Wednesday, September 26, 2012

రాష్ట్రం ఇవ్వకపోతేనే నక్సలిజం - చిక్కుడు ప్రభాకర్



వాస్తవంగా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే నక్సల్స్ సమస్య ఏర్పడదు. దేశంలో ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేత తీవ్రత వల్లనే ఆ ఉద్యమం పుడుతుంది. జార్ఖండ్‌లోనైనా, పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోనైనా నక్సల్ ఉద్యమం ఉధృతమైంది అవి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి కాదు. బీహార్, మధ్యప్రదేశ్‌లలో అవి అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి 25 ఏళ్ళకు ముందే ఆ ఉద్యమం వేళ్ళూనుకుని ఉంది. 

చిన్న రాష్ట్రాలలో నక్సలిజం పెరుగుతుంది. ఛత్తీస్‌గఢ్-జార్ఖండ్ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతనే అక్కడ నక్సలిజం పెరిగింది. తెలంగాణపై లోతైన అధ్యయనం చేయాలని దేశ హోం శాఖ మంత్రి షిండే చిలుకపలుకులు పలికారు. ఇవి అతని సొంత వాక్యాలు కావు. ఇవి యాదృచ్ఛికం కూడా కావు. ఈ పలుకులు తెలంగాణను నిరంతరం దోచుకుంటున్న సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు నాలుగు దశాబ్దాలుగా వల్లె వేస్తున్న పలుకులే. కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ లోక్‌సభ సభ్యులు లగడపాటి రాజగోపాల్ హోం మంత్రి షిండేకి పంపిన లేఖలోని మాటలుగా భావించవచ్చు

. అలాగే నక్సలిజానికి పుట్టినిల్లు 'ఉత్తరాంధ్ర' అని, నేటికీ ఉత్తరాంధ్ర మొత్తం నక్సలిజం ఆవరించుకుని ఉందనే విషయం ఈ కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతున్నారు. తెలంగాణ మనోభావాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తొలి రోజుల నుంచి తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం, తమకే కావాలని దశాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఒక రాష్ట్ర ఏర్పాటుకు ఇంత సుదీర్ఘమైన పోరాటం జరిగిన ప్రాంతం దేశంలోనే లేదు.

గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో పాటు దేశంలోని వివిధ ప్రజాఉద్యమాలకు 'నక్సల్స్ అనుకూల ఉద్యమాలు'గా ముద్ర వేసి ప్రభుత్వం అణచివేస్తోంది. రైతాంగం, విద్యుచ్ఛక్తి, విత్తనాలు, గిట్టుబాటు ధర అడిగినా, కార్మికులు వేతనాల పెంపుకొరకు, యాజమాన్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడినా, తమ భూములు, తమ నీరు, తమ సంపద తమకే దక్కాలని ప్రజలు పోరాటం చేసినా, వాటిలో నక్సలైట్లు ఉన్నారని ఆరోపణ చేస్తూ పాలకులు తీవ్ర అణచివేతకు పూనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమాన్ని కూడా నక్సల్స్ అనుకూల ఉద్యమంగా ముద్రవే యడం, తెలంగాణ రాష్ట్రమేర్పడితే నక్సలైట్లు పెరుగుతారనే ప్రచారం చేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నవారు సీమాంధ్ర కాంగ్రేస్ నాయకులే. వీరికి ఆ ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం, వైఎస్ఆర్‌సిపి నాయకులు కూడా తోడయ్యారు.

శ్రీకాకుళ పోరాటం తర్వాత సుదీర్ఘకాలం తెలంగాణలో ఈ పోరాటం నడిచిన మాట వాస్తవమే. కానీ నేడు తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం తాత్కాలికంగా 'లోతైన వెనకంజ' వేసింది. నాటి ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నేటి కావూరి, రాయపాటి, లగడపాటిల వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏదుర్కొనేందుకు రెండు వితండ వాదాలను ప్రచారం చేస్తున్నారు. ఒకటి-తెలంగాణ రాష్ట్రమేర్పడితే నక్సలైట్ల సమస్య పెరుగుతుందని, రెండు-తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం దేశ సమగ్రతకు భంగకరమని, పై రెండు విషయాల్లో ఏ ఒక్కటి కూడా శాస్త్రీయమైనది కాదు. వాస్తవంగా చిన్న రాష్ట్రాల్లో మాత్రమే నక్సల్స్ సమస్య ఏర్పడదు.

దేశంలో ఎక్కడైనా ఆ ప్రాంతంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక అణచివేత తీవ్రత వల్లనే ఆ ఉద్యమం పుడుతుంది. జార్ఖండ్‌లోనైనా, పక్కనే ఉన్న చత్తీస్‌గఢ్‌లోనైనా నక్సల్ ఉద్యమం ఉధృతమైంది అవి చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి కాదు. అవి బీహార్, మధ్యప్రదేశ్‌లలో అంతర్భాగంగా ఉన్నప్పటి నుంచి 25 ఏళ్ళకు ముందే ఆ ఉద్యమం వేళ్ళూనుకుని ఉంది. చిన్న రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి మిలటరీ వికేంద్రీకరణ పె రిగి అణ చివేత తీవ్రమయి ఆ ఉద్యమాలు వెనుకంజ వేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఎనిమిది ఏళ్ళ తర్వాత 1964లో మొదలైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం 1968 నాటికి ఉధృత రూపం దాల్చింది. 1969 సంవత్సరం నాటికి తెలంగాణలో దాదాపు సంవత్సరకాలం ప్రభుత్వ వ్యవస్థ పనిచేయలేనంతగా ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్ష వెల్లువెత్తింది. సరిగ్గా అపుడే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలోని మన్నెంలో సాయుధపోరాటం మొదలయింది. 1967 ఫిబ్రవరిలో పశ్చిమబెంగాల్‌లోని 'నక్సల్‌బరి' గ్రామంలో సంతాల్ గిరిజనుల తిరుగుబాటు ప్రేరణతో శ్రీకాకుళ ఉద్యమం వచ్చింది. దేశ వ్యాప్తంగా అనే క ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమాలు వెలిశాయి. ఆ తర్వాత ఆ ఉద్యమంలో వచ్చిన చీలికలు దేశ వ్యాప్తంగా పాయలు, పాయలుగా సాయుధ పోరాటాన్ని నడిపించాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో సాయుధ పోరాటాలు నడిపించిన ఎంసీసీ, పీపుల్స్‌వార్ పార్టీలు విలీనమై సుమారు 31 వేల మంది సాయుధ శక్తితో నేడు దేశంలోనే అతిపెద్ద నక్సలైట్ పార్టీ (సీపీఐ మావోయిస్టు)గా అవతరించింది.

శ్రీకాకుళ పోరాటాన్ని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, హోం మంత్రి జలగం వెంగళరావులు తీవ్రంగా అణచివేశారు. ఆ ఉద్యమ అణచివేతతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని కూడా తీవ్రంగా అణచివేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను నిరంతరం కొనసాగించాలనుకున్న కాంగ్రెసు పాలకులు నేటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగానే తయారైనారు. నాటి శ్రీకాకుళ పోరాటంలో పాల్గొన్న నాయకులలో చారుమజుందార్ అవగాహనను కలిగిన కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని వర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించింది. కానీ చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవ రావు. దేవులపల్లి వెంకటేశ్వర రావు నాయకత్వంలోని పార్టీలు నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యానికి అవరోధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని భావించారు.

తెలంగాణ ప్రాంత భౌతిక పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని ఎంఎల్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బేషరతుగా సమర్థించింది. నాటి నుంచి 1995లో మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలయ్యే నాటికి పీపుల్స్ వార్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల చాలా స్పష్టమైన, లోతైన అవగాహన కలిగి ఉన్నది. తొమ్మిది పార్టీలతో కలిసిన జనశక్తికి కానీ, పైలా వాసుదేవరావు నాయకత్వంలోని న్యూడెమొక్రసీకి కానీ ఈ పోరాటం పట్ల స్పష్టమైన అవగాహన లేదు. వాటికి ఈ ప్రాంత పరిస్థితుల పట్ల స్పష్టమైన అవగాహన లేకపోవడంతో తెలంగాణా ఉద్యమాన్ని వారు సమర్థించలేదు. కానీ, జనశక్తి నుంచి 'కులం' విషయం మీదనే చీలిన నాటి 'మారోజు వీరన్న' నాయకత్వంలోని పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నూతనంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో 'దళిత-బహుజనుల రాజ్యాధికార' లక్ష్యంతో ముందుకు కదిలింది.

మలిదశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతమయ్యే సమయానికి పీపుల్స్‌వార్‌పార్టీ 'గెరిల్లా జోన్ పర్‌స్పెక్టివ్'ను అభివృద్ధి పరుస్తూ, ఉత్తర తెలంగాణను ప్రాథమిక దశకు, దక్షిణ తెలంగాణను సన్నాహక దశకు చేర్చింది. 1997 నాటికి తెలంగాణ అభివృద్ధి మీద ఒక్క స్పష్టమైన 'ప్రజా ప్రత్యామ్నాయం' పేరుతో డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ఆ డాక్యుమెంట్ వెలుగులో విశాల ప్రజారాసులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు వారు పోరాడుతున్నారు. నాడు చండ్రపుల్లారెడ్డి వారసత్వంలోని ఏర్పడిన పార్టీలోని ఒక వర్గం, న్యూడెమొక్రసీ, సిపిఎం,సిపిఐలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించగా, జనశక్తి తన అవగాహనను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించింది. కాలక్రమేణా నేడు ఒక్క సిపిఎం పార్టీ తప్ప, మిగతా కమ్యూనిస్టు పార్టీలన్నీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి ఇతర సంఘాలతో కలిసి పనిచేస్తున్నాయి.

చిన్న రాష్ట్రాలు మిలిటరీ వికేంద్రీకరణకు అనువుగా ఉంటాయని, ప్రజా ఉద్యమాలను సులువుగా అణచివేసేందుకు ఇవి దోహదపడుతాయని సిపిఐ మావోయిస్టు రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ 2010 జనవరిలో ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఈశాన్య భారతదేశంలోని త్రిపుర, మిజోర ం, నాగాలాండ్, అసోం, మేఘాలయ రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఉండడం మూలానే అక్కడి ప్రజాఉద్యమాలను ఆ ప్రభుత్వాలు సులభంగా అణచివేయగలుగుతున్నాయని ఆయన చెప్పారు. సీమాంధ్ర సంపన్నవర్గాల చేతిలో గురవుతున్నందున చిన్న రాష్ట్రమే అయినప్పటికీ ప్రత్యేక తెలంగాణ ను తాము సమర్థిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష మేరకు తాము ఉద్యమంలో పాల్గొంటున్నామని తెలిపారు. నేడు నక్సల్స్ ఉద్యమం బలంగా ఉన్న ప్రాంతాలు చిన్న రాష్ట్రాలుగా ఏర్పడడానికి పూర్వమే బలమైన ఉద్యమకేంద్రాలుగా ఉన్నాయి. నేడు రాంచీని మిలిటరీ బే స్‌గా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లో ఆ ఉద్యమం మీద తీవ్ర అణచివేత కొనసాగుతున్నది.

ఇక రెండవ కారణమైన దేశ సమగ్రతకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసలు ఎటువంటి సంబంధం లేదు. స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశంలో 13 రాష్ట్రాలుండగా, నేడు అవి 29 రాష్ట్రాలుగా ఏర్పడినాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి దేశసమగ్రతకు ఎటువంటి సంబంధం ఉన్నది? ఈ ప్రాంతం ప్రజలు దేశంనుంచి విడిపోతామని ఏమైనా అంటున్నారా? స్వపరిపాలన పేరుతో భౌగోళిక తెలంగాణను కోరుతున్న వారు కొందరైతే, స్వపరిపాలనతో పాటు స్థానిక వనరులు, స్థానిక ప్రజలకు సమపాళ్ళలో దక్కాలని ఈ ప్రాంత ప్రజానీకం పోరాడుతున్నారు.

ఇలాంటి ప్రచారాలు సీమాంధ్ర సంపన్నులు కుట్రపూరితంగా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక ్సల్ సమస్య పెరగదు. కానీ, వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా ఇలా సాగతీత వలన ఇక్కడి ప్రజలు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చే స్తారు. కేసీఆర్‌తో చర్చలు, కోర్ కమిటీ భేటీలన్నీ సెప్టెంబర్ 30 తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేయించడానికే. ఈ ఆర్భాటాలన్నీ 'జీవ వైవిధ్య సదస్సు'ను సజావుగా జరపడం కోసమే గానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కాదు.

సీమాంధ్ర సంపన్న వర్గాల కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగదీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజా ఉద్యమాల ఉధృతి తాత్కాలికంగా ఉపశమిస్తుందే గాని నక్సలిజం పెరుగుతుందన్న పాలకులు ప్రచారంతో అర్థంలేదు. తెలంగాణ ఏర్పాటును మరింతగా సాగదీస్తే ఈ పోరాటం మరింతగా ఉధృతమై నక్సలైట్ ఉద్యమం పెరగడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు.

- చిక్కుడు ప్రభాకర్
Andhra Jyothi News Paper Dated : 27/09/2012 

No comments:

Post a Comment