Saturday, September 1, 2012

మానవతపై దాడిని ఆపుదాం! - గెడ్డం ఝాన్సీ


టరానితనం రూపుమాపి, దళిత ఆదివాసీలపై అత్యాచారాలను అంతమొందిద్దాం! అనే నినాదంతో అత్యాచార నిరోధ క చట్టాన్ని సవరించి, బలోపేతం చేయడం కోసం దేశవ్యాప్తంగా ప్రచారోద్యమం జరుగబోతోంది. అనేక దళిత, ప్రజా సంఘాలు కలిసి ఒక సంఘీభావ కమిటీగా ఏర్పడి ఈ ప్రచారోద్యమాన్ని చేపట్టనున్నాయి. దీనిలో భాగంగానే మన రాష్ట్రంలో, ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకు 23 జిల్లాలకు సంబంధించి 100కి పైగా దళిత, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ఐక్య సంఘటనగా ఏర్పడి సెప్టెంబరు 3వ తేదీన రవీంద్ర భారతిలో చట్టం సవరణలపై చర్చించ తలపెట్టారు. ఈ సదస్సులో దళిత మంత్రులు, దళిత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారు.

1989లో వచ్చిన ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, 1995లో వచ్చిన నిబంధనలకి సంబంధించి సవరణల ప్రతిపాదనలు ప్రస్తుత తరుణంలో అత్యవసరం. మిగతా చట్టాలతో దళిత, ఆదివాసీలపై అత్యాచారాలు అంతమొందించలేక పోతున్నామని గ్రహించిన ప్రభుత్వం ఈ ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చి, దళితులపై దాడులు చేసే దళితేతర కులాల నేరస్థులకు శిక్షలను మరింత కఠినం చేసింది. అలసత్వం ప్రదర్శించే ప్రభుత్వోద్యోగులకు కూడా శిక్షలు విధించింది. అయితే ఆశించిన మేరకు ఈ చట్టం ప్రయోజనకరంగా లేకపోవడం, చట్టం కచ్చితంగా అమలుకాకపోవడం వేదనకరం.

ప్రభుత్వ అధికారులు, పోలీసు యంత్రాంగం, న్యాయ వ్యవస్థ పనితీరు, దీనిలోని ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఈ చట్టంలో ఏర్పాటు చేసిన జిల్లా, రాష్ట్ర పర్యవేక్షక కమిటీల పనితీరు పూర్తి అసంతృప్తికరంగా ఉంది. అత్యాచారాల చట్టం బలోపేతానికై ఏర్పడిన ఐక్యసంఘటన సేకరించిన గణాంకాల ప్రకారం గత 15 సంవత్సరాలలో 5,58,103 అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 4,71,717 సంఘటనలు ఎస్సీలపై, 87,836 సంఘటనలు ఎస్టీలపై జరిగాయి. ఇవికాక నమోదు కాని కేసులు కోకొల్లలు. శిక్షలు పడే శాతం గమనించినట్లైతే 0.5 శాతం నుంచి మూడు శాతం లోపే ఉంది.

అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నా, శిక్షలు మాత్రం పడడం లేదు. దౌర్జన్యాలు చేసిన నిందితులు బోను ఎక్కి, జైళ్ళకు వెళ్ళగలిగితే పౌర సమాజంలో సమానత్వం సాధించుకునే దిశగా ప్రయాణం సాగించగలం. బాధితులకు రక్షణ, ఓదార్పు ఇవ్వగల సమాజంగా ఉంటుంది. అసమానత్వాన్ని ఛేదించి అమానవత్వంపై కొరడా జులుపించగలిగేవారం. కానీ అలా జరగడంలేదు. చట్టంలో ఉన్న లొసుగులనూ, అధికారాలనూ ఉపయోగించి అమలుపర్చడంలో విఫలం చెందుతున్నాము. కేసు నమోదు నుంచి నిందితుని అరెస్టు, తీర్పు వరకు అన్నీ నిర్లక్ష్యాలే. అందుకే అత్యాచారాలను అంతమొందించి, అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం - అత్యాచార నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలుపర్చడం కోసం జాతీయ సంఘనటగా ఏర్పడి అక్కడి నుంచి రాష్ట్రాల్లో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం రాష్ట్ర ఐక్య సంఘటనగా ఏర్పడడం జరిగింది.

ఈ ఉద్యమాన్ని జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి ప్రజలందరినీ కూడగట్టాలనేది ఉద్దేశం. ఎందుకంటే పౌర సమాజం అంగీకరించనిదే ఏ పనీ సఫలీకృతం కాదు. అంటరానితనం, కుల వివక్షను రూపుమాపడం లాంటి జాడ్యాలను, విషవృక్షాన్ని తీసివేసే పని దళిత, ఆదివాసీ కులాలది మాత్రం కాదు. సమాజంలో ఉన్న ప్రతి మనిషీ దీనిమీద చైతన్యవంతమవ్వాలి. అప్పుడు మన సమాజం కులరహిత సమాజం కాగలదు. అందుకోసం ఇలాంటి చట్టాలను సమర్థంగా, నిజాయితీగా అమలుపర్చాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

అందుకోసం ఈ ప్రచారోద్యమం ద్వారా ఈ చట్టాన్ని సమర్థంగా అమలు చేసి, మరింత పదును పెట్టేందుకై కొన్ని సవరణలను సూచించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. కొన్ని ముఖ్య సవరణలు : (1) చట్టంలో ఉన్న 19 నేరాలకు మరికొన్ని నేరాలను చేర్చాలి. (ప్రస్తుతం పరిగణనలో ఉన్న అత్యాచారాలు) (2) భారత శిక్షాస్మృతిలోని 7 నుంచి 10 సంవత్సరాల వరకూ శిక్షార్హమైన నేరాలన్నిటినీ అత్యాచార నిరోధక చట్టం కింద నేరాలుగా పరిగణించాలి.

(3) ఒక ప్రత్యేక అధ్యాయాన్ని ఈ చట్టంలో కేటాయించి అంటరానితనం కారణంగా అమలయ్యే అన్ని వివక్షలనూ సివిల్ నేరాలుగా ప్రకటించి వాటికి సివిల్ పరిష్కారాలు పొందుపర్చాలి. ఉదాహరణకు విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకం, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు వంటివి. ఇలాంటి వాటన్నిటినీ నిరోధించడానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. (4) కొన్ని నేరాలకు భారత శిక్షాస్మృతిలో ఉన్న శిక్షే ఈ చట్టంలో కూడా ఉండాలి. ఎందుకంటే ప్రత్యేక చట్టం అయి ఉండీ ఈ చట్టంలో శిక్షలు, ఐపీసీలో కంటే తక్కువగా ఉన్నాయి.

ఈ వ్యత్యాసాన్ని తొలగించాలి. (5) ప్రత్యేక కోర్టులు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కేవలం అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు మాత్రమే చూసే విధంగా ఏర్పాటు చేయాలి. దీనివల్ల జాప్యాన్ని నివారించి విచారణ త్వరితంగా జరిపించవచ్చు. (6) బాధితుల, సాక్షుల హక్కులు అనే ప్రత్యేక అధ్యాయాన్ని ఈ చట్టంలో చేర్చాలి. (7) ఈ చట్టంలో ఉన్న కొన్ని 'ఉద్దేశంతో'; ఉద్దేశం, కోరుకుని; 'బహిరంగ ప్రదేశం'; అకారణంగా; వంటి పదాలను తొలగించాలి. ఈ పదాల వలన చట్టాన్ని దుర్వినియోగపరస్తున్న సంఘటనలు కోకొల్లలు. (8) ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వోద్యోగులు నిర్లక్ష్యం వహించడానికి సంబంధించి. (9) పర్యవేక్షక కమిటీల పనితీరు గురించి, ఈ చట్టాన్ని విస్తృత పరచాలి. (10) సాంకేతిక కారణాల రీత్యా దళితులుగా పరిగణించబడుతూ అత్యాచాలకు లోనౌతున్న క్రిస్టియన్, ఇస్లాం మతం వారిని ఈ చట్టం పరిధిలోకి తేవాలి. ప్రజలందరూ ఈ ప్రచారోద్యమంలో భాగస్వాములవ్వాలి.
- గెడ్డం ఝాన్సీ
Andhra Jyothi News Paper Dated : 2/09/2012 

No comments:

Post a Comment