Tuesday, September 6, 2011

తెలంగాణలో ముస్లింల మాటేమిటి? - కనీజ్ ఫాతిమా Andhra Jyothi 07/09/2011


తెలంగాణలో ముస్లింల మాటేమిటి?

- కనీజ్ ఫాతిమా

తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైనదో సామాజిక తెలంగాణ కూడా అంత కన్న ఎక్కువ న్యాయమైనది. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ 2009లో ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం పునరుజ్జీవం పొందింది. అయితే, ఆ సమయంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉద్యమంలో పాల్గొనలేదు. 'ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ' 2007నుండి తెలంగాణ ఆవశ్యకత గురించి ముస్లిం సమాజంలో అవగాహన కల్పిస్తుంది. ఈ సంస్థ ఒక ప్రెజర్ గ్రూప్‌గా మాత్రమే పనిచేయటం లేదు.

అది ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలన్నింటి పరిష్కారం కోసం కృషిచేస్తుంది. అనేక మంది ముస్లింలు క్రమంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావటం వెనక ఈ ఫోరం కల్పించిన అవగాహన ఉంది. అనేక జేఏసీలు, వేదికలను ముస్లింలు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణ ముస్లింల కన్న ఆయా జిల్లాల్లో నివసిస్తున్న ముస్లింలే ఎక్కువగా ఉద్యమంలో కనిపించారు. చివరికి నిజామాబాద్‌లో బిజెపి అభ్యర్థిని 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముస్లింలే గెలిపించేంత స్థాయికి ముస్లింల భాగస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో పెరిగింది.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవటంతో మళ్లీ ఉద్యమం ఊపందుకుంది. ఈసారి హిందూత్వ శక్తులు, ఎక్కువగా బిజెపి ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఇక్కడికి ఆహ్వానించి తెలంగాణ ఏర్పాటు హామీని విద్వేష ఉపన్యాసాలతో పాటు ఇప్పించారు. చిన్న రాష్ట్రాలను సమర్ధించే పేరుతో తెలంగాణ డిమాండ్‌ను బలపర్చారు. ముస్లింలను తిరిగి అధికారంలోకి రానివ్వమనే హామీని కూడా వారు ఇచ్చారు.

ఇదే సందర్భంలో 2010లో హైదరాబాదులో జరిగిన అల్లర్లు ఇక్కడ ప్రస్తావించటం తప్పేమీ కాదు. శాంతికాముకుల నగరంలో విద్వేష, భయాందోళనలు ప్రజ్వరిల్లచేసింది, ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టిందీ బిజెపి నాయకులే. 2010-11లలో హనుమాన్ జయంతి, శ్రీరామనవమి సందర్భంగా ముస్లిం వ్యతిరేక విద్వేష ఉపన్యాసాలను పెద్దస్థాయి లో ఇప్పించారు. తెలంగాణ ఉద్యమానికి నిజంగా ప్రమాదకరమైన బిజెపి తన రాజకీయ ఉనికి కోసం ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నది.

ఈ సంఘటనలతో ముస్లింలు పునరాలోచనలో పడ్డారు. అనేక సందేహాలు వాళ్ల మనస్సులో తలెత్తాయి. సరైన పద్ధతిలో మనం లక్ష్యం వైపు పయనిస్తున్నామా? ఈ ఉద్యమం సరైనదేనా? రాబోయే కొత్త రాష్ట్రం ప్రజాస్వామికమైనదేనా? కొత్త రాష్ట్రంలో ముస్లింలకు ఏదైనా రక్షణ ఉంటుందా? వారి వాటా వారు పొందగలరా? లేక సమైక్య రాష్ట్రంలో కన్నా హీనమైన రీతిలో చూడబడుతారా? వంటి అనుమానాలు తలెత్తాయి.

టిఆర్ఎస్ నేత నోటిమాటగా అన్న '12 శాతం రిజర్వేషన్, ఉపముఖ్యమం త్రి' హామీలు పనిచేయవని ముస్లింలు అర్ధం చేసుకున్నారు. ఆయనవి కేవలం మాటలు మాత్రమే. అవి ఎప్పుడూ చేతలుగా మారలేదు. ఆయన పార్టీలో ఇప్పటి వరకు ముస్లిం ప్రాతినిధ్యం (కనీసం ఒక్క ముస్లిం ఎమ్మెల్యే) లేకపోవటమే అందుకు నిదర్శనం. ఏడో నిజాం సమాధిని సందర్శించినంత మాత్రాన ముస్లింలను ఆయన సంతృప్తిపరచలేరు. వేదికల మీద ముస్లిం నేతలను తన పక్కన కూర్చోబెట్టుకున్నంత మాత్రానే అది వీలు కాదు.

సంపన్న ముస్లింలు సామాన్య ముస్లింలకు ప్రతినిధులు కారు. తెలంగాణ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనేక మంది సామాన్యమైన ముస్లింలు ఉన్నారు. వాళ్లంతా ఎక్కడ విసిరేయబడ్డారు? ప్రధాన స్రవంతి నుండి వాళ్లనెందుకు దూరం పెట్టారు? అన్ని చోట్లా కేవలం సంపన్న ముస్లింలే ఎందుకు కనిపిస్తున్నారు? దీనికి తోడు తెలంగాణ జాక్ కన్వీనర్ బిజెపి నాయకత్వం మద్దతు అడుగుతాడు.

రాజకీయ ఆకాంక్షలెంత సంకుచితమయ్యాయో, నాయకత్వమెంత వివాదాస్పదమైపోయిందో ఇది చూపిస్తుంది. కుహనా నేతలు తప్ప మైనార్టీలు, స్త్రీలతో సహా మరొకరు ఉద్యమంలో కనిపించరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిజాయితీగా ఉండాల్సింది పోయి తమ ఉనికి కోసం పోటీ పడుతున్నారు. ఉద్యమం స్వార్థపూరితమూ అవినీతిమయమూ అయిందని చెప్పొచ్చు.

స్త్రీలు, ముస్లింలను దూరం పెట్టేందుకు శాయశక్తులా నేతలు కృషి చేస్తున్నారు. విద్యార్థులనే కాదు సామాన్య జనాల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. విద్యార్థుల మధ్య విజయవంతంగా చీలికలు తెచ్చారు. నాయకుల ప్రోత్సాహంవల్ల అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్లను అమరులని కీర్తిస్తున్నారు. నేతలు నిజాయితీపరులైతే ఈ ఆత్మహత్యలు జరిగేవే కావు. ఆత్మహత్యలను ఎందుకు సమర్థిస్తున్నారు? మరిన్ని జరగాలని ఎందుకు కోరుకుంటున్నారు? తెలంగాణ పేరు మీద యువకులందర్నీ ఈ నేతలు బలివ్వాలని అనుకుంటున్నారా?

సామాజిక పునాదుల మీద ఆధారపడిన లౌకిక ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కారణం వల్ల ముస్లిం సమాజం కోరుతున్నది? ఈ ప్రశ్నే చాలా శక్తిమంతమైనది. ఇలా అడగటం వల్ల ముస్లింల పట్ల అకారణ వ్యతిరేకత పెల్లుబుకుతుందనేది నిజం. చరిత్రలో కూడా అదే జరిగింది. దేశానికి గాంధీజీ స్వతంత్రం తెస్తానంటే ముస్లింలే వద్దంటున్నారని ఆనాడు నిరాధారమైన ఆరోపణలు చేశారు. వాటినే నేటికీ మతతత్వ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. స్వతంత్రం ప్రకటించిన తర్వాత 1892 నుండి 1947 వరకు ముస్లింలకు ఉన్న ప్రత్యేక నియోజకవర్గాలు, విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్య వ్యవస్థ ఉండి వుంటే ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితిలో ముస్లింలు ఉండేవారు కాదు.

ఇక కొన్నేళ్ల క్రితం తెలంగాణలో స్థిరపడిన కొంతమంది సీమాం«ద్రులు రాష్ట్ర సాధన డిమాండ్‌ను సమర్ధిస్తున్నారు. ఈ మద్దతు నిజాయితీతో కూడినది కాదు. ఇందులో వారి స్వప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడితే అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందేది వాళ్లే. అంతేకాదు, ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో వాళ్లే పాలిస్తారు.

హైదరాబాదులో నెలకొన్న అనేక స్వచ్ఛంద సంస్థలు అగ్రకుల సీమాంధ్ర సెటిలర్ల చేతిలో వున్నాయి. తెలంగాణకు మద్దతిస్తున్నట్టు నటిస్తున్న సీమాం«ద్రులు, వారి చేతిలో వున్న అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలు భవిష్యత్తులో మనల్ని పాలించే సమయం వస్తుంది. నిజంగా సీమాం ధ్ర సెటిలర్లు తెలంగాణ కోరుకుంటే వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయి, అక్కడ ప్రచారం చేయాలి. అప్పుడే వారి నిజాయితీ నిరూపితమవుతుంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క సమూహం కూడా మోసగించబడకుం డా అణచివేయబడకుండా, వారి జనాభా ప్రకారం సమానమైన వాటా పొందే విధంగా తెలంగాణ ఎజెండాను రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీలకు అధికారం, విద్య, ఉద్యోగాల్లో వాటా పొందుతారనే దాంట్లో సందేహం లేదు. కాని ముస్లిం ల మాటేమిటి? తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లింలు ఏం పొందబోతున్నారు? ఉపముఖ్యమంత్రి పదవా? లేక 12 శాతం రిజర్వేషనా? ఉపముఖ్యమంత్రి పదవి ముస్లింలను రంజింప చేస్తుందా? సమైక్య రాష్ట్రంలోనే ఇప్పుడు 4 శాతం రిజర్వేషన్ సమస్య పెండింగ్‌లో ఉంది. అలాంటిది మతతత్వ శక్తులు ప్రబలంగా వున్న భవిష్యత్ కాలంలో 12 శాతం ఏ రకంగా ఊహించగలం? విద్య, ఉద్యోగం, అధికారంలో వాటా మాట సాధ్యమయ్యేనా?

ఈ పరిస్థితుల నేపథ్యంలో లౌకిక, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్ అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి ఈ డిమాండ్‌ను ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బిసిలు చేస్తూనే ఉన్నారు. అదిప్పుడు ఒక తీవ్రమైన చర్చగా మారింది. ప్రొ.కంచె ఐలయ్య, డా.జిలుకర శ్రీనివాస్ వంటి బహుజన మేధావులు, విశారదన్, మందకృష్ణ వంటి నాయకులు లౌకిక ప్రజాస్వామిక తెలంగాణను డిమాండ్ చేయటమే కాదు, దాన్ని నిర్మించేందుకు అవసరమైన సూచనలు ఇస్తూనే ఉన్నారు.

ఈ డిమాండ్‌ను సాకారం చేసేందుకు డా. జిలుకర శ్రీనివాస్ సూచించిన విధంగా ఎజెండా రూపొందించుకోవాలి. ఒక పెద్దమనుషుల ఒప్పందం రాజకీయ పార్టీలు, ఎస్సీ-ఎస్టీ-బిసి-మైనార్టీ సంస్థ ల మధ్య కుదరాలి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒప్పందం చేసుకుందామంటే కుదరదు. అది రాష్ట్ర ఏర్పాటుకన్న ముందే జరగాలి. అలాంటి ఒప్పందానికి ముస్లింలు తప్పకుండా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు. ఒకవేళ తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం జరుగకున్నా, ఆ ఒప్పందాన్ని తుంగ లో తొక్కినా కొత్త రాష్ట్రం అనతికాలంలోనే అంతర్యుద్ధాన్ని చవిచూస్తుంది.

- కనీజ్ ఫాతిమా
ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణ

No comments:

Post a Comment