఉద్యమానికి ఒకవైపు హరిత విప్లవం మరోవైపు దుర్మార్గమైన నూతన ఆర్థిక విధానం ప్రధాన కారణాలు. హరిత విప్లవం వ్యవసాయంలో నీళ్ళ పాత్రను విపరీతంగా పెంచింది. దీంతో నదీ జలాలలో ఏ ప్రాంత వాటా ఎంత అన్న ప్రశ్న ముందుకు వచ్చింది. అంతకుముందు తెలంగాణలో వ్యవసాయం చిన్న తరహా నీటి వనరుల మీద ఆధారపడి ఉండేది. రైతు తనకున్న దాంట్లో సరిపుచ్చుకునేవాడు. వ్యవసాయ వ్యాపారీకరణతో తెలుగు ప్రజల భవిష్యత్తు పెడదారిలో పడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ముందు, దాని దీర్ఘకాలిక పర్యవసానాన్ని పాలకులు ఆలోచించవలసి ఉంది.
అది ఒక చారిత్రక తప్పిదం. ఆ తప్పిదం ఇప్పుడు రెండు ప్రాంతాల రైతులను ఆందోళనకు గురిచేస్తున్నది. తెలంగాణ రాకపోతే తమకు భవిష్యత్తులేదని తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ వ్యవసాయానికి సరిపోయే నీళ్ళు రావని ఆ ప్రాంతం వాళ్ళు ఆందోళన పడుతున్నారు. ఈ వైరుధ్యం చాలా తీవ్రం కావడంతో రెండు ప్రాంతాల రాజకీయ నాయకులను సంక్షోభంలోకి నెట్టేసింది.అలాగే చంద్రబాబు ఇవ్వాళ హైదరాబాదు నగరాన్ని తాను అభివృద్ధి చేసానని ఎంత వాదించినా, ఆ అభివృద్ధి వల్ల మన రెండు ప్రాంతాల ప్రజలు నష్టపోయారే గానీ బాగుపడలేదు. ఒక ్క హైద్రాబాదు నగరాన్ని 'అభివృద్ధి' చేస్తే ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలకు ప్రయోజనమైనట్లా? ఆంధ్రలోని రైతులు తమ పంటలకు ధర లేక 'క్రాప్ హాలిడే' ప్రకటించారు. మనం ఒక అభివృద్ధి నమూనాను ఇతరుల నుంచి కాపీ కొట్టే ముందు ఈ అంశాల గురించి ఆలోచించాలి కదా! హరిత విప్లవం వలన నీళ్ళు సమస్యగా మారితే, అభివృద్ధి నమూనా సృష్టించిన సమస్య హైద్రాబాదు నగరం అయింది. చరిత్ర, ఇన్ని వ్యక్తీకరణలకు గురికావడంతో మనం ఇప్పుడు ఒక అసహాయమైన స్థితిలోకి నెట్టబడ్డాం.
పరిస్థితి ఇంత విషమంగా మారిన తర్వాత సమైక్యతను ఎలా కాపాడగలం? ఇప్పుడున్న పరిస్థితిలో విడిపోవడం తప్ప వేరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. రెండు ప్రాంతాల మధ్య ద్వేష భావం ఇంకా పెరిగితే హైద్రాబాదులో నివసించే రెండు ప్రాంతాల వాళ్ళు నిత్య జీవితంలో కలసిమెలిసి జీవించడం ఎలా సాధ్యం? శాంతి భద్రతలకు పోలీసుగా పనిచేసిన గవర్నర్ ఏం కాపాడగలడు. లాఠీలతో ప్రజలను కలిపి ఉంచడం సాధ్యమా? అది హింసాత్మకంగా మారితే హైద్రాబాదు నగర సామాజిక సంబంధాల భవిష్యత్తు ఏమిటి? ఈ విషమ పరిస్థితిలో పరస్పర అవగాహనతో విడిపోయి, రెండు ప్రాంతాల మధ్య సమస్యలను ఎంత సామరస్యంగా పరిష్కరించగలమో, అంత సామరస్యంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏర్పడే అవగాహన భవిష్యత్తులో మళ్ళీ రెండు ప్రాంతాల ప్రజల అంగీకారంతో సమైక్య రాష్ట్రంగా ఏర్పడే ఒక చారిత్రక అవకాశాన్ని భవిష్యత్ తరాలకు నిలపగలిగితే సామాజిక శాస్త్రవేత్తలు తమ పాత్ర సరిగ్గా నిర్వహించినట్లే.
- జి.హరగోపాల్
రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యులు
Andhra Jyothi Telugu News Paper Dated : 11/10/2013
No comments:
Post a Comment