Sunday, September 1, 2013

ఏది ప్రజాభీష్ఠం, ఏది ప్రజాస్వామ్యం? By ఉ.సా


'నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కాదు ప్రజలే' అని తెలుగు భాషా దినోత్సవ సభలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన సంచ లనాత్మక వ్యాఖ్యల ఉద్దేశ్యమేమిటో గ్రహించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానిష్టంకాదు, కేంద్ర ప్రభుత్వ ఇష్టంకాదు, ప్రజాభీష్ఠమే ఫైనల్ అనడం అధిష్ఠానాన్ని ధిక్కరించటమో లేక అనుకరించటమో తేలాల్సి ఉంది. జగన్‌మోహన్ రెడ్డి హవాని అడ్డుకోవడానికి అదే సామాజి క వర్గానికి, అదే ప్రాంతానికి చెందిన అడ్డుపుల్లగా అధిష్ఠానం దయాదాక్షిణ్యా లమీద ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్ఠానాన్ని ధిక్కరించేంత సత్తాఉందా? ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న సత్తాని దృష్టిలోపెట్టుకొని సీమాంధ్ర వలస పెత్తందార్ల స్వార్థ ప్రయోజనాలను కాపాడటం కోసం ఇంతకు తెగించారా, లేక సీమాంధ్రలో కూడా రాజకీయ లబ్ధిపొందటం కోసం అధిష్ఠానం ఆదేశాలతోనే ఈ అంతర్నాటకం ఆడుతున్నారా అనేది త్వరలోనే బయటపడక తప్పదు. మన దేశ రాజ్యాంగ నిర్మాత డా॥ బి.ఆర్. అంబేడ్కర్ ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏసామాజిక వర్గానికైనా, ఏప్రాంతానికైనా ఎలాంటి వివక్షకి, అన్యాయానికి తావులేకుండా సమాన గౌరవం, సమాన అవకాశాల కల్పనద్వారా సమాన సమగ్ర అభివృద్ధి సాధించే సామాజిక న్యాయాన్ని పాటించడం అందులో ముఖ్యాంశం. సేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో కూడిన సమసమాజాన్ని స్థాపించటం మరో ముఖ్యాంశం. ఈ రెండింటి సారాంశమే మన¬దేశ రాజ్యాంగ అంతిమ లక్ష్యమని ప్రియాంబుల్‌లో పొందుపరిచారు.

ఈ కారణంగానే ఓ ప్రాంతం మరో ప్రాబల్య ప్రాంతంవారి ప్రాంతీయ ఆధిప త్యానికి అన్యాయానికి గురైనపుడు ఆ దుస్థితి నుండి బైటపడటానికి ఆప్రాంతం వారికి స్వయంపాలనాధికారాన్ని కల్పించటం ప్రజాస్వామ్య బద్ధమే, రాజ్యాంగ బద్ధమేనని ఆర్టికల్-3లో పొందుపర్చాడు. అలాగే ఒక సామాజిక వర్గం మరో సామాజిక వర్గంపై సామాజిక ఆధిపత్యానికి అన్యాయానికి పాల్పడినపుడు వారికి సామాజిక న్యాయం కల్పించటమే రాజ్యాంబద్ధ సామాజిక ప్రజాస్వామ్యం అని స్పష్టంచేశారు. ఈ రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారమే సామాజిక న్యాయ సాధికారకల్పన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లాంటి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చటం రాజ్యాంగబద్ద ప్రజాస్వామిక ప్రక్రియ అవుతుంది.

మెజారిటీ ఓట్లు, సీట్లు గెలిచి ప్రజాభీష్టాన్ని చూరగొన్న పార్టీకి అధికారం కట్టబెట్టమేకాదు, న్యాయమైన ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేరుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీఇవ్వటం, అధికారంలోకి వచ్చాక మాటతప్పకుండా, ప్రజల్ని మోసగించకుండా ఆ హామీని అమలుజరగటం కూడా ప్రజాస్వామిక ప్రక్రియే. కనుక ప్రజలకిచ్చిన వాగ్దానాల్ని వమ్ముచేసే రాజకీయ పార్టీలకు గుణపా ఠం చెప్పటం కోసం వాటిని ఓడించి, అధికారం నుంచి దించేందుకు సదవకాశం ఉండటమే ప్రజాస్వామ్య గొప్పతనం. ఆరకంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు తప్ప పార్టీలు, ప్రభుత్వాలు కాదు అని ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్ర చాటిచెపుతోంది.

ఈ అర్థంలో 'నిర్ణయాలు తీసుకొనేది పార్టీలు, ప్రభుత్వాలు కాదు ప్రజలేనని' ప్రజాస్వామ్యానికి మన రాష్ట్రముఖ్యమంత్రి చెప్పిన భాష్యం అంతగా సంభ్రమాశ్చర్యాలను కలిపించదు. 'పార్టీలు, ప్రభుత్వాలు ప్రజాభీష్టానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకొనకపోతే ప్రజలు వాటికి అధికారం నుండి శలవు ప్రకటిస్తార'ని చెప్పటం కూడా తప్పేమీకాదు. కాకపోతే ఈ సూత్రబద్ధ ప్రజాస్వామిక విధానాన్ని ఏ సందర్భానికి, ఏ ప్రాంతానికి అన్వయించి మాట్లాడుతున్నారో స్పష్టంచేయకుండా తప్పించుకొనే ప్రయత్నం చేశారు. కనుక ఆయన చెప్పే ప్రజాభీష్ఠం ఏ ప్రాంతపు ప్రజాభీష్ఠమో, ఆయాన వల్లించే ప్రజాస్వా మ్యం ఏ తరహా ప్రజాస్వామ్యమో నిగ్గుతేల్చాల్సిఉంది. ఇటీవల ఆగస్టు 8న హైదరాబాద్‌లో స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి ఆయన బహిర్గత పర్చిన అంశాలే ఆయన ఆలోచనల్ని బట్టబయలు చేస్తాయి. ప్రజాస్వామ్యంలో పార్టీస్వామ్యం కూడా అంతర్భాగం కనుక ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లించే ముఖ్యమంత్రి పార్టీ స్వామ్యాన్ని ఏమేరకు పాటించారో, ప్రభుత్వాధినేతగా ఏ మేరకు తన కర్తవ్యాన్ని నిర్వహించాడో స్పష్టంచేసుకోవటం అవసరం.

నిజానికి తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రజాస్వామ్య పద్ధతినే పాటించాయని భావించవద్దు. పార్టీ అత్యుతన్న విధాన నిర్ణయ కమిటీ అయిన సి.డబ్ల్యూసి మొదటగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి నిర్ణయం తీసుకొని, యు.పి.ఎ. ప్రభుత్వ భాగస్వామ్య పక్షాల సమన్వయ కమిటీ ఆమోదం తీసుకొంది. యు.పి.ఎ సబ్ కమిటీ నియమించి అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నిటి అభిప్రాయాలు తీసుకొంది. ప్రాథమికంగా ఈ సమస్య ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించింది గనుక తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించే, పార్టీకి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులతో సంప్ర దించింది. ఈ హోమ్‌వర్క్ అంతా చేసినాకే 2013 జూలై 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఏ ప్రాంతం వారి అభిప్రాయాలు ఎలావున్నా ఫైనల్‌గా పార్టీ అధిష్ఠానం తీసుకొన్న న్ణియానికి కట్టుబడి వుంటాం అని పదే పదే ప్రకటించిన కాంగ్రెస్ పెద్దలంతా ఆ మాటకు కట్టుబడి వుండాలి. కాంగ్రెస్ అధిష్ఠాన సంస్కృతి ఎలావున్నా పై కమిటీకి క్రింది కమిటి ఎ.ఐ.సి.సి, పి.సి.సి కి మెజారిటీకి మైనారిటీ కట్టుబడి ఉండటమే పార్టీస్వామ్యం. ఒకవేళ పార్టీ అధిష్ఠానం తీసుకొన్న నిర్ణయం సరైన నిర్ణయం కాదనుకొంటే, ప్రభు త్వాధినేత స్థానంలో ఉండి ఆ నిర్ణయం అమలు చేయటం ఇష్టంలేకపోతే సమైక్యాం ధ్రప్రదేశ్‌కేకుని కోసేచాకుగా తాను మారటం కస్టమైతే కాంగ్రెస్ పార్టీకి ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసి ఆపైన ఇలాంటి రాద్ధాంతానికి దిగితే తప్పులేదు.

రాహుల్‌గాంధీకి యువరాజ పట్టాభిషేకం చేయాలనే ఆత్రంతో, 2014 ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపి సీట్లు గెలవటంకోసం, సీమాంధ్ర ప్రాంతానికి సమన్యాయం చేయకుండా ఏకపక్షంగా 'తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకొంటే ఇప్పటికేవున్న సమస్యలకు తోడు ఇది మరింత పెద్ద సమస్యగా మారుతుంది' అని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానాన్ని హెచ్చరించారు. అధిష్ఠాన ఇష్టాయిష్టాలకంటే సీమాంధ్ర ప్రజల అభీష్ఠమే తనకు శిరోధార్యం అని ధిక్కారాన్ని ప్రకటించారు. కనుక పార్టీస్వామ్యాన్ని ప్రభుత్వ స్వామ్యాన్ని ఉల్లం ఘించేవారికి ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే అర్హతలేదు. అందుకే ఉపముఖ్యమంత్రి దామోదర నర్సింహ ముఖ్యమంత్రినుద్దేశించి 'తెలంగాణ ర్రాష్టాన్ని ఏర్పాటు చేస్తామని, 2004, 2009 నాటి పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా వున్న ఇరువురం ఇప్పుడే కాదు, అప్పుడు కూడా కాంగ్రెస్ నేతలమే. తనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం సరైన నిర్ణయం కాదనే భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు ఆరోజే తన అభ్యం తరం వ్యక్తం చేసి, పార్టీకి రాజీనామా చేసి బైటకు పోవాల్సింది' అని సూటిగా ప్ర శ్నించారు. ఆనాడు మాత్రం పార్టీకి రాజకీయ లబ్ధికావాలి. తెలంగాణ సెంటిమెం ట్‌ని ఓట్‌బ్యాంక్‌గా మార్చుకొని అందలమెక్కి పదవులు దక్కించుకోవాలి. అప్పటి అవసరం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామికమైందని, న్యాయమైందని కల్లబొల్లి కబుర్లుచెప్పి తెలంగాణ ప్రజల అభీష్ఠాన్ని నెరవేర్చుతాం అని మభ్య పెట్టాలి. ఇపుడేమో తెలంగాణ ప్రజలు ప్రజలుకాదు, తెలుగుజాతి సమైక్యతను చీల్చిచిచ్చుపెట్టే విచ్చిన్నకర వేర్పాటువాద శక్తులు అని తెలంగాణపై సీమాంధ్రలో వ్యతిరేకత రెచ్చ గొడతారు. తెలంగాణ ప్రజల అభీష్టం ప్రజాస్వామిక అభీష్టం కాదు కేవలం సీమాంధ్ర ప్రాంత ప్రజల అభీష్టమే శిరోధార్యం అంటారు. టిటర్న్ నుండి యుటర్న్ తీసుకొన్న ఈ రెండు నాల్కల ద్వంద్వ వైఖరి తెలంగాణ ప్రజల్ని దగాచేసే వైఖరికాదా? అని నిలదీశారు.

కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు గనుక తెలంగాణ విష యంలో కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయంపట్ల సీమాంధ్ర ప్రాంతంలో తీవ్రమైన వ్యతి రేకత పెల్లుబికి తన రాజకీయ భవిష్యత్తుకి, పార్టీ భవిష్యత్తుకి ముప్పుముంచు కొచ్చినందుకు ఆందోళన చెందటం తప్పుకాదు. అలాగని తెలంగాణ రాష్ట్ర ఏర్పా టుకోసం పార్టీ తీసుకొన్ని నిర్ణయాన్ని అమలుకానీయకుండా అడ్డుకొంటే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌పార్టీ తుడచిపెట్టుకుపోతుందికదా! మరి తెలంగాణలోని కాం గ్రెస్ నాయకుల భవిష్యత్తును, పార్టీ రాజకీయ భవిష్యత్తును కాపాడేదెలా? అని ఇరుప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఉంటే ఓస్టేట్స్‌మెన్‌గా ఆయన రాణించేవారు. అలా కాకుండా కేవలం సీమాంధ్ర వలసపెత్తందార్ల కొమ్ముగాస్తే స్వయంగా తానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి లేదా అధిష్ఠానం ఆయనను భర్తరఫ్‌చేయాలి. లేకుంటే తెలంగాణ వారు కూడా కాంగ్రెస్ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. 2004లో 2009లో తెలంగాణ రాష్ట్రఏర్పాటుపై కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసినపుడు సీమాంధ్ర ప్రాంతంలో కానరాని వ్యతిరేకత 2009 డిసెంబర్ 9న, 2003 జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నప్పుడే, ఎందుకు వెల్లువెత్తింది? అన్న ప్రశ్నకు సీమాంధ్ర నాయకులతోపాటు కిరణ్ కుమార్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలి. 


ఉద్యమాల ఉపాధ్యాయుడు

Surya News Paper Dated: 01/09/2013 

No comments:

Post a Comment