Sunday, December 23, 2012

మేధావులూ మౌనమేల..? - సుజాత సూరేపల్లి



తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకునికి పరిమితం చేసి, ఇది ఒక రాజకీయ నిర్ణయం ద్వారానే సాధ్యం అన్న ధోరణిపై అందరూ పునరాలోచించుకోవలసిన తరుణమిది. తెలంగాణ అంశాన్ని రాజకీయ పార్టీలకు వదిలేసి చోద్యం చూస్తున్న ఆంధ్ర ప్రాంత పెద్దమనుషులు, మేధావి వర్గాలు అదే సమయంలో ఎక్కడో మెల్లిగా, చాటుగా తెలంగాణకి మద్దతు తెలుపుతున్న ప్రజాస్వామికవాదులు ఆత్మావలోకనం చేసుకోవలసిన సందర్భం ఇది... నిజానికి ఏమాత్రం చరిత్ర తెలిసినా, అన్యాయం, అసమానతలపై ఏ కొద్ది అవగాహన ఉన్నా, పోరాటాలకు, ఉద్యమాలకు విలువలపై నమ్మకం ఉంటే తెలంగాణ ఈ రోజు ఆత్మహత్యలకి కేంద్రంగా నిలిచి ఉండేది కాదు. 

శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలను చూసుకున్నా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క రంగంలో అన్యాయం జరిగిందని కళ్లకు కట్టినట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి, బలవంతంగా హైదరాబాద్ సంస్థానంపై సర్దార్ వల్లభాయి పటేల్ (1948-56), ఉక్కు మనిషి ఆధ్వర్యంలో సైన్యాలతో, బలగాలతో, గూండాలతో వేలాదిమందిని ఉక్కు పాదంతో నిర్దాక్షిణ్యంగా అణచివేసి ఈ ప్రాంతాన్ని ఈ పవిత్ర భారతదేశంలో విలీనం చేయక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. 

ఇది దక్కనీ ప్రాంతం. ఇక్కడ నిజాం రాజుల పాలన, ఉర్దూ భాష, హిందూ ముస్లింల కలయికతో కూడిన సంస్కృతి, వ్యవసాయ ఆధారిత జీవన విధానం ఒక ప్రత్యేకత. ఇదే ఆంధ్ర ప్రాంతం నుంచి వేరుగా ఉండడానికి కారణం కూడా. ఒక భాష ఒక రాష్ట్రం అనే సాకుతో మద్రాసు నుంచి వేరుపడిన తరువాత సంపన్న ప్రాంతంగా పేరుగాంచిన హైదరాబాద్‌ను ఆక్రమించుకోవడానికి చూపిన అతి అందమైన అన్యాయం. 

1918లోనే హైదరాబాద్ సంస్థానం ముల్కీ ఫర్మానాను జారీచేసింది. 1954-56 ఉద్యమం ఉధృతంగా నడిచింది. అంతకంటే ముందుగానే 'ఇడ్లీ సాంబార్ గోబ్యాక్' నుంచి వ్యతిరేకతను వివిధ రూపాల్లో ప్రకటిస్తూనే ఉంది. ఇవికాక పెద్దమనుషుల ఒప్పందం, ప్రాంతీయ ప్రత్యేక మండళ్లు, గిర్‌గ్లానీ కమిషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చారిత్రక ఘట్టాలు తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఉన్న నేపథ్యాన్ని, అనుభవాన్ని చెబుతాయి. ఇదే పరాకాష్ఠకి చేరి 1969 విద్యార్థులపై కాల్పులకి దారితీసి 369 ప్రాణాలు నేలరాలాయి. నెత్తురోడిన హైదరాబాద్ నగరం సాక్షిగా ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. 

2009 నుంచి జరుగుతున్న ఉద్యమంలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చనిపోయిన వాళ్ళు పిరికివాళ్ళే కావొచ్చు, అవగాహన లోపం ఉండొచ్చు కానీ వారి చావులను అవమానపరిచి ఉద్యమంలో వారిగురించి మాట్లాడకుండా ఉండడం అమానవీయమే అవుతుంది. ఒక ప్రాంత ఆకాంక్షను, ఉద్యమాన్ని చిన్నచూపు చూడడంతో నిరాశా, నిస్పృహలకి గురై ప్రాణాలు పోగొట్టుకున్న వారి చావుకు ఎవరు కారణం అనేది విశ్లేషించాలి. ఐదు సంవత్సరాల ఎన్నికల పండుగకు ప్రజల క్షేమాన్ని కుదించి, డబ్బు, కుల, స్వార్థ రాజకీయ నాయకులకు జీవితాలను అంకితం చేస్తున్న పరిస్థితులను చూసి మౌనంగా ఉన్న మేధావులు, ప్రజాసంఘాలను ఎలా అర్థం చేసుకోవాలి. 

ఉద్యమ నేపథ్యం చూస్తే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ జనసభ, మహాసభ తర్వాత వచ్చినదే తెలంగాణ రాష్ట్ర సమితి (2001). కేవలం రాజకీయ నిర్ణయం ద్వారానే తెలంగాణ సాధ్యం అని గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ఈ మలుపులు అన్నీ తెలంగాణ ఉద్యమంలో అనేక పార్శ్వాలను అంటే కులం, వర్గం, రాజకీయ అవగాహనను బయటపెట్టాయి. జై తెలంగాణ అన్నప్పుడల్లా జై ఆంధ్ర ఉద్యమం రావడం 1972 నుంచి మొదలైంది. అప్పుడు ముల్కీ విధానం రద్దు కావాలని జై ఆంధ్ర ఉద్యమం నడిచింది. 

ఇప్పుడు మళ్ళీ ఒక రాష్ట్రం, ఒక తల్లి పిల్లలం అని మరొక నినాదంతో కొంతమంది రాజకీయ నాయకుల కనుసన్నలలో, తప్పుడు తడకల ఆధిపత్య భావజాలంతో సీమాం ధ్ర ప్రజలను మోసం చేస్తూ సమైక్యాంధ్ర ప్రోగ్రాం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా కేసీఆర్, అటు లగడపాటి, కావూరి లాంటి వాళ్ళు నడిపిస్తున్నారని చాలా మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది. మీడియా కూడా ఈ భావననే పెంచి పోషిస్తుంది. 1969 నుంచి ఉధృతంగా ఉద్యమం భావవ్యాప్తి దిశగా నడిచింది. 

ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించాక రాజకీయ పార్టీల ద్వారా పరిష్కారమౌతుందని అనేక ప్రయత్నాలు 2001, 2004, 2009 ఎన్నికలలో నడిచాయి. ఏ పార్టీ కూడా తెలంగాణ అజెండా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకుండా పోటీ చేయలేదు. గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తిరిగిన ప్రతి పార్టీ కూడా మేము తెలంగాణకి వ్యతిరేకం కాదు అని చెప్పే స్థితికి ఉద్యమం తీసుకొచ్చింది అన్న సత్యం మనముందున్నది. ఈ విషయం చెప్పడానికి కూడా మనకి పరకాల ప్రభాకర్, లగడపాటి, కావూరి, కేసీఆర్‌లు కావాలా? విధిలేని పరిస్థితిలో కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చోవడం, ఉద్యమం ఒక్కసారిగా పైకి లేవడం అందరికీ తెలిసిందే. 

డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తిరిగి తెలంగాణ ప్రాంతానికి ఒక కొత్త ఊపిరిలూదింది కానీ ఆ ఆశలు నిలువక ముందే మళ్ళీ కపట రాజకీయ పార్టీలు బరిలోకి దిగి ప్రకటన వెనుకకుపడేట్టు చేశాయి. రాజీనామాలు, ఎన్నికలు, మిలియన్ మార్చ్‌లు, సకలజనుల సమ్మె, బం ద్‌లు, ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయి. దీనికి బాధ్యత గల ప్రజాసంఘాలు, మేధావుల నిశ్శబ్దం కాలానికి ఒక మాయని మచ్చ గా మిగిలిపోనున్నది. ఈ మధ్యలో లవణం గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, కొద్దిమంది రచయితల 'కావడి కుండలు' వంటి రచన లు, బహుజన కెరటాలు, కుల నిర్మూలన వంటి కొద్ది విశిష్ట పత్రికలూ తప్పితే ఎక్కువ బాహాటంగా మద్దతు ఇచ్చిన వారు చాలా తక్కువ. 

ఒక ప్రాంతం అల్లకల్లోలమవుతుంటే, ఉద్యమాలనే ఊపిరిగా మలుచుకొని బతుకుతుంటే ఒక పరిష్కార మార్గాన్ని చూడడంలో, చూపడంలో సమైక్యాంధ్రలో బుద్ధిజీవులు కరువయ్యారు అని తెలంగాణ ప్రాంతం భావించదా? రాజకీయ పార్టీలంటేనే స్వార్థం, వాటి మనుగడ కోసం ఏమైనా చేస్తాయి అన్న విషయం తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కళ్లారా చూసారు. దీనికి తెలంగాణ రాజకీయ నాయకులు మినహాయింపు కాదు. 

సీమాంధ్ర పెద్దమనుషులు రెండు ప్రాంతాలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఇక్కడ వివరిస్తాను. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో ఉన్న సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనే ప్రముఖ పరిశోధన సంస్థ ఢిల్లీలో ఇరు ప్రాంతాల నేతలను, పరిశోధన కారులను పిలిచి తెలంగాణ అంశంపై ఒక సానుకూల పరిష్కార మార్గం చూసే నేపథ్యంలో ఒక ప్రయత్నం చేసింది. దానికి 'డైలాగ్ ఆన్ తెలంగాణ' అని పేరు పెట్టి, రాజకీయాలతో సంబంధం లేని వారిని దాదాపుగా 50 మందిని ఎంపిక చేసి ఆహ్వానించారు. 

తెలంగాణ ప్రాంతం నుంచి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, జాహెద్ అలీ ఖాన్ (ఎడిటర్, సియాసత్), భిక్షం గుజ్జా, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బూర్గుల విజయ్, పాండు రంగారెడ్డి, డాక్టర్ సూరేపల్లి సుజాత, ఆంధ్ర ప్రాంతం నుంచి సి.వి. రాఘవులు, కె.ఎస్. చలం, డాక్టర్ చిన్నయ సూరి, కె.వి. రమణా రెడి, వీరితో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులని, పరిశోధనకారులని, కొద్దిమంది మీడియా మిత్రులని, శ్రీకృష్ణ కమిటీ వారిని కూడా పిలిచారు. 

తెలంగాణ రాష్ట్రంపై కనీసం మేధావులు అన్నా నోరు విప్పుతారని, నిజానిజాలు కోపాలు, ఉద్రేకాలు, ఆవేశకావేశాలకు లోనుకాకుండా మాట్లాడుకోవచ్చని ఎంతో ఆశపడ్డ మాకు చాలా నిరాశ ఎదురైంది. అంతే కాకుండా ఇంకా బాధ కలిగించిన అంశం యునైటెడ్ ఆంధ్రా జాక్ రెసిడెంట్ వై. నరసింహారావు, కన్వీనర్ వి.అంజిరెడ్డి నుంచి నిర్వాహకులకు అందిన లేఖ. దాని సారాంశం 'మీరుపంపిన ఆహ్వానంలో తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్ నోట్ తెలంగాణకు మద్దతు పలికేదిగా ఉందని, అందుకని మేము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఉంది. 

నిజానికి ఆ విధమైన అభిప్రాయముంటే అక్కడికొచ్చి నివృత్తి చేసుకోవచ్చు ఈ మేధావులు. కానీ ఆ విధంగా జరగకుండా చూసి ఏమి నిరూపించుకున్నారు? అక్కడ కనీసం 'చర్చ' అని కూడా అనలేదు కేవలం 'డైలాగ్' అని మాత్రమే అన్నారు. ఆ సమావేశానికి శ్రీకృష్ణ స్వామి అయ్యర్ వంటి నీటి నిపుణులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు దుగ్గల్, సంజయ్ బారు వంటి ప్రముఖులు హాజరయి వారి అభిప్రాయాలను తెలిపారు. ఒక చర్చకి, డైలాగ్‌కి సిద్ధంగా లేని పెద్ద మనుషులు రెండు రాష్ట్రాల మధ్య సుముఖంగా, సవ్యంగా ఒక పరిష్కారానికి వస్తారని అశలు లేవు. 

తెలంగాణపై వోట్లు, సీట్లు, నోట్లు అన్న సూత్రాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ విషయం పట్టించుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు ముందుకు రావడం లేదు. రానివ్వట్లేదు అంటే బాగుంటుందేమో. ఒక ప్రాంతం అతలాకుతలమవుతుంటే ఇంకొక ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రేక్షకులుగా చూస్తూ ఊరుకోవడమేనా? గత 60 ఏళ్లుగా తమ వ్యాపారాల కోసం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి సొంత ప్రాం తాలని, వాటి అభివృద్ధిని మరిచిపోయిన సీమాంధ్ర నాయకులని అడిగే కనీస ప్రయత్నం చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం కాదా? 

నిజానికి అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్రకి, శ్రీకాకుళం వంటి జిల్లాలకి రాజధాని హైదారాబాద్ అంటే ఎంత దూరమో, అభివృద్ధిలో అంతే దూరంగా ఉంది. వారికి రేపు విజయవాడో, విశాఖపట్నమో రాజధాని అయితే లాభం చేకూరుతుంది అని ఆలోచించే సమయం ఇది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొద్దిమంది అగ్రకుల పెట్టుబడిదారుల చేతిలో నలిగిపోతున్న సమైక్యాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన కులాల, వర్గాల వారికి న్యాయం చేకూరుతుంది అన్న వాస్తవాన్ని ప్రజల ముందుంచాలి. శ్రీకృష్ణ కమిటీలో కూడా స్పష్టంగా గ్రామీణులు, కిందిస్థాయి వారు రెండు ప్రాంతాలను కోరుకుంటున్నారని తెలియజేశారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం రాష్ట్రాల విభజనతో అభివృద్ధికి నోచుకోదా? 

ఇప్పటివరకు ఏర్పడ్డ ఛత్తీస్్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మానవాభివృద్ధి సూచికలు జాతీయస్థాయి కంటే మెరుగ్గా ఉన్నాయన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956, మార్చ్ 5 బహిరంగ సభలో చెప్పారు. 'విశాలాంధ్ర' అనే భావనే సామ్రాజ్యవాద విస్తరణకు తోడ్పడేదిగా ఉందని 1953, అక్టోబర్ 17లో చెప్పారు. ఆయన అపోహలు, ఫజల్ అలీ ఖాన్ భయాలు నిజమయ్యాయి అని వేరే చెప్పక్కర్లేదు. 

తెలంగాణ అనగానే ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొడతారని, నీళ్ళు ఇవ్వరని, హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని, ముస్లింలకు చేటని, మావోయిస్టుల సమస్య వస్తుందని పుకార్లు, వదంతులు పుట్టిస్తున్న వారి వార్తలను నమ్మి మోసపోతున్నది సామాన్య ప్రజలే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని అమెరికా వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ద్వారా భాష, సంస్కృతి, వనరుల వినియోగం, నిధుల పంపకం సక్రమంగా అన్ని ప్రాంతాలకు అందుతాయని చరిత్ర చెబుతుంది. 

ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు అ అవగాహనను ప్రచారం చేయవలసిన బాధ్యత భుజాన వేసుకోవాలి. స్వేచ్ఛ, స్వతంత్ర సమానత్వ పునాదుల మీద న్యాయాన్యాయాల నిర్ణయం జరగాలి. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం నిరంకుశ రాచరిక పాలన వైపు, పెట్టుబడిదారుల కబంధ హస్తాల చేతిలో చిక్కుకుని ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే వైపుకు తీసుకుపోతాయి. ఇవే పెట్టుబడిదారీ శక్తులు నేడు ప్రభుత్వాలను శాసిస్తున్నాయి, ఉద్యమాల నోర్లు మూయిస్తున్నాయి అన్న విషయం తెలుసుకొని కూడా మౌనంగా ఉండడం సమాజానికి చేసే ద్రోహమే. 

- సుజాత సూరేపల్లి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల వేది

Andhra Jyothi News Paper Dated: 23/12/2012

No comments:

Post a Comment