Friday, September 16, 2011

ఉరిశిక్ష రద్దుకై ఉద్యమిద్దాం by - దుడ్డు ప్రభాకర్ Andhra Jyothi 17/09/2011


ఉరిశిక్ష రద్దుకై ఉద్యమిద్దాం

ఒక మనిషిని మరో మనిషి చంపడం ఘోర నేరమయినప్పుడు ఆ చంపిన మనిషిని చట్టబద్ధంగా హత్య చేయడాన్ని ఏమనాలి? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి న్యాయశాస్త్ర కోవిదులు అవసరం లేదు; సామాజిక స్పృహ ఉన్న ఏ మనిషి నడిగినా చెబుతాడు. హత్యలను చట్టబద్ధం చేసే మధ్యయుగాల నాటి అనాగరిక సంప్రదాయం ఇంకా కొనసాగడం ఈ దేశ ప్రజలుగా మనందరి దౌర్భాగ్యం.

చట్టబద్ధత ఉన్నంతకాలం కోర్టులు మరణ శిక్షలు అమలుచేస్తూనే వుంటాయని కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించారు. మరణ శిక్ష విధించడానికి అనుకూలమైన న్యాయసూత్రాలు, చట్టాలను రద్దుచేయాలని ప్రజలు అంటున్నారు. అసాధారణ కేసుల్లో, అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే మరణ శిక్ష విధించాలని మన సుప్రీం కోర్టు సూచించింది.

ఉరిశిక్ష రద్దు కోసం మన దేశంలో దశాబ్దాలుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. జార్ఖండ్‌కు చెందిన నలుగురు ఆదివాసీ, దళిత కళాకారులకు గిరిధి జిల్లా సెషన్స్ కోర్టు గత జూన్ 22న ఉరిశిక్ష విధించడం, రాజీవ్ గాంధీ హంతకులకు కొద్ది రోజుల క్రితం తమిళనాడు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంతో మరణ శిక్ష రద్దు గురించి దేశ వ్యాపితంగా మళ్ళీ చర్చ జరుగుతోంది.

జార్ఖండ్ అభియాన్ అనే సాంస్కృతిక సంస్థకు చెందిన జీతన్ మరాండి, మనోజ్ రాజ్వర్, అనిల్‌రామ్, ఛత్రపతి మండల్‌కు గిరిధి జిల్లా కోర్టు మరణ శిక్ష విధించింది. 2007లో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ కుమారుడు అనుప్ మరాండీతో పాటు అతను తయారు చేసిన జార్ఖండ్ వికాస్ మోర్చా అనే ప్రైవేట్ సైన్యానికి చెందిన 18 మందిని మావోయిస్టులు కాల్చిచంపారు. ఆ సంఘటన జరిగిన ఐదు నెలల తర్వాత 2008 ఏప్రిల్‌లో జీతన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

2007 అక్టోబర్ 1న విస్థాపన్ విరోధ్ జన వికాస్ ఆందోళన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఇంటి ముందు జరిగిన రాస్తారోకోలో ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడాడని, ఉపన్యాసాలిచ్చాడనే అభియోగంతో కేసు నమోదు చేశారు. 2009 ఏప్రిల్‌లో జీతన్‌ని, అతని సహచరుల్ని అనుప్ హత్య కేసులో ఇరికించారు. నేరచరిత్ర కలిగిన కొందర్ని సమీకరించి, బెదిరించి సాక్షులుగా చేర్చారు. జీతన్, అతని సహచరులు కోర్టుకు హాజరవుతున్న సమయంలో సాక్షులకు చూపించి హత్యలో వాళ్ళు పాల్గొన్నట్లు చెప్పే విధంగా శిక్షణ ఇచ్చారు.

2011 జూన్ 22న గిరిధి కోర్టు ఆ నలుగురికీ ఉరిశిక్ష విధించింది. మన పాలకులు అడవిని, అడవిలోని ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీలకు కట్ట బెడుతున్న నేపథ్యంలో ఆదివాసులు నిరాశ్రయులౌతున్నారు. బొగ్గు, ఇనుము, బాక్సైట్, రాగి, వెండి, యురేనియం లాంటి కోట్లు విలువ జేసే సంపద జార్ఖండ్ అడవుల్లోని భూమి పొరల్లో ఉంది. ఆ ఖనిజ సంపదను వెలికి తీయడానికి భారీ యంత్రాలు అడవిలోకి ప్రవేశించాయి. ఉక్కు కర్మాగారాల నిర్మాణం జరిగింది. ముడిసరుకు రవాణా కోసం విశాలమైన రోడ్లు ఏర్పడ్డాయి. ఆ రోడ్ల కోసం అడవుల్ని నరికారు.

తద్వారా ఆదివాసులు వేలాది ఎకరాల వ్యవసాయ భూముల్ని కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. నిర్వాసితులైన ఆదివాసులు అడవిని వదిలి జీవించలేక అడవిపై హక్కు కోసం జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అడవుల విధ్వంసాన్ని అడ్డుకుంటున్నారు. వనరుల దోపిడీని వ్యతిరేకిస్తున్నారు. జల్, జంగిల్, జమీన్ హమారా! అంటూ నినదిస్తున్నారు. జార్ఖండ్‌లో ఆదివాసీ హక్కుల గురించి పోరాడే సంస్థల్లో విస్థాపన్ విరోధి జన వికాస్ ఆందోళన్ ఒకటి.

జీతన్ మరాండీ ఆ సంస్థలో సభ్యుడు. ఈ దేశ పాలకులు, సామ్రాజ్యవాదులు కలసి చేస్తున్న దోపిడీ అణచివేతకు వ్యతిరేకంగా ఆదివాసుల్ని చైతన్యపరుస్తూ, జీతన్, అతని బృందం స్థానిక ఆదివాసీ, హిందీ భాషల్లో పాటలు రాసేవారు. గ్రామ గ్రామం తిరిగి ప్రజలకు పాడి వినిపించే వారు. గోచి, గొంగడి, డోలక్‌లతో నిత్యం ప్రజల్లో ఉండే జీతన్ మరాండీ జార్ఖండ్ గద్దర్‌గా ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు.

అందుకే బహుళజాతి కంపెనీలు, జార్ఖండ్ ప్రభుత్వం జీతన్, అతని సహచరుల్ని హత్యకేసులో ఇరికించారు. మరణ శిక్ష పడే విధంగా సాక్ష్యాలను సృష్టించడంలో ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రశ్నించే గొంతును అంతం చేయడానికి పాలకులు కోర్టులను కూడా ఎలా ఉపయోగించుకుంటారో ఈ కేసు ద్వారా మరోసారి రుజువయింది.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో గ్రీన్‌హంట్ పేరుతో ఆదివాసులపై ప్రకటించిన యుద్ధంలో తెగిపడుతున్న కంఠాలెన్ని? తగలబడి బూడిదైన గ్రామాలెన్ని? చెరచబడ్డ తల్లులెందరు? సల్వా జుడుం, జార్ఖండ్ వికాస్ మోర్చా, రణబీర్ సేన, నల్లమల కోబ్రాస్, గ్రీన్ టైగర్స్, బ్లూ టైగర్స్ పేరు మీద ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హంతకమూకలు సృష్టిస్తున్న రక్తపాతమెంత! శవాలు కూడ దక్కని కుటుంబాలెన్ని? అన్యాయంగా తప్పుడు కేసులు మోపబడి విచారణకు కూడా నోచుకోకుండా ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్న అభాగ్యులెందరు? ఈ భయానక వాతావరణానికి తట్టుకోలేక పారిపోయి నేటికీ జాడలేని మూగజీవులెందరు? ఛిన్నాభిన్నమైన కుటుంబాలెన్ని? ఛిద్రమైన బతుకులెన్ని? నిత్యం జరుగుతున్న ఈ హత్యాకాండకు బాధ్యులెవ్వరు? ఆ బాధ్యుల్ని శిక్షించే చట్టాలెక్కడ? ఇవన్నీ ప్రశ్నలే. జవాబు దొరకని ప్రశ్నలు.

ఇంతటి విధ్వంసం మధ్య కూడా సభ్య సమాజం చిన్న ఆశతో కోర్టుల వైపు చూస్తోంది. అందుకే ప్రజాస్వామిక వాదులు కోర్టు తీర్పులపై స్పందిస్తున్నారు. భవిష్యత్‌లో ఆ ఆశను కూడా వదులుకొనే రోజులు రాబోతున్నాయా? అణగారిన ప్రజల బతుకులు గాలిలో దీపమేనా? జీతన్ మరాండీ, అతని సహచరుల ఉరిశిక్ష తీర్పు అవుననే చెబుతుంది.

1991 మే 21 రాత్రి పది గంటల సమయంలో తమిళనాడులోని పెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. థాను అనే ఎల్‌టిటిఇ ఆత్మాహుతి దళ సభ్యురాలు తననుతాను కాల్చుకొని రాజీవ్ గాంధీతో పాటు మరో 18 మంది మరణానికి కారణమయింది.

ఆ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి మొత్తం 25 మందిని నిందితులుగా తేల్చింది. ప్రత్యేక కోర్టు అందరికీ మరణ శిక్ష విధిస్తే, సుప్రీం కోర్టు నలుగురికి- మురుగన్, శాంతన్, పేరారివలన్, నళిని- మాత్రమే మరణ శిక్ష విధిస్తూ అంతిమ తీర్పు ప్రకటించింది. ఆ నలుగురు 11 ఏళ్ళ క్రితం రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. వారిలో ఒకరైన మురుగన్ భార్య నళినికి క్షమాభిక్ష లభించి, ఉరిశిక్ష యావజ్జీవ శిక్షగా మారింది.

రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ మిగిలిన ముగ్గురి పిటిషన్‌లను ఆగస్టు 11న తిరస్కరించారు. సెప్టెంబర్ 9న కోర్టు ఉరి తేదీని నిర్ణయించింది. తమిళనాడు ప్రజలు ఉరిశిక్షను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. వారికి ఉరి శిక్ష రద్దుచేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏఉకగ్రీవంగా తీర్మానం చేసింది. ఉరిశిక్షను ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రస్తుతానికి వారు సజీవంగా ఉన్నారు.

ప్రస్తుతం మన దేశంలోని వివిధ జైళ్ళలో కసబ్, అఫ్జల్‌గురుతో సహా ఉరిశిక్షలు పడ్డ ఖైదీలు 309 మంది ఉన్నారు. వారిలో 31 మంది సుప్రీం కోర్టులో కూడా శిక్ష ఖరారైంది. వాటిలో 28కేసులు రాష్ట్రపతి దగ్గర సుదీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్నాయి. మరణ శిక్షను రద్దుచేస్తే నేరాలు పెరుగుతాయనే బుద్ధి జీవులూ ఉన్నారు.

ఇప్పుడు మరణశిక్ష రద్దయిన దేశాలలో నేరాల సంఖ్య పెరగలేదు. అమలౌతున్న దేశాలలో నేరాల సంఖ్య తగ్గలేదు. దేశంలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ విధానాల పట్ల పాలకులు అవలంభిస్తున్న వైఖరిని బట్టి నేరాల సంఖ్య ఆధారపడి వుంటుంది. అనేక కులాంతరాల దొంతరలు ఉన్న ఈ సమాజంలో మనిషిపై మరో మనిషి , ఒక కులంపై మరో కులం, ఒక జాతిపై మరో జాతి విచ్చలవిడిగా దోపిడీ అణచివేతకు పూనుకుంటున్నాయి.

ఈ సందర్భంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కోర్టులు సామాజిక స్పృహ కోల్పోతే పీడకులదే పైచేయి అవుతుంది. మెజార్టీగా పీడనకు గురయ్యే వారు అనివార్య పరిస్థితిలో హంతకులుగా మారుతున్నారు. ప్రశ్నించే గొంతుకు ఉరితాడు బిగుసుకుంటున్నంత కాలం ఉరిశిక్ష రద్దుకు పాలకులు ప్రయత్నించరు. అవి అమలవుతూనే వుంటాయనేది చరిత్ర తేల్చిన సత్యం. అందుకు ఉరిశిక్ష రద్దయ్యే వరకు ఉద్యమించాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వాదులందరిపై ఉంది.

- దుడ్డు ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు, కులనిర్మూలనా పోరాట సమితి

No comments:

Post a Comment