Friday, December 14, 2012

ఢోకాలేని ముస్లింల సంక్షేమం - కె. కొండల రావు



ముస్లింలకు సామాజిక న్యాయం అందటం లేదు అనే దాంట్లో నిజం లేదు. వారి ఓటింగ్ సరళిలో సంఘటితత్వం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను కీలక సందర్భాల్లో నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. ఇతర అణగారిన వర్గాలైనవారెవ్వరికీ తీసిపోకుండా ముస్లింలు రాజ్యప్రోత్సాహం పొందుతున్నారు. ముస్లింల విషయంలో రాజ్యాంగం విఫలమయ్యిందనడం ఏవిధంగానూ సబబుకాదు. 

'ముస్లింల బాగు కోరే వారెవరు?' అని ఎస్.పి.గఫార్ (నవంబర్ 6, ఆంధ్రజ్యోతి) ప్రశ్నించారు. 'ఎవ్వరికీ పట్టని మైనారిటీలు' అంటూ ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (నవంబర్ 11, ఆంధ్రజ్యోతి) వాపోయారు. వాస్తవమేమిటి? మన ప్రభుత్వాలు నిజంగానే, ముస్లిం సోదరులను ఇంతగా నిరాశానిస్పృహలకు లోను చేస్తున్నాయా? కేంద్ర ఉద్యోగరంగంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో, సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4.5 శాతం మైనారిటీ సబ్ కోటాకు ఉత్తర్వులిచ్చింది. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ముస్లింలకు ఈ కోటా కల్పించారు. ఈ విషయంలో జాతీయ బీసీ కమిషన్‌ను సంప్రదించలేదు. ఈ సబ్‌కోటా పట్ల దేశ వ్యాప్తంగా ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు.

తమకు అన్యాయం జరుగుతుంటే ఓబీసీలు ఎలా హర్షిస్తారు? రంగనాధ్ మిశ్రా కమిషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధం; జాతీయ బీసీ కమిషన్‌ను సంప్రదించకపోవడం చట్ట విరుద్ధం; ఓబీసీల వర్గీకరణ అవసరమైతే అది 'వెనుకబాటుతనం' స్థాయిని బట్టి మాత్రమే జరగాలి; మైనారిటీ ఓబీసీ, నాన్ మైనారిటీ ఓబీసీలుగా విభజించడం మతపరమైన వర్గీకరణ అవుతుంది కాబట్టి చెల్లదు; 4.5 శాతం సబ్ కోటాను సమర్థించడానికి అవసరమైన సర్వే గణాంకాలు కూడా లేవు... ముస్లింల సబ్ కోటాకు వ్యతిరేకంగా నేను చేసిన ఈ వాదనలను హైకోర్టు ఆమోదించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హిందూ ఓబీసీలకు ఆ మేరకు ఊరట లభించింది.

ప్రమోషన్లలో రిజర్వేషన్ల వ్యవహారాన్ని చూద్దాం. ఈ రిజర్వేషన్లు కూడదని 1992లో మండల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ సదుపాయాన్ని 1955 నుంచి పొందుతున్న ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు విఘాతం కల్గింది. ఆ సామాజిక వర్గాల నాయకత్వాల తీవ్ర ఒత్తిడిమేరకు, తమ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని, నాటి ప్రధానమంత్రులు పి.వి.నరసింహారావు, ఏ.బి.వాజపేయి 1995-2001 మధ్యకాలంలో నాలుగు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు; తద్వారా అర్హత ప్రమాణాలను సడలించి, కాన్సీక్వెన్షియల్ సీనియారిటీతో సహా వెనక తేదీ 1995 జూన్17 నుంచి అమలయ్యేలా చూశారు. ఆ సదుపాయం ఎస్సీ, ఎస్టీ వర్గాలకే పరిమితం చేశారు. ఆనాటికే ప్రభుత్వ ఉద్యోగరంగంలో బీసీల ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీల కంటే ఎంతో అధ్వాన్నంగా ఉన్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినా బీసీలను పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పునరుద్ధరించారు.

దరిమిలా సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు మేరకు ఈ సదుపాయాన్ని అమలుచేయడానికి ఇబ్బంది ఏర్పడింది. ఆ సందర్భంగా (గత సెప్టెంబర్‌లో) యూపీఏ ప్రభుత్వం మరొకసారి రాజ్యాంగ సవరణకు సిద్ధపడింది. ఎస్సీ, ఎస్టీలతో పోల్చినప్పుడు బీసీల ఉద్యోగ ప్రాతినిధ్య పరిస్థితి గతంలో కంటే ఎంతో అధ్వాన్నంగా ఉంది. అయినప్పటికీ బీసీలను మరలా పక్కన పెట్టారు. సహజంగా బీసీ వర్గాల నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 117వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగిపోయింది. చెప్పవచ్చిందేమిటంటే అసమానతలను సరిచేయడంలో కూడా ఆధిపత్య శక్తులు బీసీల విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్నాయి. ఇది గర్హనీయం. తమ అభీష్టం మేరకు తమకు కావలసిన ఎటువంటి విద్యా సంస్థలనైనా స్థాపించి తామే నిర్వహించుకొనే హక్కు ముస్లింలకు ఉంది (ఎస్సీ, ఎస్టీలకు కూడా లేని ఈ ప్రత్యేక హక్కును అధికరణ 30 ద్వారా మైనారిటీలకు కల్పించారు).

ఈ హక్కును ఉపయోగించుకొనే దేశవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు ఎన్నో విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వృత్తి విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు వీటిలో ప్రముఖ మైనవి. దీనికి అదనంగా ఆయా రాష్ట్రాల్లో బీసీల్లో చేర్చబడిన ముస్లిం వర్గాలు రిజర్వేషన్ల ద్వారా ఆయా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ఈ రెండు విధాల ప్రత్యేక సహకారాన్ని, ప్రోత్సాహాన్ని రాజ్యం అందిస్తున్నప్పటికీ ముస్లింలు విద్యాపరంగా వెనుకబడి ఉండడం నిజమే. అయితే అందుకు కారణాల్ని పూర్తిగా నిర్ధారించకుండా రాజ్యాన్ని మాత్రమే తప్పుపట్టడం సమంజసం కాదు. ముస్లింల పట్ల వివక్ష, వ్యతిరేకత, అణచివేత ధోరణి అంటే కుదరదు. పేద ముస్లింలకు వారి మైనారిటీ విద్యా సంస్థలు అందుబాటులో ఉండడం లేదని సచార్ కమిటీ నిర్ధారించింది. మరి ఈ పరిస్థితికి కారకులెవరు? పార్టీలా? ప్రభుత్వాలా? ముస్లింల మీద ఇతరుల వివక్షా, వ్యతిరేకతా? లేక ఆ వర్గానికే చెందిన కొందరి వ్యాపార ధోరణా?

ఉన్నత విద్య, ప్రభుత్వోద్యోగాల మీద కంటే ముస్లింలకు అధిక ఆదాయాలకు అవకాశాలున్న గృహ పరిశ్రమలు, ఉత్పత్తి, వ్యాపార, సేవల రంగాలపై మక్కువ ఎక్కువ అని 2001 జనాభా గణన ద్వారా అర్థమవుతుంది. జాతీయ సగటు కంటే గృహపరిశ్రమ రంగంలో ముస్లింలు 92.65 శాతం అధికంగా ఉన్నారు. ఉత్పత్తి, వ్యాపార, సేవారంగాల్లో వీరు జాతీయ సగటు కంటే 30.6 శాతం ఎక్కువ ఉన్నారు. ఈ రీత్యా ఉన్నత విద్య, ప్రభుద్వోద్యోగ రంగాల్లో తగినంతగా ముస్లింలు లేకపోవటానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదనిపిస్తుంది. అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని పణంగా పెట్టి మైనారిటీల ప్రయోజనాలకే రాజ్యం ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 93వ రాజ్యాంగ సవరణ దీనికి ఒక చక్కని ఉదాహరణ. ఉన్నత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు ప్రభుత్వ రంగంలో కంటే ప్రయివేటు రంగంలో వాసిలోనూ, రాసిలోనూ ఎక్కువగా పెరుగుతున్న సందర్భమిది. ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్టం ద్వారా రిజర్వేషన్ల కల్పనకు అవకాశమిచ్చిన ఈ 93వ రాజ్యాంగ సవరణ, మైనారిటీ విద్యా సంస్థలకు ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు నిచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ ప్రయోజనాల్ని విస్మరించారు. దీన్ని ముస్లింల మీద వ్యతిరేకత అందామా? ప్రత్యేక శ్రద్ధ అందామా?

సైకిళ్ళకు పంక్చర్లు, బిందెలకు మాట్లు వెయ్యడం, గొడుగులను, తాళాలను బాగుచేయడం, రిక్షాలు లాగడం, హమాలీ పనిచేయడం కేవలం ముస్లింలకే పరిమితమైన పనులుకావు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే స్థాయి, ఇంత కంటే అధమస్థాయి వ్యాపకాల్లో ఉంటున్నవారు ఇతర సామాజిక వర్గాల్లోనూ ఎందరో ఉంటున్నారు. ముస్లింలైనా, ముస్లిమేతరులైనా కేవలం పేదరికం కారణంగానే ఈ వృత్తుల్లో ఉంటున్నారు తప్ప పారంపర్య సంప్రదాయాలేమీ ఎవరినీ ఈ చిన్న వృత్తుల్లో బంధించడం లేదు. ఇటువంటి వృత్తుల్లో సామాజిక వెనకబాటుతనానికి గీటురాళ్ళు కాదని కోర్టు తీర్పుల సారాంశం.

'పాలక వర్గాలు గత నివేదికలకు లాగానే సచార్ నివేదికను బుట్ట దాఖలు చేశాయి. స్వాతంత్య్రం సిద్ధించి ఆరున్నర దశాబ్దాలైనా ముస్లింల స్థితిగతులు నాడు ఎలా ఉన్నాయో నేడూ అలానే ఉన్నాయి. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతను తలపోస్తుంది. పాలకులకు ముస్లింల సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు' అంటూ ఉస్మాన్ ఖాన్ రాళ్ళు వేస్తున్నారు. ఇక గఫార్ 'నెహ్రూ కాలం నుంచి నేటి వరకూ ముస్లింల కోసం ప్రభుత్వాలు కార్చింది మొసలికన్నీరే. గణాంక సాక్ష్యాధారాలతో సచార్ కమిషన్, మిశ్రా కమిషన్ దీన్ని స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెల్లంకొట్టిన రాయిలాగా ఏమీపట్టనట్లు చేష్టలుడిగి చూస్తున్నాయం'టూ బండరాళ్ళు వేస్తున్నారు. కమిషన్ల నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు, బుట్టదాఖలు చేశాయనడం బాధ్యతారాహిత్యం.

పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వాలుగానీ, పార్టీలుగానీ చేయవలసిన దానికి మించి, కొన్ని సందార్భలలో బీసీల్లాంటి వారి ప్రయోజనాల్ని కూడా పణంగా పెట్టి, ముస్లింల ప్రయోజనాల కోసం ఎంతోచేస్తున్నాయనడానికి పై విశ్లేషణ, సమాచారంతోపాటు ఎన్నో వాస్తవాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆ విధంగా ఎవ్వరికీ పట్టని మైనారిటీలు అనడానికి గానీ, ముస్లింల బాగుకోరే వారెవరు అని అడగడానికి గానీ ఏమాత్రం ఆస్కారం లేదు. జస్టిస్ బిలాల్ నజ్కీ సూచించినట్టుగా సచార్ కమిటీ తన నివేదికలో వ్యాఖ్యానించినట్టు ముస్లింలు తమ అభివృద్ధి కోసం తమను తామే పట్టించుకొని 'రూట్ కరక్షన్' చేసుకోవలసిన అవసరముందని చెప్పడానికయితే ఆస్కారముంది.

కేవలం ముస్లిం సమాజపు సామాజిక, ఆర్థిక విద్యాపరమైన అభివృద్ధి స్థాయిని పెంచడానికి సచార్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులన్నిటినీ అమలుచేయడానికి నిర్ణయించి 2007 నుంచే అనుక్రమ చర్యలు ప్రభుత్వం ప్రారంభించింది. అధికారిక సమాచారం ప్రకారమే, లక్ష కోట్ల ఖర్చుతో 25 రకాలుగా ఈ చర్యలు నడుస్తున్నాయి. సచార్ నివేదిక సిఫార్సులను ఇంచుమించు అన్నిటిని అనేక కార్యాచరణల ద్వారా ఎంతో వ్యయ ప్రయాసలతో నివేదిక అందిన క్షణం నుంచి నేటివరకు కేవలం మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల బహుముఖ అభివృద్ధి కోసం కోట్లాది కుటుంబాలకు మేలు జరిగే కృషి నడుస్తుంటే గత నివేదికలు లాగానే సచార్ నివేదికనూ పాలకులు బుట్టదాఖలు చేసాయి అనడంలో ఉస్మాన్ ఖాన్, ఇంచు మించు ఇదే ధోరణితో నడిచిన గఫార్ అభాండాల ఆంతర్యం అనుమానాస్పదం కాదా? ముస్లింలకు సామాజిక న్యాయం అందటం లేదు అనే దాంట్లో నిజం లేదు.

వారి ఓటింగ్ సరళిలో సంఘటితత్వం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను కీలక సందర్భాల్లో నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. అయితే ఇది అన్నివేళల అన్ని సందర్భాల్లో ఒక స్థాయికి మించి ఉపయోగపడదు. ఇతర అణగారిన వర్గాలైనవారెవ్వరికీ తీసిపోకుండా ముస్లింలు రాజ్యప్రోత్సాహం పొందుతున్నారు. ముస్లింల విషయంలో రాజ్యాంగం విఫలమయ్యిందనడం ఏవిధంగానూ సబబుకాదు. దానికి ఎటువంటి ఆధారాలు లేవు. పనిగట్టుకుని ముస్లింలను వెనక్కు నెట్టేసే పరిస్థితి ఈ దేశంలో ఎవరికీ లేదు.

- కె. కొండల రావు
హైకోర్టు న్యాయవాది, కన్వీనర్ బీసీ మిత్రులు
Andhra Jyothi News Paper Dated: 15/12/2012

No comments:

Post a Comment