Friday, March 8, 2013

బహుముఖ సవాళ్ల మధ్య మహిళా ఉద్యమాలు -- కె స్వరూపరాణి


 Thu, 7 Mar 2013, IST  

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ దినోత్సవాన్ని భిన్న దృక్పథాలతో జరుపుకుంటారు. కానీ ఈ రోజు యొక్క విశిష్టత, రాజకీయ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
19వ శతాబ్దపు మధ్య కాలంలో జరిగిన పారిశ్రామిక విప్లవం స్త్రీలను ఇళ్ళ నుంచి బయటికి తెచ్చింది. ఆర్థిక అవసరాలు వారిని సామాజిక ఉత్పత్తిలోకి అనివార్యంగా తెచ్చాయి. ఒకవైపు ఇంటి చాకిరీ, మరోవైపు కర్మాగారాలల్లో అంతులేని శ్రమదోపిడీతో రోజుకు 14 నుంచి 16 గంటలు పనిచేసేవారు. దుమ్ము, ధూళి నిండిన చీకటి గుయ్యారాల్లాంటి కర్మాగారాల్లో అమానవీయ పరిస్థితులు ఉండేవి. అసమాన వేతనాలతో సరైన తిండి లేక చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలు పొడచూపేవి. ఆనాటి శ్రామిక మహిళల ఆయుఃప్రమాణం 36 ఏళ్ళకు దిగజారింది.
అమెరికా కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామిక స్త్రీలు ఒకరికొకరు తోడయ్యారు. ఒకరి కష్టాలు ఒకరు అర్థం చేసుకున్నారు. ఈ ఐక్యతే పోరాటాలకు నాంది పలికింది. 1845లో పనిగంటలను 16 నుంచి 10కి తగ్గించాలని కోరుతూ మొదటిసారి భారీ ర్యాలీ జరిగింది. ఈ ఉద్యమాన్ని యాజమాన్యం అణచివేయాలని ప్రయత్నించింది. 'ఆకలితో చస్తూ బ్రతికే కన్నా పోరాటంలో చావటం మేలు' అంటూ 1857లో న్యూయార్క్‌ నగరంలో వేతనాలు పెంచాలని, పనిగంటలు తగ్గించాలని, అమానవీయ చర్యలకు వ్యతిరేకంగానూ, ఓటుహక్కు కోసం బట్టల మిల్లుల్లో పనిచేసే వేలాది మంది మహిళలు సమ్మె చేశారు. ఇది సహించలేని యాజమాన్యం మహిళా కార్మికుల్ని నిర్బంధించి నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. 146 మంది తుపాకీ తూటాలకు బలయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో సమ్మెను కొనసాగించటంతో యాజమాన్యం దిగిరాక తప్పలేదు. అమెరికాలో జరిగిన పోరాట స్ఫూర్తితో అనేక దేశాలలో కార్మికుల సంఘటిత పోరాటాలు ఊపందుకున్నాయి. 1868లో మొదటి అంతర్జాతీయ సదస్సులో మార్క్స్‌ స్వయంగా మహిళల హక్కులు, సమస్యలను ప్రస్తావించారు. పరిశ్రమలలో పని చేసేందుకు అధిక సంఖ్యలో స్త్రీలు ముందుకు రావాలని, మహిళా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే సరైన చట్టాలను చేయాలని, ట్రేడ్‌ యూనియన్లలో మహిళలకు సమాన హక్కులుండాలని స్పష్టం చేశారు. ఆ ప్రోద్బలంతో అనేక దేశాలలో మహిళా కార్మికులు శ్రామిక వర్గ ఉద్యమాలలో అగ్రభాగాన నిలిచారు.
1971 నాటి చారిత్రిక పారిస్‌ కమ్యూన్‌లో అనేక రంగాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులు, ఉద్యోగులు, రోజువారి కూలీలు, మేధావులు విప్లవోద్యమంలో పాల్గొన్నారు. వారిలో అనేక మంది ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేశారు. 1893లో ఫ్రాన్స్‌ మహిళల హక్కుల ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 'మహిలకు ఉరికంబాలెక్కే హక్కు ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రవేశించే హక్కు ఎందుకుండదు' అని మహిళలు రాజకీయ హక్కుల కొరకు ప్రశ్నించారు. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమాలతో పాటు శ్రామిక మహిళల ప్రత్యేక డిమాండ్లకై ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలోనే ప్రముఖ జర్మనీ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జట్కిన్‌, లారా లఫార్గ్‌ (మార్క్స్‌ కుమార్తె)తో కలిసి శ్రామిక మహిళల ఉద్యమానికి సహకరించారు. ఎంగెల్స్‌ రచించిన కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక, ఆగస్టు బెబెల్‌ 1857లో రచించిన మహిళలు-సోషలిజం రచనలను మహిళా కార్మికులు విస్తృతంగా అధ్యయనం చేశారు. వర్గ చైతన్యం, శాస్తీయ సోషలిజం భావనలు శ్రామిక మహిళల్లో ఉత్తేజాన్ని నింపాయి.
1889లో పారిస్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌లో స్త్రీపురుషులకు సమాన హక్కుల సమస్య అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించబడింది. మహిళల పత్రిక 'శ్రామిక మహిళ'ను 'సమానత్వం'గా మార్చారు. క్లారా జెట్కిన్‌ ఆ పత్రిక మొదటి సంపాదకురాలుగా 25 సంవత్సరాలు పనిచేశారు. ఈ పత్రిక శ్రామిక మహిళల్ని నిర్మాణంలోకి తేవడంలో ప్రముఖ పాత్ర వహించింది. 1907లో అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సు జర్మనీలోని స్టట్‌గార్టులో జరిగింది. రెండవ అంతర్జాతీయ మహిళా సదస్సు డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్‌లో నిర్వహించారు. ఆ సదస్సులో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినంగా మార్చి 8ని ఎంపిక చేశారు. మార్చి 8 మహిళల సమాన హక్కులకు, విముక్తికి సంకేతంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన శ్రామిక మహిళా పోరాటాలతో పని గంటల తగ్గింపు, వేతనాల పెంపు, ఓటుహక్కును సాధించుకున్నారు.
18, 19 శతాబ్దాల్లో ప్రపంచంలో స్త్రీల అభివృద్ధికై జరిగిన జాగృతి భారతదేశ మహిళలపై ప్రభావాన్ని చూపింది. 1975లో ఐక్యరాజ్యసమితి మెక్సికోలో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిపింది. మహిళా సమస్యల పరిష్కారానికి దశాబ్ది కాలం (1975-1985) పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరపాలని ఐరాస సర్వసభ్య సమావేశంలో పెట్టిన తీర్మానానికి భారత్‌తో సహా 150 దేశాలు అంగీకరించాయి. 1975 నుంచి అసమానత, దోపిడీ, పీడన, అణచివేతకు వ్యతిరేకంగా మార్చి 8ని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలు అసంఖ్యాక మహిళలను సమస్యల వలయంలోకి నెడుతున్నాయి. మహిళా శ్రామికులు పోరాడి సాధించుకున్న చట్టాలు కనుమరుగవుతున్నాయి. 1948లో వచ్చిన ఫ్యాక్టరీ చట్టం స్త్రీలు రాత్రి షిప్టుల్లో పనిచేయడాన్ని నిషేధించింది. ప్రస్తుతం నిషేధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం మహిళల భద్రత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోంది. ప్రైవేటు రంగంలో 8 నుంచి 12 గంటల పనితో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. దేశంలో ఉపాధి పొందుతున్న మహిళల్లో 6 శాతం మంది మాత్రమే సంస్థాగతమైన ఉద్యోగాలు పొందుతున్నారు. 94 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 48 శాతం మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. 42 శాతం రెగ్యులర్‌ కార్మికులుగా ఉన్నారు. మహిళలు ఉపాధి పొందుతున్న మరో రంగం ప్రభుత్వం ఏజెన్సీలు (అంగన్‌వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి). వీరికి ఎలాంటి రక్షణాత్మక శాసనాలు, ఉద్యోగ భద్రత లేవు. సంపద సృష్టిలో పురుషులతో సమానంగా కష్టపడుతున్నా, హక్కులలో మాత్రం వెనకబడే ఉన్నాం.
మహిళా సాధికారతకై 1995 బీజింగ్‌ సదస్సు డిక్లరేషన్‌పై భారత ప్రభుత్వం సంతకం చేసి 18 ఏళ్ళు పూర్తయింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎండమావిగానే ఉంది. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు లోక్‌సభలో ప్రవేశానికి నోచుకోలేదు. వామపక్షాలు మినహాయించి మిగతా రాజకీయ పార్టీల కుటిల నీతి వల్ల బిల్లు ఆమోదం పొందకుండా గాలిలో వేలాడుతున్నది. పురషాధిక్య భావజాలమే మహిళలకు విధాన నిర్ణయాధికారాన్నిచ్చే పదవుల్ని నిరాకరిస్తోంది. 545 మంది ఉన్న లోక్‌సభలో 60 మంది, 244 మంది రాజ్యసభ సభ్యుల్లో 26 మంది మాత్రమే మహిళలున్నారు. మహిళా సాధికారత కాగితాలకే పరిమితమైంది. జనాభాలో సగమైనా అవకాశాల్లో అత్తెసరే. మహిళలు తమకున్న పరిమిత అవకాశాలతో విద్య, ఉద్యోగ, క్రీడారంగాలలో ప్రతిభను చాటుతున్నారు. సమాచార, సాంకేతిక రంగాల్లో నేడు మహిళల హవా దూసుకుపోతోంది. క్షిపణి ప్రయోగంలో థెస్సీ ధామస్‌, అంతరిక్షంలో అడుగుపెట్టి పరిశోధనలు చేసిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ వంటి వారు సాధించిన విజయాలు భారత్‌ను తలెత్తుకునేలా చేస్తున్నాయి.
మరోవైపు స్త్రీలపై నిరాటంకంగా సాగుతున్న అత్యాచారాలు, వరకట్న హత్యలు, కిడ్నాపులు, ఆడపిల్లల అక్రమ అమ్మకాలు, లైంగిక వేధింపులు దేశాన్ని అంతర్జాతీయంగా తలవంచుకునేలా చేస్తున్నాయి. స్త్రీలు గడపదాటితే ఇంటికి సురక్షితంగా చేరతారని నమ్మకంలేని దారుణ పరిస్థితులున్న దేశం మనది. 2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన స్త్రీల భద్రత అంశాన్ని ముందుకు తెచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళ, 76 నిమిషాలకు ఒక బాలిక అత్యాచారానికి, ప్రతి గంటకు 18 మంది మహిళలు హింసాత్మక వేధింపులకు గురవుతున్నారు. సరళీకరణ విధానాలు అమలౌతున్న గత మూడు దశాబ్దాలలో మహిళలపై నేరాలు 825 శాతం పెరిగాయి(నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్‌). 14 సంవత్సరాల లోపు బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. మార్కెటీకరణ పెరిగే కొద్దీ మహిళలపై హింస పెరుగుతోంది. అందాల పోటీలు, బ్యూటీపార్లర్లు, సినిమాలు, టీవీలు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌ ఒకటేమిటి ప్రతిదీ అమ్మాయిల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచీకరణ విధానాలు ప్రజల మనసులు, ఆలోచనలు, ప్రవర్తనను సైతం లొంగదీసుకునేందుకు పూనుకుంటున్నాయి. దీనికి ప్రతిగా మితవాద శక్తులు సంప్రదాయం పేరిట చూపించే ప్రత్యామ్నాయం కూడా స్త్రీలను పరాధీనత వైపుకు నెట్టేవిగా ఉంటున్నాయి. పురుషుల రక్షణలో స్త్రీ అణిగిమణిగి ఉంటే సమస్యలేవీ రావని ప్రవచిస్తున్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, ఆధ్యాత్మిక గురువులు మొదలైన వారు ఢిల్లీ గాంగ్‌రేప్‌ తర్వాత బాధితురాలినే లక్ష్యం చేస్తూ ప్రకటనలు చేశారు. ఇటువంటి తిరోగామి శక్తుల భావాలను వ్యతిరేకించాలి. స్త్రీలు ఏ విధమైన దుస్తులు ధరించాలి, ఎలా ప్రవర్తించాలంటూ నియమాలను విధించటం మొదలు పెడితే అది చివరకు వారిని పరాధీనతకు గురిచేస్తుంది. రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నందు వల్లనే యువకులు వెంట పడుతున్నారంటూ మహిళల్ని తప్పు పట్టే సామాజిక ధోరణి పురుషాధిక్య దృక్పథం నుంచే వస్తోంది. ఈ అసమాన వ్యవస్థలో మార్పు రావాలంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో మార్పులు అనివార్యం. ఇందుకోసం చట్టాల్లో, నేర శిక్షాస్మృతిలో, పాలన, న్యాయ వ్యవస్థలో మహిళా పక్షపాత నిబంధనలు అమలు జరగాలి. స్త్రీలను అంగడి సరుకుగా చిత్రీకరిస్తున్న ధోరణులను రూపుమాపాలి. స్త్రీపురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ముఖ్యంగా బాలబాలికల నిష్పత్తిలో ప్రమాద సూచికలు కనపడుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలు అన్ని తరగతుల ప్రజలపై భారాలు మోపుతున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఎరువులు, ఆహార సబ్సిడీలు కుదించబడుతున్నాయి. నగదు బదిలీ పథకంతో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపింది. మంచినీరు, మరుగుదొడ్లు లేని గ్రామాలున్నాయి గానీ మద్యం దుకాణం లేని గ్రామం లేదు. మహిళల ఉసురుతో ప్రభుత్వం ఖజానా నింపుకుంటోంది. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కుటుంబాలను మహిళలే నిర్వహిస్తున్నారు. పెరిగిన జీవన వ్యయంతో వ్యభిచార గృహాలకు అమ్ముడుపోతున్న ఆడపడుచులు, బతుకుబండి నడపడానికి మాతృత్వాన్ని అద్దెకిచ్చే అద్దె తల్లులు ప్రభుత్వాలకు కానరావడంలేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మొత్తంగా మహిళా లోకం ఉద్యమాల్లోకి రావాల్సిన అవసరాన్ని ఇవి నొక్కి చెబుతున్నాయి.
సమాచార వ్యవస్థ అభివృద్ధి కాని రోజుల్లో 1957లోనే మహిళలు చైతన్యంతో హక్కులకై పోరాటాన్ని ఎక్కుపెట్టారు. నిర్బంధాలను సైతం ఎదుర్కొని సాధించుకున్న హక్కులపై విశృంఖల దాడి జరుగుతోంది. మార్చి 8 సందర్భంగా ఆకలి, పేదరికం, హింసకు వ్యతిరేకంగా, సమాన హక్కులు, మహిళ రిజర్వేషన్‌ బిల్లు సాధనకై ఉద్యమిద్దాం.
(వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి) 
-కె స్వరూపరాణి

Prajashakti Telugu News Paper Dated : 8/3/2013

No comments:

Post a Comment