Tuesday, June 11, 2013

సిబ్బితీగల వనం మాండలిక పదకోశం ---వేముల ఎల్లయ్య



తెలంగాణ ప్రాంతాన్ని ముందుగా శాతవాహను లు, చాళుక్యలు, కాకతీయులు అటు తర్వాత మొఘలాయిలు పాలించారు. మొఘలాయిల ఏలుబడిలో ము స్లిం రాజ్యస్థాపన జరిగింది. మొఘలాయిల పతనంతో గోల్కొండ కేంద్రంగా ఆసఫ్‌జాహీలు (తానీషాలు) పాల న సాగించారు. వారి కాలంలోనే తెలంగాణ భాషలో ఉర్దూ మిళితమైంది. తదుపరి నిజాంలు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని పాలన సాగించారు. ఎంతమంది ఏలినా! మనుషుల జీవనశైలి మారలె. చరిత్ర, సంస్కృ తి ఆచారాలు, కుల వ్యవహారాలు, కుటుంబ వ్యవస్థ తీరు, గ్రామ స్వరూపమైన కుల పదజాల నుడికారం వృత్తులలో మమేకమై, కుల అల్లిక మాండలికం, పదజాలంతో తెలంగాణ భాషా‘గుమ్మి’ నిండింది. తొలకని సమాచారం నిలువై, కొన్ని వేలసంవత్సరాలు అనేక ప్రాచీన తెలుగు పదసంపద పదపదానికి, ఈ ప్రాంతం లో తెలింగా, ఉర్దూ, పార్సీ, కన్నడం, హిందూ, మార్వా డీ, తమిళం భాషల కలయికలైన జీవభాష తెలంగాణ భాష. దీనిని దక్కని భాషని పిలిచారు. హైదరాబాద్ దేశదేశాల ప్రజల సంస్కృతులతో విలసిల్లిన ప్రాంతం తెలంగాణైతే, నడిమిట్ల నల్లగొండజిల్లా ప్రజల విశిష్టత మాండలిక పదజాలం. నట్టనడుమ ప్రాంతీయ ఏలుబళ్లతో పద సౌందర్యమై భాషాశాస్త్రం సామ్యమైన భాషా రీతి కనిపిస్తుంది. కులవృత్తి పదాలు, బడుగు బలహీనవర్గాల, నిరక్షరాస్యుల మాండలిక పదజాలం ఇది. అగ్రవర్ణ ఉన్నత, ధనిక, సంపన్న వర్గాల విద్యావంతుల పదజాలం కొంత సామ్యం కలిమిడి అయినా! భాషాంతరికమైన తెలుగు భాషా పదజాలాన్ని వాడుతూ ఈ జిల్లా జనం మాండలికమైన సంస్కృతిని నిలబెడుతున్నారు. పరాయీకరణ చెందిన అగ్రవర్ణీకులు, సంస్కృతి మాటు న మాయ ప్రదర్శన బతుకమ్మ లాడుతూనే ఉన్నారు. ప్రకృతిని మించిన వారసత్వమని, ప్లాస్టిక్ కాయితం పూల బొడ్డెమ్మలు నిలుపుతున్నారు. ఇదొక పార్శం.యేతరజాతి వాళ్లు నిరక్షరాస్యులుగా, నెట్టి వేయబడ్డ జాతి జనులు మాండలీకరణమై ప్రజల భాషను పలుకుతారు.ఉదాహరణకు కైకిలి, కిస్తీ, లొల్లి, తుంకలు, ఇట్టెం, జాగ, ఇంగులం, కార్జం, సియ్యలు, గుర్రు, జిద్దు, పలుకరం, బిగెడు, సికారి, సుతిలి, బాగం, తొక్కు, గల్లీ, రకం తదితరాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. గీ విధంగా ఈ జిల్లా సామాజిక కులాల్లో వృత్తి మాండలిక భాషను పదిల పరుస్తున్నారు. ప్రభావితం చేస్తున్నారు. ఈ జిల్లా జీవనంలో ఇమిడి ఉన్న ఉర్దూపదాలు ఇజ్జత్, ఎకురార్‌నా మ, కర్చీపు, కైమా, చటాకు, జులుం, నిషాని, వజన్, వతన్, శికాయిత్, సుభూత్, హుకుం ఇంకా ఎన్నో.. ఇట్లా తెలంగాణ తెలుగులో మిళితమై వాడుక భాషగా మారిన విధానం చూస్తున్నం.

గ్రామీణ ప్రజలకు జీవితంతో ముడిపడిన ధాన్యం కొలతలు, గివ్వి తెలిసిన వాళ్ళు బతుకు తెల్సిన చెప్పటానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అడవిలో తండలు, గోండులు, ఆదివాసులు, సవరలు వీళ్ల పదజాలం మారుమూల పల్లెలను తాకుతూ, మిళితమై కొన్నొందల, వేల సంవత్సరాల ప్రాచీనతను, నిత్య ఆధునికతను అద్ది, పుదిచ్చి ఈ ప్రాంత తెలంగాణ తెలుగు పదాలు మాండలిక నుడికారాన్ని ఎత్తి పడ్తుంది. వన్నె తెచ్చింది. పద జల్లెడలై ఎత్తి, అక్షరాలను, రాసులుగా కుమ్మరిస్తుంది. పదజాలమై వికసించి భాషా శాస్త్రంగా వర్ధిల్లుతుంది. భాషా వైవిధ్యం ఉన్న వాళ్ళను రెండు రకాల ప్రజలను గమనించాలి. ప్రజలలోని భాషా అప్రమాణికమనీ, సామాజికంగా వృద్ధి చెందినటు వంటిది గా, మరొకటి ప్రజల్లో భాషా మార్పులు చెందుతూ సామాజిక అభివృద్ధి అవుతూ, సామాన్యులభాష ప్రా మాణికమైన భాష అవుతుంది.ప్రామాణికతలో కూడా మాండలికం కలుస్తూ ఆధునికమైన భాషలో కూడా స్వభావం మారుతూ ఉంటుం ది. దీన్ని ప్రామాణికంలో మాండలిక మిళిత భాష అనవచ్చును. స్వభావంలో రెండింటికి విరుద్ధ భావాలున్నా, అనివార్యంగా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. వాటినే విరూపకాలు అంటారు. ఈ రెండు మమేకమై సాగుతూ వ్యతిరేకమైన స్వభావాన్ని వదులుకుంటాయి. మనం ప్రామాణిక మాండలికాన్ని చూస్తే అర్థమైతది. భాష ప్రజల్లో పుట్టి ప్రజల్లో పెరుగుతుంది. ఆదిమ కాలం నుంచి కూడా దినదినాభివృద్ధి చెంది ప్రజల భాష నుంచి తెగలభాష, తెగలభాష నుంచి జాతులు, జాతుల భాష నుంచి కులాలభాష, కులాలభాష నుంచి వృత్తుల భాషగా అభివృద్ధి చెందుతాయని భాషా చరిత్ర పరిశోధ నల వల్ల తెలుస్తున్నది. తెలంగాణలో అధికశాతంగా మాండలికం మాల, మాదిగ ఉపకులాలు, బీసీ ఉప కులాల జీవనంలో వృద్ధి చెందింది. ప్రామాణికంలో దేశీయత లోపించిన భాష. అగ్రవర్ణీకులు సంకరం చేసి వర్గ స్వభావ భాషని అందరి భాషగా బడుగు, బలహీన వర్గాలకే తిరిగి భాషా శాస్త్రాన్ని బోధిస్తున్నారు, బొంకిస్తున్నారు. అసలు తెలంగాణ మాండలిక భాష ను సందిగ్ధంలో పడేస్తున్రు. అంటే సంస్కృతీకరణతో కలుషితమై, కిందిస్థాయి ప్రజల స్వచ్ఛత మాండలికం ప్రామాణికం కాబోయే ముందు పరదేశ భాషాప్రవేశం మొదలుపెట్టి దేశీయ భాషీయులను అగౌరవ పరుస్తున్నారు. ఈ తెలంగాణ పల్లెల్లో కుల నిర్మూలన జరగకుండా నిత్యం అవమానంతో పా టు, భాషావమానాన్ని ఎదుర్కొంటున్నారు. 


ప్రజలు భాష కూడా మాదిగవాడకు ఒకరకం, మాల వాడకు ఇంకోరకం, కుమ్మరి, చాకలి గొల,్ల గౌండ్ల బీసీ వాడల్లో ఒకరకంగా, రాత భాషకు, మౌఖిక భాషకు, వాడుక భాషకు, సంభాషించే భాషని, బయటి భాష అని, యాస భాష అని, కులవృత్తుల భాష అని, చెప్పుల భాష అని, బేగరి భాష అని పిలువబడుతున్నది. ఊరు, వాడ కులం వృత్తి, వృద్ధులు, పిల్లల్లో మాండలికంలోనే విభిన్న తేడా. కుల వృత్తి మాండలికం పద కోశం బలహీనవర్గాల సామాజిక భాషా వ్యవహార కలయికై, సమూహమై కుల పనులకు సంబంధించి వృత్తి చిహ్నాలు భాషా నిర్మితానికి ప్రాతినిధ్యం అందిస్తూ, క్షేత్రస్థాయి అస్తిత్వ అనుభవమై ఉంటున్నది. పరిశీలనే పరిశోధనా దృష్టికి, నిజాయితీని గుండెనిండా ఆలింగనం చేస్తే తప్పా, భాషా శాస్త్రం వర్ధిల్లదని అర్థమైతుంది.ఈ కుల వృత్తి మాండలిక పరిశోధక కవి రచయిత ముత్యాలు. కవిత, కథ నవలా ప్రక్రియల్లో చేయి తిరిగిన రచయిత. ఈ దేశ రచయితల్లో ఒకరు దుగిలి కవి త్వం, సూర పురుడు, ఇగురం నవలలు, బేగరి కథలు భూతం ముత్యాలు కలం నుంచి వెలువడ్డ రచనలు. ఈ రచయిత సాహితీ ప్రస్థానంలో మొదలైన సందర్భం.. నల్లగొండ టౌన్‌హాలు నందు దళిత సాహిత్య రాష్ట్ర సదస్సు 14,15 డిసెంబర్ 2002 నాటికి పది తెల్ల పేపర్ల నిండా పదిహేను కవితలతో వచ్చి సాహితీ ప్రవేశం చేసినవాడు. ఈయన ఉపాధ్యాయుడు. స్థానికతపై పరిపక్వ త ఉన్న భూతం ముత్యాలు ‘గుంపు’ సాహితీ సంస్థలో సభ్యుడై, సాహితీ సృష్టి సాగిస్తున్నాడు. మాండలిక భాషా ప్రణాళికను ఒడుపుతో తనవైపు తిప్పుకొన్న రచయిత. తెలంగాణ ఉద్యమ సాహితీ చరివూతలో ‘గుంపు’ సాహితీ మిత్రుడు. భూతంముత్యాలు మాండలిక భాషా పరిరక్షక్షుడుగా విజేయుడై మళ్లీ పది జిల్లాల పదకోశాన్ని నిర్మిస్తాడని ఆశిద్దాం. ఇతను వివిధ రచయితలు, కవుల గ్రంథాలలో మాండలిక పదకోశాన్ని ఏరి మరో పదకోశ గ్రంథాన్ని ముద్రించి భాషా సేవకు అంకితం కావాలని కోరుకుందాం.

-వేముల ఎల్లయ్య
(‘మాండలీకం’ తెలంగాణ కుల వృత్తి పదకోశం పుస్తకానికి వేముల ఎల్లయ్య రాసిన 
ముందుమాట నుంచి కొన్ని భాగాలు)

Namasete Telangana Telugu News Paper Dated : 12/6/2013

Wednesday, June 5, 2013

Kalekuri Prasad = కలేకూరి ప్రసాద్



క నిజయితి గల వ్యక్తి తనను తను అంతం చేసుకోవడానికి, ఒక్క నమ్మకం వమ్ము అయితే చాలు, కానీ కలేకూరి ప్రసాద్ కు తను నమ్మిన మూడు నమ్మకాలూ వమ్ము అయినాయి, ఒక్కటి. నిజాయితి లేని, విప్లవకారులుగా చలామణి అవుతున్న నకిలీలు, రెండు రాజకీయలలో బాగంగా ప్రేమికురాలుగా నటించిన ప్రేమికురాలు, మూడు నిజయితిలేని దళిత నాయకత్వం. కలేకూరి ప్రసాద్ కి తాగుడు నేర్పింది, తాగుబోతుగా ప్రచారం చేసింది పై మూడు కేటగిరి లకూ చెందిన వ్యక్తులే. కలేకూరీ ప్రసాద్ తాగడం వల్ల అతని శరీరం నాశనం అయింది, ప్రక్కన ఉన్న స్నేహితుల డబ్బులు కర్చు అయినాయి అనే రెండు చిన్న నష్టాలు జరిగాయి కానీ, అతన్ని తాగుబోతుగా ప్రచారం చేయడం వల్ల సమాజం ఒక నిజాయితీ కలిగిన మేధావిని కోల్పోయింది. తాగడం వల్ల జరిగిన నష్టం కంటే, తాగుబోతుగా జరిగిన ప్రచారం వల్ల జరిగిన నష్టం ఎక్కువ.
 వ్యవస్తీకరించబడని వ్యక్తిగా, తాగుబోతుగా ప్రపంచానికి ప్రచారం చేయబడిన కలేకూరి ప్రసాద్ ఒక నిజాయితీగలిగిన మేధావి, కవి, రచయిత, సాహితి విమర్శకుడుల గొప్ప భావుకుడు. అతను ఒక పోస్ట్ మోడెర్నిస్ట్ కాదు యే ఎజెండా లేకుండా ఎప్పుడు బ్రతకలేదు. మనుషులంతా స్వచ్చంగా, సమానంగా, సమగ్ర సంస్కృతిక విలువలతో బ్రతకాలని తపించిన ఒక తాత్విక భైరగి. తనకంటూ ఏమీలేని నిజమైన బౌద్ధ బిక్షువు, నిజమైన కమ్యూనిస్ట్. ఒక పూర్తికాలం సామాజిక కార్యకర్త. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులలో ఒకరు, ప్రముఖ దళిత విప్లవ మేధావి కె. జి‌. సత్యమూర్తి లాగా కలేకూరి ప్రసాద్ కూడా  ఏమి దాచుకోలేదు, వారిద్దరి జీవిత ఆచరణ లో సారూప్యత ఉంది. నిజానికి వీరిద్దరికి వ్యక్తిగత జీవితం అనేదే లేదు. వీరిద్దరు సమాజనికి అంకితమైన గొప్ప సామాన్యులు.
కలేకూరి ప్రసాద్, అందరూ వ్యక్తిగతమైన విషయాలనుకొనే పెళ్లి, సెక్స్, ఆస్తి, పేరు ప్రతిష్టలు చివరికి తాను రాసిన రచనలు అన్నీ ఏ విషయాలను వ్యక్తిగతం అనే ముసుగు కింద దాచుకోలేదు, తన జీవితాన్ని గురించిన ఏ విషయాన్ని అయిన ఎవరితోనైనా పంచుకొనేందుకు ఏ క్షణంలోనైనా సిద్దంగా ఉండే అత్యంత అరుదైన మనిషి.
కలేకూరి ప్రసాద్ ని తాగుబోతుగా  తయారు చేయడంలో, తాగుబోతుగా ప్రచారం చేయడంలో కులం ఉంది, కుట్ర ఉంది. తాగుడు అలవాటు అయిన నుండి, ఏ రోజు తాగకుండ లేడు, అలాగని తగినంత కాలం, చచ్చే వరకు  ఏ రోజు తాగి స్పృహ కోల్పోయిన సందర్బం లేదు, తాగిన తాగక పోయిన తాను చెప్పదల్సుకున్న విషయాన్ని అంతే సమర్ధంగా అంతే నిజాయితీతో చెప్పగలిగిన వ్యక్తి కలేకూరి ప్రసాద్. తాగుబోతుగా ప్రచారం జరిగింది చాలా ఎక్కువ. ఒకవేళ ప్రచారం జరిగినంత అతను తాగి ఉన్నట్లయితే, రెండు దశాబ్దాలుగా బ్రతికిఉండేవాడు కాదు. మనచుట్టూ అంతకన్నా ఎక్కువగా తాగే మేధావులు, కవులు ఉన్నారు కానీ వారికి తాగుబోతు బిరుదులు మాత్రం ఈ సమాజం యివ్వలేదు అతను తాగింది మాత్రం తక్కువ ప్రచారం మాత్రం ఎక్కువ
384769_2368545425381_485425323_n

అతనిది సంచార జీవితం, ఏమీలేనివాడికి ప్రపంచమంత తన సొంతం. తనకంటూ ఒక గిరిగీసుకున్న కుటుంబం లేనివాడికి మానవాళి అంతా కుటుంబ సబ్యులే, సరిగ్గా అలాగే బ్రతికాడు, సరిగ్గా అలాగే చని పోయాడు. మే 17 2013 నా ఒంగోల్ లోని అంబేడ్కర్ భవన్ లో చనిపోయాడు, ఎప్పుడు కూడా తన కుటుంబం తో లేడు. ఒకరోజు కటిక దరిద్రన్ని అనుభవిస్తే, మరుసటిరోజు 5 నక్షత్రాల హోటల్ లో బస చేశాడు, ఒకరోజు లారీలో ప్రయాణం చేస్తే ఆ మరుసటి రోజే విమానంలో ప్రయాణం చేశాడు, అందుబాటులో ఉన్న ఏ సౌకర్యమైన, అసౌకర్యమైన అది తన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసేది కాదు. అతని ఆచరణలో తేడా ఉండేది కాదు. లోయర్ టాంక్ బాండ్ లో ఉన్న అంబేడ్కర్ భవన్ ముందు మురికి కాలవ ప్రక్కన, ప్రజాశక్తి బుక్ హౌస్ ముందు రోడ్ ప్రక్కన నిద్ర పోయిన రోజులు కూడా కలేకూరి ప్రసాద్ జీవితంలో ఉన్నాయి. ఆర్దికంగా ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం నుండి వచ్చి, తోటి కుటుంబ సబ్యులు ఆర్ధికంగా అనేక అవకాశాలు  కల్పీంచడానికి సిద్దంగా ఉన్నా, అన్నీ సౌకర్యాలను తిరస్కరించి జీవితాంతం తన చుట్టూ ఉన్న పేదలతో, స్నేహితులతో జీవితమంతా గడిపేశాడు.
మేధావులతో ఎలా మాట్లాడేవాడో, సామాన్యులతో అలాగే మాట్లాడేవాడు, స్త్రీలతో ఎలా మాట్లాడేవాడో పురుషులతో అలాగే మాట్లాడేవాడు, పెద్దలతో ఎలమాట్లాడేవాడో పిల్లలతో అలాగే మాట్లాడేవాడు. మనుషుల ఆర్థిక సామాజిక, స్థాయినిబట్టి వారికిచ్చే గౌరము మారేదికాదు, మనుషులందరిని సమానంగా చూడడం అనే ఒక గొప్ప మానవీయ విలువను కలేకూరి ప్రసాద్ పాటించినంతగా మరెవరూ పాటించలేదు.
మనుషులంటే అపారమైన ప్రేమ అతనికి, పరిచయస్తులైన, అపరిచయస్తులైన, అప్పుడే పరిచయమైన వారయిన ఏమాత్రం తేడా లేకుండా అందరినీ ఒకే రకంగా పలకరించడం, గౌరవించడం కలేకూరి ప్రసాద్ కె సాధ్యం.  ఎవరైనా ఏదైనా సమస్యతో కలేకూరి ప్రసాద్ దగ్గరికి వస్తే, ఆ సమస్య అతనికి అర్థమైన మరుక్షణం నుండి ఆ సమస్య అతనిదే అయిపోతుంది, దానిని పరిష్కరించడానికి తనకు అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలను శోదించి అందులో పూర్తిగా ఇమిడిపోయి అది పరిస్కారం అయ్యే వరకు వదిలిపెట్టేవాడు కాదు.
ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలు చెప్పి, ఏ మాత్రం పాటించని వ్యక్తులంటే నిజానికి ఎవరికైనా అసహ్యం వేయాలి, కానీ ప్రసాద్ ఎవరిని అసహ్యించుకోలేదు కానీ వారిని చాలా సున్నితంగా విమర్శిచేవాడు. ఆ విమర్శ కేవలం విమర్శ కాకుండా వారు ఏ విధంగా మారాలో సూచించే విధంగా ఉండేదే గాని విమర్శ కేవలం విమర్శ దగ్గర నే ఆగిపోయేది కాదు. కలేకూరి ప్రసాద్ ఎవరినైనా విమర్శిస్తున్నాడు అంటే అదీ ఆ విమర్శ కు గురి అవుతున్న వ్యక్తికి తప్పకుండ ఉపయోగ పడేది అయిఉండేది. అందుకే కలేకూరి విమర్శలంటే అవి ఎదుటి వారి అభివృద్దికి సలహాలు మరియు సూచనలు మాత్రమే. అందుకే కలేకూరి విమర్శిస్తే కోపగించుకొనే వ్యక్తులు లేరు అందరూ అతని విమర్శ్లను స్వీకరించిన వారే.
 390632_2368548025446_1608039444_n
కలేకూరి ప్రసాద్ నాకు చాలా లేట్ గా పరిచయం అయ్యాడు, 2005 మే లో చంపాపేట్ లో ఉండే మా రూమ్ తెనాలి వెంకటేశ్వర్లుతో కల్సీ వచ్చాడు అప్పటినుండి 2005 నవంబర్ వరకు, మద్య మద్యలో బయటకు వెళ్ళినా,  దాదాపు మాతోనే ఉన్నాడు . అదే రూంలో మా అన్న, సామాజిక కర్యాకర్త  బత్తుల ప్రకాష్ నేను కలసి ఉండేవాళ్లం, కె.జి. సత్యమూర్తి మా రూమ్ కి తరుచూ వాస్తు ఉండేవారు. అతనితో మేము బరించిన ఏకైక సమస్య డబ్బులే, యింకే సమస్యలేదు.
ఎన్నో రకాల విషయాలపై చర్చలు చేసిన, కలేకూరి ప్రసాద్ కులాంతర వివాహాలపై నేను మొదలు పెట్టిన చర్చ లో చాలా సీరియస్ గా నాతో చర్చకు దిగాడు. చంపాపేట్ చౌరస్తా నుండి ఈస్ట్ మారుతినగర్ రూమ్ కి వెళ్ళే వారకు, దాదాపు 20 నిమిషాలు కులాంతర వివాహలి ఎలా ఉండాలనే విషయాన్ని వివరించాడు. కాలాంతర వివాహలంటే వధువు వైపున ఉండే వందలాది కుటుంబాలు వరుడివైపున ఉండే వందలాది కుటుంబాల మద్య బందుత్వానికి ఈ వివాహాలు దారి తీయాలని. కానీ అది జరగక పొగా, రెండు సమూహాల మద్య శతృత్వానికి ఈ కులాంతర వివాహాలు దారి తీస్తున్నాయని చెప్పాడు. దానికి విప్లవ కుటుంబాలు తే చెప్పుకుంటున కుటుంబాలు కూడా మినహాయింపుగా లేవని చప్పడు.
2009 మే నెలలో తన చెల్లెలు దగ్గరికి వెళ్ళి కేవలం నెల రోజులు ఉండి, ఇక అక్కడ ఉండలేనని హైదరాబాద్ కు వచ్చేశాడు, వస్తు వస్తు మా అన్న, కలేకూరి చెల్లెలు తాగుడు మాన్పించే చికిత్స కోసం తీసుకువెళ్లారు. అది అర్ధమైన ప్రసాద్, వారి నిర్ణయాన్ని వ్యతికేరించి హైదరాబాద్ కు వచ్చేశాడు. జులై 2009 నుండి డిశంబర్ 2009 వరకు మా అన్న బత్తుల ప్రకాష్ వరంగల్ తీసుకువెళ్లి అక్కడి మిత్రులు, సిద్దేశ్వర్, నరేందర్ ల సహాయంతో ఒక హోటల్ లో పెట్టి అవసరమైన చికిత్స చేయించారు. అక్కడ ఉన్నపుడే, తనకు తెలియకుండా తాగుడు మాన్పించే చికిత్స చేయిస్తున్నారని అనుమానించి హోటల్ రూమ్ లోనుండి కిందకి దుకాడు, నిజానికి అది డి అడిక్షన్ ట్రీట్మెంట్ కాదు. కాలు విరిగింది ఆ తర్వాత కావలిసినా చికిత్స చేయించి అతని సొంత ఊరు కంచికచెర్ల కు పంపించారు.ఇక అప్పటినుండి దాదాపు చనిపోయే వరకు కంచికచర్ల, ఒంగోల్ లోని మిత్రులు పల్నాటి శ్రీరాములు మరియు యితరుల వద్ద గడిపాడు. అప్పటినుండి హైదరాబాద్ వచ్చింది తక్కువ. ఎప్పుడు వచ్చిన ఒకటి, రెండు రోజులు తప్ప ఎక్కువ రోజులు ఉండలేదు.
కలేకూరి ప్రసాద్, ఆంధ్ర ప్రదేశ్ సాహితి రంగం లో ఒక సంచలనం. జన నాట్య మండలి తొలి నాల్ల లో రాసిన ప్రతిపాట లో కలేకూరి ప్రసాద్ ది కనీసం ఒక చరణం అయిన ఉంటుంది  జన నాట్య మండలి కార్య కర్త, డప్పు ప్రకాష్ ఇచిన సమాచారం ప్రకారం కలేకూరి ప్రసాద్ ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు వందలాది  పాటలు వ్రాసారు. అందులో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు ఉన్నాయి.  నిజానికి ప్రసాద్ ఏది మాట్లాడినా కవిత్వంగా ఉండేది, అతని మాటలు వినడానికి చాలా మండి ఆసక్తి చూపించేవారు.
నా మొదటి పుస్తకం, దలిత్ ఆవాజ్ ఆవిష్కరణ సభలో మార్చి 10, 2007 నాడు ప్రెస్ క్లబ్ లో మాట్లాడినాడు, ఆ రోజు సభ 9 గంటలకు ముగియాలి, కానీ కలేకూరి ప్రసాద్ 8:45 కు వచ్చాడు, అతని రాకతో వెళ్లిపొవాదానికి సిద్దపడిన వాళ్ళంతా మళ్ళీ కూర్చున్నారు, దాదాపు 40 నిమిషాలు ఉపన్యసించాడు, యే ఒక్కరూ కదలలేదు. మీటింగ్ ఆపేయమని వచ్చిన ప్రెస్ క్లబ్ సిబ్బందికూడా శ్రద్దగా విన్నారు. అ తర్వాత రోజున అదే పుస్తకానికి విశ్లేషణ వ్రాశాడు అది 2007 మార్చ్ 11 నాడు వార్తా పత్రికలో అచ్చు అయింది. విశ్లేషణ ఒకే పుస్తకానికి అయిన, మాట్లాడిన పదాలు ఏవి రాయలేదు. అది అతనికి తెలుగు బాష పైన ఉన్న పట్టు.
దాదాపు 70 పుస్తకాలు ఇంగ్లీష్ నుండి తెలుగు లోకి అనువాదం చేసాడు, చేగువేరా లాంటి అంతర్జాతీయ విప్లవ నాయకులను తెలుగు ప్రజలకు పరిచయం చేసింది కలేకూరి ప్రసాద్, స్వామి ధర్మతీర్థ రాసిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర, అరుంధతి రాయ్ రాసిన తే గొద్ ఒఫ్ స్మాల్ థింగ్స్ లాంటి అతి ముక్యమైన పుస్తకాలను అనువాదం చేసింది కలేకూరి ప్రసాద్. ఈ రాష్ట్రంలో అత్యంత గొప్ప విద్యా వేత్త గా పేరున్న ఒక పెద్దాయన, కలేకూరి ప్రసాద్ తో అబ్దుల్ కలామ్ పుస్తకాన్ని అనువాదం చేయించి తన పేరుతో అచ్చు వేయింధుకున్నారు. ఎలా అనేక వందల పుస్తకాలను అనధికారంగా అనువాదం చేసి పెట్టాడు
ఒకవేళ నువ్వు చచిపోతే నీపై నేను ఒక వ్యాసం వ్రాస్తాను, ఆ వ్యాసానికి “దళిత తాత్విక భైరగి కలేకూరి ప్రసాద్” అనే టైటిల్ పెడతాను అని చెప్పి, ఈ టైటిల్ బాగుందా అని ఆడిగాను, దానికి ఎలాంటి భావోద్వేగాలు లేకుంట “బాగుందిరా” అన్నాడు. ఒక్కసారి కాదు దాదాపు నాలుగైదు సార్లు అడిగినా చిన్నన నవ్వి. నువ్వు ఎలా వ్రాయగాలవో అలాగా ఉందిరా నీ వ్యాసానికి టైటిల్, అనేవాడు. కానీ కలేకూరి ప్రసాద్ ని టైటల్స్ వద్దు అనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసానికి ఆ టైటిల్  పెట్టలేదు. కలేకూరి ప్రసాద్ అంటే కలేకూరి ప్రసాద్ అంతే.
Photo0151
చావుని, ఆ లేక్కకొస్తే జీవితాన్ని ఎ మాత్రం లెక్క చేయని మనిషి కలెకురీ ప్రసాద్. జీవితాన్ని ఎగతాళి చేసిన మనిషి, విప్లవ సిద్ధాంతాలు వల్లిస్తూ మత సంప్రదాయాలతో బ్రతుకులు వెళ్ళదీస్తున్న ప్రధాన స్రవంతి విప్లవ మేధావులుకు, నాయకులకు, కవులకు సాహితి విమర్శకులకు అంతు బట్టని, అంతు చిక్కని గొప్ప ఆచరణ కలేకూరి ప్రసాద్ ది. ఆచరణ లేని ఆదిపత్యకుల విప్లవ వాదుల పెరట్లో పాములాంటి వాడు కలేకూరి ప్రసాద్.
వ్రాయటమంటే ఇంత నీరసం ఎప్పుడు రాలేదు, కలేకురి గురించి వ్రాయటమంటే, చాల ఉంది కదా ఒక్క వ్యాసంలో ఏమి వ్రాయగలం అని? కలేకూరి ప్రసాద్ కవిత్వం,పాటలు, సాహిత్యం, వ్యాసాలు,  అనువాదాలు, సాహితి విమర్శల గురుంచి ఎంతైనా వ్రయవచు. గ్రంధాలే అవుతాయి. అంతకన్నా అతని వ్యక్తిత్వం గురించి సామాజిక వ్యక్తిగత ఆచరణ గురించి ఎంతైనా వ్రాయవచ్చు. అదృష్ట వశాత్తు కలేకూరి ప్రసాద్ ఒక అంటరాని కులంలో పుట్టాడు, అందుకే అతను పేదలకు, దళితులకు, పీడితులకు అందుబాట్లో ఉండే మేధావి కాగలిగాడు. అదే ఒక ఆధిపత్య కులంలో పుట్టి ఉన్నట్లయితే అతను ఈ ప్రజలకు అందుబాటులో కి వచ్చేవాడు కాదు, ఏ విశ్వ విద్యాలయంలోనో, ఏదో ఒక డిపార్ట్మెంట్ లో స్మారక ఉపన్యాసం అయిపోయేవాడు. కానీ యిప్పుడు ఆ ప్రమాదం లేదు. అతను ప్రజల్లో బ్రతికి ఉంటాడు
కలేకూరి ప్రసాద్ రచనలు అన్నీ ప్రచురించి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అతని కులం రీత్యా ఈ పని ఏ విశ్వవిద్యాలయం చేయక పోవచ్చు. అది అతను కోరుకోలేదు కూడా, కానీ ఆ రచనల ప్రసంగికతను బట్టి, దళిత విప్లవ సామాజిక రంగం లో పని చేస్తున్న వారూ ఆ పని చేయాలి. అది కూడా కలేకూరి ప్రసాద్ కోసం కాదు, మన కోసం. అందులో బాగంగానే రవిచంద్రన్ అనే దళిత హక్కుల కార్యకర్త కలేకూరి ప్రసాద్ ని అతని జీవితం పై, సాహిత్యం పై ఇంటర్వ్యూ చేసి ఆ వీడియొలను దలిత్ కెమెరా వెబ్ చానల్ లో అప్లోడ్ చేశారు
అనేక పరిమితులనుబట్టి, అనేక విషయాలు ఈ వ్యాసంలో రాయలేదు, ఈ వ్యాసం కలేకూరి ప్రసాద్ అనే ఒక గ్రంధానికి కేవలం ముందుమాట లేదా వెనుక మాట లాంటిది.
                                                                                                                                                                                                                   -      బత్తుల కార్తీక్ నవయన్

Friday, May 31, 2013

అమ్మహస్తం-రిక్తహస్తమేనా..? పిట్టల రవి

  Thu, 30 May 2013, IST  

పథకాల 'మాటున' ప్రజలను మాయ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని అమ్మహస్తం మరోసారి నిరూపించింది. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే అందిస్తున్న తొమ్మిది రకాల సరుకులతోనే పేదల కడుపులు నిండిపోతాయంటూ పాలకులు సెలవిస్తుంటే అరకొర సరఫరా, నాసిరకం, పురుగులున్న సరుకులను అంటగడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఆకలితో అలమటించే పేద ప్రజల ఆకలి తీర్చటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కలల పథకంగా పురుడుపోసుకున్న అమ్మహస్తం రిక్తహస్తంగా మారింది. ఓట్ల సాధన వేటలో ప్రభుత్వం చేతిలో ఆయుధంగా మారి అమ్మహస్తం అస్తవ్యస్తంగా తయారైంది. పేదల పాలిటి అమృతహస్తమని ప్రచారం చేస్తోంది. తొమ్మిది రకాల నిత్యావసర వస్తువుల సరఫరా పథకం అంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. ప్రజలకు ఉపయోగపడే పథకాలు తెస్తే స్వాగతించాల్సిందే. కానీ పథకాల 'మాటున' ప్రజలను మాయ చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని అమ్మహస్తం మరోసారి నిరూపించింది. మార్కెట్‌ ధరల కంటే తక్కువకే అందిస్తున్న తొమ్మిది రకాల సరుకులతోనే పేదల కడుపులు నిండిపోతాయంటూ పాలకులు సెలవిస్తుంటే అరకొర సరఫరా, నాసిరకం, పురుగులున్న సరుకులను అంటగడుతున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రజలపై పథకాల మత్తుజల్లి ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తెగబడ్డారనే విషయం స్పష్టమైంది. పేదల కడుపు నింపే పేరుతో అవినీతిపరుల బొజ్జలు నింపేందుకు పథకం ఉపయోగపడుతుందనే విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వ వాదనల్లో నిజమెంత ..?
'ముందుంది మరింత మంచికాలం' అనే నినాదంతో పథకాల పరంపరను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి మరో పథకాన్ని ప్రజలపై వదిలారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ పేదలకు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని, వారిని ఆదుకునేందుకే అమ్మహస్తం వరం లాగా ప్రవేశపెట్టామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 2013 ఏప్రిల్‌ 11 ఉగాది పండుగ నాడు ఆర్భాటంగా ప్రారంభించింది. రాష్ట్రంలోని 2.25 కోట్ల మంది తెల్లరేషన్‌కార్డుదారులు ఈ పథకం ద్వారా కందిపప్పు, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, పంచదార, పామాయిల్‌, గోధుమలు, గోధుమ పిండి వంటి తొమ్మిది రకాల వస్తువులు మార్కెట్‌లో రూ.292 ధర పలుకుతుంటే ప్రభుత్వం కేవలం రూ.185 కే అందిస్తూ ప్రజలపై రూ.107 భారం తగ్గిస్తున్నామంటోంది. దీని కోసం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.660 కోట్లు కేటాయించారు. నిర్వహణలో వైఫల్యం, పథకంలో డొల్లతనం వల్ల ఆచరణలో ముందడుగు పడటం లేదు. ప్రచారంలో చూపుతున్న శ్రద్ధ అమలులో లేకపోవటం వల్ల ప్రజల్లో అభాసుపాలు అవుతోంది. ఈ పథకంతో ఎంతో కొంత ఉపయోగం జరుగుతుందని ఆశతో ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. ఇది జనాన్ని ఉద్ధరించేది కాదని, ఎన్నికల ఎర అనే విషయం అర్థమైంది.
వీటితోనే పేదల కడుపునిండేనా...
ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా ఇప్పటి వరకూ బియ్యం, పంచదార, గోధుమలు, కిరోసిన్‌ పంపిణీ చేస్తున్నారు. వీటికి మరికొన్ని కలిపి అమ్మహస్తం ప్రకటించారు. నెలకు అర కేజీ చింతపండు, అరకేజీ పంచదార, కేజీ కందిపప్పు, వందగ్రాముల పసుపు, పావు కేజీ కారం, కేజీ ఉప్పు, కేజీ పామాయిల్‌, కేజీ గోధుమ పిండి, కేజీ గోధుమలు సరఫరా చేసి పేదోడి ఆకలి తీరుస్తామని చెప్పటం విడ్డూరంగా ఉంది. అంతేకాదు ఆచరణలో సాధ్యం కాదనే విషయం తెలిసి కూడా పథకాన్ని వల్లెవేస్తూ వంచనకు పాల్పడుతోంది. నలుగురు సభ్యులు గల ఒక కుటుంబానికి ప్రభుత్వం రూ.185కు ఇచ్చే పై సరుకులు 8-10 రోజులకు మాత్రమే సరిపోతాయి. మరి మిగతా 20 రోజుల పరిస్థితి ఏమిటి..? అంటే 20 రోజుల తిండి కోసం అధిక ధరలు చెల్లించి మార్కెట్‌లో కొనక తప్పదు. దీనివల్ల ప్రజలపై విపరీతమైన ధరల భారం పడి సామాన్యుడు కుదేలవుతున్నాడు. అంతేకాక మన బియ్యం పేరుతో మనిషికి నెలకు 4 కేజీల చొప్పున ఇస్తున్న బియ్యంతోనే నెలంతా తినగలడా..? అంటే అరకొరగా ఇస్తున్న సరుకులతో నెలంతా బ్రతకటం సాధ్యంకాదు. అయినా పాలకులు అమ్మహస్తంతో గోరంత చేస్తూ కొండంత చేస్తున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారు. పథకాన్ని సక్రమంగా అమలుచేస్తున్నారా అంటే అదీ లేదు. ఇప్పటికీ చాలా చోట్ల 4-6 రకాలను మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. నాసిరకం, ఎంతో కాలంగా నిల్వ ఉండి పురుగులు పట్టి పాడైపోయిన వాటిని ఇచ్చి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నాణ్యత లోపించిన సరుకులను అంటగడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల చైతన్యనగర్‌కు చెందిన సత్యమ్మకు అమ్మహస్తం సరుకుల్లో చనిపోయి మురుగుడు వాసన వస్తున్న పిచ్చుక వచ్చిందంటే ఈ పథకం ఎలా అమలవుతోందో అర్థమవుతుంది. అప్పులు చేసి మరీ డి.డిలు కట్టిన రేషన్‌ షాప్‌ డీలర్లకు తొమ్మిది రకాలు ఇవ్వకపోవటంతో ఇక్కట్లకు గురవుతున్నారు.
ధరల భారానికి కారణం ఎవరు..?
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతుండటం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఒక కథ అతికినట్లు సరిపోతుంది. మన జేబుకొట్టి మనకే అందులోంచి కొంత సాయం చేసినట్లుంది ప్రభుత్వం తీరు. ప్రపంచబ్యాంకు దర్శకత్వంలో పరిపాలన చేస్తూ కార్పొరేట్‌ కంపెనీలకు మేలు చేకూర్చుతూ ప్రజలపై భారాలు మోపుతోంది. దేశంలోని వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేసి విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి కల్పించారు. అడ్డూ అదుపూ లేకుండా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచటం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కొండెక్కాయి. ధరలు పెంచేది, పెరుగుతున్నాయని బాధపడేదీ ప్రభుత్వమే. మార్కెట్‌ శక్తులకు ప్రజల సొమ్మును దోచిపెడుతున్న పాలకులు ధరలు తగ్గించకుండా ప్రజలకు తాత్కాలికంగా తాయిలాలు ప్రకటిస్తూ పథకాలను వెదజల్లుతున్నారు. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకే అమ్మహస్తంలాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రజలకు అర్థమవుతోంది. అందుకే పాలకుల పాచికలకు లొంగకుండా ఎదురుతిరుగుతున్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. 
-పిట్టల రవి
  
Prajashakti Telugu News Paper Dated : 30/5/2013 

వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌ --- పి రాజశేఖర్‌

   Sat, 1 Jun 2013, IST  

  • నేడు హెలెన్‌ కెల్లర్‌ 25వ వర్ధంతి
జీవితం నిత్యం సమ స్యలతో స్వా గతం పలు కుతున్నా, అంధత్వం అడ్డుతగిలినా, మూగ, చెవిటితనంతో కృంగిపోలేదు. అధైర్యపడకుండా, నిరాశ చెందకుండా అవరోధాలను అధిగ మించారు. లక్ష్యాలను సాధించి చిమ్మ చీకటిలో సైతం వెలుగును చూడగలిగే ధైర్యం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం మనిషి ఉన్నతికి స్ఫూర్తి అని ప్రపంచానికి చాటి చెప్పారు హెలెన్‌ కెల్లర్‌. ఆమె వికలాంగుల హక్కుల సాధనకు జీవితాన్ని అర్పించిన గొప్ప త్యాగశీలి. 'ఇన్‌ హర్‌ స్టోరీ'కి ఉత్తమ డాక్యుమెంటరీగా 1955లో అకాడమీ అవార్డు వచ్చింది. వైకల్యం శాపం కాదు. సవాల్‌గా తీసుకోవాలని వికలాంగులను వారి హక్కుల పట్ల చైతన్యపరచేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ప్రేరణ కల్పించేందుకు 39 దేశాలు పర్యటించారు. ప్రగతిశీల భావాలతో అమెరికన్‌ సోషలిస్టు పార్టీలో చేరి వికలాంగులతోపాటు బాలల, మహిళల, కార్మికవర్గం హక్కులు, సంక్షేమంపై ఉపన్యాసాలు, అనేక పుస్తకాలు, వ్యాసాలు రాశారు. ఆమె రాసిన 12 పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ముద్రించబడ్డాయి. వికలాంగుల హక్కుల పరిరక్షణకే పునరంకితమైన హెలెన్‌ కెల్లర్‌ అవివాహితగానే ఉండిపోయారు.
హెలెన్‌ కిల్లర్‌ 1880 జూన్‌ 27న ఆర్థర్‌ హెచ్‌ కెల్లర్‌, కేథరీన్‌ ఆడమ్స్‌ కెల్లర్‌ దంపతులకు అమెరి కాలోని అలబామాలో తుస్కుంబియాలో జన్మించారు. 19 నెలల వయస్సులో విపరీతమైన అనారోగ్యం మూలంగా చూపును, వినికడిని కోల్పోయారు. అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ సలహా మేరకు ఆమె పెర్కిన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది బ్లైండ్‌లో చేర్చారు. అక్కడ సల్లివాన్‌ అనే ఉపాధ్యాయురాలి వద్ద అనేక పదాలను తాకడం, వాసన ద్వారా నేర్చుకొని 1890 నాటికి చదవడం, రాయడం నేర్చుకున్నారు. 1900లో రాడ్‌క్లిఫ్‌ కళాశాలలో చేరి బ్యాచిలర్స్‌ డిగ్రీ పొందారు. 1902లో 'ది స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌' అనే పుస్తకాన్ని వ్రాశారు. టెంపుల్‌ యూనివర్శిటీ, హార్వర్డ్‌ యూనివర్శిటీ, స్కాట్లాండ్‌లోని గ్లాస్గో, జర్మనీలోని బెర్లిన్‌, భారత్‌లోని ఢిల్లీ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందారు. ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌ గౌరవ ఫెలోగా కూడా ఉన్నారు. ఉపాధ్యాయురాలైన సల్లివాన్‌ ఇంట్లోనే ఉంటూ అభ్యుదయ భావాలవైపు, సోషలిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. వికలాంగులతోపాటు మహిళల, కార్మిక ఉద్యమాలను నిర్మించారు. 1924లో అమెరికాను పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి అంధుల సంక్షేమం కోసం కోట్లాది డాలర్లు సేకరించారు. ది మిరాకల్‌ కంటిన్యూ అనే హాలీవుడ్‌ సినిమాలో నటించి హెలికాప్టర్‌, గుర్రం నడపడం తెలియ కపోయిన షూటింగ్‌ సమయంలో సాహసవంతంగా వాటిని నడిపి వచ్చిన డబ్బును అమెరికా పౌండేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌కు ఇచ్చారు. 1933లో నేషనల్‌ లైబ్రరీ ఫర్‌ బ్లైండ్‌కు అధ్యక్షురాలిగా ఎంపికై అనేక పుస్తకాలు బ్రెయిలీ బాషలోకి ప్రింట్‌ చేయించారు. ఆమె రచించిన పుస్తకాలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. హెలెన్‌ కెల్లర్‌ 1903 నుంచి 1965 వరకూ ఉన్న అమెరికా అధ్యక్షులందరికీ అంధులు, వికలాంగులు, మహిళలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి లేఖలు వ్రాశారు. అమెరికా అధ్యక్షులందరూ సమా ధానాలు పంపేవారు. ఆమె చార్లీచాప్లిన్‌, మార్క్‌ ట్విన్‌, గ్రాహంబెల్‌, నెహ్రూ, డేవిడ్‌సన్‌, విలియం జేమ్స్‌, తదితర నాయకులతో స్నేహం చేశారు. వారితో వికలాంగులు, సోషలిజంపై చర్చించేవారు. 1964లో అమెరికా అధ్యక్షుడు జాన్సన్‌ తమ దేశ ముద్దుబిడ్డగా హెలెన్‌ కెల్లర్‌ను ప్రకటించి ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ప్రీడం అత్యున్నత పురస్కారం అందించారు. ఆమె ఇంకా అనేక అవార్డులు అందుకున్నారు. వికలాంగుల జీవితాల్లో వెలుగును ప్రసాదించడమే కాక ప్రపంచ మార్పు కోసం 80 సంవత్సరాల వయస్సులో కూడా రోజుకు 10 గంటలు సామాజికాంశాల్లో పాల్గొనేవారు. వికలాంగులకు చేసిన సేవకు గుర్తింపుగా ప్రపంచ దేశాలు విద్యాసంస్థలకు, ప్రాంతాలకు ఆమె పేరు పెట్టాయి. 1988 జూన్‌ 1న నిద్రలోనే ప్రపంచాన్ని వీడిన హెలెన్‌ అవరోధాలు ఎన్ని ఉన్నా వాటిని మించిన అవకాలుంటాయని చాటిచెప్పారు. ప్రపంచంలో అత్యుత్తమమైన వాటిని కంటి చూపుతో ఆస్వాదించకపోయినా హృదయంలో వాటి అనుభూతులను పొందవచ్చునని నిరూపించారు. ఈ విశ్వం ఉన్నంత వరకూ వికలాంగులకే కాకుండా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి ప్రదాత. ఈ సమాజానికి ఒక గొప్ప రోల్‌ మాడల్‌. వికలాంగుల హక్కుల గొంతుక హెలెన్‌ కెల్లర్‌.
-పి రాజశేఖర్‌
  
Prajashakti Telugu News Paper Dated : 1/6/2013

రేపటి రాజ్యం బహుజనులదే ----- అరూరి సుధాకర్ బహుజన ఇంటలెక్చువల్ కలెక్టివ్


రాబోయే సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనువాద పార్టీలు కుప్పిగంతులేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు. బహుజనుల అభిప్రాయాలకు ఎలాంటి విలువ లేదని ఈ అగ్ర కులాలు భావిస్తున్నాయి. మనువాద నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదిస్తున్నారని కంచ ఐలయ్య వంటి మేధావులు సైతం ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను తెలంగాణ పీడిత కులాల ప్రజలు నమ్మరని వీళ్ళ విశ్వాసం. కేసీఆర్ కుటుంబం దోపిడీ గురించి ఆ పార్టీ బహిష్కృతుడు రఘునందన్ ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ఉద్యమం పేరుతో డబ్బు దండుకుంటున్నాడని ఒక్కసారి కూడా బీజేపీ నాయకులు విమర్శించలేదు. టీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతుంది. బీజేపీ, టీఆర్ఎస్ ఉమ్మడిగా అభ్యర్థులను నిలపాలని, ఆ అభ్యర్థులను కూడా పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ నిర్ణయించాలని మేచినేని కిషన్‌రావు సూచిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతాన్ని వేదమయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కాబట్టి, టీఆర్ఎస్ సిద్ధాంతం కూడా బీజేపీకి భిన్నమైందేమీ కాదని ఆయన భావన.
తెలంగాణ ఉద్యమం బీజేపీ చేతిలోకి వెళ్తే తన ఆటలు సాగవని కేసీఆర్ ఒంటరి పోరుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి చేయి చాపాలనే తాపత్రయమే తప్ప నిజాలు చెప్పే అలవాటు కేసీఆర్‌కు గానీ, జాక్ చైర్మన్ కోదండరామ్‌కు గానీ, వీళ్లిద్దరికీ వంతపాడే దళిత నాయకులకు గానీ లేదు.

తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని బహెన్ మాయావతి డిమాండ్ చేశారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను విభజించి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరుతున్నారు. ఆమె అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరికి కట్టుబడి ఉన్నారు. అధికారమే పరమావధిగా వ్యవహరించే మనువాద పార్టీలు తెలంగాణ ఇస్తాయన్న హామీ ఏమీ లేదు. కానీ బహుజన రాజ్యాధికారం కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న బీఎస్పీ అధినేత మాయావతి నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు చేయడం మాత్రం ఖాయం. ఈ విషయాన్ని ప్రజలకు అర్థ కాకుండా చేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అన్ని రకాలుగా వేషాలూ వేస్తున్నాయి.
తెలంగాణ కోరుతున్న బహుజనులను నిస్సహాయులను చేయాలని అన్ని పార్టీలూ చూస్తున్నాయి. నిన్నటి వరకు నెల రోజుల్లో తెలంగాణ వస్తుందనీ, కేంద్రం నాతో సంప్రదింపులు జరుపుతుందని బుకాయించిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు కాబట్టి దాన్ని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణలోని వివిధ వృత్తి కులాలు, మాదిగ, మాల కులాలంతా తెలంగాణ కోసం అన్ని రకాల నిరసనలు చేపట్టినప్పుడు దాన్ని నీరుగార్చింది కేసీఆర్, జాక్ నాయకత్వం కాదా? తెలంగాణ ఉద్యమానికి దాదాపు అన్ని వర్గాలు దూరమైపోయాయి. ముఖ్యంగా ముస్లింలు, దళితులు, గిరిజనులు చాలా త్వరగా నిజం తెలుసుకున్నారు. బీసీల్లో చాలా వరకు టీఆర్ఎస్ పట్ల విముఖంగా ఉన్నారు. కొంత మంది బీసీ నాయకులు, కవులు తప్ప ఆత్మాభిమానం మెండుగా ఉన్న బీసీ కులాలేవీ ఉద్యమం పేరుతో జరిగే మోసాన్ని సహించే పరిస్థితిలో లేవు.

2009 నుంచి కొనసాగుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ముస్లింల మీద దాడి జరగని సంవత్సరమే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలే తెలంగాణాలో నూటికి తొంభై ఐదు మంది ఉన్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళదే అధికారమని కేసీఆర్ దళిత నాయకుడిలాగా మాట్లాడుతున్నారు. అయితే ముస్లిం మైనారిటీలపై కొంతకాలంగా జరుగుతున్న దాడులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దళిత, బహుజనులపై అగ్రవర్ణ దాడులను ఆయన ఇంతవరకు ఖండించనేలేదు. ఒక్క తెలంగాణ తప్ప మరేది పట్టని తప్పుడు చైతనాన్ని ఈ ఉద్యమ నేతలు రగిలించారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు స్పందించే స్ప్పహను తెలంగాణ ఉద్యమం తొలగించిందా? తెలంగాణ ప్రాంతంలో ఎన్నో త్యాగాలతో నిర్మాణం చేసుకున్న ప్రత్యామ్నాయ ఉద్యమాలను అగ్రకుల నాయకత్వం ధ్వంసం చేసింది.

జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, నరేంద్రమోడీ లను ఓడించి మాయావతి బహుజనులను అధికారంలోకి తీసుకు రావ డం ఖాయం. తెలంగాణ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేసినవారిలో బహుజనుల పిల్లలే అధికం. మాయావతి మాత్రమే బహుజన తెలంగాణ ఏర్పాటు చేయగలదని బహుజనులు నమ్ముతున్నారు. మాయావతిని ప్రజల్లోకి రానివ్వకుండా జాక్ పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని కాషాయ తీవ్రవాదులకు అప్పజెప్పాలని కోదండరామ్ ప్రయత్నిస్తే వారు గుణపాఠం చెబుతారు.


Andhra Jyothi Telugu News Paper Dated : 31/5/2013

Wednesday, May 29, 2013

జోగిని వ్యవస్థ అంతమయ్యేదెప్పుడు? ----దుర్గం శ్రీనివాస్





భారతీయ సమాజం స్త్రీని ఆదిశక్తిగా, ధన, ధాన్య, దైర్య, సంపదలక్ష్మి గా కొలుస్తున్నది. పురాణాల్లో ఇతిహసాల్లో స్త్రీ శక్తి గురించి ఎన్నో సాహసగాథలను పలు విధాలుగా పేర్కొన్నారు. ఇన్ని రూపాలుగా కొలిచే స్త్రీని ఇదే సమాజంలో మరో రూపంలో మాంసపు ముద్దగా, భోగ వస్తువుగా కూడా చూస్తున్నది.ఈ క్రమంలోనే అణగారిన, అట్టడుగు కులాలకు చెందిన స్త్రీలను భూస్వా మ్య,పెత్తందారులు లైంగిక వాంఛను తీర్చే సాధనంగా, ఆట వస్తువుగా మార్చారు. దీనికి సజీవ సాక్ష్యమే ‘జోగిని వ్యవస్థ’.
భారత సమాజంలో ఉన్న సామాజిక రుగ్మతల్లో జోగిని వ్యవస్థ అతి హేయమై నది. బూర్జువా, భూస్వాముల ‘కోరిక’లను తీర్చేందుకు జోగినీ వ్యవస్థను ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగేలా చేస్తున్నారు. దీంట్లో భాగంగానే దళిత, గిరిజన స్త్రీలను కామ వాంఛను తీర్చేందుకు వ్యభిచారులుగా చేస్తున్నారు. ఈ వ్యవస్థను అణగారిన దళిత, గిరిజన స్త్రీలకే పరిమితమయ్యేట్లు చేసి సమాజంలోని ఆధిపత్య కులాలు, వర్గాలు రూపొందించాయి. ఆది నుంచి ఊరికి దూరంగా, అంటరానివారిగా వెలివేశారు. జోగిని వ్యవస్థ మన రాష్ట్రంలో మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, రంగాడ్డి, కరీంనగర్, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికీ జోగిని, దేవదాసీ, బసివి, మాతం గి అనే పేర్లతో కొనసాగుతున్నది. 

పేర్లు ఏవైనా రూపం, స్వరూపం ఒక్కటే. గ్రామాల్లో భూస్వాముల కామవాంఛను తీర్చేందుకు వీరిని ఒక వస్తువుగా,సాధనంగా వాడుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8వేల మంది జోగిని, దేవదాసీ, బసివి, మాతంగులు ఉంటారని ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం తెలుస్తున్నది. ఈ వ్యవస్థ అనాదిగా వస్తున్న ఆచారమని అణగారిన కులాలకు అగ్రకుల పెత్తందారులు ఆపాదించారు. కానీ దీని నేపథ్యం చూస్తే..చరిత్రలో వేర్వేరు సామాజిక కారణాలతో ఉద్భవించిందని చెప్పవచ్చు. ప్రఖ్యాత రచయిత తాపి ధర్మారావు రాసిన ఎన్నో రచనలో స్త్రీ స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. వీటిలోనే దేవదాసీ వ్యవస్థను కూడా ఆయన రాసిన ‘దేవాలయాలపై బూతు బొమ్మపూందుకు’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. పూర్వం దేవదాసీలు దేవుని సేవకులుగా మాత్రమే ఉండేవారు.

వీరి నివాసం దేవాలయాల్లోనే ఉండేది. వీరి వృత్తి వ్యభిచారం. వీరితో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వచ్చే విటులు (అప్పట్లో రాజవంశీకులు, జమీందారులు) నేరుగా దేవాలయానికే వచ్చే వారు. అక్కడే దేవదాసీలు వ్యభిచార వృత్తిని అందరి అంగీకారంతో చేసేవారు. వారు ఇచ్చిన డబ్బు, కానుకలను తాము నమ్ముకున్న దేవుడి హుండిలో సగభాగం వేసే వారని చలం తన రచనల్లో ప్రస్తావించారు. ఈ విధంగా దేవదాసీ వ్యవస్థ ను అప్పటి రాచరిక వ్యవస్థగానీ, భూస్వాములుగానీ ప్రోత్సహించారని, వీరందరూ దేవుడి పేరుతో వ్యభిచారం చేసేవారని తెలుస్తోంది. దేవదాసీ వ్యవస్థకు మూలం తాపీ ధర్మా రావు స్పష్టంగా చెప్పారు. దేవాలయాల్లోనే దేవదాసీలు వ్యభిచారం చేశారు కాబట్టి దేవాలయాల్లో బూతుబొమ్మలను అప్పటి రాజులు వేయించారని ఆయన వాదన. దీనిపై రకరకాల అభివూపాయాలున్నాయి. కానీ ఇదే వ్యవస్థ ఆధునీక కాలంలో రకరకాల పేర్లతో కొనసాగుతున్నది. దీనికి అనవాళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ జిల్లాలో జోగిని పేరుతో కొనసాగుతున్నది. దళిత, గిరిజన, కురుమ కులాల్లోని స్త్రీలను జోగినీలుగా మారుస్తుంటారు. ఏదైన కుటుంబంలో మగపిల్లలు పుట్టకపోవడంతో వారసత్వం లేదని సంబంధిత కుటుంబంలోని పెద్ద కూతురు లేదా అందరికంటే చిన్న కూతురును జోగినీగా మారుస్తారు. ఈమెను ఆ కుటుంబంలో వరుసకు మేనమామ సంబంధమున్న వారితోగానీ, లేదా వారు కొలిచే ఇష్టానుదైవం సన్నిదిలోగానీ తాళిబొట్టు కట్టించి పెళ్లి జరిపిస్తారు. సంబంధిత జోగినీకి ఆ దేవునితో పెళ్లి జరిగినట్లుగా కుల పెద్దలు నిర్దారిస్తారు. వారసత్వం కోసం జోగినీగా మార్చినందుకు సదరు గ్రామంలోని భూస్వామ్య, పెత్తందారి వర్గాలు వ్యభిచారిగా ముద్ర వేయడం జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఊట్కూర్, నారాయణపేట, మక్తల్, దన్వాడ, ఆత్మకూర్, మాగనూరు, కొడంగల్, కోస్గి, దేవరకద్ర, అలంపూర్, గద్వాల, గట్టు, దరూర్ మండలాల్లో దళిత, గిరిజన, కురుమ కుటుంబాల్లో జోగినీ వ్యవస్థ కొనసాగుతున్నది. ఈ వ్యవస్థను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం 1988 సంవత్సరంలో జోగినీ నిషేధ చట్టాన్ని రూపొందించింది. కానీ ఈ చట్టం కేవలం కాగితాలకే పరిమితమైంది. అంతేకానీ జోగినీ, దేవాదాసీ, బసవి, మాతంగి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. 

జోగినీ పిల్లలకు తండ్రి ఎవరో తెలియని పరిస్థితి. దీంతో జోగిని పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలంటే ఇబ్బందులు పడాల్సిందే. నేటి విద్యా వ్యవస్థలో పిల్లలను పాఠశాలల్లో చేర్పించేటప్పుడు తండ్రి పేరును తప్పకుండా నమోదు చేయాలనే నిబంధన విధించింది. జోగినీ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తున్నది. 

కొన్ని సందర్భాల్లో సదరు స్త్రీలకు ఇష్టం లేకున్నా బలవంతంగా జోగినులుగా మారుస్తున్నారు. కాదని ఎదిరిస్తే భూస్వామ్య, పెత్తందారులు దాడులకు పాల్పడడం, ఊళ్లో నుంచి వెలివేయడంలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 65 ఏళ్లు గడిచినా సామాజిక రుగ్మతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేందుకు జోగినీ వ్యవస్థ నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోగిని నిషేధ చట్టం చేసి చేతులు దులుపుకున్నాయి.వారి ఉద్ధ రణకని కమిటీలు, కమిషన్లు వేశాయి.అలాగే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ కూడా వేసింది. ఈ కమిషన్ కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించింది. జోగినీలకు పునరావాసం కల్పించేందుకు ప్రభు త్వం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేయాలని, వారి పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ జోగినీ, బసివి, దేవాదాసీ, మాతంగీల అరకొర సహాయం కూడా అందలేదు. వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో 500 మంది జోగినీలకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్కరికీ ఐదువేల రూపాయల చొప్పున రుణాలను మంజూరు చేశారు. ఒక్కో ఎకరం భూమి కూడా ఇచ్చారు. ఎక్కడో ఊరికి దూరంగా ఎందుకూ పనికిరాని పోరంబోకు భూములను కట్టబెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. కొన్ని ప్రాంతాల్లో సంక్షేమహాస్టళ్లల్లో పిల్లలను చేర్పించి చదివించారు. కానీ ఉన్నత చదువులకు వెళ్లే పరిస్థితి లేక అయా గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా మారినవారే ఎక్కువగా ఉన్నారు. జోగిని వ్యవస్థను నిషేధిస్తామని గొప్పలు చెప్పే స్వచ్ఛందసంస్థలు లబ్ధి పొందాయి. జోగిని వ్యవస్థను భూతద్దంలో చూపించి విదేశాల నుంచి కోట్లాది నిధులను తమ సంస్థల ఖాతాల్లోకి జమ చేసుకున్న స్వచ్ఛంద సంస్థలు చేసింది శూన్యమనే చెప్పాలి. నిధులు తెచ్చుకున్న స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు కోటీశ్వరులయ్యారు. కానీ జోగినుల దయనీయ పరిస్థితిలో ఏ మార్పూ లేదు. రాలేదు. జోగిని, బసివి, దేవాదాసీ, మాతంగి వ్యవస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సమస్యగా గుర్తించాలి. దాని నిర్మూలనకు చిత్తశుద్ధిగా కృషి చేయాలి. జోగినులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. 

అలాగే సమాజంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం సాధించేందుకు ప్రభుత్వాలు సంక్షే మ పథకాలను ప్రవేశపెట్టాల్సిన అవసరమున్నది. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో జోగినీలకు ప్రత్యేక నిధులను కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో ప్రత్యేక నిధులను కేటాయించాలి. జోగినీ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి, చట్టాన్ని అతిక్షికమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. జోగినీల కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలి. సామాజిక, జీవిత భద్రత కింద పింఛన్లు, జీవితబీమా వంటి సౌకర్యాలను ప్రభుత్వమే విధిగా అమలు చేయా లి. జోగినీల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుడే దేవదాసీల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. 

-దుర్గం శ్రీనివాస్
స్కాలర్ (జర్నలిజం), ఉస్మానియా యూనివర్శి

Namasete Telangana Telugu News Paper Dated : 30/5/2013

పెడదోవలో విద్యార్థి నేతలు ----- ఇనప ఉపేందర్ (ఇఫ్లూ), కోట రాజేశ్ (ఓయూ) పరిశోధక విద్యార్థులు



ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో యావత్ దేశ ప్రజానీకాన్ని తనవైపు తిప్పుకున్న ఘన చరిత్ర ఉస్మానియా విశ్వవిద్యాలయంకు ఉన్నది. విద్యార్థి జేఏసీ నాయకుల రాజకీయ చేరిక మరొకసారి ఒక చారిత్రక చర్యకు అవకాశాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో అటు యావత్ తెలంగాణలో, ఇటు ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీలోనూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర దిశగా సాగుతున్న మలిదశ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులే నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉద్యమ గమనంలో జైలు జీవితాలు, వందల సంఖ్యలో కేసులు, లాఠీ దెబ్బలు, రబ్బరు బులెట్ ఫైరింగులు, థర్డ్ డిగ్రీ చిత్రహింసలను సైతం ఎదుర్కొని వెన్ను చూపని వీరోచిత పోరాటాన్ని నిర్వహించారు.

తెలంగాణ మట్టి బిడ్డల స్వప్నమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసే నిజమైన ఉద్యమకారులుగా ఓయూ విద్యార్థులు ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేశారు.

తెలంగాణ పట్ల టీఆర్ఎస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీల అవకాశవాద విధానాల్ని ఎండగడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా తెలంగాణ విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేశారు. విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపులే యావత్ తెలంగాణ ఉద్యమ కార్యాచరణగా కొనసాగింది. ఈ ఉద్యమ ప్రభావంతోనే కేంద్రం డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించటం జరిగింది. విద్యార్థుల పాదయాత్రలో భాగంగా తెలంగాణలో పల్లె పల్లె తిరుగుతున్నప్పుడు అక్కడి ప్రజలు ఉస్మానియా విద్యార్థుల పాదాలను పాలతో కడిగి నీరాజనాలు పలికారు. వృద్ధులు సైతం వారి కొంగుల్లో దాచుకున్న ఫించన్ డబ్బులను విద్యార్థులకు ఇచ్చి 'రాజకీయ పార్టీల బద్మాష్‌గాళ్లను మేము నమ్మం బిడ్డా... వస్తే గిస్తే తెలంగాణ మీతోటే రావాల, మీరే నిజమైన నాయకుల'ని దీవించారు. తెలంగాణ ప్రాంత ఆత్మగౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టడం కోసం ప్రజా బాహుళ్యాన్ని ఉరకలు వేయిస్తూ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించి తెలంగాణ ఉద్యమంలో చారిత్రక బాధ్యతను నిర్వర్తించారు.

ఇంతటి చారిత్రక పాత్ర పోషించిన విద్యార్థి నాయకత్వం నుంచి కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ పదవుల వ్యామోహంతో నాయకులకు అమ్ముడుపోతున్న స్థితి యావత్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లినట్లయ్యింది. నాడు 'చలో అసెంబ్లీ' అని నినదించిన నాయకత్వం, నేడు ఎమ్మెల్యే సీట్లకై రాజకీయ పార్టీల ఆఫీసులకు 'చలో' అంటున్నారు. రాజీనామా ప్రమాణాలను ఆత్మత్యాగం చేసిన వారి శవాలపై చేయి ంచిన విద్యార్థి నాయకులే అవే పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. వీరు గతంలో సమరశీల పోరాటాలతోనే తెలంగాణ వస్తుంది తప్ప, ఎన్నికల లాబీయింగులతో తెలంగాణ రాదని చెప్పినవారే. ఈ నయవంచకుల తీరు ను గమనిస్తే 1969 తెలంగాణ ఉద్యమ విద్రోహ వారసత్వానికి వారసులు ఇలాంటి వారేనని చెప్పక తప్పదు.
తెలంగాణ రాష్ట్ర డిమాండును నిర్వీర్యం చేయడానికి ఉద్యమ కేంద్రమైన ఉస్మానియావైపు పాలకవర్గ పార్టీలు చూస్తూండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. గత 60 సంవత్సరాల కాలంలో చవిచూసిన చేదు అనుభవాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు తమకు జరిగిన, ఇంకా జరుగుతున్న అన్యాయాల గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ ఆందోళనను అదుపుచేసి అసలు సిసలైన తెలంగాణ గొంతును సమష్టి పోరాటాల ద్వారా బయటి ప్రపంచానికి వినిపించాల్సిన గురుతర బాధ్యత ఉస్మానియా విద్యార్థి నాయకత్వంపై ఉంది. 1969 తెలంగాణ ఉద్యమంలో నక్సల్‌బరీ ప్రభావం ఉన్నప్పటికీ అంతర్లీనంగానే ఉన్నది. అంతర్లీనం నుంచి అంతర్భాగమయ్యే గుణాత్మక పరిణామ దశలోనే 1969 తెలంగాణ ఉద్యమం ద్రోహానికి గురయ్యింది. విశాల మద్దతు ఉన్న ఒక ప్రజాస్వామిక డిమాండ్ అనేక ఒడిదుడుకులకు లోనైనప్పటికీ ప్రజా క్షేత్రంలో సుదీర్ఘకాలం నిలిచి వుండటం ఈ ఉద్యమానికి ఉన్న ఒక ప్రత్యేకత. తెలంగాణ ఆకాంక్ష మరుగునపడిన ప్రతిసారీ, ఆ ఉద్యమ జ్వాలను ఆరనివ్వకుండా కాపాడుతున్నది తెలంగాణ ప్రజలే.

1969 ఉద్యమాన్ని గుణపాఠంగా తీసుకొని మరోసారి తెలంగాణకు ద్రోహం తలపెట్టే అన్ని రాజకీయ పార్టీలకు సమష్టి ఉద్యమాలతో సమాధానం చెప్పే ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలి. విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో రాజకీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకమని భావించిన పార్టీలన్నీ ఏకమై విద్యార్థి ఉద్యమాన్ని నిలువునా చీల్చిన చేదు అనుభవాన్ని మరువరాదు. ఏ ప్రజలైతే మనపై ఆశలతో కాళ్ళుకడిగి గుండెలకు హత్తుకున్నారో వారి కన్నీళ్ళు తుడిచే చారిత్రక బాధ్యతను నిర్వర్తించాలి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమరం భీం, బందగి వారసులుగా చరిత్రలో నిలిచిపోతారా? రాజకీయ నాయకులకు పావులుగా ఉపయోగపడి చరిత్రహీనులౌతారా మీరే తేల్చుకోండి. ఇలా మోసపోయిన ప్రతిసారీ దగాపడిన ప్రజలను అక్కున చేర్చుకొని ఉద్యమ గుణపాఠాలను నెమరువేయించి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలతో మమేకమైనవారే నిజమైన తెలంగాణ ఉద్యమకారులు.
- ఇనప ఉపేందర్ (ఇఫ్లూ),
కోట రాజేశ్ (ఓయూ)
పరిశోధక విద్యార్థులు
Andhra Jyothi Telugu News Paper Dated : 30/5/2013