Sunday, September 4, 2011

స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా పంచాయితీ By Oosa 05/06/2011 Surya News Paper


స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా పంచాయితీ

- వివాదాల ఊబిలో ఎన్నికల ప్రక్రియ
- వాయిదాకే పాలకుల ప్రయత్నం
- మహిళా రిజర్వేషన్లకు క్రీమీలేయర్‌ వద్దా?
- బీసీ లెక్కల సేకరణకు ఎందుకు పూనుకోరు?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష
- రాజ్యమేలుతున్న అగ్రకులాధిపత్యం

ఈ సారి జరగనున్న పంచాయితీ రాజ్‌, నగర పాలక సంస్థల ఎన్నికల నిర్వహణ వివాదాస్పదంగా, సంక్లిష్టంగా మారింది. నిర్ణీత కాలా నికి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఒకవైపు, నిర్వ హించక తప్పనిసరి పరిస్థితి మరొక వైపు ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ పరంగా జరపాలా, పార్టీ రహితంగా జరపాలా అన్న సమస్యతో పాటు బీసీ కోటా తగ్గింపు, మహిళా కోటా పెంపు, బీసీ ఓటర్ల జాబితా తయారీ, రోటేషన్‌ విధానం ఖరారు, నగరపాలక సంస్థల్లో మార్పులు చేర్పులు, చట్ట సవరణలు వంటి సమస్యలన్నీ వివాదాస్పదంగా మారి సకాలంలో ఎన్నికలు నిర్వహించటం కష్టంగా, సంక్లిష్టంగా మారింది. ఇలాంటి ప్రతికూల స్థితిలో అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదు గనుక ఈ పరిస్థితి మారేదాకా ఏదొక సాకుతో ఎన్నికల్ని వాయిదా పడేట్టు చేయటానికి పాలకులు పావులు కదుపుతున్నారు. అందుకు పంచాయితీ ఎన్నికల్లో బీసీ కోటా పంచాయితీని పావుగా వాడుతున్నారు.

అన్ని రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటరాదని సుప్రీంకోర్టు విధించిన ఆంక్షల ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచనల ప్రకారం 34 శాతం బీసీ కోటాని 24 శాతానికి తగ్గించక తప్పదని ప్రకటించిన అధికార పార్టీ మంత్రివర్గ ఉపసంఘం పెద్దలు- అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఆకస్మాత్తుగా బీసీ కోటా యథాతథంగా కొనసాగిస్తామని ప్రకటించడంలోని ఆంతర్యం- ఎన్నికలు వాయిదా పడేట్లు చూడటమే తప్ప బీసీ కోటా అమలయ్యేట్లు చూడడం కాదు.సుప్రీంకోర్టు ఆంక్షల్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అభ్యంతరాల్ని అధిగమించి బీసీ కోటా ను తగ్గించకుండా యథాతథంగా కొనసాగించటానికి అవసరమైన హేతుబద్ధమైన రాజ్యాంగ బద్ధమైన రక్షణ చర్యలేవీ తీసుకోకుండా- కాగల కార్యాన్ని గంధర్వులే నిర్వహిస్తారన్నట్లు- ఈ బంతిని ఎన్నికల కమిషన్‌, న్యాయస్థానాల కోర్టులోకి నెట్టేయడం అంటే చేతులు దులుపుకోవడమే అవుతుంది. తాము బీసీ కోటా యథాతథంగా కొనసాగించాలని చూసినా ఎన్నికల కమిషన్‌ -కోర్టులు అడ్డుకొన్నాయని నెపం వాటి మీదకు నెట్టి బీసీల ఆగ్రహాన్నించి తాము తప్పించుకోవాలని చూస్తే, ఈ మోసపూరిత ఎత్తుగడలతో బీసీలు మోసపోవటానికి సిద్ధంగా లేరు.

గత ఏడాది మే 11న సుప్రీంకోర్టు కర్ణాటక విషయంలో ఇచ్చిన ఆదేశాలు ఆ రాష్ట్రానికి పరిమితమైనవే తప్ప ఆంధ్ర ప్రదేశ్‌కు, అన్ని రాష్ట్రాలకు వర్తించేవి కావని ఇప్పుడు నమ్మబలుకుతున్న కాంగ్రెస్‌ మంత్రులు- ఇప్పటిదాకా వర్తిస్తాయని ఎందుకు వాదించారో సమాధానం చెప్పాలి. వర్తించకపోయినా వర్తింపజేసి బీసీ కోటా తగ్గించి, అగ్రకులాధిపత్యాన్ని పదిలపర్చుకొందామనే పన్నాగంతో అలా వాదించారా? ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అనే స్త్రీవాద నినాదంలాగే- జనాభాలో సగం, అవకాశాల్లో సగం అని బీసీ వాదులు ఎప్పటినుండో ఘోషిస్తురు.

అయినా, మహిళా రిజర్వేషన్‌ కోటాని 33 శాతం నుండి 50 శాతానికి పెంచి, బీసీ కోటాని మాత్రం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించడంలో అగ్రకుల వివక్ష బట్టబయలు కావడం లేదా? నిజానికి మహిళా సామాజిక వర్గం కులాతీత స్వతంత్ర సామాజిక వర్గం కాకపోయినా వారి రిజర్వేషన్‌ కోటాని సుప్రీంకోర్టు సీలింగ్‌ పరిధిలోకి, క్రీమీలేయర్‌ పరిధిలోకి తేకుండా ఉంచడం, బీసీ కోటాకి సీలింగ్‌, క్రిమిలేయర్‌ ఆంక్షలు విధించటం, మహిళా కోటాలో దళిత మహిళలకి చోటుకల్పించి, బీసీ మహిళలకు చోటు లేకుండాచేసి, ఓసి కోటా పేరిట ఎఫ్‌సీ మహిళల అగ్రకులాధిపత్యానికి పెద్దపీట వేయటం బీసీలను అణగదొక్కటంకాదా?

బీసీల్లో నిజంగా అర్హులైన వారికి రిజర్వేషన్‌ అవకాశాల్ని కల్పించడం కోసమే క్రీమీలేయర్‌ ఆంక్షలు విధించామని చెప్పడం సాకు మాత్రమే. ఆ సాకుతో బీసీకోటాని కుదించి బీసీ ముసుగులో అగ్రకులాధిపత్యాన్ని కొనసాగించుకోవడమే అంతర్యం. అందుకే క్రీమీలేయర్‌ని మినహాయించటంలో ఎంతో ఆసక్తి చూపే అగ్రవర్గాల పాలకులు బిసిలలో అత్యంత వెనుకబడిన క్రీమీలేయర్‌ ఎంబీసీల ఎడల ఎలాంటి శ్రద్ధ చూపక పోవటమే అందుకు నిదర్శనం. అంతేకాదు, అన్ని రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు సీలింగ్‌ విధించడం వలన, బీసీ కోటా రాష్ట్రంలో 25 శాతానికి (కేంద్రంలో 27 శాతానికి) కుదిస్తున్నారు.

విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్‌లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయడం వలన ఉన్నంతలో ఆ 25 శాతాన్ని గ్రూపుల వారిగా 7-10-1-7 చొప్పున అన్ని గ్రూపుల వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నారు. కానీ స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ పాటించకపోవడం వలన అత్యంత వెనుకబడిన ఎంబీసీ కులాల వారికి కనీస అవకాశాలు కూడా దక్కటంలేదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలు దక్కకపోవడమే కాదు- కనీసం సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు కూడా దక్కడంలేదు. ఈ దుస్థితి మార్చటానికి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్ల కోటాలో ఏబీసీడి వర్గీకరణ పాటించాలని హైకోర్టు అదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ పేరిట అడ్డుకోవటాన్ని బట్టి ఎంబీసీల పట్ల వారికి ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.

సుప్రీంకోర్టు విధించిన పరిమితిని అధిగమించడానికి అవసరమైన రాజ్యాంగబద్ధ, చట్టబద్ధ చర్యలేమీ తీసుకోకుండా గాలిలో దీపం పెట్టినట్లు వ్యవహారించడం బాధ్యతా రాహిత్యంకాదా? బీసీ కోటా యథాతథంగా కొనసాగిస్తామని మభ్యపెడితే కోర్టు తప్పుపడుతుందని తెలిసి కూడా ఆ నిజాన్ని కప్పిపుచ్చడం బీసీలను బలిబశువులను చేయడం కాదా? బీసీ కోటాని కొనసాగించటానికి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవడానికి, రాజ్యాంగ సవరణలు చేయటానికి తగిన సమయం లేదని, బీసీ కోటా తగ్గించడం భావ్యంకాదని, ఈ సారికి బీసీ కోటా కొనసాగించటానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల కమిషన్‌ను, కోర్టులను అభ్యర్ధిస్తామని చెప్పటం కూడా ఎన్నికల్ని వాయిదా వేయించే రాజకీయ నాటకంలో భాగమేనని భావించక తప్పదు.

గత ఏడాది మే 11న సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఇప్పటికి ఏడాది కాలందాటి పోయింది. ఎన్నికల గడువు ముంచుకొచ్చేదాకా కాలయాపన చేసి ఇప్పుడు సమయంలేదని చెప్పటం సాకు మాత్రమే. 2009 ఎన్నికల్లో తమ రాజకీయ లబ్ధికోసం దివంగత వై.ఎస్‌. ఆధ్వర్యంలో ఓటు బ్యాంకు ఎత్తుగడలతో బీసీ జాబితాలో అనేక కులాల్ని చేర్చినందువలన పెరిగిన బీసీ జాబితాకి అనుగుణంగా 40 శాతం దాకా కోటా పెంచటానికి రాష్ట్ర బీసీ కమిషన్‌ గత ఏడాది చర్యలు చేపట్టిన సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియనిది కాదు.

మే 11న ‘కర్ణాటక బీసీ కోటా’లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ రాష్ట్రంలో అమల్లో వున్న 68 శాతం రిజర్వేషన్‌ కోటా- 50 శాతం పరిమితిని దాటిపోవటాన్ని తప్పుపట్టినమాట నిజమే. ఆ కోటాకి తగిన విధంగా జనాభా లెక్కలు చూపకపోవటం అభ్యంతరకరం అని చెప్పిన మాట కూడా నిజమే. కానీ అదే ఏడాది 2010 జులైలో తమిళనాడు కోటా విషయంలో జరిపిన 9 మంది న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనం 50 శాతం పరిమితి దాటి బీసీ రిజర్వేషన్‌ కోటా పెంచదలిస్తే- బీసీ జనాభా అంత ఎక్కువగా ఉన్నట్టు ఆధారం చూపాలని చెప్పింది.

తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం అలాంటి బీసీ జనాభా లెక్కలు ఆధారంగా చూపింది గనుక 50 శాతం మించి 69 శాతం కోటా కొనసాగించడం సమసంజసమేనని తీర్పు చెప్పింది. అంతేకాదు, 1990 నాటి మండల్‌ కమిషన్‌ సిఫార్సుల సందర్భంగా ఇంద్రషానీ కేసులో 50 శాతం పరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సర్వవేళలా అనుల్లంఘనీయం కాదని కూడా వ్యాఖ్యానించింది. 2010లో ఒకే ఏడాదిలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రిజర్వేషన్‌ కోటాల విషయంలో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పులు రెండూ పరస్పర విరుద్ధమైనవి కావు. క్వాంటఫైబుల్‌ బీసీ జనాభా డేటా ఆధారంగా ఉంటే, ఆ జనాభాకి తగిన అవకాశాలు కల్పించడం రాజ్యాంగబద్ధ సామాజికన్యాయ స్ఫూర్తికి విరుద్ధం కాదనేదే ఆతీర్పు సారాంశం.బీసీ జనాభా లెక్కల్ని ఆధారంగా చూపకపోవడం వలన కర్ణాటకలో అమల్లో వున్న 68 శాతం కోటాను 50 శాతానికి తగ్గించాలని ఆదేశించింది. అది కూడా వెంటనే కాకుండా 68 శాతం కోటాను ఏడాది పాటు 2011 దాకా కొనసాగించుకోవచ్చని, ఆ లోగా బీసీ జనాభా లెక్కల సేకరణ చేపట్టమని సూచించింది. తమిళనాడు రాష్ర్ట ప్రభుత్వం బీసీ జనాభా లెక్క ల్ని ఆధారంగా చూపించింది గనుక అక్కడ 69 శాతం కోటాని కొసాగిం చుకోవటానికి అనుమతించింది.

ఈ స్ఫూర్తిని ఆధారం చేసుకొనే గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌ బీసీ కమిషన్‌ పెరిగిన బిసి జాబితాకి అనుకూలంగా బీసీ కోటా ప్రక్రియ చేపట్టింది. అందకు తగిన బీసీ జనాభా లెక్కల్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించిన మల్టీ పర్పస్‌ హౌస్‌ హోల్డ్‌ సర్వే నిర్థారించిన 42 శాతం బీసీ జనాభా లెక్కల్ని ఆధారంగా చేసుకొంది. ఇంకా నికరమైన, నిర్థిష్టమైన శాస్త్రీయమైన బీసీ జనాభా లెక్కల సేకరణ జరపటానికి, 2009 తర్వాత బీసీ జాబితాలో చేర్చిన కొత్త కులాలతో సహా బీసీ కులాలన్నిటి జనాభా లెక్కలు సేకరించటానికి రూ. 50 కోట్ల నిధుల్ని మంజూరు చేయమని రాష్ర్ట ప్రభుత్వాన్ని కోరింది.

పెరిగిన బీసీ జాబితాకి అనుగుణంగా బీసీ కోటా పెంచడానికి బీసీ కమిషన్‌ ఇంత బాధ్యతాయుతంగా కృషి చేసి రాష్ర్ట ప్రభుత్వ సహాయ సహకారాలను అర్థిస్తే, నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యం చేసినది చాలక కర్ణాటక రాష్ర్టంపై తీర్పు మేరకు బీసీకోటా తగ్గించక తప్పదనే వైఖరి తీసుకోవడం కాంగ్రెస్‌ అగ్రకులాధిపత్య కుట్ర తప్పవేరేమికాదు. బీసీ కోటా పెంచకుండా బీసీ కులాల జాబితా పెంచే బాధ్యతా రహిత వైఖరిని రాష్ట్ర ప్రభుత్వమే గాక, ఇటీవల ఒబిసి కులాల జాబితా పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టడం చూస్తే వీరి వైఖరి బీసీలను అణచివేయటమేనని స్పష్టమవుతోంది.

అంతే కాదు 72, 73 రాజ్యాంగ సవరణల ప్రకారం 1994 నుండి 2006 దాకా మూడు సార్లు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు జరగడం రాజ్యాంగ బద్ధం, చట్టబద్ధం అయినప్పుడు- సుప్రీంకోర్టు ఆంక్షలు విధించడం న్యాయం కాదు. ఒకవేళ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అనివార్యమైతే 34 శాతం బీసీ కోటాకి రక్షణ కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేయడం కేంద్రప్రభుత్వం బాధ్యత.

బీసీ కోటాకి ఆంక్షలు విధిస్తూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణకి పూనుకొని బీసీలకు కల్పించిన రాజకీయ రిజర్వేషన్‌ హక్కుల్ని, అవకాశాల్ని రక్షించి ఉండాల్సింది. లేదా కేంద్రప్రభుత్వ మార్గదర్శకత్వంలో రాష్ట్రాలవారీ బీసీకులాల జనాభా లెక్కల సేకరణకి అనుమతి ఇచ్చి అందుకు తగిన చర్యలు తీసుకుని ఉండవలసింది. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నా బీసీల ఎడల ఆ రెండూ ఒకే రకంగా వివక్ష చూపడం అగ్రకులాధిపత్య వైఖరికి నిదర్శనం. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నియామకాల్లో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కోసం వెంపర్లాడడమే జరుగుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం దొడ్డిదారిలో బీసీ కోటాకి భంగం కలిగిస్తే, ఎన్నికల్ని వాయిదా వేస్తే, బీసీల ఆగ్రహానికి గురై తగిన మూల్యం చెల్లించుకోలేక తప్పదు.

No comments:

Post a Comment