Wednesday, October 31, 2012

ఆదివాసుల హక్కులు, చట్టాలకు కొరడిన రక్షణ ఎం సూర్యనారాయణ


  Tue, 30 Oct 2012, IST  

తూర్పు కనుమల్లో నిక్షిప్తమైన బాక్సైట్‌ను తవ్వేందుకిచ్చిన లీజులను రద్దు చేయాలంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వై కిశోర్‌చంద్రదేవ్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. జిందాల్‌, రస్‌-ఆల్‌ఖైమా, తదితర ప్రయివేటు కంపెనీలతో రాష్ట్ర మైనింగ్‌ కార్పొరేషన్‌ ఒప్పందాలు చేసుకుంది. బాక్సైట్‌ తవ్వకాల వల్ల ఆదివాసుల మనుగడకు, పర్యావరణానికి ప్రమాదం ఉందని వ్యతిరేకత వచ్చింది. ఆదివాసుల రాజ్యాంగబద్ధ హక్కులను, చట్టాలను, జీవోలను ప్రభుత్వమే తుంగలోతొక్కింది. ఐదో షెడ్యూల్‌ ప్రాంతంలో 1/70, పెసా, గిరిజన సలహా మండలి, తదితర అంశాలను పర్యవేక్షించే పెద్దదిక్కుగా రాష్ట్ర గవర్నర్‌ వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా జరగలేదు. గవర్నర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించి గిరిజనుల పక్షపాతిగా ఉండాలి. కానీ గడిచిన 60 ఏళ్లలో ఏ గవర్నరూ అలా వ్యవహరించలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా గవర్నర్‌ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌, లేటరైట్‌ అనుమతులు, విజయనగరం, శ్రీకాకుళం ఏజెన్సీలో ఏనుగుల జోన్‌ కేటాయింపు, భద్రాచలం, పోలవరం గిరిజన ప్రాంతాల్లో లక్షలాది మంది గిరిజనులు పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురికావడం, శ్రీశైలం, ఉట్నూర్‌ అటవీ ప్రాంతాల్లో అభయారణ్యాల పేరుతో గిరిజనులను తరిమేయడం, తదితర అంశాలపై గవర్నర్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ విశాఖ ఏజెన్సీలోని బాక్సైట్‌ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ పోస్ట్‌మేన్‌లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ వాదనను బలపరుస్తూ కిశోర్‌చంద్రదేవ్‌ కూడా గవర్నర్‌ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటీష్‌ వారు షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా ఏజెన్సీ ప్రాంతాలనే ఎందుకు ప్రకటించారు? ఐదవ షెడ్యూల్డ్‌ అంటే ఏమిటి? రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు ఇచ్చిన హక్కులు, చట్టాలు ఏమిటి? 244(1) అధికరణం ప్రకారం షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గవర్నర్లు కీలకం ఎందువల్ల? గవర్నర్ల తీరుపై జాతీయస్థాయిలో చర్చ జరగాలా? ఇటువంటి అనేక అంశాలు మనకు అర్థం కావాలంటే గతాన్ని పరిశీలించాలి.
స్వాతంత్య్రానికి ముందు ఆదివాసీ తిరుగుబాట్లు
దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో దోపిడీ తీవ్రంగా ఉండేది. అడవి మీద హక్కు కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం అనేక తిరుగుబాట్లు జరిగాయి. భారతదేశంలో స్వాతంత్య్రం కోసం తొలుత పోరాడింది ఆదివాసులే. 1778లో బ్రిటీష్‌ ప్రభుత్వంపై ఛోటానాగపూర్‌ ప్రాంతంలోని తిరుగుబాటు మొదటిదిగా చెప్పవచ్చు. సుదీర్ఘ స్వాతంత్య్రోద్యమాల్లో గిరిజనుల పాత్రను చరిత్రకారులు నిర్లక్ష్యం చేశారు. సంతాల్‌ తిరుగుబాట్లు, బిర్సా ముండా తిరుగుబాట్లు, కోల్‌ తిరుగుబాట్లు జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులు స్వేచ్ఛను కోరుకునేవారు. స్వయంపాలన కావాలని పోరాడారు. నాగా తిరుగుబాట్లు, మిజో తిరుగుబాట్లు జరిగాయి. మహారాష్ట్రలో గోదావరి పరులేకర్‌ నాయకత్వాన వర్లీ ఆదివాసీ పోరాటం జరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ కేంద్రంగా జల్‌, జంగిల్‌, జమీన్‌ హక్కు కోసం కొమరం భీమ్‌ ఉద్యమించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు, గాం గంటందొర, మల్లుదొర, మర్రి కామయ్య, తదితరులు అడవి మీద హక్కు ఆదివాసులకే ఉండాలని, బ్రిటీష్‌వారు మన్యాన్ని వదిలిపోవాలనీ పోరాడారు. భద్రాచలంలో కోయల తిరుగుబాటుకు ద్వారబందాల చంద్రయ్య నేతృత్వం వహించారు. ఈ విధంగా అనేక చోట్ల ఆదివాసీల తిరుగుబాట్లు పెరుగుతున్న నేపథ్యాన్ని బ్రిటీష్‌ ప్రభుత్వం గమనించింది. ఆదివాసీల అసంతృప్తిని దారి మళ్లించడానికి పథకం వేసింది. గిరిజనులకు ప్రత్యేక ప్రాంతాలు కేటాయించి వారి ప్రయోజనాలను కాపాడాలని ఎట్టకేలకు బ్రిటీష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యంతోనే గిరిజన ప్రాంతాలను షెడ్యూల్డ్‌ జిల్లాలుగా 1847లో ప్రకటిస్తూ బ్రిటీష్‌ ప్రభుత్వం చట్టం తెచ్చింది. భారతదేశంలో స్వాతంత్య్రోద్యమం విస్తరించిన సమయంలో ఉద్యమ ప్రభావం గిరిజనులపై పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంది.
స్వాతంత్య్రానంతరం ఆదివాసుల అగచాట్లు
భారతదేశంలోని గిరిజనుల గురించి 'కారల్‌మార్క్స్‌' ఈ విధంగా పేర్కొన్నారు. పారిశ్రామికీకరణ క్రమంలో గిరిజనులు తమ సొంత ప్రపంచాన్ని పోగొట్టుకున్నారని, కొత్త ప్రపంచం అందించిన ప్రయోజనాలను ఆదివాసులు అందుకోలేకపోయారని విశ్లేషించారు. ఆదివాసులు పేదవారు అయినప్పటికీ వారు నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రకృతి ఎన్నో సంపదలను పోగుచేసి పెట్టింది. అపారమైన అటవీ సంపద, తరగని ఖనిజ సంపద, జలవనరులు, విద్యుత్‌ ప్రాజెక్టులు, అటవీ ఫలసాయాలు, పర్యాటక ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. ఈ సంపద దేశానికి వరప్రసాదం వంటిది. అందుకోసం ఆదివాసులను బలిపశువులుగా మార్చడం సరైందికాదు. పారిశ్రామికీకరణ, ప్రాజెక్టులు, మైనింగ్‌, విధ్వంసకర అభివృద్ధి పేరుతో ఆదివాసులను అటవీ ప్రాంతాల నుంచి తరిమేస్తున్నారు. గిరిజన ప్రాంతాల పారిశ్రామికీకరణ వల్ల గిరిజనులు లబ్ధి పొందుతారన్నది భ్రమేనని తేలిపోయింది. గిరిజన ప్రాంతాల్లోనే పరిశ్రమలు రావడం వల్ల వారికి తగిన ఉపాధి దొరకలేదు సరికదా ఇళ్లు, వాకిళ్లు పొగొట్టుకున్నారు. బీహార్‌లోని మైధాన్‌, కోనార్‌, పంచట్‌లు, ఒడిశాలోని మందిరా, మాచ్‌ఖండ్‌, హీరాకుడ్‌ వంటి విద్యుత్‌ ప్రాజెక్టులు, ఒడిశా, మధ్యప్రదేశ్‌, బీహార్‌లోని రూర్కెలా, దుర్గాపూర్‌, భిలారు, రాంచీ ఉక్కు ప్యాక్టరీల వల్ల అధిక సంఖ్యలో గిరిజనులు నిరాశ్రయులయ్యారు. అప్పటి లెక్కల ప్రకారం 62,494 కుటుంబాలు నిరాశ్రయులు కాగా, కేవలం 14,560 కుటుంబాలకే ప్రత్యామ్నాయ ఉపాధి దొరికింది. ఈ కంపెనీలకు గనుల నిమిత్తం కేటాయించిన భూమి గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నది. మన రాష్ట్రంలో 49 వేల ఎకరాలు, గోవాలో 46 వేల ఎకరాలు, ఛత్తీస్‌గఢ్‌లో 68 వేల ఎకరాలు, ఒడిశాలో 46 వేల ఎకరాలు, కర్నాటకలో 28 వేల ఎకరాలను మైనింగ్‌ పేరుతో స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఖనిజ వనరుల తవ్వకాలు జరిగే ప్రధానమైన 50 జిల్లాలున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్న 5వ షెడ్యూల్‌ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతాల్లోని ఆదివాసులకు రక్షణ ఉంటుందని భావిస్తే అగచాట్లు తప్పడంలేదు.
గిరిజన ప్రాంతాలు - గవర్నర్ల పాత్ర
దేశ జనాభాలో ఎనిమిది శాతం మంది గిరిజనులున్నారు. వారికి రాజ్యాంగపరంగా కొన్ని రక్షణ చర్యలు పొందుపర్చారు. రాజ్యాంగంలోని 244 అధికరణ ప్రకారం షెడ్యూల్డ్‌ ప్రాంతాలను ప్రకటించారు. అత్యంత విలువైన సహజ వనరులున్న ప్రాంతాలైనప్పటికీ గిరిజనులు పేదరికంలోనే ఉన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారి హక్కులు, చట్టాలకు భంగం కల్గకుండా ప్రభుత్వాలు వ్యవహరించాలి. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌, విద్య, వైద్యం, రోడ్డు, రవాణా, తదితర సదుపాయాలు ఆదివాసులకు నేటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయి. స్వాతంత్య్రనంతరం 1950, జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. షెడ్యూల్డ్‌ తెగల జాబితాను 342 అధికరణం ద్వారా రాష్ట్రపతి ప్రకటిస్తారు. రాజ్యాంగం తెగల గురించి స్పష్టంగా పేర్కొనకపోవడం వల్ల కొన్ని తెగలు ఏజెన్సీ ప్రాంతంలో అనాదిగా ఉన్నా గిరిజనులుగా ప్రకటించడంలో అవాంతరాలు, అయోమయ పరిస్థితిలో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర గవర్నర్‌తో సంప్రదించిన తరువాత, ఏదైనా తెగనుగాని, తెగల సమూహంగాని షెడ్యూల్డ్‌ తెగలుగా గుర్తించవచ్చు. తెగలను కలిపేందుకు, తీసివేసేందుకు పార్లమెంటుకు ఆధికారం ఉన్నది.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరువాత గిరిజనుల అభివృద్ధి, సంక్షేమ బాధ్యతలను ఎన్నికైన ప్రభుత్వాలతోపాటు రాష్ట్రపతి, గవర్నర్ల ద్వారా ఏజెన్సీలో పాలన సాగిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ఆధారంగా షెడ్యూల్డ్‌ తెగల హక్కుల రక్షణకు గవర్నర్‌ కీలకపాత్ర పోషిస్తారు. నిజానికి రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రకారం ఆదివాసుల భూములపై గల హక్కులకు గవర్నర్‌ గట్టి భరోసా ఇవ్వాలి. రాష్ట్రపతి నోటిఫై చేసిన ప్రాంతాలు, తెగలు మాత్రమే ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి వస్తాయి. ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, తదితర గిరిజన ప్రాంతాలను ఐదో షెడ్యూల్‌ ప్రాంతాలుగా నోటిఫై చేశారు. ఆయా ప్రాంతాల్లో గవర్నర్లు కీలకపాత్ర పోషిస్తారు. ఐదో షెడ్యుల్‌లో మూడు ప్రధాన అంశాలను గవర్నర్లు పర్యవేక్షిస్తారు. అవి గవర్నర్‌కు ప్రత్యేక శాసన అధికారాలు ఇవ్వబడ్డాయి. రాష్ట్రపతికి గవర్నర్‌ వార్షిక నివేదికను ఎప్పటికప్పుడు సమర్పించాలి. గిరిజన సలహామండలి ఏర్పాట్లపై ముఖ్య పాత్ర పోషించాలి.
ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, ఇతర ప్రణాళికలు, ప్రాజెక్టులు, తదితరాలు నెలకొల్పాలంటే గిరిజన సలహామండలి నిర్ణయం మేరకు సాధ్యమవుతుంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోనూ 1/70ని ధిక్కరించి గిరిజనేతరులు భూములు కొనుగోలు చేయకుండా భూ బదలాయింపు చట్టం అమలు, గిరిజనేతరుల దోపిడీని అరికట్టడానికి వడ్డీ నియంత్రణ చట్టం వంటి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత వాసులకు న్యాయస్థానాలు అందుబాటులో లేని కారణంగా వారి ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులే వివాదాలను పరిష్కరించే అవకాశం కల్పించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని ఉద్యోగాలు జీవో మూడు ప్రకారం స్థానిక గిరిజనులకే కేటాయించారు. ఐటిడిఎల ద్వారా ఆదివాసుల సమగ్ర అభివృద్ధి కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించి నిధులు ఖర్చుచేయాలి. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని గ్రామాలను తొలగించాలన్నా, కొత్త గ్రామాలను షెడ్యూల్డ్‌ ప్రాంత జాబితాలో చేర్చాలన్నా రాష్ట్రపతికి మాత్రమే అధికారం ఉంటుంది. అదీ రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించిన తరువాత మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఆయా ప్రాంతాల్లో శాంతియుత పరిపాలన అందించేందుకు గవర్నర్లకు ప్రత్యేక శాసనాధికారాలను అప్పగించారు. ఐదవ షెడ్యూల్‌ రాష్ట్రాల్లోని గిరిజన శాసనసభ్యులు, గిరిజన సంక్షేమశాఖ అధికారులతో కూడిన గిరిజన సలహామండలిని ఎప్పటికప్పుడు గవర్నర్‌ సంప్రదించాల్సి ఉంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల అభివృద్ధిని, రాజ్యాంగబద్ధ నియమాల ద్వారా సంక్రమించిన చట్టాలను, హక్కులను, జీఓల అమలుతీరును పర్యవేక్షిస్తుండాలి. షెడ్యూల్‌లోని గిరిజన ప్రాంతాలకు ఏదైనా చట్టాన్ని వర్తింపజేసే లేదా మినహాయించే హక్కు రాష్ట్ర గవర్నర్‌కు ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాన్ని గవర్నర్‌ తన విచక్షణాధికారంతో సవరణతోగానీ, యథావిధిగాగానీ షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తింపజేయవచ్చు. ఆదివాసుల అభివృద్ధి, వారి జీవన ప్రమాణాలకు సంబంధించి రాష్ట్రపతికి గవర్నర్లు తమ వార్షిక నివేదికలు సమర్పించాలి. ఈవిధమైన కృషిని ఈ 60 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క గవర్నరూ అమలుచేయలేదు.
మన రాష్ట్రంలో తొమ్మిది జిల్లాల పరిధిలో సుమారు 805 గిరిజన గ్రామాలు నాన్‌షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉన్నాయి. 1976లో రాజ్యాంగానికి సవరణ చేసి షెడ్యూల్డ్‌ ప్రాంతంలో లేని మిగిలిన గ్రామాల వివరాలను పంపాలని కేంద్రం కోరింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు. అదే సమయంలో మహారాష్ట్ర, రాజస్థాన్‌ సరైన శ్రద్ధ తీసుకున్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాగా గుర్తింపు పొందాయి. దీనిపై గతంలో భద్రాచలం పార్లమెంటు సభ్యులు డాక్టర్‌ మిడియం బాబూరావు రాష్ట్రపతిని, గవర్నర్‌ను పదేపదే కోరినా సరైన స్పందన రాలేదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ తన శాసనాధికారాలను ఉపయోగించి తక్షణమే ఈ 805 గ్రామాలను ఐదవ షెడ్యూల్‌లో కలపాల్సిన ఆవశ్యకత ఉంది.
సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
-ఎం సూర్యనారాయణ
Prajashakti Telugu News Paper Dated : 30/10/2012 
  

No comments:

Post a Comment