Wednesday, May 1, 2013

మేడే ఇన్‌ ఇండియా టుడే! ---ఉ.సా.,



నాడు వేతన బానిసల తిరుగుబాటు
జీతాల కోసం కాదు, జీవితాల కోసం
వర్గ దృక్పథంతో ఉద్యమాలు పక్కదారి
గులాం గిరిపై మహాత్మా ఫూలే పోరాటం
బొంబాయిలో బడుగుల తొలి ఉద్యమాలు
కుల కోణాన్ని స్పష్టం చేసిన అంబేడ్కర్‌
కుల వివక్ష వ్యతిరేక పోరాటానికి పిలుపు 


అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినాల కోసం మే 1న ఆనాటి కార్మికులు చేసిన వీరోచిత పోరాటం రక్తసిక్తమై చరిత్ర సృష్టించింది. నిప్పురవ్వ దావానలంగా మారినట్లు చికాగో కార్మికుల పోరాట స్ఫూర్తితో ప్రపంచ దేశాలన్నిటా 8 గంటల పనిదినాన్ని పాటించే పరిస్థితి ఏర్పడింది. ఆరకంగా చరిత్ర సృష్టించిన ‘మేడే’ ప్రపంచ వ్యాపిత కార్మిక హక్కుల సాధన దినోత్సవంగా, అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా చరిత్ర ప్రసిద్ధిగాంచింది. అలా చరిత్ర సృష్టించిన ఈచరిత్రాత్మక పోరాటానికి రెండు లక్షణాలు న్నాయి. మనిషి తత్వంతో, మానవీయ గౌరవం కోసం మహోన్నత చైతన్యాన్ని ప్రదర్శించిన మానవజాతి లక్షణం ఒకటైతే మరొకటి కార్మికవర్గ అంతర్జాతీయ లక్షణం.

అవధులులేని ధన దాహంతో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు షిప్టులవారీగా రేయింబవళ్లు కార్మికుల చేత గొడ్డుచాకిరి చేయించిన పెట్టుబడిదారీ వర్గంపై జరిగిన ఆనాటి తిరుగుబాటును ఒక్కమాటలో వేతన బానిసల తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు. ఇది జీతాల కోసం జరిగిన ఆర్థిక పోరాటంకాదు, జీవితాలకోసం జరిగిన రక్తసిక్త జీవన్మరణ పోరాటం, మనిషిని మనిషిగా కాక గొడ్డులా చూసి రేయింబవళ్లు గొడ్డుచాకిరి చేయించిన దోపిడీ వర్గాల అమానుషత్వంపై జరిగిన తిరుగుబాటు, ఈ అమానుషత్వాన్ని ప్రదర్శించిన పెట్టుబడిదారీ వర్గానికి, తిరుగుబాటు చేసిన కార్మిక వర్గానికి ఇరువురికి గత బానిస వ్యవస్థ నాటి వారసత్వ ఛాయలున్నాయి. మధ్యయుగాల్లో ఎన్నో శతాబ్దాలపాటు బానిసత్వ ప్రయోజనాలను అనుభవించి అభివృద్ధి చెందిన పాశ్చాత్యదేశాల పాలకవర్గాలు 19వ శతాబ్దంలో బానిసత్వాన్ని నిషేధించక తప్పలేదు.

అయితే ఈ నిషేధానికి దోహదపడిన అంశాల్లో మానవీయ ఉదారవాదం కన్నా, అభ్యుదయ ఆదర్శవాదం కన్నా, ఆర్థిక ప్రయోజన వాదమే ప్రధానాంశంగా పనిచేసింది.ఆనాటి బానిస యుగంలో బానిసలు బతికి బట్టకట్టకుండా వారిచేత దాస్యం చేయించు కోవటం సాధ్యంకాదు గనుక వారికి తిండి, బట్ట, నివాసం సమకూర్చి వారిని పోషించే బాధ్యత బానిస యజమానులు చేపట్టాల్సి వచ్చేది. దుర్భరమైన ఆ బానిసత్వాన్ని భరించలేక బానిసలు తప్పించుకు పారిపోయే పరిస్థితి రీత్యా వారికి కాపలా పెట్టాల్సి వచ్చేది. పశువుల సంతలో గొడ్డును కొన్నట్లు బానిసలల సంతలో ఒకసారి బానిసను కొనుక్కొచ్చాక ఇక అతనికి వేతనం ఇవ్వకుండా జీవితాంతం ఊడగించేయించుకోవచ్చు.

వారికి సంతాన యోగ్యం కల్పించి, వారి సంతానాన్ని కూడా బానిసలుగా వాడుకోవచ్చు. అంత ప్రయాస ఎందుకనుకుంటే సంతాన యోగ్యత లేకుండా చేసి, చచ్చిందాకా వాడుకొని సంతలో మరోకొత్త బానిసను కొనుక్కోవటం చౌకబేరం అని అలాకూడా చేశారు. పారిశ్రామిక విప్లవం తరువాత, ఫ్యాక్టరీలు నెలకొల్పిన తరువాత పెట్టుబడిదారీ పాలకవర్గాల ఆలోచనల్లో మార్పువచ్చింది. వేతనం ఇవ్వకుండా ఎంతకాలమైనా ఊడిగం చేయించుకునే బానిసత్వంలో బానిసల పోషణ బాధ్యత బానిసయజమా నుల మీద ఉండేది. ఈ ప్రయాసకన్నా పోషణ బాధ్యతలేని వేతన బానిసలుగా వారిని మార్చుకోవటం మిన్న అనే చౌకబారు ఆలోచన వచ్చింది. వేతనంలేని బానిస, వేతన బానిస అనే తేడా- వేతనం విషయంలో తప్ప బానిసత్వ ఆలోచనలో మౌలిక మార్పురాలేదు.

అందుకే రేయింబవళ్లు శ్రామికుల్ని గొడ్డుచాకిరి చేయించే పరిస్థితి కొనసాగింది. కాని ఈ అమానుష బానిస సంకెళ్ల ఆనవాళ్లను కూడా తెగదెంచివేసే మానవీయ చైతన్యంతో చికాగో కార్మికులు చేసిన తిరుగుబాటు వేతన బానిసలు చేసిన తిరుగు బాటుగా మరోచరిత్ర సృష్టించింది. మొదటగా పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థను నెలకొల్పిన ఇంగ్లండ్‌ దేశంలో బానిసత్వాన్ని నిషేధించే ఉద్యమానికి శ్రీకారం చుట్టినా, బానిసత్వానికి ముగింపు పలికినది మాత్రం అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే. ఈ చరిత్రక నేపథ్యంలోనే అమెరికాలోని చికాగో నగర కార్మికులు వేతన బానిసత్వంపై తిరుగుబాటు చేశారు. ఇది యాదృచ్ఛికం కానీ, చికాగో కార్మికుల మేడే పోరాట యదార్థ వ్యదార్థ చరిత్ర. ఇక ఈ పోరాటానికి ఉన్న కార్మికవర్గ అంతర్జాతీయ లక్షణం విషయానికి వస్తే, దీనికి ఉన్న రాజకీయ ప్రాముఖ్యతను గుర్తించిన మార్క్‌‌స, ఏంగిల్స్‌ మహాశయులు ఈ ప్రాముఖ్యతకు మేధోరూపం ఇచ్చారు.

తమ జీతాల కోసం కాక జీవితాల కోసం మనిషితత్వాన్ని, మానవత్వాన్ని చాటిచెప్పిన చికాగో కార్మికుల చైతన్యం సర్వమానవ చైతన్యానికి ప్రతీక అని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతేకాదు కార్మికవర్గం తమను తాము విముక్తి చేసుకోవటడం కోసం జరిపే కార్మికవర్గ పోరాటం, ప్రపంచ పెట్టుబడిదారీ వర్గాన్నే రాజ్యాధికారం నుండి కూలదోసి, సోషలిజాన్ని స్థాపించి కమ్యూనిజాన్ని సాధించే విప్లవాత్మక చారిత్రక కర్తవ్యం నెరవేర్చగల అంతర్జాతీయ విప్లవాత్మక శక్తి సామర్థ్యాలున్న పోరాటం అని పతాకస్థాయిలో అభివర్ణించారు. ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడు గనుక ప్రపంచ దేశాలన్నింటా ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి! పోరాడితే పోయేదేం లేదు బానిససంకెళ్లు తప్ప! వస్తే మరో ప్రపంచమే, వర్గరహిత కమ్యూనిస్టు ప్రపంచమే సాక్షాత్కరిస్తుంది’ అని 1848 నాటి ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో చరిత్రాత్మక పిలుపునిచ్చారు.

సరిగ్గా ఇదే సమయానికి మార్క్‌‌స సమకాలికుడైన మహాత్మజ్యోతి రావు ఫూలే భారతదేశీయ బ్రాహ్మణీయ బానిసత్వం (గులాంగిరి)పై తిరుగుబాటు ప్రకటిస్తూ అందుకు తొలిమెట్టుగా 1948లో శూద్రాతి శూద్ర బహుజన బాల బాలికలకు తొలి పాఠశాలను ప్రారంభించాడు. తరతరాలుగా శుద్రాతి శూద్ర బహుజనులను విద్యకు, విజ్ఞానికి, ఆస్తికి, అధికారానికి శాశ్వతంగా దూరంచేసి బ్రాహ్మణీయ అగ్రవర్ణ పాలకవర్గ ద్విజులకు స్వచ్ఛందంగా ఊడిగం చేయించుకొంటున్న ప్రగతి నిరోధక బ్రాహ్మణీయ గులాం గిరిని సవాల్‌ చేశారు. వ్యక్తి స్వేచ్ఛను, వృత్తి స్వేచ్ఛను హరించి, సమానహక్కుల్ని మానవహక్కుల్ని నిరాకరించే వివక్షా పూరిత కుల కట్టుబాట్లకి, అంతస్తులవారీ అసమానతల కుల కట్టడానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రకటించారు.అదేక్రమంలో అప్పుడప్పుడే బ్రిటిష్‌ వారి తోడ్పాటుతో బొంబాయిలో బ్రాహ్మణ- మార్వాడీ అగ్రవర్ణ పారిశ్రామిక వేత్తలు స్థాపిస్తున్న పరిశ్రమల్లో కార్మికులుగా చేరుతున్న శుద్రాతి శూద్ర బహుజన కార్మికుల కడగండ్లను తీర్చటానికి మహాత్మ ఫూలే సహచరుడు లోఖండే తొట్టతొలి కార్మిక సంఘాల స్థాపనకు నాందిపలి కాడు.

కూలి వివక్షకు, లింగ వివక్షకు తావులేని విధంగా కార్మికులందరికీ సమాన పని కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల పని పరిస్థితుల్లో, జీవన పరిస్థితుల్లో ఉన్న దుర్భరత్వాన్ని మార్చాలని, కార్మికుల ప్రాణభద్రతకు, ఆరోగ్య భత్రకు పారిశ్రామిక యాజమానులు బాధ్యత వహించాలని, 10 గంటల పని దినాన్ని పాటించాలని డిమాండ్‌ చేశారు. అలాగే బాలకార్మికతను, పాకీ పనిని, వెట్టిచాకిరిని రూపు మాపాలని ఎలుగెత్తి చాటారు. వీరి పోరాట ఫలితంగా భారతదేశ కార్మికుల ప్రత్యేక స్థితిగతుల్ని అధ్యయనం చేయటానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇన్‌స్పెక్టర్‌ ‘ఖాడ్‌కింగ్‌’ కమిటీని నియమించింది. ఆరకంగా 1881 నాటికి బ్రిటిష్‌ ఇండియాలో చట్టబద్ధమైన ‘కార్మిక (హక్కుల) చట్టం’ రాటానికి కారకులు కమ్యూనిస్టులు కాదు, కమ్యూనిస్టులు స్థాపించిన రెడ్‌ ట్రేడ్‌ యూనియన్లు కావు, ఫూలే ఆలోచనా విధానం ఫలితంగా లోఖండే నాయకత్వంలో ఏర్పడిన బ్లూ ట్రేడ్‌ యూనియన్స్‌ కృషి ఫలితమే.

1920-30 మధ్య భారత దేశంలో ఉనికిలోకి వచ్చిన కమ్యూనిస్టుపార్టీ, దానికి నాయకత్వం వహించిన బ్రాహ్మణీయ అగ్రవర్ణ శక్తులు- స్వీయాత్మక అగ్రకుల నేపథ్యంలో, యాంత్రిక మార్కిస్టు కార్మి వర్గ అంతర్జాతీయ దృక్పథంతో వారు ప్రక్కదారి పట్టడమే గాక భారతదేశ కార్మికుల్ని పక్కదారి పట్టించారు. ‘ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ దేశమందున్నా పేదలంతా ఒకటి, బాధలన్నీ ఒకటి! ప్రపంచ పేదలారా! ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అని పిలుపు నిచ్చారు. మహాత్మఫూలేని తన గురుతుల్యునిగా భావించిన డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ రంగప్రవేశం చేశాక, కులాన్ని విస్మరిస్తున్న బ్రాహ్మణీయ భారత కమ్యూనిస్టు నేతలపై ప్రత్యక్ష విమర్శ నాస్త్రాలను సంధించాడు. ప్రపంచంలో ప్రతి వ్యక్తీ ఏదోఒక వర్గానికి చెంది ఉంటాడని మార్క్‌‌స చెప్పిన విషయం ఇండియాకు మినహాయింపు కాదు.

కానీ కులాధీన వర్గవ్యవస్థ ఓ ప్రత్యేక వ్యవస్థగా ఉన్న ఇండియాలో ప్రతివ్యక్తీ ఏదో ఒక వర్గానికి చెంది ఉన్నట్లే, ప్రతి వర్గం ఏదొక కులానికి చెంది ఉంటుందని స్పష్టం చేశాడు. వర్గ పరమైన సాధారణ శ్రమ విభజనని- కుల పరమైన అసాధారణ శ్రామికుల విభజనగా మార్చిన కుల వ్యవస్థలో వర్గ వ్యత్యాసాలు అంతస్తులవారీ కుల-వర్గ వ్యత్యాసాలుగా మార్చారని స్పష్టంచేశాడు. అందువల్ల ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అని మార్క్‌‌స ఇచ్చిన కార్మికవర్గ అంతర్జాతీయ పిలుపు ఇండియాలో యథాతధంగా అమలు కాదని 1930 నాటి ‘కులనిర్మూలన’ గ్రంథంలో స్పష్టంచేశారు. నిమోన్నత, స్పృశ్యా స్పృశ్య కుల వివక్షను పాటించేందుకు ఆస్కారమున్న భారత కార్మికవర్గం ఉద్యమంలో కులవివక్షా వ్యతిరేక వర్గపోరాట దృక్పథాన్ని పాటించకపోతే కార్మికవర్గ సమాన హక్కులు కార్మికులందరికీ సమానంగా దక్కవని చాటిచెప్పాడు.

ఈ నేపథ్యం నుండే 1936లో ‘స్వతంత్య్ర మజ్దూర్‌ పార్టీ’ (ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ)ని స్థాపించాడు. ఈ పార్టీ తరఫున కార్మిక పక్షాన నిలిచి. బొంబాయి లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో గెలిచి, బొంబాయి కౌన్సిల్‌లో పారిశ్రామిక వివాదాల బిల్లుమీద జరిగిన చర్చల సందర్భంగా కార్మికుల సమ్మెహక్కు రాజ్యాంగబద్ధ చట్టబద్ధ హక్కుగా మారడానికి దోహదపడి భారత కార్మికులకు సమ్మె హక్కును సాధించి పెట్టాడు. ఈ పార్టీ జెండా ఎర్రజెండా! ఎర్రజెండా అలాగే 1928లో బొంబాయిలో జరిగిన జౌళి మిల్లు కార్మికుల సమ్మె పోరాటంలో కమ్యూనిస్టులతో చేతులు కలిపి పోరాడాడు. ఆ సందర్భంలోనే ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికుల్లోనున్న కులవివక్షకు వ్యతిరేకంగా కూడా పోరాడాలని డిమాండ్‌ చేసి, ఈ డిమాండ్‌ని ట్రేడ్‌ యూనియన్‌ పోరాట డిమాండ్లలో చేర్చాలని ప్రతిపాదించాడు.

అంతేకాదు, ఆయన స్థాపించిన పార్టీకి ఎర్రజెండాను ఎంచుకున్నాడు. ఆ ఎర్రజెండాపై 11 నక్షత్రాల గుర్తులుంచాడు. ఈ 11 నక్షత్రాలు బ్రిటిష్‌ ఇండియాలో ఉన్న 11 ప్రావిన్సెస్‌కి సంకేతమని చెప్పి హిందూ జాతీయ వాదులు ముందుకు తెచ్చే అఖండ భారత హిందూ రాష్ట్ర భావనకి ప్రతిగా ప్రత్యామ్నాయ ఫెడల్‌ జాతీయ భావాన్ని ఎంచుకున్నాడు. ఇండియా సంయుక్త రాష్ట్రాల ఫెడరల్‌ రిపబ్లిక్‌ స్థాపన కోసం స్వతంత్య్ర, ప్రజాతంత్ర రాజ్యస్థాపనకోసం తాను నెలకొల్పిన స్వతంత్ర మజ్దూర్‌ పార్టీతో చేతులు కలపమని కమ్యూనిస్టులకు విజ్ఞప్తి చేశారు. కాని వారు బ్రాహ్మణీయ హిందూ జాతీయవాద మత తత్వాన్ని ముందుకు తెచ్చిన- అగ్రవర్ణ పాలకవర్గాల అఖండ భారత రెండు జాతుల సిద్ధాంతాన్ని బలపరిచి, కుహనా జాతీయ కాంగ్రెస్‌కు చేయూతనిచ్చి స్వతంత్ర భారత దేశంలో రాజ్యాధికారాన్ని కాంగ్రెస్‌ చేతికి అప్పగించారు.

ఇండియాలో వర్గాన్ని అంట్టిపెట్టుకొని ఉండే కులాన్ని, కుల వివక్షని పరిగణలోకి తీసుకో కుండా, కార్మిక వర్గపోరాటానికి కులవివక్షా పోరాటాన్ని జోడించకుండా ఇండియా కమ్యూనిజాన్ని స్థాపించాలని ఆశించే అగ్రవర్ణ కమ్యూనిస్టుల కల నెరవేరదని ‘ఫ్రీ రిక్విజైడ్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ కమ్యూనిజం’ అనే గ్రంథంలో ఆనాడే తీల్చి చెప్పాడు. ఆయన చెప్పిందే నిజమని చరిత్ర చాటిచెప్పింది. అంతేకాదు, పెట్టుబడి పాలకవర్గాల మెడలు వంచి కార్మికవర్గం, ఇండియాలో కులపీడిత శ్రామికవర్గం పోరాడి సాధించుకునే హక్కులకు రాజ్యాధికారం లేకుండా గ్యారంటీ లేదని మార్క్‌‌సకు దీటుగా చారిత్రక దృష్టితో అంబేడ్కర్‌ చెప్పినట్లే ఈనాటి ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ తాలూకు నూతన ఆర్థిక విధానం వలన ఆనాడు కార్మికులు, దళిత కార్మికులు సాధించుకున్న ట్రేడ్‌ యూనియన్‌ హక్కులు, రిజర్వేషన్‌ హక్కుల్ని కూడా కోల్పోవలసి వచ్చింది. అంతేకాదు, మేడే స్ఫూర్తితో ఆనాడు అమల్లోకి వచ్చిన ఎనిమిది గంటల పనిదినం కూడా అమల్లో లేకుండా పోయింది. ఈ మొత్తం పరిస్థితిని ఒక్క మాటలో ‘మేడే ఇన్‌ ఇండియా టుడే’ అని వ్యాఖ్యానించవచ్చు.


Surya Telugu News Paper Dated : 1/5/2013 

No comments:

Post a Comment