Wednesday, March 6, 2013

గర్భాశయం నుంచి గోరీ వరకు.. - సుజాత సూరేపల్లికులం లేనిదెక్కడ? ప్రతిచోటా ఉంది. సాహిత్యం, విద్యా సంస్థలు, మీడియా, విధాన నిర్ణయాలు, వాటి అమలు, శాసన నిర్మాణం, ప్రభుత్వ యంత్రాంగం... బహుశా భారతీయాకాశంలోను, భారత భూమి అట్టడుగు పొరలలోను కులం ఉంది; ఆదివాసీలపై వివక్ష ఉంది. మేము గర్భాశయం నుంచి గోరీ వరకు వివక్షకు లోనవుతూనే ఉన్నామని చెప్పక తప్పదు. 

మేము ప్రకృతిలో జీవిస్తాం! ప్రకృతిలోనే మేము చనిపోతాం! అదీ మా జీవితం. మీరు మా భూమిని ఆక్రమిస్తే మేము ఎక్కడకు వెళ్ళాలి? ఎలా జీవించాలి? ఈ భూమి ఎవరిది? - దయామణి బర్లా తీవ్ర స్వరంతో వేసిన ఈ ప్రశ్నలు ఆ హాలులో ప్రతిధ్వనించాయి. ముంబై లోని 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్'లో గత నెల15, 16 తేదీల్లో జరిగిన దళిత, ఆదివాసీ మహిళల సదస్సులో ఆమె ప్రసంగించారు. దేశంలో దళిత-ఆదివాసీ మహిళల సదస్సు జరగడం ఇదే మొదటిసారి. జార్ఖండ్ ఆదివాసీ ఉద్యమకారిణి అయిన దయామణి ఇంకా ఇలా అన్నారు: 'గనుల తవ్వకం పేరిట ఆదివాసీల జీవన విధానాన్ని అంతమొందించడానికి 108 మైనింగ్ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. మొదట వారు బొగ్గుకోసం వచ్చారు. ఆ తరువాత విద్యుత్కేంద్రాలు అన్నారు. మమ్ములను మా భూముల నుంచి ఇంకా ఇంకా వెళ్ళగొడుతున్నారు. మా భూములు మాకు లేకుండా పోతే మేము ఎలా జీవించాలి?' జార్ఖండ్‌లో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆదివాసీలను, ఇతర ప్రజలను ఏకం చేయడానికి కృషి చేస్తోన్న ఆ ఉద్యమకారిణి ప్రసంగంలోని బాధ, ఆవేదనలను హాలులోని ప్రతి ఒక్కరూ తమలో సంవేదించుకున్నారు. దయామణి బర్లా తన ప్రసంగాన్ని ఇలా ముగించారు: 'హమ్ కో జీనే దో! మా బతుకును మమ్ములను బతకనివ్వండి'.

ఆదివాసీలు తమ మనుగడ కోసం చేస్తోన్న పోరాటాలు, ముఖ్యంగా అడవుల విషయంలో ప్రభుత్వ విధానాలతో వారి ఘర్షణ గురించిన ప్రసంగాలతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆ తరువాత వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా ప్రసంగించారు. ఒక మైనారిటీ మతంలో మైనారిటీ వర్గానికి చెందిన రజియా పటేల్ తన సహ మతస్థులు సత్యాన్ని మాట్లాడడానికి, వినడానికి, చూడడానికి భయపడిపోతున్నారని పేర్కొన్నారు. ముస్లింలలో కూడా కుల పరమైన అంతరాలు ఉన్నాయనేది ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవమని, వీటివల్ల కొంతమంది వివక్షకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన అస్తిత్వానికి సంబంధించిన అంశాలను తాను అర్థంచేసుకోలేక పోతున్నానని సమతా మానె వాపోయారు. తమది సంచార జాతి లేదా విముక్త తెగ (డీ నోటిఫైడ్ ట్రైబ్)గా పేర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. రాజ్య వ్యవస్థ తమపై రుద్దిన ఈ గుర్తింపుతో తాము మమేకం కాలేకపోతున్నామని పేర్కొంటూ ఆమె ఇలా ప్రశ్నించారు: 'ఈ సమాజంలో మా స్థానం ఏమిటి? ఏ గుర్తింపును మీరు మాకు ఇస్తున్నారు? ఎస్సీ, ఎస్టీ లేదా నేరస్థ తెగా? మాకు రేషన్ కార్డులూ లేవు, ఓటరు కార్డులూ లేవు. ఈ దేశంలో ఏ ప్రాంతానికి, ఏ సామాజికవర్గానికి చెందిన వాళ్లం మేము?'

స్వీయ విషాద గాథలూ, విఫల పోరాటాల అనుభవాలనూ పలువురు వక్తలు ఈ సదస్సులో వివరించారు. భావజాలపరమైన ప్రశ్నలను కూడా వారు లేవనెత్తారు. రాజ్య వ్యవస్థ కుల స్వభావాన్ని వారు ఎత్తి చూపారు. బతుకు తెరువుకు పాకీ పనిచేస్తున్న వారి పట్ల దళితులే వివక్ష చూపుతున్నారన్న వాస్తవాన్ని కొంతమంది ఎత్తి చూపారు. జోగినీల, మాతంగీల, దేవదాసీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కొందరు ప్రస్తావించారు. ఈ వృత్తుల్లో ఉన్న మహిళలు ఎటువంటి అమానుషాలకు గురవుతున్నారో వారు పేర్కొన్నారు. ఈ బాధాకరమైన వాస్తవాలను వింటున్నప్పుడు ఎన్నో ఆలోచనలు మనస్సును కుదిపివేశాయి. మనమేమిచేయగలం? ఈ వాస్తవాలను వివరించిన వారిలో చాలా మంది జీవితంలో తమకు జరుగుతున్న అన్యాయాలపై తిరగబడి పోరాడుతున్న వారే.అయితే వారికి ఎటువంటి గుర్తింపు లేదు. వారి పోరాటాల గురించి మీడియాలో ఎటువంటి వార్తలు రావు.

నిజానికి మన సంక్షుభిత, అయితే ఉద్యమాల కాలానికి వారే నిజమైన మార్గదర్శకులు. అటువంటివారు ఇంకా ఎంతో మంది ఉంటారు. అయితే వారిని గుర్తించేది ఎవరు? విశాల దేశానికి తెలియజేసేదెవరు? ఎన్నో అన్యాయాలు, అణచివేతలకు వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారు. తమ తమ సామాజిక సంప్రదాయాలను, జీవన శైలులను కాపాడుకోవడానికి వారు ఉద్యమిస్తున్నారు. ఆ సదస్సులో పలువురు వక్తలు లేవనెత్తిన ప్రశ్నలన్నీ మన సమాజంలోని అణగారిన వర్గాల వారు దళితేతరులు, ఆదివాసేతరులపై ఎక్కుపెట్టిన ఆయుధాలే సుమా! విప్లవమూర్తులు ఫూలే, అంబేద్కర్, సావిత్రీ బాయి ఎప్పటికీ వారికి స్ఫూర్తి.

వివక్ష, అసమానతలకు గురవుతోన్న అణగారిన వర్గాల వారందరినీ ఒక సమైక్య వేదిక మీదకు తీసుకురావడానికి ముంబై సదస్సు ప్రయత్నించింది. చాలామంది అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న కుల, వర్గ, జెండర్ పరమైన వివక్షలను ఎటువంటి సంకోచాలు లేకుండా వివరించడానికి ఈ సదస్సు ఒక వేదిక అయింది. ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రమనంతరం కూడా మేమిలా ఎందుకు వివక్షకు గురవుతున్నామని వారు ప్రశ్నించారు. కొంతమందైతే అమాయకంగా 'భారతదేశంలో కులం ఉందా?' అని ప్రశ్నించారు. కుల వివక్ష, ఆదివాసీలకు అన్యాయాలు కట్టు కథలు అని ఎవరైనా భావిస్తే ఈ సదస్సులో పలువురు వెల్లడించిన వ్యక్తిగత గాథలు, వాస్తవ జీవితానుభవాలను తప్పక వినాలి, చదవాలి. కులం లేనిదెక్కడ? ప్రతిచోటా ఉంది. సాహిత్యం, విద్యాసంస్థలు, మీడియా, విధాన నిర్ణయాలు, వాటి అమలు, శాసన నిర్మా ణం, ప్రభుత్వ యంత్రాంగం... బహుశా భారతీయాకాశంలోను, భారత భూమి అట్టడుగు పొరలలోను కులం ఉంది; ఆదివాసీలపై వివక్ష ఉంది. ఈ దురాగతాలకు అధికంగా బలవుతున్నది మహిళలే. సదస్సులో ప్రసంగాలను వింటున్న ఒక వ్యక్తి ఇలా ప్రశ్ని ంచాడు: దళిత్, ఆదివాసీ మహిళలు ఏమి ఆశిస్తున్నారు? ఈ ప్రశ్నను ఎలా అర్థం చేసుకోవాలి? 'నేటి భారత్‌లో ఇంకా కుల వ్యవస్థ ఉన్నదా?' అన్న ప్రశ్నను ఇది మళ్ళీ గుర్తుకు తెచ్చింది.

ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి మనమెక్కడ మొదలవ్వాలి? మేము గర్భాశయం నుంచి గోరీ వరకు (జటౌఝ ఠీౌఝఛ ్టౌ ్టౌఝఛ) వివక్షకు లోనవుతూనే ఉన్నామని చెబుదామా? దళిత్, ఆదివాసీ మహిళలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు; ప్రకృతిని కాపాడడానికి ఆరాటపడుతున్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి జరుగుతున్న ఉద్యమాలకు వారు నాయకత్వం వహించడం లేదా? వారు భూమి కోసం పోరాడుతున్నారంటే అది వారి సొంతం కోసం కాదు, విశ్వ లయలను వికృతపరచని పచ్చని ధరిత్రి కోసమే కాదూ? దళిత్-ఆదివాసీ మహిళా ఉద్యమకారులు జీవ వైవిధ్య ఆచార్యులు, ప్రకృతి పరిరక్షకులు. భావి తరాల శ్రేయస్సుకోసం వారు పాటుపడుతున్నారు. సంపన్నుల సంపదలో వారు వాటా అడగడం లేదు. వారు అడుగుతున్నదల్లా తమ మౌలిక అవసరాలను తీర్చమనే కదా. ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రం అనంతరం కూడా వారికి విద్యా వైద్యాలు, ప్రాథమిక సామాజిక భద్రతను సమకూర్చడంలో ఈ దేశ పాలకులు విఫలమవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఈ దేశాన్ని పాలించాలని అనుకుంటున్నవారు దేశ జనాభాలోని అత్యధికులు ఎదుర్కొంటున్న వివక్షను గమనించారా? ఎందుకు పాలించాలనుకొంటున్నారు? ఎవరిని పాలించాలనుకొంటున్నారు? ఎవరి ఓట్లతో తాము అధికారానికి వస్తుందీ వారు గుర్తించారా? చాలా దేశాల్లో ఆదివాసీలకు ప్రత్యేక న్యాయస్థానాలున్నాయి. వారి ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఉంది. మన దేశ జనాభాలో ఆదివాసీల సంఖ్య తక్కువేమీకాదు. మరి మన పాలకులు వారి హక్కులను గౌరవిస్తున్నారా? వారికి న్యాయబద్ధమైన ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారా? ఏ సమాజానికైనా శ్రామికవర్గమే వెన్నెముక. ఈ దేశ జనాభాలో 70 శాతం మంది శ్రామికులే. సంపదలు సృష్టిస్తుంది వారే. మరి వారికి న్యాయం జరుగుతుందా? ఈ అంశాలన్నిటినీ ముంబైలో జరిగిన దళిత్-ఆదివాసీ మహిళల సదస్సు చర్చించింది. దళితులు, ఆదివాసీలను చైతన్యపరచడానికి, ఆ వర్గాల విద్యార్థినీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఇటువంటి సదస్సును నిర్వహించవల్సిన అవసరమున్నది. అవినీతితో కునారిల్లుతున్న ఈ వ్యవస్థపై మన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించాలి. ప్రస్తుతానికిదే ప్రత్యామ్నాయం. మనం పోరాడడానికే పుట్టాము. చివరకంటా పోరాడాలి!

- సుజాత సూరేపల్లి
సామాజిక శాస్త్ర అధ్యాపకులు, శాతవాహన యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 6/3/2013

No comments:

Post a Comment