Thursday, September 6, 2012

పదోన్నతులలో రిజర్వేషన్లు - ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు



పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించి తీరాలి. పౌరులందరికీ ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని కల్పించడానికి మన రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చడంలో భాగమే పదోన్నతులలో రిజర్వేషన్లు... సమానత్వ సాధనకు నిబద్ధమవని ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ అని అభివర్ణించడానికే అర్హమైనది కాదు. 

విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అభ్యుదయ సాధనాలు. ఇది నిర్వివాదాంశం. కొద్దిమంది-అణగారిన, సామాజికంగా అంటరానితనాన్ని అనుభవించిన భారతీయులు-కి, పరిమితంగానైనప్పటికీ సాధికారత కల్పించడంలో రిజర్వేషన్లు విశేష తోడ్పాటు నందించాయి. ప్రవేశ స్థాయి రిజర్వేషన్లతో ఎస్సీలు, ఎస్టీలు విద్యా సంస్థలలో ప్రవేశం పొంది విద్యాధికులు అవుతున్నారు; ప్రభుత్వ వ్యవస్థలోనూ, ప్రభుత్వరంగ సంస్థలలోనూ ఉద్యోగాలు పొందుతున్నారు.

తద్వారా జీవితంలోనూ, సమాజంలోనూ పురోగమిస్తున్నారు. అయితే ఈ అభ్యుదయ విధానాన్ని గత 62 ఏళ్ళలో ఏనాడూ చిత్తశుద్ధితో అమలుపరచలేదు. అమలుపరిచి ఉన్నట్టయితే ఈ 21వ శతాబ్దంలో విద్య, ఉద్యోగాలలో అందరికీ సమానావకాశాలు లభిస్తూ ఉండేవి కావా? మరి పరిస్థితి అలా లేదు.

ఈ వాస్తవం చెబుతున్నదేమిటి? భారత రాజ్యవ్యవస్థ తన రాజ్యాంగ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమయిందనే కాదూ? అంతేకాదు, తరతరాలుగా అంతులేని అన్యాయాలకు గురవుతోన్న బడుగు కులాల వారి పట్ల ఉన్నత కులాల వారిలో నెలకొని వున్న చులకన భావం, వివక్షా వైఖరి పూర్తిగా తొలగిపోలేదనే చేదు సత్యాన్ని కూడా విశదం చేస్తోంది. పదోన్నతులలో ప్రమోషన్ల విషయమై ప్రస్తుతం జరుగుతోన్న చర్చలో అదే వివక్షా వైఖరి మరో సారి నిస్సిగ్గుగా వ్యక్తమవుతోంది.

ఉద్యోగాలలో ప్రవేశించేందుకు తోడ్పడిన రిజర్వేషన్ సదుపాయం, ఆ తరువాత పై స్థానాలలోకి వెళ్ళేందుకు అంటే పదోన్నతులకు కూడా ఆసరాగా ఉండాలని అణగారిన వర్గాల వారు ఆకాంక్షిస్తున్నారు. పదోన్నతుల స్థాయిలో కూడా రిజర్వేషన్ సదుపాయం కొనసాగేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి 2007లో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులలో రిజర్వేషన్ అమలుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. మాయావతి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

ఆ హైకోర్టు నిర్ణయాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం గత ఏప్రిల్ 30న సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లనివ్వడం రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలైన మాయావతి కొద్దిరోజుల క్రితం సభలో ఆ అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రధాన ప్రతిపక్షాల నుంచి ఆమె డిమాండ్‌కు పూర్తి మద్దతు లభించింది.

అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్ వారి ఉద్యోగ జీవితంలో ఒక సతార్కిక పురోగతికి తోడ్పడుతుంది. ప్రవేశస్థాయిలో వారికి రిజర్వేషన్ సదుపాయం లభించడానికి ఏవైతే కారణాలో, అవి, పదోన్నతుల స్థాయిలో కూడా వర్తిస్తాయి. నిజానికి వర్తింపచేయాలి కూడా. ఎందుకు? ఆ అణగారిన వర్గాల వారికి సమానత్వం, సామాజిక న్యాయం సమకూర్చడానికి.

సామాజిక అంతరాల మూలంగా ఎదుర్కొంటున్న అన్యాయాలను తొలగించేందుకు, మేధా సామర్థ్యం తక్కువ అనే న్యూన భావనను అధిగమించేందుకు అణగారిన వర్గాల వారికి ప్రవేశస్థాయిలో రిజర్వేషన్లు కల్పించారు. తొలిదశలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను వారు అన్ని దశలలోనూ, ముఖ్యంగా పదోన్నతుల సందర్భంలో ఎదుర్కొంటున్నారనేది ఒక వాస్తవం. భారత రాజ్యాంగం నిర్దేశించిన సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలను సాధించాలంటే పదోన్నతులలో రిజర్వేషన్లు అనివార్యం.

రిజర్వేషన్ల అమలులో చిత్తశుద్ధి లేదు. కొన్ని సందర్భాలలో ఆ రాజ్యాంగ కర్తవ్యాన్ని పూర్తిగా, ఎటువంటి సంజాయిషీ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలనా యంత్రాంగంలో కీలక స్థానాలలో ఉన్న వారి కుల ప్రయోజనాలే ప్రాధాన్యం పొందుతున్నాయి. దీంతో ఎవరిని ఆదుకోవడానికైతే రిజర్వేషన్లను కల్పించారో వారికే ఆ సదుపాయం లభించడం లేదు.

దీంతో రాజ్యాంగ లక్ష్యాలు కేవలం ఉత్త మాటలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బడుగు వర్గాల వారిలో ఉన్న ఒక 'సామాజిక న్యూనతా భావం' అలానే కొనసాగుతోంది. ఆ వర్గాల వారు క్లాస్ 3, క్లాస్ 4 'సేవా' ఉద్యోగాలకే పరిమితమవుతున్నారు. ప్రభుత్వోద్యోగాలలో ప్రాతినిధ్యం విషయంలో మిగతా సామాజిక వర్గాల వారికంటే ఎస్సీలు, ఎస్టీలు బాగా వెనుకబడిపోయారని అధికారిక గణాంకాలే స్పష్టం చేశాయి.

క్లాస్ 1, క్లాస్ 2 ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీయేతర సామాజిక వర్గాలు ముఖ్యంగా అగ్రకులాల వారిదే అప్పుడూ, ఇప్పుడూ పై చేయి; ఇక క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాలలోనూ వారిదే గణనీయమైన వాటా.

ఈ తులనాత్మక పరిశీలనలో ఎస్టీల పరిస్థితి, ఎస్సీల కంటే మరీ ఘోరం. ప్రణాళికా సంఘం నివేదికల ప్రకారం 1971లో క్లాస్ 1 ఉద్యోగాలలో ఎస్సీలు ఇంచు మించు 2.5 శాతం మాత్రమే ఉన్నారు (ఇది, రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన దాదాపు పాతికేళ్ళ అనంతర పరిస్థితి); 2011లో ఈ వాటా 12 శాతానికి పెరిగింది. క్లాస్ 2 ఉద్యోగాలలో 1971లో 4 నుంచి 2011లో 14 శాతానికి పెరిగింది. అదే కాలంలో ఎస్సీల వాటా క్లాస్ 3 ఉద్యోగాలలో 9 నుంచి 15 శాతానికి, క్లాస్ 4 ఉద్యోగాలలో 18 నుంచి 21 శాతానికి పెరిగింది. ఈ వాస్తవం 'క్రింది కులాల వారు' ఎప్పటికీ 'పై కులాల వారికి' సేవలు అందిస్తూనే ఉండాలన్న సంప్రదాయ వైఖరిని ధ్రువీకరిస్తోంది.

ఎస్సీలు, ఎస్టీలకు ఉద్యోగావకాశాలను నిరాకరించేందుకు అనుసరిస్తోన్న ఒక ఉమ్మడి వ్యూహం ఆ వర్గాల వారికి ఉద్దేశించిన పోస్ట్‌లను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో రిజర్వ్ చేసిన బోధనా సిబ్బంది ఉద్యోగాలలో కేవలం 25 నుంచి 30 శాతం మాత్రమే భర్తీ చేయడం జరిగింది.

మిగతావన్నీ ఖాళీగా ఉన్నాయి. అంటే అత్యధిక భాగం భర్తీ కాలేదు. కారణమేమిటి? ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులలో అర్హులైన వారు లభించకపోవడమేననే సమాధానం వస్తుంది. ఇందులో నిజమెంత? చాలా స్వల్పం. వాస్తవానికి ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి పట్ల ఉన్న వివక్షే ఆ పోస్టుల భర్తీ పట్ల ఉదాసీనత వహించేలా చేస్తోంది. ఇది వివక్ష కంటే తక్కువేమీ కాదని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ స్పష్టం చేసింది.

ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి 'ప్రత్యేక శ్రద్ధ' తీసుకోవాలని గత విద్యా సంవత్సరంలో యుజిసిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దురదృష్టమేమిటంటే మన రాజకీయ వ్యవస్థ ఇటువంటి వివక్షాపూరిత అంశాల పట్ల కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే శ్రద్ధ చూపుతుంది. దానివల్ల తమ ఓటు బ్యాంకు మరింత పటిష్ఠమవుతుందనే విశ్వాసమే రాజకీయ నాయకులను అందుకు పురిగొల్పుతుంది.

పదోన్నతులలో రిజర్వేషన్లపై చర్చ ప్రారంభమయిందో లేదో మరొకసారి తీవ్ర భయాందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటువంటి పదోన్నతుల వల్ల పాలన 'కుప్పకూలుతుందని', దేశ భవిష్యత్తు తీవ్ర పర్యవసానాలలో చిక్కుకొంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 'ప్రతిభ'కు మరోసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ప్రపంచపు అగ్రరాజ్యంగా ఆవిర్భవించాలన్న భారత్ స్వప్నం భగ్నమవుతుందని పలువురు వాపోతున్నారు.

నిజానికి ఇటీవలి కాలం వరకు విశ్వవిద్యాలయాలలో 'మెరిట్ ప్రమోషన్'ను ఒక నియమంగా అమలుపరిచేవారు. ఒకరు ఒక స్థానంలో నిర్దిష్ట సంవత్సరాలు ఉన్న తరువాత, మరింత స్పష్టంగా చెప్పాలంటే ఎనిమిది సంవత్సరాల సర్వీసు పూర్తిచేసిన తరువాత అతనికి లేదా ఆమెకు పై స్థానానికి విధిగా పదోన్నతి కల్పించేవారు. సెలక్షన్ కమిటీ ద్వారా పదోన్నతి పొందలేని పక్షంలో కూడా చిరకాలంలోనే పై స్థానానికి పదోన్నతి పొందేందుకు వారికి హామీ లభించేది. 

ఈ ప్రమోషన్ల వెనుక ఉన్న భావన ఉన్నతమైనది, మానవీయమైనది. ఉద్యోగంలో పదోన్నతి ఒక వ్యక్తి ఆత్మగౌరవభావనను పెంచుతుంది; మరింత ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తుంది. తన విధులను మరింత సమర్థంగా నిర్వహించాలనే ప్రేరణను కల్గిస్తుంది. పదోన్నతితో ఆర్థిక ప్రయోజనాలు ఎలాగూ సమకూరుతాయి గనుక మరింత ఉత్తమ అధ్యాపకుడుగా రూపొందేందుకు సదరు వ్యక్తి తప్పక ప్రయత్నిస్తాడు.

పదోన్నతులలో రిజర్వేషన్ లేకపోతే అణగారిన వర్గాల వారికి ప్రవేశస్థాయిలో లభించే రిజర్వేషన్‌లు సైతం అర్థరహితమైనవని చెప్పక తప్పదు. ఎందుకని? ఒక ఉద్యోగంలోకి ప్రవేశించిన వ్యక్తి, పదోన్నతి లేకపోతే ఉన్నచోటనే ఉండిపోతాడు. అతని జీవితంలో ఎటువంటి ప్రగతి ఉండదు. దీనివల్ల అతను నిరాశా నిస్పృహలకు లోనవుతాడు.

పైపెచ్చు అతను వివక్షలు, వివిధ వ్యతిరేకతల నుంచి బయటపడేందుకు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం పొందిన వ్యక్తి అనే వాస్తవాన్ని విస్మరించకూడదు. కాగా ప్రతిభ తక్కువగా ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు సరైన ఫలితాలను సాధించలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిరాధారమైన భయం. వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి.

బెంగళూరు ఐ.ఐ.ఎమ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇఅఖీ పరీక్షలో మంచి ర్యాంకులు సాధించిన ఓ బీసీ, జనరల్ కేటగిరీ అభ్యర్థుల మధ్య మార్కుల తేడా కేవలం రెండు శాతం మాత్రమే. 

అలాగే అహ్మదాబాద్ ఐ.ఐ.ఎమ్ నిర్వహించిన అధ్యయనంలో 'రిజర్వ్‌డ్' అభ్యర్థులు సాధించిన మార్కులు 'జనరల్' అభ్యర్థుల కంటే కొంచెం తక్కువే అయినప్పటికీ, కోర్సు పూర్తయ్యే నాటికి మార్కుల విషయంలోనూ, నియామకాలు పొందే విషయంలోనూ ఈ రెండు వర్గాల అభ్యర్థుల మధ్య ఎటువంటి తేడా ఉండడంలేదు. రిజర్వ్‌డ్ అభ్యర్థులలో ప్రతిభ తక్కువ నేది పూర్తిగా అవాస్తవమని ఈ అధ్యయనాలు స్పష్టం చేశాయి.

స్వాతంత్య్ర ప్రయోజనాలు, అభివృద్ధి ఫలాలలో దేశ ప్రజలందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. ఇది వారి హక్కు. అయితే ప్రస్తుతం చాలా కొద్దిమంది మాత్రమే అభివృద్ధి ఫలాలన్నిటినీ భుక్తం చేసుకొంటున్నారు. దేశ జనాభాలో కేవలం 1 శాతంగానైనా లేనివారు సహజ వనరులన్నిటిపై నియంత్రణ సాధించి 'ఫార్చ్యూన్ 500' జాబితాలో స్థానం సంపాదించుకోవడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాము.

అయితే అణగారిన వర్గాల వారు సమాన అవకాశాల కోసం ఆందోళన చేస్తే దేశ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నారని వారిని నిందించడం జరుగుతోంది. ఇదెంతవరకు సమంజసం? పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించి తీరాలి. పౌరులందరికీ ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని కల్పించడానికి మన రాజ్యాంగం హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చడంలో భాగమే పదోన్నతులలో రిజర్వేషన్లు.

మరి ఈ హామీని నెరవేర్చని పక్షంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యవస్థాపకులను వంచించడమే అవుతుంది. ఈ దేశ జనాభాలో అత్యధికులకు రాజ్యాంగ హక్కులను నిరాకరించడమే అవుతుంది. సమానత్వం, సామాజిక న్యాయం అనేవి మన రాజ్యాంగ వ్యవస్థకు పునాదులు. సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి చిత్తశుద్ధితో పూనుకోని పక్షంలో మన రాజ్యాంగ పునాదులు కదిలిపోతాయి. అందరూ సమానంగా ఎదగడానికి అవకాశం కల్పించాలి. సమానత్వ సాధనకు నిబద్ధమవని ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ అని అభివర్ణించడానికే అర్హమైనది కాదు.
- ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్ రావు
వ్యాసకర్త సుప్రసిద్ధ రచయిత్రి హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగం అధిపతి. (ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదా కేంద్ర కేబినెట్ ఆమోదం పొందక ముందే రాసిన వ్యాసమిది)

Andhra Jyothi News Paper Dated : 07/09/2012 

No comments:

Post a Comment