ముస్లింల బాగుకోరనిదెవరు?
- కె. కొండలరావు
కీలకమైన ఎన్నో వ్యవస్థల్లో ఆధిపత్య వర్గాల తరువాత ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇతర అణగారిన వర్గాల వారెవరూ ముస్లింల స్థాయికి చేరుకోలేదు. నెహ్రూ 1954లో రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నట్టుగా 'మన పబ్లిక్ సంస్థల్లో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లభించడంలేదనేది' నేడు వాస్తవం కాదు.
'ముస్లింల బాగుకోరే వారెవరు?' అంటూ ఎస్.పి. గఫార్ (నవంబర్ 6, ఆంధ్రజ్యోతి) తన వ్యాసంలో సంబంధిత సమాచారాన్ని, వాస్తవాన్ని పరిశీలించకుండా బాధ్యతా రాహిత్య స్థాయిలో నిందలు వేస్తే, శీర్షికలోనూ సారంలోనూ పూర్తి సారూప్యంతో 'ఎవ్వరికీ పట్టని మైనార్టీలు' అంటూ ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (నవంబర్ 11, ఆంధ్రజ్యోతి) నిష్ఠూరమాడారు. నిబద్ధతతో ముస్లింల అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలను కూడా పూర్తిగా విస్మరించి ఆయా రాజకీయ పార్టీలపైన, ప్రభుత్వాలపైన, మొత్తంగా సమాజంపైన తీవ్రస్థాయి వ్యతిరేక తీర్పునివ్వడం నిజాయితీగా జరుగుతున్న కృషిని అవమానించడమే అవుతుంది. ముస్లింల అభివృద్ధికి, వారి దామాషా భాగస్వామ్య సాధనకు ఇంతవరకు జరిగిన, జరుగుతోన్న కృషిని ఏమాత్రం స్పృశించకుండా, సాపేక్షంగా విశ్లేషించకుండా, కేవలం వారి స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ / కమిషన్ల నివేదికల ఆధారంగా, మైనారిటీల అభివృద్ధికి జాతిని సమాయత్తం చేసే లక్ష్యంతో ఆరు దశాబ్దాల క్రితం, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖల మీదే ఆధారపడి కేవలం ఊహాజనిత అంచనాలతో తీర్పునివ్వడం సరికాదు.
వెనుకబాటుతనం ఎక్కడున్నా దానికి కారణాల్ని గుర్తించి, ప్రత్యేక సదుపాయాల కల్పనద్వారా పరిష్కరించడం ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా రాజ్య ధర్మం. హక్కుల విషయంలో సమానత్వాన్ని కోరి నిలదీస్తున్న మనం వెనకబాటుతనం పరిష్కారంలో ఆయా వర్గాలు తమ తమ బాధ్యతలను కూడా సమానంగా స్వీకరించి సహకరించాలి. కారణాలు ఎటువంటివైనా ముస్లింలు మాత్రమే ఈ బాధ్యతల విషయంలో నిత్యం మినహాయింపుగా కొనసాగడం న్యాయం కాదు. ముస్లింల వెనుకబాటుతనాన్ని నిర్ధారించి అంచనా వెయ్యడానికి, కేవలం వారికే ప్రత్యేకమైన కొన్ని సూచికలను ఉపయోగించి నిర్ణయించడమే సమంజసమవుతుందని, 5 శాతం రిజర్వేషన్ చట్టాన్ని కొట్టేస్తూ 2006లో అర్చనా రెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాక్షికంగా విభేదించిన ఆనాటి యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బిలాల్ నజ్కీ తన తీర్పులో ఉదహరించిన సూచికలు గమనార్హం.
(1) విడాకులివ్వడానికి వారి పురుషులకున్న, విశృంఖల అధికారాలు, ఆ అధికారాల ప్రభావం సామాజికపరమైన, విద్యాపరమైన ముస్లింల వెనుకబాటుతనానికి ఏ మేరకు కారణం; (2) ముస్లిం మహిళల విద్యాపరమైన వెనకబాటుతనానికి 'పరదా'సంప్రదాయం ఏమేరకు కారణం; (3) జాతీయ స్థాయికంటే అత్యధికంగా ఉన్న ముస్లింల జననాలు వారి వెనకబాటు తనానికి ఏమేరకు కారణం అనేవి ఆ వర్గ వెనకబాటుతనాన్ని మదించడానికి ప్రమాణాలు కావాలని ఆయన తన తీర్పులో అభిప్రాయపడ్డారు.
ఇంటిలో ఉండి పనిచేసే మహిళల శాతం జాతీయ స్థాయిలో 51 శాతం ఉండగా, ముస్లిం మహిళలు అత్యధికంగా 70 శాతం ఉండడం గమనించిన సచార్ కమిటీ, తన నివేదికలో 'సాంప్రదాయ గోడలు' మహిళల సాధికారతకు అడ్డంకులు అవుతున్నట్లు వ్యాఖ్యానించడం ఇదే తీరులో ఉండడం గమనార్హం. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం, 40-49 సంవత్సరాల వయస్సుగల హిందూ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కలిగిన పిల్లల సంఖ్య జాతీయ స్థాయిలో వరుసగా 4.34, 5.72, 4.85, 4.74, 4.43. ఆ విధంగా అత్యధికంగా పిల్లలకు జన్మనిస్తుంది ముస్లిం మహిళలే.
హిందువుల కంటే ముస్లింల జననాలు 31.8 శాతం ఎక్కువ. ఇదే ప్రకారం హిందువుల కంటే ఎస్సీ ఎస్టీ, బీసీల జననాలు వరసగా 11.74, 9.22, 2.07 శాతం మాత్రమే ఎక్కువ. అదే విధంగా 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం 13.43 శాతం జనాభా కలిగిన ముస్లింల (0-6) వయస్సు పిల్లలు 15.81 శాతంతో దేశసరాసరి కంటే 17.72 శాతం అధికంగా ఉన్నారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో, 10 సంవత్సరాలలోపు పిల్లలు జనాభాలో 23 శాతం కాగా, ముస్లింల పిల్లలు 27 శాతంతో దేశ సరాసరి కంటే 17.4 శాతం ఎక్కువగా ఉన్నారు.
ఈ విధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక వెనకబాటుతనానికి ముస్లింల సాంప్రదాయ పద్ధతులు, జీవన విధానానికి సంబంధించిన ఆలోచన, వ్యవహరింపు వైఖరులు ప్రముఖమైన కారణాలుగా ఉన్నట్లు అధికారిక సమాచారం, గణాంకాలు రుజువు చేస్తుంటే, విజ్ఞులైన వారి నాయకత్వం, మేధావివర్గం తమ సమాజాన్ని ఈ విషయాల్లో చైతన్యం చేయవలసిన బాధ్యతను అంగీకరిస్తాయా లేక అపోహలతో ఊహాజనిత అభద్రతా భావనలతో వ్యతిరేకత, వివక్ష, అణచివేత లాంటి రుజువుకాని, ఆధారాలు లేని ఆరోపణలపైనే తమ అభివృద్ధికి ఆధారపడతారా? ఏది సమంజసం? 'వివక్ష'ను నిరూపించడానికి ఎటువంటి అధ్యయనాలు లేవని సచార్ కమిటీ నివేదికే నిర్మొహమాటంగా చెబుతుంటే, ఇదే నివేదికను ఉటంకిస్తూ ఈ ఇద్దరు వ్యాసకర్తలు చేస్తున్న 'వివక్ష' ఆరోపణ అవాస్తవ ప్రచారం అవ్వదా? ఉత్పత్తి, వ్యాపార రంగాల్లో ఇతర సామాజిక వర్గాల కంటే ముస్లింల భాగస్వామ్యం అధికంగా ఉందని 2006లో సచార్ నివేదిక కూడా స్పష్టం చేస్తుంటే వ్యాపార రంగంలో వారు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని 52 ఏళ్ళ క్రితం, 1954లో నెహ్రూ రాసిన లేఖను ఈనాడు తన ఆరోపణలకు అనుకూలంగా గఫార్ ఎలా ఉటంకిస్తారు?
అణగారిన వర్గాల్లో సంఖ్యాపరంగా అత్యధికులు బీసీలైతే, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు అల్పసంఖ్యాకులు. నాడూ నేడూ వ్యవస్థల మీద గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న అగ్రకులాలూ అల్పసంఖ్యాకులే. దోచిన సంపదను కాపాడుకోవడానికి, దోపిడీని కొనసాగించుకోవడానికి ఈ ఆధిపత్య శక్తులకు రాజ్యాధికారమే వజ్రాయుధం. రాజ్యాధికారం మీద ఆధిపత్యం మరో వర్గానికి పోకుండా దోపిడీ కొనసాగింపునకు అవసరమైనమేర, సామాజిక శాంతి భగ్నం కాకుండా జాగ్రత్తపడడం ఈ ఆధిపత్య శక్తులకు అవసరం. అల్పసంఖ్యాక, దళిత, మైనారిటీల అభివృద్ధి, సాధికారిత అగ్రకులాల ఆధిపత్యానికి అంతగా సవాలేకాదు. అధిక సంఖ్యాక బీసీల అభివృద్ధి, సాధికారత మాత్రం వీరి ఆధిపత్యానికి గొడ్డలి పెట్టే. అందుచేత, దళిత, మైనారిటీ వర్గాల ప్రజాస్వామ్య అవకాశాల కల్పనకు ఆధిపత్య శక్తులు ప్రదర్శిస్తున్న శ్రద్ధ, ఆసక్తి, దూకుడు, బీసీల అభివృద్ధి, అవకాశాల కల్పన విషయంలో కంటితుడుపు స్థాయికే పరిమితం చేస్తూ, వారిపై అణిచివేత కొనసాగించుకోవడానికి దళిత మైనారిటీలను అడ్డం పెట్టుకుంటున్నాయి. వారి సహకారంతో బీసీల్ని అణచివేస్తున్నారు.
కొన్ని కీలకమైన గణాంకాలను, చారిత్రక సమాచారాన్ని పరిశీలించడం ద్వారా, పై వాస్తవాలను నిర్ధారించవచ్చు. యాక్టింగ్ హోదాతో సహా ఇంతవరకు పనిచేసిన 15 మంది రాష్ట్రపతుల్లో నలుగురు ముస్లింలకు, ఒక ఎస్సీకి, మరొక మైనారిటీకి అవకాశం ఇచ్చారు. బీసీల నుంచి ఎవ్వరూ లేరు. 12 మంది ఉప రాష్ట్రపతుల్లో ముగ్గురు ముస్లింలు, ఒక ఎస్సీ ఉన్నారు తప్ప బీసీలెవ్వరూ లేరు. 2007 ఆగస్టులో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ రాజకీయ పక్షాలు నిలిపిన ముగ్గురు అభ్యర్థులూ ముస్లిం వర్గం వారే కావడం ప్రత్యేక విశేషం. ఇంతకు ముందు పనిచేసిన 38 మంది, ఇప్పుడు పనిచేస్తున్న ఈ దేశ ప్రధాన న్యాయమూర్తితో కలిపి 39 మంది ప్రధాన న్యాయమూర్తుల్లో ముస్లింల నుంచి నలుగురు, ఎస్సీల నుంచి ఒకరు ఉండగా బీసీల నుంచి ఒక్కరూ లేరు. 2010 మే నెల 11వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు గండి పడింది, ఎస్సీ వర్గానికి చెందిన ఆనాటి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ ఇచ్చిన తీర్పుద్వారానే.
ఇంతవరకు పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న 200 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 16 మంది ముస్లింలు, నలుగురు ఎస్సీలు ఉండగా బీసీల నుంచి ఇద్దరు, ముగ్గురికి మించి లేరు. 2012 సెప్టెంబర్ 28న అల్టమస్ కబీర్ ప్రధాన న్యాయమూర్తి పదవి స్వీకరించేనాటికి, మిగిలిన 25 న్యాయమూర్తుల్లో ఇద్దరు ముస్లింలు ఉన్నారు. ఇంతవరకు పనిచేసిన 17 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లలో ఒక్క ముస్లింకే ఆ అవకాశం దక్కింది. 30 మంది కేబినెట్ సెక్రటరీలలో ఒక్క ముస్లింకే ఆ అవకాశం దక్కింది. 25 మంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల పదవుల్లో ముగ్గురు ముస్లింలున్నారు. ఎస్సీ, బీసీలు ఎవరూ లేరు. ఇంతవరకు 'భారతరత్న' గౌరవం దక్కిన 41 మందిలో, ఆరుగురు ముస్లింలకు ఒక ఎస్సీకి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఒక్క బీసీకి కూడా ఈ స్థాయి గౌరవం దక్కలేదు.
ప్రస్తుత 34 మంది కేంద్ర కేబినెట్ స్థాయి మంత్రుల్లో ముస్లింల నుంచి ముగ్గురున్నారు. బీసీల నుంచి ఇద్దరే కనబడుతున్నారు. 1947 నుంచి 1996 వరకు 50 సంవత్సరాల నిడివిలో పనిచేసిన 15 కేంద్ర కేబినెట్లలో మొత్తం 243 మంది కేబినెట్ స్థాయి మంత్రులు పనిచేయగా, వాటిలో 28 స్థానాలతో 11.5 శాతం ముస్లిం వర్గం దక్కించుకోగా కేవలం 11 స్థానాలతో బీసీలు 4.5శాతానికే పరిమితమయ్యారు. దళితులు 16 స్థానాలతో 6.5 శాతం అవకాశాలు పొందారు. ప్రస్తుoత లోక్‌సభకు ఎన్నికైన 543 మందిలో 24 మంది ముస్లింలు ఉన్నారు. ఇది 4.4 శాతం. దామాషా అవకాశాల్లో మూడవ వంతే. అయితే దీనికి పరిహారంగా అన్నట్లు 243 మంది రాజ్యసభ సభ్యుల్లో 30 మంది నామినేట్ చేయబడిన ముస్లింలు ఉన్నారు. ఇది 12.35 శాతం. దామాషాతో సరిపోలుతుంది. కీలకమైన ఎన్నో వ్యవస్థల్లో ఆధిపత్య వర్గాల తరువాత ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు.
ఇతర అణగారిన వర్గాల వారెవరూ ముస్లింల స్థాయికి చేరుకోలేదు. ఎవరు అధికారంలో ఉన్నా, ముస్లింలకు కీలక వ్యవస్థల్లో సముచిత స్థానం కల్పించడం ఒక విధంగా, సాంప్రదాయంగా కొనసాగుతున్నట్లు, రాజ్యం దానికి శ్రుతి చేయబడినట్లు అర్థమవుతుంది. నెహ్రూ 1954లో రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు 'మన పబ్లిక్ సంస్థల్లో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లభించడంలేదనేది' నేడు వాస్తవం కాదు. అందుచేత గఫార్ తన అభిప్రాయాలకు తేదీలు మార్చుకోవాలి.
- కె. కొండలరావు
హైకోర్టు న్యాయవాది, కన్వీనర్, బీసీ మిత్రులు
Andhra Jyothi Telugu News Paper Dated: 4/12/2012
No comments:
Post a Comment