Monday, April 22, 2013

దళిత ముస్లింల దుస్థితి By షేక్ సత్తార్ సాహెబ్



తమ జీవనోపాధికి అపరిశుభ్రమైన వృత్తుల్లో ఉన్న సుమారు 60 ముస్లిం కులాలను ఆంధ్రప్రదేశ్‌లో దళిత ముస్లింలుగా గుర్తించి ఉన్నారు. ఉదాహరణకు, దూదేకుల (కాటన్ క్లీనర్స్), హజామ్ (బార్బర్ లేక మంగలి), ఫకీరు బుడిబుడిక్కి, పాములు ఆడించేవారు, ఎల్లుగొడ్లు ఆడించేవారు, గారడీ చేసేవారు, మెహతర్ (పాకీ పనిచేసేవారు),అత్తరు అమ్మేవారు, బండలుకొట్టేవా రు, బోరేవాలా తదితరులు. ఆనాటి రాష్ట్రపతి ఉత్తర్వులద్వారా ఈ ఎస్సీ రిజర్వేషన్‌ను హిందూమతంలో ఉన్న దళిత కులాలకు మాత్రమే పరిమితం చేసి హిందూ మతేతర దళిత ముస్లింలు, దళిత క్రిష్టియన్లు, దళిత సిక్కులు, దళిత బౌద్ధ కులాలను తొలగించారు. బ్రిటిష్ ప్రభుత్వకాలం నుంచి కొసాగుతున్న ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను స్వాత్రంత్యానంతరం రాష్ట్రపతి కలం పోటుతో తొలగించి హిందూమతేతర దళితుల వెన్ను విరిచేశారు.

1950 నుండి రిజర్వేషన్‌లకు దూరమై ఈ దళిత ముస్లిం కులస్థులు నేటికి ఎస్సీ, ఎస్టీలకన్న అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుచున్నారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ తన నివేదిక- అపరిశుభ్రమైన (అన్ క్లీన్ ఆక్యుపేషన్స్) వృత్తుల ద్వారా జీవనాన్ని గడుపుతున్న దూదేకుల, హజామ్, ఫకీరు బుడిబుడిక్కి మొదలగు దళిత ముస్లింలను ఎస్సీ రిజర్వేషన్‌ను తొలగించినందువల్ల వారు ఎస్సీ, ఎస్టీల కన్నా అన్ని రంగాలలో దారుణంగా వెనుకబాటుకు గురయివున్నారని నివేదించింది.సచార్ కమిటి నివేదిక ప్రకారం దళిత ముస్లిం అక్షరాస్యులలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు10వ తరగలి వరకే పరిమితమవుతున్నారు. డ్రాప్ఔట్స్ 70 శాతంగా ఉన్నాయి. కొద్దిమంది మాత్రమే ఇంటర్ మీడియట్, డిగ్రీ, పిజి వరకు వెళ్ళగలుగుతున్నారు. ఇక ఉన్నత ఉద్యోగాల్లో- ఐఎఎస్, ఐపీఎస్‌లో 1950 నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు. దళిత ముస్లింలలోని దూదేకుల లాంటి కులాలలో ఎక్కువశాతం చప్రాసీలుగా, అటెండర్‌లుగా, స్వీపర్లుగానే పనిచేస్తున్నారు. క్లర్క్‌స్థాయి ఉద్యోగులు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆధునిక పరిశ్రమల వలన వారి వారి వృత్తులు కోల్పోయి రైతు కూలీలుగా, హమాలీలుగా, రోజువారి కూలీలుగా, శాశ్వతఉపాధి లేని కూలిపనులకే పరిమితమై ఉన్నారు. నేటికి ఈ కులాలలో నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన వారు ఒక్కరూ లేరంటే, అది వీరి పట్ల అణచివేతకు నిదర్శనం. దళిత ముస్లింల అభివృద్ధి ఆమడ దూరంలోఉన్నా, అవమానాలు, అవహేళనలు మాత్రం అడుగడుగునా అన్ని రూపాల్లో వెంటాడుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ముస్లిం జనాభా సుమారుగా కోటిపై చిలుకే ఉన్నట్లు అంచనా. వీరిలో సుమారు 70 శాతం దళిత వర్గానికి చెందిన ముస్లింలే. వీరికి కాంగ్ర్‌స్ పార్టీగాని, తెలుగుదేశం పార్టీగాని, బీజేపి గానీ, వైఎస్సార్ సిపీ గాని, టీఆర్ఎస్ గానీ ఒక్కరికీ ఎమ్మెలే సీటు కేటాయించి గెలిపించిన దాఖలాలు లేవు. అసలు పట్టించుకొనే నాయకుడు గాని, పార్టీ గానీ లేదు.1950లో రాష్ట్రపతి ఉత్తర్వు లుఎస్సీ రిజర్వేషన్‌ను కేవలం హిందూ మతంలోని దళితులకు పరిమితం చేశాయి. కానీ 1956లో సిక్కు మతం స్వీకరించిన దళిత సిక్కులకు, 1990లో బౌద్ధ మతం స్వీకరించిన దళిత బౌద్ధులకు ఈ ఉత్తర్వును సవరించి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎస్సీ రిజర్వేషన్ కల్పించింది. సచార్ కమిటీ నివేదిక ఆధారంగా మరింత విస్తృతంగా అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన జస్టిస్ రంగనాథమిశ్రా కమిషన్ తన నివేదికలో దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిన విధంగా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్‌ను తిరిగి కల్పించాలని సిఫారసు చేసింది, 2009లో నాటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి, దళిత క్రిష్టియన్లకు, దళిత ముస్లింలకు ఎస్సీ స్టేటస్ రిజర్వేషన్ ఇవ్వవలసినదిగా ఏకగ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపచేశారు.ఆయన మరణంతరువాత ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపలేదు.

జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసుల ఆధారంగా కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ 180/2004కు జవాబు అఫిడవిట్ ద్వారా దాఖలు చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో దళిత క్రిష్టియన్‌లకు, దళిత ముస్లింలకు యస్‌సిరిజర్వేషన్ ఇవ్వాలని 2009లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వానికి పంపాలి. రాజేందర్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా సిఫారసులు అమలు చేస్తూ నాటి రాష్ట్రపతి యస్. సి. ఉత్తర్వులోని పేరా 3ను తొలగించి, దళిత క్రిష్టియన్‌లకు దళిత ముస్లింలకు తొలగించిన యస్.సి. రిజర్వేషన్‌ను కల్పించాలి.దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు ఇచ్చిన విధంగా దళిత క్రిష్టియన్‌లకు, దళిత ముస్లింలకు యస్.సి. రిజర్వేషన్ కల్పించాలి. మతం మారినా కులం మారదు కనుక దళిత క్రిష్టియన్ల పై, దళిత ముస్లింలపై ఉన్న నిబంధనలను ఎత్తివేయాలి. ఎ.పి. నూర్‌బాష్/ దూదేకుల కు రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసి, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. నుర్‌బాష్/ దూదేకుల/ లద్దాఫ్/ పింజారి ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలి, నామినేటెడ్ పదవుల్ని కేటాయించాలి. మైనారిటీ విద్యాసంస్థలలో వీరి విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. వీరికి అన్ని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమి, హజ్ కమిటి, వక్ఫ్‌బోర్డులో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. అన్ని కౌన్సిలింగ్‌లలో బి.సి.ఇ.లో మిగిలిపోతున్న మెడికల్/ ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సీట్లు కేటాయించాలి. ఉద్యోగ ఖాళీలను అదే సామాజిక వర్గానికి చెందిన విసిఎ/ బిసిబికి చెందిన వారితో భర్తీ చేయాలి.



షేక్ సత్తార్ సాహెబ్
దళిత ముస్లిం యస్.సి రిజర్వేషన్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు


Surya Telugu News Paper Dated: 23/4/2013

No comments:

Post a Comment