సామాజిక భౌగోళిక తెలంగాణ
- ఉ.సా.
భౌగోళిక - సామాజిక తెలంగాణ వాదోపవాదాల్లో ఏదిముందు ఏది తర్వాత? ఏది ముద్దు ఏది వద్దు? ఏది ముఖ్యం ఏది అముఖ్యం? ఏది అద్వితీయం ఏది ద్వితీయం? ఏది పోటీ ఏది కాదు? అనే అంశాలపై హేతుబద్ధం గా జరగాల్సిన సిద్ధాంత చర్చ అవగాహనా రాహిత్య వితండవాద రాద్ధాంతంగా రచ్చకెక్కుతున్నది. భౌగోళిక - సామాజిక ఉద్యమాల్లో ఏ ఉద్యమా న్ని ఎలా గుర్తించాలి? ఆయా ఉద్యమాల్ని బేషరుతుగా బలపర్చాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీమాంధ్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఉమ్మడిగా ఎదుర్కొంటున్న కుల-వర్గ దోపిడీ పీడనల సమస్యలే గాక తెలంగాణ ప్రాంత ప్రజలు అదనంగా ఎదుర్కొంటున్న వలసీకరణ ప్రత్యేక సమస్య ఏమిటి?
దాని వలన ఉత్పన్నమవుతున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రత్యేకత ఏమిటి? స్థలకాలస్థితిగతుల వర్తమాన ప్రాసంగికత (రెలివెన్స్) ఏమిటి? అద్వితీయ ప్రాధాన్యత (ప్రామినెన్స్) ఏమిటి? భౌగోళిక - సామాజిక అంశాల మధ్య పొంతన ఏమిటి? వాటి ఎడల అనుసరించాల్సిన విభిన్న వైఖరులేమిటి? అనే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానాలు రాబడితేనే ఈ వితండవాద వివాదంలోని నిజానిజా ల్ని వెలికితీసి ఎవరితప్పేమిటో నిగ్గు తేల్చగలం. ఏ ఉద్యమానికైనా మెజారిటీ ప్రజల న్యాయమైన ఆకాంక్ష ప్రాతిపదికగా వుండాలి. ప్రజాస్వామిక స్వభావం కలిగి వుండాలి. అపుడే అది ప్రజాస్వామిక ప్రజా ఉద్యమంగా పరిగణించబడుతుంది.
ఆ ప్రజా ఉద్యమ పరిధికి, ప్రాంతానికి సంబంధించిన వారెవరూ ప్రజాభీష్టాన్ని కాదనలేని, కాదని మనలేని సామాజిక ఆమోదం లభిస్తుంది. భౌగోళిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, బహుజన సామాజిక న్యాయ ఉద్యమాలు దేనికదే న్యాయమైన, సమంజసమైన ప్రాం తీయ సామాజిక ప్రజాస్వామిక ఉద్యమాలుగానే పరిగణించబడతాయి. సాకులతో, షరతులతో, ఆంక్షలతో, పోటీ నినాదాలతో, ఏ రూపంలో ఈ ఉద్యమాలను వ్యతిరేకించినా, ఆ వ్యతిరేకతను ఏ ముసుగులో కప్పిపుచ్చాలని చూసినా వారు ప్రజా వ్యతిరేకులుగా తిరస్కరించబడతారు.
భౌగోళిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అదనపు ప్రత్యేకత ఏమిటో, బహుజన సామాజిక న్యాయ ఉద్యమం విలక్షణత్వం ఏమిటో, ఈ అంశాలను ఏకకాలంలో ఎలా మేళవించాలో సరిగా అర్థంకాక సైద్ధాంతిక అవగాహనా రాహిత్యంతో ఆచరణలో ఈ తప్పుచేసేవారిని హేతుబద్ధ సిద్ధాంత చర్చతో కనువిప్పు కలిగించి ఉద్యమంలో కలుపుకురావచ్చు. ఇక ఉద్దేశపూర్వకంగా తెలిసితప్పుచేసే స్వార్థపర, సంకుచిత, అశ్రితవాద, అవకాశవాద శక్తుల్నిమాత్రం కళ్లు తెరిపించి కనువిప్పు కలిగించలేం. అందుకే అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని డా.బి.ఆర్. అంబేద్కర్ తన అంతిమ సందేశ వ్యాసంలో "స్వార్థం హేతువుకు లొంగదని, హేతుబద్ద సిద్ధాంత చర్చకి తలొగ్గదని'' స్పష్టం చేశాడు.
ఏ నిబద్ధతకి కట్టుబడకుండా, ఏ నిబంధనకి పట్టుబడకుండా, కనీసం తమ మాటమీదైనా తాము నిలబడకుండా సమయానుకూలంగా «ప్లేటు ఫిరాయించే, ధైర్యంగా బుకాయించే వితండవాద, వివాదాస్పద, అవకాశవాద శక్తులను మాత్రం అవగాహనా పరమైన సిద్ధాంత చర్చతో మార్చలేం. సంకుచిత స్వప్రయోజనాలనే బహుజన ప్రజాప్రయోజనాలుగా, బూటకపు సామాజిక న్యాయాన్నే నిజమైన సామాజిక న్యాయంగా బులిపించేవారి నిజస్వరూపాన్ని బహిర్గతపర్చి, మిగతా బడుగువర్గ బహుజనుల్ని వారి బారిన పడకుండా అప్రమత్తం చేయాలి. సీమాంధ్ర వలస పెత్తందార్ల అంతర్గత వలసీకరణ భల్లూకపు పట్టునుండి బైటపడితే తప్ప తెలంగాణకి దాస్యవిముక్తిలేదనే స్పష్టతతో, స్వపరిపాలనాధికార ఆకాంక్షతో సాగుతున్న ప్రజా ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం.
ప్రత్యేక తెలంగాణ జన్మహక్కు అని ఎలుగెత్తి చాటుతున్న ఈ భౌగోళిక తెలంగాణ ఉద్యమం దానికదే ఓ ప్రాంతీయ ప్రజాస్వామ్య ప్రజా ఉద్యమం. కనుక బేషరతుగా బలపర్చటంతప్ప దాన్ని వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు. కానీ ప్రాంతీయ వలసీకరణతోపాటు కుల - వర్గ, పితృస్వామ్య దోపిడీ పీడనల లాంటి అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ఒక్క భౌగోళిక తెలంగాణ ఉద్యమమే చాలదు. తెలంగాణ ప్రాంతీయ నిర్వలసీకరణ ఉద్యమం సీమాంధ్ర అగ్రకుల సంపన్నవర్గాల వలసపెత్తందారీతనం నుండి మాత్రమే దాస్య విముక్తి కలిగిస్తుంది.
అదే దాని ప్రత్యేకత అదే దాని పరిమితి కూడా. అంటే తెలంగాణలో సైతం సర్వసాధారణమైన అగ్రకుల ధనికవర్గాల సామాజిక గుత్తాధిపత్యం యధాతధంగా కొనసాగుతూనే వుంటుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ విభాగంలో, న్యాయవిభాగంలో, సెక్రటేరియట్‌లో తెలంగాణ భౌగోళిక జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయంగా లభించాల్సిన 42 శాతం భాగస్వామ్యం లభిస్తే అందులో అధిక భాగం తెలంగాణ అగ్రకుల ధనికవర్గాలవారే అన్యాయంగా హస్తగతంచేసుకొని సామాజిక అన్యాయానికి పాల్పడ్డారు.
హైకోర్టు అడ్వకేట్ జనరల్, సెక్రటేరియట్ సెక్రటరీలలో అగ్రకుల పెత్తందార్లే ఆధిపత్యం చలాయిస్తున్నారు. దళితులపై వివక్ష, బడుగులపై దాడులు, సంక్షేమ నిధుల దారిమళ్లింపు, స్థానిక సంస్థల్లో బిసిల రాజకీయ రిజర్వేషన్ కుదింపు, స్త్రీల వేధింపు, నేతన్నల ఆకలిచావులు, ఆత్మహత్యలు, క్రాప్ హాలిడేలు, సింగరేణి కార్మికుల రిట్రించ్‌మెంట్ల లాంటి కుల వర్గ పితృస్వామ్య సమస్యలపై పాక్షిక పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక తెలంగాణ వచ్చేదాకా ఈ సమస్యలపై పోరాటాలు వద్దంటే, భౌగోళిక తెలంగాణ వాదం తప్ప సామాజిక తెలంగాణ వాదం ఊసెత్తొద్దంటే కుదరదు.
కులాతీత, వర్ణాతీత, భౌగోళిక తెలంగాణ వాదం అగ్రకుల ధనికవర్గాలకి లాభదాయకంగా, అణగారిన కులాల పేదవర్గాల వారికి నష్టదాయకంగా పరిణమిస్తుంది. ఈ పరస్పర విరుద్ధ కుల-వర్గ వైరుధ్యం వలన ఎవరి ప్రయోజనాల కోసం వారు పాటుపడతారు. పోటీపడతారు. కుల-వర్గ సామాజిక వాస్తవికతను అలా ప్రతిబింబిస్తుంటారు.
భౌగోళిక సామాజిక తెలంగాణ వాదాలు రెండూ తెలంగాణ దళిత బహుజన పేదవర్గాల జన్మహక్కు. ఈ ఉమ్మడి హక్కును కాదనే హక్కు ఎవరికీ లేదు. మరికాస్త విడమర్చి చెప్పాలంటే భౌగోళిక తెలంగాణ వచ్చేదాకా సామాజిక తెలంగాణ వాదాన్ని పక్కనపెట్టమనే హక్కు తెలంగాణ అగ్రకుల దొరలకు లేనట్లే. సామాజిక తెలంగాణ వచ్చేదాకా భౌగోళిక తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టమనే హక్కు దళిత బహుజన బడుగువర్గాల వారికి కూడా లేదు. ఎందుకంటే సీమాంధ్ర పెత్తందారీతనానికి తెలంగాణ అగ్రకుల దొరలతోపాటు బడుగువర్గాల వారు ఉమ్మడిగా గురవుతున్నారు.
అందుకే "ప్రాణాలైనా అర్పిస్తాం, తెలంగాణ సాధిస్తాం'' అనే నినాదానికి ఆచరణాత్మకత కల్పించిన బలిదానాల్లో బడుగులే అత్యధికులు. అలాగే భౌగోళిక సామాజిక తెలంగాణ వాదాలను ఒకదానికొకటి ఎదురెదురుగా పోటీపెట్టి, ఏదొకదాన్ని ముందుపెట్టి మరొకదాన్ని వెనక్కినెట్టే హక్కు ఎవరికీ లేదు. ఒక్కమాటలో భౌగోళిక తెలంగాణకి జై కొడదాం! తెలంగాణకి జైకొట్టే సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణకి కూడా జై కొడదాం.
- ఉ.సా.
చైర్మన్ : సామాజిక ఆంధ్ర - తెలంగాణ సమన్వయ కమిటీ
No comments:
Post a Comment