Friday, September 28, 2012

జీవ వైవి«ధ్యాల వైరుధ్యాలు! - సుజాత సూరేపల్లి



ఎన్ని రకాలుగా అడవులని, సహజ వనరులని నాశనం చేయవచ్చో పరిశోధనలు చేస్తున్న పెద్ద దేశాలకి, వాటికి ఊడిగం చేస్తూన్న చిన్న దేశాలకి ఇట్లాంటి సదస్సు అవసరమా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న... ఒక్కో సంస్కృతిని ఒక్కో రకంగా పేర్లుపెట్టి, బొందపెడుతున్న మనం జీవులను, వైవిధ్యం గురించి మాట్లాడుట నయా జీవన విధానానికి ఒక నమూనా... వైవిధ్యాల వైరుధ్యాలతో మునిగి ఉన్న ప్రపంచ దేశాలకి తెలంగాణ పోరాటం ఒక కనువిప్పు కావాలి. 


దాదాపు ఏడు వేల కోట్ల బడ్జెట్, 193 దేశాల నుంచి పదివేల మంది ప్రతినిధుల రాక, అట్టహాసంగా ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు. అది కూడా తెలంగాణ ముఖ్య పట్టణం, రాజధాని హైదరాబాద్‌లో. ఐక్యరాజ్యసమితికి, ప్రపంచ దేశాలకి, ఆర్థికంగా ముందున్న దేశాలకి జీవ వైవిధ్యం గురించి మాట్లాడాలని ఒక తలంపు వచ్చింది. అవి పర్యావరణం, జీవావరణం, ఆవరణం లాంటి అందమైన పదాలే కావొచ్చు కానీ అవి కూడా ఉన్నవి ఈ సృష్టిలో అని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి మోఖా! ఇంతకు ముందెన్నడు ఇంత పెద్ద సదస్సు జరగలేదని తెగ హైరానా పడుతున్నారు పాలకులు.



ప్రపంచంలో భిన్న వైవిధ్యాలు ఉన్న 17 దేశాలలో మన దేశం ఒకటి. అంతే కాదు జీవ వైవిధ్యాన్ని అతి వేగంగా కోల్పోతున్న దేశాలలో కూడా మన దేశం ఒకటి. వైవిధ్యం గురించి మాట్లాడే అర్హత మనకు కానీ, ఒక పక్క పర్యావరణాన్ని నాశనం చేస్తూ దానికి అభివృద్ధి అని పేరు పెడుతూ రెండు పాత్రలలో బాగా జీవిస్తున్న ఏ దేశానికి గానీ లేదు. ఎన్ని రకాలుగా అడవులని, సహజ వనరులని నాశనం చేయవచ్చో పరిశోధనలు చేస్తున్న పెద్ద దేశాలకి, వాటికి ఊడిగం చేస్తూన్న చిన్న దేశాలకి ఇలాంటి సదస్సు అవసరమా అన్నది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న.



అయినా ఫరవాలేదు. మనం ఇప్పటికైనా వైవిధ్యాల గురించి మాట్లాడుతున్నాం (కనీసం అనుకుందాం). వైవిధ్యంలో అందం, ఆనందం ఉంది. అది మనుషులకి, జీవులకి చరాచర రాసులకి ఒకేలాఉంటుంది అని చెప్పడానికి అతి పెద్ద చదువులు, సోకాల్డ్ తెలివితేటలు అవసరం లేదు. ఇక్కడ ఒక పశువుల కాపరిని, వ్యవసాయదారుని, మత్స్యకారుని, ఒక అడవిబిడ్డను అడిగితే చెప్తారు ప్రకృతిని ప్రేమించడం అంటే ఏమిటో. చెట్టులో, పుట్టలో, జంతువులలో, పంచ భూతాలని పూజ చేస్తూన్న ప్రజలకి జీవవైరుధ్యం గురించి ఒక అవగాహన జీవితంలో ఒక భాగంగానే ఉంటుంది.



కానీ ప్రపంచమంతా ఒకే మూసలో పోసినట్టు ఉండాలనే తపనతో భిన్న సంస్కృతులను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్న ప్రపంచీకరణ నమూనాలు ఇప్పుడు వైవిధ్యం అని మాట్లాడడం వైరుధ్యమా? పరిహాసమా? ఏమో కొన్ని వేలకోట్లు పెట్టి, అన్నిదేశాల నుంచి ప్రతినిధుల మేళాల నిర్వహణ ద్వారానే జవా బు దొరుకుతుంది అనుకోవచ్చు. అది కూడా హైటెక్ హంగామాలతో మాత్రమే. వేతనాలకి, జీతాలకి, తాగునీరుకి, విద్యకి, వైద్యానికి పైసల్లేవ్ అనే ప్రభుత్వాలకు ఏడు వేలకోట్లు కుచ్ భి నహీన్! గరీబీ హఠావో కాదు గరీబోన్ కో హఠావో అన్నట్టుగానే ఉంది ఇప్పుడు పరిస్థితి.



అసలు వైవిధ్యాలని వ్యతిరేకించే ప్రభుత్వాలు ఇంత పెద్ద వ్యవహారానికి ముందుకు రావడాన్ని అభినందించాలి. ప్రపంచం అంతా తెల్ల తోలు తొడుక్కోవాలని, అందరూ ఒకేరకమైన పిజ్జా, బర్గర్ లాంటి ఆహారం తినాలని, నైకి, అడిడాస్ కంపెనీల బూట్లు, పేక మేడల ఇండ్లు, ఒకే రకమైన కార్లు, కంపెనీలు, ప్లేస్టేషన్లు, టాబ్లెట్లు, నోట్‌బుక్‌లు వాడాలని, వాల్ మార్ట్‌లు, పెద్ద పెద్ద మాల్స్ తప్ప, చిన్నచిన్న సంతలు, అంగళ్లు, కిరాణా దుకాణాలు ఉండకుండా అన్నీ ఒకేలాగా ఉండాలని శాసిస్తున్న దేశాలు ఇప్పుడు వైవిధ్యాల గురించి మాట్లాడుతున్నై బ్రదర్! ఒక్కో సంస్కృతికి ఒక్కో రకంగా పేర్లుపెట్టి, బొందపెడుతున్న మనం జీవులను, వైవిధ్యం గురించి మాట్లాడుట నయా జీవన విధానానికి ఒక నమూనా.



ఇక రాజకీయ చర్చలోకి వస్తే ఇక్కడ జరుగుతున్న జీవ వైరుధ్యం గురించి మాట్లాడుకుంటే, సెప్టెంబర్ 30న తెలంగాణ వాదులు తలపెట్టిన మార్చ్‌ని బంద్ పెట్టున్రి అని కొంత మంది నాయకులు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్ని సంస్థలు వీటికి అనుగుణంగా మాత్రమే పనిచేసే ప్రభుత్వ విభాగాలు మార్చ్ జరపొద్దని డిమాండ్ చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఉద్యమకారులని అరెస్ట్ చేస్తున్నారు. వందలకొద్దీ పోలీసులు రోడ్లమీద తనిఖీలు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది అని కూడా వాపోతున్నారు ఇంకా కొందరు. అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇక్కడ నివసించే వాళ్ళని అడగాలి. అతి గొప్ప సంస్కృతికి చిహ్నంగా నిలిచింది హైదరాబాద్. 



'గంగా జమునా తెహజీబ్' అని బ్రాండ్ ఉన్న తెలంగాణ గడ్డ ఇక్కడ భాష, తిండి, సంస్కృతి సంప్రదాయాలని వలసవాద సంస్కృతిలో కోల్పోయింది. ఈ భూమి మొత్తం ఆక్రమణకి గురై అల్లాడుతున్నది. మాకు మా బతుకు కావాలె, పరాన్న భుక్కులై మా జీవితాలను, ప్రాంతాలను ఆక్రమించిన ఈ వలసాంధ్ర సంస్కృతి నుంచి మేము విముక్తి కొరకు పోరాడుతున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మార్చ్ చేస్తున్నాం అన్న సంగతి. 1969లో 360 మంది యువకులు రాజ్యహింసకి బలైతే, 2009 నుంచి దాదాపు 800 మంది ఉద్యమకారులు, యువకులు ఆత్మ బలిదానాలిచ్చినారు. జొన్నరొట్టెకి, పుల్ల అట్టుకి, అట్ల తద్దికి, బతుకమ్మకి ఉన్న సంస్కృతిని కాపాడాలనే ఈ తెలంగాణ ఆరాటం, దాని కోసం తెగబడి కొట్లాడుతున్నది. అవును నీ ఇడ్లి బండికి అడ్డా, జాగా నీది నీకే ఉండాలని కదా కొట్లాడుతున్నది. కాని పచ్చల్లతోనివచ్చి, పొట్ట చేతబట్టుకొని వచ్చి ఇక్కడ జీవితాలని కబ్జా చేసి, నా భాషని, యాసని ఎక్కిరిస్తే ఇంకెక్కడి వైవిధ్యం భాయ్? ఇక్కడ కోట్లకొద్ది మనుషులుబతికినా జీవచ్ఛవాల లెక్క మిగిలున్నారు.



పాలకులారా! చంచా యుగకర్తలారా! ఎవరికన్నా ఇక్కడి వేదన అర్థమయ్యే మనస్సుంటే అర్థం చేసుకోండి. తెలంగాణ చరిత్ర తెలుసుంటే పోలీసులు, కేసులు అరెస్టులు ఇక్కడ పుట్టిన బిడ్డని ఏమీ చేయలేవని మీరు తెలుసుకోలేనంత పనికిమాలిన వాళ్ళు అని ఇక్కడి ప్రజలు అనుకోవట్లేదు. రక్తాలు ఏర్లు అయి పారిన గడ్డ ఇది. జైళ్ళు మొత్తం నిండి, యేండ్ల కొద్ది జీవితాలను అంకితం చేసి ఉద్యమాలను నడిపిస్తున్న బిడ్డలను కన్న గడ్డ ఇది. భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం ఇయ్యాల తెలంగాణ మొత్తం కదిలొస్తున్నది. తెలంగాణ జీవితాన్ని కాపాడుకోవడానికి, ఇక్కడి ప్రాంత వైవిధ్యాన్ని గురించి ప్రపంచానికి చెప్పడానికి ఇది మంచి సమయంగా భావించండి. ఇది ప్రజల యాత్ర, పోరు, మరొక స్వతంత్ర పోరాటం అని చెప్పటానికి తెలంగాణ గడ్డ ఇల్లిల్లు కదిలొస్తున్నది. ఇది వేల కోట్లు వెచ్చించి చేస్తూన్న సదస్సు కంటే గొప్పది, ఇట్లాంటి పోరాటం చూడడం ఇక్కడకి వచ్చే ప్రతనిధులకి మీరిచ్చే బహుమానం.



మీకు గత అనుభవాలు పాఠాలు నేర్పలేదా? మీరు అడ్డంపడి ఎప్పుడైనా ఏ కార్యక్రమం అన్నా ఆపగలిగినారా? ఆడవాళ్ళు, ఆదివాసీలు, ముస్లింలు, హిందువులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ఉద్యోగ సంఘాలు సద్దన్నం మూటలు కట్టుకొని సంసిద్ధంగానే వొస్తున్నరు తెలంగాణ మార్చ్‌కి. రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రతిసారి ఒకరో ఇద్దరో అమాయకులు బలి అయినారు మీరుచేసే చేష్టల తోటి. ఇదే ట్రెండ్ మళ్లీ కొనసాగకుండా కాపాడుకోవాలే.



ఉద్యమనాయకులు ఒక మెట్టు దిగివచ్చి తమ పార్టీలను కాపాడుదాం అనే ఆశతో ఉన్నారు. కేంద్రం మల్లొక చచ్చు ప్రకటన ఇచ్చి సదస్సును ఎలాగైనా జరపాలని చూస్తున్నది. ఉద్యమాన్ని చల్లబరచాలని చూస్తే ఉప్పెనలై ఉరికొస్తారు ఇక్కడి ప్రజలు. కానీయండి, ఈ జీవన పోరాటానికి మద్దతు తెలపకపోయినా ఫరావాలేదు. కనీసం అడ్డం పడకండి. విన్నపాలు, వేడుకోలు ఇక జాన్తానై. వైవిధ్యాల వైరుధ్యాలతో మునిగి ఉన్న ప్రపంచ దేశాలకి తెలంగాణ పోరా టం ఒక కనువిప్పుకావాలి. అతిథుల కొరకు మీరు పడే ఆరాటంలో ఈ ప్రాంతం వారు ప్రాణాలకు తెగించి చేస్తూన్న పోరాటానికి పదో వంతు సహాయాన్నన్నా అందించిండి.



చివరగా ఢిల్లీలో చక్రం తిప్పుతున్న నాయకులకి, ఇక్కడ ఉండి ఒకటి రెండు సినిమా డైలాగ్‌లు లాగా టీవీల ముందు కూర్చుని మాట్లాడుతున్న వారికి కూడా ఇదే ఆఖరి పిలుపు. ఇప్పుడు మార్చ్‌కి రాకపోతే ఇంకెప్పుడు మీరు వోట్ల కోసం ప్రజల వద్దకు మార్చ్ చేయడానికి అర్హులు కాదు. ప్రతి ఒక్కరి రాజకీయ డ్రామాల చిట్టా తెలంగాణ ప్రజల వద్ద భద్రంగా ఉంది. ప్రజా పోరాటాలకు విలువనిస్తే ఇంత పెద్ద సదస్సులు పెట్టుకునే అవకాశం ఏ దేశానికి రాకపోవచ్చు. ఇదే తెలంగాణ ప్రపంచానికి ఇచ్చే సందేశం.



- సుజాత సూరేపల్లి
Andhra Jyothi News Paper Dated : 29/09/2012 

Wednesday, September 26, 2012

రాష్ట్రం ఇవ్వకపోతేనే నక్సలిజం - చిక్కుడు ప్రభాకర్



వాస్తవంగా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే నక్సల్స్ సమస్య ఏర్పడదు. దేశంలో ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేత తీవ్రత వల్లనే ఆ ఉద్యమం పుడుతుంది. జార్ఖండ్‌లోనైనా, పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోనైనా నక్సల్ ఉద్యమం ఉధృతమైంది అవి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి కాదు. బీహార్, మధ్యప్రదేశ్‌లలో అవి అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి 25 ఏళ్ళకు ముందే ఆ ఉద్యమం వేళ్ళూనుకుని ఉంది. 

చిన్న రాష్ట్రాలలో నక్సలిజం పెరుగుతుంది. ఛత్తీస్‌గఢ్-జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతనే అక్కడ నక్సలిజం పెరిగింది. తెలంగాణపై లోతైన అధ్యయనం చేయాలని దేశ హోం శాఖ మంత్రి షిండే చిలుకపలుకులు పలికారు. ఇవి అతని సొంత వాక్యాలు కావు. ఇవి యాదృచ్ఛికం కూడా కావు. ఈ పలుకులు తెలంగాణను నిరంతరం దోచుకుంటున్న సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు నాలుగు దశాబ్దాలుగా వల్లె వేస్తున్న పలుకులే. కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యులు లగడపాటి రాజగోపాల్ హోం మంత్రి షిండేకి పంపిన లేఖలోని మాటలుగా భావించవచ్చు

. అలాగే నక్సలిజానికి పుట్టినిల్లు 'ఉత్తరాంధ్ర' అని, నేటికీ ఉత్తరాంధ్ర మొత్తం నక్సలిజం ఆవరించుకుని ఉందనే విషయం ఈ కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారు. తెలంగాణ మనోభావాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తొలి రోజుల నుంచి తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం, తమకే కావాలని దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఒక రాష్ట్ర ఏర్పాటుకు ఇంత సుదీర్ఘమైన పోరాటం జరిగిన ప్రాంతం దేశంలోనే లేదు.

గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు దేశంలోని వివిధ ప్రజాఉద్యమాలకు 'నక్సల్స్ అనుకూల ఉద్యమాలు'గా ముద్ర వేసి ప్రభుత్వం అణచివేస్తోంది. రైతాంగం, విద్యుచ్ఛక్తి, విత్తనాలు, గిట్టుబాటు ధర అడిగినా, కార్మికులు వేతనాల పెంపుకొరకు, యాజమాన్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడినా, తమ భూములు, తమ నీరు, తమ సంపద తమకే దక్కాలని ప్రజలు పోరాటం చేసినా, వాటిలో నక్సలైట్లు ఉన్నారని ఆరోపణ చేస్తూ పాలకులు తీవ్ర అణచివేతకు పూనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమాన్ని కూడా నక్సల్స్ అనుకూల ఉద్యమంగా ముద్రవే యడం, తెలంగాణ రాష్ట్రమేర్పడితే నక్సలైట్లు పెరుగుతారనే ప్రచారం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నవారు సీమాంధ్ర కాంగ్రేస్ నాయకులే. వీరికి ఆ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం, వైఎస్ఆర్‌సిపి నాయకులు కూడా తోడయ్యారు.

శ్రీకాకుళ పోరాటం తర్వాత సుదీర్ఘకాలం తెలంగాణలో ఈ పోరాటం నడిచిన మాట వాస్తవమే. కానీ నేడు తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం తాత్కాలికంగా 'లోతైన వెనకంజ' వేసింది. నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి కావూరి, రాయపాటి, లగడపాటిల వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏదుర్కొనేందుకు రెండు వితండ వాదాలను ప్రచారం చేస్తున్నారు. ఒకటి-తెలంగాణ రాష్ట్రమేర్పడితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని, రెండు-తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం దేశ సమగ్రతకు భంగకరమని, పై రెండు విషయాల్లో ఏ ఒక్కటి కూడా శాస్త్రీయమైనది కాదు. వాస్తవంగా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే నక్సల్స్ సమస్య ఏర్పడదు.

దేశంలో ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేత తీవ్రత వల్లనే ఆ ఉద్యమం పుడుతుంది. జార్ఖండ్‌లోనైనా, పక్కనే ఉన్న చత్తీస్‌గఢ్‌లోనైనా నక్సల్ ఉద్యమం ఉధృతమైంది అవి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి కాదు. అవి బీహార్, మధ్యప్రదేశ్‌లలో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి 25 ఏళ్ళకు ముందే ఆ ఉద్యమం వేళ్ళూనుకుని ఉంది. చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి మిలటరీ వికేంద్రీకరణ పె రిగి అణ చివేత తీవ్రమయి ఆ ఉద్యమాలు వెనుకంజ వేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఎనిమిది ఏళ్ళ తర్వాత 1964లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 1968 నాటికి ఉధృత రూపం దాల్చింది. 1969 సంవత్సరం నాటికి తెలంగాణలో దాదాపు సంవత్సరకాలం ప్రభుత్వ వ్యవస్థ పనిచేయలేనంతగా ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష వెల్లువెత్తింది. సరిగ్గా అపుడే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని మన్నెంలో సాయుధపోరాటం మొదలయింది. 1967 ఫిబ్రవరిలో పశ్చిమబెంగాల్‌లోని 'నక్సల్‌బరి' గ్రామంలో సంతాల్ గిరిజనుల తిరుగుబాటు ప్రేరణతో శ్రీకాకుళ ఉద్యమం వచ్చింది. దేశ వ్యాప్తంగా అనే క ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమాలు వెలిశాయి. ఆ తర్వాత ఆ ఉద్యమంలో వచ్చిన చీలికలు దేశ వ్యాప్తంగా పాయలు, పాయలుగా సాయుధ పోరాటాన్ని నడిపించాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాయుధ పోరాటాలు నడిపించిన ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీలు విలీనమై సుమారు 31 వేల మంది సాయుధ శక్తితో నేడు దేశంలోనే అతిపెద్ద నక్సలైట్ పార్టీ (సీపీఐ మావోయిస్టు)గా అవతరించింది.

శ్రీకాకుళ పోరాటాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, హోం మంత్రి జలగం వెంగళరావులు తీవ్రంగా అణచివేశారు. ఆ ఉద్యమ అణచివేతతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కూడా తీవ్రంగా అణచివేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నిరంతరం కొనసాగించాలనుకున్న కాంగ్రెసు పాలకులు నేటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగానే తయారైనారు. నాటి శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్న నాయకులలో చారుమజుందార్ అవగాహనను కలిగిన కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని వర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించింది. కానీ చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవ రావు. దేవులపల్లి వెంకటేశ్వర రావు నాయకత్వంలోని పార్టీలు నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యానికి అవరోధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని భావించారు.

తెలంగాణ ప్రాంత భౌతిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని ఎంఎల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బేషరతుగా సమర్థించింది. నాటి నుంచి 1995లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలయ్యే నాటికి పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల చాలా స్పష్టమైన, లోతైన అవగాహన కలిగి ఉన్నది. తొమ్మిది పార్టీలతో కలిసిన జనశక్తికి కానీ, పైలా వాసుదేవరావు నాయకత్వంలోని న్యూడెమొక్రసీకి కానీ ఈ పోరాటం పట్ల స్పష్టమైన అవగాహన లేదు. వాటికి ఈ ప్రాంత పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన లేకపోవడంతో తెలంగాణా ఉద్యమాన్ని వారు సమర్థించలేదు. కానీ, జనశక్తి నుంచి 'కులం' విషయం మీదనే చీలిన నాటి 'మారోజు వీరన్న' నాయకత్వంలోని పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో 'దళిత-బహుజనుల రాజ్యాధికార' లక్ష్యంతో ముందుకు కదిలింది.

మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతమయ్యే సమయానికి పీపుల్స్‌వార్‌పార్టీ 'గెరిల్లా జోన్ పర్‌స్పెక్టివ్'ను అభివృద్ధి పరుస్తూ, ఉత్తర తెలంగాణను ప్రాథమిక దశకు, దక్షిణ తెలంగాణను సన్నాహక దశకు చేర్చింది. 1997 నాటికి తెలంగాణ అభివృద్ధి మీద ఒక్క స్పష్టమైన 'ప్రజా ప్రత్యామ్నాయం' పేరుతో డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఆ డాక్యుమెంట్ వెలుగులో విశాల ప్రజారాసులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వారు పోరాడుతున్నారు. నాడు చండ్రపుల్లారెడ్డి వారసత్వంలోని ఏర్పడిన పార్టీలోని ఒక వర్గం, న్యూడెమొక్రసీ, సిపిఎం,సిపిఐలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించగా, జనశక్తి తన అవగాహనను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించింది. కాలక్రమేణా నేడు ఒక్క సిపిఎం పార్టీ తప్ప, మిగతా కమ్యూనిస్టు పార్టీలన్నీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తున్నాయి.

చిన్న రాష్ట్రాలు మిలిటరీ వికేంద్రీకరణకు అనువుగా ఉంటాయని, ప్రజా ఉద్యమాలను సులువుగా అణచివేసేందుకు ఇవి దోహదపడుతాయని సిపిఐ మావోయిస్టు రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ 2010 జనవరిలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈశాన్య భారతదేశంలోని త్రిపుర, మిజోర ం, నాగాలాండ్, అసోం, మేఘాలయ రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఉండడం మూలానే అక్కడి ప్రజాఉద్యమాలను ఆ ప్రభుత్వాలు సులభంగా అణచివేయగలుగుతున్నాయని ఆయన చెప్పారు. సీమాంధ్ర సంపన్నవర్గాల చేతిలో గురవుతున్నందున చిన్న రాష్ట్రమే అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ను తాము సమర్థిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష మేరకు తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని తెలిపారు. నేడు నక్సల్స్ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడానికి పూర్వమే బలమైన ఉద్యమకేంద్రాలుగా ఉన్నాయి. నేడు రాంచీని మిలిటరీ బే స్‌గా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లో ఆ ఉద్యమం మీద తీవ్ర అణచివేత కొనసాగుతున్నది.

ఇక రెండవ కారణమైన దేశ సమగ్రతకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసలు ఎటువంటి సంబంధం లేదు. స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశంలో 13 రాష్ట్రాలుండగా, నేడు అవి 29 రాష్ట్రాలుగా ఏర్పడినాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి దేశసమగ్రతకు ఎటువంటి సంబంధం ఉన్నది? ఈ ప్రాంతం ప్రజలు దేశంనుంచి విడిపోతామని ఏమైనా అంటున్నారా? స్వపరిపాలన పేరుతో భౌగోళిక తెలంగాణను కోరుతున్న వారు కొందరైతే, స్వపరిపాలనతో పాటు స్థానిక వనరులు, స్థానిక ప్రజలకు సమపాళ్ళలో దక్కాలని ఈ ప్రాంత ప్రజానీకం పోరాడుతున్నారు.

ఇలాంటి ప్రచారాలు సీమాంధ్ర సంపన్నులు కుట్రపూరితంగా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక ్సల్ సమస్య పెరగదు. కానీ, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఇలా సాగతీత వలన ఇక్కడి ప్రజలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చే స్తారు. కేసీఆర్‌తో చర్చలు, కోర్ కమిటీ భేటీలన్నీ సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించడానికే. ఈ ఆర్భాటాలన్నీ 'జీవ వైవిధ్య సదస్సు'ను సజావుగా జరపడం కోసమే గానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కాదు.

సీమాంధ్ర సంపన్న వర్గాల కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగదీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజా ఉద్యమాల ఉధృతి తాత్కాలికంగా ఉపశమిస్తుందే గాని నక్సలిజం పెరుగుతుందన్న పాలకులు ప్రచారంతో అర్థంలేదు. తెలంగాణ ఏర్పాటును మరింతగా సాగదీస్తే ఈ పోరాటం మరింతగా ఉధృతమై నక్సలైట్ ఉద్యమం పెరగడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

- చిక్కుడు ప్రభాకర్
Andhra Jyothi News Paper Dated : 27/09/2012 

Sunday, September 9, 2012

ఆదివాసులకు విద్య - అంతా మిథ్య రమేష్‌ బుద్దారం


   Fri, 7 Sep 2012, IST  


'భారతదేశంలో మొదటి తరం వారెవరంటే ఆదివాసీలే. అయినప్పటికీ తరతరాలుగా మా చరిత్ర వివక్ష, దోపిడీలతో కూడుకుని నడుస్తోంది. స్వతంత్ర భారత దేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించబడతాయి, ఎవరూ నిర్లక్ష్యం చేయబడరని ఆశిస్తున్నా' ఇవి రాజ్యాంగ నిర్మాణ సభలో ఏకైక ఆదివాసీ సభ్యుడుగా ఉన్న జైపాల్‌ ముండా 1946లో చేసిన వ్యాఖ్యలు ఇవి. 65 వసంతాల స్వతంత్ర భారతదేశంలో నిజంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయా అనే సందేహం సామాన్య మానవుడికి కలగక మానదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, కానీ ఆదివాసీల తలరాతలు మాత్రం మారిన దాఖలాలు కనిపించడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌ 35 గిరిజన తెగల్లో నాలుగైదు మైదాన ప్రాంత తెగలు మినహా చాలా మటుకు తెగల్లో అక్షరాస్యతా రేటు చాలా తక్కువనే చెప్పాలి. చెంచు, బొడొ గదబ, గుటొబ్‌ గదబ, డొంగ్రియ, ఖొండ్‌ కుల్తియ, ఖొండ్‌, కొలం, కొండరెడ్డి, కొండ సవర, బొండొ ఫొర్జ, ఖొండ్‌ ఫొర్జ, ఫరెంగి ఫొర్జ తెగల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ తెగల నుంచి పట్టుమని ఒక డాక్టరుగానీ, ఒక ఇంజనీరు గానీ లేరంటే అతిశయోక్తి కాదు. 46వ ప్రకరణ బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు తగిన విద్యా సదుపాయాలు కల్పించి వారిని సామాజిక అసమానత్వం, వివక్షల నుంచి కాపాడటం రాజ్యం బాధ్యత అని నిర్దేశిస్తుంది. రాజ్యాంగంలోని 21వ ప్రకరణ 1-14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత విద్య ఒక హక్కుగా ప్రకటించింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వీరి అభివృద్ధికై ప్రత్యేకంగా 10 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేశారు. వీరి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటున్నాయి. సబ్‌ప్లాన్‌ ద్వారా ప్రత్యేక నిధులొస్తున్నాయి. అయినప్పటికీ అభివృద్ధి ఫలాలు, తరతరాలుగా వీరికి విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. విద్యాభివృద్ధిలో భాగంగా వివిధ పేర్లతో పాఠశాలలు ఏర్పాటయ్యాయి. దాదాపు 8 శాతం ఉన్న గిరిజన జనాభాకు అవి ఏమాత్రం సరిపోవు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా స్కూళ్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకసారి సమస్య మూలాల్లోకెళ్ళి గమనిస్తే అనేకానేక విషయాలు తెలుస్తాయి. వలసలు, సరైన జీవనోపాధులు లేకపోవడం, మూఢాచారాలు, అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు, బాల్య వివాహాలు, సంచార జీవనం వంటివి ఆర్థిక కారణాలు కాగా, నక్సలిజం పేరుతో పోలీసుల హింస, చదువుకున్న అమాయక యువకులను, గిరిజనులను కోవర్టులు, ఇన్‌ఫార్మర్ల నెపంతో అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు చాలా ఇబ్బందులకు గురిచేయడం వంటి సామాజిక కారణాల మూలాన చక్కగా సాగాల్సిన బతుకులు నేరస్తులు అనే మరకలంటి మసవుతున్నాయి. మాతృభాషలో విద్య జరగాలని భారత రాజ్యాంగ ప్రకరణ 350(ఎ) నిర్దేశించింది. మాతృభాషలో విద్యాబోధన జరిగితే అవగాహన శక్తి పెరిగి తద్వారా విద్యార్థికి విద్యపై ఆసక్తి కలుగుతుందని అనేక కమిటీలు నొక్కి చెప్పాయి. విద్య ప్రాముఖ్యతను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదివాసులకు తెలియపరచడంలో విఫలం కావడంతో ఇది ఎక్కడా అమలు జరగడం లేదు. గిరిజనేతర ఉపాధ్యాయుల నియామకం, స్కూల్‌ నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, రెగ్యులర్‌ ఉపాధ్యాయుల కొరత, ఉపాధ్యాయుల గైర్హాజరి, విద్యా వాలంటీర్లచే బోధన మొదలగు కారణాలు అధిక డ్రాపౌట్‌ రేటుకు కారణాలవుతున్నాయి. గ్లోబలైజేషన్‌ మాయలో సాగుతున్న ఈ విద్యా విధానం ఆదివాసులకు ఆమడ దూరమేనని చెప్పాలి. మూల విద్య సరిగ్గా అందనివాడికి ఆంగ్ల విద్య అనేది కష్టమే. ప్రస్తుత విద్యా విధానం అనేది కొన్ని వర్గాలకే అనుకూలంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అనేక కమిటీలు వేశారు. సదస్సులు, చర్చా గోష్టులు జరిపారు. కమిటీలు ఎన్ని వేసినా, ఎన్ని చర్చలు జరిపినా మన పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారు. ఆచరణకొచ్చేసరికి ప్రపంచబ్యాంకు విధానాలకే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ద్వంద్వ ప్రమాణాలను పాటించడం వల్లే అక్షరాస్యతలో ప్రపంచంలో భారత్‌ వందో స్థానంలోనూ, దేశంలో మన రాష్ట్రం 28వ స్థానంలోనూ ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి బదులు మరింత దిగజార్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ఉపాధ్యాయులను కుదించడం, పాఠశాలలను మూసేయడం, విద్యారంగ కార్పొరేటీకరణ వంటివి ఇందుకు కొన్ని మచ్చుతునకలు. విద్య అనేది దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర అనే విషయం విస్మరించిన మన పాలకులు ఎప్పటికప్పుడు ఖాళీ అయిన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా కేవలం ఎన్నికల సమయాలలో మాత్రమే నియామకాలు చేపట్టడం పరిపాటిగా మారింది.
విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలకు అన్ని వసతులూ కల్పించి, తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయ నియామకాలు జరిపి, మాతృభాషలో విద్యాబోధన జరిపి తద్వారా నాగరిక సమాజానికి దగ్గరగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చట్టాలు ఎన్నో చేస్తున్నారు కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. చట్టాల అంతరార్థం అర్థం చేసుకొని పాలకులు వాటి అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన మహోన్నత బాధ్యత, అవసరం ఎంతో ఉంది. అందరికీ అక్షరాస్యత బాధ్యత ప్రభుత్వానిదే. దీని సాధనకు రాజకీయ చిత్తశుద్ధి ఎంతైనా అవసరం. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చాం. ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)
(రచయిత రీసర్చ్‌ అసోసియేట్‌, కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌))))000 ))

Prajashakti News Paper Dated : 07/09/2012

పిలుపుల మలుపుల్లో ఉద్యమం - సుజాత సూరేపల్లి



నాయకులకి పిలుపు అంటే తెలంగాణ గుండెల్లో రాళ్ళు పడ్డట్టే. గత రెండు సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు ఉద్యమం ఒక అడుగు ముందుకు వేద్దామన్నా ఏదో ఒక పిలుపు ఎవరికో ఒకరికి వస్తుంది. అది కూడా నాయకులకి మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రాంతాలు తేడాలుండవచ్చు కానీ వారికి తప్పక దైవ సందేశాలు ఉండే ఉంటాయి. రాజకీయ పార్టీలకు మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడి ఉండనే ఉంది. మూడు ప్రాంతాల నుంచి ఎవరికైనా పిలుపులు/సందేశాలు రావొచ్చు.

ఈ సిగ్నల్ వ్యవస్థ రిలయన్స్, వొడాఫోన్ వాళ్ల కంటే తెలంగాణ నాయకులలో కాస్త ఎక్కువ. 2009 డిసెంబర్‌లో చిదంబరం ప్రకటన వచ్చింది, ఇదీ ఒక పిలుపు లాంటిదే. ఆ రాత్రి తెలంగాణ వాళ్ళంతా ధూమ్‌ధామ్‌లు, సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే రాజకీయ నాయకులకి చిదంబరం గారి పిలుపొచ్చింది, పార్టీలకు అతీతంగా ఆయనేదో సీక్రెట్‌గా పిలిచి అడిగారు, వీరు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రజల చేతిలోకి పోతే మనం రాజకీయ నిరుద్యోగులం అవుతామని అన్నారని బయట వినికిడి. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల గురించి తెలంగాణలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.

పిలుపులో ఉన్న మహత్యం ఏమిటో గానీ ఇచ్చిన మాట వెనక్కి పోయింది. గొప్పగొప్ప నాయకులు తెలంగాణ రాకపోతే నాలుక తెగ్గోసుకుంటం, ఉరేసుకుంటం అన్నోళ్ళు సప్పుడు సడి లేకుండా ఉన్నారు. తరువాత కృష్ణ కమిటీ అని ఒక కపట కమిటీని వేసి మరింత కాలయాపన చేశారు. ఈ మధ్య కాలంలో వరుస బెట్టి పోరగాండ్లు చస్తూనే ఉన్నారు, నాలుగు (రెండు?) కన్నీటి బొట్లు రాల్చి, పుష్పగుచ్చాలిచ్చి వచ్చారే గానీ ఏ ఒక్క నాయకుడికి ఈ 'హత్యలను' ఆపడానికి ఒక్క పిలుపు రాలేదు. రాజీనామా చేయాలనిపించాలే, ఇంకొక్క అడుగు ముందుకేస్తే చావులకు కూడా మార్కెట్ చేసుకున్నోళ్లు కోకొల్లలు. సెంటిమెంట్‌లతో మరిన్ని పదవులు, పైసలు, ఓట్లు కూడా ఉచితంగా కొట్టెయ్యొచ్చు అని నిరూపించారు.

కోట్లకొద్దీ ప్రజలు ప్రేక్షకపాత్ర వహించారు, మౌనంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు. రచయితలు కసిగానో, కవ్విస్తూనే రచనలు రాశారు. కానీ ఎవరికీ గుండె మండలే, పౌరుషం రాలే. ఒక నిర్లిప్తత, స్తబ్దత సర్వత్రా వ్యాపించింది. ఇట్లా ఈ ఆత్మహత్యల పరంపర నడుస్తుండగానే మళ్లీ ఉప ఎన్నికల పిలుపులు, జై తెలంగాణ నినాదాలు, రాజీనామాలు, కోపమొస్తే, నవ్వొస్తే, అలిగితే, పదవులు కావాలంటే ఒకే ఒక్క మార్గం 'రాజీనా(డ్రా)మ', ఉద్యమం అంతా నాయకులని గెలిపిస్తే చాలు అని ఓట్ల చుట్టూ తిరిగింది.

ఓటు రాజకీయాలతో అలసిపోయిన తెలంగాణ ఏ ఒక్క అవకాశం పోగొట్టుకోదలచుకోలేదు. కడుపులు, గుండెలు మండుతున్నా కూడా నిండు మనసుతో ఓట్లేశారు. జీవితంలో మళ్లీ ఎన్నికలలో నిలబడి గెలవలేని వాళ్ళు 'జై తెలంగాణ' అని అధికార పార్టీల నుంచి జంప్ చేసి అత్యధిక ఓట్లతో గెలిచారు. అసలు ఈ నాయకులు ప్రజాసమస్యల మీద, వనరుల దోపిడీ మీద, మతం పేరుతో జరుగుతున్న హింస మీద, దళిత, ఆదివాసీల ఊచకోతల మీద ఒక్కడన్నా ఎందుకు రాజీనామా చేయలేదో మనం అడుగకూడదు. ఉద్యమం అడగదు, స్వచ్ఛంద సంస్థలు, స్వతంత్ర సంస్థలు అడగవు. అన్నీ రాష్ట్రం వచ్చిన తరువాతనే, ఒట్టికుండ చేతికొస్తే ఏమైతది? ఒకవేళ ఎవరో ఒకరు అడిగితే, అడిగిన వాళ్ళని ఏదో ఒకపేరు పెట్టి పక్కకు పెడతారు, లేదంటే చెరుకు సుధాకర్ మరి అనేక మంది విద్యార్థులు, ఉద్యమకారుల లెక్క జైలుకి పంపుతారు.

విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి అని పిలుపునిస్తే నాయకులు మౌనం వహిస్తారు. మాస్ ఏ పిలుపునిచ్చినా నాయకులు స్పందించినది చాలా తక్కువ, విధిలేక మొక్కుబడిగా ఒప్పుకున్నవే ఎక్కువ. మళ్లీ ఎండాకాలం, రెస్ట్ హౌస్‌లోనో, గెస్ట్ హౌస్‌లోనో, ఫాంహౌస్‌లోనో సమ్మర్ వెకేషన్. కింద మీద బడుకుంట మిలియన్ మార్చ్ వస్తే ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు. ప్రజల వెల్లువ చూసి కుక్కిన పేను లెక్క పడి ఉండి, మళ్లీ క్రాప్ హాలిడే లాగా పొలిటికల్ హాలిడే డిక్లేర్ చేస్తారు. ఇదే క్రమంలో సకల జనుల సమ్మె వచ్చింది. అసలు అది ఎందుకు మొదలైందో, ఎందుకు ముగిసిందో ఎవ్వరికీ తెలియదు. ఒక డిమాండ్ లేకుండా మొదలుపెట్టినా కూడా ఢిల్లీ పీఠం గడగడలాడించే లెక్క సమ్మె చేశారు.

సింగరేణి అగ్గి పుట్టించింది, అగ్గిబిడ్డల ఉద్యమ తాకిడికి దేశం అంతా అల్లకల్లోలం అయింది. ఇక కేంద్రం, సోనియమ్మ దిగొస్తది అనుకున్నంతలోనే నాయకులు సమ్మెను బంద్ చేయమని 'మరో పిలుపునిచ్చారు', లేకపోతే మీ చావు మీరు చావండి అన్నారు. అప్పటికే కడుపులు కాలి ఉండి, అప్పులు చేసి కూడా ధైర్యంగా ఉన్న ప్రజలు నాయకుల వైఖరితో అధైర్యపడ్డారు. అప్పుడు కూడా నాయకులకు పిలుపొచ్చింది కానీ జనాలు తంతరని పోలేదు అన్న వారు లేకపోలేదు. ఇంక సమ్మె కాలంలో జీతాలు ఇవ్వమని, సెలవులని రద్దుచేయమని మళ్లీ మధ్యతరగతి ఉద్యమంలోకి వచ్చి పడింది. ఇంక పార్లమెంట్ సమావేశాలంత గమ్మత్తు సీన్ దేశంలో మరొకటి కనపడదు. ఒకే ఒక్క ఖల్ నాయక్, నాయకీమణి జై తెలంగాణ అనుకుంట లోపలికి పోతారు. ఇంగ టీవీలోళ్లు చూపించిందే చూపించి పండుగ చేసుకున్నారు.

పొద్దున లేస్తే తెలంగాణ అనే నాయకులెవ్వరూ అక్కడ కనపడరు. ప్రపంచం అంతా పిచ్చి గొర్రెలు అనుకుంటారేమో కానీ ఇంతనన్నా సోయి కూడా లేకుండా చీప్‌గా ట్రిక్కులు ప్లే చేస్తారు. అరవై ఏళ్ల సంధి చూసిచూసి జనాలు అలసిపోయారు. రాజులు మారుతున్నారు కానీ రాజ్యాలు మారట్లేదు. ఉద్యమ సంస్థలూ హాలిడేలు ప్రకటించుకున్నాయి. పండుగలు, పబ్బాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అన్నీ అయిపోయాయి. హఠాత్తుగా అధికారపార్టీల వాళ్లకి రోషమొచ్చింది. తాడోపేడో తేల్చుకుంటామని హస్తినకు వెళ్ళారు. పార్లమెంటులో జై తెలంగాణ అని అనకముందే అమ్మ కనుసైగ చేసింది, వేలెత్తి చూపింది. 

మెరుపులాంటి ఒక్క కనుసైగకి కళ్ళు తిరిగి, నోర్లు పడిపోయి, దిమ్మ తిరిగి మౌనవ్రతం పట్టుకున్నారు. అమ్మ ఎలాగన్నా కరుణిస్తుందని, తెలంగాణ వరం ప్రకటిస్తుందని ఆశతో ఉన్నామని ప్రవచనా లు చెబుతున్నారు. అంతకన్నా ఏమి చేస్తారు పాపం! వుయ్ పిటి దెమ్!

ఇక చంద్రబాబు నాయుడు గారి కథ కంచికి చేరినట్టే. గనులను మింగిన జగనులను జైలులో పెట్టారు కానీ ఓట్లని రాబట్టుకోలేకపోయారు. ఎప్పుడైతే బాబు జై తెలంగాణ అని పిలుపునిద్దామని అనుకున్నారో మళ్ళీ కేంద్రం నుంచి పిలుపులొస్తున్నాయి కొంత మంది నాయకులకు. ఎప్పుడైతే తెలంగాణ మార్చ్‌కి ప్రజలు సిద్ధమవుతున్నారో మళ్లీ నాయకులకి మరో పిలుపు వస్తుంది. కపట ప్రకటన రావొచ్చు లేదా మంచి ప్యాకేజీ రావొచ్చు, మళ్ళీ ఎన్నికలదాకా ఏదో ఒక టైం పాస్!

ప్రజలు ఒక్కటి మాత్రం తెలుసుకున్నారు. పదేళ్ల ఓట్ల, సీట్ల కసరత్తులకి కేంద్రం తెలంగాణ ప్రకటనని ఇవ్వలేదు. కేవలం ఉద్యమం మాత్రమే అది కూడా బాగా వత్తిడి వచ్చినప్పుడే నాయకులకి సిగ్నల్స్, పిలుపులు వచ్చాయి. అది కూడా ఉద్యమాన్ని అణచివేయడానికి లేదా తప్పుదారి పట్టించడానికి మాత్రమే అని జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు కావలసింది తెలంగాణకి ఉద్యమ బాట, రాజీలేని పోరాటాలు. ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాయంటే దానికి నిస్వార్థ ప్రజల ఉద్యమమే కారణం.

తెహ్రిర్ స్క్వేర్ మరిపించే విధంగా సెప్టెంబర్ 30 మార్చ్ చేస్తారు ఇక్కడి ప్రజలు. అందులో ఏమీ సందేహం లేదు కానీ దీని వల్ల ఈ తెలంగాణ రక్తానికి రుచి మరిగిన రాజకీయ పార్టీల వైఖరి మారుతుందా, కుట్ర లేని తెలంగాణని ప్రకటిస్తారా, మరొక పోరాటానికి సిద్ధం చేస్తారా? మరొక 'పిలుపు' కోసం వేచి చూడాల్సిందే! అది రాజకీయ నాయకులు పిలుపు కాదు, ఆవేశంతో రగిలిన ప్రజల పిలుపు. దానిని తట్టుకొనే ప్రభుత్వాలు ఇంకా భూమి మీద పుట్టలే!
- సుజాత సూరేపల్లి

Andhra Jyothi News Paper Dated : 09/09/2012 



Saturday, September 8, 2012

మైలపడిన కాలాన్ని కడిగిన తిరుగుబాటు బావుటా -- Dr. P Kanakaiah



chak
ఆమె జ్ఞాపకాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. బహుజ ను ల హృదయాలు ఆత్మీయమైన స్పందనతో ఒక్క సారిగా కరిగిపోతాయి. ఆమె సుగుణాలు స్నేహ సౌశీ ల్యాన్ని గుర్తుచేసి బహుజనులను ఒక్కచోటికి చేరు స్తాయి. ఆమె మానవతా వాదం ముందు ప్రతీ ఒక్కరూ బలాదూరే. బహుజన సర్వతో ముఖాభివృద్ధికి ఆమె ఒక ప్రతీక. ఆమె ఒకతరానికి ప్రతినిధి. సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్య శాలి. ఆమె పేరు చాకలి ఐలమ్మ. అయి లమ్మ పుట్టినిల్లు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలో క్రిష్టాపురం అనే చిన్నగ్రామం. పుట్టినిల్లుకు దగ్గరగానే పాలకుర్తి మండల కేంద్రం ఆ వీరనారి మెట్టినిల్లు. రజాకార్లను తరిమికొట్టి ఎరజ్రెండా ఎగురవేసి తెలంగాణ రెైతాంగ పోరుకు కేంద్ర బిందువుగా నిలిచింది పాలకుర్తి. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో అయిలమ్మకు బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ప్రధానంగా వీరికి వారి అత్యంత గౌరవ ప్రదంగా ఆరాధించే చాకలి కులవృత్తే వారికి జీవనాధారం.

ఐలమ్మకు సిద్ధాంతం తెలియదు. కానీ బహుజనులను చీత్కారం చేసిన మొఖా లమీద చీత్కార తుంపురులనే కుమ్మరించిన కల్కి అవతారం ఆమె. కుట్రలు కుతం త్రాలు తెలియవు కానీ బహుజనుల అణచివేతకు ఏర్పడిన గూడుపుఠానులన్నింటినీ ఒక కుదుపు కుదిపిన సాహస వీరవనిత. ఇటువంటి స్త్రీ చెైతన్యమూర్తులు ధెైర్య సాహాసాల వల్లనే తెలంగాణ సాయుధ రెైతాంగపోరాటంతో పాటు మహిళా ఉద్యమం ఎదిగిం ది. పోరాటక్రమంలో మహిళల్లో చెైతన్యం తేవడానికి అనేకమంది కృషి చేసారు. అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’అని ఉత్పత్తికులాల చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీత పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నా రు. దొరా అని పిలువకపోతే ఉన్నతకులాల అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కు లాల మీద ఆ పీడన రూపాలు విరుచుకు పడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి అఘయిత్యం చేయించేవారు. స్త్రీ సాధికారతే స్త్రీ విముక్తికి మంచి ఆయుధమని స్త్రీలు నేడు నమ్మటానికి ఐలమ్మ ఉత్పత్తికులాల వారికి ఒక మంచి ఆయుధమైంది. 
ఈ భూమినాది. పండించిన పంటనాది. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.

నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ. ఆమె నడిపిన కౌల్దారి పోరాటం ప్రజా పోరాటాలకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. భూమి కోసం, భుక్తికోసం వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన వీరతెలంగాణ సాయుధ రెైతాంగ పోరాటంలో అయి లమ్మ చూపిన తెగువ మరువలేనిది. దొరలను ఎదిరిస్తే కష్టా లు తప్పవని తెలుసు. ప్రాణాలు తీస్తారని తెల్సినా పోరాట బాట పట్టింది అయిలమ్మ. ఆ పోరాటంలో తన పేరు చిర స్థాయిగా నిలిచిపోతుందని తన పేరును ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటారని అయిలమ్మ కలలో కూడా ఊహించి ఉండదేమో!.ప్రతి రోజూ అందరికంటే ముందే తనే సూర్యున్ని చూసేది. ఎంతోమందికి మేలు కొలుపు అయ్యేది. ఇంటింటికీ వెళ్లి బట్టలు తీసుకునేది. అరికాళ్లలో రాళ్లు గుచ్చుకున్నా, చంకలో పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా, నెత్తిమీద చద్దికూడు గంప భారం అవుతున్నా, భుజానికున్న మైల పాతల మూట బరువు ఎక్కువ వుతున్నా, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని చాకిరేవుకు సాగిపోయేది.

కడుపులో పేగులు మెలివడుతున్నా, పొదల మాటున పసివాడు పాలకోసం గొంతెత్తి ఏడ్చినా,,, నెత్తిమీద కొంగేసుకొని నిశ్చింతగా తనపని తాను చేసుకునేది. పులిసిన చద్దికూ డులో పచ్చిమిరపకాయ నంజుకుంటూ, సగం పేగులు మాడ్చుకొని భర్తకు చేదోడు వాదోడెై, అర్థాకలి చంపుకొని, తన ఇల్లును బట్టల ఖజానా చేసుకొని, పెైసా పెైసా కూడబెట్టి పాలకుర్తిలో 40 ఎకరాల భూమిని అయిలమ్మ కౌలుకు తీసుకుంది. అది మల్లెంపల్లి భూస్వామి కొండల్‌రావుకు చెందిన భూమి.అందులో నాలుగు ఎకరాలు సాగు చేసింది. ఐలమ్మ కుటుంబం ఈ భూమిలో కష్టపడటం పాలకుర్తి పట్వారీకి గిట్టలేదు. ఆయన పేరు వీరమనేని శేషగిరిరావు. అయిలమ్మ కుటుంబంతో విరోధం పెంచుకుంటాడు. అయిలమ్మే కాదు ఆనాటి అక్కడి ప్రజలు వెట్టికి గురెై స్వేచ్ఛగా జీవించలేని పరిస్థి తులు ఏర్పడ్డాయి. దొరోడు తన ఇంట్లో పెండ్లికి అట్టహాసంగా ఊరిప్రజలతో వెట్టిచాకిరి చేయించేవాడు. ఉత్పత్తి చేసే సామా న్య జనులకు కేవలం జొన్న సజ్జగటుక కూడా దొరక నిచ్చే వారు కాదు. పాలకుర్తి పట్వారీ అయిలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పని చేయాలని ఒత్తిడి చేశాడు.

కానీ అప్పటికీ ఆంధ్ర మహాసభ తనలో నింపిన చెైతన్య స్ఫూర్తితో పని చేయడానికి నిరాకరించింది. అయి లమ్మను ఎలాగెైనా లొంగదీసుకోవాలని భూస్వాములు కుట్రలు చేశారు. వారు చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఆనాటి దొరలకు అధికార దర్పాలు ఎక్కువగా ఉండేవి. మీకు కట్న కానుకలు ఎందుకివ్వాలి?. మీఇంట్లో వెట్టి చాకిరి ఎందుకు చేయాలి? ఈప్రశ్నల పరంపరలో వీరోచితంగా పోరాడిన వీరవనిత చాక లి అయిలమ్మ. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూని స్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయిన ప్పటికీ కోర్టులో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌ పట్వారిని పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించు కున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్‌ పంపాడు. 

ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, బయటి గ్రామాలనుండి వచ్చిన నాయకులు అయిలమ్మతో సహా పొలం దగ్గర కూర్చున్నారు. పంటను ధ్వంసం చేయాలని, లేదా కోసుకెళ్లాలని వచ్చిన గూండాలను ఎదిరించారు. ఆ గూండాలపెై అయిలమ్మ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వెల్లగక్కింది. తాను బతికి ఉన్నంత సేపు భూమి, పంట మీకు దక్కదని కొంగును నడుముకు చుట్టి ఆవేశ పూరితంగా మాట్లాడింది. ఈ చెైతన్యపు తాకిడికి గూండాలు వెనుదిరిగారు. వరిపంట కోసి, వరికట్టలు కొట్టి ధాన్యాన్ని అయిలమ్మ ఇంటికి చేర్చారు. భంగపాటుకు గురెైన దేశ్‌ముఖ్‌ మరోసారి పోలీసులను ఆశ్రయించి తన పంట ను, ధాన్యాన్ని కమ్యూనిష్టులు దోచుకెళ్లారని నాయకులపెై స్థానికులపెై కేసులు పెట్టిం చాడు. కమ్యూనిస్టు నాయకత్వం చొరవ, కొండా లక్ష్హణ్‌ బాపూజీ సహకారంతో అయిలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది. రజాకార్ల ఉప సేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. దేశ్‌ముఖ్‌ పాలకుర్తిపెై దాడులు నిర్వహించి, ఇండ్లను బూడిద చేయించాడు. జీవంజి సోమయ్య, నర్సయ్యలను సజీవదహనం చేశాడు. అయిలమ్మ ఇంట్లోఉన్న సరుకులు ఎత్తుకెళ్లారు. అయి లమ్మ కుమార్తె సోమనర్సమ్మపెై అత్యాచారానికి పాల్పడ్డారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు. అన్నీ కోల్పో యిన అయిలమ్మ ఒక్కచిత్తం చేసుకొంది. ‘ఈ దొరగాడు ఇంతకంటే ఇంక నన్ను ఏవిధంగా నష్టపెట్టగలడు’ అని తనలో తాను ప్రశ్నించుకొన్నది.

kanakaiya
నీ దొరోడు ఏం చేస్తాడ్రా’ అని మొక్కవోని ధెైర్యంతో రోకలి బండ చేతబూని గూండాలను తరమి కొట్టిన నారీమణి అయిలమ్మ. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరిన సాహసి. పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఇంటిని కూల్చి మొక్కజొన్న పండించిన ఘనత మరువలేనిది. అయిలమ్మ భూపోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపెై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. అలాగే 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. అయిలమ్మ భూపోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన అయిలమ్మ సెప్టెంబర్‌ 10, 1985న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో అయిలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనం సిపిఎం వారు నిర్మించారు. నేడు జరుగుతున్న భూపోరాటాలకు చాకలి అయిలమ్మ చేసిన భూపోరాటం మాతృక అని చెప్పవచ్చు. ఇంకా ఉత్పత్తికులాల ఉత్పత్తిని దోపిడి చేస్తున్న గుత్తదార్లను, బ్రోకర్లను భూస్థాపితం చేయటానికి అయిలమ్మను స్ఫూర్తిగా తీసుకొని పోరాటం కొనసాగించాలి. 

సెప్టెంబర్‌ 10 చాకలి అయిలమ్మ వర్ధంతి

Namasete Telangana News Paper Dated : 09/09/2012

సంచారజాతుల స్థానం ఎక్కడ? --- బుద్ధారం రమేష్




భారతదేశం సకల జనుల సమ్మేళనం. విభిన్న జాతులు,మతాలు భాషల సంస్కృతుల సమ్మిళితం.అయితే కొందరు రాజభోగాల్లో తులతూగుతుంటే, మరికొందరు కటిక దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. 65 వసంతాల స్వతంత్ర భారతం అసమానతలను, వివక్షను, అణచివేతను అరికట్టలేకపోతున్నది. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు, నిధుల కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయి. దేశం సాంకేతికపరంగా ఎంత ముందుకు దూసుకెళ్లినా సామాజిక సమానత్వం సాధించడంలో వెనకపడిపోయిం ది. ఎన్నోఏళ్లుగా ఆంగ్లేయుల పాలనలో నేరస్త జాతులుగా అపకీర్తి మూటగట్టుకొ ని స్వతంత్ర దేశంలో విముక్త జాతులు/సంచార జాతులుగా పిలవబడుతున్న కులాలు, అభివృద్ధికి నోచుకోక కొన్ని అవసాన దశలో కొట్టు మిట్టడుతున్నాయి. తరాలు మారినా వీరి తలరాతలు మారడం లేదు. 1952లో నేరస్థ జాతుల చట్టం నుంచి విముక్తి పొందిన ఈ తెగలన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో చేర్చబడ్దాయి. బాలసంతు, బహురూపి, బందర, బుడబుక్కల, దొమ్మర,గంగిడ్ల వారు, జంగం, జోగి,కావటిపాపల, కొర్చ, మొండివారు, మొండిబండ, బండ, పిచ్చకుంట్ల, వంశరాజ్, పాముల, పార్థి, నీర్ షికారి, పంబాల, దమ్మలి, పెద్దమ్మలవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలవాండ్లు, వీర ముష్టి, నెత్తికోటల, వీరభవూదీయ, గుడాల, కంజరబట్ట, రెడ్డిక, మొండిబట్ట, నొక్కర్, పరికి ముగ్గుల, యాత, చొపమెరి, కైకాడి, మందుల, మేథర్, కూపపులి, పొందర, పట్రా, కురాకుల, సిక్లిగర్, పూసల, కెట్లు, గుడియా జక్కల, గుడ్ది ఎలుగువాళ్లు, బుడ్ బుడ్కలవాళ్లు, తేరుగాడు, డీరా ఫకీర్లు, బొంతల ఇలా ఇంకె న్నో కులాలను బీసీ జాబితాలో చేర్చారు. రెడ్డిక, తోట నాయక్, సుగాలి,యనాది, దొంగ యానాది, రెడ్డి యానాది, కొండ దొర, దొంగ యెరుక, లంబాడాలను ఎస్టీ జాబితాలో, అనిపి మాల, యెదురుపాక మాల, అన్నబోయిన మాల, రెల్లి, దొంగ మాలలను ఎస్సీ జాబితాలో చేర్చారు.వీరి వర్తమాన పరిస్థితులు దినదిన గండంగా తయారయ్యాయి. బుక్కెడు బువ్వ కోసం పడరానిపాట్లు పడుతున్నారు. బాలసంతు, బహురూపి కులస్తులు బహుళ కలల ద్వారా ప్రజలకు వినోదాన్ని కలిగించే వీరి వృత్తి కనుమరుగైపోయింది. ఇప్పు డు వారు ఏవిధంగా బతుకుతున్నారో తెలియదు. దొమ్మరి విద్యలు దుమ్ము రేపే వి. వీరి విన్యాసాలు ఒలింపిక్ ఆటలను తలపించేవి. ప్రస్తుతం వీరిలో చాలామంది జీవనాధారం లేక పడుపు వృత్తిని ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. బలమైన ఇను ప ముక్కను తమ సమ్మెట పెట్టుతో అందంగా తీర్చిదిద్దే బహిర్ కమ్మరులు తమ జీవితాలను దిద్దుకొలేకపోయారు. గంగిడ్ల వారి గోవులు గుమ్మాలు తొక్క టం మానేశాయి. శైవ మత ప్రచారంలో తరించిన జంగం, జోగి కులాల వాళ్లు బిక్షగాళ్ళుగా మారిపోవాల్సి వచ్చింది. బందర కులస్తులు బందిపోటు దొంగలుగా ముద్రవేయబడ్డారు. బుడబుక్కల కులస్తులకు యాచక వృత్తే జీవనాధారం అయింది. జక్కుల వాళ్లు చెప్పే పురాణకథలు, భాగవతాలు, వినే ఓపిక తీరిక జనా ల్లో ఎపుడో నశించింది. పూసల వాళ్ళు పనిలేని వాళ్లు అయ్యారు. దాసరులవి వలస బతు కులు అయ్యాయి. డక్కలొల్లు దిక్కులేని వాళ్లయ్యారు. కాటిపాపల వాళ్లు కానరాకుండపోయారు. విద్యా, వైద్యం, ఉపాధి వీరికి అందని ద్రాక్షలే. ఆధునీకరణ, ప్రపంచీకరణ, నూతన పారిక్షిశామికీకరణ దెబ్బతో వీరి జీవితాలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. ఎన్నో కులాలు నిర్వీర్యమైపోయాయి. మరికొన్ని అంతరించిపోయాయి. లక్షలాది కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి.

రాష్టంలో వీరి పరిస్థితి ఈ విధంగా ఉంటే పభుత్వాలు మాత్రం తమ కు ఏమి పట్టనట్టు హామీలు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నాయి. ఎన్నికల సమయానికి ఎక్కడున్నా జనాల్ని వెతికి పట్టుకొచ్చి ఓట్ల జాతర కానిస్తున్నాయి. రాష్టంలో ఈ జాతుల హక్కుల కోసం పని చేస్తున్న సద్భావన ఫౌండేషన్ సంస్థవారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరడ్డితో పలుమార్లు చర్చించారు. ఈ జాతుల అధ్యయనానికి రాష్ట్రంలో ప్రత్యేక కమిషన్‌ను, వీరి ఉపాధి కల్పనకు ప్రత్యేక ఫెడరేషన్‌ల స్థాపనకు హామీ ఇచ్చారు. ఆ హామీలన్నీ అలాగే మిగిలిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదు. దేశంలో మొదటిసారిగా ఈ జాతుల సమస్యలపై గళం ఎత్తిన ఘనత మానవ హక్కుల కార్యకర్త, రచయిత్రి మహాశ్వేతదేవికే దక్కుతుంది. ‘డి నోటిఫైడ్ ట్రైబ్స్ రైట్స్ యాక్షన్ గ్రూప్’ పేరుతో ఒక సంస్థను స్థాపించి ఆ జాతుల హక్కుల కోసం ఆమె పోరాటం చేస్తూ 1990లో మొదటిసారిగా సంచార విముక్త జాతుల ఉనికి గురించి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రొఫెసర్ గణేష్ డెవి, ప్రొఫెసర్ రామకృష్ణాడ్డి, ప్రొఫెసర్ ఆశీర్వాదం ఈ జాతుల సమస్యలపై తమవంతు కృషి చేశారు. వీరి కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం 2006లో బాలకృష్ణ రెనకె అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఆయా జాతుల సామాజిక ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసి విలువైన సిఫార్సులను చేసింది. ఈ జాతుల వారు అత్యంత నిరుపేదలని, కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని, అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవ నం సాగిస్తున్నారని వివరించింది. ఈ మధ్యకాలంలో బాలకృష్ణ తమ కమిషన్ ప్రతిపాదించిన సిఫార్సులు అమలుకావడం లేదని, ప్రభుత్వం వారికి కేటాయించిన నిధులను వారి సంక్షేమానికి ఖర్చు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.

ఏదైనా జాతి అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉన్నప్పుడే అది సాధ్యం. కానీ రాష్ట్రాల వారీగా, దేశవ్యాప్తంగా జాతులకు సంబంధించిన లెక్కలు సమాచారం ప్రభుత్వాల దగ్గర లేకపోవడం విడ్డూరంగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే స్వాతంవూత్యానంతరం ఈ జాతులపైన ఎలాంటి సమగ్ర అధ్యయనం జరగలేదు. దేశం వైజ్ఞానిక రంగంలో సాధించి న పురోగతి సామాజికశాస్త్ర పరిశోధనలో సాధించలేదన్నది అక్షర సత్యం. దేశంలో ఎన్నో ప్రతిష్టాత్మక సామాజిక పరిశోధక సంస్థలు వె లిశాయి. అయినప్పటికి వారి దృష్టి ఈ జాతులపై లేకపోవడం శోచ నీయం. భారత సామాజిక పరిశోధన మండలి అనేది దేశంలో సామజిక పరిశోధనలకు పెద్దపీట వేసే ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థ ఈమధ్య కాలంలో ఈ జాతులపై పరిశోధనలకు నిధులు కేటాయించడం శుభ పరిణామం. ఐతే కొంత కాలంగా హైదరాబాద్‌లోని సామాజిక అభివృద్ధి మండలి (సి.ఎస్.డి), ముంబాయిలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, అలాగే మరికొన్ని విశ్వవిద్యాలయాలు ఈ జాతులపైన పరిశోధనకు పూనుకోవడం హర్షించదగిన పరిణామం. ఇప్పటికైనా ప్రభుత్వాలు సంచార జాతు ల పట్ల నిర్లక్ష్య ధోరణిని విడనాడాలి. రెనకె కమిషన్ సిఫారసును అమలు చేయాలి. ఈ జాతులపై ఆంగ్లేయుల కాలం నుంచి జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలి. స్వతంత్ర దేశంలో ప్రతి ఒక్కరికీ సమ న్యాయం, అభివృద్ధి ఫలాలు సమంగా అందేలా చూసే బాధ్యత పాలకులపై ఉన్నది.

-బుద్ధారం రమేష్ 
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, హైదరాబా

Namasete Telangana News Paper Dated : 09/09/2012 

సెప్టెంబర్ 17: దురాక్రమణే---నలమాస కృష్ణ




తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం అనే పేరుతో చీకటి బాటలు వేసిన 194pandu సెప్టెంబర్ 17కు చరివూతలో ప్రాముఖ్యం ఉన్నది. ఈ రోజును పాలకవర్గాలు, ప్రజలు భిన్న కోణాల నుంచి చూస్తున్నారు. కనుకనే విలీనమా? విద్రోహ మా? విమోచనా? అనే దానిపై ఇంకా చర్చ జరుగుతున్నది. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత సైన్యాలకు లొంగిపోయిన రోజు గా, బ్రిటిష్ పాలన అనంతరం సంస్థానాల మహా సమ్మేళనంగా రూపుదిద్దుకుంటున్న భారత్ యూనియన్ కోసం తన మొదటి సైనిక చర్య హైదరాబాద్‌పైనే జరి పింది. దీన్ని భారత పార్లమెంటరీ వ్యవస్థ కుట్రలో భాగం చేసిన రోజుగా చెప్పు కో వచ్చు. వెట్టిచాకిరికి, భూస్వామ్యానికి, ఎదురు నిలిచి పోరాడుతున్న ప్రజలను అణచివేయడానికి, రాజకీయ వ్యవస్థీకృత నియంతృత్వానికి చట్టబద్ధమైన హక్కు పాలకవర్గం పొందిన రోజుగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా..ఎన్ని భిన్న పార్శాలున్నప్పటికీ సారాంశంలో ప్రజలపై ‘ఆపరేషన్ పోలో’ పేరిట క్రూరదాడికి నాంది పలికిందనేది కాదనలేని సత్యం. నేడు తెలంగాణ ప్రజలు చేస్తున్న ప్రజాస్వామిక పోరాట దృక్పథం నుంచి చూస్తే మాత్రమే నాటి దురాక్షికమణను, దానికి గల ఉద్దేశ్యాలను సరిగ్గా అర్థం చేసుకోగలం.ఒకపార్టీ ముస్లిం రాజుపై హిందూ ప్రజల విజయంగానూ, మరొక పార్టీ స్వతంత్ర దినంగానూ, విలీన దినంగానూ చెబుతుంటే, పీడి త ప్రజలకు మాత్రం పీడకలను మిగిల్చిన రోజుగానే కనబడుతున్నది. విమోచన జరిగిందనే వాదన పాలకవర్గాలది మాత్రమే. అప్పుడు విమోచన జరిగితే ఇప్పుడు తెలంగాణ ప్రజలు పోరాటం ఎందుకు చేస్తున్నట్టు? నిజానికి విమోచన దినం గా స్థానం కల్పించడానికి పాలకవర్గం చూస్తున్న రోజు తెలంగాణ ప్రజలు సాధించుకున్న విజయాలు కోల్పోవడానికి దారితీసిన రోజు కాదా? ఇక్కడ ఒక విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవలసిందేమిటంటే తెలంగాణ పేరు వినడం కూడా జీర్ణించుకోలేని చంద్రబాబు లాంటి నియంతలు వేలమంది తెలంగాణ బిడ్డలను పొట్టన బెట్టుకున్న వాడు కూడా తెలంగాణ సాయుధ పోరాట వీరులకు నివాళులు అర్పించడం ఇప్పటి ఓ చారిత్రక విషాదం.


ఇప్పుడు సాగుతున్న తెలంగాణ పోరాటాన్ని అణచివేయడం లో ప్రముఖపాత్ర వహించే వారు కూడా సెప్టెంబర్17న త్రివర్ణ పతాకాలు ఎగురవేసి తెలంగాణ స్వతంత్ర సంబరాలు జరుపుతున్నారు. అంతే కాదు, నాటి సాయుధ పోరాటంలో పాల్గొన్న వారికి సన్మానం చేయడం క్రూర పరిహాసమే. త్యాగాలను కూడా పెట్టుబడిగా మార్చుకోవాలనుకుంటున్న సీమాంధ్ర సంపన్నవర్గం విమోచన సంబరాల్లో భాగం ఎందుకవుతున్నది? ఈ సందర్భంగా మూడు రంగుల జెండాలు ఎగురవేసి సంబరాలు చేయాలనే పాలకవర్గానికి తెలంగాణ ప్రజలకు మధ్య వైరుధ్యం ఉన్నది. తెలంగాణ ప్రజలు తమ మౌలికమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటంలో తమ విముక్తిని చూసుకోకుండా, నాటి సైనిక దురాక్షికమణలో (సైనిక చర్య) విముక్తి చూసుకొమ్మని చెబుతున్నాయి. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకలను కూడా ఘనంగాను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని వివిధ పార్టీలు కోరడం ఇందులో భాగమే. తెలంగాణ సాధన పోరాటాన్ని, భావోద్వేగాలను వక్రమార్గం పట్టించాలనే పాలకుల కుట్రలను ప్రజలు గ్రహించాలి. తెలంగాణ ప్రజలు వీరోచిత త్యాగాలతో నిజాంను కూల్చితే, వంద లాది మంది నైజాంను తలదన్నే నియంతలు ఎలా పుట్టుకొచ్చారనేది నేడు మన ముందున్న ప్రశ్న. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పాలనలో ఉన్న ఆరు వందల సంస్థానాల్లో హైదరాబాద్ అతి పెద్దది. 1946 భారత స్వతంత్ర చట్టం ప్రకారం ఇండియాలోగానీ పాకిస్థాన్‌లోగాని, స్వతంత్ర సంస్థానాలుగా ఉండవచ్చు. లేదా స్వతంత్ర దేశంగా ఉండవచ్చు. దీన్ని అనుసరించి నైజాం ఆజాదీ హైదరాబాద్‌గా ఉంటానని ప్రకటించాడు. కొన్ని సంస్థానాలు స్వతంవూతంగా ఉండడానికి నిర్ణయించుకున్నప్పటికీ 1947 ఆగస్టు నాటికి హైదరాబాద్‌తోపాటు జునాగఢ్- కాశ్మీర్ తప్ప మొత్తం చిన్నా చితక సంస్థానాలు విలీనం అయ్యాయి. జునాగఢ్ సంస్థానం ప్రజల తిరుగుబాటు ద్వారా , కాశ్మీర్ కొన్ని నిర్దిష్ట షరతులతో కూడిన ఒప్పందం ద్వారా భారత భూభాగంలో భాగమయ్యాయి. హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. నిజాం రాజు అటు పాకిస్థాన్‌లోనూ ఇండియాలోను కలవకుండా 1947 నవంబర్ 29 భారత్‌తో యథాతథ ఒడంబడిక చేసుకున్నాడు. దీన్ని ఉల్లంఘించి ఇండియన్ యూనియన్ సైన్యాలు హైదరాబాద్ పై దాడికి దిగాయి. ప్రజలపై దాడులను ఆపుతామనే హామీ ని భారత ప్రభుత్వం నుంచి తీసుకున్న అనంతరం నిజాం తన లొంగుబాటును రేడియో ద్వారా ప్రకటించాడు. దీనిని కూడా కనీసం నిలబెట్టుకోలేని భారత పాలకవర్గం కొనసాగించిన ఆకృత్యాలకు సెప్టెంబర్ 17 తర్వాత జరిగిన దాష్టీకాలకు అంతులేదు. వేలాది మంది ప్రజలు రజాకార్ల ఊచకోత, అత్యాచారాలకు బలయ్యారు. కాశ్మీర్ వలె హైదరాబాద్ ప్రజలకు కనీసం రాజ్యాంగ పరంగానైనా కొన్ని ప్రత్యేక హక్కులు రాలేదు. భారతదేశం నిర్మాణంలో హైదరాబాద్ ప్రజలు ఏనాడు భాగం కాలేదు. అటువంటిప్పుడు నిరంకుశ నిజాం కూడా ప్రజలపై దాడి చేయవద్దన్న విజ్ఞాపనను కూడా గౌరవించని దురాక్షికమణ మనస్తత్వం కలిగిన భారత పాలకవర్గం మనకు కల్పించింది విముక్తేనా?



తమ భూమి, భుక్తి,విముక్తి కోసం పిడికిపూత్తిన ప్రజల చేత గ్రామాల నుంచి తరి మివేయబడ్డ అగ్రకుల దొరలు, భూస్వాములు, జమీందార్లు, జాగీర్‌దార్లకు అండ గా పోలీసు క్యాంపులు పెట్టి చట్టబద్ధ భూస్వామ్యానికి పాదుకొల్పడమేనా తెలంగాణకు జరిగిన విముక్తి? సైన్యాల ప్రవేశంతో ప్రజల్లో చిగురించిన ఆశలను అంధకారం చేసి,గాంధీ టీపీలు, ఖద్దర్ బట్టలతో శాంతి జపం చేస్తూ ప్రజల నెత్తురు తాగారు.1949 ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో నాటి ఉప ప్రధాని సర్ధార్ పటేల్ తెలంగాణను ఉద్దేశించి మాట్లాడుతూ ‘కమ్యూనిస్టుల మూలంగా చైనా, బర్మా ఇప్పటికీ తగలబడిపోతున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి దాపురించే అవకాశం ఉన్నది. కమ్యూనిస్టులు సమస్యలు జఠిలం చేయాలని చూస్తున్నారు. నేనొక్కటి చెప్పదలచుకున్నాను. వారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇక్కడే ఉంటే ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేదిలేదు. ఎందుకంటే కమ్యూనిజం అది ఒక్క హైదరాబాద్ రాజ్యాన్నే కాదు మొత్తం దేశాన్ని విషపూరితం చేస్తుంద’ని విషం గక్కాడు. దోపిడీ పీడనలేని వ్యవస్థ కోసం జరుగుతున్న ప్రజాపోరాటాన్ని దేశాన్ని విషతు ల్యం చేసే చర్యగా భావించిన పటేల్ ప్రకట న వెట్టిచాకిరిని, భూస్వామ్య విధానాన్ని పాలకవర్గ స్వభావాన్ని తెలియచేస్తున్నది. భూమి కోసం, ప్రజాస్వామిక హక్కుల కోసం తెలంగాణ ప్రజ లు చేస్తున్న పోరాటాన్ని నేటి పాలకవర్గం శాంతి భద్రతల సమస్యగా చూడడంలో నాటి పటేల్ చూసిన దృష్టి కోణమే కనిపి స్తున్నది.తెలంగాణ సాయుధపోరాట విజయాలు, ఫలితాలు కోల్పోవలసి రావడానికి దారితీసిన రోజును, ఘోర మారణహోమానికి దారితీసిన రోజును, మిలటరీ, సివిల్ పాలన పేరుతో సీమాంధ్ర ఉద్యోగస్వామ్యం చొరబాటుకు దారితీసిన రోజును సంబరాలు జరపవలసిన బాధ్యత ప్రజలపై ఎందుకున్నదో విమోచనను సమర్థించేవారు ప్రజలకు చెప్పాలి. తెలంగాణ చరివూతను, సంస్కృతిని, భాష యాసలను ఎక్కిరించే సీమాంధ్ర దురంహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారు వాస్తవాలు గుర్తించాలి. తెలంగాణ ప్రజల భవిష్యత్తును సంక్లిష్టంగా మార్చిన ఆధునిక నియంతృత్వ దురాక్షికమణ దాడిని ఎదిరించాలి. సెప్టెంబర్ 17ను దురాక్షికమణ దినంగా జరపడమే అమరవీరుల త్యాగాలకు మనమిచ్చే గౌరవం. నివాళి. ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం, సమానత్వంతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఈ ప్రాంత ప్రజలకు విమోచన, అంతవరకు దాని కోసం పోరాటం తప్పదు.

-నలమాస కృష్ణ
తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రధానకార్యద

Namasete Telangana News Paper Dated : 09/09/2012

Friday, September 7, 2012

సబ్ కోటాల్లేని సబ్‌ప్లాన్లు వృథా! - కృపాకర్ మాదిగ



ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అనేది మాలవారి అభివృద్ధి ప్రణాళిక. మాల సంఘాలు, మాల మేధావుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సబ్‌ప్లాన్‌పై తన తుది నివేదికను ముఖ్యమంత్రికి ఇటీవల సమర్పించింది. ఈ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు త్వరలో శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది.

ప్రతి ప్రభుత్వ శాఖ తన బడ్జెట్ నుంచి ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం 17 శాతం, ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం 7 శాతం నిధులను వారి సంక్షేమం కోసం ఖర్చు చెయ్యాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. కాగా, ఆధిపత్య కులాల ప్రభుత్వాలు గత ఇరవయ్యేళ్ళుగా తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేశాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని దైవాదీనంగా, గాల్లో దీపంగా మార్చేశాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చెయ్యాల్సిన ఇరవై వేల కోట్ల రూపాయలకు పైన నిధులను పక్కదార్లు, తప్పుదార్లు పట్టించాయి.

ఫలితంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం బక్కచిక్కింది. నీరసించింది. రోగగ్రస్తమైంది. ఆకలితో మాడింది. గూడేల్లో, తండాల్లో ఖర్చుపెట్టాల్సిన సొమ్మును చివరికి రింగురోడ్ల నిర్మాణానికి, కాలుష్య నివారణ మొదలైన వాటికి ప్రభుత్వాలు దానం చేసేసాయి. ప్రభుత్వాల ఈ బాధ్యతా రాహిత్య పరిస్థితుల నేపథ్యం నుంచే ఎస్సీల నిధులు ఎస్సీల సంక్షేమం కోసమే ఖర్చు చెయ్యాలని, ఎస్టీల నిధులు ఎస్టీల సంక్షేమం కోసమే ఖర్చు చెయ్యాలనే డిమాండ్లు వచ్చాయి. వీటి ఫలితంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం నోడల్ ఏజెన్సీ, సబ్‌ప్లాన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లు ముందుకొచ్చాయి.

ఇప్పుడున్న ప్రతిపాదిత రూపంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్లు అమలు జరిగేటట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 61 ఎస్సీ కులాల్లో మాల కులం మినహా మిగిలిన 60 ఎస్సీ కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇందుకు కారణం మాల కులం, లంబాడి తెగ సింహభాగం రిజర్వేషన్లు ఇప్పటికే పొంది, ఎస్సీ, ఎస్టీల మధ్య బలమైన సమూహాలుగా తయారయ్యాయి.

ఇదే సమయంలో ఎస్సీల్లో మెజారిటీలైన మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల, మాష్టి, రెల్లి, మెహతార్, పాకి, పంచమ, గొడగలి, గొడారి, బుగజంగాలతో పాటు అనేక కులాల వారు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లు పొందటంలో మాల కులంతో పోలిస్తే పూర్తిగా లేదా చాలా వెనుకబడిపోయారు లేదా అణచివేతలకి గురయ్యారు. ఇదే మాదిరి పరిస్థితులు ఎస్టీల్లోనూ ఉన్నాయి. లంబాడి, బంజారా, సుగాలీ, ఎరుకల జాతులు సాపేక్షికంగా అభివృద్ధి చెందగా యానాదులు, చెంచులు, కోయలు మొదలగు 34 జాతులు పూర్తిగా లేదా చాలా వెనుకబడిన పరిస్థితుల్లో అణగారిపోయి ఉన్నారు.

మంత్రివర్గ ఉపసంఘం ఇప్పుడు రూపొందించిన సబ్‌ప్లాన్ ఉన్నది ఉన్నట్లుగా అమలుజరిపినట్లయితే, ఎస్సీలోని మాల, మాల దాసరి, ఆదియాంధ్ర మాల, ఎస్టీల్లోని లంబాడి, ఎరుకల మొదలగు తక్కువ పరిమితి సంఖ్య కలిగిన కులాల, జాతుల చేతుల్లోకే మొత్తం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వెళ్ళిపోయే అవకాశం, ప్రమాదం ఉంది.

ఎందువల్లనంటే, పైన పేర్కొన్న పరిమిత సంఖ్యగల ఎస్సీ, ఎస్టీ కులాలు, తెగలవారు గత 60 ఏళ్ళుగా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లలో సింహభాగం అనుభవించి దళిత కులాలు, ఆదివాసీ తెగల మధ్య ప్రభావశీలమైన శక్తి కలిగిన కులాలు, జాతులుగా మారారు.

ఈ పరిస్థితుల్లో సబ్‌ప్లాన్‌లో ప్రణాళికాబద్ధమైన శాశ్వత సబ్ కోటాలు విధించాలి. రాష్ట్రంలోని 61 ఎస్సీ కులాలకు, 35 ఎస్టీ తెగలకు ఆయా అన్ని కులాల, జాతుల, తెగల జనాభా నిష్పత్తులకనుగుణంగా సబ్‌ప్లాన్ నిధుల పంపిణీలో న్యాయం జరిగేలా చూడాలి. ఇందుకు ప్రతిపాదిత సబ్‌ప్లాన్ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చెయ్యాలి.

సబ్‌ప్లాన్ ప్రతిపాదనలు పైన పేర్కొన్న అర్థవంతమైన రీతిలో ఉండేటట్లు ముఖ్యమంత్రి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇలా జరగకపోతే, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అన్నట్లు, 'నిండేటోన్ది నిండుతుంది, ఎండేటోన్ది ఎండుతుంది' అన్న చందంగా ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ సమూహాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలు మరింత పెంచి పోషించటానికి కారణమౌతుంది. 

కాబట్టి 2011 లేదా 2001 జనాభా లెక్కలననుసరించి ప్రతి ఎస్సీ, ఎస్టీ (61+35=96) సమూహానికీ ఈ సబ్‌ప్లాన్ నిధులు అందేవిధంగా స్పష్టమైన, న్యాయబద్దమైన చట్టాన్ని చెయ్యాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. అంతే తప్ప, గంపగుత్తగా - ఉమ్మడిగా - ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం తెచ్చినందువల్ల బలమైన నాలుగైదు కులాలు, జాతులకు మినహా, మిగిలిన మెజారిటీ ఎస్సీ, ఎస్టీ జాతులు, కులాలన్నింటికీ ప్రభుత్వమే ద్రోహం చేసినట్లవుతుంది.

కొత్తగా రూపొందించబోయే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి నమూనాగా, మార్గదర్శకంగా 1997 డిసెంబర్ 16న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన 183వ నంబరు జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి. జనాభా దామాషాను లెక్కించడానికి ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. 2011 లేదా 2001 జనాభా లెక్కల ప్రకారం సదరు జిల్లాలోని ప్రతి ఎస్సీ కులం జనాభా నిష్పత్తి, ప్రతి ఎస్టీ జనాభా నిష్పత్తి ననుసరించి స్వయం ఉపాధి పథకాలు, ఇళ్ళ స్థలాలు, పేదరిక నిర్మూలనా పథకాలు, వ్యవసాయ భూములు, పారిశ్రామిక భూముల కేటాయింపు మొదలైన పథకాలను ఈ సబ్‌ప్లాన్ చట్టం ద్వారా అందించాలి.

ఈ విధమైన అర్థంతోనే సబ్‌ప్లాన్ చట్టాన్ని చెయ్యాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధిపతులు నిర్దిష్టంగా కులం, తెగ, గ్రామం, కుటుంబం, వ్యక్తి స్థాయిలో ప్రతిపాదిత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలి.

అప్పుడు మాత్రమే సబ్‌ప్లాన్ చట్టం తేవాలి. సబ్‌కోటాలు లేని సబ్‌ప్లాన్ (ఉమ్మడి) చట్టం వలన మాలలు, లంబాడి, వంటి కొన్ని, కొద్ది కులాలు, తెగలకు అర్హతకు మించి లాభం కలుగుతుంది. మెజారిటీ ఎస్సీ కులాలకు, ఎస్టీ తెగలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అశక్తులైన సమూహాలకు తీవ్ర నష్టమే కాదు, పెను ప్రమాదం కూడా. ప్రభుత్వం ఈ ఆంతరిక వ్యత్యాసాలను సరిదిద్దే సక్రమ, న్యాయ చర్యలకు సిద్ధమౌతుందని ఆశిస్తున్నాం.
- కృపాకర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి

Andhra Jyothi News Paper Dated: 08/09/2012

ప్రాణాలు తీసేందుకే ప్రాజెక్టులా? ---జంజర్ల రమేష్‌బాబు



విధ్వంసం, నిర్బంధం పాలనా విధానంగా మారిన కాలంలో మనం ఉన్నాము. ఒక జాతిని మరొక జాతి పీడించే దురన్యాయానికి ఆమోదం లభించే అప్రజాస్వామిక పాలనకు సజీవ సాక్షీభూతులుగా బతుకుతున్న సమాజం మనది. లేకపోతే మూడు లక్షల మంది ఆదివాసులను, లక్షా యాభై వేల ఎకరాల భూమిని, 400 గ్రామాలను, వేలాది ఎకరాల రిజర్వుఫాస్ట్‌ను, పరిసరాలతో తరాలుగా పెనవేసుకున్న అనుబంధాన్ని తెంచివేస్తూ ‘ప్రపంచ ఆదివాసీ దినం’ సందర్భంగా, ఏ చట్టబద్ధ అనుమతులు లేకున్నా పోలవరం ఆపే ప్రసక్తే లేదు’ అని మాట్లాడటం ఊహించగలమా? రాజ్యాంగం కల్పించిన అన్నిరకాల హామీలను, రక్షణలను, హక్కులను బేఖాతరు చేస్తూ ముఖ్యమంత్రి పోలవరాన్ని నిర్మిస్తానని అంటున్నారు. ప్రాజెక్టు నిర్మించడం ద్వారా ఆదివాసులను, దేశాన్ని అభివృద్ధి చేస్తామనే వాళ్ళు దేన్ని అభివృద్ధిగా పేర్కొంటున్నారు? దానికి కొలమానం ఏమిటి? మానవీయ స్పందనను, ప్రజాస్వామిక స్ఫూర్తిని కోల్పోయిన మన ప్రభుత్వాలు ఏ విలువల వైపు పయనిస్తున్నాయి?

తాను తిరగాడే నేలను, బతుకుతెరువునిస్తున్న ప్రాంతాన్ని, పెంచుకున్న అనుబంధాన్ని తెంచుకుని నిర్వాసితుడు కావాలని ఏ మనిషి కోరుకోడు. అందులోనూ అడవితో జీవనం ముడిపడి ఉన్న ఆదివాసులు అసలే కోరుకోరు. కట్టూ,బొట్టూ,కట్టుబాట్లలో వైవిధ్యం కలిగిన ఆదివాసులకు తాము నిర్మించుకున్న ప్రపంచం అంటూ ఒకటి ఉంటుంది. వారికి ఒక ఆవరణం ఉంటుంది. రాజ్యాంగం ద్వారా వారి హక్కులను కాపాడుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వారికి ప్రధాన శత్రువై ఆదివాసీ జాతి అంతానికి కోరలు చాస్తున్నది. పోలవరాన్ని నిర్మించడం ద్వారా వారి సంస్కృతి, సంప్రదాయాలను, అస్తిత్వాన్ని రూపుమాపే కుట్రకు పాల్పడుతున్నది. 

ప్రభుత్వ అంచనాల ప్రకారమైనా, ‘సెస్’ రిపోర్టు ప్రకారమైనా, ఆంధ్రవూపదేశ్‌లో 276 గ్రామాలు, ఒడిషాలో 24, ఛత్తీస్‌గఢ్‌లో 12 గ్రామాలు, లక్షా యాభై వేల ఎకరాల భూమి 8 వేల ఎకరాల రిజర్వుఫాస్ట్, అరుదైన జీవజాతులు, ఔషధమొక్కలు, పేరాంటాలపల్లి, పాపి కొండలు లాంటి రమణీయ ప్రాంతాలు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా మునిగిపోనున్నాయి. ఇంతచేసి ప్రభుత్వం సాధించే డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా సాగులోకి వచ్చే వ్యవసాయ భూమి ఎంత? ప్రభుత్వం చెపుతున్నట్టుగా ఏడు లక్షల ఇరవై ఒక్కవేల ఎకరాలు అంకెల గారడీ మాత్రమే! తీరవూపాంతంలో నెలకొల్పుతున్న ‘ఇండవూస్టీయల్ కారిడార్’కు నీటిని అందించడం ద్వారా బహుళజాతి కంపెనీల ప్రయోజనాలు కాపాడడం కోసమే. అభివృద్ధి అంటే ప్రకృతివనరులు, వృక్షసంపద, జంతుసంపదలు నాశనం చేయడం కాదని, అలాగే ఒక వర్గం ప్రజల ఆదాయ అవకాశాలను మెరుగుపరచడం కోసం ఇతర ప్రాంతాల ప్రజల భవిష్యత్తును బలి పెట్టడం కాదని అంతర్జాతీయ ప్రాజెక్టుల కమిషన్ తేల్చిచెప్పింది. ప్రజలలో ’భారీ నిర్మాణాల’పట్ల ఉన్న ఆరాధనాభావం వారి అవినీతి కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పిస్తున్నది. కాబట్టి అవి ప్రజలను లబ్ధిపొందే వారిగా, నష్టపోయేవారిగా విభజించడం ద్వారా విద్వేషాలను పెంచుతున్నాయి. అందుకే నిర్లజ్జగా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకుంటున్నది. ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారిపై అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్రలు వేస్తున్నది. ఈ దేశంలో నిరసన తెలపడం కూడా రాజవూదోహాంగా పరిగణించే స్థితి ఉన్నది. ఉద్యమకారులపై రకరకాల చట్టాల పేరిట నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం సాగునీరు, తాగునీరు, అభివృద్ధిలాంటి వాటితోనే ముడిపడి లేదు. ఇది మానవహక్కుల సమస్య. ఇది ఆదివాసుల సమస్య మాత్రమేకాదు, పర్యావరణ సమస్య. రాజ్యాంగం 5,6 షెడూల్డ్ ద్వారా గవర్నరు అధ్వర్యంలో ఆదివాసుల అభివృద్ధిని, వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి గిరిజన సలహామండలి సలహాతో పాలించే వీలు కల్పించింది. 1/70 చట్టం ద్వారా ఏజెన్సీ ఏరియాలో ఆదివాసేతరుల అక్రమ చొరబాట్లను నిషేధించింది. భూముల క్రయ విక్రయాల పట్ల కఠిన వైఖరిని తెలియజేసింది. పెసా లాంటి చట్టం ద్వారా గ్రామసభ ఆ ప్రాంత అభివృద్ధి నిర్ణయించే అధికార కలిగి ఉంటుంది. ఆదివాసులకు అనేక హక్కులు, రక్షణలు ఉన్నాయి. వీటన్నింటిని తుంగలో తొక్కడం ద్వారా ప్రభుత్వం తన దోపిడీ నీతిని బయట పెట్టుకుంటున్నది. నిరంకుశంగా ఏజెన్సీ ఏరియాల్లోకి చొరబడి, ఆ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను, అటవి సంపదను పెట్టుబడిదారులకు, యం.యన్.సి. కంపనీలకు దోచిపె ప్రయత్నిస్తున్నది. 

పోలవరవం నిర్మాణం పట్ల అభ్యంతరాలు కేవలం ఆంధ్రవూపదేశ్‌కే పరిమితమై లేవు. తమ రాష్ట్రాలలోని ఆదివాసీప్రాంతాల మునక పట్ల, వారి నిర్వాసిత్వం పట్ల ఒడిషా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు సైతం అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. 1986 రిపోర్టులో కేంద్ర జల సంఘానికి తెలియజేసిన వివరాల ప్రకారం ఈప్రాజెక్టు సామర్థ్యం 36లక్షల క్యూసెక్కులుగా నిర్ణయించింది. కాని తదనంతరం దానిని 50లక్షల క్యూసెక్కుల సామర్థ్యంగా పెంచబడింది. డిజైన్ మార్చినా దానికి తగిన అనుమతులు తీసుకోలేదని సి.డబ్యూ.సి. దృష్టికి తీసుకురావడంతో నివేదికను తిప్పి పంపడం జరిగింది. 1986లో భారీవరదల కారణంగా (36 లక్షల క్యూసెక్కులు,182అడుగుల నీరు) భద్రాచలం రామాలయం గుడి మెట్ల వరకు మునిగిపోయింది. డ్యామ్ నిర్మాణం తర్వాత 50లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రమాదం ఉంటుందని అంటున్నారు. 2010 అగస్టు 7న నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తీసిన ఉపక్షిగహ చిత్రం 28.5 లక్షల క్యూసెక్కుల నీరు వల్ల 369 గ్రామాలు మునుగుతాయని హెచ్చరించింది. అంటే 50 లక్షల క్యూసెక్కుల నీటితో మునిగే గ్రామాలను ఊహించగలమా? అంతే గాక ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాజెక్టు కింద ఉన్నవూపాంతాలు, 25 నుంచి 30 లక్షల జనాభా, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా కూడా జల సమాధి అవుతుంది. 

అందుకే విధ్వంసకర అభివృద్ధికి సజీవసాక్ష్యంగా నిలుస్తు న్న  Telaపోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసులు మరోసా రి పోరాటానికి సిద్ధమవుతున్నారు. పచ్చికబయళ్ళలో, వెన్నె ల రాత్రుల్లో జరుపుకునే అకాడి పండుగలకు, కొత్తల పండుగలకు, గోదావరి తీరానికి దూరం అవుతామనే అందోళన చెందుతున్నారు. తమ సంస్కృతిని, సంప్రదాయాలను, జాతి ని అంతం చేసే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం, ఆత్మ గౌరవం కోసం పోరాడిన తమ ఆదివాసీ వీరులు రాంజీగోండు, బిర్సాముండా, గుండాధర్, కొమరంభీమ్, సమ్మక్క సారలమ్మల ను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పపూల వనాలలో దాచుకున్న విల్లంబులను తీసేలా తమ ను రెచ్చగొట్టవద్దని హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం పాలకులకు పట్టడం లేదు. పర్యావరణం, జీవావరణం అన్న పదాలు వారికి నచ్చడం లేదు. అభివృద్ధి అంటే అర్థమే నిర్వాసిత్వానికి పర్యాయ పదంగా ఉండటమే నేటి సమాజపు విషాదం. 

-జంజర్ల రమేష్‌బాబు 
పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక ఐక్య పోరాట వేదిక (పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ‘ గిరిజన సంక్షేమ పరిషత్’ చేస్తున్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా

Namasete telangana news papaer date: 2/09/2012 

Thursday, September 6, 2012

పదోన్నతులలో రిజర్వేషన్లు - ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు



పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించి తీరాలి. పౌరులందరికీ ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని కల్పించడానికి మన రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చడంలో భాగమే పదోన్నతులలో రిజర్వేషన్లు... సమానత్వ సాధనకు నిబద్ధమవని ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ అని అభివర్ణించడానికే అర్హమైనది కాదు. 

విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అభ్యుదయ సాధనాలు. ఇది నిర్వివాదాంశం. కొద్దిమంది-అణగారిన, సామాజికంగా అంటరానితనాన్ని అనుభవించిన భారతీయులు-కి, పరిమితంగానైనప్పటికీ సాధికారత కల్పించడంలో రిజర్వేషన్లు విశేష తోడ్పాటు నందించాయి. ప్రవేశ స్థాయి రిజర్వేషన్లతో ఎస్సీలు, ఎస్టీలు విద్యా సంస్థలలో ప్రవేశం పొంది విద్యాధికులు అవుతున్నారు; ప్రభుత్వ వ్యవస్థలోనూ, ప్రభుత్వరంగ సంస్థలలోనూ ఉద్యోగాలు పొందుతున్నారు.

తద్వారా జీవితంలోనూ, సమాజంలోనూ పురోగమిస్తున్నారు. అయితే ఈ అభ్యుదయ విధానాన్ని గత 62 ఏళ్ళలో ఏనాడూ చిత్తశుద్ధితో అమలుపరచలేదు. అమలుపరిచి ఉన్నట్టయితే ఈ 21వ శతాబ్దంలో విద్య, ఉద్యోగాలలో అందరికీ సమానావకాశాలు లభిస్తూ ఉండేవి కావా? మరి పరిస్థితి అలా లేదు.

ఈ వాస్తవం చెబుతున్నదేమిటి? భారత రాజ్యవ్యవస్థ తన రాజ్యాంగ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయిందనే కాదూ? అంతేకాదు, తరతరాలుగా అంతులేని అన్యాయాలకు గురవుతోన్న బడుగు కులాల వారి పట్ల ఉన్నత కులాల వారిలో నెలకొని వున్న చులకన భావం, వివక్షా వైఖరి పూర్తిగా తొలగిపోలేదనే చేదు సత్యాన్ని కూడా విశదం చేస్తోంది. పదోన్నతులలో ప్రమోషన్ల విషయమై ప్రస్తుతం జరుగుతోన్న చర్చలో అదే వివక్షా వైఖరి మరో సారి నిస్సిగ్గుగా వ్యక్తమవుతోంది.

ఉద్యోగాలలో ప్రవేశించేందుకు తోడ్పడిన రిజర్వేషన్ సదుపాయం, ఆ తరువాత పై స్థానాలలోకి వెళ్ళేందుకు అంటే పదోన్నతులకు కూడా ఆసరాగా ఉండాలని అణగారిన వర్గాల వారు ఆకాంక్షిస్తున్నారు. పదోన్నతుల స్థాయిలో కూడా రిజర్వేషన్ సదుపాయం కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి 2007లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులలో రిజర్వేషన్ అమలుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. మాయావతి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

ఆ హైకోర్టు నిర్ణయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం గత ఏప్రిల్ 30న సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లనివ్వడం రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలైన మాయావతి కొద్దిరోజుల క్రితం సభలో ఆ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రధాన ప్రతిపక్షాల నుంచి ఆమె డిమాండ్‌కు పూర్తి మద్దతు లభించింది.

అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్ వారి ఉద్యోగ జీవితంలో ఒక సతార్కిక పురోగతికి తోడ్పడుతుంది. ప్రవేశస్థాయిలో వారికి రిజర్వేషన్ సదుపాయం లభించడానికి ఏవైతే కారణాలో, అవి, పదోన్నతుల స్థాయిలో కూడా వర్తిస్తాయి. నిజానికి వర్తింపచేయాలి కూడా. ఎందుకు? ఆ అణగారిన వర్గాల వారికి సమానత్వం, సామాజిక న్యాయం సమకూర్చడానికి.

సామాజిక అంతరాల మూలంగా ఎదుర్కొంటున్న అన్యాయాలను తొలగించేందుకు, మేధా సామర్థ్యం తక్కువ అనే న్యూన భావనను అధిగమించేందుకు అణగారిన వర్గాల వారికి ప్రవేశస్థాయిలో రిజర్వేషన్లు కల్పించారు. తొలిదశలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను వారు అన్ని దశలలోనూ, ముఖ్యంగా పదోన్నతుల సందర్భంలో ఎదుర్కొంటున్నారనేది ఒక వాస్తవం. భారత రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలను సాధించాలంటే పదోన్నతులలో రిజర్వేషన్లు అనివార్యం.

రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ధి లేదు. కొన్ని సందర్భాలలో ఆ రాజ్యాంగ కర్తవ్యాన్ని పూర్తిగా, ఎటువంటి సంజాయిషీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలనా యంత్రాంగంలో కీలక స్థానాలలో ఉన్న వారి కుల ప్రయోజనాలే ప్రాధాన్యం పొందుతున్నాయి. దీంతో ఎవరిని ఆదుకోవడానికైతే రిజర్వేషన్లను కల్పించారో వారికే ఆ సదుపాయం లభించడం లేదు.

దీంతో రాజ్యాంగ లక్ష్యాలు కేవలం ఉత్త మాటలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బడుగు వర్గాల వారిలో ఉన్న ఒక 'సామాజిక న్యూనతా భావం' అలానే కొనసాగుతోంది. ఆ వర్గాల వారు క్లాస్ 3, క్లాస్ 4 'సేవా' ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వోద్యోగాలలో ప్రాతినిధ్యం విషయంలో మిగతా సామాజిక వర్గాల వారికంటే ఎస్సీలు, ఎస్టీలు బాగా వెనుకబడిపోయారని అధికారిక గణాంకాలే స్పష్టం చేశాయి.

క్లాస్ 1, క్లాస్ 2 ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీయేతర సామాజిక వర్గాలు ముఖ్యంగా అగ్రకులాల వారిదే అప్పుడూ, ఇప్పుడూ పై చేయి; ఇక క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాలలోనూ వారిదే గణనీయమైన వాటా.

ఈ తులనాత్మక పరిశీలనలో ఎస్టీల పరిస్థితి, ఎస్సీల కంటే మరీ ఘోరం. ప్రణాళికా సంఘం నివేదికల ప్రకారం 1971లో క్లాస్ 1 ఉద్యోగాలలో ఎస్సీలు ఇంచు మించు 2.5 శాతం మాత్రమే ఉన్నారు (ఇది, రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన దాదాపు పాతికేళ్ళ అనంతర పరిస్థితి); 2011లో ఈ వాటా 12 శాతానికి పెరిగింది. క్లాస్ 2 ఉద్యోగాలలో 1971లో 4 నుంచి 2011లో 14 శాతానికి పెరిగింది. అదే కాలంలో ఎస్సీల వాటా క్లాస్ 3 ఉద్యోగాలలో 9 నుంచి 15 శాతానికి, క్లాస్ 4 ఉద్యోగాలలో 18 నుంచి 21 శాతానికి పెరిగింది. ఈ వాస్తవం 'క్రింది కులాల వారు' ఎప్పటికీ 'పై కులాల వారికి' సేవలు అందిస్తూనే ఉండాలన్న సంప్రదాయ వైఖరిని ధ్రువీకరిస్తోంది.

ఎస్సీలు, ఎస్టీలకు ఉద్యోగావకాశాలను నిరాకరించేందుకు అనుసరిస్తోన్న ఒక ఉమ్మడి వ్యూహం ఆ వర్గాల వారికి ఉద్దేశించిన పోస్ట్‌లను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో రిజర్వ్ చేసిన బోధనా సిబ్బంది ఉద్యోగాలలో కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే భర్తీ చేయడం జరిగింది.

మిగతావన్నీ ఖాళీగా ఉన్నాయి. అంటే అత్యధిక భాగం భర్తీ కాలేదు. కారణమేమిటి? ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులలో అర్హులైన వారు లభించకపోవడమేననే సమాధానం వస్తుంది. ఇందులో నిజమెంత? చాలా స్వల్పం. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి పట్ల ఉన్న వివక్షే ఆ పోస్టుల భర్తీ పట్ల ఉదాసీనత వహించేలా చేస్తోంది. ఇది వివక్ష కంటే తక్కువేమీ కాదని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ స్పష్టం చేసింది.

ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి 'ప్రత్యేక శ్రద్ధ' తీసుకోవాలని గత విద్యా సంవత్సరంలో యుజిసిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దురదృష్టమేమిటంటే మన రాజకీయ వ్యవస్థ ఇటువంటి వివక్షాపూరిత అంశాల పట్ల కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే శ్రద్ధ చూపుతుంది. దానివల్ల తమ ఓటు బ్యాంకు మరింత పటిష్ఠమవుతుందనే విశ్వాసమే రాజకీయ నాయకులను అందుకు పురిగొల్పుతుంది.

పదోన్నతులలో రిజర్వేషన్లపై చర్చ ప్రారంభమయిందో లేదో మరొకసారి తీవ్ర భయాందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటువంటి పదోన్నతుల వల్ల పాలన 'కుప్పకూలుతుందని', దేశ భవిష్యత్తు తీవ్ర పర్యవసానాలలో చిక్కుకొంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 'ప్రతిభ'కు మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రపంచపు అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలన్న భారత్ స్వప్నం భగ్నమవుతుందని పలువురు వాపోతున్నారు.

నిజానికి ఇటీవలి కాలం వరకు విశ్వవిద్యాలయాలలో 'మెరిట్ ప్రమోషన్'ను ఒక నియమంగా అమలుపరిచేవారు. ఒకరు ఒక స్థానంలో నిర్దిష్ట సంవత్సరాలు ఉన్న తరువాత, మరింత స్పష్టంగా చెప్పాలంటే ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన తరువాత అతనికి లేదా ఆమెకు పై స్థానానికి విధిగా పదోన్నతి కల్పించేవారు. సెలక్షన్ కమిటీ ద్వారా పదోన్నతి పొందలేని పక్షంలో కూడా చిరకాలంలోనే పై స్థానానికి పదోన్నతి పొందేందుకు వారికి హామీ లభించేది. 

ఈ ప్రమోషన్ల వెనుక ఉన్న భావన ఉన్నతమైనది, మానవీయమైనది. ఉద్యోగంలో పదోన్నతి ఒక వ్యక్తి ఆత్మగౌరవభావనను పెంచుతుంది; మరింత ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తుంది. తన విధులను మరింత సమర్థంగా నిర్వహించాలనే ప్రేరణను కల్గిస్తుంది. పదోన్నతితో ఆర్థిక ప్రయోజనాలు ఎలాగూ సమకూరుతాయి గనుక మరింత ఉత్తమ అధ్యాపకుడుగా రూపొందేందుకు సదరు వ్యక్తి తప్పక ప్రయత్నిస్తాడు.

పదోన్నతులలో రిజర్వేషన్ లేకపోతే అణగారిన వర్గాల వారికి ప్రవేశస్థాయిలో లభించే రిజర్వేషన్‌లు సైతం అర్థరహితమైనవని చెప్పక తప్పదు. ఎందుకని? ఒక ఉద్యోగంలోకి ప్రవేశించిన వ్యక్తి, పదోన్నతి లేకపోతే ఉన్నచోటనే ఉండిపోతాడు. అతని జీవితంలో ఎటువంటి ప్రగతి ఉండదు. దీనివల్ల అతను నిరాశా నిస్పృహలకు లోనవుతాడు.

పైపెచ్చు అతను వివక్షలు, వివిధ వ్యతిరేకతల నుంచి బయటపడేందుకు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తి అనే వాస్తవాన్ని విస్మరించకూడదు. కాగా ప్రతిభ తక్కువగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు సరైన ఫలితాలను సాధించలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిరాధారమైన భయం. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.

బెంగళూరు ఐ.ఐ.ఎమ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇఅఖీ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన ఓ బీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థుల మధ్య మార్కుల తేడా కేవలం రెండు శాతం మాత్రమే. 

అలాగే అహ్మదాబాద్ ఐ.ఐ.ఎమ్ నిర్వహించిన అధ్యయనంలో 'రిజర్వ్‌డ్' అభ్యర్థులు సాధించిన మార్కులు 'జనరల్' అభ్యర్థుల కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ, కోర్సు పూర్తయ్యే నాటికి మార్కుల విషయంలోనూ, నియామకాలు పొందే విషయంలోనూ ఈ రెండు వర్గాల అభ్యర్థుల మధ్య ఎటువంటి తేడా ఉండడంలేదు. రిజర్వ్‌డ్ అభ్యర్థులలో ప్రతిభ తక్కువ నేది పూర్తిగా అవాస్తవమని ఈ అధ్యయనాలు స్పష్టం చేశాయి.

స్వాతంత్య్ర ప్రయోజనాలు, అభివృద్ధి ఫలాలలో దేశ ప్రజలందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. ఇది వారి హక్కు. అయితే ప్రస్తుతం చాలా కొద్దిమంది మాత్రమే అభివృద్ధి ఫలాలన్నిటినీ భుక్తం చేసుకొంటున్నారు. దేశ జనాభాలో కేవలం 1 శాతంగానైనా లేనివారు సహజ వనరులన్నిటిపై నియంత్రణ సాధించి 'ఫార్చ్యూన్ 500' జాబితాలో స్థానం సంపాదించుకోవడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాము.

అయితే అణగారిన వర్గాల వారు సమాన అవకాశాల కోసం ఆందోళన చేస్తే దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని వారిని నిందించడం జరుగుతోంది. ఇదెంతవరకు సమంజసం? పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించి తీరాలి. పౌరులందరికీ ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని కల్పించడానికి మన రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చడంలో భాగమే పదోన్నతులలో రిజర్వేషన్లు.

మరి ఈ హామీని నెరవేర్చని పక్షంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థాపకులను వంచించడమే అవుతుంది. ఈ దేశ జనాభాలో అత్యధికులకు రాజ్యాంగ హక్కులను నిరాకరించడమే అవుతుంది. సమానత్వం, సామాజిక న్యాయం అనేవి మన రాజ్యాంగ వ్యవస్థకు పునాదులు. సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి చిత్తశుద్ధితో పూనుకోని పక్షంలో మన రాజ్యాంగ పునాదులు కదిలిపోతాయి. అందరూ సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించాలి. సమానత్వ సాధనకు నిబద్ధమవని ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ అని అభివర్ణించడానికే అర్హమైనది కాదు.
- ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు
వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత్రి హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి. (ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందక ముందే రాసిన వ్యాసమిది)

Andhra Jyothi News Paper Dated : 07/09/2012 

Monday, September 3, 2012

బీసీ ఎజెండా ఫలిస్తుందా? - కంచ ఐలయ్య

బీసీ ఎన్నికల ఎజెండా ఒక రాజకీయ ప్రయోగం. ఇది ప్రజల జీవితాలను ఎంతో కొంత మార్చేది. ఆ మార్పు తేవడానికి రాజకీయ పార్టీలు పోటీపడాలి గానీ ఎత్తుగడలేసి వారిని మళ్ళీ మోసం చెయ్యాలనుకోవడం కుదరదు.

రాష్ట్రంలో బీసీలకు రాజకీయ అధికారంలో వాటా గురించిన చర్చ మళ్ళీ ఊపందుకున్నది. దీనితో పాటు రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు స్పెషల్ ప్లాన్ ఏర్పాటు చేసి బడ్జెట్‌లో వాటా రూపొందించాలనే అంశం కూడా చర్చలో ఉంది. గత ఎన్నికల ముందు కూడా బలహీనవర్గాల సాధికార వేదిక సభలు, సమావేశాలు పెట్టాక బీసీలకు 100 సీట్లు ఇచ్చే అంశంపై చర్చ జరిగింది.

కానీ అప్పుడు అన్ని రాజకీయ పార్టీలను ప్రభావితం చెయ్యకముందే ప్రజారాజ్యం పార్టీ ఒక బీసీల పార్టీగా ముందుకు రావడంతో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చూద్దాంలే అనే ధోరణిని అనుసరించాయి. కానీ 2014 ఎన్నికల నాటికే ఈ అంశాన్ని ఒక కొలిక్కినెట్టకపోతే తెలుగుదేశం పార్టీ ఉనికిలో లేకుండాపోయే దశ వచ్చింది. ఈ దశలోనే మేధావుల ఫోరం బీసీలకు స్పెషల్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది.

ఈ రెండు అంశాలను తమ ఎజెండాగా మలుచుకొని ఎన్నికల రంగంలో దిగకపోతే టీడీపీ బతికి బట్టకట్టలేదేమో అనే దశ వచ్చింది. అందుకే అది 2014 ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు, 10వేల కోట్ల రూపాయల స్పెషల్ ప్లాన్ రూపొందిస్తామని నిర్ణయాత్మకంగా ప్రకటించింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.

ఈ స్థితిలో మిగతా రెండు పార్టీలు - కాంగ్రెస్, వైఎస్ఆర్‌సి- ఈ అంశాలపై తమ నిర్ణయాన్ని చెప్పకతప్పదు. కాంగ్రెస్‌లోని బీసీ వర్గం స్పెషల్ ప్లాన్‌పై మేధావులతో కలిసి కసరత్తు చేసిన మాట వాస్తవం. కానీ పార్టీపరంగా అది ఒక నిర్ణయం తీసుకోలేదు.

ఎందుకంటే ఇప్పటి వరకూ అది ప్రధానంగా 'రెడ్ల' పార్టీగా ఉంది కనుక. జాతీయస్థాయి పార్టీ ఇటువంటి నిర్ణయాన్ని ఒక్క రాష్ట్రంలో తీసుకుంటే దానికి అన్ని రాష్ట్రాల్లో సమస్యలొస్తాయి. వైఎస్ఆర్‌సి కూడా ప్రత్యామ్నాయ 'రెడ్డి' ప్రాంతీయ పార్టీగా రూపొందుతున్నప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఎవరి పార్టీగా ఉండాలనే ప్రశ్న ముందుకొస్తుంది. తెలుగుదేశం ప్రధానంగా కమ్మల పార్టీ అయినప్పటికీ బీసీ, మాదిగల అండతో అది అధికారంలో కొనసాగింది. కానీ ముందు, ముందు టీడీపీ కమ్మల పార్టీగా కొనసాగడం కష్టం.

బీసీల ఆకాంక్ష దినదినానికి పెరుగుతోంది. యు.పి, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో బలమైన బీసీ నాయకత్వం ఎదిగింది. పార్టీ ఏదైనా అక్కడి బీసీ ప్రజల సింబాలిక్ కల పండిందనే భావన ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఆ కల కలగానే మిగిలి ఉంది. కులాలు అభివృద్ధిని కోరుకుంటాయి. అధికారాన్ని కోరుకుంటాయి. తమ సింబాలిక్ నాయకత్వాన్ని కూడా కోరుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొంత అభివృద్ధి ఉంది కానీ అధికారంలో వారికి అర్థవంతమైన వాటా లేదు.

సింబాలిక్ నాయకత్వం అంతకన్నా లేదు. టీడీపీ అధికారంలో వాటా 100 సీట్లతో ఇస్తానంటోంది. అభివృద్ధికి ప్రత్యేక ప్లాన్ రూపొందిస్తానంటోంది. ఆ మేరకు అది ఒక్క అడుగు ముందుకేసినట్లే. అయితే అది మేమూ చేస్తామని కాంగ్రెస్, వైఎస్ఆర్‌సి అనడం సులభమే. ఎందుకంటే పార్టీల మధ్య పోటీ ఒక అంశం చుట్టూ తిరుగుతున్నప్పుడు, అన్ని పార్టీలూ చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలనుకుంటాయి.

ప్రస్తుతానికి చర్చ మూడు అంశాల చుట్టూ ఉంది. (1) బీసీలకు వంద సీట్లు (2) ఈ వంద సీట్లలో అన్ని పార్టీలూ బీసీలనే పోటీ చేయించే విధంగా చూడడం (3) బీసీలకు సీట్లు జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు ఇవ్వడం, ప్రాతినిధ్యం వచ్చే విధంగా చూడడం. ఇందులో మొదటి ప్రతిపాదన టీడీపీ చేస్తే, రెండోది వైఎస్ఆర్‌సి చేసింది. మూడో ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చింది. టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా యాంటీ-బీసీ పార్టీలు కనుక అవి చర్చలో కూడా పాల్గొనడం లేదు అనే అభిప్రాయం ఉంది. కమ్యూనిస్టు పార్టీలు చాలా కాలంగా బీసీలకు సంబంధించిన చర్చకు దూరంగా ఉంటున్నాయి. ఏదేమైనా పై మూడు ప్రతిపాదనలలో ఏది అమలు కాగలిగేది, ఏది కాలేనిది కూడా చూడాలి.

బీసీలకు వంద సీట్లు ఇవ్వాలనే చర్చ 2009 ఎన్నికల నాటి నుంచి ఉంది. బలహీన వర్గాల సాధికారత సంస్థ మీటింగుల తరువాత టీడీపీ వరంగల్‌లో బీసీ సభ జరిపి 100 సీట్లు ఇస్తామనే వాగ్దానం చేసింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ ఆ అంశాన్ని పట్టించుకోలేదు. 2014 ఎన్నికల్లో పోటీ రూపం మారబోతోంది. రాష్ట్రమంతటా ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. తెలంగాణలో నాలుగు పార్టీలు పోటీ పడవచ్చు. ఇప్పుడున్న రూపం చూస్తే అన్ని పార్టీలూ అగ్రకులాల ఆధిపత్యంలోనే ఉన్నాయి.

ఈ చర్చను గ్రామస్థాయి బీసీలు కూడా అందిపుచ్చుకుంటే ఈసారి రాజకీయ పార్టీలన్నీ 100 సీట్లు బీసీలకివ్వకుండా ఉండలేని పరిస్థితి ఉండొచ్చు. ఈ స్థితిని అవసరం రీత్యానైనా టీడీపీ రాజకీయ పార్టీల ముందు ఉంచింది. అలాగే 10వేల కోట్ల రూపాయల స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌కు టీడీపీ కట్టుబడి ఉంటుందనే నమ్మకం బీసీల్లో కలిగితే ఆ పార్టీ పక్కన బీసీలు నిలబడే అవకాశం లేకపోలేదు.

అయితే వైఎస్ఆర్‌సి ఒక ప్రాక్టికల్ పాయింట్‌ను ముందుకు తెచ్చింది. పార్టీలు 100 సీట్లు బీసీలకు ఇచ్చి ఫలితమేమిటి? ఆ వందకు వంద ఓడిపోయే వాటినే ఇవ్వవచ్చు కదా అనేది? ఈ రెండు వాదనలకు ప్రత్యామ్నాయంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జనాభా ప్రాతిపదికన కులాల వారీగా ఇవ్వాలనే ప్రతిపాదన పెట్టారు. కానీ కులాల లెక్కలన్నీ తప్పుడు లెక్కలని చెప్పారు.

సరే లెక్కలు తేల్చవచ్చు అనుకున్నా ఆయన ఆచరణ అనువుగాని ప్రతిపాదన చేశారని భావించేందుకు అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ ముందు 100 సీట్లయినా ఇస్తామని చెప్పకుండా జనాభా ప్రాతిపదికన, కులాలవారీగా ఇస్తామని చెప్పడం ఎలా నమ్మదగ్గది? కాంగ్రెస్ చరిత్రలో ఇప్పటికే ఓడేటివో, గెలిచేటివో 100 సీట్లు ఎప్పుడూ ఇవ్వలేదు. కనుక కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఒక వైఖరి తీసుకొని తమ పార్టీని ముందు 100 సీట్లకు, 10వేల కోట్ల స్పెషల్ బడ్జెట్‌కు ఒప్పించాలి కదా! అలా చెయ్యనప్పుడు వారిని ఎవరు నమ్ముతారు?

ఈ రెండు అంశాలను పక్కకు పెట్టి కాంగ్రెస్ బీసీ వ్యక్తిని 2014 నాటికి ముఖ్యమంత్రిని చెయ్యగలిగే అవకాశమున్న పార్టీ. మరి ఆ పని చేస్తుందా? అలా చేస్తే కాంగ్రెస్‌లో రెడ్లు లేకుండా వైఎస్ఆర్‌సిలోకి జంప్ అవుతారనే భయం దాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎలాగూ దెబ్బతినే పరిస్థితి రాష్ట్రంలో ఉంది కనుక (వైఎస్ఆర్‌సి, టీఆర్ఎస్ ఉనికి వల్ల) సర్వేలన్నీ ఆ స్థితినే సూచిస్తున్నాయి కనుక కాంగ్రెస్ బీసీ కార్డుతో పునఃనిర్మాణానికి పూనుకుంటే చంద్రబాబు కూడా ఇరకాటంలో పడతారు.

జగన్ పార్టీ జగన్‌మోహన్ రెడ్డిని తప్ప మరో ముఖ్యమంత్రిని అంగీకరించదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా బీసీ వ్యక్తిని నియమించి బీసీ నాయకత్వాన్ని పైకి తెచ్చే పరిస్థితి లేదు. మేము గెలిస్తే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రిని చేస్తామని కూడా టీడీపీ అధ్యక్షుడు చెప్పడం లేదు. అంటే ఎంత కాలమైనా టీడీపీ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒక్క టీఆర్ఎస్ నాయకుడు మాత్రం ప్రత్యేక తెలంగాణ ఏర్పడదనే నమ్మకంతో కావచ్చు ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని, ఒక బీసీ (స్వామిగౌడ్‌ను) మంత్రిని చేస్తానని 'చండేశి మంత్రం' చెబుతున్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్.

అందులోని బీసీలు మంత్రులుగా ఉండి రెడ్ల సేవ చేసి, చేసి ఇప్పుడు జైలుకు పోతున్నారనే చర్చ ఉండనే ఉంది. ఈ అన్ని పార్టీలనూ ఇరకాటంలో పెట్టాలంటే కాంగ్రెస్ ఏకంగా బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చెయ్యాలి. అలా చేసి, బీజేపీ గుజరాత్‌ను, మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘ కాలం తమ చేతుల్లో ఉంచుకోగలుగుతోంది. అది ఇక్కడ ఆ పని చెయ్యవచ్చు.

ఎలాగూ కాంగ్రెస్ గానీ, వైఎస్ఆర్‌సి గానీ ఈ అంశంపై ఇనిషియేటివ్ తీసుకున్న పార్టీలు కావు. ఇప్పటికైనా ఇనిషియేటివ్ టీడీపీదే కనుక - అది ఇంకో అడుగు ముందుకేసి మేం సంపూర్ణ మెజారిటీ సాధిస్తే బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తే ఆ పార్టీని ప్రజలు నమ్మే అవకాశముంది. 100 సీట్లు, 10వేల కోట్ల స్పెషల్ బడ్జెట్, ఒకరిని బీసీ ముఖ్యమంత్రి అని తేల్చినట్లయితే చంద్రబాబుకు రాజకీయ సంస్కర్త అనే పేరు దక్కే అవకాశముంది.

అది నామమాత్ర అధికారమా, నిజమైన అధికారమా వేరే విషయం. కానీ అది ఒక బీసీ నాయకుడిని (సింబాలిక్‌గానైనా) ప్రజల ముందు పెట్టకుండా బీసీలు సైతం నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఆ పార్టీపై నమ్మకం కోల్పోయిన వాతావరణం కూడా రాష్ట్రంలో ఉంది. అందుకే ఏ సర్వేలో కూడా తెలుగుదేశం గెలుస్తుందని చెప్పగలిగే ఓటర్లు లేకుండా పోయారు. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో గానీ, ఎన్‌డీటీవీ సర్వేలో గానీ తెలుగుదేశం గుర్తింపు గలిగిన పార్టీగా కూడా కనిపించడం లేదు.

ఈ సర్వేలు ఈ పార్టీ బీసీ ఎజెండానూ, మాదిగ ఎజెండానూ ప్రకటించక ముందు చేసినవో, తరువాత చేసినవో కూడా తెలియదు. ఏది ఏమైనా రాష్ట్రంలో బీసీల స్థితి మారాలంటే వారికో స్పెషల్ బడ్జెట్, 100 సీట్లు (అసెంబ్లీలో ఉండగలిగితే ఇంకా మంచిది) ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి గద్దెమీద కూర్చోబెట్టడం అనివార్యమౌతుంది. ఇందుకు టీడీపీ సిద్ధపడడంఅవసరమౌతుంది. అది దాని చిత్తశుద్ధిని ప్రకటించినట్లవుతుంది.

కరప్షన్ అంశంపై వైఎస్ఆర్‌సిని గానీ కాంగ్రెస్‌ను గానీ బలహీన పరుస్తామనుకుంటే అది సాధ్యం కాదు. ఎక్కడో పైన జరిగిన కరప్షన్‌ను ప్రజలు 'తమ సమస్య'గా చూడడం లేదు. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా కరప్షన్ అంశంపై ఎన్నికల్లో గెలవడమో ఓడిపోవడమో జరగలేదు. నాయకులు, పార్టీలు మాకేం ఇస్తారనే అంశంపైనే ప్రజలు తమ దృష్టిని కేంద్రీకరిస్తారు.

కనుక బీసీ ఎజెండాను ఒక కొలిక్కినెట్టి రాజ్యాధికారాన్ని సాధించుకోవాలంటే ఇంతకు ముందు వారికిచ్చిన రాయితీల కంటే భిన్నమైనవి, నిర్దిష్టంగా వాళ్ళ జీవితాలను ప్రభావితం చెయ్యగలిగేవి నమ్మకంగా ఇస్తారనే ఆత్మవిశ్వాసం వారిలో కలగాలి. గత అనుభవాల వల్లో ఏమో టీడీపీ బీసీ ఎజెండాను ప్రజలు పూర్తిగా నమ్మడం లేదు. వారు ఒక సందిగ్ధ దశలో ఉన్నారు. వారు నమ్మడానికి కొన్ని ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలి. ఇవి వాగ్దానాలను నమ్మే రోజులు కావు. మనుషుల కంచంలో కాసులు కనబడాలి.

పైవాళ్ళంతా తింటారు. తిననియ్యండి. కానీ మాకేం ఇస్తారనేది ఈనాటి విలువ. ఇందులో ప్రజల ప్రాగ్మాటిజం ఇమిడి ఉంది. బీసీలు ఇంతకాలం ప్రాగ్మాటిజానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళూ అలా ఉండదలుచుకోవడం లేదు. కనుక ఏ మార్పు తేవాలన్నా కొన్ని ప్రయోగాలు చెయ్యకతప్పదు. ఈ బీసీ ఎన్నికల ఎజెండా కూడా ఒక రాజకీయ ప్రయోగం. అయితే ఇది ప్రజల జీవితాలను ఎంతో కొంత మార్చేది. ఆ మార్పు తేవడానికి రాజకీయ పార్టీలు పోటీపడాలి గానీ ఎత్తుగడలేసి వారిని మళ్ళీ మోసం చెయ్యాలనుకోవడం కుదరదు.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త