Friday, May 31, 2013

రేపటి రాజ్యం బహుజనులదే ----- అరూరి సుధాకర్ బహుజన ఇంటలెక్చువల్ కలెక్టివ్


రాబోయే సార్వత్రక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మనువాద పార్టీలు కుప్పిగంతులేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కేవలం ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు. బహుజనుల అభిప్రాయాలకు ఎలాంటి విలువ లేదని ఈ అగ్ర కులాలు భావిస్తున్నాయి. మనువాద నాయకులు తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్లు సంపాదిస్తున్నారని కంచ ఐలయ్య వంటి మేధావులు సైతం ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను తెలంగాణ పీడిత కులాల ప్రజలు నమ్మరని వీళ్ళ విశ్వాసం. కేసీఆర్ కుటుంబం దోపిడీ గురించి ఆ పార్టీ బహిష్కృతుడు రఘునందన్ ఆరోపణలు చేశారు.

కేసీఆర్ ఉద్యమం పేరుతో డబ్బు దండుకుంటున్నాడని ఒక్కసారి కూడా బీజేపీ నాయకులు విమర్శించలేదు. టీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మరిన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని ఆ పార్టీ ఆరాటపడుతుంది. బీజేపీ, టీఆర్ఎస్ ఉమ్మడిగా అభ్యర్థులను నిలపాలని, ఆ అభ్యర్థులను కూడా పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో నియమించిన కమిటీ నిర్ణయించాలని మేచినేని కిషన్‌రావు సూచిస్తున్నారు. తెలంగాణ ఏర్పడితే ఈ ప్రాంతాన్ని వేదమయం చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. కాబట్టి, టీఆర్ఎస్ సిద్ధాంతం కూడా బీజేపీకి భిన్నమైందేమీ కాదని ఆయన భావన.
తెలంగాణ ఉద్యమం బీజేపీ చేతిలోకి వెళ్తే తన ఆటలు సాగవని కేసీఆర్ ఒంటరి పోరుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి చేయి చాపాలనే తాపత్రయమే తప్ప నిజాలు చెప్పే అలవాటు కేసీఆర్‌కు గానీ, జాక్ చైర్మన్ కోదండరామ్‌కు గానీ, వీళ్లిద్దరికీ వంతపాడే దళిత నాయకులకు గానీ లేదు.

తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని బహెన్ మాయావతి డిమాండ్ చేశారు. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను విభజించి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరుతున్నారు. ఆమె అధికారం కోల్పోయాక కూడా అదే వైఖరికి కట్టుబడి ఉన్నారు. అధికారమే పరమావధిగా వ్యవహరించే మనువాద పార్టీలు తెలంగాణ ఇస్తాయన్న హామీ ఏమీ లేదు. కానీ బహుజన రాజ్యాధికారం కోసం సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న బీఎస్పీ అధినేత మాయావతి నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు చేయడం మాత్రం ఖాయం. ఈ విషయాన్ని ప్రజలకు అర్థ కాకుండా చేసేందుకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలు అన్ని రకాలుగా వేషాలూ వేస్తున్నాయి.
తెలంగాణ కోరుతున్న బహుజనులను నిస్సహాయులను చేయాలని అన్ని పార్టీలూ చూస్తున్నాయి. నిన్నటి వరకు నెల రోజుల్లో తెలంగాణ వస్తుందనీ, కేంద్రం నాతో సంప్రదింపులు జరుపుతుందని బుకాయించిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదు కాబట్టి దాన్ని ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణలోని వివిధ వృత్తి కులాలు, మాదిగ, మాల కులాలంతా తెలంగాణ కోసం అన్ని రకాల నిరసనలు చేపట్టినప్పుడు దాన్ని నీరుగార్చింది కేసీఆర్, జాక్ నాయకత్వం కాదా? తెలంగాణ ఉద్యమానికి దాదాపు అన్ని వర్గాలు దూరమైపోయాయి. ముఖ్యంగా ముస్లింలు, దళితులు, గిరిజనులు చాలా త్వరగా నిజం తెలుసుకున్నారు. బీసీల్లో చాలా వరకు టీఆర్ఎస్ పట్ల విముఖంగా ఉన్నారు. కొంత మంది బీసీ నాయకులు, కవులు తప్ప ఆత్మాభిమానం మెండుగా ఉన్న బీసీ కులాలేవీ ఉద్యమం పేరుతో జరిగే మోసాన్ని సహించే పరిస్థితిలో లేవు.

2009 నుంచి కొనసాగుతున్న మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ముస్లింల మీద దాడి జరగని సంవత్సరమే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలే తెలంగాణాలో నూటికి తొంభై ఐదు మంది ఉన్నారని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళదే అధికారమని కేసీఆర్ దళిత నాయకుడిలాగా మాట్లాడుతున్నారు. అయితే ముస్లిం మైనారిటీలపై కొంతకాలంగా జరుగుతున్న దాడులతో సహా రాష్ట్ర వ్యాప్తంగా దళిత, బహుజనులపై అగ్రవర్ణ దాడులను ఆయన ఇంతవరకు ఖండించనేలేదు. ఒక్క తెలంగాణ తప్ప మరేది పట్టని తప్పుడు చైతనాన్ని ఈ ఉద్యమ నేతలు రగిలించారు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు స్పందించే స్ప్పహను తెలంగాణ ఉద్యమం తొలగించిందా? తెలంగాణ ప్రాంతంలో ఎన్నో త్యాగాలతో నిర్మాణం చేసుకున్న ప్రత్యామ్నాయ ఉద్యమాలను అగ్రకుల నాయకత్వం ధ్వంసం చేసింది.

జాతీయ స్థాయిలో సోనియా గాంధీ, నరేంద్రమోడీ లను ఓడించి మాయావతి బహుజనులను అధికారంలోకి తీసుకు రావ డం ఖాయం. తెలంగాణ లక్ష్యం కోసం ప్రాణ త్యాగం చేసినవారిలో బహుజనుల పిల్లలే అధికం. మాయావతి మాత్రమే బహుజన తెలంగాణ ఏర్పాటు చేయగలదని బహుజనులు నమ్ముతున్నారు. మాయావతిని ప్రజల్లోకి రానివ్వకుండా జాక్ పేరుతో తెలంగాణ ప్రాంతాన్ని కాషాయ తీవ్రవాదులకు అప్పజెప్పాలని కోదండరామ్ ప్రయత్నిస్తే వారు గుణపాఠం చెబుతారు.


Andhra Jyothi Telugu News Paper Dated : 31/5/2013

No comments:

Post a Comment