Wednesday, October 9, 2013

బహుజనులే భావి విధాతలు - సుజాత సూరేపల్లి

ప్రపంచీకరణ వెర్రితలలు వేస్తున్నట్టే కొన్ని సందర్భాలలో, ప్రాంతాలలో ఇప్పుడు జరిగే ఉద్యమాల అర్థాలు మారుతున్నాయి. నలుగురు పెద్ద మనుషులు తమకు తోచింది చెబితే అవే వేదాలై కూర్చుంటున్నాయి. నియమాలై నియంత్రిస్తున్నాయి. దానిని అమాయక ప్రజలు పొరపాటునో, గ్రహపాటునో అందిపుచ్చుకుని పోరాటాలు జరిపిస్తున్నారు. సీమ, ఆంధ్ర ప్రాంతంలో నేడు జరుగుతున్న సమైక్య పోరు చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అక్కడి ప్రజల అవగాహనా రాహిత్యమో, అర్థం లేని భయాలో కానీ వాళ్ళ ప్రయాణం ఎటో అర్థం కాకుండా ఉంది. ఎవరీ ప్రజలు నష్టపోయేది? ప్రజలు అంటే వెనుకబడిన వారు, ప్రాంతం అంటే వెనుకబడిన లేదా పడవేయబడిన ప్రాంతం అన్న కొద్ది అవగాహన మనకందరికీ ఉందనే అనుకుందాం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వారెవరు? బహుజనులే. ఎస్సీ, ఎస్టీ, శ్రామిక కులాల, మైనారిటీ ప్రజలు. మరి ఇప్పుడు ఉద్యమాలకు దిక్సూచిలు అయింది ఎవరు? వాళ్ళే? కోపం పట్టలేక ఒకడి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకోవడానికి బాలి చేసేది ఎవడిని. ఈ బడుగు జీవినే. ప్రభుత్వ స్కూళ్ళు, ఆస్పత్రులు, బస్సులు, పథకాలు అన్నీ ఆపేస్తే కూడా బలైయ్యేది ఈ మామూలు ప్రజలే. సీమాంధ్రలో తెలంగాణపై కేబినెట్ నోట్ తరువాత ఇప్పుడు జరుగుతున్న దాడులు రాజకీయ నాయకుల ఇళ్ల మీద, ఆస్తుల మీదనే. ఎవరైతే కృత్రిమ ఉద్యమమంట రగిలించారో వారి కొమ్మలే అంటుకుంటున్నాయి ఇవాళ.
ఇటు తెలంగాణ ఉద్యమానికి 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. అటు సీమ, ఆంధ్ర ఉద్యమానికి 65 రోజుల చరిత్ర ఉన్నది. ఇంకా ఉండొచ్చు. తెలంగాణలో దశల వారీగా ఉద్యమాలు జరిగినట్టు చరిత్రనే చెబుతుంది. 1996 నుంచి ఉద్యమం రాజకీయాలను మారుస్తూ వచ్చింది. దీంట్లో మారోజు వీరన్న వేసిన బీజాలు బహుజన తెలంగాణ కోణం నుంచి, విప్లవ పార్టీల అజెండా ప్రజాస్వామిక తెలంగాణ అయింది. ఆ తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ భౌగోళిక తెలంగాణ ప్రత్యేక తెలంగాణగా ముందుకొచ్చింది. ఈ మూడు దశలలోనూ ప్రాణ త్యాగాల నుంచి, వీధిలో నిరసనల దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరిగిన అన్ని పోరాటాల రూపాలలో బహుజనుల పాత్రనే కీలకమైంది. నెత్తుటి సాల్లు పారిన ఈ నేల గురించి, రక్తాన్ని మరిగించి పోరాట బాట పట్టే విధంగా కలం, గళం పట్టిన రచయితలూ, కళాకారులు కూడా అధికశాతం బహుజనులే.
ఇంత చేసినా బహుజనుల పాత్ర కార్యకర్తల వరకే పరిమితం కావడం ఇక్కడ ఉన్న కుల, వర్గ రాజకీయాలకి అద్దం పడుతుంది. ఇది కేవలం తెలంగాణకే ప్రత్యేకం కాదు. భారతదేశమంతా ఇదే తంతు. తెలంగాణ ఉద్యమానికున్న ప్రత్యేకత అన్ని కులాల్ని ఉద్యమంలోకి తీసుకురావడం. అగ్రకులాల స్వార్థ చింతన ఎట్లా ఉన్నా ఉద్యమంలో వారి పాత్రని కూడా తీసివేయడం కష్టం. అనేక సందర్భాలలో ఒకరికొకరు సహాయం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి కూడా. వేల సంవత్సరాల నుంచి వస్తున్నా కుల వివక్షత రాష్ట్రాల విభజనతో పోతుంది అనుకోవడం మూర్ఖత్వమే అయితే తప్పకుండా సమన్యాయం కోసం పోరాడడం అనివార్యం.
ఉద్యమాలకి ఊపిరిలూదిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నది 90 శాతం బహుజనులే. జై ఆంధ్ర, జై సామాజిక ఆంధ్ర ఉద్యమ కారులు, వీరు బహుజనులు. మేము మా తీర ప్రాంతాన్ని ఉపయోగించుకొని మలేషియా కన్నా గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేసుకుంటాం అని దళిత నేత కత్తి పద్మారావు అంటే పట్టించుకోరెందుకు? సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర పేరుతో ఊసా లాంటి నాయకులు నిరంతరం సీమ, ఆంధ్ర ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని విస్మరించాలని చూసినా ఇది వాస్తవం. ఆధిపత్యంతో కూడిన అధికారాన్ని మేము బహిష్కరిస్తున్నాము అన్నది మనకు కనపడకున్నా అది బహుజన వాయిస్ మాత్రమే. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకపోతే వారిని పట్టించుకోకుండా బెదిరిస్తూ ఉద్యమం నడుపుతున్నారు. ఇది న్యాయమేనా? సమ్మెలో ఉన్న పిల్లలు బహుజనులు చదివే ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంటారా? ఆర్‌టీసీ బస్సుల్లో వెళతారా? సమైక్య ఉద్యమంలో ప్రైవేట్ సర్వీసులు ఎవరివి? ఏ కులాల వారివి? ఆసుపత్రులు ఎవరికున్నై? అయినా మాకు రెండు రాష్ట్రాలు కావాలి అంటున్న ఆ గొంతులు సమాన అవకాశాలను ఆశిస్తున్నారు. వారికి హైదరాబద్‌లో పెట్టుబడులు లేవు. వ్యాపారాలు లేవు. సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు లేవు, ఉన్నా వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు, పట్టించుకోరు. అందుకే రెండు రాష్ట్రాల ద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని అనుకుంటున్నారు. ఇదే సమానత్వానికి పునాది. ఇది కేవలం బహుజనుల గొంతులోంచే వినబడుతుంది ఈ కష్ట కాలంలో కూడా. అవును వేరొక కోణంలోంచి చూస్తే అగ్ర కుల రాజకీయ నాయకుల స్వార్థాలకి బలైపోయేది కూడా వీళ్ళే.
సమైక్యపోరులో పచ్చి అబద్ధాలు చెప్పి సీమ, ఆంధ్ర ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు నాయకులు, మేధావులు. నీళ్ళు రావని, హైదరాబాద్‌లో ఉన్న వారికి భద్రత లేదని, ఇక్కడనే అన్ని వసతులు ఉన్నాయన్నది బలమైన వాదన. సమన్యాయం చెప్పే వారు లేనే లేరా? నిజంగా నీళ్ళ గురించి మాట్లాడడానికి నిపుణులు, కమిటీలు ఉంటాయి కదా? ఆసుపత్రులు, కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం అంత కష్టమా? రేపు ఇక్కడ చదువుకునే వారిని నిజంగా వెళ్లగొట్టే హక్కు ఎవరికైనా ఉంటుందా? తెలంగాణకు ఆ చరిత్ర ఉందా అసలు? అన్ని పార్టీల నాయకులు తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదని రాసి ఇచ్చి, ఇప్పుడు ఆస్తుల రక్షణ కోసం ఉద్యమం చేపిస్తే అమాయకులను రెచ్చగొట్టడం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన బహుజనులు రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సులభంగా ఉంటాయని, అధికార వికేంద్రీకరణకి అనువుగా, కింది కులాల వారికి చేరువలో ఉంటాయని చెప్పిన అంబేద్కర్ సూత్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. ఇటు తెలంగాణలో ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర, దిక్సూచిలా నిలబడ్డ వైనం ఎట్లా అయితే బహుజనుల వల్ల వచ్చిందో అలాగే సీమ, ఆంధ్ర ప్రాంతానికి కూడా అధికారం, స్వయం పాలన రావాలని అక్కడి బహుజనులు కోరుకుంటున్నారు. వారికున్న భయాలను పోగొట్టే బాధ్యత ఇరు ప్రాంతాల వారు తీసుకోవాలి. రెండు రాష్ట్రాల పునర్నిర్మాణ కార్యక్రమంలో మరుగున పడ్డ హక్కులను పైకి తీయాలి. స్త్రీలను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాలి. మైనారిటీల ఆందోళనలను పోగొట్టాలి. ముఖ్యంగా సహజ వనరులను రక్షించుకుని భావి తరాల వారికి అందించాలి.
రెండు రాష్ట్రాల అభివృద్ధి కోరుకునే వారు ఇప్పుడు అడ్డం పడాలనుకోవడం మూర్ఖత్వం. తెలంగాణలో కూడా బహుజనులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. సీమ, ఆంధ్ర ప్రాంతంలో మాత్రం మరొక యుద్ధమే చేయాలేమో. సాంస్కృతిక విప్లవానికి మళ్లీ నడుం బిగించాలి. రెండు, మూడు కులాలు మాత్రమే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వారు మాత్రమే ఇప్పుడు అన్ని పాత్రలు పోషిస్తున్నారు. బహుజనులు అప్రమత్తంగా ఉండి తమ హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు సాధించిన ఫలితం దక్కుతుంది.
- సుజాత సూరేపల్లి
తెరవే, రాష్ట్ర కార్యదర్శి



Andhra Jyothi Telugu News Paper Dated: 10/10/2013 

No comments:

Post a Comment