Thursday, December 27, 2012

అంతటా స్ర్తీది ఒకే దుస్థిత ---Kommineni Srinivasa Rao



- దేశాన్ని కుదిపివేసిన అత్యాచారం
- ఉద్యమరూపం దాల్చిన ఆందోళనలు
- ప్రపంచమంతటా స్త్రీ వివక్ష 
- చట్టాలు పుష్కలం, ఆచరణే శూన్యం 
- ప్రాణాంతకమైన దురాచారాలు 
- అంతులేని వరకట్న హత్యలు 
- ప్రజాప్రతినిధులపైనా అత్యాచారం కేసులు 

JM
దేశ రాజధానిలో జరిగిన దారుణ మానభంగం ఘటన దేశవ్యా ప్తంగా ప్రజలలో ఒక కదలిక వచ్చేలా చేసింది. ఇదేమి దారుణం, ఈ ప్రభు త్వాలు ఏమి చేస్తున్నట్లు? ఈ రాజకీయ పార్టీలు ఏమి చేస్తున్నట్లు? ఇంత అరాచ కానికి పాల్పడిన తీరుపై ఢిల్లీలో వెల్లువెత్తిన తీరు కూడా అందరిలో చైత న్యం పెంచింది. కొంతకాలం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టి నప్పుడు ప్రజలలో ఎలా ఒక్కసారిగా ఆవేశం ఉప్పొంగిందో, ఇప్పుడు ఈ ఘటన కూడా అలాగే అందరిని ఆలోచింప చేసింది. మానవ రూపంలో ఉన్న మృగాలు చేసిన ఘాతుకాన్ని ఖండించడానికి మాటలు ఉండవనే చెప్పాలి. 

నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు అత్యాచారాలకు గురి అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్నా, మరో వైపు మూఢ నమ్మకాలు, నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మానభంగం కేసులు కాని, మహిళలపై గృహ హింస కేసులు కాని లేని దేశం దాదాపుగా లేదనే చెప్పాలి. కమ్యూనిజం ద్వారా సమానత్వం సాధించడానికి ప్రయత్నించే చైనాలో కూడా ముప్పై శాతం మంది మహిళలు గృహహింసను ఎదుర్కుంటున్నట్లుగా ఒక సమాచారం వెల్లడిస్తోంది. ఉక్రేనియా దేశంలో పది నుంచి పదిహేను శాతం మంది మహిళలు మానభంగాలకు గురి అయ్యే పరిస్థితి ఉందని, రెండువేల మూడులో వచ్చిన ఒక నివేదిక వెల్లడించింది. పారిశ్రామికంగా ఎదిగిన దేశాలలోకన్నా, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగాఉండే దేశాలలో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. అనేక దేశాలలో దీనికి సంబంధించిన చట్టాలుఉన్నా అమలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

ప్రపంచంలో యుద్ధాలు జరిగే సమయాలలో మహిళలపై జరిగే అత్యాచారాలు ఇన్నీ అన్నీ కావు. పురుషాధిక్య సమాజం ప్రపంచం అంతటా ఏదో రూపంలో కొనసాగుతున్న తరుణంలో మహిళను మనిషిగా కాక, ఆస్తిగా చూడడం కూడా దీనికి ఒక కారణంగా కనిపిస్తుంది. బోస్నియాలో యుద్ధం జరిగినప్పుడు సెర్బ్‌లు ఇరవైవేల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న సమాచారం వినడానికే దారుణంగా ఉంటుంది. సూడాన్‌లో అంతర్యుద్ధంలో వేలాది మంది మహిళలు కూడా ఇదే పరిస్థితికి గురి అయ్యారు. రవాండా దేశంలో 1990 దశకంలో మూడు లక్షల మంది టుట్సీ జాతి మహిళలు అత్యాచారాలకు గురి అయ్యారు. ఇక కొన్ని మూఢ నమ్మకాలకు కూడా స్ర్తీలు బలి అవుతున్నారు. 

స్ర్తీల జననాంగాలకు సున్తీ చేసే సంప్రదాయం కొన్ని దేశాలలో ఉన్న తీరు చాలా ఘోరంగా ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొన్ని భాగాలను తొలగించే వైనం హృదయ విదారకంగా ఉంటుంది. అమెరికా వంటి దేశాలలో దీనిపై నిషేధం విధించినా అనేక ఆఫ్రికా దేశాలలో ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇరవై ఎనిమిది ఆఫ్రికా దేశాలలో, మద్యప్రాచ్య దేశాలలో, యూరప్‌, అమెరికా, కెనడాలలోని సంచార జాతులలో ఈ దుష్ట సంప్రదాయం మహిళలకు ప్రాణాంతకంగా మారుతోంది. కొన్ని దేశాలలో ఈ సమస్య నుంచి తప్పించు కోవడానికి మహిళలు ఇతర దేశాలకు పారిపోయి ఆశ్రయం కోరుతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది వనితలకు ఈ సమస్య ఎదురవుతోంది. మాలి దేశంలో, సూడన్‌ దేశంలో తొంభై మూడు శాతం మంది ఈ తరహా ఇబ్బంది (జెనిటికల్‌ మ్యుటిలేషన్‌) కి గురవుతున్నారంటే ఎంత విషాదమో ఆలోచించండి. 

ఇక కొన్ని ముస్లిం దేశాలలో మానభంగం జరిగినా ఫిర్యాదు చేసే పరిస్థితి తక్కువగా ఉంటుంది. సమాజ కట్టుబాట్లకు తోడు, మానభంగం కేసును రుజువు చేయడానికి నలుగురు సాక్షులు ఉండాలన్న నిబంధన ఉండడం దారుణంగా చెప్పవచ్చు. ఇక భారత దేశంలో, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలలో కట్నం హత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. రెండువేల రెండులో లెక్కల ప్రకారం ఇండియాలో ఆరువేల మంది మహిళలు కట్న హత్యలకు గురి అయ్యారు. పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ వంటి దేశాలలో మహిళల పట్ల తాలిబన్లు ఎంత పాశవికంగా అనుసరిస్తున్నది ఇటీవలి చరిత్రే. ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న నలుగురు మహిళలను తాలిబన్లు పాక్‌లో కాల్చి చంపారు. 

Vijay-Chowk
మలాలా అనే చిన్నారి, బాలికల విద్యా హక్కు గురించి గొంతెత్తినందుకు ఆమెను హతమార్చడానికి తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనపై ప్రపంచం అంతా తీవ్రంగా స్పందించింది. ప్రత్యేకంగా ఒక విమానం ద్వారా లండన్‌ పంపి ఆమెకు వైద్యం చేస్తున్నారు. కిర్జిస్థాన్‌ దేశంలో పెళ్లికాని యువతులను కిడ్నాప్‌ చేసి బలవంతంగా రేప్‌చేసి పెళ్లిచేసుకోవడం ఒక సంప్రదాయంగా ఉంది. మహిళలకు ఇష్టం లేకపోయినా ఒకసారి కిడ్నాప్‌కు గురి అయ్యాక తప్పనిసరిగా పెళ్లి చేసుకోవలసి వస్తోంది. పన్నెండువేల కేసులు ఈ తరహావి నమోదు అయి, అక్కడ పార్లమెంటు దీనిపై చట్టం తీసుకు రావడానికి ప్రయత్నిస్తే, కొందరు రాజకీయ నేతలు ఇది సంప్రదాయం అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మన దేశంలో మానభంగం కేసులు ప్రతి అరగంటకు ఒకటి జరుగుతుంటే, అమెరికాలో ప్రతి రెండు నిమిషాలకు ఒకటి జరుగుతోందని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం పోలీసు స్టేషన్‌లలో నమోదు కావు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. అమెరికా, ప్రాన్స్‌, స్వీడన్‌ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయంటే మానవ సమాజం ఎంత అనారిగకంగా ఉన్నది అర్ధం అవుతుంది. కొన్ని దేశాలలో వావివరసలతో సంబంధం లేకుండా దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ప్రపంచబ్యాంక్‌ ఛైర్మన్‌గా పనిచేసిన స్ట్రటస్‌ ఖన్‌ అనే వ్యక్తి పై అత్యాచారం అభియోగం నమోదైంది. చివరికి ఆయన వ్యక్తిగతంగా పరిహారం చెల్లించి బయటపడ్డారు. ఇటలీ మాజీ ప్రదాని బెర్లుస్కొని సెక్స్‌ పార్టీలలో పాల్గొన్నారన్న అభియోగం వచ్చింది. 

మన దేశంలో కూడా రాజకీయ నాయకులపై అత్యాచార కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలలో 369 మందిపై అత్యాచారం, ఇతర కేసులు ఉన్నాయి. వీరిలో వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారు. ఈ విషయంలో ఉత్తర్రపదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ ముందంజలో ఉన్నాయి. ఈ కేసులు ఉన్నప్పటికీ ఎన్నికలలో ఆయా పార్టీల టిక్కెట్లు పొందిన వారిలో కాంగ్రెస్‌ నుంచి ఇరవై ఆరు మంది, బిజెపి నుంచి ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉండడం విశేషం. అత్యాచారం కేసులు ఉన్నా, ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందినవారు కూడా డెబె్భై ఆరు మంది ఉండడం విశేషం. 

కొందరు రాజకీయ నేతలు కొంతకాలం ఈ కేసులలో అరెస్టు అయినా, ఆ తర్వాత ఎలాగో తప్పించుకోగలుగుతున్నారు. రాజస్థాన్‌లో బన్వరీదేవి కేసులో ఒక మంత్రిపై అభియోగాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎయిర్‌ హోస్టెస్‌ ఆత్మహత్య కేసులో హర్యానా మంత్రి అరెస్టు అయ్యారు. జమ్ము- కాశ్మీర్‌లో రెండు వేల ఐదులో నమోదైన సంచలనాత్మక మానభంగం కేసులో ఒక ప్రిన్సిపల్‌ సెక్రటరి, ఎమ్మెల్యేతో సహా పలువురు రాజకీయ నేతలపై కేసును చండీఘడ్‌ సిబిఐ కోర్టు కొట్టివేసింది. 

భారత్‌లో 1971లో రోజుకు ఏడు మహిళల అత్యాచారాలు, కిడ్నాప్‌ తదితర కేసులు నమోదైతే, రెండు వేల ఆరు నాటికి రోజుకు ఏభై మూడు కేసులు నమోదు అవుతున్నట్లుగా జాతీయ క్రైమ్‌రికార్డు వెల్లడిస్తోంది. అత్యాచార కేసులలో నిందితులుగా ఉన్న నేతలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనఉన్నప్పట్టికీ, అందువల్ల రాజకీయ కక్షలతో ఇలాంటి కేసులు నమోదైతే ఏమి చేయాలన్న చర్చ వస్తోంది. జాతీయ రికార్డుల నివేదిక ప్రకారం పది లక్షల మించి జనాభా ఉన్న నగరాలలో ఈ అత్యాచారాల కేసులలో డిల్లీ మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నట్లు తేలింది. 

రెండు వేల ఆరు లెక్కల ప్రకారం డిల్లీలో 4134 కేసులు నమోదైతే, హైదరాబాద్‌ లో 1755 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, దేశం అంతటిలో మహిళలపై అత్యాచారాలతో సహా వివిధ రకాల కేసులలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉండడం కూడా సిగ్గుచేటే. మన రాష్ట్రంలో 21484 కేసులు నమోదైతే, ఆ తర్వాత స్థానాల్ని ఉత్తర్రపదేశ్‌, మధ్యప్రదేశ్‌లు ఆక్రమించాయి. మన డిజిపి దినేష్‌ రెడ్డి ఈ ఏడాది అత్యాచారం కేసులు తగ్గాయని చెబుతున్న తరుణంలో హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ వద్ద ఒక చిన్నారి ఘాతుకానికి గురి అయినట్లు వార్తలు వచ్చాయి. సమాజం పురోగతి సాధించే కొద్దీ ఇలాంటి అత్యాచారాలు తగ్గవలసి ఉండగా, ఇవి పెరుగుతుండడం బాధాకరమే. మణిపూర్‌లో తాజాగా ఒక నటిపై నాగా మిలిటెంట్‌ ఒకరు అసభ్యంగా వ్యవహరిస్తే అతనిపై చర్య తీసుకోవాలంటూ రాష్ట్రం అంతా అట్టుడికింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో ఒక జర్నలిస్టు మరణించడం కూడా బాధాకరం. 

మొత్తం మీద ఈ అత్యాచారాలకు మూల కారణాలపై అన్వేషణ సాగాల్సిన సమయం ఆసన్నమైంది. సామూహిక అత్యాచారాలను కాని, ఏ అత్యాచారాన్ని అయినా చేసే నీచ సంస్కృతిని అరికట్టకపోతే ఏ జాతికి నిష్కృతి ఉండదు. అందులో సనాతన సంప్రదాయాలతో, మహిళకు అత్యధిక గౌరవం ఇచ్చే మతంగా పేరున్న హిందువులు అత్యధికంగా నివసించే మన దేశంలో ఇలాంటి కేసులు పెరగడం కచ్చితంగా సామాజిక రుగ్మతే. ఇక్కడ శీలం పోవడంకాదు, దానిని ఒక మహిళపై దాడిగా తీసుకోవాలి. శీలం అంటే గుణం అని అర్ధం అని ఒక కవి తన పాటలో పేర్కొన్నారు. ‘నువ్వేమి చేశావు నేరం’ అంటూ మానభంగానికి గురైన ఒక మహిళను ఆదరించే విధంగా ఆ కవి రాసిన పాట అద్భుతంగా ఉంటుంది. 

ప్రతి ఒక్కరిలో సమాజం పట్ల అవగాహన, పురుషుడు- స్ర్తీ కి మధ్య ఉండవలసిన సంబంధం, అనుబంధం మొదలైనవాటిపై చిన్నప్పటినుంచే పిల్లలకు బోధన జరగాలి. అంతేకాదు సినిమాలలో కాని, ఇతర్రతా కాని మానభంగాలు, అత్యాచార నేరాలు వంటివి ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అక్కడ సిగరెట్‌పైన, మద్యపానంపైన చట్టబద్ధ హెచ్చరిక చేస్తున్నట్లు- ‘ఇది సినిమా మాత్రమే, ఇలాంటివి చేయరాదు’ అన్న సూచనలు స్పష్టంగా చేయాలి. లేకుంటే మన సమాజం ఆటవిక సమాజంగా మారిపోయే ప్రమాదం ఉంది. 

srini
ఢిల్లీలో కాని, దేశంలోని వివిధ ప్రాంతాలలో గాని మానభంగం ఘటనపై స్పందించిన తీరు మంచిదే కాని కొందరు హింసకు పాల్పడడం ఏ మాత్రం పద్ధతి అనిపించదు. ఇందులో రాజకీయాలు చొప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఏది ఏమైనా ప్రపంచంలో అన్ని దేశాలలో మహిళల పరిస్థితి కొంచెం తర తమ తేడాలతో దాదాపు ఒకే రకంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహిళా హక్కుల సంఘాలు ఎంత కృషి చేస్తున్నా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఈ దుస్థితి మారడం లేదు. ఇది అంతర్జాతీయ సమస్య కనుక, ప్రపంచ దేశాలన్నీ ఈ సమస్యపై ఒక అవగాహనకు వచ్చి ఎక్కడ ఇలాంటి నేరాలు జరిగినా ఒకే తరహా శిక్ష వేసే విధంగా, అలాగే ప్రజలలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చైతన్యం తెచ్చే కార్యక్రమాలు రూపొందించడం అవసరం.

Surya News Paper Dated : 27/12/2012 

No comments:

Post a Comment