Sunday, September 9, 2012

ఆదివాసులకు విద్య - అంతా మిథ్య రమేష్‌ బుద్దారం


   Fri, 7 Sep 2012, IST  


'భారతదేశంలో మొదటి తరం వారెవరంటే ఆదివాసీలే. అయినప్పటికీ తరతరాలుగా మా చరిత్ర వివక్ష, దోపిడీలతో కూడుకుని నడుస్తోంది. స్వతంత్ర భారత దేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించబడతాయి, ఎవరూ నిర్లక్ష్యం చేయబడరని ఆశిస్తున్నా' ఇవి రాజ్యాంగ నిర్మాణ సభలో ఏకైక ఆదివాసీ సభ్యుడుగా ఉన్న జైపాల్‌ ముండా 1946లో చేసిన వ్యాఖ్యలు ఇవి. 65 వసంతాల స్వతంత్ర భారతదేశంలో నిజంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయా అనే సందేహం సామాన్య మానవుడికి కలగక మానదు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు, కానీ ఆదివాసీల తలరాతలు మాత్రం మారిన దాఖలాలు కనిపించడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌ 35 గిరిజన తెగల్లో నాలుగైదు మైదాన ప్రాంత తెగలు మినహా చాలా మటుకు తెగల్లో అక్షరాస్యతా రేటు చాలా తక్కువనే చెప్పాలి. చెంచు, బొడొ గదబ, గుటొబ్‌ గదబ, డొంగ్రియ, ఖొండ్‌ కుల్తియ, ఖొండ్‌, కొలం, కొండరెడ్డి, కొండ సవర, బొండొ ఫొర్జ, ఖొండ్‌ ఫొర్జ, ఫరెంగి ఫొర్జ తెగల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ తెగల నుంచి పట్టుమని ఒక డాక్టరుగానీ, ఒక ఇంజనీరు గానీ లేరంటే అతిశయోక్తి కాదు. 46వ ప్రకరణ బడుగు, బలహీన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు తగిన విద్యా సదుపాయాలు కల్పించి వారిని సామాజిక అసమానత్వం, వివక్షల నుంచి కాపాడటం రాజ్యం బాధ్యత అని నిర్దేశిస్తుంది. రాజ్యాంగంలోని 21వ ప్రకరణ 1-14 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచిత విద్య ఒక హక్కుగా ప్రకటించింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వీరి అభివృద్ధికై ప్రత్యేకంగా 10 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేశారు. వీరి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటున్నాయి. సబ్‌ప్లాన్‌ ద్వారా ప్రత్యేక నిధులొస్తున్నాయి. అయినప్పటికీ అభివృద్ధి ఫలాలు, తరతరాలుగా వీరికి విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. విద్యాభివృద్ధిలో భాగంగా వివిధ పేర్లతో పాఠశాలలు ఏర్పాటయ్యాయి. దాదాపు 8 శాతం ఉన్న గిరిజన జనాభాకు అవి ఏమాత్రం సరిపోవు. మారుతున్న పరిస్థితులకనుగుణంగా స్కూళ్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఒకసారి సమస్య మూలాల్లోకెళ్ళి గమనిస్తే అనేకానేక విషయాలు తెలుస్తాయి. వలసలు, సరైన జీవనోపాధులు లేకపోవడం, మూఢాచారాలు, అనారోగ్యం, కుటుంబ పరిస్థితులు, బాల్య వివాహాలు, సంచార జీవనం వంటివి ఆర్థిక కారణాలు కాగా, నక్సలిజం పేరుతో పోలీసుల హింస, చదువుకున్న అమాయక యువకులను, గిరిజనులను కోవర్టులు, ఇన్‌ఫార్మర్ల నెపంతో అటు పోలీసులు, ఇటు మావోయిస్టులు చాలా ఇబ్బందులకు గురిచేయడం వంటి సామాజిక కారణాల మూలాన చక్కగా సాగాల్సిన బతుకులు నేరస్తులు అనే మరకలంటి మసవుతున్నాయి. మాతృభాషలో విద్య జరగాలని భారత రాజ్యాంగ ప్రకరణ 350(ఎ) నిర్దేశించింది. మాతృభాషలో విద్యాబోధన జరిగితే అవగాహన శక్తి పెరిగి తద్వారా విద్యార్థికి విద్యపై ఆసక్తి కలుగుతుందని అనేక కమిటీలు నొక్కి చెప్పాయి. విద్య ప్రాముఖ్యతను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదివాసులకు తెలియపరచడంలో విఫలం కావడంతో ఇది ఎక్కడా అమలు జరగడం లేదు. గిరిజనేతర ఉపాధ్యాయుల నియామకం, స్కూల్‌ నిర్వహణపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, రెగ్యులర్‌ ఉపాధ్యాయుల కొరత, ఉపాధ్యాయుల గైర్హాజరి, విద్యా వాలంటీర్లచే బోధన మొదలగు కారణాలు అధిక డ్రాపౌట్‌ రేటుకు కారణాలవుతున్నాయి. గ్లోబలైజేషన్‌ మాయలో సాగుతున్న ఈ విద్యా విధానం ఆదివాసులకు ఆమడ దూరమేనని చెప్పాలి. మూల విద్య సరిగ్గా అందనివాడికి ఆంగ్ల విద్య అనేది కష్టమే. ప్రస్తుత విద్యా విధానం అనేది కొన్ని వర్గాలకే అనుకూలంగా ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ అనేక కమిటీలు వేశారు. సదస్సులు, చర్చా గోష్టులు జరిపారు. కమిటీలు ఎన్ని వేసినా, ఎన్ని చర్చలు జరిపినా మన పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారు. ఆచరణకొచ్చేసరికి ప్రపంచబ్యాంకు విధానాలకే ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. ఈ ద్వంద్వ ప్రమాణాలను పాటించడం వల్లే అక్షరాస్యతలో ప్రపంచంలో భారత్‌ వందో స్థానంలోనూ, దేశంలో మన రాష్ట్రం 28వ స్థానంలోనూ ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి బదులు మరింత దిగజార్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. ఉపాధ్యాయులను కుదించడం, పాఠశాలలను మూసేయడం, విద్యారంగ కార్పొరేటీకరణ వంటివి ఇందుకు కొన్ని మచ్చుతునకలు. విద్య అనేది దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర అనే విషయం విస్మరించిన మన పాలకులు ఎప్పటికప్పుడు ఖాళీ అయిన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకుండా కేవలం ఎన్నికల సమయాలలో మాత్రమే నియామకాలు చేపట్టడం పరిపాటిగా మారింది.
విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలకు అన్ని వసతులూ కల్పించి, తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయ నియామకాలు జరిపి, మాతృభాషలో విద్యాబోధన జరిపి తద్వారా నాగరిక సమాజానికి దగ్గరగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. చట్టాలు ఎన్నో చేస్తున్నారు కానీ అవి అమలుకు నోచుకోవడం లేదు. చట్టాల అంతరార్థం అర్థం చేసుకొని పాలకులు వాటి అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన మహోన్నత బాధ్యత, అవసరం ఎంతో ఉంది. అందరికీ అక్షరాస్యత బాధ్యత ప్రభుత్వానిదే. దీని సాధనకు రాజకీయ చిత్తశుద్ధి ఎంతైనా అవసరం. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేస్తామని అంతర్జాతీయ సమాజానికి హామీ ఇచ్చాం. ఆ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.
(నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం)
(రచయిత రీసర్చ్‌ అసోసియేట్‌, కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌))))000 ))

Prajashakti News Paper Dated : 07/09/2012

No comments:

Post a Comment