March 28, 2013
కఠిన చట్టాలకోసం, క్రూరమైన శిక్షలకోసం నగర రహదారులు ర్యాలీల రిబ్బన్లవుతున్నాయి. కొత్త చట్టాలు భద్రమైన సమాజాన్ని సృష్టిస్తాయని మధ్యతరగతి కలలు కంటున్నది. యాదృచ్ఛికంగా పెల్లుబికే ఆవేశాల అణచివేతకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కేంద్రప్రభుత్వం దారుణ శిక్షల చట్టాల చిట్టాను వెలుపలికి తీసింది.
స్త్రీ ఆదిశక్తి, భరతమాత, జగన్మాత, మహాకాళి, మాతృ దేవత- ఇది ఒక కోణంలో. మరో కోణంలో స్త్రీ బానిసకొక బానిస. ఈ బానిసత్వం ఒకనాటితో వచ్చింది కాదు. ఆదిమ సమాజంలో మానవుడు తండాలుగా వేటమీద ఆధారపడి జీవించే దశలో, నీది నాది అనే స్వంత ఆస్తి భావన లేని రోజుల్లో పురుషులు వేటకి వెడితే స్త్రీలు పోడు, సమాన శ్రమ విభజన ఉన్న వ్యవసాయం, పిల్లల సంరక్షణ చేస్తూ ఉండే వారు. ఈ దశలో స్త్రీ, పురుష సంబంధాల మధ్య ఎలాంటి ఆంక్షలూ లేవు. ఆస్తి లేదు. కాబట్టి ఆడ, మగ మధ్య సంపూర్ణమైన సమానత్వం ఉండేది. అంతేకాదు, ఈ మాతృస్వామ్య దశలో మానవజాతి సృష్టికి కారకురాలుగా ఆమె అత్యున్నతంగా గౌరవం పొందింది. ఆహార సేకరణ దశ, ఆహారోత్పత్తి దశకి చేరిన తర్వాత వ్యక్తిగతఆస్తి ఏర్పడి క్రమంగా నీదీ, నాదీ అనుకునే దశలో స్త్రీని ఇంటిపనికి కుదించి పురుషుడు వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏకభర్తృత్వం ద్వారా వ్యక్తిగత ఆస్తి పుట్టుకకు ముందే పితృస్వామిక సమాజం ఆవిర్భవించడంతో స్త్రీపై మొదటి అణచివేత ప్రారంభమైంది. ఆ తర్వాత మిగులు ఉత్పత్తికి, ఆస్తికి పురుషుడు హక్కుదారుడయ్యాడు. వ్యక్తిగత ఆస్తి ఏర్పాటు కారణంగా తండా పద్ధతి నశిస్తూ కుటుంబ వ్యవస్థ గట్టిపడటం ప్రారంభమైంది. మాతృస్వామిక వ్యవస్థ స్థానంలో పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. స్వంత ఆస్తి పుట్టుక స్త్రీని పురుషుడికి శాశ్వతంగా బానిసగా చేసింది.
స్త్రీని దశలవారీగా తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో నిర్బంధించి, సాంఘిక కట్టుబాట్లు ఏర్పరిచి గృహ కృత్యాలకు కట్టిపడేసి స్త్రీని ఈనాటి నికృష్ట జీవితానికి గురిచేసింది. దోపిడీకి గురయ్యే పీడితుల అణచివేతను సైతం సహజమైనదిగా, దైవ సమ్మతమైనదిగా భ్రమింప చేయడంలో మతం కీలకపాత్ర వహించింది. అందులో భాగంగానే స్త్రీలపై పురుషాధిక్యత దైవసృష్టి అని ప్రచారం చేసి చిన్నప్పటినుంచే స్త్రీల మెదళ్ళలో పాతివ్రత్యాన్ని నూరిపోసి ఇలా నడవకూడదు, అలా నవ్వకూడదు అని ఆంక్షలు విధించారు. బాల్యంనుంచే స్త్రీని బలహీను రాలిననే ఆత్మన్యూనతా భావానికి గురిచేసి అబల అన్నారు. ఏ మతమైనా స్త్రీని అణచి వేయడంలో ప్రధానపాత్రే వహించింది.
లైంగిక అత్యాచారాలు, తిట్లు, తన్నులు, ఆంక్షలు, సూటిపోటి మాటలు, లైంగికత్వంపై దాడి- ఇవన్నీ స్త్రీలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సంఘటనలు. ఇవి కనిపించేవైతే గుట్టుచపడు కాకుండా జరిగేవి కొన్ని ఉన్నాయి. ఇంటిచాకిరీ, పిల్లల పెంపకం లాంటి ఆదాయం లేని పనులు వాళ్ళకి అప్పగించి, వాళ్ళ శ్రమకి విలువ లేకుండా చేసి వాళ్ళకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేకుండా చేశారు. అసలు కుటుంబమే ఇప్పుడున్న రూపంలో హింస. దానిని నిలబెడుతున్న పితృస్వామ్య వ్యవస్థ ఈ హింస అంతటికీ మూలకారణం. రాజకీయ వ్యవస్థలకంటే బలమైనది కావడం వల్లనే ఇది మారకుండా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. స్త్రీలకు హక్కులివ్వడం, వాళ్ళకోసం చట్టాలు చెయ్యడం, కేవలం కాలానుగుణంగా చేసే మేకప్ మాత్రమే.
మహిళలపై హింసను నిరోధించటానికి పదహారు అంశాల కార్యాచరణను ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. చట్టాలు అమలు చేసి రూపొందించటమే కాదు, జాతీయ స్థాయిలోనూ, స్థానికంగానూ పటిష్ఠ కార్యాచరణ వ్యూహాల్ని చెపుతోంది. మహిళా హక్కుల్ని తొక్కిపట్టే కాలం చెల్లిన చట్టాలు ఇంకా రాజ్యాంగంలో అనేకం ఉన్నాయని జాతీయ మహిళా సంఘం ఏనాడో ప్రస్తావించింది. ఇటీవల తెచ్చిన పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం వంటివి, కొన్నేళ్ళ క్రితం నాటి గృహహింస చట్టం వంటివి మాత్రమే స్త్రీలకు రక్షణ కవచాలు కాలేవు. అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే శిక్షలు పడుతున్నవి కేవలం 24 శాతమే. సమస్య మూలం ఎక్కడున్నది అనూహ్యం కాదు. ఇండియాలో 2010 కంటే 7.1 శాతం అధికంగా 2011లో మహిళలపై 2,28,650 నేరాలు జరిగినట్లు జాతీయ నేర నమోదు సంస్థ లెక్కతేల్చింది. అభాగ్య స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టడంలో ప్రపంచంలో ఇండియా రెండోస్థానంలో ఉంది.
టాటా వ్యూహాత్మక నిర్వహణ బృందం తాజాగా బహుళ అధ్యయనాలను విశ్లేషించి (వెల్‌బీయింగ్ ఇండెక్స్) మహిళా రక్షణ సూచీలను వెలువరించింది. వీటిప్రకారం హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్‌లు అట్టడుగు స్థానాల్లో ఉంటున్నాయి. స్త్రీలపై సాధారణంగా జరిగే లైంగిక అత్యాచారాలకు అంతేలేదు. ఆరేళ్ళ పసివారినుండి అరవై ఏళ్ళ వృద్ధురాలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారు. ఇంటినుండి బయటికి వెళ్ళిన మహిళ క్షేమంగా ఇల్లు చేరుతుందో లేదో తెలియదు. అసలు తన ఇంట్లో తానే భద్రంగా ఉండగలదా అనేది మరో ప్రశ్న.
మహిళలు వంటింటి కుందేళ్ళు మాత్రమే అనే దృక్పధాన్ని రాణి రుద్రమ నుంచి మదర్ ధెరిస్సా వరకు తప్పని ఏనాడో నిరూపించాం. నేటి ఆధునిక మహిళ అన్ని రంగాల్లో తన ఉన్నతిని చాటుతుంది. కొన్ని రంగాల్లో పురుషులను అధిగమించి దూసుకుపోతోంది. ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రభాగాన నిలచి విజయపతాక ఎగురవేస్తున్నది. మహిళలను గత చరిత్ర నీడలు భయపెట్టినా వర్తమాన, భవిష్యత్ చిత్రపటంలో తన హక్కులు నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాటాలు చేస్తూనేఉంది. ఆకాశంలో సగం కాకుండా అనంతమంతా నేను అంటుంది.
నాణానికి రెండోవైపు చూస్తేచ అదే సమయంలో ఎంత విద్యావంతురాలైనా ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా ఏదో హింసకు ప్రతి నిత్యం గురవుతోంది. వయోపరిమితి, వరస వావి లేకుండా ఇంటా బయటా అనేక హింసలను ఎదుర్కొంటోంది. ప్రతిరోజు మన సమాజంలో ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఏదో ఒక హింసకు బలవుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిముషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 34 నిముషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిముషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, అలాగే వరకట్నం కోసం ప్రతి 99 నిముషాలకు ఒక వధువు బలి అవుతోంది.
వివాహమైన మహిళలకు కొందరి జీవితంలో పెళ్ళంటే నూరేళ్ళపంట అనేకంటే బ్రతుకంతా మంట అనవలసి వస్తుంది. కన్యాశుల్కం నాటి నుండి వరకట్నం దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఎవరైనా చైతన్యవంతురాలైన మహిళ, సాటి మహిళలకు సలహా ఇవ్వబోతే భర్తే ప్రత్యక్ష దైవం అంటూ తమను ఎంత హింసించినా సతీసావిత్రి సతీఅరుంధతి వంటి పతివ్రతలను తలుచుకొని ‘నా మొగుడు గాక నన్ను ఇంకెవరు కొడతారు, తిడతారు’ అనే వారు ఉన్నారు. మహిళ అయితే చాలు చిన్నారి అయినా, పిచ్చిదైనా, వికలాంగురాలైనా, అఖరికి వృద్ధురాళ్ళని కూడా అత్యాచారాలకు గురిచేస్తున్నారు. పెట్టుబడిదారులు తమ వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో మహిళల్ని కేవలం వ్యాపార అభివృద్ధి వస్తువుగా చూపిస్తున్నారు. సెక్స్ సింబల్‌గా, జుగుప్సాకరంగా, విలన్లుగా చూపిస్తున్నారు. చదివిన దానికంటే కూడా చూసిన దృశ్యమే సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఆ విధంగా చెడు ప్రభావానికి గురై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, హత్యలకు, నేర ప్రవృత్తికి దారితీస్తోంది.
అత్తగార్ని కోడలు తల్లిలా ఎలా గౌరవించాలి, కోడల్ని అత్తగారు కూతురులా ఎలా అభిమానిం చాలి, చిన్నపిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకొని ప్రేమతత్వాన్ని నేర్పాలి, వృద్ధుల మనోభావాలు దెబ్బ తినకుండా ఏ విధమైన పద్ధతులు ప్రవేశపెట్టాలి, ఏ వయసు వారికి ఆ వయసుకు తగిన వ్యక్తిత్వం ఎలా ఉండాలి- ఇలాంటి విషయాలపట్ల కనీస అవగాహన కల్పించే సామాజిక స్పృహ, బాధ్యతలు ఈ పెట్టుబడిదారులకుగానీ, ప్రభుత్వానికి గానీ, రాజకీయ నాయకులకు గానీ లేవు. కేవలం తమ తమ లాభనష్టాలు, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వారికి ముఖ్యం.
స్త్రీలను మార్కెట్ సరుకుగా, సెక్స్ సింబల్‌గా చూపిస్తున్న అన్ని వాణిజ్య ప్రకటనల్ని రద్దుచేయాలి. స్త్రీలు కేవలం లైంగిక సుఖాన్ని ఇచ్చే యంత్రాలుగా చూసే భావజాలం మారాలి. స్త్రీనా పురుషుడా అని కాకుండా మనుషుల్ని ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారిగా గౌరవించే సంస్కృతి రావాలి. అప్పుడు మాత్రమే అత్యాచారాల్ని హత్యల్ని ఆపగలుగుతాం. మహిళలపై జరుగుతున్న అన్ని దాడులకు ప్రభుత్వమే కారణం కాబట్టి మహిళలపై జరుగుతున్న హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు, యాసిడ్ దాడులకు పాల్పడిన నేరస్థులను ఎన్‌కౌంటర్లు చేయడం, సామాజిక అత్యాచారాలు జరిగినప్పుడు మరణ శిక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రజాస్వామ్య విలువలకై పోరాడుతూ, రేపటి తరం యువతను సామ్రాజ్యవాద విషసంస్కృతినుండి రక్షించుకోవడం మనందరి బాధ్యత. వ్యవస్థే నేరమయ మైనపుడు వ్యక్తులు మాత్రమే ఎలా నేరస్థులవుతారు? ఈ వ్యవస్థను తయారు చేస్తున్న ప్రభుత్వాలు, రాజకీయపార్టీలే అసలు సిసలు నేరస్థులు. మహిళల వ్యక్తిత్వాల్ని దెబ్బతీస్తూ వారిని అంగడి సరుకుగా మారుస్తున్న మీడియా, పెట్టుబడిదారులు, ప్రభుత్వమే మహిళలపై జరిగే హింసకు కారణం.
ఫ్యాక్టరీల్లో యజమానుల లైంగిక వేధింపులు, కూలికెళ్తే కామందుల కామానికి బలి కావడాలు, మైనర్ బాలికల్ని పనుల్లో పెట్టుకొని- తండ్రి వయసున్న యజమానులు వారిపై అత్యాచారాలు చేయడం, కులంపేరుతో కింది కుల మహిళలపై అగ్రకుల పురుషులు గ్యాంగ్ రేప్‌లు, హత్యలు చేయడం, గురువుల కామాగ్నికి బలయ్యే విద్యార్థినులు, ప్రేమను కాదన్నందుకు యాసిడ్ దాడులు, హత్యలు, కట్నంకోసం కిరోసిన్ బాత్‌లు, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, మాతంగులు, ఆడపిల్లల అమ్మకాలు, బలవంతంగా వ్యభిచారంలో దించడం, కులాంతర వివాహాలు చేసుకున్నందుకు వారిని కన్నవారే కసాయిలుగా నరకడం- ఈ జాబితాకు అంతే లేదు. ఇక పోలీసుల చేతుల్లో బలైన చిత్తాయి, సిలకమ్మలు ఎంతోమంది ఉన్నారు. దేశంలో రోజురోజుకీ స్త్రీలలో చైతన్యం అభివృద్ధి చెందుతోంది. స్త్రీలు తమ చరిత్రని తాము నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో, సమాజంలో, రాజకీయాలలో కుటుంబంలో తమ స్థానంకోసం పోరాటం చేస్తున్నారు.నిరంతరం మగపెత్తనానికి, పితృస్వామిక హింసకు గురవుతున్న భారత స్త్రీలకు తమపై అమలవుతున్న హింసను, ఆధిపత్యాన్ని వ్యక్తిగత స్థాయిలో, సమాజ స్థాయిలో ప్రతిఘటించ డంతో పాటు కరుడుగట్టిన పురుష దృక్పథంతో రూపుది ద్దుకున్న భారత న్యాయచట్టాల్లో స్త్రీలకు అనుకూలంగా మార్పులు తీసుకు రావడానికి భారత స్త్రీలు పోరాడాలి. స్త్రీలపై జరుగుతున్న హింసాకాండను, మగపెత్తనాన్ని, పితృస్వామిక భావజాలాన్ని రూపుమాపేందుకు మహిళలు పిడికిలి బిగించాలి.
స్త్రీమూర్తుల్ని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దకుండా సమానత్వం, సాధికారత రావు.వాణిజ్య ప్రకటనల్ని, అందాల పోటీల్ని, మద్యపానాన్ని నిషేధించాలి. మానవ సృష్టికి మూలమైన, సమాజంలో, సహజీవనంలో సగమైన స్త్రీవ్యక్తిత్వాన్ని కాపాడేలా ప్రభుత్వాలు పనిచేయాలి. మగపిల్లలకు చిన్ననాటినుండే ఎదుటి స్త్రీని గౌరవించే సంస్కారాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. స్త్రీల సమస్యలపై అవగాహన కల్పించాలి. అవసరం వచ్చినపుడు మాత్రమే కాకుండా ప్రాథమికవిద్యనుంచే ఆడపిల్లలకు మార్షల్‌ఆర్ట్‌స నేర్పించాలి. కార్యాలయాల్లో కంప్లెయింట్ బాక్సులు, కళాశాలల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి. చట్టాల్లో మార్పు కన్నా సమాజంలో మార్పు, భావజాలంలో మార్పు కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి నైతిక విద్యాబోధన జరగాలి. దుశ్శాసన సంతతిపై కఠిన శిక్షల కొరడా పడాలి. అశ్లీలతకు అడ్డుకట్ట వేయాలి.
వీటన్నింటికోసం సమాజంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం పురివిప్పాలి. దాదర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఢిల్లీ బస్సులో నిర్భయ ఉదంతం వరకూ అత్యాచారాల చిట్టా పెరుగుతూనే ఉంది. నిర్భయ ఉదంతం జాతి గుండెలను కలచివేసినా పరమ జుగుప్సా కరంగా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నది మరవకూడదు. జస్టిస్ జెఎస్ వర్మ సూచనల్ని కొన్నింటిని తోసిపుచ్చి అత్యవసర ఆదేశాన్ని జారీచేసిన కేంద్ర ప్రభుత్వం సామాజిక విలువలు పెంచటంలో తన వంతు ప్రయత్నం ఏం చేసిందో- ఇంకా ఏం చేస్తుందో వేచి చూడాలి.
జి. విజయలక్ష్మి
Surya News Paper Dated: 28/3/2013
No comments:
Post a Comment