Monday, December 17, 2012

స్వార్థ రాజకీయ క్రీడలు - కనీజ్ ఫాతిమా



కాంగ్రెసైనా, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అయినా అన్ని పార్టీలతో ముస్లింలు బాధలు పడి విసిగిపోయారు. నేతలు అధికారంలో బలపడ్డం తప్ప సామాన్య ముస్లింల జీవితంలో ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేతల మురికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఈ నేతలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మన జ్ఞాపక శక్తి కోల్పోకూడదు. వారి చర్యలను ప్రశ్నించాలి. మేము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదనే సంగతి వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి. 

హైదరాబాదు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ మహానగరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో హైదరాబాదులో ఏం జరుగుతుందో విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మతతత్వ వ్యాప్తి, మురికి రాజకీయాలు, అన్ని పార్టీలు ఆడుతున్న రాజకీయ ఆటల వల్ల ఈ పరిస్థితి దాపురించిందా లేదా మరేదైనా కారణం ఉందా? హైదరాబాదు సామాన్యులు, ముఖ్యంగా ముస్లింలు పడుతున్న బాధలతో పాటు గత రాజకీయ పరిస్థితులను పూర్వావలోకనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హైదరాబాదు ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలను ఈ పరిస్థితులు సంకేతిస్తున్నాయి. అన్ని పార్టీల అధినేతలు ఇతరుల నుంచి ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు రాజకీయ యాత్రలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి సంబంధం లేని ఈ యాత్రలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. 

వందలాది మంది అమాయక యువకులను అపహరించిందీ, చట్టవిరుద్ధంగా నిర్బంధించిందీ, అమానవీయంగా హింసించిందీ రాజశేఖర్ రెడ్డి కాలంలోనే అన్న సంగతిని ఎవరూ మరిచిపోవద్దు. ఆయన పాలనలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొన్న దుర్మార్గం గురించి ఏ పార్టీ ప్రశ్నించలేదు. అంతేకాదు వటోలిలో ఒక ముస్లిం కుటుంబాన్ని హిందూత్వ శక్తులు సజీవ దహనం చేసిందీ వైఎస్ పాలనలోనే. నేటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఫార్మసీ విద్యార్థి అయేషామీరాను దారుణంగా హత్య చేసిందీ అదే పాలనలో. ఈ కుటుంబానికి కూడా నేటికీ న్యాయం అందలేదు. దేశం సంగతి వదిలేయండి, రాష్ట్రంలో లౌకికత్వం ఎక్కడుంది? తండ్రి మరణించిన తర్వాత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. అధిష్టానం సీఎం పదవి ఇవ్వకపోవడంతో తన రాజకీయ బలం చూపించేందుకు 'ఓదార్పు' యాత్రను నిర్వహించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు ఓట్లు కొల్లగొట్టేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ల రాజకీయ లబ్ధి కోసం అమాయక ప్రజలను అవమానిస్తున్నారు.

తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' యాత్ర మొదలు పెట్టారు. హైదరాబాదులో హైటెక్ సిటీ మీద ఆయన శ్రద్ధ పెట్టిన కాలంలోనే రైతులు దుర్భరమైన కష్టాలను చవిచూశారు. పాతబస్తీలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలను కొత్త బస్తీకి తరలించింది ఈయనే. గుజరాత్‌లో ముస్లిం నరమేధం సందర్భంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిం చకపోవడంపై నేటికీ పశ్చాత్తాప పడడం లేదు. అధికారంలోకొస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని అంటున్నారు. కానీ ఆయన పార్టీలో ముస్లింలు నామమాత్రంగానే ఉన్నారు. ఈయన కాలంలోనే ఎన్‌కౌంటర్ల పేరుతో ముస్లింలను హత్య చేశారు. ముస్లిం సమాజం మీద నిఘా పెట్టేందుకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులతోనూ ముస్లిం వ్యతిరేకులైన అధికారులతోనూ ప్రత్యేక బృందాలను చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేశారు? హరేన్‌పాండ్యే హత్య కేసులో తప్పుడు ఆరోపణలతో అమాయక ముస్లిం యువకులను అరెస్టు చేసి గుజరాత్ పోలీసులకు అప్పగించారు?

2007లో జరిగిన మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు విచారించే పేరుతో అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా బంధించి అమానవీయంగా హింసిస్తే అసెంబ్లీలో గొంతు విప్పడానికి ఏ కారణం వల్ల నిరాకరించారు? అందుకు తన పార్టీ ముస్లిం నేతలే సాక్ష్యం. నగరంలో మత హింసను రేపుతున్న రాజా సింగ్, శ్రీనివాస రావులు తన పార్టీ వారే అయినా ఎందుకు వారి మీద చర్య తీసుకోవటం లేదు? అయేషా మీరా మీద దారుణ అత్యాచారం చేసి హత్య చేస్తే చంద్రబాబు ఎందుకు నోరు మూసుకున్నారు? ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి 2009 ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగించుకున్నారు. చంద్రబాబును ఏ రకంగా లౌకికవాదివో చెప్పమని ముస్లింలు నిలదీయాలి.

ఇక కేసీఆర్ పెద్ద రాజకీయ జూదరి. తెలంగాణ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఆయనను ఎవరు ప్రశ్నించినా తెలంగాణ వ్యతిరేకులని ముద్రవేసే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించినప్పటికీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో ముస్లిం అభ్యర్థి ఓటమికి కేసీఆర్, రాజకీయ జేఏసీ బాధ్యులు. ముస్లిమనే కారణంతో టీఆర్ఎస్ సీనియర్ నేతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, ఆయన పార్టీ సభ్యులే ఓడించారు. తెలంగాణ పేరుతో మతతత్వ పార్టీతో ఆయన జట్టుకట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైన తర్వాతే మతతత్వ పార్టీ బలపడ్డది. అందుకు టీఆర్ఎస్‌దే బాధ్యత. ఈ మూడేళ్ల తెలంగాణ ఉద్యమ కాలంలోనే ముస్లింల మీద అనేక దాడులు జరిగాయి. లౌకికవాద ముసుగు తగిలించుకొన్న అనేక మంది నిజరూపం బహిర్గతమైంది కూడా తెలంగాణ ఉద్యమం వల్లే. తెలంగాణ సాధన పట్ల సీరియస్‌గా ఉన్నట్టు టీఆర్ఎస్ కనిపిస్తుంది కానీ అది నిజం కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో రాజకీయ బలం పెరక్కపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి కేసీఆర్ ఉద్దేశాలు వేరు. ఒకవేళ టీఆర్ఎస్ బలం పెరిగినా పరిస్థితిలో ఎలా ంటి మార్పు ఉండదు. మళ్లీ మళ్లీ అమాయక జనులు మోసపోతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. కానీ తెలంగాణ పేరుతో రాజకీయ వ్యామోహితులు అధికారం పొందుతూనే ఉంటారు.

ఇక హైదరాబాదులోని పరిస్థితులను చూస్తే, ప్రతిఏటా జరిగే దీపావళి పండగ సందర్భంగా చార్మినార్‌ను అనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. నిజానికి చార్మినార్ గోడలకు వాహనాలు తాకుతూ వెళ్లకుండా అక్కడ ఒక రాయి ఉండేది. క్రమంగా దాన్ని మైసమ్మ దేవతగా పూజించటం మొదలైంది. కానీ అక్కడ మార్వాడీలు ఉండటంతో వాళ్లు దాన్ని భాగ్యలక్ష్మి ఆలయంగా మార్చేశారు. నిజానికి అక్కడ ఎలాంటి గుడి లేదని వంద ఏళ్ల నుంచీ తీసిన ఫోటీలు సాక్ష్యం చెబుతున్నాయి. అయితే, చార్మినార్‌లోని మొదటి అంతస్తులో మజీదు, రెండో అంతస్తులో మదరసా ఉండేదని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత మొదటి, రెండు అంతస్తులను మూసేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అది మత సమస్య కాదు. చారిత్రక వారసత్వ నిర్మాణాలకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురాతత్వ శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 

రాష్ట్రం మీద మతాధిపత్యాన్ని రుద్దాలని అన్ని పార్టీలు ఈ సమస్యను సృష్టించాయి. అదే హిందూత్వ ఆధిపత్యమనొచ్చు. హైదరాబాదు రాజకీయ నాయకులకూ పాలకవర్గాలకూ ఈ సమస్య కొత్తది కాదు. ఆకస్మికంగా చార్మినార్ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న వాళ్లంతా అనేక సంవత్సరాలుగా అక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నప్పుడు ఎక్కడున్నారు? అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎలాగైనా సరే చార్మినార్‌ను రక్షించాలని ఇప్పుడు అనడం వెనక కారణం ఏమిటి? దీని రాజకీయ కోణం అర్థం చేసుకోవాలి. మతం పట్ల ప్రేమతోనో, చారిత్రక కట్టడాలపై అభిమానంతోనో ఈ ఆందోళన చేయటం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి రావాలనుకున్నా ఇక్కడ మతకలహాలు రేపుతారని హైదరాబాదు వాసులకు తెలుసు. చెన్నారెడ్డి కాలం అందుకు ఉదాహరణ.

ముస్లిం రాజకీయ పార్టీ ఎంఐఎం ఆకస్మికంగా తన నిరసన ప్రకటించింది. పి.వి. నరసింహారావునూ కిరణ్‌కుమార్ రెడ్డినీ మతతత్వవాదులుగా వ్యాఖ్యానించింది. చంద్రబాబు కాలంలో ముస్లింలపై దాడులు జరిగాయనీ ఆరోపణలు చేసింది. కానీ రాజశేఖర రెడ్డి కాలంలో జరిగిన దుర్మార్గమైన వేధింపులు, హత్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? జగన్ రెడ్డితో పొత్తు గురించి అది మాట్లాడుతుంది. దీన్ని ముస్లింలు హర్షిస్తారా? నిజంగా ముస్లిం సమాజ సంక్షేమం గురించి అది నిజాయితీతో ఉంటే అవినీతిపరులతోనూ మతతత్వ ప్రచారం చేస్తున్న ఎలాంటి పార్టీతోనూ వ్యక్తులతోనూ ఎట్టి పరిస్థితిలో పొత్తులు పెట్టుకోరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవటం ఒక పెద్ద నాటకం. బాబ్రీ మసీదు కూల్చిసినప్పుడు, అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా హింసించినప్పుడూ, వటోలిలో కుటుంబాన్ని సజీవంగా దహనం చేసినప్పుడూ ఇదే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు. 

అదేవిధంగా ముస్లిం ఫ్రంట్ నేతల నిర్ణయం కూడా సామాన్య ముస్లింలకు విభ్రాంతి కలిగించింది. అవినీతిలో కూరుకుపోయిన జగన్ రెడ్డితో ముస్లింలు ఎలాంటి స్థితిలోనైనా జతకడతారా? ముస్లింలకు ఎంత విషాదం దాపురించింది! ఇలాంటి రాజకీయ క్రీడలతో ముస్లింలు విసిగిపోయారు. మానవ, పౌర హక్కులు హరించి వేయటం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ముస్లిం నేతలకు బాగా పట్టున్న హైదరాబాదులోనే అనేక వందల మంది యువకులను అపహరించి, అక్రమ కేసులతో జైల్లో పెట్టారు. ఇంకా చాలా మంది కనిపించకుండా పోయారు. అది కాంగ్రెసైనా, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అయినా అన్ని పార్టీలతో ముస్లింలు బాధలు పడి విసిగిపోయారు. నేతలు అధికారంలో బలపడ్డం తప్ప సామాన్య ముస్లింల జీవితంలో ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేతల మురికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఈ నేతలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మన జ్ఞాపక శక్తి కోల్పోకూడదు. వారి చర్యలను ప్రశ్నించాలి. మేము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదనే సంగతి వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి.

- కనీజ్ ఫాతిమా
సహాయ కార్యదర్శి, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ క

Andhra Jyothi Telugu News Paper Dated: 18/12/2012 

No comments:

Post a Comment