ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అనేది మాలవారి అభివృద్ధి ప్రణాళిక. మాల సంఘాలు, మాల మేధావుల ఒత్తిడి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సబ్‌ప్లాన్‌పై తన తుది నివేదికను ముఖ్యమంత్రికి ఇటీవల సమర్పించింది. ఈ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు త్వరలో శాశ్వత చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది.
ప్రతి ప్రభుత్వ శాఖ తన బడ్జెట్ నుంచి ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం 17 శాతం, ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం 7 శాతం నిధులను వారి సంక్షేమం కోసం ఖర్చు చెయ్యాలని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నాయి. కాగా, ఆధిపత్య కులాల ప్రభుత్వాలు గత ఇరవయ్యేళ్ళుగా తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేశాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని దైవాదీనంగా, గాల్లో దీపంగా మార్చేశాయి. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చెయ్యాల్సిన ఇరవై వేల కోట్ల రూపాయలకు పైన నిధులను పక్కదార్లు, తప్పుదార్లు పట్టించాయి.
ఫలితంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం బక్కచిక్కింది. నీరసించింది. రోగగ్రస్తమైంది. ఆకలితో మాడింది. గూడేల్లో, తండాల్లో ఖర్చుపెట్టాల్సిన సొమ్మును చివరికి రింగురోడ్ల నిర్మాణానికి, కాలుష్య నివారణ మొదలైన వాటికి ప్రభుత్వాలు దానం చేసేసాయి. ప్రభుత్వాల ఈ బాధ్యతా రాహిత్య పరిస్థితుల నేపథ్యం నుంచే ఎస్సీల నిధులు ఎస్సీల సంక్షేమం కోసమే ఖర్చు చెయ్యాలని, ఎస్టీల నిధులు ఎస్టీల సంక్షేమం కోసమే ఖర్చు చెయ్యాలనే డిమాండ్లు వచ్చాయి. వీటి ఫలితంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం నోడల్ ఏజెన్సీ, సబ్‌ప్లాన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్లు ముందుకొచ్చాయి.
ఇప్పుడున్న ప్రతిపాదిత రూపంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్లు అమలు జరిగేటట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 61 ఎస్సీ కులాల్లో మాల కులం మినహా మిగిలిన 60 ఎస్సీ కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇందుకు కారణం మాల కులం, లంబాడి తెగ సింహభాగం రిజర్వేషన్లు ఇప్పటికే పొంది, ఎస్సీ, ఎస్టీల మధ్య బలమైన సమూహాలుగా తయారయ్యాయి.
ఇదే సమయంలో ఎస్సీల్లో మెజారిటీలైన మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల, మాష్టి, రెల్లి, మెహతార్, పాకి, పంచమ, గొడగలి, గొడారి, బుగజంగాలతో పాటు అనేక కులాల వారు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లు పొందటంలో మాల కులంతో పోలిస్తే పూర్తిగా లేదా చాలా వెనుకబడిపోయారు లేదా అణచివేతలకి గురయ్యారు. ఇదే మాదిరి పరిస్థితులు ఎస్టీల్లోనూ ఉన్నాయి. లంబాడి, బంజారా, సుగాలీ, ఎరుకల జాతులు సాపేక్షికంగా అభివృద్ధి చెందగా యానాదులు, చెంచులు, కోయలు మొదలగు 34 జాతులు పూర్తిగా లేదా చాలా వెనుకబడిన పరిస్థితుల్లో అణగారిపోయి ఉన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం ఇప్పుడు రూపొందించిన సబ్‌ప్లాన్ ఉన్నది ఉన్నట్లుగా అమలుజరిపినట్లయితే, ఎస్సీలోని మాల, మాల దాసరి, ఆదియాంధ్ర మాల, ఎస్టీల్లోని లంబాడి, ఎరుకల మొదలగు తక్కువ పరిమితి సంఖ్య కలిగిన కులాల, జాతుల చేతుల్లోకే మొత్తం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వెళ్ళిపోయే అవకాశం, ప్రమాదం ఉంది.
ఎందువల్లనంటే, పైన పేర్కొన్న పరిమిత సంఖ్యగల ఎస్సీ, ఎస్టీ కులాలు, తెగలవారు గత 60 ఏళ్ళుగా విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రిజర్వేషన్లలో సింహభాగం అనుభవించి దళిత కులాలు, ఆదివాసీ తెగల మధ్య ప్రభావశీలమైన శక్తి కలిగిన కులాలు, జాతులుగా మారారు.
ఈ పరిస్థితుల్లో సబ్‌ప్లాన్‌లో ప్రణాళికాబద్ధమైన శాశ్వత సబ్ కోటాలు విధించాలి. రాష్ట్రంలోని 61 ఎస్సీ కులాలకు, 35 ఎస్టీ తెగలకు ఆయా అన్ని కులాల, జాతుల, తెగల జనాభా నిష్పత్తులకనుగుణంగా సబ్‌ప్లాన్ నిధుల పంపిణీలో న్యాయం జరిగేలా చూడాలి. ఇందుకు ప్రతిపాదిత సబ్‌ప్లాన్ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చెయ్యాలి.
సబ్‌ప్లాన్ ప్రతిపాదనలు పైన పేర్కొన్న అర్థవంతమైన రీతిలో ఉండేటట్లు ముఖ్యమంత్రి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇలా జరగకపోతే, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ అన్నట్లు, 'నిండేటోన్ది నిండుతుంది, ఎండేటోన్ది ఎండుతుంది' అన్న చందంగా ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ సమూహాల మధ్య అభివృద్ధి వ్యత్యాసాలు మరింత పెంచి పోషించటానికి కారణమౌతుంది.
కాబట్టి 2011 లేదా 2001 జనాభా లెక్కలననుసరించి ప్రతి ఎస్సీ, ఎస్టీ (61+35=96) సమూహానికీ ఈ సబ్‌ప్లాన్ నిధులు అందేవిధంగా స్పష్టమైన, న్యాయబద్దమైన చట్టాన్ని చెయ్యాల్సిన బాధ్యతను ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. అంతే తప్ప, గంపగుత్తగా - ఉమ్మడిగా - ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం తెచ్చినందువల్ల బలమైన నాలుగైదు కులాలు, జాతులకు మినహా, మిగిలిన మెజారిటీ ఎస్సీ, ఎస్టీ జాతులు, కులాలన్నింటికీ ప్రభుత్వమే ద్రోహం చేసినట్లవుతుంది.
కొత్తగా రూపొందించబోయే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టానికి నమూనాగా, మార్గదర్శకంగా 1997 డిసెంబర్ 16న అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ జారీ చేసిన 183వ నంబరు జీవోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పరిగణనలోకి తీసుకోవాలి. జనాభా దామాషాను లెక్కించడానికి ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకోవాలి. 2011 లేదా 2001 జనాభా లెక్కల ప్రకారం సదరు జిల్లాలోని ప్రతి ఎస్సీ కులం జనాభా నిష్పత్తి, ప్రతి ఎస్టీ జనాభా నిష్పత్తి ననుసరించి స్వయం ఉపాధి పథకాలు, ఇళ్ళ స్థలాలు, పేదరిక నిర్మూలనా పథకాలు, వ్యవసాయ భూములు, పారిశ్రామిక భూముల కేటాయింపు మొదలైన పథకాలను ఈ సబ్‌ప్లాన్ చట్టం ద్వారా అందించాలి.
ఈ విధమైన అర్థంతోనే సబ్‌ప్లాన్ చట్టాన్ని చెయ్యాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధిపతులు నిర్దిష్టంగా కులం, తెగ, గ్రామం, కుటుంబం, వ్యక్తి స్థాయిలో ప్రతిపాదిత ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలి.
అప్పుడు మాత్రమే సబ్‌ప్లాన్ చట్టం తేవాలి. సబ్‌కోటాలు లేని సబ్‌ప్లాన్ (ఉమ్మడి) చట్టం వలన మాలలు, లంబాడి, వంటి కొన్ని, కొద్ది కులాలు, తెగలకు అర్హతకు మించి లాభం కలుగుతుంది. మెజారిటీ ఎస్సీ కులాలకు, ఎస్టీ తెగలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అశక్తులైన సమూహాలకు తీవ్ర నష్టమే కాదు, పెను ప్రమాదం కూడా. ప్రభుత్వం ఈ ఆంతరిక వ్యత్యాసాలను సరిదిద్దే సక్రమ, న్యాయ చర్యలకు సిద్ధమౌతుందని ఆశిస్తున్నాం.
- కృపాకర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి
Andhra Jyothi News Paper Dated: 08/09/2012
No comments:
Post a Comment