Friday, March 8, 2013

సంపాదకీయం జెండర్ న్యాయం



ఆకాశంలో సగం మాటేమో కానీ అవకాశాల్లో చిరుభాగం కోసం కూడా పోరాడవలసిన స్థితిలోనే స్త్రీలు ఇంకా కొనసాగుతున్నారు. అంతరిక్షయాత్రికుల్లో, పర్వతారోహకుల్లో, దేశాధినేతల్లో, శాస్త్రవేత్తల్లో, కళాకారుల్లో, యుద్ధరంగంలో, కార్పొరేట్ బోర్డ్‌రూముల్లో- ఆడవాళ్లు కనిపిస్తూనే ఉన్నారు. కానీ, వాళ్లను సంకేతాలు గానో, స్ఫూర్తిదాతలుగానో చెప్పుకున్నంతగా, సర్వత్రా స్త్రీల ప్రాతినిధ్యానికి ప్రతీకలుగా పరిగణించలేము. ఎవరో కొందరు అక్కడక్కడా, అవరోధాలను అధిగమించి, కొద్దిగా సడలిన రెక్కలను విశాలంగా విప్పార్చి, సంకెళ్లింకా తెగీతెగకుండానే సుదూరాలను లంఘిస్తూ, పురుషప్రపంచపు పీఠాలను, స్థలాలను అధిరోహిస్తున్నారు.

ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మహిళా ఉత్సవాలు గురించిన ప్రయత్నాలు 1900 సంవత్సరం నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చి8న అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం 1913లో. ఈ నూటా ఒకటో మహిళాదినోత్సవం, స్త్రీల సాధికారతా ప్రస్థానాన్ని సమీక్షించుకోవడానికి ఒక సందర్భం. ఈ ప్రపంచం ఎంతగా స్త్రీపురుష వివక్షను అధిగమించిందో, ఇంకా ఎంతటి అంధకారం మిగిలి ఉన్నదో లెక్కవేసుకోవడానికి ఇది ఒక అవకాశం. బహుశా వివిధ మహిళా ప్రజా ఉద్యమాలు అటువంటి సమీక్షలు చేసుకుంటాయి. 

సుదీర్ఘ పోరాటాల పరోక్ష దోహదంతో అవకాశాలను పొంది, విజయాలు సాధించిన వ్యక్తులు - చారిత్రక నేపథ్యాన్ని గుర్తించో, గుర్తించకుండానో విజయోత్సవాలు జరుపుకుంటారు. అనేక బహుళజాతి కార్పొరేట్ సంస్థలు శుక్రవారం నాడు తమ తమ మహిళా ఉన్నతోద్యోగులను ప్రదర్శించి, తామెంతగా స్త్రీపురుష సమత్వాన్ని పాటిస్తున్నాయో చెప్పుకోబోతున్నాయి. 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం ప్రకటించేదాకా పెద్దగా ప్రచారంలో లేని మహిళాదినోత్సవం- ఇప్పుడు అనేక దేశాల్లో సెలవుదినంగా కూడా మారింది. 

క్యూబా, కంబోడియా, లావోస్, వియత్నాం వంటి దేశాలతో పాటు, ఆప్ఘనిస్థాన్, అజర్‌బైజాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్కమినిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో కూడా మార్చి 8 ఒక పబ్లిక్ హాలిడే. చైనా, నేపాల్‌లలో ఈ రోజు స్త్రీలకు మాత్రమే సెలవుదినం. స్త్రీల సాధికారతా ప్రస్థానాన్ని సంబరంగా జరుపుకునే ఆనవాయితీ ప్రారంభమైన తరువాత కూడా మార్చి 8 సెలవు కోసం మన దేశంలో ఇప్పటివరకు డిమాండ్ వినిపించలేదు.

ఈ ఏడు మహిళాదినోత్సవానికి మనదేశంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇటీవలి ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన దరిమిలా, స్త్రీల భద్రత గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరిగింది. ప్రభుత్వం ఒక కమిటీని నియమించి, దాని సిఫార్సుల ఆధారంగా ఒక కొత్త చట్టాన్ని కూడా రూపొందించింది. స్త్రీల భద్రతను ఒక ప్రత్యేక అంశంగా పరిగణించి, బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేశారు. రైల్వే రక్షకదళంలో పదిశాతం ఉద్యోగాలను స్త్రీలకు ఇస్తామని చెప్పారు. 

ఇదంతా ఆహ్వానించదగినదే కానీ, 'నిర్భయ' ఆందోళన సందర్భంగా, మహిళా ఉద్యమ విలువలకు విరుద్ధమయిన ఆకాంక్షలెన్నో వ్యక్తం కావడం, ప్రభుత్వం సైతం వాటి ప్రభావంలో పడిపోవడం జరిగింది. అన్నిటి కంటె ఆశ్చర్యకరమైన అంశం, దశాబ్దాలుగా నిర్మించిన వివిధ మహిళా ఉద్యమాలు, వాటి సంస్థలు, నేతలు అందరూ అప్రధానమై, గాఢమైన అవగాహన, దూరదృష్టి లేని ఫేస్‌బుక్ తరం ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకోవడం. ప్రధానంగా పట్టణ మధ్యతరగతి ఉద్యమమే అయినప్పటికీ, మనదేశంలోని పౌరసమాజం ముఖచిత్రంలో వస్తున్న మార్పులను అది సూచించింది. 

పాలపొంగులా ఆ ఉద్యమం ఉబికివచ్చి, ప్రభావం వేయగలిగినప్పుడు, మహిళా రాజకీయ రిజర్వేషన్ల కోసం కొంతకాలం కిందట ఉధృతంగా జరిగిన ఉద్యమం ఎందుకు వెనుకపట్టు పట్టిందన్న ప్రశ్న ఈ సందర్భంగా రావడంలో ఆశ్చర్యం లేదు. మహిళా సాధికారత చర్యలను సామాజిక న్యాయవాదులు అడ్డుకుంటున్నారన్న అభిప్రాయం కానీ, మహిళల పేరుతో అగ్రవర్ణాలు అధిక స్థానాలను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం కానీ - మంచివి కావు.

ఈ వైరుధ్యాన్ని పరిష్కరించవలసిన బాధ్యత మహిళా ఉద్యమాలకు, వాటికి మార్గదర్శనం చేస్తున్న రాజకీయపార్టీలకు ఉన్నది. పనిలో పనిగా బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ల ప్రతిపాదన చేసి, అన్ని సామాజిక, మహిళా రిజర్వేషన్లను అనుసంధానం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అదొక సుదీర్ఘ ప్రక్రియ అనుకుంటే, వివిధ పార్టీలు సుముఖంగా ఉన్న పదిశాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను అయినా ముందుకు తీసుకువెడితే తాత్కాలికంగా అయినా ప్రయోజనమే.

మహిళా ఉద్యమం తన సాంప్రదాయికమైన ఆందోళనాంశాలతో పాటు, కొత్తగా ముందుకు వస్తున్న సమస్యలను కూడా స్వీకరించాలి. ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న వనరుల దోపిడి, పర్యావరణ విధ్వంసం, భూనిర్వాసితత్వం, అదపులేని పారిశ్రామికీకరణ- వీటివల్ల అధికంగా బాధితులవుతున్నది స్త్రీలే. పెట్టుబడితో పాటు నిర్నిరోధంగా ప్రవహిస్తున్న సాంస్కృతిక కాలుష్యం కూడా గురిపెడుతున్నది స్త్రీలనే. అక్షరాస్యతలోకి, విద్యలోకి వేగంగా ప్రవేశిస్తున్న స్త్రీలు, కొందరు ఉన్నత స్థానాలకు వెడుతున్నప్పటికీ, అత్యధికులు, సాంప్రదాయికంగా స్త్రీలకు స్థానంలేని అనేక కొత్త ఉద్యోగరంగాలలోకి వెళ్లవలసి వస్తున్నది. 

కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్లడం, పురుషులు మాత్రమే వలసవెళ్లి స్త్రీలు కుటుంబబాధ్యతలు మొత్తాన్ని నిర్వహించవలసి రావడం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర చోట్ల నివసించవలసి రావడం- మహిళలు కొత్త సవాళ్లు ఎదుర్కొనవలసి రావడానికి కొన్ని కారణాలు. కొత్త సవాళ్లతో పాటు, పాత సమస్యలు కూడా యథాతథంగా కొనసాగుతూ ఉండడం మన దేశంలో మరో విషాదం. భ్రూణహత్యలు, పరువుహత్యలు, అర్థరాత్రి అత్యాచారాలు, పోలీసు దాష్టీకాలు, వరకట్నం హత్యలు, ఆసిడ్ దాడులు.. ఎక్కడా ఆగుతున్నట్టు కనిపించడం లేదు.

చదువులు, సంపాదనలు, వివిధ స్థాయిల్లో సాధికారత- ఇవి తెచ్చే ధైర్యమూ ధీమా మాత్రమే స్త్రీల పురోగతికి సరిపోవు. సర్వరంగాల్లో ఆధిపత్యాన్ని తొలగించి, స్త్రీపురుష సమత్వాన్ని స్థాపించడానికి, మనుషుల ఆలోచనల్లోను, వ్యవస్థల ధోరణుల్లోను, ప్రజా వినోదసమాచార సాధనాల వైఖరుల్లోను పరివర్తన తేవడానికి దృక్పథ స్పష్టత కలిగిన మహిళా ఉద్యమాలు బలపడాలి. ప్రాతినిధ్యాన్ని విస్తరించడం, చైతన్యాన్ని వ్యాపింపజేయడం- ఈ రెండూ మహిళా స్వాతంత్య్రానికి కీలకాలు


Andhra Jyothi Telugu News Paper Dated: 8/3/2013 Sampadakiyam 

No comments:

Post a Comment