Sunday, September 9, 2012

పిలుపుల మలుపుల్లో ఉద్యమం - సుజాత సూరేపల్లి



నాయకులకి పిలుపు అంటే తెలంగాణ గుండెల్లో రాళ్ళు పడ్డట్టే. గత రెండు సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు ఉద్యమం ఒక అడుగు ముందుకు వేద్దామన్నా ఏదో ఒక పిలుపు ఎవరికో ఒకరికి వస్తుంది. అది కూడా నాయకులకి మాత్రమే. రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రాంతాలు తేడాలుండవచ్చు కానీ వారికి తప్పక దైవ సందేశాలు ఉండే ఉంటాయి. రాజకీయ పార్టీలకు మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడి ఉండనే ఉంది. మూడు ప్రాంతాల నుంచి ఎవరికైనా పిలుపులు/సందేశాలు రావొచ్చు.

ఈ సిగ్నల్ వ్యవస్థ రిలయన్స్, వొడాఫోన్ వాళ్ల కంటే తెలంగాణ నాయకులలో కాస్త ఎక్కువ. 2009 డిసెంబర్‌లో చిదంబరం ప్రకటన వచ్చింది, ఇదీ ఒక పిలుపు లాంటిదే. ఆ రాత్రి తెలంగాణ వాళ్ళంతా ధూమ్‌ధామ్‌లు, సంబరాలు చేసుకున్నారు. సరిగ్గా అప్పుడే రాజకీయ నాయకులకి చిదంబరం గారి పిలుపొచ్చింది, పార్టీలకు అతీతంగా ఆయనేదో సీక్రెట్‌గా పిలిచి అడిగారు, వీరు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం ప్రజల చేతిలోకి పోతే మనం రాజకీయ నిరుద్యోగులం అవుతామని అన్నారని బయట వినికిడి. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల గురించి తెలంగాణలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు.

పిలుపులో ఉన్న మహత్యం ఏమిటో గానీ ఇచ్చిన మాట వెనక్కి పోయింది. గొప్పగొప్ప నాయకులు తెలంగాణ రాకపోతే నాలుక తెగ్గోసుకుంటం, ఉరేసుకుంటం అన్నోళ్ళు సప్పుడు సడి లేకుండా ఉన్నారు. తరువాత కృష్ణ కమిటీ అని ఒక కపట కమిటీని వేసి మరింత కాలయాపన చేశారు. ఈ మధ్య కాలంలో వరుస బెట్టి పోరగాండ్లు చస్తూనే ఉన్నారు, నాలుగు (రెండు?) కన్నీటి బొట్లు రాల్చి, పుష్పగుచ్చాలిచ్చి వచ్చారే గానీ ఏ ఒక్క నాయకుడికి ఈ 'హత్యలను' ఆపడానికి ఒక్క పిలుపు రాలేదు. రాజీనామా చేయాలనిపించాలే, ఇంకొక్క అడుగు ముందుకేస్తే చావులకు కూడా మార్కెట్ చేసుకున్నోళ్లు కోకొల్లలు. సెంటిమెంట్‌లతో మరిన్ని పదవులు, పైసలు, ఓట్లు కూడా ఉచితంగా కొట్టెయ్యొచ్చు అని నిరూపించారు.

కోట్లకొద్దీ ప్రజలు ప్రేక్షకపాత్ర వహించారు, మౌనంగా కన్నీళ్ళు పెట్టుకున్నారు. రచయితలు కసిగానో, కవ్విస్తూనే రచనలు రాశారు. కానీ ఎవరికీ గుండె మండలే, పౌరుషం రాలే. ఒక నిర్లిప్తత, స్తబ్దత సర్వత్రా వ్యాపించింది. ఇట్లా ఈ ఆత్మహత్యల పరంపర నడుస్తుండగానే మళ్లీ ఉప ఎన్నికల పిలుపులు, జై తెలంగాణ నినాదాలు, రాజీనామాలు, కోపమొస్తే, నవ్వొస్తే, అలిగితే, పదవులు కావాలంటే ఒకే ఒక్క మార్గం 'రాజీనా(డ్రా)మ', ఉద్యమం అంతా నాయకులని గెలిపిస్తే చాలు అని ఓట్ల చుట్టూ తిరిగింది.

ఓటు రాజకీయాలతో అలసిపోయిన తెలంగాణ ఏ ఒక్క అవకాశం పోగొట్టుకోదలచుకోలేదు. కడుపులు, గుండెలు మండుతున్నా కూడా నిండు మనసుతో ఓట్లేశారు. జీవితంలో మళ్లీ ఎన్నికలలో నిలబడి గెలవలేని వాళ్ళు 'జై తెలంగాణ' అని అధికార పార్టీల నుంచి జంప్ చేసి అత్యధిక ఓట్లతో గెలిచారు. అసలు ఈ నాయకులు ప్రజాసమస్యల మీద, వనరుల దోపిడీ మీద, మతం పేరుతో జరుగుతున్న హింస మీద, దళిత, ఆదివాసీల ఊచకోతల మీద ఒక్కడన్నా ఎందుకు రాజీనామా చేయలేదో మనం అడుగకూడదు. ఉద్యమం అడగదు, స్వచ్ఛంద సంస్థలు, స్వతంత్ర సంస్థలు అడగవు. అన్నీ రాష్ట్రం వచ్చిన తరువాతనే, ఒట్టికుండ చేతికొస్తే ఏమైతది? ఒకవేళ ఎవరో ఒకరు అడిగితే, అడిగిన వాళ్ళని ఏదో ఒకపేరు పెట్టి పక్కకు పెడతారు, లేదంటే చెరుకు సుధాకర్ మరి అనేక మంది విద్యార్థులు, ఉద్యమకారుల లెక్క జైలుకి పంపుతారు.

విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి అని పిలుపునిస్తే నాయకులు మౌనం వహిస్తారు. మాస్ ఏ పిలుపునిచ్చినా నాయకులు స్పందించినది చాలా తక్కువ, విధిలేక మొక్కుబడిగా ఒప్పుకున్నవే ఎక్కువ. మళ్లీ ఎండాకాలం, రెస్ట్ హౌస్‌లోనో, గెస్ట్ హౌస్‌లోనో, ఫాంహౌస్‌లోనో సమ్మర్ వెకేషన్. కింద మీద బడుకుంట మిలియన్ మార్చ్ వస్తే ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు. ప్రజల వెల్లువ చూసి కుక్కిన పేను లెక్క పడి ఉండి, మళ్లీ క్రాప్ హాలిడే లాగా పొలిటికల్ హాలిడే డిక్లేర్ చేస్తారు. ఇదే క్రమంలో సకల జనుల సమ్మె వచ్చింది. అసలు అది ఎందుకు మొదలైందో, ఎందుకు ముగిసిందో ఎవ్వరికీ తెలియదు. ఒక డిమాండ్ లేకుండా మొదలుపెట్టినా కూడా ఢిల్లీ పీఠం గడగడలాడించే లెక్క సమ్మె చేశారు.

సింగరేణి అగ్గి పుట్టించింది, అగ్గిబిడ్డల ఉద్యమ తాకిడికి దేశం అంతా అల్లకల్లోలం అయింది. ఇక కేంద్రం, సోనియమ్మ దిగొస్తది అనుకున్నంతలోనే నాయకులు సమ్మెను బంద్ చేయమని 'మరో పిలుపునిచ్చారు', లేకపోతే మీ చావు మీరు చావండి అన్నారు. అప్పటికే కడుపులు కాలి ఉండి, అప్పులు చేసి కూడా ధైర్యంగా ఉన్న ప్రజలు నాయకుల వైఖరితో అధైర్యపడ్డారు. అప్పుడు కూడా నాయకులకు పిలుపొచ్చింది కానీ జనాలు తంతరని పోలేదు అన్న వారు లేకపోలేదు. ఇంక సమ్మె కాలంలో జీతాలు ఇవ్వమని, సెలవులని రద్దుచేయమని మళ్లీ మధ్యతరగతి ఉద్యమంలోకి వచ్చి పడింది. ఇంక పార్లమెంట్ సమావేశాలంత గమ్మత్తు సీన్ దేశంలో మరొకటి కనపడదు. ఒకే ఒక్క ఖల్ నాయక్, నాయకీమణి జై తెలంగాణ అనుకుంట లోపలికి పోతారు. ఇంగ టీవీలోళ్లు చూపించిందే చూపించి పండుగ చేసుకున్నారు.

పొద్దున లేస్తే తెలంగాణ అనే నాయకులెవ్వరూ అక్కడ కనపడరు. ప్రపంచం అంతా పిచ్చి గొర్రెలు అనుకుంటారేమో కానీ ఇంతనన్నా సోయి కూడా లేకుండా చీప్‌గా ట్రిక్కులు ప్లే చేస్తారు. అరవై ఏళ్ల సంధి చూసిచూసి జనాలు అలసిపోయారు. రాజులు మారుతున్నారు కానీ రాజ్యాలు మారట్లేదు. ఉద్యమ సంస్థలూ హాలిడేలు ప్రకటించుకున్నాయి. పండుగలు, పబ్బాలు, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అన్నీ అయిపోయాయి. హఠాత్తుగా అధికారపార్టీల వాళ్లకి రోషమొచ్చింది. తాడోపేడో తేల్చుకుంటామని హస్తినకు వెళ్ళారు. పార్లమెంటులో జై తెలంగాణ అని అనకముందే అమ్మ కనుసైగ చేసింది, వేలెత్తి చూపింది. 

మెరుపులాంటి ఒక్క కనుసైగకి కళ్ళు తిరిగి, నోర్లు పడిపోయి, దిమ్మ తిరిగి మౌనవ్రతం పట్టుకున్నారు. అమ్మ ఎలాగన్నా కరుణిస్తుందని, తెలంగాణ వరం ప్రకటిస్తుందని ఆశతో ఉన్నామని ప్రవచనా లు చెబుతున్నారు. అంతకన్నా ఏమి చేస్తారు పాపం! వుయ్ పిటి దెమ్!

ఇక చంద్రబాబు నాయుడు గారి కథ కంచికి చేరినట్టే. గనులను మింగిన జగనులను జైలులో పెట్టారు కానీ ఓట్లని రాబట్టుకోలేకపోయారు. ఎప్పుడైతే బాబు జై తెలంగాణ అని పిలుపునిద్దామని అనుకున్నారో మళ్ళీ కేంద్రం నుంచి పిలుపులొస్తున్నాయి కొంత మంది నాయకులకు. ఎప్పుడైతే తెలంగాణ మార్చ్‌కి ప్రజలు సిద్ధమవుతున్నారో మళ్లీ నాయకులకి మరో పిలుపు వస్తుంది. కపట ప్రకటన రావొచ్చు లేదా మంచి ప్యాకేజీ రావొచ్చు, మళ్ళీ ఎన్నికలదాకా ఏదో ఒక టైం పాస్!

ప్రజలు ఒక్కటి మాత్రం తెలుసుకున్నారు. పదేళ్ల ఓట్ల, సీట్ల కసరత్తులకి కేంద్రం తెలంగాణ ప్రకటనని ఇవ్వలేదు. కేవలం ఉద్యమం మాత్రమే అది కూడా బాగా వత్తిడి వచ్చినప్పుడే నాయకులకి సిగ్నల్స్, పిలుపులు వచ్చాయి. అది కూడా ఉద్యమాన్ని అణచివేయడానికి లేదా తప్పుదారి పట్టించడానికి మాత్రమే అని జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు కావలసింది తెలంగాణకి ఉద్యమ బాట, రాజీలేని పోరాటాలు. ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాయంటే దానికి నిస్వార్థ ప్రజల ఉద్యమమే కారణం.

తెహ్రిర్ స్క్వేర్ మరిపించే విధంగా సెప్టెంబర్ 30 మార్చ్ చేస్తారు ఇక్కడి ప్రజలు. అందులో ఏమీ సందేహం లేదు కానీ దీని వల్ల ఈ తెలంగాణ రక్తానికి రుచి మరిగిన రాజకీయ పార్టీల వైఖరి మారుతుందా, కుట్ర లేని తెలంగాణని ప్రకటిస్తారా, మరొక పోరాటానికి సిద్ధం చేస్తారా? మరొక 'పిలుపు' కోసం వేచి చూడాల్సిందే! అది రాజకీయ నాయకులు పిలుపు కాదు, ఆవేశంతో రగిలిన ప్రజల పిలుపు. దానిని తట్టుకొనే ప్రభుత్వాలు ఇంకా భూమి మీద పుట్టలే!
- సుజాత సూరేపల్లి

Andhra Jyothi News Paper Dated : 09/09/2012 



No comments:

Post a Comment